Friday, December 7, 2018

అమెరి'కతలు -3

"ఎలాగూ బయటే ఉన్నారుగా . ఇంట్లో పాలైపోయాయి. టెన్నిస్ ఆడటం  అయిపోయాక వీలయితే షాపుకెళ్లి పాలు తెమ్మని" ఇంటినుంచి ఫోన్.

"వీలయితే','నీ కిష్టమైతే ' లాంటి పదాలకు సంసారపు నిఘంటవులో బోల్డన్ని అర్ధాలు కదా?(ప్రస్తుతానికీ విషయం అప్రస్తుతం అనుకోండి)

టెన్నిస్ కోర్టు పక్కనే ఓ రెండు నిమిషాల దూరంలో షాపు.

ఒక్క పాల డబ్బానే కదా అని తోపుడుబండి లేదా కనీసం అక్కడుండే ప్లాస్టిక్ బుట్టనైనా తీసుకోకుండా అలా షాపు  మధ్యలోకెళ్లాక అనిపించింది ఎలాగూ  పెరుక్కి తోడు పెట్టాలేమో రెండు డబ్బాలు తీసుకుంటే మంచిదేమో అని.తోపుడుబండి కోసం మళ్ళీ వెనక్కెళ్లే ఓపిక లేక అలానే ముందుకెళ్లి  రెండు పాల డబ్బాలు  తీసుకుని ఉసూరుమంటూ గల్లా పెట్టెలుండే చోటుకి  వచ్చాను .

రాత్రి దాదాపు 9 గంటల సమయం.పైగా చలికాలం.అన్ని కౌంటర్లు మూసి ఉన్నాయి ఒక్కటి తప్ప.నేను వెళ్లి లైన్లో నిలబడబోయే ముందు  అదేసమయంలో అటు వైపు నుంచి ఒక నడి  వయసు స్త్రీ , చేతిలో ఒక బ్రెడ్ ప్యాకెట్ తో అదే వరుసలో నిలబడడానికి వచ్చింది. ఇద్దరం దాదాపు ఒకే సారి వచ్చినా  నేను  ఒక అడుగు ముందు రావటంవల్ల ఆమె మోహంలో కొద్దిపాటి సంకోచం.

చేతిని (పాల డబ్బాతో సహా)  నేల వైపు ముందుకు చూపి  "ప్లీజ్" అన్నాను తనని నా ముందు నిలబడమన్నట్లుగా. ఒకసారి నావైపు చూసి "ఆర్ యు ష్యూర్? " అంది. నేను నవ్వుతూ తలూపాను.మా ఇద్దరి కంటే ముందు లైన్లో ఇంకో ఇద్దరున్నారు.

అప్పటికే చేతులు నొప్పెడుతుండటంతో   ఇక ఆ పాల  డబ్బాలు మోయలేక కింద పెట్టాను. నాతో ఏమైనా మాట్లాడదామనుకుందో ఏమో ఆమె నావైపు వెనక్కి తిరిగి  అదే సమయంలో నేను అక్కడ స్టాండ్ లో ఉన్నమేగజైన్ల వంక చూస్తుండడంతో ఆ ప్రయత్నం విరమించుకుంది. మాఇద్దరి ముందున్న వాళ్ళ కార్టులు ఒక మాదిరి  నిండుగా ఉన్నాయి. మావంతొచ్ఛేసరికి ఎంత లేదన్నా ఒక ఐదునిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువే పట్టొచ్ఛు.ఎదురుగా పలకరిద్దామని అంతలోనే విరమించుకున్న వ్యక్తి.  ఒకప్పుడైతే ఇటువంటి సమయాల్లో నా చేయి అప్రయత్నంగా సెల్ ఫోన్ ని చేతుల్లోకి తీసుకుంటుంది. కొత్త మెసేజీలొ,మెయిళ్ళో  వచ్చాయేమో చూడటం అనేది ఒక నెపం మాత్రమే. నిజానికి  అది నన్ను ఎదుటివాళ్లతో  మాట్లాడాల్సిరావడమనే 'విపత్కర' పరిస్థితులనుంచి రక్షించే డిజిటల్ ఆయుధం అన్నమాట.ఒక మూడేళ్ళ క్రితం నామీద నేనే ఒట్టేసుకున్నాను, ఇకపై అలా చేయకూడదని . వీలయితే  వాళ్ళతో నాలుగు  మాటలు మాట్లాడ్డం లేదా నా మానాన నేను చేతులు కట్టుకొని  నిలబడ్డం. (మరీ ఇబ్బంది అనిపిస్తే  ఎదురుగా ఉన్న ఏదో  ఒక వస్తువు మీద చూపు నిలిపి నా శ్వాస మీద ధ్యాస నిలపటం. ) అంతేగాని అలా పారిపోవటం ఒక చిన్న సైజు మానసిక బలహీనత  అని నా భావన.

ఇక నా ముందున్నామె వంతు రావటమూ, తను కార్డు బయటికితీసి గల్లా పెట్టె అమ్మాయితో ఏదో మాట్లాడడమూ గమనిస్తూ నా ఆలోచనల్లో నేనున్నా.ఇంతలో గల్లాపెట్టె అమ్మాయి నేను కింద పెట్టిన పాల డబ్బాలను తనే తీసికొని చక చకా స్కాన్ చేసేసింది.పని గంటలు ముగిసి బహుశా ఆ అమ్మాయి ఇంటికెళ్లే  తొందర్లో ఉందేమో అనుకొని కార్డుని మెషిన్ లో పెట్టబోతుండగా ఆ అమ్మాయి వారించి అప్పటికే తన బ్రెడ్ పాకెట్ తీసికొని వెళ్తున్న ఆమె వైపు చూపించి " నీ  పాల  డబ్బాల తాలూకు ధర కూడా ఆమె చెల్లించేసింది"  అని చెప్పింది చిన్నపాటి చిరునవ్వుతో.

దాదాపు పదకొండు డాలర్లు. పెద్ద మొత్తమూ కాదు అలా అని చిన్న మొత్తమూ కాదు.

అవాక్కయిన నేను సరిగా విన్నానో లేదో అని ఆ అమ్మాయిని ఇంకోసారి అడిగి నిర్ధారించుకొని  రెండడుగులు గబా గబా వేసి "ఎక్స్ క్యూజ్మీ " అని పిలవగానే వెనుదిరిగిన ఆమె ఏ  విధమైన ఉపోద్ఘాతం లేకుండా నా వంక చూస్తూ చెప్పింది

"ప్లీజ్ డోంట్ వర్రీ ఎబౌట్ ఇట్. ఐ జస్ట్  హేడ్   ఏన్  ఆఫుల్ డే.ఇట్స్ రియల్లీ బ్యాడ్ .... .బట్ యూ సీమ్స్ సో నైస్ ... థాంక్యూ  ఫర్ బీయింగ్  నైస్" 

తన మోహంలో అలసట, గొంతులో కొద్దిపాటి నైరాశ్యం

నాదగ్గర కార్డు తప్పితే నగదు ఎలాగూ లేదు. ఈమెని  ఇక్కడ నిలబెట్టి  గల్లా పెట్టె అమ్మాయి దగ్గర "క్యాష్  బ్యాక్ " తీసుకొని ఆమెకి  ఇచ్ఛే ప్రయత్నం చేస్తే నా హడావిడి అంతా చూసి ఆమె  నొచ్చుకుంటుందేమో.... ?ఇలా ఆలోచిస్తున్న నన్ను  చూస్తూ చిర్నవ్వుతో చెయ్యూపి వెళ్ళిపోయిందామె.

ప్రపంచమంతా నీకెదురుతిరిగినప్పుడు
నీ ఉనికి  నీకే   ప్రశ్నార్ధకమైనప్పుడు
ఏ పసి పిల్లాడి బోసినవ్వో
ఒక అపరిచిత వ్యక్తి చేసే చిన్నపాటి  సాయమో
ఇవేమీకాకపోతే
ఆకాశంలో ఎగిరే కొంగల గుంపో
నిశ్చలంగా ఉండే ఏ చెట్టు కొమ్మో
నీకు నీవు మాత్రమే మిగిలే ఏ నిశిరాత్రో
నీ మూలాన్ని నీకందిస్తాయి
కొండంత బలం కాకపోయినా
కూసింత ఆశ, రేపటి కోసం

ఆమెని అంతగా బాధపెట్టిన విషయాలేవో నాకు  తెలిసే అవకాశం ఎలాగూ లేదు.తరచుగా తారసపడితే తప్ప ఎవరిమొహాలూ అస్సలు గుర్తుండవు నాకు. ఈమె మళ్ళీ ఎదురుపడితే గుర్తు పట్టే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ గుర్తుపట్టినా మాట్లాడే చొరవ తీసుకుంటానా  అనేది ఆ సందర్భం వస్తే కానీ తెలీదు.

ఏదేమైనా ఆమె బాధ ఆరోజు వరకే తాత్కాలికం అయి ఉండాలని కోరుకుంటూ.....


Tuesday, October 30, 2018

ఒక జర్నలిస్టు హత్య

అహంకారంతో విర్రవీగి సౌదీ ప్రస్తుతానికైతే బొక్కబోర్లా  పడింది. 

డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అనే సూత్రం వ్యక్తిగత  స్థాయిలో మాత్రమే  కాకుండా దేశాల స్థాయిలో కూడా భేషుగ్గా పనిస్తుంది కాబట్టి ఇంకొన్ని వారాలకి బహుశా ఇది మరుగున పడి పోవచ్చు. కానీ జరిగిందేమిటో పరిశీలిస్తే మనసు కకావికలం కాక  తప్పదు.

సౌదీ రాజకుటుంబానికి ఒకప్పుడు దగ్గరగా మెలిగి ప్రస్తుతం వారి తీరు నచ్చక దూరం జరగటమే కాకుండా  అంతర్జాతీయ మీడియాలో  వారికీ,వారి మొక్కుబడి పాలనా సంస్కరణలకు  వ్యతిరేకంగా గళమెత్తిన  సౌదీ దేశపు జర్నలిస్టు జమాల్ ఖషోజీ.  ( ఆయన జర్నలిస్టు కావడానికి  ముందు  ఏంచేసాడన్న దానిమీద భిన్నాభిప్రాయాలున్నాయి).

ఆయన ఈ అక్టోబర్ రెండున టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయం లోకి విడాకుల ధృవీకరణ పత్రం కోసం వెళ్లి  ఇక తిరిగి రాలేదు. కీడు ముందే శంకించిన ఆయన తన కాబోయే భార్యకు ముందే చెప్పాడట తాను ఒక  గంటలోపు బయటికి రాకపోతే తనకు తెలిసిన టర్కీ అధికారికి ఫోన్ చేసి 'అలర్ట్'  చేయమని. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఒక  హాలీవుడ్ స్పై సస్పెన్సు థ్రిల్లర్ ని తలపించాయి.

సౌదీ మొదట్లో జమాల్  వచ్చిన  పని ముగించుకొని వెళ్ళిపోయాడు మాకేం తెలియదని బుకాయించింది. 'సాక్ష్యాలేవీ?' అని టర్కీ అడిగితే 'సి సి కెమెరాలు ఆ రోజు పనిచేయలేద'ని చెప్పింది. అయితే సరే గానీ 'మా దగ్గర అసలేం జరిగిందో సవివరంగా తెలిపే ఆధారా లున్నాయి' అని టర్కీ మొదటి బాంబు పేల్చే సరికి సౌదీ కాస్త దిగొఛ్చి  'రాయబార కార్యాలయంలో జరిగిన గలాటా ('ఫిస్ట్ ఫైట్ ') లో జమాల్  చనిపోయాడని'  విచారం వెలిబుచ్చింది.  'మాదగ్గరున్న  (ఆడియో )ఆధారాలు బయటపెట్టమంటారా'  అని టర్కీ అనేసరికి సౌదీకి  తప్పు ఒప్పుకోక  తప్పలేదు. ఇంతా చేసి టర్కీ ఆ ఆడియోని మీడియాకి విడుదల చేయలేదు ఎందుకంటే విదేశీ రాయబార కార్యాలయంలో నిఘా పరికరాలు అమర్చడం అంతర్జాతీయ నియమావళికి విరుద్ధం కాబట్టి.

ఈ మొత్తం విషయంలో టర్కీ మీడియాని 'మేనేజ్' చేసిన చేసిన విధానం అమోఘం.  రోజుకో లీక్ , అదికూడా పశ్చిమ దేశాల మీడియాకి ( ముఖ్యంగా అమెరికా). ఎక్కడ మీట నొక్కితే దాని ప్రభావం ఎక్కువుంటోందో టర్కీ కి  బాగా తెలుసు.పైగా జమాల్  అమెరికా వాస్తవ్యుడు ( గ్రీన్ కార్డు) కావడం, వాషింగ్టన్ పోస్ట్  తరపు జర్నలిస్ట్ కావడం మూలాన  అమెరికా మీడియాలో ఈ వార్తకు తగిన  ప్రచారం లభించింది.

మీడియా మానేజ్మెంట్  విషయంలోనే కాదు, కేసు దర్యాప్తుపరంగా కూడా టర్కీ పశ్చిమ దేశాలకు తీసిపోని విధంగా శరవేగంగా అన్ని ఆధారాలనీ బయటకు లాగింది. ఈ నేరానికి పాల్పడ్డ పదిహేనుమంది పేర్లూ, వారి వివరాలూ, ఎవరెప్పుడు ,ఎలా టర్కీ దేశంలోకి ప్రవేశించిందీ,బస చేసిన హోటళ్ళూ, తిరిగి ఎలా సౌదీ వెళ్లిపోయారనేది మొత్తం కూలంకషంగా బయటపెట్టి సౌదీని మొదటినుంచి  రక్షణాత్మక ధోరణిలోకి నెట్టేసింది. చాలా పైస్థాయిలో ఈ హత్య కి సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయంటూ నర్మగర్భంగా వేలు సౌదీ యువరాజు  వైపు  చూపెట్టింది.

హత్య జరిగిన తీరు మాత్రం భయానకంగా ఉంది. సౌదీ లో రాజవంశానికి దగ్గరివాడైన, ఆటాప్సి చేయడంలో నిపుణు డైన  ఒక డాక్టరు హెడ్ ఫోన్స్ లో సంగీతం వింటూ తాపీగా జమాల్   బతికుండగానే  దేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడట. ఏ ఐఎస్ఐ,తాలిబాన్  టెర్రరిస్టులే కాదు  బాధ్యతగల దేశాలు కూడా 'డిప్లొమాటిక్ ఇమ్మ్యూనిటి' ముసుగులో ఇలాంటి ఘోరమైనచర్యలకు పాల్పడడం దారుణం.హంతకులు జమాల్ చేతి వేళ్ళను  హత్యకు ఆదేశించిన వారికి ఒక  'ట్రొఫీ' లా  సౌదీ తీసుకెళ్లారని ఒక కథనం.

ఈ విషాద ఘటన పై అంతర్జాతీయస్థాయిలో మీడియా సర్కిళ్లలో వెల్లడైన విపరీతమైన అసంతృప్తీ , ఆవేదనా,  ఆంక్షలు విధించాల్సిందే అని పట్టుబట్టిన వివిధ దేశాధినేతలూ,నిజం వెల్లడయ్యే వరకు సౌదీలో పెట్టుబడుల విషయంలో తమ నిర్ణయాలు  వాయిదావేసిన మల్టీ నేషనల్ కంపెనీలూ  ఇవన్నీ  ప్రాణాలకి తెగించి నిజాన్ని నిర్భయంగా వ్యక్తపరచగలిగే 'తెగింపు' ఉన్న జర్నలిస్టులకు  నిరాశ పడకుండా, భవిష్యత్తుపై ఆశ కోల్పోకుండా ఎంతోకొంత ఆసరా ఇచ్చేవే.

మన భారత మీడియా ఈ వార్తకు ఏ మేరకు ప్రాధాన్యత ఇచ్చిందో  నాకు తెలీదు. 

Sunday, October 28, 2018

ఉన్నమాటే చెప్తున్నా

ఉన్నమాటే చెప్తున్నా... 

తన ఇండియా  ప్రయాణం ఖరారు కాగానే మొదట్లో నేను కొద్దిగా భయపడ్డ మాట నిజం.

 ఆఫీసుపని చూసుకుంటూ ఇద్దరు  పిల్లల్ని నేనొక్కడినే దాదాపు ఒక నెల పాటు,   పొద్దున్న వాళ్ళని  స్కూలుకి పంపడం దగ్గర్నుంచి రాత్రి నిద్రపుచ్చే వరకూ వాళ్ళ అవసరాలన్నీ ఏ లోటు లేకుండా చూసుకోగలనా లేదా అని.ఆఫీసుపని మీద దీని తాలూకు ప్రభావం తప్పకుండా ఉండేతీరుతుందన్న భయం ఇంకొకటి. 

పొద్దున్న ఆరింటికి లేచి వాళ్ళని  రెడీ చేసి ఏడున్నరకి స్కూలు దగ్గర  దింపి 'హమ్మయ్య!' అనుకుని కాఫీ తాగి ,కాస్త ఆఫీసు పనిలో నిమగ్నమయ్యి, మధ్యలో నా బ్రేక్ ఫాస్టు  తిని  ఇలా చూడగానే టైం  పన్నెండు. మధ్యాహ్న భోజనానికి  వాళ్లకి 'ఏం వండుదాం?' అనుకొని, అటు ఆఫీసు పని ఇటు  వంట పని   చూసుకొనేసరికి అప్పుడే టైం రెండున్నర. మళ్ళా స్కూలుకు పరుగు పిల్లల్ని తీసుకురావడానికి. 

ఆ సమయంలో నాకు ఆఫీసు పనెక్కువ.  బహుశా స్కూల్లో బాగా అలసిపోయి నిద్రకొచ్చి  ఉంటారేమో అస్సలు మాట వినకుండా ఇల్లంతా కిష్కింధ కాండ. 

స్కూలు హోంవర్క్ కాక అమ్మాయికి టెన్నిస్ , కూచిపూడి ఎలాగూ ఉన్నాయి. సాయంత్రాలు తనని క్లాసులకి తీసుకెళ్లడమే కాకుండా వీటిని క్రమం తప్పకుండా ఇంట్లో సాధన చేయించాలి. 

కానీ ఆశ్చర్యం.....

ఈ నెలలోజుల్లో కనీసం ఒక్కరోజు, ఒక్క సారంటే ఒక్కసారి కూడా ఏదీ మిస్సయ్యింది లేదు.   ఏ విషయంలోనూ రాజీ  పడిందీ లేదు. సివరాకరికి వంట విషయంలో  కూడా. 

పొద్దున్న వాళ్ళని నిద్ర లేపడం , వాళ్ళని తయారు చేసి , పిల్లకి జడేసి , స్కూల్ ఫోల్డర్లు ఇద్దరివీ  చెక్ చేసి, వాళ్లకి బ్రేక్ ఫాస్థూ , లంచ్  డబ్బాలు సర్ది స్కూలుకి పంపడం  దగ్గర్నుంచి రాత్రి నిద్ర పుచ్చడం  వరకూ  ఈ మధ్యలో ఉన్న సవాలక్ష పనులనూ ఏ మాత్రం 'స్ట్రెస్' లేకుండా చేసుకురాగలగటం నాకే చాలా ఆశ్చర్యం కలిగించింది. నిజానికి తనున్నప్పుడు అడపాదడపా  'ఈ ఒక్కసారికి  ఏంకాదులే' అని చేతులెత్తేసినట్టు గుర్తు. (మరీ అంత తరచుగా కాకపోయినా ) వంట వండే ఓపిక లేక బయట తినటం గురించి చెప్పనవసరంలేదు.  

ఇక శనాదివారాల్లో  కొనకపోతే కొంపలంటుకుంటాయన్న రీతిలో ఆ  షాపు నుంచి ఈషాపుకి పరిగెత్తాల్సిన అగత్యం అస్సలే లేదు..

అన్నిటికీ మించి సాయంత్రం అయ్యేసరికి పొద్దుట్నించి ఓ టన్ను బరువు మోస్తున్నట్టుగా  నాలో  ఉండే విపరీతమైన నిస్సత్తువా , నిరాసక్తతా అంతా  మటుమాయం. ఇది మాత్రం ఎనిమిదో వింతే నాకు ..

సాయంత్రాలు పిల్లలకి తిండి పెట్టి వాళ్ళతో కాసేపు ఆటలాడి  నిద్రపుచ్చాక నాకు బోల్డంత  ఫ్రీ టైం.దాని పుణ్యమే ఈ రాతలు ... 

ఒక వారం గడవక ముందే అసలుసిసలు 'స్ట్రెస్' ఎక్కడుందో అర్ధమయింది నాకు... 

ఉన్నమాటే  చెప్తున్నా... 

PS: నా టెన్నిస్ ని  మాత్రం  బాగా మిస్సయ్యా. పిల్లల్ని  మేం చూసుకుంటాం  అని ఎదురింటివాళ్ళు 'ఆఫర్ ' ఇఛ్చినా ఎందుకో  వాళ్ళని వదిలి వెళ్ళబుద్ధికాలేదు

Saturday, October 27, 2018

సొట్ట బిందె


( నా వయసుముచ్చట్లు కి కొనసాగింపుగా......) . 


సంజె చీకట్లు ముసురు కుంటున్నాయి .


వీధిలో సోడాలబ్బాయి ఎదురింటి సీతారావమ్మకి సోడా ఇచ్చి వాళ్ళింటి గోడ మీద పెన్సిల్ తో లెక్క  రాస్తున్నాడు . లెక్కంటే ఏమీ లెదు. ఇఛ్చిన  ప్రతి సోడాకో నిలువు గీత. ఓ వారానికో పదిరొజులకొ రొక్కం  పుచ్చుకొని ఇచ్చిన వాటి మేరా వాటి మీద అడ్డగీతలు.

వంటింటి గడప మీద కూర్చొని మసిపట్టిన  లాంతరు  గ్లాసుని ముగ్గుతో శుభ్రం చేస్తున్న అమ్మ సోడా అబ్బాయి గొంతు విని అక్కడినుంచే నాకు కేకేసింది   ఒక సోడా తీసుకొమ్మంటూ. 

వీధి వైపు, మూడు మలుపుల్లో మేడమీదికి దారితీసే మెట్ల మొదటి మలుపు దగర నిలబడి మోచేతిని పిట్టగోడ మీద పెట్టి వీధిని పరికించి చూస్తున్న నేను అమ్మ మాట వినగానే అక్కడ్నుంచే సోడాలబ్బాయిని చిన్నగా పిలిచాను..

"ఇదిగో సోడా, నలకల్లేకుండా చూసి ఒక సోడా కొట్టు"

సోడా కోసం మెట్లు దిగి వీధి వాకిట్లోకి రాగానే మా ఇంటి మెట్లెక్కుతూ ఎదురయింది తను.

క్షణాల క్రితంవరకూ వరకూ వీధిని ఆమూలాగ్రం పరికిస్తున్న నేను తను అంత  అకస్మాత్తుగా నా ముందు ఎలా ప్రత్యక్షమయిందో అర్ధం కాక విస్తుపోయాను ఒక్కక్షణం.ఆ మరుక్షణమే ఒక వెల్లువలా మనసంతా పట్టరాని ఆనందం.తనని చూసి అప్పటికే రెండు రోజులు.

చంకలో ఖాళీ బిందె. నీళ్ళు మోయడానికి సన్నద్ధం అన్నట్టు లంగాని కొద్దిగా పైకి దోపుకొని  గాజుల్ని దాదాపు మోచేయి వరకు లాక్కొని ఉంది. 

మనసులోని ఆనందాన్నణచుకుంటూ  తనని గమనించనట్టే  సోడా తీసుకోవడానికి వీధి మెట్లు దిగాను.

ఇంటిముందు మెల్లా లో బోరింగు పంపు ఇంకా పెట్టక పోవడం గమనించి బిందెని  పంచలోని  చెక్క బల్ల  మీద ఉంచి,  లంగా సవరించుకుంటూ  అమ్మని పలకరించటానికన్నట్టు తను లోనికి అడుగులు వేసింది.

తనను తప్పించుకొని ముందుకెళ్లే  వీలు లేక చేతిలో సోడాతో తన వెనుకే నేను. 

రెండు గదుల ఆవల ఉన్న అమ్మను గమనిస్తూనే ఓ రెండు క్షణాలు ట్యూబు లైటు వెలుగులో తనను పరీక్షగా చూసాను. 

టీనేజీలో ఉండే సహజ ఆకర్షణా  దానికితోడు  కేవలం రెండు మూడడుగుల  ఆ సాన్నిహిత్యమూ  నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి... 

                                                                                                                                                                                             (ఇంకావుంది) 

Wednesday, October 24, 2018

కాలం కథలు - సత్తి గాడుఇది కూడా దాదాపు ఓ ముప్పై ఆరేళ్ళ  క్రితం సంగతే.

అప్పటికి నా ఎనిమిదో తరగతి క్లాసులు మొదలై రెండు రోజులే . 

కొత్త యూనిఫాం ,కొత్త నోటు పుస్తకాలు. అప్పటికి ఇంకా టెక్స్ట్ బుక్స్ చేతికందలేదు. అయినా ఆసక్తి కొద్దీ నాకంటే ఒక తరగతి పెద్దదైన రవణమ్మ ( రమణమ్మ) దగ్గరున్న తెలుగూ,సోషలూ పుస్తకాలు తీసుకొని అసలు పాఠాలేమున్నాయా  అని అలా బొమ్మలు చూస్తూ పైపైన తిరగేసా. కొత్త  టెక్స్ట్ బుక్స్  చేతికందగానే వాటిని కూడా సంచిలో పెట్టుకొని బడికెప్పుడెల్తానా  అని ఒకటే ఎదురు చూపులు .


తరగతిలో మిగతా వాళ్ళందరూ కనపడుతున్నారు గానీ నా ఆప్తమిత్రుడు సత్యనారాయణ జాడే లేదు.అప్పటికీ వాడింటి దగ్గరుండే తోటి  వాళ్ళందరిని  ఆడిగా. అందరూ మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. ఆ తరువాత ఒక రెండు రోజులకి శేఖర్ గాడు చెప్పాడు సత్తి గాడు మొన్న వాడికి   సాంబయ్య టీ  స్టాలు దగ్గర కనబడ్డాడనీ ,మాట్లాడబోతే తలతిప్పుకొని వెళ్లిపోయాడనీ. నాలో ఆదుర్దా   ఎక్కువైంది. 
 ఒక  రెండడుగులు పక్కకేస్తే వాడిల్లు నేను స్కూలు నుంచి ఇంటికెళ్ళే దారిలోనే. వాడి గురించి అంత ఆదుర్దా ఉన్నా ఆ రెండడుగులు పక్కకేసే స్వాతంత్య్రం  లేని వయసది. స్కూలునుంచి సరాసరి ఇంటికి రాకుండా దారి మళ్ళానని ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా?

సత్తిగాడు అంతకుముందు ఒకట్రెండు సార్లు నన్ను వాడింటికి  తీసుకెళ్లాడు.ఒకటే గది. అది కూడా చాలా చిన్న గది.ఆ గదిలోనే ఒక మూలన  చిన్న కిరోసిన్ స్టవ్వూ,కొన్ని సత్తు వంట గిన్నెలూ. ఆ గదిముందు అంతే పరిమాణంలో పేడతో అలికిన చిన్న మెల్లా, నిలబెట్టిన రెండు నులక మంచాలూ.బహుశా  రాత్రుళ్ళు అక్కడే పడుకుంటారేమో.వాడి నాన్న నాకెప్పుడూ కనపడలేదు. అడిగితే దాటేసేవాడు. వీడికి తోడుగా అక్కా తమ్ముళ్లు   ఎవరూ లేరు వాడికి. అమ్మ మాత్రం ట్రంకురోడ్డు మీదున్న  మిల్లులో గ్రేడింగు పనికె ళ్లేది. 

తెల్ల చొక్కా- ఖాకీ నిక్కరూ మా స్కూలు యునిఫామ్. అందరి చొక్కాలు  తెల్లగా తళ తళ లాడుతూ ఉంటే వాడి చొక్కా ముతక రంగులో అసలది తెలుపా?పసుపా? అన్నట్లుగా ఉండేది. నిక్కరు కూడామొద్దుగాబండకేసి బలంగా రాసినా దానికేమీ కాదనే రీతిలో ఉండేది. మా అమ్మ తరపు బంధువుల ద్వారా ఇటువంటి పరిస్థితులు నాకు పరిచయమున్నా,వీడి సాహచర్యంలో నాకవి  మరింత ప్రస్ఫుటంగా కనిపించేవి.ఇంటర్ బెల్లు ( ఇంటర్వెల్ ) లో మేము ఏ జామకాయలో రేగ్గాయలో కొనుక్కోటానికి పరిగెడితే వాడు క్లాసులో అలా వంటరిగా ఉండిపోయేవాడు ఏదో ఒకటి చదూకుంటూ

ఎనిమిదో తరగతి 'అసలు' క్లాసులు మొదలయ్యాయి. అటెండెన్స్ రిజిస్టర్లు కూడా తయారయ్యాయి కానీ వాడి జాడ లేదు . ప్రతి క్లాసులో వాడి పేరు లేని అటెండెన్స్ నాకు అసంపూర్తిగా కనిపించేది. ఒక నెల గడచినా ఎప్పటికైనా వాడు వస్తాడనీ, రెండు పేర్ల మధ్య వాడిపేరు(ఆ నెలకి) రిజిస్టర్లో ఇరికించి  రాస్తారనే ఆశ చావలేదు నాలో. కొత్త వాళ్ళతో నేస్తం కట్టి, చదువులో మునిగిపోయినా ఏదో రూపేణా గుర్తొస్తూనే ఉన్నాడు వాడు. 

ఒక రోజు...మధ్యాహ్నం నాలుగుగంటల సమయం 

భోజనాలు ఆలస్యమైనట్లున్నాయి.ఇంట్లో వాళ్లింకా మాంఛి మధ్యాహ్నపు నిద్రలో ఉన్నారు.  అలికిడి చేయకుండా పుస్తకాల సంచి దేవుడి గదిలో ఒక మూల ఉంచి ఇంటి ముందు భాగంలో ఉన్న మేడమెట్ల మొదటి మలుపులో నిలబడి ఆ పిట్టగోడపై రెండు మోచేతులానించి  వీధిలోకి చూస్తున్నాను. పేరుకి వేసవి కాస్త మందగించినా ఆ వేడి   భరించనలవి కానంతగా ఉంది. కొలిమి పక్క నిలబడ్డట్టు ఒకటే ఆవిరి. వీధి నిర్మానుష్యంగా ఉంది. 

కాస్త ముందొస్తే బేరాలెక్కువ దొరుకుతా యనుకున్నాడో ఏమో సోడాలబ్బాయి అప్పుడే వీధిలోకి మలుపు తిరిగాడు. 

ఎదురింటి సామ్రాజ్యం  అప్పుడే నిద్ర లేచి ఆవలించుకుంటూ  తలపైకెత్తి  వాళ్ళింటి జాజి చెట్టు వంక చూస్తోంది పూలెటువైపు   ఎక్కువున్నాయో  అట్నుంచి మొదలెడదాం అనుకుంటున్నట్టు.

ఇంతలో  వీధికిటువైపు నుంచి ఎవరో సైకిల్ మీద వస్తున్నట్టు గమనించా నా కనుచివరలనుండి.  ఎవరోలే అనుకొని పట్టించుకోలేదు. ఆ సైకిలు  నన్ను దాటి వెళ్లిన తరువాత  గమనిస్తే  వాడు సత్తి గాడి లానే కనపడ్డాడు వెనకనుంచి. 

వాడికి సొంత సైకిలు లేదు కాబట్టి  వాడు కాదేమో అని అనిపించినా  కానీ అచ్ఛం వాడిలానే ఉన్నాడే అని ఒకింత అనుమానం. "సత్తిగా" అని గట్టిగా నేను పిలవగానే ఆ మనిషి సీటు మీద నుంచి లేచి ఇంకాస్త వేగంగా సైకిలు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. నా అనుమానం బలపడింది.. 

మరుసటి రోజు అదే సమయానికి కాపు కాసాను. వాడు మావీధి మలుపు తిరగ్గానే మెట్లు  గబ  గబా దిగి వాడు నన్ను దాటిపోకుండా రెండుచేతులు బార్లా అడ్డుపెట్టి ఎదురెళ్లా "రేయ్ సత్తిగా " అంటూ. తప్పించుకునే వీలు లేక వాడు పాపం సైకిలు దిగాడు( నేలకి   కాళ్ళందవు మరి).నేను ఎందుకైనా మంచిదని ఒక బ్రేకు బిగించి పట్టుకున్నా.

గుంటూరు జిల్లా ఎండలు కదా వాడప్పటికే తడిసి ముద్దయి ఉన్నాడు.జుట్టులోంచి కారిన  చెమట పాయొకటి  చెవి వెనుకగా జారి  చొక్కా కాలరు వెనుక మాయమైంది . వాడి మొహం లో  అలసట కంటే పట్టుబడ్డానన్న బాధే ఎక్కువగా కనపడుతోంది నాకు. 

అప్పుడు గమనించా వాడి సైకిలు ముందు భాగానికి తగిలించిన పెద్ద అట్ట.దాని నిండా క్లిప్పులతో రక రకాల లాటరీ టిక్కెట్లు.

వాడితో ఏమి మాట్లాడానో  అస్సలు గుర్తు లేదు.  "ఈ లాటరీ టిక్కెట్లు ఏందిరా ?" అని అడిగుంటాను.  "స్కూలుకి   రావట్లేదేమిటి?" అని కూడా. బహుశా వాడు "వేరే స్కూల్లో జేరా" అని బుకాయించీ  ఉంటాడు. నాకు గుర్తున్నదల్లా నిప్పులు చెరిగే ఆ మధ్యాహ్నపుటెండలో  తడిసిన ముద్దయిన వాడి  మొహమూ  అందులో (నా కళ్ళకు) కనపడిన  దిగులూను. 

అదే ఆఖరు సారి వాడిని చూడ్డం.. తరువాత ఎప్పుడు చూసినా ఆ ఇంటికి  తాళం  వెక్కిరిస్తూ కనపడేది. (కప్పు కూలిపోయి మొండిగోడలతో పాడుబడి ఆ గది ఇప్పటికి ఉంది. )

ఆరోజుల్లో ఆర్థిక స్తొమత అంతంత మాత్రం ఉండే కుటుంబాల్లో చదువు మాన్పించి పనిలోపెట్టే ప్రక్రియలో  మొదటి మలుపు ఏడో తరగతయితే  ఇంకాస్త స్తొమత ఉన్నవాళ్లకి  అది  పదోతరగతి. ఆ సరికి వాళ్ళు ప్రయోజకులైనట్టే లెక్క చదువు పరంగా.

పన్నెండేళ్ల  వయసులోనే ఇంటి బాధ్యత నెత్తి  మీద పడి ఆ మండుటెండలో మావూరికి చుట్టుపక్కల ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న చిన్న పల్లెటూళ్లలో లాటరీ టికెట్లమ్మడానికి  బయల్దేరిన వాడు మరి ఇప్పుడు  ఎక్కడున్నాడో ఏం  చేస్తున్నాడో? అసలు నేను గుర్తున్నానో లేదో?

Sunday, October 21, 2018

ఓ జ్ఞాపకం

దాదాపు నలభై ఏళ్ళ కిందటి మాట. 

ఎక్కడికో గుర్తులేదు గాని అమ్మతో  బయటికి వెళ్తున్నాను. బహుశా గుడికి  అయుండొచ్చు. మా ఇంట్లోంచి బయటకొచ్చి ఓ పదడుగులు వేస్తే వస్తుంది మెయిన్ రోడ్డు.  దానిమీద కుడివైపుకి తిరిగి ఇంకొక పదడుగులేస్తే వస్తుందొక పెద్ద వాణిజ్య కూడలి. ఒక రిక్షా స్టాండూ,మెడికల్ షాపులూ,కిరాణాదుకాణాలూ,పళ్ళ బండ్లూ,సినిమాహాలూ ,హొటళ్ళూ,సైకిళ్ళ  రిపేరూ షాపులూ, పిండి మరలూ, చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళకెళ్లే ప్రయివేటు బస్సులూ.. ఇలా  సమస్తం. ఏదైనా  ప్రత్యేకమైన  పని ఉంటే తప్ప మాకు ఆ సెంటరు దాటి  పోవాల్సిన అవసరం  ఉండదు  చాలా వరకు.  

మేము మెయిన్ రోడ్డు  మీదకు  తిరగగానే మాకెదురుగా వస్తూ నా దృష్టినాకర్షించిందొక రిక్షా.మిగతా రిక్షాల్లాగా దానికేమీ హంగూ ఆర్భాటాలేవీ  లేవు. తళ తళ లాడే  రిమ్ములూ, హ్యాండిల్ కి రెండువైపులా వేలాడే  తోలు పటకాలూ, ఆ (గూడు)రిక్షా  రెండు  వైపులా ఎన్టీఆర్-ఏఎన్నార్ బొమ్మలూ..  ఇవేమీ  లేవు . బ్రేకులు జారిపోయి ,రిమ్ములు తుప్పు పట్టి, రిక్షా రంగులు వెలిసిపోయి ఏ క్షణమైనా  కూలిపోవడానికి సిద్దంగా ఉన్నట్టుంది.నిజానికి అదొక అస్థిపంజరాన్ని తలపించేలా ఉంది.   

ఆ వయసులొ సహజంగా ఉండే  ఆసక్తి కొద్దీ దాన్నే చూస్తూ ఉండిపోయాను. రిక్షా మమ్మల్ని దాటి  వెళ్తుండగా ఆసక్తి కొద్దీ ఆ రిక్షా లోపల ఎవరు కూర్చొని ఉన్నారా అని చూసాను. ఎవరూ కనబడలేదు  గాని ఒక తాటి చాపలో  ఏదో వస్తువు చుట్టబడి  ఉన్నట్లనిపించింది. పరికించి  చూస్తే అవొక మనిషి కాళ్ల లాగా అనిపించాయి నాకు. వెంటనే  అమ్మ చెయ్యి  పట్టుకొని  గట్టిగా  అరిచి చెప్పా  "అమ్మా! అటు చూడు, ఎవరివో కాళ్ళు " అని . అమ్మ అటు చూసి చటుక్కున  తల తిప్పి "కాళ్లూ లేవు గీళ్లూ లేవు  పద " అంటూ నా చేయి గట్టిగా  పట్టుకొని  ముందుకు లాగింది . 

అమ్మతో వడివడిగా ముందుకు నడుస్తూ   ఆసక్తిని చంపుకోలేక  ఆ రిక్షాని  అలా తలతిప్పి చూస్తూ ఉన్నా. 

ఆ తాటి  చాపలో  బయటికి తొంగిచూస్తూ , దాదాపు కట్టెపుల్లల్లా సన్నగా,నల్లగా కమిలి నట్టున్న మనిషి కాళ్ళు. 

పేరుకి  తార్రోడ్డయినా  అడుగడుగునా ఉండే  గుంటల్లో పడి ,ఆ కుదుపుకి ఒక్క సారిగా  చాప మొత్తం  ఎగిరిపడిన దృశ్యం అలా గుర్తుండి పోయింది నాకు .

                  
అక్కడికి ఓ అర కిలోమీటరు దూరం లోనే  మావూరి వాగు. దాన్ని  దాటుకొని ఆ ఇసుకమేటలకు కొద్దిగా అవతలగా...  రుద్రభూమి. 
               

ఆ తర్వాత కొన్నేళ్ళకి కలిమి-లేములూ, కష్ట సుఖాలూ, బాధలూ-బాంధవ్యాలూ  గురించి  తోచినంతలో ఏదో  కొద్ది అవగాహన కుదిరాక  నేను చూసిన ఆ దృశ్యం కొద్దికొద్దిగా బోధపడినట్లనిపించేది నాకు.

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...