Wednesday, May 20, 2009

గమ్మత్తైన సంఘటనలు -1

కొన్ని కొన్ని సార్లు మనం కలలో కూడా ఊహించని సంఘటనలు ఇలలో ఎదురై మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. వీటిల్లో కొన్ని అప్పటికి సీరియస్ యవ్వారాలే. కానీ కాలం గడిచేకొద్దీ అవి కామెడీగా మారి తలచుకున్నకొద్దీ మాంఛి కిక్ ఇస్తుంటాయి. అలాంటివి కొన్ని....

***************************************************************************************


చానాళ్ళ..కాదు కాదు చానా ఏళ్ళ కిందట సంగతి.


నేను అప్పుడప్పుడే ఒక సాఫ్టువేర్ ఇంజనీరుగా సంఘంలో పేరు తెచ్చుకుంటున్న రోజులు.....


ఎదురుపడ్డ ప్రతివాడూ "నువ్వు అమెరికా ఎప్పుడెల్తావ్?" అని నన్ను నిలదీస్తున్నట్టు ఊహించుకొనే రోజులు....


వాళ్ళు నిలదీయకపోయినా వాళ్ళతరపున నన్నునేను నిలదీసుకునే రోజులు....


ఆఫీసులో ట్రావెల్ డెస్క్ ముందునుంచి వెళ్ళే ప్రతిసారీ "ఏదో ఒకరోజు నాపీరు మీద అమెరికా టిక్కెట్టు ఇక్కడ రెడీ అవకపోదు.నేనూ అబిడ్స్‌లో రెండు పెద్ద పేద్ద సూట్కేసులుకొని, వాటిని షాపు బయట ఫుట్ పాత్ మీదపెట్టి "ఏయ్ ఆటో" అని స్టయిల్‌గా ఆటోవాణ్ణి పిలవకనూపోను" అని ఊహించుకుంటూ నా వెన్ను నేనే తట్టుకునే రోజులు.......


ఇంకా చెప్పాలంటే పైకి నవ్వుతూ,లోపల కుళ్ళుకుంటూ నా తోటివాళ్ళకి "హేపీ జర్నీరా మామా" చెప్పే రోజులు......

అటువంటి రోజుల్లో....

ఆఫీసులో తెగ కష్టపడేవాడిని(పెద్ద గొప్పేం కాదు. నాలాంటి వాళ్ళు బోల్డు మంది ఉండేవారు). రోజుకి దాదాపు 12-14 గంటలు పని చేసేవాడిని. మా ఆఫీసులో ఒక మానేజరున్నాడు.ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లాగా ఆన్ సైట్ స్పెషలిస్ట్ అంటూ ఆయనకో మెగా ఇమేజి ఉండేది.ఈయన టీములో పడితే ఒక కాలు అమెరికాలో పెట్టినట్టే అనిన్నూ, ఇక అమెరికా షాపింగు మొదలెట్టడమే తరువాయి అంటూన్నూ అందరూ ఆశగా అనుకొనేవారు. నా ట్రైనింగు పూర్తికాగానే నన్ను ఆయన టీములోనే వేసారు. హమ్మయ్య! ఒక కాలు అమెరికాలో పెట్టేసా.ఇక రోజుకు పదహారు గంటలు కష్టపడితే ఆ రెండోకాలు కూడా అమెరికాలో పెట్టెయ్యొచ్చు అని ఊహల్లో తేలిపోతూ నా ప్రాజెక్టు తాలూకు క్లయింటుప్లేసులో టెంపరేచరు ఎంతుందో రెండురోజులకోకసారి చూసుకుంటూ ఉండేవాడిని.ఒకానొక దుర్దినాన ...


పొద్దున్నే ఆఫీసుకి బయలుదేరా.ఇంటినుంచి ఆఫీసు దాదాపు ఇరవై కిలోమీటర్లు. హైదరాబాదు ఈ చివర నుంచి ఆ చివరకు ప్రధాన వీధుల్ని సర్వే చేస్తూ సాగేది నా టూవీలర్ ప్రయాణం. అంతదూరం ఆ హైదరాబాదు ట్రాఫిక్‌లో వెళ్తే తెల్ల చొక్కా నల్లగా మారటమేమోగాని ఆ వాహనాల పొగా, రోడ్లమీద దుమ్మూ తలకంటుకొని జుట్టు బరక బరగ్గా తయారయ్యేది.రెండురోజులకోకసారి తలస్నానం చెయ్యకపోతే ఆ మూడో రోజు పని పక్కనపెట్టి బుర్రగోక్కోటంతోటే సరిపోయేది. ఇది అటువంటి ఒకానొక మూడోరోజన్న మాట.


ఆఫీసుకి ఠంచనుగా టైముకే చేరుకున్నా. ఇంకా ఎవరూ వచ్చినట్టు లేరు. ఫ్లోరంతా ఖాళీగా ఉంది. ఇదే మంచి అవకాశం అని అప్పటికే ఈనాడు చదివి ఉన్నాను కాబట్టి నెట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేశా. అవి ఇంటర్నెట్ విప్లవం భారతదేశ తీరాన్ని తాకీ తాకనట్టు తాకుతున్న రేషను రోజులన్నమాట.ఆఫీసులో "టైమ్స్ ఆఫ్ ఇండియా" సైటునుకూడా అదేదో చూస్తున్నట్టు రహస్యంగా చూడాల్సొచ్చేది.


చదూతుండగా తలలో ఏదో కదిలినట్టయింది.


ఏదోలే అనుకుంటే.. కాసేపాగి మళ్ళీ


ఈసారి అటూ ఇటూ చూసి ఎవరు లేరు కదా అని జేబులోంచి దువ్వెన తీసి బరబరా తల దువ్వి ఏవైనా జీవులు తలలో తిష్టవేసుక్కూర్చున్నాయేమో అని దువ్వెనని కిటికీ వెలుతురుకి ఎదురుగా పెట్టి చూసా.ఊహు! ఏమీ కనపడలేదు. సరే అని మళ్ళా టైమ్స్ ఆఫ్ ఇండియా మీదకి దృష్టి మరల్చబోయేంతలో...


మరోసారి.....


ఈసారి చికాగ్గా చేతిగోళ్ళతో మాడు ఘాట్టిగా గోక్కుంటుండగా నా కుడిచేతిమధ్యవేలుగోట్లో ఏదో ఇరుక్కున్నట్లనిపించింది. చూస్తే ఎన్నడూలేనిది, పేనులాగా ఉంది. చచ్చినట్టు పడుంది.


ఆహా నామీద కూడా ఆధారపడ్డ జీవులున్నాయన్నమాట అనుకుంటూ ఉండగా చిన్నప్పుడెప్పుడో మా ఇంట్లోవాళ్ళు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. తలలో పేను చేతికి చిక్కినా, దువ్వెనకి చిక్కినా దాన్నలాగే వదిలేస్తే దరిద్రం అట. వెంటాడి వేటాడి వేటకొడవళ్ళతో కాకున్నా కనీసం చేతి గోళ్ళతో దాన్ని హత్య చేయాల్సిందే అట.సరే, ఇంట్లో వదిలేస్తే ఇంటికి దరిద్రం. మరి ఆఫీసులో వదిలేస్తే అది ఏరకమైన దరిద్రం?ఒకవేళ ఏదోఒక దరిద్రం చుట్టుకున్నా మా CEOనో MDనో పట్టుకుంటుంది. నాకేమిటిలే నష్టం అని అనుకుంటుండగా నాకు ఇంకొక ఆలోచన వచ్చింది.సపోజు, ఫర్ సపోజు ఇది నా డెస్కు వదిలిపెట్టకుండా ఏదో ఒకమూల స్థిరనివాసమేర్పరచుకొని ప్రతిరోజూ నన్నే వెక్కిరిస్తూ చూస్తూ తన శేషజీవితాన్ని హాయిగా గడిపేసిందనుకోండి. అంటే ఆ దరిద్రం నా డెస్కుకూ తద్వారా నాకూ పాకినట్టేగా? అమ్మో ఇది బతికితే నా అమెరికా ప్రయాణం హుళక్కి అన్నమాట.ఆ ఆలోచన రాగానే నాకు దానిమీద విపరీతమయిన కోపం వచ్చేసింది. దాన్నలా టేబుల్ మిద పెట్టి కుడిచేతి బొటనవేలి గోరుతో టక్కున నొక్కా. చావటానికి ముందు పేను "టిక్" అనే శబ్దంతో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చి మరీ చస్తుంది కదా. కన్ఫర్మేషన్ రాకపోయే సరికి నా పట్టుదల హెచ్చింది. ఇంకాస్త శ్రద్దగా నెమ్మదిగా సినిమాల్లోలాగా స్లోమోషన్లో ట్రై చేశా. ఈసారి కూడా నో కన్ఫర్మేషన్ .ఈసారిలా కాదని నా ఎడమచేతి బొటనవేలి గోరు సపోర్టుగాపెట్టి కుడిచేతి గోటితో "చావవే నీ..." అంటూ దాన్ని పరలోకానికి పంపి నేను అమెరికా వెళ్దామని కసిగా నొక్కబోతుండగా నా కుడిపక్క ఏదో అలికిడి. కనుచివరలనుండి తెలుస్తోంది పక్కనెవరో ఉన్నారని.


తలతిప్పి చూస్తే....


అచ్చం సినిమాల్లోలానే.... ముందు ఆ శాల్తీ వేసుకున్న బూట్లు కనపడ్డాయి. ఆతరువాత నెమ్మదిగా తలెత్తి చూస్తే..


ఎవరోకాదు నా మేనేజరే...


టక్కున చేతులు రెండూ వెనక్కి లాక్కుని కుర్చీలో సర్దుక్కూర్చొని నా కంప్యూటరు వైపు చూసా. ఎదురుగా "టైమ్స్ అఫ్ ఇండియా" వెక్కిరిస్తూ. ఆయన నా వైపే చూస్తున్నాడు. "ఆహా! ఒకవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకో వైపు పేను నొక్కుడు.ఏమి వైభోగంరా నీది" అంటూ చూస్తున్నట్టనిపించింది. ఈయన మరో స్పెషాలిటీ ఏమిటంటే మొహంలో హావభావాలేమీ ఉండవు. నిమ్మకి నీరెత్తినట్లో లేదా ఏ విస్కీ ఎత్తినట్లో ఉంటుంది ఈయన మొహం.


ఏమీమాట్లాడలేదు. నన్నూ నా కంప్యుటర్ స్క్రీన్నీ మార్చి మార్చి చూసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు అంతే.


ఇండియాలో ఉన్న నా రెండోకాలు అమెరికాలో పెట్టడం మాట దేముడెరుగు, (ఊహల్లో)అమెరికాలో ఉన్న నా మొదటికాలు వణకడం ఆరంభించింది.ఆ తరువాతి నుంచి చాలారోజులపాటు మీటింగుల్లోగానీ, మరెక్కడైనా, చివరికి కేంటిన్లో కూడా ఆయన నావైపు చూస్తే నాకాసంఘటనే గుర్తుకొచ్చేది. నాకు మోక్షం ప్రాప్తిస్తుందేమో అన్న ఆశతో దాదాపు రెండేళ్ళు ఆయనకిందే పనిచేసాను.ఒకసారి ప్రమోషనూ మిగతా వాళ్ళతో పోలిస్తే అప్పుడప్పుడూ జీతం పెంపూ బానే ఇచ్చాడు గానీ అమెరికాని మాత్రం "ఆ ఒక్కటీ తప్ప" అనే కేటగిరీలో ఉంచేసాడు.


ఇప్పుడంటే సరదాగా రాస్తున్నానుగాని మేనేజరు కరుణాకటాక్ష వీక్షణాలకోసం తపించిపోయే ఓ పిల్ల సాఫ్టువేర్ ఇంజనీరునైన నన్ను అప్పట్లో ఈ సంఘటన ఒక వారం పాటు డిప్రెషన్ లోకి నెట్టేసింది.


దాదాపు నూటయాభై మంది ఆయనకింద పనిచేసేవారు.కాబట్టి ఆయన ఈ సంఘటనని గుర్తుపెట్టుకొని మరీ నన్ను పక్కన పెట్టుండొచ్చు అన్న ఆలోచన నాకు ఇప్పుడు సమర్ధనీయంగా లేదు.కానీ అప్పట్లో మాత్రం నా ఆలోచనలు అలానే ఉండేవి. ప్రతిదాన్నీ ఈ సంఘటనతో ముడిపెట్టేవాడిని చానాళ్ళపాటు. ఆయన నన్ను చూసి నవ్వినా దీనివల్లే, నవ్వకపోయినా దీనివల్లే అననుకునేవాడిని.


ఇంతాచేసి ఆరోజు నా తల తవ్వకంలో బయటపడ్డ ఆ జీవి పేను కాదు. అసలది జీవే కాదు. హైదరాబాదు ట్రాఫిక్ లోంచో లేదా ఏ చెట్టుమీంచో ఎగిరొచ్చి నా తల్లో దూరిన ఆ జీవంలేని ఆవగింజంత ఘనపదార్ధం ఏంటో నాకిప్పటికీ తెలీదు.

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...