Friday, December 12, 2008

డాక్టర్ సానియా మీర్జా

(ముందుగా బ్లాగర్లందరికీ ఈ ఆదివారం తెలుగు బ్లాగర్ల దినోత్సవం సందర్భం గా నా శుభాకాంక్షలు. )
ఈరోజు ఈనాడు లో ఒక వార్త చదివాను. భారత టెన్నిస్ ఆశాకిరణం సానియా మీర్జా కి గౌరవ డాక్టరేటు ప్రదానం చేసారు అనేది ఆ వార్త సారాంశం. ఆ వార్త చదవగానే నాకొచ్చిన మొట్టమొదటి ఆలోచన అసలు ఈ గౌరవ డాక్టరేటు ని ఏ ప్రాతిపదిక మీద ప్రదానం చేస్తారు? ఆయా రంగాలలో విశేష కృషి చేసినవారికా?ఏవైనా విజయాలు సొంతం చేసుకున్న వారికా?లేక సదరు వ్యక్తుల పేర్లు మీడియాలో హోరుమని కొన్నాళ్ళ పాటు వినిపిస్తే చాలా?


వ్యక్తి గతంగా ఆమె సాధించిన విజయాలేమీ నాకు స్ఫురణకు రావటం లేదు. నాకు గుర్తుండి ఏదో ఒక గ్రాండ్ స్లాం లో ఆమె నాలుగవ రౌండ్ కి చేరుకుంది.గ్రాండ్ స్లాం టోర్నమెంట్లలో అదే ఆమె అత్యుత్తమ ప్రదర్శన.ఆదపాదడపా ఏవో చిన్నా చితకా విజయాలు తప్పితే కెరీర్ టైటిల్స్ కూడ పెద్దగా ఏమీ లేవు.ఆమె చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసి ఏవో కొన్ని ఆశలు రేకెత్తించేలోగా పిడుగులాంటి వార్త వింటాం ,గాయాల బారిన పడిందనో, ఫిట్నెస్ సరిగాలేదనో.ఆమెను స్పూర్తిగా తీసుకొని మరికొంత మంది టెన్నిస్ ఆటగాళ్ళు తయారయ్యారు అనేచిన్నపాటి సంతృప్తి తప్పితే ఆమె భారత టెన్నిస్ కి ఒరగ బెట్టిందేమీ లేదనిపిస్తుంది.నాకు ఇంకొక చిరాకు కలిగించే విషయం ఆమె టెన్నిస్ క్రీడాకారిణి అయ్యుండీ, టెన్నిసేతర కారణాలతో వార్తల్లో ఉండటం. వ్యక్తిగతం అని సరిపెట్టుకుందామనుకున్నా, కోర్టుల్లొ చెప్పుకొదగ్గ విజయాలు లేకపోవటం విమర్శలకు ఊతమిస్తోంది.పెద్ద పెద్ద టోర్నమెంట్లలో మొదటి రౌండ్ దాటడం,అభిమానులంతా "హమ్మయ్య, ఒక గండం గడిచింది" అని ఊపిరి పీల్చుకొనేలోపు రెండవ రౌండ్లో ఆమె చేతులెత్తేయడం.కెరీర్లో పెద్దగా ఏమీ సాధించకుండానే,టెన్నిస్ అకాడెమీ పెట్టి కోచింగ్ ఇస్తానని రాష్ట్రప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకోవడం,మకాం దుబాయి కి మారుస్తాననడం లాంటివి భారత టెన్నిస్ ప్రియులకు కొద్దిగా కష్టం కలిగించేవే. మీడియా అత్యుత్సాహం ఇబ్బంది కలిగించేదే అయినా,వారడిగిన ప్రశ్నలకు చిరాకుపడి సమావేశం మధ్యలోనే లేచెళ్ళి పోవడం ఈమెకే చెల్లింది.


ఆటలో వత్తిడి ఉంటుంది.దాన్ని జయించడం అంత ఈజీ కాదు.అందునా దాదాపు వంద కోట్ల మంది ఆశల్ని మోస్తున్నప్పుడు,ఓడినా గెలిచినా అత్యుత్సాహాన్ని ప్రదర్శించే మీడియా చూస్తున్నప్పుడు,అది ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. దాన్ని జయించినవారే నిజమైన ఛాంపియన్.


సానియా ఆటని చూడాలని ఎప్పటినించో అనుకోగా పోయిన సంవత్సరం ఆ కోరిక తీరింది. 2007 బేంక్ ఆఫ్ వెస్ట్ టోర్నమెంటు. ఫైనల్స్ , మన సానియా మీర్జా, అన్నా చక్వతద్జే ల మధ్య. అప్పటికి సానియా ఒక మాదిరి విజయాలతొ మాంచి ఊపు మీద ఉంది. ఆట ఒక్కక్షణం కూడా మిస్ కాకూడదనే ఉద్దేశ్యం తో కాఫీ ముందే కలుపుకొని, మధ్యలో ప్రకటనలు వచ్చినప్పుడు చదవటానికుంటుందని ఒక పుస్తకం పెట్టుక్కూర్చున్నాను. మొదటి సారి ఆమె ఆట చూడటం కాబట్టి నా మనసు మనసులో లేదు. ఆట మొదలయింది. చూస్తున్నానే గానీ ఆమె ఆటలో ఏదో తేడా. మిగతా అంతర్జాతీయ ఆటగాళ్ళలో వెదికినా కనపడని లోపం ఈమెలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది.కాసేపటికి అర్ధమయింది, గెలవాలనే పట్టుదల, కసి కాగడా వేసి వెతికినా ఆమె మొహంలో ఎక్కడా లేశ మాత్రమైనా లేదని.ఒక టొర్నమెంటు ఫైనల్స్ ఆడుతున్నానని, ఇంకొక్క అడుగు జాగ్రత్తగా ముందుకు వేస్తే టైటిల్ తన సొంత మవుతుందనే అలోచనేమాత్రం లేనట్టు ఆడుతొంది. ఈ విషయం లో లియాండర్ పేస్ చాలా బెటరు. పాయింటు పాయింటు కీ గెలవాలనే తపన,భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నననే స్పృహ అనుక్షణం కనపడుతుంది నాకు ఆయనలో.సరే,నాకొచ్చిన ఆలోచన ఆ టివీ కామెంటేటరుకు కూడా వచ్చినట్లుంది, ఆట మధ్యలో కొద్ది పాటి విరామం దొరికితే ఆమె మైకు పట్టుకొని ఆట చూస్తున్న సానియా వాళ్ళమ్మ దగ్గరికెళ్ళి ఇలా అడిగింది.

(మక్కీకి మక్కీ సంభాషణ నాకు గుర్తు లేదు గాని, దాని సారాంశం మాత్రం ఇదే)..

"ఇది టొర్నమెంటు ఫైనల్ కదా, కొంచెం కష్టపడితే టైటిల్ సానియా సొంతం, కానీ తను ఆ ధ్యాసే లేనట్టు ఆడుతొంది"

""

"తనకేమైనా గాయాలున్నాయా, ఫిట్నెస్ సరిగాలేదా?"
"అదేమీ లేదు, షి ఈజ్ జస్ట్ ఫైన్."

"మరెందుకలా ఆడుతోంది?"

"బహుశా ఫైనల్స్ వరకు వచ్చానుకదా అదేచాలనుకుందేమో?"

టీవీ కామెంటేటర్ ఇంకేమీ మాట్లాడకుండా తన బాక్సు దగ్గరకెళ్ళి, తన సహ కామెంటేటర్ని అడిగింది.

"సానియా వాళ్ళమ్మ అన్నది నీకేమైనా అర్ధం అయిందా, అదేమిటి?ఫైనల్స్ వరకు వస్తే చాలా? గెలవాల్సిన అవసరం లేదా?"

"ఏమో నాకూ అదే అర్ధం కాలేదు" అన్నాడు రెండో కామెంటేటరు.

నాకయితే మాత్రం "హమ్మయ్య, ఈమాత్రం ప్రదర్శన చాలు, ఇక ఇండియాలో విమర్శకుల నోళ్ళు మూయించొచ్చు" అన్నదే సానియా, సానియా వాళ్ళమ్మ మనసుల్లో ఉన్నట్టనిపించింది.

మీలో కొంతమంది ఊరికే విమర్శించటం కాదు,ఆడితే తెలుస్తుంది అందులోని కష్టం అనుకోవచ్చు. స్వతహాగా టెన్నిస్ ప్రియుణ్ణి, కొన్నేళ్ళుగా ఆమె ఆట గురించి వింటున్న వాణ్ణి, ఈక్వేషను లో ఏదో తేడా ఉంది అని అనిపించింది కాబట్టి రాస్తున్నాను.

సరేగానీ, ఇంతకీ ఈ డాక్టరేటు ల సంగతేమిటి? అసలు ఇవి ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు? ఎందుకిస్తారు మీకేమయినా తెలుసా? అరకొర విజయాలతో మరీ ఇరవై రెండేళ్ళకే సానియా డాక్టరయి కూర్చుంది. ఇప్పుడేమో గానీ కొన్నేళ్ళ క్రితం మన యూనివర్సిటీలు పోటీలుపడి మరీ సత్కరించాయి మన మహానటుల్ని గౌరవ డాక్టరేట్లతో. నాకయితే ప్రస్తుతానికీ గౌరవ డాక్టరేట్లో మరీ అంత గౌరవించాల్సిందేమీ లేదనిపిస్తొంది.


PS: నా అభిమాన నటుడు వేణుమాధవ్ కి ఎవరైనా డాక్టరేటు ఇస్తే చూడాలనుంది.

Tuesday, December 9, 2008

నా తెలుగు సినీదర్శకులు

సరదాగా రాసుకున్న టపా ఇది.


నేను ఎవరైనా సినీ దర్శకుడిని గుర్తుచేసుకుంటే అసంకల్పితంగా, ఒక సినీ ప్రేక్షకుడిగా, చటుక్కున నాకు స్ఫురణకి వచ్చే అంశాన్ని ఆయా దర్శకుల పేర్లతో జోడించి రాసాను. మీకు నే రాసినది గాక ఇంకేమైనా గుర్తుకొస్తే మీ చూపలాంటిది అనుకొని సరిపెట్టుకోండేం?

బి. విఠలాచార్య: మాయలూ, మంత్రాలూ , రాకుమారుడూ-రాకుమారి

కె. విశ్వనాధ్ : మొహంలో అవసరమైన దానికన్నా ఎక్కువ సాత్వికత

మణిరత్నం: అందమైన కేమెరా

రాం గోపాల్ వర్మ : జులపాల జుట్టు రౌడీలు, హింస తో కూడుకున్న చీకటి

జంధ్యాల : మధ్యతరగతి ఇళ్ళు, అందమైన తిట్లు, వైజాగ్

రేలంగి నరసిఁహారావ్: సాదా సీదా మధ్యతరగతి మనుషులు

బాల చందర్: విప్లవ ధోరణిలొ సాగే ప్రేమకధలు

ఈ.వి.వి సత్యనారాయణ: అందాల ఆరబోత తో కూడిన హాస్యం

చంద్రశేఖర్ యేలేటి: వైవిధ్యం, వైవిధ్యం, వైవిధ్యం... వెరసి ఉలిపికట్టె

వంశీ: యాసతో కూడిన హాస్యం, మూడు నిముషాల పాటకి మూడొందల ఫ్రేములు

శంకర్: అవినీతి, ఒక మెలోడీ,ఒక ఫాస్ట్ బీట్ , ఒక జానపద పాట, హింస

కృష్ణవంశీ: రంగు రంగుల ముగ్గులు, అవసరమైన దానికన్న ఎక్కువ నోరు చేసుకొనే హీరోయిన్లు, తడిసిన తలలతో హీరోలు

వి. వినాయక్ : ఫ్యాక్షనిజం

గుణశేఖర్: భారీ సెట్టింగులు

కోదండరామిరెడ్డి: చిరంజీవి, యండమూరి, ఇళయరాజా, లోక్ సింగ్ (ల కాంబినేషన్ )

యస్.వి. కృష్ణారెడ్డి: చిన్నపిల్లల హాస్యం

టి.కృష్ణ: తిరుగుబాటు

త్రివిక్రం శ్రీనివాస్: ప్రాస తో కూడిన ప్రయాస

బాపు: పదారణాల తెలుగుదనం,కొంటె చూపులూ, పెదవి విరుపులూ, పొడవాటి జడ ఇంకా చాలా...

రాఘవేంద్రరావు : అవసరమా? ఆహ, అవసరమా అని అడుగుతున్నా..

Tuesday, December 2, 2008

నే చదివిన ఒకానొక మంచి కధ

నేనప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను,నేను నా చిన్నప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్ని సినిమాలు చూసిఉంటాను? అని. నాలుగొందలు? ఆరొందలు? వెయ్యి? అమ్మో వెయ్యా? అన్నుండవు. ఏమో లే,తెలుసుకొని చేసేదేముంది.
మొన్నీమధ్య అదేరీతిలో ఇంకొక ఆలోచనొచ్చింది. చిన్నప్పటినుంచి ఇప్పటివరకు ఎన్ని కధలు చదివి ఉంటాను అని.వెయ్యేం ఖర్మ ఆపైన ఇంకో వెయ్యి కూడా వేసుకోవచ్చు అనిపిస్తుంది.సరే మరి, ఆ చదివిన వాటన్నిటిలోకల్లా మంచి కధ ఏది? చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే చదివిన వాటిల్లో ముప్పాతికొంతు అసలు గుర్తేలేవు కనుక.ఈ ఇంటెర్నెట్ పుణ్యమా అని ఇప్పటికీ రెగ్యులర్ గా ఆన్లైన్లో దొరికిన కధనల్లా చదువుతూనే ఉన్నా. వాటిల్లో నాకు బాగా నచ్చిన కధ శ్రీరమణ గారి "బంగారు మురుగు". మొట్టమొదటసారి ఆ కధని చదివేటప్పుడు కధ చివరకు రాగానే మనసంత ఏదో దిగులుగా అయిపోయింది. ఆ కధని ఆరొజే దాదాపు ఏ పదిసార్లో చదువుకొని ఉంటాను.అంత బాగా నచ్చింది నాకా కధ. నేను ఆన్ లైన్లో రాసిన మొట్టమొదటి కామెంటు కూడా ఆ కధకే. ఆతరువాత నేను చేసిన పని ఆ కధని ప్రింటవుటు తీసుకోవడం.ఈ నాలుగేళ్ళలో ఆ కధని ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు.
ఇక కధ విషయానికొస్తే ఇది ఒక బామ్మా మనవళ్ళ కధ. ఏదొ చాదస్తపు బామ్మ కాదు. ఎందుకు పుట్టామో చెపుతుంది, ఎలా బ్రతకాలో చెప్తుంది, ప్రేమంటే ఏమిటొ చెప్తుంది, సాటి ప్రాణి మీద దయలేని దైవభక్తి ఎంత నిరర్ధకమో చెప్తుంది,త్యాగమంటే ఏమిటో చెప్తుంది. చిట్టచివరిగా ఈ కధ అందరికీ తమ అమ్మమ్మల్నో, నానమ్మల్నో గుర్తు చేస్తుంది.
చక్కటి కధ. ఎక్కడా ఆగకుండా అలా చదివించే కధనం. ఇది శ్రీరమణ గారు రాసిన మొట్టమొదటి కధ అంటే నమ్మబుద్ది కాదు.
సరె, ఇక్కడ ఆకధ మీకోసం.


P.S: ఆ కధ కింద వచ్చిన కామెంట్లలో ఒకరు శ్రీరమణ గారు రాసిన "షోడానాయుడు" కధ గురించి ప్రస్తావించారు. మీకెవరికైనా ఆ కధ ఎక్కడైన ఆన్లైన్లో కనపడితే వివరాలిచ్చి పుణ్యం కట్టుకోగలరు.

Tuesday, November 25, 2008

వారసులొచ్చేస్తున్నారు జాగ్రత్త!!

గుండమ్మకధ.
అప్పుడు నేను చదివేది ఏ ఆరో తరగతో, ఏడోతరగతో.
అప్పటికి గుండమ్మకధ ఏ పదో రిలీజో, పదకొండో రిలీజో.మ్యాటినీ హవుస్ ఫుల్. ఈసురో మని వెళ్తే ఫషో మళ్ళీ హావుస్ ఫుల్. ఆ తరువాత ఒక రెండు రోజులకి గానీ దొరకలేదు టిక్కెట్లు.

ఎంటీఆర్, ఏఎన్నార్, రాజ్యన్నేలిన రోజుల్లో అందరూ పాపం చక్కగా వారి సినిమాల్ని ఎంజాయ్ చేసారు.వాళ్ళకి నీరాజనాలు పట్టారు. నెత్తికెక్కించుకున్నారు. ఏదో మర్యాదా, మన్ననలు కాలమేలిన రోజులు, నెత్తిమీద పెట్టుకున్నన్ని రోజులు పెట్టుకొని ఆ తరువాత దిగండి సారూ అంటే వారు కూడా మర్యాదగా దిగి అస్త్ర సన్యాసం చేస్తారనుకున్నారు గానీ ఇలా కొంప కొల్లేరు అవుతుందని సగటు ప్రేక్షకుడు ఎవడూ అనుకోలేదు. "హవ్వ! మనమరాలి వయసు అమ్మాయితో గంతులూ , కుప్పి గంతులూనా" అనుకున్నా, ఆ ఫీలింగుని కడుపులోనే దాచుకున్నారు, వారు వింటే బాధపడతారని. వారు నటించిన పాత చిత్ర రాజాలను చూసి పెద్దమనసుతో క్షమించేసారు. అంతటితో ఆగిందా? లేదు. రోజులు మారాయి. వాళ్ళూ మనలాంటి మనుషులేగా. వాళ్ళకంటూ ఒక కుటుంబం , పిల్లలూ...

ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యారు.మనకి గుది బండయ్యారు. అయినా భరించాం...
బక్క పలచగా ఉన్నా భరించాం...
బొద్దుగా ఉన్నా భరించాం..
మొదట్లో చాలా కష్టపడి పైకొచ్చి ఆ తరువాత నేను స్టార్ ని, నా కధలింతే మీ గతంతే..అంటే భరించాం...
తరం మారింది..
వీళ్ళూ యాభై, అరవైల్లోకొచ్చారు. వీళ్ళకీ ఒకటో రెండో పెళ్ళీళ్ళూ ఇద్దరో ముగ్గురో పిల్లలూ...
పాపం సగటు ప్రేక్షకుడికి ఇక చాలు బాబో అనే ఓపిక కూడా లేదు...
************************************

మొన్నీ మధ్య మేము నలుగురు ఫ్రెండ్స్ మి ఒక పార్టీ సందర్భంగా కలుసుకున్నప్పుడు ఇప్పుడున్న నటుల్లో(?) ఎవరెవరికి ఎంత మంది పిల్లలు, వాళ్ళ వయసెంత, ఇంకెంతమంది ఈ సినీలోకం మీద దాడికి రెడీ గా ఉన్నారు అని భయ భయం గా చర్చించుకున్నాం.
ఏమిటో, ఓ సంవత్సరం క్రితం పెళ్ళై, ఈ మధ్యే తండ్రైన నటుణ్ణి చూసినా భయపడాల్సొస్తోంది..హతవిధీ......

Monday, November 24, 2008

నా వానా కాలం చదువు

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సాగిన నా పఠనా ప్రస్థానాన్ని అక్షరబద్దం చేద్దామనే ఆలోచన ఈ టపా కి ప్రేరణ. ఇది రాస్తున్నంత సేపూ నాకని పిస్తూనే ఉంది ఇది సమగ్రమైన టపా కాక పోవచ్చు అని.కొన్నేమో లీలగా గుర్తున్నాయ్, మరి కొన్ని గుర్తుకు వచ్చినప్పుడు ఆ ఒక్క విషయానే ఒక పెద్ద టపా లా రాయొచ్చు అనిపించేది. ఇక్కడ కుదించి రాసి రెంటికీ చెడ్డ రేవడి లా అవుతున్నదేమో అన్న అసంతృప్తి.దానికితోడు అభిరుచి కొద్దీ నేను చేసిన జర్నలిజం కోర్సు లో నేర్చుకున్న "క్లుప్తత" పాఠం, నన్ను పేజీ లకు పేజీలు రాయనివ్వలేదు. వెరసి ఇదిలా తయారైంది.
************************************************************

మొత్తం మీద చూస్తే నేనేమి పెద్దగా ఏమీ చదూకోలేదు అనిపిస్తుంది నాకు.స్కూలో ఉన్నప్పుడు,కాలేజీ లో ఉన్నప్పుడు ఎడా పెడా చదివి పారేసినా ఉద్యోగపర్వం లోకి వచ్చాక పెద్దగా చదివింది అంతగా లేదు.అదే నాకు కొద్దిగా బాధ కలిగించే విషయం.ఈ పన్నెండేళ్ళలో ఎన్ని వేల గంటల్ని వృధా చేసానో అనిపిస్తుంది నాకు.సద్వినియోగం చేసుకొని ఉంటే ఇంకొన్ని పుస్తకాలు నేను చదివిన లిస్టు లోకి చేరి ఉండేవి కదా.ఏమాట కామాటే చెప్పూకోవాలి నా ఉద్యోగజీవితం మొదలైన కొత్తల్లో పని పరమైన ఒత్తిడి విపరీతంగా ఉండేది. మిగతావారి కంటే వెనక పడ కూడదనే గట్టి పట్టుదలా, ఆ మొదటి నాలుగేళ్ళూ నా సాంకేతిక జ్ఞానాన్ని వృద్ధి పరచుకోవాల్సిన ఆవశ్యకతా, నన్ను నాకిష్టమైన పనికి దూరం చేసాయి. మనకిష్టమైన పనిని ఎన్ని ఇబ్బందులొచ్చినా కొనసాగించటం లోనే గొప్పతనం దాగుంటుంది. నేను మాత్రం ఆ విషయం లో పెద్ద ఫెయిల్యూర్.

నాకు ఊహ తెలిసి నేను చదివిన మొదటి పుస్తకం చందమామ.ఆ తరువాత బాలజ్యోతి,బాలమిత్ర,జాబిల్లి. వీటివల్లనేమో నాకు జానపద చిత్రాలంటే విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.నా చిన్నప్పుడు నేను జానపద చిత్రాల్ని విపరీతంగా చూసేవాడిని. పొద్దున్నే స్కూలు కి వెళ్ళేటప్పుడు ఎన్.టి.రామారావు గారి ఏ "అగ్గి పిడుగో", లేక కాంతా రావు గారి "జ్వాలా ద్వీప రహస్యం" తాలూకు వాల్ పోస్టర్ కనపడిందంటే ఇక మనసంతా ఒకటే ఆలోచన, ఈ సినిమా చూసే వీలు ఎప్పుడూ కలుగుతుందా అని.ఇప్పుడంటే రెండు ఫోన్ నంబర్లు గుర్తుపెట్టు కోవాలంటే బుర్ర కి కొద్దిగా కష్టమవుతుంది గాని చిన్నపుడు నేను ఏకసంధా గ్రాహిని.బాగా చదువుతాననే పేరుండటం చేత ఇంట్లో కూడా నా సినిమా పిచ్చి కి పెద్ద అడ్డుండేది కాదు. అమ్మ దగ్గర ఒక రూపాయుచ్చుకుంటే సినిమా టిక్కెట్టు తోపాటు ఇంటర్వెల్ లో ఉడకబెట్టిన వేరుశెనక్కాయలు కూడా నా వళ్ళో పడేవి(నావన్నీ నేల టిక్కెట్టు సినిమాలు లెండి).సరే విషయం పక్క దారి పడుతోందనుకుంటా. నా చదువు గోల కాస్తా సినిమా గోల గా మారకముందే దీన్ని ఆపేస్తా.ఆ రోజుల్లో చిన్న చిన్న పాకెట్ సైజు జానపద కధల పుస్తకాలు ఉండేవి.నాదగ్గరున్న ట్రంకు పెట్టెలో దాదాపు ఒక వంద పుస్తకాలుండేవి అట్లాంటివి.అప్పట్లో అవి నాప్రాణం.పాఠ్య పుస్తకాలకుక్కూడా అంత సీనుండేది కాదు వాటిముందు.వాటిని పాన్ షాపుల్లో క్లిప్పులతో ఒక దడి లాగా కట్టి వేలాడదీసి అమ్మేవారు.అట్టమీద బొమ్మ, కధ పేరు కాస్త ఆసక్తికరంగా కనపడిందంటే చాలు ఆ పుస్తకాన్ని కర కరా నమిలి మింగాల్సిందే. లేకుంటే మనసులో చెప్పలేనంత దిగులు.

నాకు ఈనాడు పేపరు చదవటం నా పదోయేటే అలవాటైంది. అతిశయోక్తి అనుకోకుంటే ఒక్క మాట.నా ఈనాడు పఠనం అప్పటినుండి ఇప్పటిదాకా అప్రతిహతం గా కొనసాగుతూనే ఉంది.నేను చదవనిదల్లా పండగలప్పుడు "పండగ సందర్భం గా ఈనాడు కార్యాలయానికి సెలవు"అని వారు సెలవిచ్చినప్పుడే. అప్పటినుంచి ఇప్పటివరకు నేను "ఈనాడు" వీరాభిమానిని(ఈ కుళ్ళు రాజకీయాలని పక్క పెడితే). నా ఆరోతరగతిలో యేసురత్నం గారని సోషల్ టీచరొకరుండేవారు. ఆయన ఆరోజుల్లోనే మాకు డైరీ రాయటం నేర్పించారు. రోజూ ఆయన క్లాసులో మేము క్రితం రోజు రాసిన మా దిన చర్య చూపించాలి. దానితో పాటు ఆరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైనా వార్తలు కూడా రాయాలి. అలా ఒకానొక శుభదినాన నా "ఈనాడు" పఠనం మొదలయింది. నా ఆనాటి దినచర్యలో మొదటి మూడు వాక్యాలు ప్రతిరోజూ ఒకేలా ఉండేవి ఇలా..

"ఈరోజు నేను పొద్దున్నే ఏడుగంటలకు నిద్ర లేచితిని. ఆ వెంటనే పళ్ళుతోమితిని. అటుపిమ్మట కాలకృత్యములు తీర్చుకొని కాసేపు చదువుకొంటిని".

నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆ డైరీ అనుకోకుండా నా కంట పడితే ఒక రోజంతా నవ్వుకున్నా మళ్ళీ మళ్ళీ చదువుకొని.
అప్పుడు నేనుచదివిన ఈనాడు లో నాకిప్పటికీ గుర్తున్న వార్తలు కొన్నున్నాయ్. అవి , రష్యా అధ్యక్షుడు అంద్రోప్రొవ్ మరణం, ఎయిర్ ఇండియా విమానం కనిష్క కూల్చివేత, బందిపోటు రాణి పూలన్ దేవి లొంగుబాటు, మహా కవి శ్రీ శ్రీ మరణం. ఇంకా ఆలోచిస్తే మరికొన్ని గుర్తొస్తాయి గానీ, నాకే అనిపిస్తొంది ఇక్కడ రాయటం అంత అవసరమా అని. మరి చదివే వారు మీకేమనిపించొచ్చో నాకుతెలుసు. సరే, పేపరు నాచేతికి రాగానే మొదట నేను చదివేది మూడో పేజీ లో కుడివైపు కింద భాగం లో ఉండే బొమ్మల కధ. ఒక రెండేళ్ళ పాటు వీటిని కట్ చేసి పుస్తకంగా కుట్టుకున్నాను కూడా. తరువాత క్రీడా వార్తలు, మొదటిపేజీ వార్తలు. కాస్త బుర్ర పెరిగాక మూడో పేజి సంపాదకీయాలూ, కులదీప్ నయ్యరు (లోగుట్టు), ఎ.జి. నూరానీ, చంద్రచూడ్ సింగ్ లాంటీ మహా మహుల వ్యాసాలూ , పుణ్యభూమీ, చలసాని కబుర్లూ వగైరా వగైరా.

ఎప్పుడు , ఎందుకు చదివానో నాకు తెలీదు గానీ నేను నా జీవితంలో చదివిన మొట్టమొదటి నవల మల్లాది వారి "మేఘమాల". నా అదృష్టమేమో నా మొట్టమొదటి నవలే మల్లాది ది కావటం. నాకానవల విపరీతంగా నచ్చింది. ఇంకేముంది జబ్బు ముదిరింది నాకు. దొరికిన నవల్నల్లా చదివి పారెయ్యటమే.దానికి తోడు మా అన్నయ్య ఫ్రెండొకతనికి అద్దె పుస్తకాల షాపుండేది. మల్లాది,యండమూరి, సూర్యదేవర, చందు సోంబాబు,అల్లాణి శ్రీధర్,యర్రంశెట్టి ఒకరేమిటి, పేరున్న, పేరు లేని, పేరుండి ఆ తరువాత పిచ్చి రాతలు రాసి పేరు చెడగొట్టుకున్న వారందరి నవళ్ళూ చదివేసా. మల్లాది కి వీరాభిమానిని కదా ఆయన రూపాయి పత్రిక స్రవంతి నీ పోషించా అదున్నన్నాళ్ళూ. నాకు బాగా నచ్చిన నవలలు బోలెడున్నాయ్ అన్నీ గుర్తు కు రావు గానీ, యండమూరి ఆనందో బ్రహ్మ, ప్రార్ధన, వెన్నెల్లో ఆడపిల్ల, మల్లాది మేఘమాల, సావిరహే,అందమైన జీవితం,మందాకిని వాటిలో కొన్ని. నాకు మల్లాది రాసిన వాటిల్లొ నచ్చని దంటే ఏకలింగం అడ్వెంచర్స్. ఆ తరువాత ఆయన రాసిన రచనల్లో శృంగారం పాళ్ళు ఎక్కువ ఉండటం కూడా నాకు నచ్చలేదు. మొత్తానికి ఆ టైంలో నాకు బాగా నచ్చిన రచయితలంటే వారిద్దరే , మల్లాది, యండమూరి.

మల్లాది నవలల్లో హైదరాబాదు ప్రస్తావన దాదాపు అన్ని నవలల్లో కనపడేది.అప్పట్లో సావిరహే చదివి నేను డంగైపోయాను.నేను కూడా హైదరాబాదు వెళ్ళి అర్జంటుగా ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి షికార్లు కొడుతున్నట్ట్లు ఊహల్లో తేలిపోయేవాడిని. ఛీ ఇంకా ఎన్నాళ్ళీ పేట జీవితం, హైదరాబాదు ఎప్పుడెల్తాను అనిపించేది నాకు. అందుకే నాకు ఇంజనీరింగు సీటు హైదరాబాదు లో వస్తే, సీటు వచ్చినందుకంటే, హైదరాబాదు వెళ్తున్నందుకు చాలా సంతోషం వేసింది నాకు.

అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా, మల్లాది గారి కో నియమం ఉండేది. ఆయన రాసే ప్రతి నవల లో పాత్రల పేర్లు ఏవీ కూడా రిపీట్ కాకూడదు. అంటే అంతకుముందు తను రాసిన ఏ నవల్లోను పెట్టని పేర్లై ఉండాలి. అందుకే ఆయన రచనల్లో కొన్ని పాత్రల పేరు చాలా విచిత్రం గా ఉండేవి. ఆ పేర్లు ఆ పాత్ర స్వభావాన్ని, వయసునీ దృష్టిలో పెట్టుకొని ఎన్నుకున్నట్టే ఉంటుంది కానీ , అసహజం గా ఏమాత్రం ఉండేవి కావు. యండమూరి లా భావుకత ని పండించక పోయినా, చాలా సింపుల్ గా, ఒక సన్నివేశం తరువాత మరొక సన్నివేశం , అలా అలా .. నవలంతా కళ్ళముందు జరిగిపోతున్న సినిమాలా ఉండేదే తప్ప, ఒక నవల చదువుతున్నట్టు ఏమాత్రం ఉండేది కాదు నాకు. నాకు డైరీ రాసే అలవాటున్నప్పుడు, ఏదో ఒక డైరీ వెనక పేజీ లో మల్లాది పాత్రల పేర్లు అని హెడ్డింగు పెట్టి నాకు గుర్తున్న పేర్లన్నీ రాసినట్టు గుర్తు. యెర్రంశెట్టి హాస్యం అన్నా నాకు చాలా ఇష్టం. ఆయన ఒక కాలనీ ని ఆధారంగా చేసుకొని రాసిన కధలు చాలా బావుండేవి(అది నిర్భయ్ నగర్ కాలనీ నేనా?). శాయి గారు అంతకుముందు సీరియస్ గా ఉండే రచనలు చేసారనుకుంటా. కార్నర్ సీట్ అని ఒక చిన్న నవల ఈయనదే చదివినట్టు గుర్తు.(రచయిత ఆయన కాకపోతే సరిదిద్దండేం?).

వార , మాస పత్రికలూ తెగ చదివేవాడిని. నాకు గుర్తుండి నేను చదివిన మొట్టమొదటి కధ "ప్రిస్టేజ్" అని అంధ్ర సచిత్ర వార పత్రిక లోనిది. నవలలు ఎంత ఇష్టం గా చదివేవాడినో పత్రికల్లో కధలు కూడా అంతే ఇష్టం గా చదివేవాడిని. ఇప్పుడెలా ఉందో తెలీదు ,చదవటం మానేసాను గాని,అప్పట్లో నా అభిమాన వార పత్రిక అంటే అంధ్రభూమి. కొన్న రెండు గంటల్లో మొత్తం చదివిపారేసి నిట్టూర్చేవాడిని అప్పుడే అయిపోయిందే అని. మొత్తం చదివేయక పోతే ఒక రెండు కధలో సీరియల్సో రేపటికి మిగుల్చుకుంటే బాగుండేది కదా అనుకొనేవాడిని. ఆతర్వాత కొన్ని సంవత్సరాలకు అదే ఆంధ్రభూమి కారణంగా నాకు కధల మీద ఆసక్తి పోయింది. ప్రతిభ ఏమాత్రం లేని కొత్త రచయితల కధలు ప్రచురిత మవటం ప్రారంభమయింది. కొన్ని కధలైతే అసలిది కధేనా అనిపించేటంత. డబ్బులిచ్చి వేయించు కున్నట్లుంది అనే కొన్ని వాఖ్యలు వినపడినా నాకైతే అందులో నిజమెంతుందో తెలీదు. ఆ రోజుల్లో నేను క్రమం తప్పకుండా చదివిన మరికొన్ని పత్రికలు అంటే అంధ్ర జ్యోతి, అంధ్ర ప్రభ, రచన,మిసిమి ( ఇందులో కొన్ని వ్యాసాల స్థాయి ఎలా ఉంటుందంటే నాకసలు అర్ధమయేవి కావు, బహుశా యిప్పటికీ కూడా). ఇంకా మరికొన్ని ఉండేవి గాని పేర్లు గుర్తు రావటం లేదు. సినిమా పత్రికల్లో సితార, జ్యోతిచిత్ర క్రమం తప్పకుండా చదివేవాడిని. మహానటి సావిత్రి చనిపోయినప్పుడు "రాలిపోయిన తార" అని హెడ్డింగు పెట్టి రాసారు జ్యోతిచిత్రలో(అనుకుంటా). అప్పటికి నేనింకా చాలా చిన్నపిల్లోడిని, నాకు సావిత్రి తెలీదు. అందరూ "అయ్యో" అంటూ చదువుతుంటే, నేను యధాలాపంగా ఆపేజీ చూసానంతే.

ఈనాడు ఆదివారం సంచికలో వచ్చే కధ అంటే నాకు చాలా క్రేజ్. నేను ఇంజనీరింగు చదివే రోజుల్లో నేను సైతం అని ఒక కధ రాసి ఈనాడు లో పనిచేసే మా పిన్ని ద్వారా పంపిస్తే చలసాని వారు బహు మర్యాదగా దాన్ని తిప్పి పంపిం"చేరు". దాంతో మా పిన్ని అప్పటి అంధ్ర ప్రభ ఏడిటర్ గా ఉన్న వాకాటి వారి వద్దకి పంపిస్తా, వెళ్ళి, మాట్లాడి, రాయడం లో కొన్ని కిటుకులు తెలుసుకోమంటే, కధ రిజక్ట్ అయిన బాధలో నేను ఆమెతో "ఊ" అన్నా, నాతోనేను "ఊహూ" అనుకొని బయటకొచ్చేసాను. అప్పటి కధని కొన్నేళ్ళ తరువాత తిరిగి చదువుకుంటే , ఆ రోజు వాకాటి వారి వద్దకు వెళ్ళకుండా మంచి పని చేసాననిపించింది. పెద్దమనిషి కర్రుచ్చుకొని వెంటపడిఉండేవారు. దాదాపు ఒక నాలుగైదు యేళ్ళపాటు ఈనాడు ఆదివారం సంచిక లో వచ్చే కధలన్నీ చింపి ఒక చిన్న పుస్తకం లా కుట్టుకున్నాను. కొన్ని కధలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు మాటల్లో చెప్పలేను. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు దుమ్ము దులిపి ఒక లుక్కేయాలి దానిమీద.

ఇంజనీరింగు లోకొచ్చాక కూడా మొదటి మూడేళ్ళు బానే చదివాననుకుంటా. అప్పట్లో నేను స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కి వెళ్ళేవాడిని రెగ్యులర్ గా. మా కాలేజేమో గండిపేట్లో.లైబ్రరీ ఏమో అఫ్జల్ గంజ్ లో. శనాదివారాలు పొద్దునే బయలుదేరి లైబ్రరీ కి వచ్చేవాడిని. వచ్చేసరికి ఎంతలేదన్నా పదీ పదకొండయ్యేది, ఒక గంట చదవగానే ఆకలి. ఇంకొక రెండు గంటలు కాగానే ఇంక బయల్దేరాలీ అనే తొందర. ఇంట్లో డబ్బులమీద ఆధార పడ్డ ఆరోజుల్లో హాస్టల్ లంచ్ త్యాగం చేసి బయటతినాలంటే కొద్దిగా ఆలొచించాల్సొచ్చేది.అలా అక్కడ నాకు తిలక్,బలివాడ,శీలా వీర్రాజు,కొ.కు,రంగ నాయకమ్మ, అక్కిరాజు (మంజు శ్రీ),భరాగో, ఇంకా చాలా మంది పరిచమయ్యారు. ముఖ్యం గా కొ.కు గారు. ఆయన రచనలు చదుతుంటే , చదువుతున్నత సేపూ కోపం వచ్చేది నామీద నాకే. ఈయన రచనలు నా దృష్టి కి మరీ ఇంత లేటు గా వచ్చాయేమిటి అని. రంగనాయకమ్మ గారి రచనలు చదివాక నాకు అప్పటివరకు ఉండే ఆలోచనల్లో సమూలమైన మార్పు వచ్చింది. "బడు" పద ప్రయోగం మీద, "వాడుక భాష" గురించి ఆమె రాసిన వ్యాసాలు చాలా ఆసక్తి గా చదివాను.ఆ తరువాత నా మకాం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ కి మార్చాను.అప్పటి తిరుగుడు అంతా సిటీ బస్సుల్లోనే కదా. ఈ లైబ్రరీ ఎలా ఉండేదంటే ఎటువైపు బస్సు దిగినా బాగా లోపలికి నడవాలి. దానికి తోడు ఆరూట్లో బస్సులు తక్కువ. ఇంత కష్టపడ్డా ఇక్కడేమి చదివానో గుర్తు లేదు గాని, రిఫరెన్సు విభాగంలో పదిహేను ఇరవైయేళ్ళ నాటి "ఈనాడు" పేపర్లు నెలలవారీగా బైండు కట్టి ఉండేవి, వాటిని తెగ చదివేవాడిని. ముఖ్యంగా ఆదివారం నాటి పేపర్లని.

నాకు ఊహ తెలిసి నేను చదివిన మొదటి సాహితీ కాలం "చేరాతలు". ఆ తరువాత ఏపేపరు చదివినా సాహిత్యానికి సంబంధించిన పేజీ లని శ్రద్ద గా చదివేవాడిని. ఇప్పటికీ నాకు కొన్ని అర్ధం కావు. అందుకే నా స్థాయి మీద నాకెప్పుడూ న్యూనతా భావమే. ఇంకొంచెం ఎక్కువ చదివి ఉండాల్సింది అనే ఆలోచనే..

పెళ్ళి చేసుకొని మొదటి సారి ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నా, నాలుగు సూట్కేసులు గదా, ఈసారి ఇండియా వెళ్ళినప్పుడూ ఒక సూట్కేసు నిండా నాకు నచ్చిన పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకోవాలి అని. అలానే ఒకరొజు మా ఆవిడ కళ్ళుగప్పి అబిడ్స్ విశాలాంధ్ర బుక్ హవుసు కెళ్ళి నాకు నచ్చిన పుస్తకాలు చాలా కొన్నా. నండూరి వారి విశ్వదర్శనం రెండు సంపుటాలు, తిలక్ కధలు, మునిపల్లె రాజు జర్నలిజం లో సృజనరాగాలు, అక్కిరాజు గారి సాహితీ వ్యాసంగం, భరాగొ ఇట్లు మీ విధేయుడు, నవీన్ అంపశయ్య, డి.వి నరసరాజు గారి ఆత్మ కధ, మహానటి సావిత్రి జీవిత చరిత్ర, భానుమతి గారి నాలో నేను.. మరికొన్ని. ఇంటి కొచ్చాక వాటన్నిటినీ తూకం వేస్తే గుండే గుభేలు మంది. నిజంగానే ఒక సూటుకేసు కి అవే సరిపోతాయ్. అవన్నీ ఒక సూటుకేసు లో సర్ది, పైన బట్టలు పెట్టా అనుమానం రాకుండా. "రాజభవనం అంతా తిరుగు, ఆ గది తలుపు మాత్రం తియ్యకు" అని అదేదో జానపద కధలో రాకుమారిడికి చెప్పినట్లు నేను తనకి చెప్పాను, ఆ సూట్కేసు తీయకు అందులో ఉన్నవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు, అవి గనక పోతే ఇక అంతే సంగతులు అని. ఇంకా నమ్మకం కుదరక ఆ సూట్కేసు ని మా బెడ్రూం మంచం కింద లోపలికి అందకుండా తోసేసా. మొతానికి కధ సుఖాంతమే అయింది "నేను అమెరికా వచ్చేదాకా". ఆమాత్రం రిస్కు తీసుకోకపోతే నాకు మిగిలేది ఇంకో రెండు శిల్పారామం , తరుణి షాపింగులూ , ఇంకో రెండు రకాల పచ్చళ్ళు, మరి కొన్ని తపేలాలూ, గిన్నెలూనూ . ఇంట్లో ఇప్పటికీ తను గుర్రు గా చూస్తుంది ఆ పుస్తకాల వంక.

నాకు బాగా తెలుసు నాదంతా వానాకాలం చదువే అని. ఇక్కడికొచ్చేక ఆ మాత్రం చదువు కూడా లేదు. ఎలాగైనా రెండో ఇన్నింగ్స్ మొదలేట్టాలి. అన్నిటికంటే ముందు ఇప్పటివరకూ చదివిన సిలబస్ ని ఇంకోసారి తిరగెయ్యాలి..

Wednesday, November 19, 2008

అమెరికా సిత్రాలు

నేను కార్లో పెట్రోలెప్పుడూ కాస్ట్కో లోనే పోయిస్తా వీలైనంత వరకు. ఇంజనుకి రక రకాల పెట్రోలు తాగించే బదులు ఎపుడూ ఒకేరకమైంది తాగిస్తే మంచిదనే గుడ్డి నమ్మకం, కాస్ట్కో కంపనీ మీదున్న నమ్మకం, పైగా అక్కడ ఒక రెండు సెంట్లు తక్కువుండడం అనేవి వేరే కారణాలు. నా ఆఫీసు కొచ్చేదారిలో దాదాపు అయిదు పెట్రోలు బంకులు కనబడతాయి నాకు. రోజు అవసరమున్నా లేకున్న పనిగట్టుకొని మరీ చూస్తా ఈరొజుటి రేట్లెలా ఉన్నాయా అని. ఒక బంకు లో ఉన్న రేట్లు ఇంకొక బంకు లో ఉండకపోవటం ఒక విషయమైతే, ఒకే బంకులో పొద్దునొక రేటు సాయంత్రమొక రేటు ఉంటుంది. నాలుగేళ్ళ నుంచి అనుకుంటున్నా దీని వెనకున్న కధా కమామిషు కనుక్కోవాలని. ఇంతవరకూ కనుక్కోలేదు. సరే మొన్నొకసారి కాస్ట్కో లో పెట్రోలు నింపుకుంటూ యధాలాపంగా గేలను రేటెంతా అని చూసా. ఒక్కసారి నాకు కలలో నిజమో అర్ధం కాలేదు. రెండు డాలర్ల అయిదు సెంట్లు. కరెక్టుగా ఒక మూణ్ణెల్ల క్రితం నాలుగు డాలర్ల ఏడు సెంట్లు. ఈ మూణ్ణెల్లలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేవీ సంభవించలేదు. అయినా ఎందుకీ మార్పు? ఎక్కడో ఏదో ఉంది. ఎవడో ఎక్కడినించో మీటలు నొక్కు తున్నాడు. ఆ మాట కొస్తే గేలను నాలుగు డాలర్ల పైచిలుకు పలికినప్పుడు కూడా ప్రపంచం లో ఎక్కడా ఏరకమైన ఉత్పాతమూ సంభవించలేదు. అప్పుడు బారెలు క్రూడాయిలు ధర నూట ఇరవై పైనే పలికింది.ప్రస్తుతానికి యాభై పైచిలుకు. ఇప్పుడు ఇది రాసేటైముకి గేలన్ పెట్రోలు జాతీయ సగటు ధర రెండు డాలర్లు. అయ్యారే ఏమి ఈ విచిత్రము?
**************************************************************
కొత్త జబ్బులొచ్చేస్తున్నయ్.

ఈమధ్య CNN లొ ఒక వార్త చూసాను. చూసాక నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. సాక్షాత్తూ న్యూయార్క్ గవర్నరుకి సహాయకుడి గా పనిచేసే చార్ల్స్ ఓ'బర్న్ అనబడే వ్యక్తి 2001 నుండి 2005 వరకు నాలుగేళ్ళ పాటు ఆదాయపన్ను రిటర్న్స్ దఖలు పరచలేదు. బకాయి పడిన మొత్తం చాలా పెద్దది , పైగా యవ్వారం ఆదాయపు పన్ను శాఖ తోటి కాబట్టి చార్ల్స్ ఒక లాయర్ని వెతుక్కున్నాడు. ఈ లాయర్లకి అమెరికాలో బాగా గిరాకి. సరే సదరు లాయరుకి ఎంత బుర్ర గోక్కున్నా ఏ లాజిక్కూ తట్టలెదు. ఏదో ఒక సంవత్సరం అంటే ఎలాగో మానేజ్ చెయ్యొచ్చు గాని వరసగా ఐదేళ్ళ పాటంటే అల్లాటప్పా కారణాలు చూపిస్తే సరిపోదని అర్ధమయింది. చెఫ్ఫటానికైతే తన క్లయింటు డిప్రెషన్ తో బాధ పడుతున్నాడనిన్నూ, ఆ కారణం చేత రిటర్న్స్ ఫైల్ చెయ్యలేదని కోర్టు వారికి విన్నవించుకున్నా, అది నిలబడదేమో అన్న చిన్నపాటి సందేహం తో ఈసారి ఓ కొత్త కారణం తో ముందుకొచ్చాడు. అదే "Late Filing Syndrome(LFS)". తన క్లయింటు ఈ LFS అనే వ్యాధి తో బాధ పడుతున్నాడనీ,ఆ ఒక్కగానొక్క కారణం చెత రిటర్న్స్ ఫైల్ చెయ్యలేదని విన్నవించుకున్నాడు. ఈ జబ్బుకున్న లక్షణం ఏమిటంటే ఇది ఎవరినైతే పట్టుకుంటుందో వారు టాక్సు రిటర్నులు తరువాతెప్పుడైనా చేద్దాములే అని ఏళ్ళూ పూళ్ళూ వాయిదా వేస్తారట. జడ్జి గారు తూలి కింద పడబోయి, తమాయించుకొని, కాసేపు బుర్ర గోక్కుని, ఈలోకం లో ఉన్న సవాలక్ష మానసిక జబ్బుల్లో ఈజబ్బు సంగతి ఎక్కడా ప్రస్తావించ బడలేదని నిర్ధారణ చేసుకొని సదరు చార్ల్స్ గారిని దోషిగా నిర్ధారించేసారు. విషయం బట్టబయలు కావటం, ఈ ఉదంతం తరువాత గవర్నరు గారి ఆఫీసులో చార్ల్స్ పెద్ద జోకరు లాగా అయిపోయి, ఈయన కనపడగానే జనాలు చాటు మాటుగా కిసుక్కున నవ్వుకోవటం, ఇత్యాది వన్నీ చూసి గవర్నరుగారికి చిర్రెత్తుకొచ్చి ఈయన్ని ఇంటికి సాగనంపారు. కొసమెరుపేమిటంటే, కేసు మొదట్లో రిటర్న్స్ ఫైల్ చెయ్యకపోవటానికి డిప్రెషన్ కారణం అని చెప్పి ఈయన అమెరికా లో డిప్రెషన్ తో బాధపడుతున్న కొన్ని మిలియన్ల మందిని అవమాన పరిచాడని కొన్ని వర్గాలు రుసరుస లాడాయి.
******************************************************************

Friday, October 31, 2008

మరచి పోయిన మొదటి జ్ఞాపకం.

ఈ బ్లాగు రాయడం మీద ఇష్టం నాకు రోజురోజుకీ పెరిగి పోతోంది. వచ్చిన ప్రతి ఆలోచననూ ఒడిసిపట్టుకొని దాన్ని బ్లాగులో పెట్టొచ్చా లేదా అని అలోచిస్తూంటే, చివరికి దాన్ని రాసినా రాయకపోయినా, ఆ ఆలోచన మాత్రం నన్ను నేను మరలా మరొక్కసారి తరచి చూసుకొనే అవకాశాన్ని కలిగిస్తోంది. ఏదో పరాకు లో ఉన్నప్పుడో, డ్రైవ్ చేస్తున్నప్పుడో ఎన్నో ఆలోచనలు. ఒకప్పుడు అవి చాలా వరకు అలా వచ్చి ఇలా వెళ్ళేవే. బ్లాగు పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఆలోచనని మధిస్తుంటే నాకు బ్లాగు రాయడానికి మించిన ఆనందం కలుగుతోంది. ఎన్నో జ్ఞాపకాలు, తారసపడే ఎందరో వ్యక్తులు, ఎక్కడో మొదలయ్యే జీవితం. చాలా దూరం వచ్చామని తెలుస్తుంది గాని ఎంతదూరం వచ్చామో తెలీదు, ఇంకెంత దూరం ఉందో అంతకంటే తెలీదు.

నా చిన్నప్పుడు మా అమ్మకంటే ముందు మా బాగోగులు చూసిన వ్యక్తి ఒకరున్నారు. ఆమే మా అవ్వ. మా నానమ్మ వాళ్ళమ్మ. నేను పుట్టే టప్పటికే తనకి దాదాపు ఎనభై యేళ్ళుంటాయేమో. అప్పటికే ఆమెకి ఏదో వ్యాధి వచ్చి నడుం వంగిపోయింది. నడుము నుంచి మొహం వరకు నేలకు సమాతరం గా ఉంచి నడిచేది. మేము తనముందే ఆమెలా నడిచి ఆమెను ఆట పట్టించేవాళ్ళం. మేము ఆట పట్టిస్తున్నా కూడా చిర్నవ్వు తో అలా మమ్మల్ని చూస్తూ మురిసిపోయేది. కోపం అనేది తన మొహంలో చూసి ఎరగను నేను. చిన్నతనం, తెలిసీ తెలియని వయసు. అయినా నాకెందుకో ఇప్పుడు ఆమెనలా ఆటపట్టించటం గుర్తుకువస్తే ఏదో క్షమార్హం కాని నేరం చేసాననిపిస్తోంది. ఆమెకి మేమే లోకం. మా బాగోగులే ఆమెకి దినచర్య. మా నలుగురు పిల్లలకి స్నానాలు చేయించటం, బట్టలు తొడగడం, అన్నం తినిపించటం, మాతో ఆడుకోవడం ఇవే ఆమె ప్రధాన వ్యాపకాలు.

భోజనాల దగ్గర అవ్వను నేను తెగ విసిగించేవాడిని. చెప్పాను కదా ఆమె అలా వంగి నడుస్తూ ఉంటే నేనువింతగా చూసే వాడినని. మా భోజనాల గది వంటిల్లు వేరు వేరు గా ఉండేవి.నేను మొదట అవ్వా పప్పు కావాలి అనేవాడిని, అది తేగానే ఈసారి నెయ్యి, ఆ తరువాత ఇంకేదో. ఇలా అన్నీ ఒక్కసారే అడగకుండా ఆమెని ముప్పు తిప్పలు పెట్టేవాడిని. ప్రతిసారి ఆమె నేనడిగింది తేవటానికి వెనక్కి మళ్ళగానే నేను ఎక్కిరింతగా నవ్వుతూ మిగతా పిల్లలకి చూపించి నవ్వేవాడిని ఎలా నడుస్తోందో చూడండి అని. నేనడిగిన ప్రతిసారి విసుక్కోకుండా పాపం రెండు గడపలు దాటి మరీ వెళ్ళి తీసుకొచ్చేది.గడప దాటడం చాలా కష్టం ఆమెకి, పైగా అవి ఎత్తు గడపలు.రెండు చేతులతో ద్వారం తాలూకు నిలువు బద్ద ని పట్టుకొని ఆ ఊతంతో దాటాల్సొచ్చేది.

నాకు నాలుగైదేళ్ళున్నప్పుడే తను చనిపోయింది. మా ఇంటి పంచలో ఉంచారు ఆమె నిర్జీవ శరీరాన్ని. నాకేమాత్రం ఏడుపు రాలేదు. అలా వింతగా చూస్తూ ఉన్నానంతే. నాకు మూడు పూటలా అన్నం పెట్టి, నా ఆలనా పాలనా చూసిన ఆ చెయ్యి అలా నిర్జీవం గా పడి ఉంటే నాకేమాత్రం కనీసం దిగులు కూడా అనిపించలేదు. ఏదో జరిగిందని తెలుసు, ఏమిటో తెలీదు.
అందరిపిల్లల్లొకి ఆమెకి నేనంటే ఎక్కువ ఇష్టమట. తను చనిపోయిన తరువాత కూడ నేను నాకు అవ్వే అన్నం పెట్టాలి అని ఏడుస్తుంటే మావాళ్ళు భయపడి ఏవో పూజలు పునస్కారాలు చేసారట.

మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా నాన్న ని అడిగాను అవ్వతాలూకు ఫోటో ఎక్కడైనా దొరుకుతుందా అని. నా ఆశ అడియాశే అయ్యింది. మా బంధువుల ఇళ్ళళ్ళో ఉండే అవకాశం కూడా లేదంట.

మరణానంతరం ఏమవుతుందో ఎవరికీ తెలీదు కదా. తను మరలా ఎక్కడైనా పుట్టిందో తెలీదు, లేదా పైన వుండి నన్ను అలా విస్తుపోతూ చూస్తూ ఉందో తెలీదు. ఈ ఒక్కమాట చెప్పాలని ఉంది. నిన్ను మర్చిపోయినా, పూర్తిగా మాత్రం మర్చిపోలేదు, అప్పుడప్పుడూ గుర్తొస్తూనే ఉంటావూ అని చెప్పాలని ఉంది.

ఈ ఉరుకులు పరుగులు ఎందాకో , ఏమి సాధిద్దామనో తెలీదు గానీ , ఈ పరుగుపందెం లో నేను మరచిపోయిన నా మొట్టమొదటి జ్ఞాపకం మా అవ్వ.

Wednesday, October 22, 2008

సుహృద్భావ, స్నేహపూరిత సంభాషణ

ఇద్దరు ఎంపీ ల మధ్య జరిగిన సంభాషణ(??)

*********************************************

"ఆ! చెప్పావులే పెద్ద.."

"నువ్వు నాకు నీతులు చెప్తే వినాలి, నేను చెప్తే తప్పా?"

"ఎక్కువ మాట్లాడుతున్నావ్"

"ఎవడయ్యా? నువ్వా?నేనా?"

"ఇంక మాట్లాడింది చాలు నోర్మూసుకో"

"నువ్వే మూసుకో"

"నిన్న కాక మొన్నొచ్చావ్ నువ్వు నాకు చెప్పేటంతోడివయ్యావా?"

"ఏయ్ వాడు గీడు ఏంటి?మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం తెలీదా?"

"పోరా!, నీ మొహానికో మర్యాద కూడానా?"

"దమ్ముంటే బయటికి రా చూసుకుందాం"

"ఆ!పద, నువ్వు మగాడివో నేను మగాడినో తేల్చుకుందాం.."

**************************************************

ఇదండీ సంగతి. వాళ్ళిద్దరూ అంత చక్కగా మాట్లాడుకుంటే ఈ మీడియా ఏమిటండీ ఇలా ప్రతిదాన్నీ వివాదాస్పదం చేస్తోంది?

Sunday, October 19, 2008

మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా?నిన్న రాత్రి ఒంటిగంటప్పుడు ఆఫీసు సెల్ ఫోను కార్లోనే మర్చిపోయిన విషయం గుర్తొచ్చి, కిందకొచ్చి దాన్ని తీసుకొని, లోపలికి రాబోతూ ఒక్కసారి తల పైకెత్తి చూసాను. ఆ నిశీధి వేళ నల్లటి ఆకాశం, ఒక పక్క పున్నమి చంద్రుడు, చాలా మనోహరం గా ఉందా దృశ్యం. కాసేపలా చూస్తూ ఉండిపోయా..
*****************************************************************

నా చిన్నప్పుడు వేసవొచ్చిందంటే రాత్రుళ్ళు మిద్దేమీదే పడక. గుంటూరు జిల్లా ఎండల గురించి మీకు తెలుసుగా?వేసవి ఉక్కపోత ఎంత ఇబ్బందికరం గా ఉంటుందంటే పిల్లలందరం రాత్రి ఏడు కాగానే అన్నం తినేసి ఎప్పుడు మేడ మీదకెళ్ళి మాటలు చెప్పుకుంటూ పడుకుందామా అని ఆత్ర పడేవాళ్ళం. పడుకొని అలా ఆకాశాన్ని, ఆ నక్షత్రాలను, ఆ మసక చీకటిలో అప్పుడప్పుడు మా మీదగా ఎగిరిపోయే కొంగలగుంపునూ చూస్తూ, మాటలు చెప్పుకుంటూ , ఎప్పటికో నిద్ర పోయేవాళ్ళం. మేమే కాదు, మా పక్కింట్లో అద్దె కుండేవాళ్ళు, ఆ పక్క పెంకుటింట్లో ఉండేవాళ్ళు అందరమూ కలిపి ఒక పెద్ద గుంపు తయరయ్యేది మా మేడ మీద. పిల్లలొక గుంపు, పెద్దలొక గుంపు. ఏ గ్రూపు మాటలు వాళ్ళవే. ఇక పడుకోండ్రా అని పెద్దలు కసరందే మా మాటల కంతుండేది కాదు. వాళ్ళు కసరగానే మేమందరం పిండ్రాప్ సైలెన్స్. మరలా నెమ్మదిగా మా పిల్లల్లో ఎవరో మాటలు మొదలెట్టే వారు, మళ్ళా మాటలు. నాకప్పుడు ఐదారేళ్ళుంటాయేమో. నిద్ర మధ్యలో ఎప్పుడైనా లేచి కళ్ళు తెరిచి చూస్తే, పడుకోపోయే ముందు నా కాళ్ళ వైపు ఉన్న చందమామ నా నడి నెత్తి మీదో, ఇంకాస్త ఆ పైకో ఉండేవాడు. భలే విచిత్రం గా అనిపించేది. మా అన్నయ్యని అడిగినట్టు గుర్తు ఎందుకలా అని. తనేం చెప్పాడో నాకు గుర్తు లేదు. వాడూ చిన్నోడేగా, ఏదో తింగరి సమాధానం చెప్పేఉంటాడు. ఎప్పుడైనా ఆరింటికో ఆరున్నరకో మెలకువస్తే ఆ కాశంలో ఒకపక్క చంద్రుడు, ఇంకోపక్క సూర్యుడు. నాకదొక వింత. కనీసం పదిమందికి చూపించందే మనసూరుకునేది కాదు.

నాకు చిన్నప్పటి నుంచి సైన్సు విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. 1984 లో అనుకుంటా రాకేష్ శర్మ అంతరిక్షం లో అడుగుపెట్టాడు, భారతదేశం తరపున మొదటి వ్యోమగామిగా. TV లో చూసా అప్పటి ప్రధాని ఇందిరాగాంధి రాకేష్ శర్మ తో మాట్లాడడం. దాన్ని చూసినప్పటి నుండి రాత్రిపూట ఆకాశాన్ని చూసినప్పుడల్లా నక్షత్రాలు , చందమామ లను మించి ఆవల ఏముంది అని అలోచించేవాడిని. అన్నయ్య నడిగితే అంతరిక్షం కి అంతే లేదన్నాడు, పోతూ ఉంటే అలా అలా వస్తూ ఉంటుందట. మన లాంటి పాలపుంతలు ఎన్నో లక్షలు కోట్లు ఉన్నాయట.ఆకాశాన్ని చూస్తూ ఈ విశ్వం అనంతం అనే సత్యాన్ని తలచుకుంటూ అసలు అదెలా సాధ్యం అంటు తెగ ఆశ్చర్య పడేవాడిని. (నా బ్లాగు పేరు వెనకున్న కధ ఇదే). ఆ Infinity అనే కాన్సెప్ట్ నాకిప్పటికీ ఆశ్చర్యమే.

ఇక ఆ తరువాత చదువుల్లో పడి ఆకాశాన్ని అంతగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు మేడ మీదికొచ్చి ఆరోజు పౌర్ణమి గనక అయితే హాయ్! వెన్నెల ఎంతబాగుందో అనుకునేవాడిని. కరంటు రాగానే కిందకి పరుగు. TV చూడ్డానికో, లేక పోతే చదూకోడానికో.

ఇంజనీరింగ్ లో కొచ్చాక మాది హైదరాబాద్ నగర శివార్ల లో ఉన్న కాలేజి కాబట్టి రోజూ మెస్ లో రాత్రి భోజనం కానిచ్చి వాకింగ్ కి బయలుదేరేవాళ్ళం. అలా వాకింగ్ చేసేటప్పుడూ, నిండు వేసవిలో హాస్టలు రూము లో ఉక్కపోత భరించలేక మంచాలు బయట వేసుకున్నప్పుడూ , అలా ఆకాశం వైపొక లుక్కేసేవాడిని. హైదరాబాదు కొచ్చిన కొత్తల్లో, బిర్లా పానెటోరియం లో, అసలుకి నకలైనా, ఆకాశాన్ని చూసినప్పుడు చిన్నప్పటి సంగతులు కొన్ని గుర్తొచ్చాయి.

ఆ తరువాత ఉద్యోగాన్వేషణలో ముందు చూపే గాని బొత్తిగా పైచూపు లేకుండా పొయింది. దానికి తోడు అపార్ట్మెంట్ బతుకయిపోవటం మూలాన అదొకటుందన్న ఊహ కూడా కరువైపోయింది. ఒక ఐదేళ్ళ క్రితం అనుకుంటా మేము ముగ్గురం ఫ్రెండ్స్ మి అప్పటికప్పుడు అనుకొని హైదరాబాదు నుంచి శ్రీశైలం బయలు దేరాము మల్లన్న దర్శనం చేసుకుందామని. దర్శనం అయినతరువాత ఎవరో చెప్పారు ఒకటైము తరువాత అటవీశాఖ వారు వాహనాల్ని అడవిలోకి అనుమతించరని. అప్పటికప్పుడు రేడీ అయ్యి బయలుదేరాము తిరిగి హైదరాబాదు కి . చెక్ పోస్టు దాటి అడవి లోపలికొచ్చాక ఎందుకో కాసేపు కారాపి ఆ చల్ల గాలిని ఎంజాయ్ చెయ్యలనిపించి కారు దిగాము. చిమ్మ చీకటి. ఎంత దట్టమైన చీకటంటే పక్కనెవరైనా అడుగుదూరం లో నిలబడ్డా పోల్చుకోలేనంత చీకటి. మాట వినపడితే గాని మనపక్కనొకరున్నారన్న సంగతి తేలీదు. తల పైకెత్తి చూసానొకసారి. నాకళ్ళని నేనే నమ్మలేకపొయాను. నల్లటి ఆకాశంలో పైన ఎన్ని లక్షల నక్షత్రాలో. ఇప్పటికీ ఆదృశ్యం నా బుర్రలో భద్రం. చాలా అందమైన అనుభవం నాకది. హైదరాబాదు లో అన్ని నక్షత్రాలు కనపడవు.

ఆతరువాత , ఒక రెండేళ్ళ క్రితం మా అన్నయ్య అమెరికా నుంచి తెప్పించిన టెలీస్కోపు ని పిల్లలకి చూపిద్దామని పిల్లలనందరిని పోగేసాడు మా అపార్ట్ మెంట్ బాల్కనీలొ . పనిలో పని గా నేనుకూడ మైమరచి పోయాను ఆ చంద్రుని మీది గుంతల్ల్నీ (క్రేటర్స్), శని గ్రహం చుట్టూ ఉన్న వలయాల్నీ చూసి. ఇక పిల్లలందరూ వంతులవారీ గా చూస్తుండగా, ఇంకేమైనా పెద్ద నక్షత్రాలు, టెలీస్కోపు లో చూడదగ్గవి కనపడతాయేమో చూద్దామని ఆ వైపుకి వెళ్ళి అలా అలా వంగి చూడబోయాను. మావదిన అప్పుడే బట్టలుతికినట్టుంది , నేల తడి గాఉండి కాళ్ళ కింద పట్టు తప్పింది. ఎలా తమాయించుకున్ననో నాకు తెలీదు గాని, నిజం చెప్తున్నా, ఆ గుండె దడ ఇప్పటికీ తగ్గలేదు.

ఇక్కడ అమెరికా వచ్చిన కొత్తల్లో ఒహాయో లో ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్ కి బాల్కనీ ఉండేది. అప్పుడప్పుడు అలా వచ్చి కూర్చొని ఆకాశం వైపు చూసినా ఆ ఆలోచనలు కొద్దిగా భిన్నం గా ఉండేవి. రేపు వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం వచ్చే సూచన ఉందా?, నా రైన్ కోటు ఇంట్లో ఉందా , లేక కార్లో ఉందా? ఇట్లాంటివన్నమాట. ఏంచేస్తాం, స్థాన మహిమ.

ఆతరువాత నేను మారిన అపార్ట్ మెంటుల్లో ఒక్కదానికి కూడా బాల్కనీ లేదు. పడుకోబోయే ముందు లైట్లార్పినప్పుడు కిటికీలోంచి పున్నమి చంద్రుడు హాయ్ అన్నాకూడా నాకిప్పుడు లేచి కిటికిదగ్గరికెళ్ళీ ఆ బ్లైండ్స్ పైకి లేపి , ఆ గ్లాసు తలుపు పక్కకి జరిపి , తల బైటికి పెట్టి ఆస్వాదించే ఓపిక లేదు.

ఏతావాతా పైన చెప్పిన రెండుమూడు సందర్భాలను మినహాయిస్తే గత ఇరవై యేళ్ళు గా ఆకాశానికి నాకు బొత్తిగా మాటల్లేవ్. బిజీ లైఫ్ కదా.దానికి తోడు ఆ! నా నెత్తినే ఉండేడ్చింది కదా ఎక్కడికి పోతుందిలే అనే కొద్దిపాటి నిర్లక్ష్యం.
సరే మళ్ళీ మీకదే ప్రశ్న. మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

Wednesday, October 15, 2008

అయ్యో నా BBC

"బిబిసి కి గడ్డు రోజులు"


British Broadcasting Corporation కష్టాల్లో ఉందట.ఇప్పుడే ఈనాడులో చూసాను. ఇది నాకు నిజంగా దుర్వార్తే. చిన్నప్పుడు వెర్రి గా వినేవాడిని. అంతర్జాతీయ వార్తలూ, విశేషాలు. వాటి గురించి కాస్తో కూస్తో లోక జ్ఞానం...దీని చలవే.


ఈ వార్త BBC TV వరకే పరిమితమా?లేక TV , రేడియో రెంటికా?


నావరకు నాకు BBC లేని రేడియో ప్రపంచం అంటే జీర్ణించుకోవటం కష్టం గా ఉంది.


ఏదో ఒక దారి దొరికితే బావుణ్ణు.

Saturday, October 11, 2008

ఒక కాంట్రాక్టరు - ఇద్దరు మేనేజర్లు

అడకత్తెర లో పోకచెక్క అంటే తెలియని దెవరికి? దానిగురించి విన్నాను, అవసరమైనప్పుడు నేనూ ఆ పద ప్రయోగం చేసాను. కాని నా పరిస్థితి ఆ పోకచెక్క లా అవ్వొచ్చని ఏమాత్రం ఊహించలేకపోయాను.
****************************************************************
నేను పని చేసే విభాగం లో నాతో కలిపి దాదాపు పదమూడు మంది ఉంటారు. నేనొక్కణ్ణే భారతీయుడిని వాళ్ళలో. అందులో నలుగురు దాదాపు ఇరవై యేళ్ళ నుంచి ఈ కంపెనీ లోనే పాతుకు పోయి ఉన్నారు.చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న చందాన, సీనియారిటీ తన పని తాను చేసుకు పోవటం మూలాన, ప్రతిభ,పనితీరు ఇత్యాదివన్నీ పక్కన పెట్టబడి వీళ్ళు నలుగురూ కాల క్రమేణ మానేజర్లు అయ్యికూర్చున్నారు. ఇంతలో మా డిపార్టుమెంట్ హెడ్ కొక పెద్ద సమస్యొచ్చిపడింది. ఈ నలుగురు కాక ఈ మధ్యనే ఇంకొకతనికి కూడ సీనియారిటీ పెరిగి మానేజరయ్యే వయసొచ్చేసింది. ఇక సమయం దొరికినప్పుడల్లా మా హెడ్డు హెడ్డు తినటం మొదలెట్టాడు. డిపార్ట్మెంటులొ తిప్పి తిప్పి కొడితే ఇరవై మందిమి కూడా లేము, పని చేసే వాళ్ళు తక్కువ మానేజర్లెక్కువై నలుగుర్లో నగుబాటు అయిపోతుందేమో అని మా హెడ్డు భయం. పైగా ఆయన ఆ కంపనీ లో జేరి ఐదేళ్ళే. బయటి నుంచి వచ్చాడు, పైగా ప్రతిభ ఉంది కాబట్టి టక టకా నిచ్చెన ఎక్కేసాడు. ఎంత హెడ్డైనా ఈ ఐదుగురితో పెట్టుకుంటే పుట్టగతులుండవని తెలుసు కాబట్టి, వీళ్ళు చెప్పేది కనీసం విన్నట్టు నటిస్తాడు, చేసినా చేయకపొయినా. ప్రస్తుతానికి ఈ ఐదో అతనే మా హెడ్డు కున్న పెద్ద సమస్య. సరే, ఎవరినన్నా వెతికి ఈయన కింద వేసి మానేజర్ని చేసేద్దామంటే ఆయన చేసే పని ఇంకెవరూ చెయ్యరు డిపార్టుమెంట్లో. ఆయన పనిచేసే సాఫ్ట్ వేర్ కూడా బిల్గేట్స్ బేసిక్ రాసినప్పటి నాటిది. ఆలోచించి ఆలోచించి చివరికి బయట నుంచి కొత్తగా ఒకరిని రిక్రూట్ చేసుకొని మరీ ఈయన కింద వేసి పడేద్దామన్న నిర్ణయానికొచ్చేసాడు మా హెడ్డు. ఒకానొక దుర్దినాన ,ఆయన అలా తల ఏటవాలుగా పెట్టి గాల్లోకి చూస్తూ (బహుశా) ఈ సమస్య గురించే ఆలోచిస్తున్న సమయాన, కాంట్రాక్టరునైన నేను, ఏదో పని ఉండి ఆయన దగ్గరకి వెళ్ళటం, నన్ను చూడగానే ఒక వెయ్యి క్యాండిల్స్ బల్బు ఆయన్న బుర్రలో వెలగటం, నన్ను ఆ కొత్త మానేజరు కింద వెయ్యటం జరిగింది. నేను అదే డిపార్టుమెంటులో రెండేళ్ళ నుంచి పనిచేస్తున్నా ఈ కొత్త మానేజరు పేరు తప్ప ఇంకేమి తెలీదు. ఆ పేరు కూడా ఎందుకు కనుక్కున్నానంటే రోజూ పొద్దున్నే "గుడ్ మార్నింగ్" కి , సాయంత్రం వెళ్ళేటప్పుడూ "హవ్ ఎ గుడ్ వన్" కి పేరు అవసరం కదా, అందుకు. అసలు ఆయన ఏపని చేస్తాడొ ఎవరికీ తెలీదు. వీక్లీ మీటింగుల్లో కూడా ఒక మూలన కూర్చుంటాడు, ఏమీ మాట్లాడడు.

అసలు కధ ఇప్పుడే మొదలయింది.కొద్దికాలం క్రితం కొత్తగా మేనేజరయిన ఆ నలుగురిలో ఒకతను చేసే పనికీ,నాపనికీ కొద్ది పాటి బాంధవ్యముండటం తో ఆయన నాకు De Facto మేనేజరు అయి కూర్చున్నాడు. పాపం చాలా మంచతను. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడు. పనేలోకం. ఆయనకి, నాకు స్వభావ రీత్యా కూడా పోలికలుండటం తో మా ఇద్దరికి సయోధ్య బాగా కుదిరింది. నేను ఈ కంపనీ లోకి వచ్చినప్పటి నుంచి ఆయన తోనే నా పని. ఇప్పుడు నన్ను ఈయన దగ్గర్నుంచి పీకి సదరు కొత్త మేనేజరు కింద వేసినా అది పేరుకి పేపరుపై మాత్రమే. పని పరంగా గాని, ఇంకేరకంగా గాని ఏ విధమైన మార్పూ లేదు నాకు.

ఈ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు నాకు. ఓ శుభోదయాన కొత్త మేనేజరు నుంచి నాకొక ఈ-మెయిల్ వచ్చింది. దాన్ని తర్జుమా చేస్తే ఇలా ఉంటుంది..

"డియర్ ఉమా, నాకు తెలుసు నువ్వో మంచబ్బాయివి అని. దయచేసి ఇక నుంచి నువ్వు చేసే పనులు, చెయ్యబోయే పనులు మరియు చేస్తున్న పనులు అన్నీ మూడు రకాలుగా విడగొట్టి ఒక లిస్ట్ చేసి నాకు పంపు. అలానే ఇకనుంచి నువ్వు పంపే ప్రతి ఈ-మెయిల్ నాకు సిసి చేస్తే నేను చాలా సంతోషిస్తాను."

చాలా మంది లాగానే నాక్కూడా పనుంటే కుమ్మెయ్యడం తెలుసు గాని, సదరు పనిని నాలుగు వాక్యాల్లో పేపరు మీద పెట్టమంటే మనసు మొరాయిస్తుంది. అంత అవసరమా అనే ఒక బలమైన ఆలోచనతో నా చేతి వేళ్ళకి పక్షవాతం వచ్చినట్టవుతుంది. అధికారిక రహస్యాల చట్టం కింద కుదర్దు అని చెప్పొచ్చు ఈయనకి. కానీ దాన్ని సొంత మేనేజరు మీదే ప్రయోగిస్తే ఇంకేమైనా ఉంటుందా?మనసు రాయి చేసుకొని ఆయన అడిగింది పంపాను. ఏ మూలో కొద్దిపాటి నిర్లక్ష్యం, "ఆ.. ఈయనకి నేను చేసే పనులు ఏం తెలుసునని , పేద్ద.. " అని. నా ఊహ నిజమే. ఆయనకి ఏం తెలీదు. అందుకే టక్కున నాకు రిప్లై వచ్చింది, ఇమ్మీడియట్ గా నువ్వు నాకొక మూడు గంటలు టైము కేటాయించి అసలు నువ్వేం పనులు చేస్తావో నాకు సవివరం గా చెప్పు అని. నాకు గుండె ఆగి నంత పనయింది. ఒక్కక్షణం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తే అనిపించింది. సరే, ఎలాగోలా మూడుగంటలు కష్టపడి ఆయనకి 1950 ల నాటి జపనీస్ సినిమా చూపించాను, నా సొంత సబ్ టైటిల్స్ తో..

ఇదిలా ఉండగా, ఒకరోజెందుకో సెలవు పెట్టాలనిపించింది. ఎందుకంటారా? అబ్బే ఊరికే. మరీ కారణం కావాలి అంటే ఇదుగో వినుకోండి, "అందరికీ పనులుండి ఆఫీసులకెళ్ళే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి మా ఇల్లు ఎలా ఉంటుందో చూద్దామని". పొద్దున్నే లేచి మెయిలు పంపా. పంపిన అరగంటకి గాని గుర్తు రాలేదు అలవాటు ప్రకారం మెయిలు మా పాత మానేజరుకి పంపాను అని. మరుసటి రోజు కొద్దిగా భయపడుతూనే వెళ్ళాను ఆఫీసుకి. మా హెడ్డూ, పాత మానేజరు, కొత్త మానేజరు ల జుట్లు రేగిపోయున్నాయ్. నాకు పంపాల్సిన మెయిలు నీకెందుకు పంపాడు అని ఇద్దరు మానేజర్లు జుట్లు పట్టుకొని, పనిలోపని గా వెళ్ళి మా హెడ్డు జుట్టు పట్టుకున్నారట. నేనెళ్ళి పోతే ఇంతలా పని చెసేవాడూ దొరకడం దుర్లభం అనే ఒక్కగానొక్క కారణం చేత మా హెడ్డు నాకు సవినయం గా మనవి చేసుకున్నాడు ఇకనుంచి జాగ్రత్త గా ఉండమని.

అందరు మానేజర్లు పనున్నా లేక పొయినా రెగ్యులర్ గా టీం మీటింగులెట్టుకుంటారని ఈయనకెలా తెలిసిందో గాని, ఒకరోజు పొద్దున్నే మీటింగ్ రిక్వెస్టు కనపడింది నాకు. దాన్ని మన్నిస్తూ ఎప్పుడా అని చూసా. ప్రతి మంగళ వారం పొద్దున్న పది నుండి పదకొండున్నర వరకు. ఏదో ఒక్కసారికి అంటే జపనీస్ సినిమా చూపించా గాని ప్రతివారం గంటన్నర పాటు అంటే?

ఆరోజు మంగళవారం. భయ భయం గా అడుగుపెట్టా పదింటికి కాన్ ఫరెన్స్ హాల్లోకి. అంతపెద్ద హాల్లో మేమిద్దరమే.ఇక మొదలయింది ఆయన మాటల ప్రవాహం. ఆయన మాట్లాడిన వాటిలో మచ్చుకి కొన్ని.
పొయిన వీకెండు ఏమిచెసావు?
నీ ఇంట్లో కుక్క పిల్లి లాంటి పెంపుడు జంతువులున్నాయా??
మీ ఇండియా వాళ్ళ ఆహారపుటలవాట్లేంటి?

నీకు అమెరికా నచ్చిందా?నచ్చితే ఎందుకు?నచ్చనివి ఎమిటి?

నువ్వు మీ ఇంటి బయట పెరిగిన గడ్డి ప్రతివారం పీకుతావా లెక అప్పుడప్పుడూనా?అప్పుడప్పుడయితే ఎప్పుడెప్పుడు?

ఇలా ఉంటాయి. పైవన్నీ ఏక వాక్యాలేగా అనుకుంటున్నారేమో, ఒక్కొక్క దానిమీద దాదాపు అరగంటకు తగ్గకుండా చర్చలూ, కొద్దోగొప్పో వాదోపవాదాలూ అన్ని ఉంటాయ్.ఈమధ్యే నాకు ఆయన గురించి ఒక భయంకరమైన నిజం తెలిసింది. నేను ఆయన క్యూబ్ కి వెళ్ళినప్పుడల్లా డెస్కు మీద ఒకాయన ఫోటో కనపడేది. నాకు అర్ధం కాక పొయినా నేనేమి అంత గా పట్టించుకోలేదు. ఇంతకీ నాకు తెలిసిన ఆ నిజం ఏమిటంటే సదరు ఫొటో లో ఉన్నాయనా నా కొత్త మానేజరు భార్యా భర్తలట(?). మీకో విషయం చెప్పనేలేదు. ఆ మీటింగుల్లో అంత సరదాగా మాట్లాడే వాడల్లా, ఏదైనా పని విషయం లోకి వస్తే నే చెప్పేది వింటూ నావైపే చూస్తూ ఉంటాడు కన్నార్పకుండా. నాకది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆయనకి నే చెప్పేది అర్ధం అవుతుందా లేదా అనేది నాకర్ధమయ్యేది కాదు. పై విషయం తెలిసాక ఎందుకో కొద్దిగా భయం కూడా కలిగేది మొదట్లో.తరువాత్తరువాత ఆయన చూపు తీరే అంత అని సరిపెట్టుకున్నాను( అది ఆయనిష్టం కాబట్టీ మరియు నేను వ్యక్తిగత స్వేచ్చకి చాలా విలువనిస్తాను కాబట్టీ దీని గురించి ఎక్కువగా రాయదల్చుకోలేదు.)
ప్రస్తుతానికి ఆ పాత,కొత్త మానేజర్ల మధ్య వైరం పతాక స్థాయికి చేరింది.ఏదైనా పని చేయాలంటే పనికి మించి వీరిద్దరిని దృష్టిలో పెట్టుకొని చాలా కసరత్తు చేయాల్సొస్తోంది నాకు. నేను పంపించిన మెయిలు, నా సెలవు, అదీ ఇదీ అనికాదు, ప్రతిదీ పచ్చగడ్డే. పాతాయన్ని దూరం చేసుకుంటే పని కష్టం, కొత్తాయన్ని దూరం చేసుకంటే ఉద్యోగధర్మానికి విరుద్దం.
ఈమధ్యేంటో మా హెడ్డు నాకు ఎప్పటికంటే చాలా చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు.

Tuesday, October 7, 2008

ఇంగిలీసు పేర్లు- తెలుగు అర్భకుడు

నన్ను జీవితకాలం వెంటాడే బాధల్లో ఇదొకటి. చిన్నప్పటి నుంచీ "ఆంధ్రుల ఆరాధ్య తెలుగు వార్తా పత్రిక" ని అమూలాగ్రం చదివే అలవాటు వల్ల సంక్రమించిన చిన్నపాటి బలహీనత. ఏమాట కామాటే చెప్పుకోవాలి ఆ చదివే అలవాటే లేకుంటే ఇప్పటికీ బహుశా నేను అటు తెలుక్కీ ఇటు ఇంగ్లిష్ కీ, రెంటికీ సమాన న్యాయం చేసే సంకర భాషలో మాట్లాడుతూ, అక్షరాలు పట్టి పట్టి చదువుతూ ఉండేవాణ్ణేమో. ఆరకం గా నేను బోల్డు అదృష్టవంతుణ్ణి.

ఇక అసలు విషయానికొస్తే, ఒక నాలుగేళ్ళ క్రితం అనుకొంటా, ఇండియాలో నేను పనిచేసే కంపెనీ తాలూకు H.R విభాగం లోకి అడుగు పెట్టాను, నా అమెరికా ప్రయాణం తాలూకు పేపర్లు అందుకోడానికి. నేను సంప్రదించాల్సిన కిరస్తానీ లలనామణి ఎవరితోనో మాట్లాడుతుండడంతో, అక్కడే నిలబడి ఆమెనే చూస్తూ ఉంటే తేడాలొచ్చేస్తాయని ఆ పక్కనే ఉన్న నోటీసు బోర్డు లో మా కంపనీ వాళ్ళు డబ్బులిచ్చి వేయించుకున్న వార్త తాలూకు పేపర్ కటింగు చదవటం ప్రారంభించాను. కళ్ళటూ, చెవులిటూ అన్నమాట. కాసేపాగాక తలతిప్పి చూస్తే, నేను కలవాల్సిన ఆమె గుమ్మం దాటుతూ కనిపించడం తో మళ్ళా ఈమెని ఎక్కడ వెదికి పట్టుకుంటాం రా బాబూ అనుకుంటూ గట్టి గా పిలిచాను "మిచెల్లీ, మిచెల్లీ" అంటూ. ఆ వెంటనే ఆ గదిలో ఉన్న నాలుగైదు తలకాయలు నావైపే తిరగడం, అందులో కొందరు ఒకరకమైన జాలితో నావైపు చూడడం గమనించా. ఆ తరువాత ఒకరెండు రొజులకు నేను నా కొలీగ్ తో మాట్లాడుతూ మళ్ళీ పొరపాటున "మిచెల్లీ" అనడం, వాడు పొట్ట పట్టుకొని నవ్వడం. నవ్వీ నవ్వీ ఆ తరువాత చెప్పాడు, స్పెల్లింగ్ "మిచెల్లీ" (Michelle) అని ఉన్నా "మిషెల్" అనాలట. నిజానికి ఆ విషయం నాకు గుర్తుంది, కాని అన్నివేళలా గుర్తుండాలంటే కష్టం కదా. ఫుట్టినప్పటి నుండీ బొత్తిగా తెలుగు బుర్రాయె మనది.

ఇక్కడికొచ్చాక ఈ పేర్ల ఇబ్బంది మరీ ఎక్కువైపోయింది . నా ఆంగ్ల భాషా పరిజ్ఞానం మరీ అంత తీసిపారేయాల్సిన తీరులో ఉండదు గాని, ఈ పేర్లే ఇప్పటికీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత గుర్తు పెట్టుకుందామను కున్నా అన్నివేళలా కుదరదుగా.అలవోకగా "అసలుపేరు" బయటికొచ్చేస్తుంది అప్పుడప్పుడూ. "సేరా" "సారా" అయిపొతుంది, "షాన్ కానరీ" "సీన్ కానరీ" అయిపోతాడు, ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. మధ్య మధ్య లో ఈ నిశ్శబ్దాక్షరాలొకటి. ఈ పదాల పుట్టుక (ఎటిమాలజీ) నా కంతగా తెలీదు గాని, ఒక అక్షరాన్ని రాసి మరీ దాని గొంతు ఎందుకు నులిమేస్తారో అర్ధం కాదు నాకు. ఈ భాషకు కూడా కొన్ని వందల యేళ్ళ చరిత్ర ఉంది కాబట్టి, దానికివ్వాల్సిన గౌరవం దానికివ్వాలి కాబట్టి నాలో నేనే సరిపెట్టుకుంటాను. మొన్నటికి మొన్న మా మేనేజర్ తో నాకున్న టెన్నిస్ జ్ఞనాన్నంతా రంగరించి "జాన్ బోర్గ్" గురించి మాట్లాడుతుంటే, అంతా విన్న ఆయన, అప్పుడే జ్ఞానోదయమైన వాడిలా టక్కున నువ్వు మాట్లాడెది "బ్యొన్ బోర్గ్"(Bjorn Borg) గురించికదూ అన్నాడు. "ఆల్ టైం గ్రేట్" ఆటగాడు కాస్తా "అన్నోన్" అయిపొయాడు కాసేపు. నాకేం తెలుసు, మా ఊరి పేపర్లో అలాగే రాస్తారు మరి.

మీటింగుల్లో, వీడియో కాన్ ఫరెన్సుల్లో నా మాటల ప్రవాహానికి ముందరికాళ్ళ బంధం ఈ ఇంగిలీసు పేర్లు.పేర్ల దగ్గర ఏమిటొ పదాలు కరువైనట్టు ఆగిపోతాను, ఎక్కడ తప్పు పలికితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని. తిట్టినా క్షమిస్తారు గాని, పేరు తప్పు పలికితే అదోలా ఫీలవుతారు వీళ్ళు.

ఒక్క మనుషుల పేర్లకే పరిమితం కాదిది. మన పత్రికల్లో సోమర్ విల్ ఇప్పటికీ "సోమర్ విల్లే", "కసీనో" కాస్తా "కేసినో" నే, "ఒహాయో" ఇంకా "ఓహియో" నే, "కెరోలినా" ఇంకా "కరోలినా" నే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టొక చాంతాడు. ఇలాంటి చాలా పదాలను నేను జయించాననుకోండి, అది వేరే విషయం.

అయినా వీళ్ళు మాత్రం మనపేర్లను ఎంత బాగా ఖూనీ చేస్తారంటారూ? చెప్పుకుంటే అదో పెద్ద టపా.

ఏదేమైనా గాని, నాకు ఈ పేర్ల ప్రహాసనం తట్టుకోలేనంత పెద్ద సమస్య అనిపించదు లెండి. ఆ పేపరు పఠనం నాకు ఓనమాలు నేర్పి, నాలో సాహిత్యాభిలాషని రగిలించి, ఎన్నెన్ని మంచి పుస్తకాలని చదివించిందో.. దానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. ఈ బోడి ఇంగిలీసు పేర్లు.........పెద్ద సమస్యే కాదు...

Friday, October 3, 2008

చదవటం, కనుమరుగవుతోంది.

మొన్నీ మధ్య ఫ్రెండ్ రమ్మంటే వాడితో పాటు ఒక బుక్ షాపు కెళ్ళాను. "బార్న్స్ & నొబుల్" అని అమెరికా లో ఒకానొక పెద్ద బుక్ షాపు చెయిన్. అమెరికా మొత్తం మీద వీళ్ళకి దాదాపు 800 షాపులున్నాయి. అసలు వెళ్ళిన పనేమిటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు, ఏడేళ్ళ బుడ్డది, ఆ షాపు వాళ్ళు ఉచితంగా ఇచ్చే కధల పుస్తకం తీసుకోవాలి వెళ్దాం పద అని మారాం చేసిందట పొద్దున్నే. ఉచితంగా ఎందుకిస్తారూ అంటే , వేసవి సెలవుల్లో పిల్లల్లో పఠనాసక్తి ని పెంపొందించే ఉద్దేశ్యం తో స్కూలువారొక కార్డ్ ఇచ్చారట విద్యార్ధులందరికి. ఆ వేసవిలో వాళ్ళు ఆరు లేక అంత కంటే ఎక్కువ పుస్తకాలు చదివి, ఆ చదివిన పుస్తకాల వివరాలు, అంటే పుస్తకం పేరు,రచయిత వివరాలు,ఆ పుస్తకం ఎందుకు నచ్చిందో ఒక వాక్యం, ఆ కార్డ్ లో నమోదు చేసి,దాన్ని ఈ బుక్ షాపు లో యిచ్చి ఒక పుస్తకాన్ని ఉచితంగా పొందొచ్చు.ఆ పిల్ల ఉత్సాహాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది.

సరె, వచ్చాను కదాని ఒక రౌండ్ వేద్దామని షాపంతా కలియ తిరిగాను. షాపంతా ఒకటే సందడి గా ఉంది. ఎంత మంది పుస్తక ప్రియులో? ఆరేళ్ళ పిల్లలనుంచి తొంభైల్లో ఉన్న వృద్ధులదాకా అన్ని వయసులవారూ ఉన్నారు. కొంతమంది షాపు వారు ఏర్పాటు చేసిన సోఫాల్లో, కుర్చీల్లో కూర్చొని అక్కడే చదివేద్దామని పుస్తకాల్తో కుస్తీ పడుతున్నారు.

తిరిగి ఇంటికి వస్తుంటె మనసులో ఒకటే ఆలొచనలు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో కనీసం పది అద్దె పుస్తకాల షాపులుండేవి. వాటి బయట "ఇచ్చట నవలలు అద్దెకివ్వబడును" అని బోర్డుంటుంది . చెక్క అల్మరాల్లొ వందలకొద్దీ నవలలు. షాపు బయట నల్ల బోర్డు మీద కొత్తగా రాబోయే నవలల వివరాలు కూడా ఉండేవి. యండమూరిదో, మల్లాదిదో నవల రిలీజయితే దొరకటం మహా కష్టం. స్వాతి , ఆంధ్రజ్యొతి లాంటి వీక్లీ లు కూడా అద్దెకిదొరికేవి. భూమ్మీద డైనోసార్లు అకస్మాత్తుగా అంతరించిపోయినట్లు, ఈ షాపులు కూడా అంతరించిపోయాయి. ఈ శాటిలైట్ టివి, ముదిరిన సినిమా పిచ్చి జనాల్లో పఠనాసక్తి ని దెబ్బతీసాయంటారు. అవి మరి ఇక్కడ అమెరికా లో కూడా ఉన్నాయే? టివి ఇక్కడ కూడా ఒక నేషనల్ అబ్సెషన్. వారాంతం వస్తే ఇంటిపట్టున ఉండే వాళ్ళు బహు తక్కువ. అయినా కూడ పుస్తకాలకెందుకంత ఆదరణ? నేను వెళ్ళిన షాపువారు అమెరికా మొత్తం మీద సాలుకు అమ్మే పుస్తకాల సంఖ్య 300 మిలియన్లు మాత్రమే. ఇలాంటి బుక్ షాపు చెయిన్లు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కలిపితే ఇంకెన్ని మిలియన్లుంటాయో? దాదాపు ప్రతి షాపింగ్ మాల్ కి ఒక పుస్తకాల షాపు విధిగా ఉంటుంది. ఒక విషయంలో మాత్రం నా ఊహ నిజమేననిపిస్తుంది. ఇండియాలో ఈ ఇంగ్లిషు మీడియం చదువులొచ్చి తెలుగు పత్రికలనీ, పఠనాసక్తిని దారుణం గా దెబ్బతీసాయి. విపరీతం గా పెరిగిన పోటీతత్వం కూడా మరొక కారణం. స్కూలు, ట్యూషన్లకే టైము సరిపోనప్పుడు వేరే వాటిమీదకి వారి ధ్యాస ఎలా మళ్ళుతుంది? నాకు తెలుగు పేపర్ చదవటం రాదు అని చెప్పేవాళ్ళు నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు కోకొల్లలు. సరే, చదివేది తెలుగా, ఇంగ్లీషా అనేది పక్కన పెడితే అసలు "చదవటం" అనేదే పాతకాలపు అలవాటుగా మారిపోయింది. ఇక్కడ అమెరికన్ల విషయంలో మాత్రం చదవడం వీళ్ళ సంస్కృతిలో ఒక భాగమనిపిస్తుంది. ఇప్పటికీ మంచి పాఠకాదరణ పొందిన నవలలు హాలీవుడ్ లో సినిమాల రూపంలోకి మారతాయ్. న్యూయార్క్ టైంస్ పత్రిక ఎంపిక చేసే "న్యూయార్క్ టైంస్ బెస్ట్ సెల్లర్" నవలలకి మంచి గిరాకి. ఎయిర్ పోర్టు లాంజుల్లో , విమానాల్లొ, కారు సర్వీసింగ్ సెంటర్లలో, ఇలా చాలా చోట్ల, నాకు చాలా మంది కనపడతారు సమయం వృధా కానీకుండా నవళ్ళు చదువుతూ.
Reading is the most effective way of conscious learning, nothing can replace that.

ఇండియాలో టివి, ఇంటర్నెట్లు అకస్మాత్తుగా మాయమై, మళ్ళా పాతరోజులొస్తే బాగుణ్ణు.

Sunday, September 28, 2008

చిన్నప్పటి స్కూలు, గుర్తుందా అసలు?

చిన్నప్పుడు చదువుకున్న స్కూలంటే మనలో చాలా మందికి ఎంతో ఇష్టం అనుకుంటాను. అయితే మీ చిన్నప్పుడు చదువుకున్న స్కూలుని మీరు చివరిసారి చూసి ఎన్ని రోజులైందీ? ఆటలు, పాటలు, స్నేహం, చదువు, తగువులూ, కొట్లాటలు, పరీక్షలు , గెలుపు-ఓటమి ఇత్యాదివన్నీ మనకు పరిచయం అయిది అక్కడేగా? నేను మాఊరు వెళ్ళినప్పుడల్లా ప్రతిసారీ అనుకుంటాను చూడాలని. పోయినసారి మాఊరు వెళ్ళినప్పుడు చూసాను. అప్పటికి ఇరవై యేళ్ళు నేను ఆ స్కూలు నుంచి బయటికి వచ్చి. నాకైతే చాలా బాధ వేసింది దాన్ని చూడగానే. నేను చదివేటప్పుడు మావూర్లో అదే ప్రధాన పాఠశాల. ఇంకొక చిన్న స్కూలు, క్రైస్తవ మిషనరీ ద్వారా నడిచే కాన్వెంట్ ఉన్నా కూడా ఈ స్కూలుతో పోలిస్తే అవో లెక్కలోకి రావు. దాదాపు రెండువేల మంది విద్యార్ధులతో కళ కళ లాడుతూ ఉండెది. గత యిరవై ఏళ్ళలో ఎన్నోమార్పులు. విద్య వ్యాపారమై వీధికో స్కూలు వెలిసాయి. తెలుగు భాష, తెలుగు మీడియం మీద ఉన్న చిన్న చూపు నా స్కూలునో చూపు చూసాయి. ఇంకేముంది విధ్యార్ధుల సంఖ్య ఎంత పడిపొయిందంటే దాదాపు స్కూలు మూతపడిపొయేంత. ఒకప్పుడు గర్వంగా చెప్పుకొనే స్కూలు కాస్త ఇప్పుడు అయ్యో ఆ స్కూలా, ఏదైనా మంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళో జేర్పించొచ్చుగా అనేలా మారిపొయింది పరిస్తితి. విధ్యార్ధులు లేక , స్కూలు ముందు భాగంలో, మెయిన్ రోడ్డు నానుకొని ఉన్న తరగతి గదుల్ని పడెసి షాపులు కట్టి అద్దెకిచ్చేసారు. అంతకు ముందు నా ఏడవతరగతి క్లాసులు అక్కడె జరిగేవి. ఈ స్కూలు పరిస్థితే ఇలా ఉంది అంటే, బహుశా నేను ఒకటి నుండి ఐదవ తరగతి వరకు చదివిన స్కూలు ఈపాటికి శిధిలమై ఉండవచ్చు లేదా ఈపాటికి అక్కడొక బ్రహ్మాండమైన భవనం లేచినా లేచి ఉండవచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ రెండు స్కూళ్ళకు వెళ్ళి కొన్ని ఫొటోలు తీసుకోవాలి అవి శాశ్వతం గా అదృశ్యమయ్యేలోపు.
సరే ఇంతకీ నేను చెప్పదలచుకుందేమంటె, ఈసారి మీరు మీ ఊరెళ్ళినప్పుడు మీ బాల్యానికి చిరునామాల్లాంటి మీరు చదివిన స్కూళ్ళని ఒకసారి చూసుకొని రండి. మరలా ఒక్కసారి ఆ జ్ఞాపకాల్ని తలుచుకొని తడిసి ముద్దవ్వండి.ఏమంటారు?

Wednesday, September 17, 2008

సినీ ప్రియులకి విజ్ఞప్తి

నవతరంగం లొ నేను హాలీవుడ్ సినిమా The Shawshank Redemption మీద రాసిన సినీసమీక్ష ని చదవండి.
లింక్: http://navatarangam.com/2008/09/the-shawshank-redemption-1994/

మంచి సినిమా ని ఆదరించే ప్రేక్షకులు తప్పక చూడవలసిన చిత్రం ఇది. సమీక్ష ఎప్పుడో రాసాను, నా బ్లాగు లొ కూడా దీని గురించి చెప్తే బాగుంటుందని ఇప్పుడే అనిపించడం తొ ఇలా ......

Tuesday, September 16, 2008

నా రేడియో పోయింది, వెతికి పెట్టరూ! ప్లీజ్

మార్పు సహజం.

"అన్నీమారిపోతున్నాయ్ , ఒకప్పుడలా ఉండేది, ఇప్పుడలా లేదు ....." అని గింజు కోవటం అంతకన్నా సహజం.

అలాంటి ఒక గింజులాటే ఇది. వినండి.
********************************************************************************************
మనలో చాలామంది కి ఎంతో ఇష్టమైనది బాల్యం. ఏ బాదరబందీ లేకుండా, ఏటికి ఆవల ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం అస్సలు లేకుండా , ఆటలూ -పాటలూ,కాస్త పెరిగాక బడి, పుస్తకాలు,పండగలు-పబ్బాలు , కొత్త చొక్కాలు , కొద్దిగా ఊహ తెలిసాక సినిమాలు, కధల పుస్తకాలు, వేసవి సెలవులు ... ఎవరికిష్టం ఉండదు? నావరకు నాకు , నేను పోగొట్టుకున్నాను అనే వాటిల్లో బాల్యం ఎంత ముందుంటుందొ ,"మార్పు" అనేది స్ఫురణ కి రాగానే నాకు అంతే ముందు గా గుర్తుకొచ్చేది రేడియో. అది వింటూనే పెరిగి పెద్దయ్యాను నేను. ఇప్పుడేమో గాని ఓ పాతికేళ్ళ క్రితం రేడియో మోగని ఇల్లంటూ ఉండేది కాదేమో. అన్నీ గుర్తే ఇప్పటికీ . జనరంజని, కార్మికుల కార్యక్రమం, క్విజ్ ప్రోగ్రాములూ, ఏక చిత్ర గీతాలూ, రొజూ పొద్దున్నే వచ్చే ఢిల్లీ వార్తలూ, ప్రాంతీయ వార్తలూ.., ఆదివారం మధ్యాహ్నం నాటి నాటకాలు, శనివారం నాటి సుప్రభాతం, చెప్పుకుంటూపోతే ఎన్నో. సినిమాలకి నేపధ్య సంగీతం ఉన్నట్లే నా బాల్యానికి నేపధ్య సంగీతం నేను విన్న రేడియో. పొద్దున్నే తొమ్మిది గంటలప్పుడు బడికి వెళ్తుంటే దార్లో జనరంజని వినపడని ఇల్లుండదంటే అతిశయోక్తి కాదు. అప్పటి నా రేడియో పరిజ్ఞానం ఎలా ఉండేదంటే జనరంజని పాటల మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనలను బట్టి టైము ఎంతైందో చెప్పగలిగే వాడిని. కాల్గేట్ ప్రకటన వినపడగానే గడియారం వంక కూడా చూడకుండా "అమ్మా! టైము తొమ్మిదింబావు" అంటూ బాత్రూం లోకి పరిగెత్తే వాడిని స్నానం చేయడానికి. జనరంజని లో ఫలానా పాటని ఫలానా వాళ్లు కోరారు అంటూ చేంతాడంత లిస్టు చదివేవారు. అది నాకిష్టమైన పాట ఐతే విసుగు పుట్టేది. ఎంతకీ ఆ లిస్టు పూర్తికాదే... ఇప్పడు మర్చిపోయాను గాని, కొన్ని ఊళ్ళ పేర్లు తెగ రిపీట్ అయ్యేవి. నా సినీ పరిజ్ఞానానికి మొదటి మెట్టు కూడా రేడియో నేమో. సంగీత దర్శకుడు, గీత రచయితల పేర్లు చెప్పగానే అది ఏ పాటో పందేలు కాసేవాళ్ళం మేం నలుగురు పిల్లలం. మధ్యాహ్నం ఐతే భోజనానికి ఇంటికి వచ్చేటప్పుడు కార్మికుల కార్యక్రమం, ఆ కార్యక్రమానికి ముందు వచ్చే ఆ సంగీతం వద్దన్నా చెవిలోపడేవి . మర్చే పోయాను , శ్రీరామనవమి సందర్భం గా భద్రాచలం నుంచి శ్రీరాముని కళ్యాణ విశేషాలను వినని శ్రీరామనవమి లేదు నా బాల్యం లో. బహుశా "ప్రత్యక్ష ప్రసారం "అనే పదం నా డిక్షనరీ లో నమోదు అయింది అప్పుడే అనుకుంటాను. స్కూల్లో ఉన్నాకూడా స్కూలు పక్కన ఉన్న ఇళ్ళలోంచి లీలగా వినపడుతూ ఉండేది రేడియో సంగీతం. మా ఇంటికి దగ్గర్లొనే ఒక మునిసిపాలిటీ పార్కు ఉండేది. రొజూ సాయంత్రం ఆరు కాగానే పార్కు లొ ఉన్న మైకు ద్వారా రేడియో వార్తలు ప్రసారం చెసేవారు. ఆసక్తి ఉన్నవారు ఆ మైకు కి దగ్గరగా వచ్చి వినేవారు. ఆరు కాగానే కాస్త కలకలం గా ఉన్న పార్కు లొ విచిత్రమైన నిశ్శబ్దం రాజ్యమేలెది. ఎవరైనా ప్రముఖ రాజకీయ నాయకులు చనిపోతే నిజం చెప్పొద్దూ భలే బోరు కొట్టేది. మొదటి మూడు రోజులూ విషాద సంగీతం రోజంతా. ఆ తరువాత భక్తి పాటలూనూ. పండగలోస్తే ఆ పండగ ప్రాశస్త్యం ని బట్టి ఆయా దేవుళ్ళ పాటలు ముందు వేసేవారు. నా చిన్ని బుర్ర కి తట్టేది కాదు, ఆ పాట కోరేవాళ్ళు కరెక్టు గా ఆ రోజే చేరేట్టుగా రేడియో వాళ్ళకి జాబు ఎలా రాస్తారు అని. లలిత సంగీతం, వాతావరణ హెచ్చరికలూ, బాలానందం ..ఇలా చెప్పాలంటే ఎన్నో...అయ్య బాబోయ్ ఉష శ్రీ గారిని మర్చే పోయాను. లెంపలేసుకుంటున్నా.

ఇక మా ఇంట్లో ఉండే రేడియో గురించి. అది ఎంత పాతది అంటే దాన్ని ఆన్ చేసిన ఏడు సెకన్లకి గాని ఆన్ ఐనట్లు సూచించే లైటు వెలిగేది కాదు. అప్పట్లో నాకది వింతగా ఉండేది. మొన్న ఇండియా వెళ్లి నప్పుడు గుర్తొచ్చి ఇల్లంతా వెతికా. మేము పాత సామాన్లు వేసే గదిలో వంటరిగా పడుంది దుమ్ము కొట్టుకుపోయి. నాకు మాత్రం " విశ్వాస ఘాతకుడా" అని నన్నే చూస్తున్నట్టు అనిపించింది. వెరే ఏవైనా బయట పడేస్తే పడేసారు గాని ఇది మాత్రం జాగ్రత్త అంటుంటే వింతగా చూసాడు నాన్న. అయినా వాళ్ళకది మాములే. నెను ఇండియా కి వచ్చినప్పుడల్లా ఇలా ఏదొ ఒక అపరూపమైన వస్తువు ని వెతికి పట్టుకోవడం, పడేయొద్దు అని జాగ్రత్తలు చెప్పడం. చెప్పాలంటే అదో పెద్ద లిస్టు.

నిజానికి ఈ రేడియో పాత సామాన్ల గది చేరి దాదాపు యిరవై ఏళ్ళ పై మాటే.నేను ఎనిమిదో తరగతిలొ ఉన్నప్పుడనుకుంటాను, మా నాన్న కి నబీ అనే ఒక ముస్లిము స్నెహితుడుండేవాడు . ఆయన వీలు దొరికినప్పుదల్లా సిలోన్ ( శ్రీలంక) వెళ్ళి ఫారిన్ వస్తువులు తెచ్చేవాడు. మేడిన్ హాంకాంగ్ డిజిటల్ వాచీలు,టేప్ రికార్డర్లు, బటన్ నొక్కితే తెరుచుకొనే గొడుగులు లాంటివి. అలా ఆయన ద్వారా మా నాన్న నేషనల్ పేనసోనిక్ వాళ్ళది ఒక రేడియో కం టేప్ రికార్డర్ తెప్పించటం, కొత్త వింత.. పాత రోత.. రీతి లొనే పాతరేడియో ని ఇలా పక్కన పడేయడం జరిగింది. అది స్మగుల్డు వస్తువు కాబట్టి ఆ విషయం తెలిస్తే పోలిసులు వచ్చి దాన్ని తీసుకెళ్తారని ఎవరో చెప్పడం తొ , అది ఎప్పుడు మోగుతున్నా నేను కంగారు కంగారు గా వెళ్ళి వీధి తలుపులు మూయటం ఇంకా గుర్తుంది. మా అమ్మ కి నా కంగారు అర్ధం కావటానికి సంవత్సరం పట్టింది అదీ మా నాన్న చెప్పాకనే.

ఇక నేను పదో తరగతికి రాగానే విషయ పరిజ్ఞానం పట్ల ఆసక్తి కల నాబోటి ఔత్సాహికులకి ఇంగ్లీషు వార్తలు వినటం ఒక "స్టేటస్ సింబల్" అయి కూర్చుండటం మూలాన నా రేడియో పరిధి అమాంతం పెరిగి పొయింది. ఇండియా నే కాదు ఇండియా లాంటి దెశాలు "బోలెడు" ఉన్నాయి అని తెలియటం, తద్వారా BBC, ABC, సిలోన్ రేడియో లాంటివి నా చెతికందాయి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు నేను ఇండియా లొ ఏమి జరిగినా, "టాట్! నేనేంటి నా లెవెలేంటి" అని ఆయా వార్తలు BBC ద్వారా వినెవాడిని. ఇక్కడి వెర్షను ఎలాగూ తెలుసు అక్కడి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అనే దుగ్ధ కూడా ఒక కారణం కావచ్చు.

ఇక ఇంటర్ కి రావడం, మాకు తెలిసిన బంధువర్గం లోని పిల్లలు చాలా మంది అప్పటికే ఇంజనీరింగు చేరి ఉండటం తో, స్థాయీభేదాన్ని జీర్ణించుకొవటం కష్టమై మా నాన్న నాకు "స్ట్రిక్టు వార్నింగు" ఇవ్వటం, ఆ రెండు ఏళ్ళూ చదువే లొకం గా బతకటం, తద్వారా నా రేడియో అటకెక్కడం జరిగిపొయాయి. అప్పుడప్పుడే TV అనే గ్రహాంతర వాసి మనమీద దాడి చెయ్యడం కూడా ఒక కారణం.

ఇక ఇంజనీరింగ్ లొ కొచ్చాక మళ్ళా దుమ్ము దులిపి నా రేడియో ని బయటికి తీసాను. వీడెవడ్రా బాబూ అన్నట్లు చూసి దగ్గేవారు నా రూమ్మేట్లు. ఉండేది అయిదరాబాదు కదా,ఇక హిందీ దురద కూడా అంటుకుంది. నేను రెగ్యులర్ గా వినే వాటితొ పాటు మరి కొన్ని వచ్చి చేరాయి. బినాకా గీత్ మాలా, ఆర్మీ వాళ్ళకుద్దేశించిన పాటల కార్యక్రమం ( పేరు మర్చిపొయా, ఆప్ కి ఫర్మాయిష్???, ఆ పాటలు కోరే వాళ్ళందరు సుబేదార్లే) అలా.

ఎంత రేడియో ప్రేమికుడినైనా, కళ్ళ ముందు కనపడే రంగుల ప్రపంచానికి ఆకర్షితుడనై (ఏదొ అనుకునేరు,TV సంగతి చెప్తున్నా), కొన్నాళ్ళు నా రేడియో ని కొద్దిగా నిర్లక్ష్యం చెసిన మాట వాస్తవం. ఆ రంగుల సుందరి భ్రమలు నెమ్మదిగా తొలగి పొతున్నాయి ఇప్పుడు. ఇప్పటికీ BBC, లోకల్ రేడియో స్టేషన్లు వింటూంటా ఎంత బిజీ గా ఉన్నా. డ్రైవింగ్ చెస్తున్నప్పుడు తప్పనిసరిగా రేడియోనే వింటా, పక్కనున్న నా శ్రీమతొ, వెనక సీట్లొ ఉన్న నా స్నెహితులో నెత్తీ నోరూ బాదుకునే వరకూ. ఇప్పుడు కూడా ఒక పదిమందిమి కలిసి ఎక్కడికైనా వెళితె , అందరూ జంకుతారు నాకారు ఎక్కటానికి. కారు ఎక్కే టైము రాగానె, నా వెనకాలే ఒప్పందాలు జరిగిపొతై నువ్వెళ్ళరా బాబూ అంటె లెదు నువ్వెళ్ళరా అంటూ. కొద్దిపాటి చనువు ఉన్నొళ్ళు నాచేత ఒట్టేయించుకొని ఎక్కుతుంటారు.

మాతృభూమి కి దూరంగా ఉండటం చేత ఇండియాలొ ఈ రేడియో విషయం లొ చోటు చేసుకున్న మార్పులు ఇప్పుడు నాకు అంతగా తెలీదు. FM రేడియో జనాల్ని ఉర్రూతలూగిస్తున్నది అని విన్నాను.ఇండియా కి వెళ్ళినప్పుడు వినాలి. "రంగుల సుందరి" లా ఇది (పై పై) "హంగుల సుందరి" కాకుండా ఉంటే బావుణ్ణు.

ఆలోచిస్తే అనిపిస్తుంది నా చిన్నప్పుడు రేడియోలొ విన్న క్విజ్ ప్రొగ్రాములే నా పఠనాసక్తి కి బీజం వేసాయేమో అని. కనపడిందల్లా చదివేవాడిని అప్పుడు.ఇప్పుడు కూడా. అందుకే రేడియో అంటే నాకు చాలా ఇష్టం.రేడియో తో కూడిన నా చిన్నప్పటి జ్ఞాపకాలంటె .. ఇంకా ఇంకా ఇష్టం.

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం......

Tuesday, August 26, 2008

జీవన వైచిత్రి

అది ప్రపంచం లోనే అత్యంత ధనిక దేశం. పేదరికం ఉన్నా, ప్రపంచం లోని మిగతా దేశాలతో పోలిస్తే అస్సలు లేనట్టే లెక్క. మానవ హక్కులకు చాలా విలువ ఇస్తారు. ప్రపంచం లో ఉపద్రవం సంభవించినా, రాజకీయ ఆనిశ్చిత స్థితి సంభవించినా అన్ని తలలు దేశం వైపే తిరుగుతాయై. అంత దాకా ఎందుకు అక్కడ పెంపుడు జంతువులకు ఉన్న విలువ అభివృద్ది చెంఢుతున్న దేశాలలో మనుషులకు కూడా ఉండదు. అక్కడ ఎటు చూసినా పచ్చిక బయళ్లు, విశాలమైన రహదారులు , ఉద్యానవనాలు, దుకాణ సముదాయాలు. శని, ఆది వారాలు ప్రపంచమే మారి పోతుంది అక్కడ. అటువంటి దేశం లో పుట్టాడు అతడు. కష్టం అంటే తెలీదు. ఆడుతూ పాడుతూ గడచిన బాల్యం. ధనిక పేద తేడా తెలియదు , ఒకవేళ తెలిసినా మిగతా దేశాలలో లాగా జీవితం లోకి చొరబడి అనుక్షణం గుర్తు చేయదు. బెత్తం పట్టే పంతుల్లు ఉండరు అక్కడ. మార్కులు మార్కులు అంటూ చిన్ని బుర్ర పై వత్తిడి ఉండదు. బాల్యం దాటింది, యౌవనం వచ్చింది. ఎటు చూసినా అందమైన సీతాకోక చిలుకలు. ఉన్నదంతా అంతా ఆనందమే.

ఒకానొక రోజు,ఆడుకున్నది చాలు, చెయ్యాలి ఇప్పుడిక దేశ సేవ అన్నారు. తుపాకీ చేతికిచ్చారు. అమ్మా నాన్నాసెలవు అన్నాడు. ఇలా వెళ్ళి అలా వస్తా అన్నాడు. పాల బుగ్గలు నిమిరారు. నీ కోసం ఎదురు చూస్తాం అన్నారు

దేశానికి దూరంగా , కొన్ని వేల మైళ్ళ దూరాన ఉన్నదొక దేశం. అక్కడ జీవిత మంటేనే భయం. అనుక్షణం భయం. నోరెత్తి మాట్లాడడానికి లేదు. పుట్టాము కాబట్టి బతకటం. రోజూ పోరాటం . తిండి కోసం, హక్కుల కోసం, తన దైన రోజుకోసం. అక్కడ పుట్టాడొకడు. ప్రతి రోజూ గండమే. పాల కోసం పోరాటం . ఆట వస్తువులకోసం ఆరాటం . పుట్టిందే పనికోసం అన్నట్టు,ఐదేళ్ళు నిండకముందే రోజువారీ జీతగాడైనాడు . తిట్లు, తిరస్కారాలు, చీదరింపులు. లేత గుండె కరకు గా మారింది. బాల్యం ముగిసే సరికే జీవిత కాలపు సత్యాలు బోధ పడ్డాయ్. ఎవరి మీదో తెలీని కసి. దేని మీదో కోపం. అదేమిటో తెలీదు. తనలాంటి వాళ్ళని ఒక పది మందిని వెతుక్కున్నాడు. వీళ్ళందరి ని చేరదీసిందోక మత మౌడ్యపు కుక్క. మన మతమే గొప్ప అంది. తుపాకులు అందించింది.

ఒకానొక రోజు, వీరిద్దరూ ఎదురు పడ్డారు . తుపాకులు గర్జించై. ఈసారికి మతమే గెలిచింది. వస్తానన్న వాడు ఎప్పటికి రాలేదు. ఎదురు చూసి చూసి పచ్చిక బయళ్ళు ఎండి పోయాయి.
*************************************************************************************

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపధ్యం లో, డెమోక్రాటిక్ అభ్యర్ధి బరాక్ ఒబామా లేదా రిపబ్లికన్ అభ్యర్ధి మెక్ కెయిన్ , ఇరాక్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ గురించి మాట్లాడినప్పుడల్లా, లేదా సి ఎన్ న్ వాళ్లు ఈరోజు అమెరికా సైనికులు ఇంత మంది చని పోయారు అని చెప్పినప్పుడల్లా నా లో మెదిలే భావాలే ఇవి. ఎక్కడి ఇరాక్, ఎక్కడి అమెరికా ? పైన చెప్పిన వారిద్దరిని ఒకరికొకరు ఎదురు పడేలా చేసింది ఎవరు? సద్దామ్ హుస్సేనా? అమెరికా అధ్యక్షుడా? దేశ భక్తా?మతమా? కుటిల రాజకీయాలా? లేక సింపుల్ గా వారి నుదిటి రాతా? ఇవి ఏవైనా గాని, ఒక సాధనాలు మాత్రమె. వీటన్నిటికి అతీతం గా ఇంకేదో అదృశ్య శక్తి ఉందేమో అనిపిస్తుంది నాకు.

/ఉమాశంకర్

.

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...