Monday, April 23, 2012

అమెరి'కతలు-1(మిగతా భాగం)

మా రమేష్ గాడి నోట్లో రహస్యం ఎంతోసేపు దాగదు. రెట్టించి అడిగితే వెంటనే కక్కేస్తాడు. చాలా సార్లు అలా అడగాల్సిన అవసరం కూడా ఉండదు.

పది నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయి వస్తా అని బాత్ రూం లోకెళ్ళి తలుపేసుకున్నాడు.

ల్యాప్ టాప్ తెర మీద ఒక్కొక్కటిగా అలుముకుంటున్న పాప్ అప్ విండో లను భయ భయంగా చూస్తూ , ఇండియా కాల్ చేసి నాన్నతో ఓ పది నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసా. ఈలోపు రమేష్ రెడీ అయి, నాముందు కొచ్చి నిలబడి,రెండు చేతులూ వేసుకున్న జీన్స్ ప్యాంటు జేబుల్లోకి దూర్చి, అన్నాడు.

"వెళ్దామా?"

మెట్లు దిగి కిందకొచ్చాక అడిగాడు.

"నీ కారెక్కడ పెట్టావ్?"

"అదిగో"

"సరే నన్ను ఫాలో అవ్వు సరేనా?"

"ఓకే"

ఓ పది నిమిషాల్లో మా కార్లు కారు సర్వీసింగ్ సెంటర్ పార్కింగ్ లాట్లోకి ప్రవేశించాయి.వాడు కారు దిగి,లాక్ చేసి నావేపు చూసే దాకా ఆగి , నేను కార్లోంచే వాడికి "నేను కూడా దిగాలా?" అన్నట్టు సైగ చేసాను. వాడు "పర్లేదు " అన్నట్టు సైగ చేసి కౌంటర్ వేపు వెళ్ళాడు. నేను నా కారు సీటు కొద్దిగా వెనక్కి వాల్చి , వాడింటికి వస్తూ వస్తూ నా పోస్టల్ మెయిల్ బాక్స్ లోంచి తెచ్చుకున్న టైం మేగజైన్ తెరిచాను. కార్లో అలా చదవడం నాకిష్టమైన వ్యాపకాల్లో ఒకటి. వస్తూ వస్తూ దార్లో కనపడే మెక్ డొనాల్డ్స్ డ్రైవ్ త్రూ లో కాఫీ తీసుకుందామనుకొని ,వీడి కారు ఫాలో అయ్యే హడావిడిలో ఆ విషయం మర్చిపోయినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.

ఒక పదిహేను నిమిషాల తరువాత పాసింజరు సైడు విండో అద్దం మీద టక టక మని చప్పుడు. డోరు అన్ లాక్ చేసాక వాడు సీట్లో కూర్చొని,సర్వీసుకిచ్చిన కార్లోంచి తెచ్చిన ఏవేవో పేపర్లూ,ఇంటి తాళాలూ నాసీటు పక్కనున్న కప్ హోల్డర్ లో వేసి అన్నాడు.

"పద"

కారు రోడ్డెక్కాక అడిగాను.

"ఎంత బాదేడు?"

" రెండొందలు "

ఎమ్మెస్ నారాయణలా కామెడీ గా అడగం నాకు రాదు. అలాని సాయి కుమార్ లా అడగడం అసలే ఇష్టం లేదు. అందుకే నాగార్జునలా అడిగా..

"అస్సలు నీకా టైం లో బయటికెళ్ళాల్సిన అవసరం ఏమిటి? నాకు తెలియాలి"

"నువ్వే కార్డ్ వాడతావ్?" అడిగాడు.

"క్రెడిట్ కార్డా? అమెక్స్ చాలా వరకు."

"నేను డిస్కవర్ వాడతాను"

"సో?"

"నీకు తెలుసుగా వాడు కార్డ్ యూసేజ్ మీద కేష్ బ్యాక్ ఇస్తాడని?"

"విన్నాను "

"ఆదివారం రాత్రి పదకొండప్పుడు నిద్రపట్టక , పక్క మీద దొర్లుతూ టీవీ చూస్తుంటే అందులో డిస్కవర్ కార్డ్ తాలూకు యాడ్ ఏదో వచ్చింది. అప్పుడు సడన్ గా గుర్తొచ్చింది జాన్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా వాడు గేస్ మీద ఫైవ్ పర్సెంట్ కేష్ బ్యాక్ ఇస్తాడనీ , నా మినీ వేన్ గేక్ టాంక్ ఆల్మోస్ట్ ఎమ్టీ అని. రేపు ఆఫీసయిపోగానే అట్నుంచటే బోస్టన్ వెళ్ళాలి ఈవెనింగ్ ఫ్లైట్ కి. మళ్ళా శుక్రవారం గానీ రాను.ఓ పనైపోద్ది కదాని అప్పటికప్పుడు లేచి షా రోడ్డు మీదున్న షెల్ కెళ్ళి గేస్ కొట్టించా. దాన్ని పార్క్ చేసి మెట్లెక్కుతుంటే,పనిలో పనిగా నా రెండోకారు కేమ్రీ లో కూడా గేస్ కొట్టిస్తే ఓ పనై పోతుంది కదా అనుకున్నా. కేమ్రీ లో గేస్ కొట్టించి తిరిగి ఇంటికొస్తుంటే ఇదిగో ఈ ఆక్సిడెంట్"

నేనేం మాట్లాడలేదు. కారు వాడింటి ముందాపగానే వాడు ఇంటి తాళాలు తీసుకొని, థాంక్స్ చెప్పి కారు దిగాడు.

నేను ఇంటికొచ్చి కారు పార్క్ చేసి దిగబోతుండగా నా చూపు కప్ హోల్దర్ లో వాడు మర్చిపోయిన పేపర్ల మీద పడ్డాయి. వాటిని చేతిలోకి తీసుకొని ,కారు లాక్ చేసి మెట్లెక్కి పైకొస్తూ, వాటి వైపొకసారి చూసాను. ఒకటేమో సర్వీసు సెంటర్ వాడిచ్చిన రసీదు. ఇంకొకటి షెల్ గేస్ రిసీట్. వీడెంత సేవ్ చేసాడు చూద్దాం అని దాన్ని పరిశీలనగా చూసాను. వాడు కొట్టించిన గేస్ రెండున్నర గేలన్లు. మొత్తం ఎమౌంట్ పది డాలర్ల పదిహేడు సెంట్లు. అంటే వీడికి డిస్కవర్ వాడిచ్చిన కేష్ బ్యాక్ యాభై సెంట్లు.

వీడింటికీ షెల్ గేస్ స్టేషనుకీ రెండున్నర మైళ్ళు, అంటే రానూ పోనూ ఐదు మైళ్ళు.

నమ్మశక్యం గాక ఆ రసీదు తాలూకు తారీఖు చూసాను.

వాడు చెప్పిన రోజుదే ఆ రిసీట్. మార్చి 25 రాత్రి 11:45PM




Saturday, April 21, 2012

అమెరి'కతలు -1

శనివారం తెల్లవారుజాము తొమ్మిదింటికి రమేష్ గాడి దగ్గిర్నుంచి ఫోన్.
"ఏంట్రా"
"రేయ్ నేను రమేష్ ని. ఆ ఏంలేదు చిన్న హెల్ప్ కావాలి"
రమేష్ గాడి సంగతి నాకు బాగా తెలుసు. ఫోన్ చేసి ,విషయం పూర్తిగా చెప్పకుండా "ఆ ఏంలేదు" తో మొదలెట్టాడంటే ఏదో దాస్తున్నట్టే లెక్క.
"ఏమిటి?"
"ఆ ఏంలేదు .నా కారు సర్వీసింగ్ కివ్వాలి"
నాలో అనుమానం బలపడింది. మళ్ళీ "ఏంలేదు" అన్నాడంటే డెఫినెట్ గా ఏదో ఉంది.
"నువ్వు కూడా నాతోపాటు నీకార్లో వస్తే, వచ్చేటప్పుడు నన్ను మాఇంటి దగ్గిర వదిలేద్దువుగాని" చెప్పాడు,

వివరాలు కనుక్కొని ఫోన్ పెట్టేసాను.

మధ్యరాత్రి లేపాడుకదా ఒకటే కళ్ళు మండుతున్నాయి.

పని చేసీ,చేస్తున్నట్టు నటించీ,బుధవారంనుంచి పనిని క్రమ క్రమంగా వచ్చేవారానికి వాయిదావేసీ బాగా అలసిపోయుంటానేమో, శుక్రవారం సాయంత్రం కాగానే నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. ఇంటి విషయాల్లో దక్కే వీటో అధికారం దీనికి అదనం. తనేం పని చెప్పినా "ఏం ఇది శుక్రవారం సాయంత్రం, తెలీదా?" అన్నట్టు చూస్తుంటాను తనవైపు. జస్ట్ చూస్తాను. అంతే. ఏం అనను, ఎందుకొచ్చిన గొడవ అని. చాలా వరకు నాకు అనుకూలంగానే వర్కవుట్ అవుతుందా చూపు.ఇంతాచేసి శుక్రవారం సాయంత్రం నేనేం చేస్తానూ ఆంటే, నాకిష్టమైన సినిమా,లేక సినిమాన్నరో, ఆపై ఏదైనా పుస్తకంలో ఓ వంద పేజీలూ నమిలేసి ,ఆపై మళ్ళా టీవీ చూస్తూ ,నా కిష్టమైన చోట, అనగా సోఫాలో, నిద్ర పోతాను . బ్రహ్మచారి గా ఉన్నప్పుడు పడుకోటానికి బెడ్డున్నా,నేను టీవీ చూస్తూ సోఫాలోనే నిద్రపోయేవాడిని నాకిదే సౌకర్యం అంటూ. నా రూమ్మేట్లు వింతగా చూసేవారు,వీడి కిదేం (నిద్ర) పోయేకాలం అని. అలా ఆనందమయ జీవితానికి సోఫా ఒక సింబల్ అయి కూర్చుంది నాకు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గెస్టు లెక్కువై , హోస్టులు హైరానా పడుతుంటే నేను నెమ్మదిగా సోఫానాక్రమించుకొని నామోహాన ఒక కంఫర్టర్ పడేస్తే నా నిద్ర నేనుపోతాను అని చెప్తా ఏదో త్యాగం చేస్తున్నట్టు మొహం పెట్టి.

సరేలెండి, విషయానికొస్తే,సో, అలా నేను నిద్రపోయే సరికి శనివారం ఉదయం ఏ నాలుగో ఐదో అవుతుంది మరి.బహుశా అందుకే అనుకుంటా , ఆ మరుసటి రోజు, నేను క్రితం రాత్రి చూసిన సినిమాలు గుర్తుంటాయి గాని, వాటి పేర్లు మాత్రం చచ్చినా గుర్తు రావు.

********************************************************************

ఉసూరు మంటూ రెడీ అయి పదకొండూ పదకొండున్నర మధ్య రమేష్ గాడింటి కెళ్ళాను. వాడే తలుపు తీసాడు.వాళ్ళావిడ ఇండియా వెళ్ళింది. ఇంట్లో వీడొక్కడే. కలర్లో చూస్తున్న WW-II స్టిల్ ఫోటోగ్రాఫ్ లా ఉంది ఇల్లు. ఏ వస్తువునీ తాకకుండా, తొక్కకుండా జాగ్రత్తగా ఒక డైనింగు టేబుల్ తాలూకు కుర్చీలో సెటిలయ్యాను. వాడేమో డైనింగ్ టేబిల్ మీద పెట్టిన ల్యాప్ టాప్ లో పాటలు వింటూ వంటింట్లో స్టవ్ దగ్గర ఏదో కుస్తీ పడుతున్నాడు. ఆ పాట వింటుంటే విన్న ట్యూన్ లానే ఉంది. మ్యూజిక్కులో మాత్రం రెహ్మాన్ మార్కు స్పష్టంగా కనపడుతోంది.

"రెహ్మాన్ పాటలా ఉంది. ఏం సినిమా? " అడిగాను.

వాడు నావైపు అదోలా చూసి,గబా గబా నాదగ్గరకొచ్చి . ల్యాప్ టాప్ నావైపు తిప్పాడు. స్క్రీన్ నిండా పాపప్ విండోలు.

"ఏదో వైరస్ ఎక్కిందిరా. నీ దగ్గరేమైనా ఏంటీ వైరస్ ఉందా?" అంటూ టిక్కుం టిక్కుం అని వాటిని ఒక్కొక్కటే క్లోజ్ చేస్తున్నాడు. ఒక స్క్రీన్లో ఏవో వార్తలు వస్తున్నాయి. ఇంకో దాంట్లో ఇంట్లో కూర్చొని నెలకి ఇరవై వేల డాలర్లు ఎలా సంపాదిచ్చొచ్చో చెప్తూ ప్రకటన, ఇంకో దాంట్లో బరువు తగ్గటం ఎలా అనే విషయం మీద ఒకామె ఊదరకొట్టేస్తోంది. ఇంకొన్ని స్క్రీన్లు చెప్పకూడనివీనూ. అలా వాడు దాదాపు ఒక ఏడెనిమిది విండోలు మూసేసాక అప్పుడు వినపడింది పాట స్పష్టంగా "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి" అంటూ.

"అరె, మన ఇళయరాజా పాట. అనవసరంగా కాపీ ట్యూన్ అని రెహ్మాన్ ని ఆడిపోసుకున్నానే" నోచ్చుకున్నాన్నేను. పైకలా అన్నా నాకు రెహ్మాన్ మ్యూజిక్ అసలు నచ్చదు. వంటింట్లో ఉన్న స్టీలు పాత్రలన్నీ కౌంటర్ టాప్ మీద పెట్టి , ఒక్కసారిగా వాటన్నిటినీ నేల మీదికి తోసేసినట్టుగా ఉంటుంది నాకు ఆయన సంగీతం.

స్టవ్ దగ్గర్నుంచే వాడు ఆఫర్ చేసిన బ్రేక్ ఫాస్ట్ ని లోపల భయమేస్తున్నా,పైకి సున్నితంగా,పొట్ట రుద్దుకుంటూ ఇంట్లోనే తినొచ్చా అని చెప్పి తప్పించుకున్నాను.

వాడు తింటుండగా అడిగాను.

"ఇంతకీ ఏంటి విషయం?"

"దేని గురించి?"

"అదే , కారు సర్వీసింగ్ అన్నావు, ఆయిల్ చేంజా?"

"కాదు"

"మరి?"

వ్యక్తిగత విషయాలైనా,మొహమాటం లేకుండా,ప్రశ్నలతో వేధించగల చనువున్న అతి కొద్ది మంది (ఇద్దరు) ఫ్రెండ్స్ లో వీడొకడు నాకు.

వాడు నావైపు సాలోచనగా చూసాడు.చెప్పాలా వద్దా అని సంకోచిస్తున్నట్టుగా అర్ధమయింది నాకు. ఇప్పుడు కాకపొతే, కింద కారు దగ్గరి కెళ్ళాకో, లేదా సర్వీసు సెంటర్ లోనో విషయం నాకు వాడు చెప్పక పోయినా (చూచాయగా నైనా)తెలుస్తుందని నెమ్మదిగా అర్ధమయినట్టుంది బడుద్దాయికి. తింటున్నదాపి కాస్త నీళ్ళు తాగి గొంతు సవరించుకున్నాడు.

"ఏక్సిడెంటు చేశా"

వాణ్ని పైనించి కిందదాకా పరీక్షగా చూస్తూ అన్నా "ఏమిటీ? ఎక్కడ? ఎలా అయింది?ఏం కాలేదు కదా?"

"తిక్క మొహంది. వెళ్తూ వెళ్తూ సడన్గా బ్రేకేసింది, నేను చూసుకోలేదు" ఆమెదే తప్పన్నట్టు మొదలెట్టాడు. "వెనకనుంచి ముద్దెట్టుకున్నా"

"వాటెవర్ ఇట్ ఈజ్ . నీదే తప్పు. బాగా డామేజయిందా ?"

"ఆమె కారుకేం కాలేదు. నాకారు బానేట్ కొద్దిగా వంకర పోయింది."

"ఎప్పుడు జరిగిందిది?"

"మొన్న , సండే నైటు పదకొండప్పుడు "

"ఆ టైమ్లో బయటి కెందుకెళ్ళావురా?"

" "

దొరికి పోయాడు. సో, ఆ ఏదో, ఇక్కడుంది అన్నమాట.

పొద్దున్నే ఆఫీసు పెట్టుకొని ఆ టైమ్లో బయటికెందుకెళ్ళాడు? ఎందుకు?ఎందుకు?ఎందుకు?
(ఇంకాఉంది)


Monday, April 9, 2012

ఒక పరిచయం

తను నావైపు చూసి సన్నగా నవ్వింది.

నాలో క్షణకాలపు తడబాటు.

నన్నేనా లేక నా పక్కనున్న తన పరిచయస్తులెవరినైనా ఉద్దేశించి నవ్విందా?సమాధానంగా నేను తిరిగి నవ్వితే,ఒకవేళ ఆ నవ్వు నున్నుద్దేశించింది కాకపొతే ?

సమాధానంగా నేను నవ్వీ నవ్వనట్టు నవ్వినా, నా తడబాటు కలిగించిన ఆ క్షణకాలపు ఆలస్యం నా సమాధానాన్ని తనవరకూ చేరనిచ్చినట్టు లేదు. ఆసరికే తను తలకిందికి దించుకొని కుడి చేతి బొటనవేలిని స్మార్ట్ ఫోన్ తెర మీద ఆడిస్తోంది.

తలతిప్పి నా కుడి ఎడమలకు చూసాను. వారెవరూ తన పరిచయస్తుల్లా అనిపించలేదు.నాలో చెలరేగే సంచలనాన్ని అణచుకుంటూ, ఒక అరనిమిషం కదులుతున్న బస్సులోంచి బయటికి చూసి మళ్ళా తనవైపు ఓరగా చూసాను. తను అలానే తలవంచుకొని ఫోన్ వైపు చూస్తోంది.

నేను తనకు ఎంత కాలంనుంచి తెలుసో తెలీదు గాని, మాటా మంతీ లేని మా పరిచయానికి నావైపు నుంచి దాదాపు ఒక సంవత్సరపు వయసుంటుంది. ఇద్దరం ఆఫీసుకెళ్ళే సమయం ఒకటే కాబట్టి తరచుగా తను నాకెదురవుతూనే ఉంటుంది. మొదటిసారి చూసిన సందర్భం గుర్తులేదు కాని తనని చూడగానే ఏదో చాలా కాలం నుంచి పరిచయమున్న వ్యక్తిలా, ఒక అందమైన చిన్నప్పటి జ్ఞాపకంలా అపురూపమైనదీ, అరుదైనదీ అన్న భావన కలిగిందా క్షణాన.అప్పుడు నాకేమీ స్పురణకు రాలేదు గాని ఇది జరిగిన ఒక వారం రోజుల తరువాత , భోరున కుండపోతలా వర్షం కురుస్తున్న రోజు, బస్సులో ఎప్పటిలా తనని చూసిన క్షణాన , (బహుశా) ఆవర్షపు వాతావరణం ఒక ఉద్దీపనలా దాదాపు పాతికేళ్ళ క్రితపు నా యవ్వనపు పరిచయాన్ని గుర్తుకు తెచ్చింది. అంతటితో ఆగకుండా ఆ జ్ఞాపకానికీ నేను ఇప్పుడు చూస్తున్న వ్యక్తికీ ఏ తర్కానికీ అందని లంకె కుదిర్చి మిగతా ఖాళీని నువ్వే పూరించుకో అంటూ నిర్మొహమాటంగా నన్నో జ్ఞాపకాల జడివాన లోకి తోసేసింది..

***********************************************************************************
కాలపరీక్షకి ఎదురునిలిచే కొన్ని జ్ఞాపకాలు ఒంటరిగా గుర్తురావేమో.

ఆ సంఘటనలూ, వాటిని ఆవరించుకొని ఉన్న నేపధ్యం కూడా దాంతో పెనవేసుకొని గుర్తుండిపోతుంది. బహుశా మెదడు మనకిష్టమైన ఆ జ్ఞాపకాన్ని నిక్షిప్తం చేసే పద్దతే అదేమో నాకు తెలీదు..

ఎప్పుడో పాతికేళ్ళ క్రితపు ముసురు పట్టిన వినాయక చవితి నాటి సాయంత్రమూ..

వెన్నెల్లో మేడ మీద సిరివెన్నెల పాటలూ..

గుళ్ళో వెలిగించిన కార్తీకమాసపు దీపాలూ..

రోహిణీకార్తె మిట్టమధ్యాహ్నం ఆవిర్లు కక్కుతూ ,నిర్మానుష్యంగా ఉండి, ఏ ఐదింటికో తిరిగి జీవంపోసుకొనే వీధీ.. ఎప్పుడు సాయంత్రమవుతుందా ?తనెప్పుడు కనబడుతుందా?అని నా ఎదురుచూపులూ..

ఇవన్నీ ఆ అందమైన పరిచయానికి అంతే అందమైన నేపధ్యాలు...
*********************************************************************************


ఓరగా చూసి చటుక్కున తలతిప్పుకొనే నేను ఆరోజు తనని మొట్టమొదటి సారి పరిశీలనగా చూసాను. గుండ్రటి మొహం,ఆరోగ్యకరమైన పలకరింపుతో కూడిన కళ్ళూ, చెవులకు చిన్నప్పుడెప్పుడో పెట్టుకొని ఇప్పటివరకూ ఒక్కసారి కూడా తీయలేదేమో అనిపించే పాతకాలపు బుట్టలూ, మెడలో సన్నని బంగారపు గొలుసూ, అన్నిటికీ మించి మొహంలో పట్నవాసపు పోకడ తెలీదనిపించే ఒకరకమైన అందమైన అమాయకత్వమూ. తను తలవంచుకొనే విధానమూ , తలవంచుకొని చేస్తున్న పనిలోకి లీనమయే తీరూ ,తన నడకా ఇలా ప్రతిదీ నా జ్ఞాపకానికి ప్రతిరూపంగా అనిపించ సాగాయి ఆరోజునించి.

ఒకే అపార్ట్మెంట్ ఆవరణ లో ఉండే మాదొక మూడంచెల ఆఫీసు ప్రయాణం. ఒక రెండుమైళ్ళ కారు ప్రయాణం, తరువాత ఒక 20 నిమిషాల బస్సు, ఆపై దాదాపు ఒక 25 నిమిషాల సబ్వే రైలు ప్రయాణం. రైలు బయలు దేరిన 14 నిమిషాలకు తను దిగిపోతుంది.కొన్ని సార్లు బస్సు ఎక్కేటప్పుడు కనపడకపోయినా ట్రైన్ స్టేషన్లో కనపడుతుంది ప్లాట్ ఫారం మీద ఎస్కలేటర్ పక్కనే నిలబడి రైలు కోసం వేచి చూస్తూ.ప్రతిరోజూ అక్కడే నిలబడుతుంది ఒక అడుగు అటూ ఇటుగా.

దాదాపు ప్రతిరోజూ కారు పార్క్ చేసి నాలుగంతస్తులు మెట్లు దిగి కిందకొస్తూ, పక్కనున్న ఆద్దాలలోంచి కింద లైనులో నిలబడ్డ వాళ్ళలో ఆత్రంగా తనని వెదుక్కునేవి నాకళ్ళు. తను నాకు బస్ స్టేషనులో కనపడని రోజున నేను రైల్వే ప్లాట్ఫాం మీద ఎస్కలేటర్ పక్కనున్న ఆ స్థలాన్ని మనసులో మెదిలే ఆత్రత ఏమాత్రం పైకి కనపడనీయకుండా చాలా యధాలాపంగా గమనించేవాడిని. సరాసరి ప్రతి నాలుగు నిమిషాలకు ఒక ట్రైన్ ఉండే ఆ రూట్లో తను నాకు కనపడే అవకాశం బహు తక్కువ. చాలా వరకు ఆ స్థలం నన్ను వెక్కిరిస్తూ కనపడేది. వాక్యూముక్లీనర్లా ప్రయాణీకులందరినీ తుడుచు కెళ్ళిన రైలు వెళ్లి మరీ ఎక్కువసమయం కాకపొతే అది ఇంకాస్త ఖాళీగా , బోసి పోయి కనపడుతూ,ఆ నిశ్శబ్దంలో పక్కనున్న ఎస్కలేటర్ అప్పుడప్పుడూ చేసే కిర్రు మనే చప్పుడు అప్పుడేవెళ్ళిన తనగురించి నాకేదో చెప్తున్నట్టనిపించేది.

మా ప్రయాణంలో నేను పుస్తకం చదువుతూ, తను పాటలు వింటూ అప్పుడప్పుడు క్షణకాలం కలిసే కళ్ళను సభ్యత విడదీసేది. ఎప్పుడో అమావాస్యకో పౌర్ణానికో , ఏ తెలీని ధైర్యమో ఆ క్షణానికింకో క్షణాన్ని కలిపేది. నాగుండె లయ తప్పేలా ఆ రెండో క్షణం అచ్చంగా నా గత జ్ఞాపకం నన్నుచూసి పలకరింపుగా నవ్వినట్టుండేది. ఆసమయంలో తనుకూడా నన్ను చూస్తున్నదన్న ధైర్యం అనుకుంటా, అమాంతం వెళ్లి పక్కన కూర్చొని నన్ను తనకి పరిచయం చేసుకుందామనిపించేది.కానీ ఇలాంటి విషయాల్లో బహుశా నా నిరాశాపూరిత ఆలోచనల కారణంగా కావచ్చు , నా అందమైన ఊహల కొలనులో రాయి వేయటానికి నాకు మనస్కరించేది కాదు. కళ్ళముందున్న వాస్తవానికీ,నేనెరిగిన జ్ఞాపకానికీ స్థల,కాల పరంగా సహజంగా ఉండే దూరం ఒక భయమై, మాట్లాడకుంటే తను నాగురించి ఏమైనా చెడుగా అనుకునే అవకాశం ఉంటుందేమో అన్న ఆలోచని కూడా తోక్కిపట్టేసింది.అప్పుడప్పుడూ తన పేరేమిటో అన్న ఆలోచన మాత్రం నాలో పొడసూపేది. బహుశా తనపేరు కూడా అదేనేమో?నాలోనేను నవ్వుకునేవాడిని ఆ ఊహ రాగానే.కొన్ని కొన్ని సార్లు నేను తలతిప్పుకొని కిటికీ బయటికి చూస్తున్నప్పుడు తను నావైపే కళ్ళార్పకుండా చూస్తున్నట్టనిపించేది. అది నిజమో కాదో గాని ఆ ఆ ఊహ మాత్రం భలే గమ్మత్తుగా ఉండేది.

మాటల్లేని ఈ పరిచయం ఇలానే కొనసాగి ఉంటే బాగుండేది.

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...