Saturday, March 28, 2009

కారు డ్రైవర్ల కధ -2

(గతటపా తరువాయి )

కారన్నాక ఆగదా? అన్నట్టు చూస్తున్నాడు యాదయ్య నావైపు.

వింతగా, జాలిగా, కోపంగా పళ్ళు పటపట లాడిస్తూ,ఇలా ప్రపంచంలో ఉన్న అన్నిరకాల భావాల్నీ మొహంలో ప్రతిఫలిస్తూ నా కారు రెండువైపుల నుంచీ వాహనాల్ని దూకిస్తున్నారు నగరవాసులు.

టీ తాగటం వరకూ శాంతంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు కొద్దిగా కోపాన్ని పులుముకొని నా కారు దగ్గరికొచ్చి కార్లో ఉన్న నన్నూ, యాదయ్యనీ మార్చి మార్చి చూసి, ఇందాకటి కోపం, ఇంతలోనే వచ్చిన ఆసక్తి, అయోమయం మూడిటినీ కలిపి ఒక వింతైన మొహం పెట్టి అడిగాడు.

"పెట్రోలయిపోయిందా?"

లేదు. "L" బోర్డు పెట్టనందుకు నన్ను నేను తిట్టుకొంటూ చెప్పాను.

"బ్యాటరీ డౌనా?

"లేదు, మొన్నే కారు సర్వీసింగుకిచ్చా, క్లచ్ బాగా టైటు చేసినట్టున్నాడు మెకానిక్" ఈ మాట చెప్తూనే యాదయ్య వైపు చూసా ఇకనైనా కరుణించు మహాశయా అన్నట్టు.

"అరె అంత భయపడితే ఎలా సార్, అంటూ వెనకాల వస్తున్న వాహనదార్లకి కాస్త దూరంగా పొండి అన్నట్లు చెయ్యి చూపిస్తూ విసుగ్గా డోరు తీసి కారుదిగాడు యాదయ్య.

"బతుకు జీవుడా అంటూ నేనుకూడా "ఎక్స్ క్యూజ్మీ" అంటూ ఆ పోలీసుని పక్కకి జరగమని చెప్పి, కారుదిగి వెనక డోరు తెరచి ఠక్కున ఆ సీట్లో కూలబడ్డా ను.

ఆ పోలీసు చూస్తుండగానే కారు ముందుకి కదిలింది. వెనక సీట్లో అలాగే జారిగిలబడి "యాదయ్యా స్టీరియో ఆన్ జై" అన్నా తలపట్టుకొని.

నేనెంతో ఏరికోరి సీడీ లో కూర్చిన పాటల్లోంచి ఈ "దేవత" పాట వినిపిస్తోంది

కుడి కన్ను కొట్టగానే కుర్రోణ్ణి, ఎడంకన్ను కొట్టగానే ఎర్రోణ్ణి,
కుడి కన్ను కొట్టగానే కుర్రోణ్ణి, ఎడంకన్ను కొట్టగానే ఎర్రోణ్ణి,
ఆ రెండుకళ్ళు కొట్టరాదా, నన్ను రెచ్చగొట్టిచూడరాదా..
"వంకాయ్"
హొయ్ హొయ్
*****************************************************************
ఆ తరువాత కరెక్టుగా రెణ్ణెళ్ళకి సహనం కోల్పోయిన యాదయ్య, నాకూ, నా కారుకీ గుడ్ బై చెప్పేసి టీ బండి తెరిచేసాడు. ఇప్పటికీ నేను మా అపార్టుమెంటు లోంచి బయటికి వచ్చేటప్పుడు నన్ను గమనించినా గమనించనట్టు ఉండటానికి శతధా ప్రయత్నిస్తాడు యాదయ్య. కస్టమర్లెవరూ లేకున్నా సీరియస్ గా టీ కలపడమో, అప్పుడే గుర్తొచ్చినట్టు ఆ వాడిన టీపొడిని పారేయటానికి పక్కకెళ్ళడమో చేయటం ద్వారా.

ఆ తరువాత ఒక రెణ్ణెళ్ళు నేనే కష్టపడ్డాను. పొద్దున్నే ఏడింటికే ఆఫీసుకెళ్ళడం, రాత్రి పది తరువాతే బయటికిరావడం. అప్పుడప్పుడు, నా కొలీగ్స్ ఎవరైనా ఆఫీసు వదిలి ఇల్లుజేరాక, ఏదైనా గుర్తొచ్చి ఇంకా ఆఫీసులోనే ఉన్న నాకు ఫోన్ చేస్తే నేను వీలైనంత క్యాజువల్ గా అడిగే ప్రశ్నొకటుంది.

"ఈరోజు ట్రాఫిక్ ఎలా ఉందేమిటీ?"

************************************************************

ఒకానొక శనివారం.

అప్పటికప్పుడు యాదగిరి గుట్ట వెళ్దామని నిర్ణయించుకొని డ్రైవర్ కోసం రోడ్డున పడ్డాడు మా అన్నయ్య. మా ఇంటిపక్కనే టాటా సుమోలూ, క్వాలిస్ లు అద్దెకిచ్చే ఏదో ట్రావెల్స్ ఆఫీసుంది. అక్కడికి పొద్దున్నే ఒక పదిమంది డ్రయివర్లు చేరుకొని మా లాంటి కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా మాకు దొరికాడొక డ్రయివర్. పేరు రమేష్. రెండంగుళాల ఎర్రని నిలువు కుంకుమ బొట్టుపెట్టుకొని మహా భయానకంగా కనపడతాడు.ప్రయాణంలో ఆయనతోటి మాటలు కలవడం, ఆయన నా డ్రయివింగు కష్టాలు విని , జాలిపడి ,వాళ్ళ బావ భిక్షపతి ని ఆ సోమవారం పొద్దున్నే మా యింటికి పంపాడు.

టీవీలో చినజీయరు స్వామి ప్రవచనాలు వింటున్న టైములో డోరు బెల్లు మోగింది. తలుపు తీసా.

ఎదురుగా మాసిన గడ్డంతో ఒక ఐదడుగుల ఎత్తున్న వ్యక్తి,సన్నగా పీలగా లూజు పేంటూ, లూజు షర్టూ వేసుకొని.

"నమస్తే సార్. రమేష్ పంపించాడు సార్, డ్రయివర్ గావాలన్నార్ట?"

" ఓ, సరే లోపలికి రా.కూర్చో, ఏంటి నీపేరు?

"భిక్షపతి సార్."

ఎవరో చెప్పారు, పనిమనిషి, డ్రయివర్, వీళ్ళిద్దరినీ పనిలో కుదుర్చుకునే ముందు వాళ్ళెవరు? ఎక్కడుంటారు? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఏ తరగతి? ఏమీడియం? ఏ సెక్షను? వాళ్ల రోల్ నంబరు ఏమిటి? అసలు వీళ్ళది మొదట్నుంచి హైదరాబాదేనా, లేక హైదరాబాదు చుట్టుపక్కల ఏదైనా ఊరా? ఇత్యాదివన్నీ అడగాలట మన సెక్యూరిటీ కోసం. వాళ్ల వివరాలన్నీ మనకి తెలిస్తే ముందు ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి వారు భయపడతారు అనేది దీని వెనకున్న మాగొప్ప కారణం.

నేనయితే అవేమీ అడగలేదుగాని, ఒకే ఒక ప్రశ్న వేసా.

"ఎన్నేళ్ళ ఎక్స్ పిరియన్స్ ఉందేంటి?

మొహంలో గౌరవం ఏమాత్రం తగ్గకుండా,గొంతులో మాత్రం కొద్దిపాటి నిర్లక్ష్యాన్ని ఒలికిస్తూ అన్నాడు..

"ఇప్పటి సందా సార్,ఇరవై ఏళ్ళ పైనే.లారీ, మినివేన్, ఏ బండైనా నడుపుతా సార్".

అడక్కుండా ఈ మాట కూడా అన్నాడు, "ఈ రమేష్, ఇంకా చాలామందికి డ్రయివింగు నేనే నేర్పినా సార్"

"సరే, లారీలు, వేన్లు వద్దులేగాని, మారుతి వేగనార్ నడపగలవా?"

"ఎంత మాట సార్"

రమేష్ ఏమి చెప్పి పంపాడో గాని, జీతం దగ్గర ఏమాత్రం తగ్గలేదు భిక్షపతి .నాకింత కావాలి అంతే. ఇది నా ఎన్నారై స్టేటస్ నామీద పన్నిన కుట్ర అని వెంటనే నాకర్ధమయింది. నాప్రతి విజిట్‌లో నేను హైదరాబాదు ఎయిర్ పోర్ట్‌లో దిగినప్పటినుంచి తిరుగు ప్రయాణ మయ్యేవరకూ ఈ కుట్ర నామీద చాలా విజయవంతం గా అమలుచేయబడుతోంది.

నేనుకూడా కాసేపు ఇలా అయితే ఎలా అన్నట్టు మొహం పెట్టి, చివరికి కొన్ని షరతులు పెట్టి, ఒప్పేసుకున్నా. అవేమిటంటే, అవసరమైనప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా ఓవర్ టైం చెయ్యటం, అప్పుడప్పుడు ఆదివారాలు కూడా పనిచెయ్యటం లాంటివి. జీతం ఆకర్షణీయంగా ఉండటంతో వెంటనే తలూపాడు భిక్షపతి.

ఆరోజు పనేమీ లేక పోవటంతో "రేపట్నించి రా" అని చెప్పి పంపించేసాను.

మరుసటిరోజు పొద్దున్నే ఠంచనుగా ఎనిమిదింటికి తలుపు తట్టాడు భిక్షపతి. తాళాలివ్వగానే తీసుకొని కిందకెళ్ళిపోయాడు . మాములుగా యాదయ్యకి తాళాలివ్వగానే కారు అపార్ట్మెంటు బయటికి తీసుకొచ్చి పార్కు చేసి కింద వాచ్మెన్ పిల్లలతో ఆడుకోవడమో లేదా పక్కనే కడుతున్న వేరే అపార్ట్మెంటుపనోళ్ళతో బాతాఖానీ కొట్టడమో చేస్తాడు. అదే అలవాటు మీద నేను కిందకొచ్చి చూస్తే కారు లేదు. పక్కనే ఆడుకుంటున్న వాచ్మెన్ పిల్లల్ని అడిగితే "తెలీందంకుల్" అన్నారు. ఒకరెండునిముషాలు చూసి ఏదో డౌట్ వచ్చి సెల్లార్లోకొచ్చి చూస్తే కారక్కడే ఉంది. కాస్త దగ్గరికెళ్ళి చూస్తే కార్లో భిక్షపతి సీట్ వెనక్కి వాల్చిఅర్ధశయనాసనంలో , FM రేడియో లో ఏదో పాట వింటూ చేత్తో తాళం వేస్తూ నోటితో హమ్ చేస్తున్నాడు.నేను కిటికీ దగ్గరికెళ్ళి అద్దమ్మీద నెమ్మదిగా కొట్టా..వినపడినట్టులేదు. ఈసారి ఇంకాస్త గట్టిగా..ఊహు..లాభం లేదు. అద్దమైతే పగులుతుందని కారు డోరు మీద గట్టిగా కొట్టా.. తన ఊహాలోకం లోంచిబయటికొచ్చి నన్ను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఎంతగా ఉలిక్కి పడ్డాడంటే ఆయన ఉలికిపాటు చూసి నేనూ ఉలిక్కిపడ్డా. నేను తమాయించుకోనేలోపు పనిలో పనిగా ఒక నమస్కారం కూడా పడేసాడు.

అద్దం దించమని సైగ చేసి, దించాక అడిగా.

"బండి బయటికి తీయొచ్చుగా?"

"ఒకటే ఎండ సార్, అలా అవసరం లేకుండా ఎండలో పెడితే బండి రంగు తేలుద్ది."

ఆహా బానే సమర్ధించుకుంటూన్నాడే అనుకున్నా.

నేను కార్లో కూర్చోగానే అడిగాడు.

"ఎక్కడికెళ్దాం సార్"

"ప్యారడైజ్ పోనీ"

మొట్టమొదటిసారి కాబట్టి భిక్షపతి తన కళనంతా చూపిస్తున్నాడు.చకచకా గేర్లు మార్చడం, రోడ్డు మీద ఒక ఇరవైఅడుగుల దూరం ఖాళీ దొరగ్గానే కారుని ముందుకురికించడం, మళ్ళా వెంటనే బ్రేక్, అలా తన ఇరవై ఏళ్ళ అనుభవాన్ని నాకు చూపిస్తున్నాడు. నేనడిగాను

"నువ్వుండేదెక్కడ భిక్షపతీ?"

రోడ్డునీ
, రియర్‌వ్యూ అద్దంలో నన్నూ మార్చి మార్చి చూస్తూ చెప్పాడు.
"నేనా సార్, మన అపార్ట్మెంటు నుంచి ఒక ఆఫ్ కిలోమీటర్ లోపటికెళితే ఒక బస్తీ ఉంటది సార్. ఆ బస్తీల ఉంటా సార్"

ఏది ఆ ..... బస్తీ యా?

"అవున్సార్"

ఆ బస్తీ అంటే ఆ వీధిలో అందరికి హడల్. సీయం కాన్వాయ్ అయినా అక్కడికొచ్చిందంటే స్లో గా పోవాల్సిందే. మొన్నొకసారి ఒక అభాగ్యుడు,ఆ బస్తీ గురించి తెలీనోడు, తన ద్విచక్ర వాహనం పై వస్తూ, రోడ్డుకి అడ్డంగా హఠాత్తుగా పరిగెత్తుకొచ్చిన ఒక బస్తీ పిల్లోడి బుగ్గకి కి పొరపాటున బైకు హేండిల్ తగిలించటం, ఫలితంగా వాడి బుగ్గ కందటం, ఆ పిల్లోడేసిన కేకలకి బస్తీ అంతా కదలి రావటం, వాడి జేబులో ఉన్న మూడువేలు లాక్కోటమే కాకుండా, "పోలిసుల్ని పిలుద్దాం" అని ఆవేశంలో వాడు అజ్ఞానిలా మాట్లాడే సరికి కింద పడేసి చితక తన్నడం కూడా చేసారు.

మా వీధిలో ప్రతి రెండొందల అడుగులకి ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టిన పెద్దల్ రెడ్డి కూడా ఆ బస్తీ మీద కన్నేసి, వీరి కారణంగా ఆ చుట్టుపక్కల తను కట్టిన అపార్ట్మెంటులకి రేటు పలకటం లేదని, దాన్ని కబ్జా చేద్దామని ట్రై చేసి, ప్రతిఫలంగా అదే వీధిలో ఉన్న తన సొంతిల్లు వదిలిపెట్టి ఒక రెండు వీధులవతల అద్దింటికి తన మకాం మార్చాల్సొచ్చింది.

ఏదో ఒకటి మాట్లాడాలికదా అని అడిగా.

"డ్రయివింగేనా లేకపోతె ఇంకేమయినా చేస్తుంటావా?" ఇది అడగటానికి కారణమేమిటంటే ఒక రెండురోజుల ముందు రమేష్ తనబావ ఊరికే పని పాటా లేకుండా తిరుగుతుంటాడని చెప్పడం.

"నేను కాంగ్రెస్ పార్టీల పనిజేస్త సార్"

"ఓ, నీ బామ్మర్ది బీజేపీ కదా, నువ్వేమో కాంగ్రెస్సా?"

"నేను మొదట్ల బిజెపిల ఉన్నా సార్, అదొక వేస్టు పార్టీ సార్"

"ఎందుకు వేస్టు ?"

"అదంతే సార్, ఇప్పుడు కాంగ్రెస్‌ల ఉన్నా, మంచిగుంది"

"ఎలా?"

"ఎలా అంటే ఏమున్నది సార్, చేతినిండా పని, పైగా కాస్త పైసలు గూడ మిగుల్తాయి సార్"

"ఇంతకీ ఎవరేమిటి నీ లీడరు?"

పేరు చెప్పాడు.

పేపర్లలో చదవటమే గాని, ఇలాంటీ "క్రియాశీలక కార్యకర్త"లని నేనిదే ప్రత్యక్షంగా చూడటం. ఏదైనా ధర్నా ఉన్నా, లేదా ఢిల్లీ నుంచి ఏదైనా పెద్ద తలకాయ ఇక్కడికి వస్తున్నా, లేదా ఇక్కడున్న చిన్న తలకాయలు ఢిల్లీ వెళ్తున్నా, కారణమేదైనా కానివ్వండి, ఆ అన్నకి తన బలం-బలగం చూపించాల్సి వస్తే, మొదట మా వీధిలో ఉన్న ఒక ఛోటా నాయకుడికి ఫోనోస్తుంది. అక్కడి నుంచి బిక్షపతి లాంటి వాళ్ళకి. భిక్షపతి చేసేదల్లా ఒక ముప్పై నలభై మందిని పోగేసుకొని అక్కడికెళ్ళి ఆ బుర్ర లేని తలకాయలముందు "అన్న కీ జై జై" అనడం. అలా అన్నందుకు అందరికీ బిరియానీలూ, మనిషికింతని క్యాషూ, అందులో కొంత తనుంచుకొని మిగతాది భిక్షపతి తను పోగేసుకోచ్చిన వాళ్ళకి పంచుతాడు.

మనమెవ్వరం వినని రాజకీయాలు మూడో డైమెన్షన్లో వినపడేవి నాకు భిక్షపతి ద్వారా.

ఆయన డ్రయివర్ కం పార్టీ కార్యకర్త అయ్యేసరికి నాకు కూడా లెక్కలేనన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. ముందు రోజు సాయంత్రం హఠాత్తుగా డిక్లేర్ చేస్తాడు "సార్ రేపు రాను" అని.

"ఎందుకు?"

" సీయం రేపు ఢిల్లీ వెళ్తున్నాడు, పొద్దునే షంషా బాద్ వెళ్ళాల"

"మరి నా పన్లూ?"

"అర్జెంటా సార్?"

" "

"అర్జెంటంటే చెప్పండి సార్, నాకు తెలిసినోడొకడున్నాడు వాణ్ణిపంపిస్తా"

కాదనలేకపోయేవాడిని.పక్కనుంచి మా శ్రీమతి గొణుగుడు మీఇద్దరిలో ఎవరికెవరు యజమాని అని.

ఇంకోరోజు డ్రయివింగు చేస్తూనే, ఏదో గుర్తొచ్చి, ఉన్నట్టుండి గట్టిగా అరిచాడు

"సార్ మీరీరోజు టీవీల న్యూస్ జూసిండ్రా?"

"లేదే? ఏం?"

"నేపడ్డ సార్ టీవీల"

"ఎక్కడ?"

"నిన్న మా అన్న సీయం ఢిల్లీ కెళ్ళొస్తుంటే రిసీవ్ చేస్కోని ఏర్పోర్ట్ కెళ్ళిండు, అక్కడ, అన్న పక్కనే నేనున్న, జూడ్లే?"

ఆ రోజు సాయంత్రం పనిగట్టుకొని అన్నిఛానల్స్ వెతికితే ఒకచోట దొరికాడు. అన్న ఆవేశంగా మాట్లాడుతుంటే పక్కనే నిలబడి ఉన్నాడు తమ్ముడు. అది కాదు నన్నాకర్షించింది. టీవీలో పడుతున్నాననే ఆలోచనో, అన్న పక్కనున్నాడనో లేక మరేమిటో గానీ మొహంలో భావాలేమీ లేకుండా బిర్రబిగుసుకొని కర్రలా నిలబడ్డాడు భిక్షపతి. ఇన్నిరోజులుగా తనని చూస్తున్నా నాకుమాత్రం ఆ టీవీలో చాలా విచిత్రంగా కనపడ్డాడు. అంత సీరియస్ నెస్ నేనెప్పుడూ చూడలేదు ఆయన మొహంలో. చివర్లో మాత్రం వెనక నిలబడ్డవారివైపు ( తను తరలించుకొచ్చిన మనుషులు అనుకుంటా) చూస్తూ , గుప్పిట బిగించి, చేయి పైకెత్తి ,పూనకం వచ్చినవాడిలా "అన్నజిందాబాద్" అన్నాడంతే.

ఇంకొక రోజు కాంగిరేసు పార్టీలో ఉన్న అసమ్మతి గురించిన టాపిక్ వచ్చింది మా మధ్య.

"ఇంతలా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటే మళ్ళీ ఎలక్షన్లలో గెలవద్దా?" అడిగాను నేను..

నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే ఏదో గుర్తొచ్చినట్టు అడిగాడు.

"సార్ మీకాయన తెలుసా, అబ్బ, ఆయన పేరు గుర్తుకురావటంలేదు సార్, చేగోడీలు, ఆహా కాదు...."

"చేగోడీలా, ఆపేరుతొ ఎవరున్నారబ్బా, చేగొడీలో కారబ్బూందో నాకుతెలీదు అయినా ఏమిటివిషయం?"

"ఆయన పేరు, అబ్బా, చేగొడీ, హరేరాం, హరిఓం.. ఏదో ఉంది సార్..."

"సరే, విషయం చెప్పు"

"మొన్న మేము ఆ పెద్దాయన ఇంటికి మీదకెళ్ళి రాళ్ళేసినం, పేపర్లో వచ్చింది కూడా"

నాగ్గుర్తోచ్చేసింది ఎవరి గురించి మాట్లాడుతున్నాడో..

"ఏంటీ ఆ రాళ్ళేసింది మీరేనా?నేం కూడా చదివా పేపర్లో"

"అవున్సార్, మేమే, అన్న జెప్పిండు, ఏసేసినాం"

"ఏంటీ కనీసం పేరు కూడా తెలుసుకోకుండా, అసలు విషయమేంటో తెలుసుకోకుండా వెళ్ళి రాళ్ళేసేసావా?"

"పేర్లు మనకెందుకుసార్?"

జాలి, బాధ, కోపం కలగలసిన భావమేదో నాక్కలిగిందా క్షణాన. అదెవరిమీదో కూడా తెలీదు.

పొద్దున్నే ఠంచనుగా ఎనిమిదింటికి వచ్చే భిక్షపతి ఆరోజు రాలేదు. ఫోన్ చేసినా తీయటం లేదు. నాకేమో కోపం వస్తోంది. దాదాపు పది గంటలప్పుడనుకుంటా ఎవరో వచ్చి చెప్పాడు..

"డ్రయివర్ గావాల్నా సార్, భిక్షపతి పంపాడు"

"ఆయనకేమయింది?" కోపంగా అడిగాను.

తెలీదు సార్, ఏదో అర్జెంట్ పనిమీద ఊర్ల కెళ్ళాడు.."

కనీసం ఎవర్నో ఒకర్ని పంపాడు కదా అని తాళాలిచ్చి చెప్పా.

"సరే బండి బయటికి తియ్"

భిక్షపతితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే నాకు ఆరోజు మహా బోరు గా అనిపించింది.

"రేపొస్తాడా భిక్షపతి?" అడిగాను.

"ఏమో తెలిదు సార్, కనుక్కోని చెప్తా"

మళ్ళా తనే అడిగాడు.

"రాత్రి ఎన్నింటిదాకా ఉన్నాడు సార్ భిక్షపతి మీతో?"

"దాదాపు తొమ్మిదింటికి కారు లోపల పెట్టాడు, ఏం?"

"ఏం లేదు సార్ ఊరికినే". నాకెందుకో ఏదో జరిగి ఉంటుందనే అనుమానం బలపడింది.

ఆ మరుసటి రోజు మధ్యాహ్నం డోరు బెల్లు మోగింది..

తలుపుతీస్తే భిక్షపతి. మొహం పీక్కు పోయినట్టు గా ఉండి, మనిషి నీరసంగా కనపడుతున్నాడు. లోపలికి రమ్మని, కాఫీ ఇచ్చి కాసేపు మాట్లాడి, నీరసంగా ఉన్నట్టున్నావ్, ఏమయింది అని అడిగితే "జ్వరం సార్" అన్నాడు.ఈరోజుకి వద్దులే రేపు మాత్రం కరెక్టుగా ఎనిమిదింటికల్లా రా అని చెప్పి అని చెప్పి పంపించేసాను,

ఆ మరుసటి రోజు నేను నా శ్రీమతి షాపింగుకి బయలుదేరాం. దార్లో అడిగా ఏమయింది నిజంగా చెప్పు జ్వరమేనా ఇంకేమన్నానా అని.

కాస్త తటపటాయించి చెప్పాడు..

"ఆ రోజు రాత్రి మన స్ట్రీట్ల పెద్ద గొడవయింది సార్. ఆ రాత్రీ, పొద్దుగాల పదింటివరకూ టేసన్ల ఉన్న.అన్న ఫోన్ జేసి ఇడిపిచ్చిండు "

నాకు వెంటనే గుర్తొచ్చింది ఒక మూడ్రోజుల క్రితం అపార్ట్మెంటు కింద తొమ్మిదీ తొమ్మిదిన్నర మధ్య మెయిన్‌రోడ్డు దగ్గర ఏవేవో పెద్ద అరుపులూ, కేకలూ.బాల్కనీ లో కొచ్చి చూసా కూడా ఏమయినా కనపడుతుందేమో నని.

"ఏమయింది?"

"ఎవరో పోరగాళ్ళు మీదికొచ్చారు సార్"

ఎవరు వాళ్ళు?"

మా బస్తీల్నే ఉంటారు సార్, మొన్నీ మధ్య వచ్చినోళ్ళు, నాతో పెట్టుకుంటారా, బచ్చాగాళ్ళు"


"ఇంతకీ ఏమయింది?"

"ఒకడికి తల పగల్గొట్టినా, ఇరవై కుట్లు పడ్డాయంట, ఇంకొకనికి కాలిరిచేసినా "

పేపరు చదువుతూ అప్పుడప్పుడు రోడ్డుమీద ట్రాఫిక్‌కు ని వింతగా చూస్తున్న నా శ్రీమతి కూడా పేపరు మూసేసి మా సంభాషణని వింటోంది భయ భయం గా..

నాకేమో ఆ డ్రయివింగు సీట్లో ఉన్న భిక్షపతి భిక్షపతి లా కనిపించటం లేదు, ఎవరో అపరిచిత వ్యక్తి లా కనపడుతున్నాడు

నేనడిగా, "అసలెందుకయింది గొడవ?"

"ఏదో మా బస్తీ పార్టీ గొడవలు లెండి సారు"

మళ్ళాతనే చెప్పాడు.

"ఒక నెల సందు ట్రై చేస్తున్నారంట సార్ నా కోసం ఆ పోరగాళ్ళు, చాకులు పట్టుకొని"

నాశ్రీమతీ నేనూ మొహలు చూసుకున్నాం. అభిప్రాయాలు కలవటం మాటేమో గాని, భయాలు మాత్రం మాబాగా కలుస్తాయి మాకు.

భిక్షపతి తనెప్పుడూ నమిలే ఏదొ వక్కపొడి కోసం పక్కకెళ్ళ గానే మావిడ చెప్పేసింది సీరియస్ గా,

"అదృష్టం కొద్దీ మనతో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళబడలేదు భిక్షపతి, అదేగనక జరిగితే ఆయనా, ఆయనతో పాటు మనమూ.." అంటూ ఆపేసింది.

అప్పుడర్ధమయింది నాకు, నేనెప్పుడు భిక్షపతి ని కలవడానికెళ్ళినా అతని పక్కన కనీసం నలుగురైదుగురుంటారు, బావలో బామ్మర్దులో ఇంకెవరో. ఇందుకేనన్నమాట.

అప్పటికప్పుడే ఆ రెండు నిమిషాల్లోనే తను డిసైడ్ చేసేసింది రేపట్నించి అంతగానయితే ఆటోల్లో తిరుగుదాంగాని భిక్షపతి మాత్రం వద్దు అని.

భిక్షపతి తిరిగి సీట్లో కూర్చున్నా నాకేమీ మాట్లాడాలనిపించలేదు. మావిడ ఆయనతో ఏదో కబుర్లు చెప్తోంది గానీ, నా మనసులో ఎన్నో ఆలోచనలు భిక్షపతి గురించి. తనకి ఇద్దరు పిల్లలు. వీళ్ళ స్కూలు ఖర్చులకే చెప్పలేనంత ఖర్చవుతుందని మొత్తుకునేవాడు భిక్షపతి. అగ్గిపెట్టెలాంటి ఇంట్లో నివాసం. ఈ రాజకీయాలూ, గొడవలూ ఇవన్నీ ఎందుకూ అని ఎవరైనా అనొచ్చు. కారణమేదైనా, వ్యవస్థే తప్పుదారి పడుతున్నప్పుడు దానిలోని ఇలాంటి బడుగు జీవుల్ని వేరుచేసి తీర్పిచ్చేస్తే ఎలా? అనిపించింది.

ఎవరు చెప్పొచ్చారు, రేపు భిక్షపతి వార్డు కౌన్సిలర్ కావచ్చు, అలా అలా ఇంకో పదేళ్ళకి ఎమ్మెల్యే కావచ్చు, తనలాంటి కొందరు తమ్ముళ్ళకి అన్నా కావచ్చు.

మొన్నొకసారి ఫోన్ చేస్తే చెప్పాడు "నాకేం సార్, మంచి గున్న, మీరిండియా రానీకి ఒక రెండ్రోజులముందు నాకు జెప్తే..,నే.., అదే... మన షంషాబాద్ ల పికప్ జేసుకుంటా సర్ మిమ్మల్ని"

ప్రస్తుతానికి ఇప్పటికీ నేను ఇండియా కెళితే భిక్షపతే నా కారు డ్రైవరు.

Friday, March 20, 2009

నాకు నచ్చిన మరో కథ "షోడానాయుడు"

నాకొక స్నేహితుడున్నాడు. వాడూ నేనూ ఏడవతరగతి వరకూ కలిసే చదువుకున్నాం. ఆ తరువాత వాడికి చదువు అబ్బదు అని అనుకున్నాడోఏమో, వాళ్ళ నాన్న తనని ఒక "మేస్త్రీ" దగ్గర టైలరింగు పనిలో కుదిర్చాడు. ఇంటర్ తరువాత ఎంసెట్ రాసి అందరం చెల్లాచెదురైన తరువాత మా వూళ్ళో ఉన్న నా ఏకైక స్నేహితునిగా మా స్నేహం ఇంకా బాగా కుదురుకొంది. ఇంజనీరింగు చదివేటప్పుడు హైదరాబాదు నుంచిఎప్పుడొచ్చినా, ఆ వచ్చినరోజు సాయంత్రం మా వాడి టైలరింగు షాపులో హాజరు వేయించుకోవలసిందే. దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ఆరింటినుంచి రాత్రి పదింటికి కొట్టుకట్టేసే వరకు అక్కడే నా మకాం. నాకుతెలీని కొత్తలోకం పరిచయమయ్యేది నాకక్కడ. పక్కనున్న ఫ్యాన్సీ షాపులూ,హార్డువేరు షాపులూ,బంగారం కొట్లలో పనిచేసే కుర్రోళ్ళు మావాడితో బాతాఖానీ వేస్తుంటే నేను ఒక చెవి అటుంచి అన్నీ వింటుండేవాడిని. ఆ మాటలు చాలావరకు వాళ్ళ వాళ్ళ "సేట్ల" మీద కంప్లయింట్లూ, వ్యంగ్యపూరిత వ్యాఖ్యానాలు లేదా సినిమా ముచ్చట్లు. మావాడికి మాత్రం టైలరింగే లోకం. మేమెప్పుడు కలిసినా తన టైలరింగు గురించిన ప్రస్తావన రాకుండా ఉండదు. అన్నీ ఏకరువు పెడుతూ అప్పుడప్పుడు హైదరాబాదుకి ఉత్తరాలు కూడా రాసేవాడు.వాటిల్లో చాలా వరకు కష్టాలే. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని మంచి వార్తలు.ఊళ్ళొ కాంపిటీషనెక్కువైపోయిందంటాడు.పనోళ్ళు దొరకటంలేదు, దొరికినా ఒక సంవత్సరం పనిచేయగానే సొంతగా దుకాణాలు పెట్టుకుంటున్నారంటాడు. ఈ సంవత్సరం సంక్రాంతికైన బిజినెస్ ఉగాదికి కాలేదంటాడు.మన టౌనుల్లో కూడా రెడీమేడ్ దుకాణాలొచ్చిమా పొట్టకొడుతున్నాయంటాడు.ఇంకా అలాంటివే. ఏం మాట్లాడుకున్నా తిరిగి తిరిగి అవి తన టైలరింగు కష్టాల దగ్గరికొచ్చి ఆగేవి.నేను హైదరాబాదు కెళ్ళాక రెడీమేడ్ దుస్తులు అలవాటయి, ఎప్పుడైనా అవేసుకొచ్చి చూపిస్తే, వాటిల్లోని లోపాలని ఒకదాని తరువాత ఒకటి ఏకరవు పెట్టేవాడు. ఫిట్టింగు సరిగాలేదనేవాడు, లేదా ఇంకేదో పిస్తా,గిస్తా, అంటూ టైలరింగు భాషలో ఏదేదో చెప్పేవాడు. అన్నీ బాగుంటే కనీసం వాటిని కుట్టడానికి నాసిరకం దారం వాడారు అని తన కసి తీర్చుకొనేవాడు. రెండుతుకుల్లో ఈ గుండీలు ఊడి చేతికి రాకపోతే నాపేరు మార్చుకుంటా అని సవాళ్లూ విసిరేవాడు. నేను నొచ్చుకోకపోగా చాలా ముచ్చటపడేవాడిని తన ఎనాలిసిస్ విని.

ఈ మధ్యనే నెమలికన్ను మురళిగారు నాకు పంపిన శ్రీరమణ విరచిత "షోడా నాయుడు" కధ చదవాను. ఆ కధలో షోడానాయుడి గురించి చదవగానే పైన చెప్పిన స్నేహితుడే గుర్తొచ్చాడు. గుర్తుకు రావడం వరకే లెండి. అంతకుమించి ఈ కధకీ తనకీ పోలికలేమీ లేవు.

ఈ కధలో షోడా నాయుడికి సోడాలే లోకం. తనదైన చిన్ని లోకంలో జీవిస్తూ, విలువల్ని కాలదన్నక, అంతలోనే కొద్దిపాటి లౌక్యం ప్రదర్శిస్తూ సోడాలమ్ముకొని బ్రతుకు నెట్టుకొస్తుంటాడు.బంగారు మురుగు కధలోలానే బాల్యం నుంచి పెరిగి పెద్దవుతూ కధానాయకుడు తనగురించీ, తనెరిగిన షోడానాయుడి గురించీ చెప్పుకుంటూ కథ ముందుకు సాగుతుంది. కథ చివర్లో మనసును మెలిపెడుతుంది కూడా.

ఇక కధ గురించి. మన కధానాయకునికి చిన్నప్పుడు గోళీల పిచ్చి. తన దగ్గర అన్నిరకాల గోళీలున్నా తన దృష్టంతా సోడాల్లో ఉండే నీలం రంగు గోళీ మీదే. తన మిగతా స్నేహితుల దగ్గరున్నట్లు తనదగ్గర కూడా నీలం గోళీ ఉంటేనే తనకీ, తన ఉనికికీ సార్ధకం. ఆ గోళీ ఒక్కటి సంపాదిస్తే చాలు తనుకూడా తన స్నేహితుల దగ్గర సగర్వంగా తలెత్తుకొని తిరగొచ్చు. అప్పుడు మొదలవుతాయి మనవాడి తిప్పలు. ఆ నీలం గోళీ సంపాదించటానికి సోడాలమ్ముకొనే "షోడా నాయుడి" ప్రాపకం సంపాదించడానికి తను పడ్డ కష్టాలు, చివరికి దాన్ని సంపాదించకుండానే తన చదువుకోసం తన ఊరొదిలి వైజాగ్ వెళ్ళాల్సి రావటం, ఎదిగే కొద్ది జీవితం అంటే ఏమిటో అర్ధం కావడం, జీవితంలో నిలదొక్కుకొని ఒక ఆఫీసరవడం, చివరికి తను చిన్నప్పుడు నీలం గోళీ కోసం ఏ షోడా నాయుడి వెంట పిచ్చిగా తిరిగాడో అదే షోడా నాయుడు లోను కోసం తనని కలవటం, కలవటానికి వస్తూ గుర్తుపెట్టుకొని మరీ గుప్పెట నిండా నీలం గోళీలు తేవటం, ఎంతైనా పెద్ద ఆఫీసరు కదా ఇవ్వచ్చో ఇవ్వకూడదో అని సతమతమవటం. మనసుకి హత్తుకొనే కధ.


తన చిన్నప్పటి తాపత్రయాన్ని ఇప్పటిదాకా పదిలంగా గుర్తుంచుకొని, తనెప్పుడో వదిలి వచ్చేసిన లోకానికి తనని మళ్ళా తీసుకెళ్ళడం, ఒకప్పుడు ఈసడించిన ఆ చేత్తోనే గోళీలు ఇవ్వాలా వద్దా అని షోడానాయుడు సతమతమవటం మనసుని కదిలిస్తుంది.

"మారింది సామాజికపరంగా నా అంతస్తూ,హోదా మాత్రమే, నేను కాదు, నేనప్పటి మనిషినే" అని అరిచి గీపెట్టాలనిపిస్తుంది మనసున్న వారికెవరికైనా ఇలాంటి సందర్భాలు నిజజీవితంలో ఎదురైతే.


తిలక్ కధల్లోని మనస్తత్వ చిత్రణలూ, ప్రకృతి వర్ణనలూ నన్నాకట్టుకున్నట్టే శ్రీరమణ గారి కధల్లో ఉండే వర్ణనలూ, పాత్రలూ, వాటి తీరుతెన్నులూ నాకు చాలా నచ్చుతాయి. కథలో ఉదహరించిన వాతావరణానికి కొద్దిపాటి పరిచయముండాలే గాని,ఈ కధ చదువుతుంటే ప్రతి సన్నివేశం కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా, చాలా సహజంగా ఉండి, చేయి పట్టుకొని మనల్ని ఆ కధాకాలానికి తీసుకెళ్ళినట్లుగా ఉంటుంది. మంచి కథ . దొరికితే తప్పక చదవండి.


Friday, March 6, 2009

ఈ రోజేమీ బాలేదు

రోజేమీ బాలేదు నాకు.

పొద్దున్నే ఎందుకో బాగా ముందే మెలకువొచ్చింది. ఐదున్నరకి లేచా. ఆఫీసు పనేదో గుర్తొస్తే కాసేపు అది చూసుకున్నా. సడన్ గా రాత్రి మూడుగంటలప్పుడో, నాలుగ్గంటలప్పుడో, నా ఆఫీసు బ్లాక్ బెర్రీ "కుయ్ కుయ్" మన్నప్పుడు లేచి చూసుకున్న జీమెయిలు మెసేజీలు గుర్తొచ్చాయ్. జీ మెయిల్ ఓపెన్ చేసి చూస్తే నేను కొత్తగా రాసిన టపా కి కొన్ని కమెంట్లున్నాయి.అందరికీ రిప్లయిలిచ్చేసాను. దాదాపు అందరు నే సగం రాసి ఆపేసిన టపాని తిట్టుకొని, మర్యాదగా హెచ్చరించారు, తరువాయి భాగం త్వరగా రాయమని.

నేను బ్లాగుల్లో కొన్నిసార్లు ఏదైనా టపా ఓపెన్ చేసినప్పుడు టపా మరీ పేజీలకు పేజీలుంటే చదవకముందే నీరసపడిపోతాను. అయినప్పటికీ వాళ్ళు అంతకష్టపడి రాసినప్పుడు చదవకపోతే నాకే పాపం అని ఓపిగ్గా చదివి కమెంటేస్తా. అందుకే నాకు పెద్ద పెద్ద టపాలు రాయాలంటే చాలా భయం.అప్పుడప్పుడు మూడ్ బావున్నపుడు రాస్తూ ఉంటే ఆలోచనలు అలా ఆలా వస్తూ ఉంటాయి .వాటికి న్యాయం చెయ్యాలి అనిపించి, తద్వారా టపా సైజు పెరుగుతూ పోతుంది. అప్పటికీ రాసిందంతా మళ్లా చదువుకొని, మార్పులు చేర్పులు చేసి, అసందర్భం అనిపించినవన్నీ తీసేస్తా. అయినా కొన్నిసార్లు టపా సైజు నా అదుపులో ఉండదు.నేన్నిన్న కొత్తగా రాసిన టపా కూడా కారణంతోనే మధ్యలోనే ఆపేసి, అంతకుముందు అనుకున్న శీర్షిక మార్చి, అయిష్టంగానే పబ్లిష్ బటన్ నొక్కాను.

ఏదయితేనేం, బోలెడు బ్లాగు వర్కు పెండింగుంది నాకు. ఆల్రెడీ నెమలికన్ను మురళి గారు తనకి బాకీ ఉన్న టపా గురించి హెచ్చరించారు. అది రాయాలి. పైగా నిన్నరాసిన టపా పూర్తీ చెయ్యాలి. సరే ప్రయత్నిద్దాం అనుకుంటుండగా ఇంతలొ భాస్కర్ గారు రాసిన "దూడజచ్చింది " టపా నా కళ్ళబడింది. నా బాల్యంలో మా ఇంట్లో చనిపోయిన దూడలు గుర్తొచ్చి మనసు బాధగా మూలిగింది. అక్కడ ఒక కమెంటు రాసి,ఆఫీసుకి రెడి అయ్యి,ఏదో తిన్నాననిపించి,లంచ్ బాక్స్ , ఆఫీస్ బ్యాగ్ తీసుకొని ఆఫీసుకి బయలుదేరా. ఆఫీసు ఇంటికి పదిమైళ్ళ దూరం.ఒక ఆరు మైళ్ళు హైవే, ఒక నాలుగు మైళ్ళు లోకల్ రోడ్డు ప్రయాణం . హైవే పై ట్రాఫిక్ చాలా స్లో గా ఉంది. చాలా అసహనంగా డ్రైవ్ చేశా.లోకల్ రోడ్డు ఎక్కాక అలవాటు ప్రకారం ప్రతి గ్యాస్ స్టేషన్ లో ధర ఎంతుందో చూసుకుంటూ వస్తున్నా. ఇంకొద్ది దూరంలో గేటులేని రైల్వే ట్రాక్ వస్తుంది.అది దాటి ఎడమవైపు తిరిగి ఒక రెండు మైళ్ళు వెళ్తే అక్కడే మా ఆఫీసు. భాస్కర్ గారి టపా ప్రభావం నా బుర్ర మీద ఇంకా ఉన్నట్లుంది. శుక్రవారం అయినా ఎందుకో అంత సంతోషంగా లేను.

ఇంకొక్క రెండు సెకన్లలో రైల్వే గేటు దాటుతాననగా జరిగిందీ సంఘటన.

ముందు నా కారు కుడివైపున రోడ్డు పక్కన ఏదో కదిలినట్టనిపించింది. స్పీడ్ లిమిట్ 45 అయినా దాదాపు 55 మీద వెళ్తున్ననాకు మొదట అదేమిటో అర్ధం కాలేదు.రోడ్డు మీంచి దృష్టి మరల్చి పరీక్షగా చూస్తే ఉడత. ఆ స్పీడులో బ్రేక్ వేసి ఆపటం కల్ల. అప్పటికీ కాలు గేస్ పెడల్ మీంచి బ్రేక్ మీదికి మార్చేలోపే అది నా కుడివైపు ముందు చక్రం దాటి వచ్చేసింది.అంతకు మించి నాకేం కనపడలేదు. తరువాత ఏదో చిన్న శబ్దం. షాక్ నించి తేరుకొని టక్కున రియర్ వ్యూ అద్దం లో చూస్తే ఉడత పాపం రోడ్డుమీద పడుంది. సందేహం లేదు. అది నాకారు కింద పడ్డ ఉడతే. ఇంకో రెండు సెకన్లలో అది నా మిర్రర్ నుంచి కూడా అదృశ్యం అయిపొయింది.

ఒక్క క్షణం నా మెదడు మొద్దు బారి నట్టయింది. ఇంతకు ముందెప్పుడైనా ఇలా ఏవైనా నా కారుకింద పడి ఉండవచ్చేమో గాని, నాకు తెలిసి తెలిసీ, నేను చూస్తుండగా, జరగటం ఇదే ప్రధమం. షాక్ నుంచి తేరుకోగానే ,"జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు" అని నన్ను కన్విన్స్ చేసే పనిని చేపట్టింది నా మనసు.నా మనసు చెప్పిన మొదటి కారణం,అది నేను కావాలని చేసిన తప్పు కాదు అని. తరువాత దానికొచ్చిన రెండో ఆలోచన, స్పీడ్ లో అంత తక్కువదూరంలో బ్రేక్ వేసి కారు ఆపటం అనేది మానవమాత్రులకు అసాధ్యం.

"అప్పటికీ నువ్వు బ్రేక్ వేసి ఆపటానికి ప్రయత్నించావు కూడా ". బింకంగా కారణాలు వెతుకుతోంది నా మనసు.

నా ఈ ఆలోచనా పరంపరకి కొద్దిపాటి విరామం దొరకగానే నాకు వెంటనే ఘంటసాల భగవద్గీత గుర్తుకొచ్చింది. నాకు వేరే భగవద్గీతలు తెలీవు. తెలిసింది ఘంటసాల భగవద్గీతొక్కటే. చావు కబురు విన్నా దాని తాలూకు షాక్ నుంచి బయటపడగానే నాకు వెంటనే భగవద్గీతే గుర్తుకొస్తుంది. ముఖ్యంగా "పుట్టిన వానికి మరణము తప్పదు" అనే వాక్యం. నిజానికి సమయంలో నాకు సాంత్వన కలగజేసేది గీతే.

అయినా దాదాపు రోజూ ఇలా రోడ్డు మీద వాహనాల కింద పడి చనిపోయిన ఉడతల్ని, తొండల్ని చూడ్డం నాకు కొత్తేం కాదు. కాని ఇది నా కారుకింద, అందునా నా కళ్ళ ముందు జరిగే సరికి తట్టుకోలేక పోతున్నాను. ఇంతటితో నా ఆలోచనలు ఆగిపోతే నేను అదృష్టవంతుని కిందే లెక్క. కానీ అలా జరగలేదు.

అన్ని జీవుల్లాగే తను కూడా పాపం ఊహించి ఉండదు ఈ రోజిది జరగబోతోందని. పొద్దున్నేనిద్ర లెగవగానే రోజూ ఎప్పటిలా తనకి బాగా ఆహారం దొరకాలని అనుకొనుంటుంది. కాని ఇలా నా కారు కింద పడాలని రాసిపెట్టుందని దానికి తెలీదు. అవును ఇంతకీ అది పెద్ద ఉడతా ? పిల్ల ఉడతా? ఏదయితేనేం?ఒకవేళ పెద్ద ఉడుతయితే పిల్ల ఉడతలు ఎంతలా ఎదురు చూస్తుంటాయో కదా ఇంకా తిరిగి రాలేదని? పిల్ల ఉడుతయినా అదేపరిస్థితి. ఇంకా ఇంటికి రాని పిల్ల కోసం పెద్దుడత ఎంతలా ఎదురు చూస్తుందో కదా? అవునూ, ఉడతలలో ఫ్యామిలి కాన్సెప్టుందా? డిస్కవరీ లో, నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో చాలా జంతువుల గురించి చూసా గాని, ఉడతల గురించి ఎప్పుడూ చూసిన గుర్తు లేదు.

ఆఫీసు కొచ్చినా అదే ఆలోచన. ప్రతిజీవికీ ఆత్మ ఉంటుంది కదా. అలా ఉడత ఆత్మ ఇప్పుడు నన్నే చూస్తుందేమో?నా టేబిల్ ని పరికించి చూసాను. ఒక పక్కగా ఫోను, పక్కనే నా కాఫీ మగ్, దానిముందు ప్లాంటర్స్ వేయించిన జీడిపప్పు, నా ఎదురుగా నా లాప్టాప్, కుడివైపు మౌస్ పేడ్, మౌస్, పక్కన నా రెండు సెల్ ఫోన్లు. అదిగో అక్కడ టేబిల్ చివర్న, అక్కడ నిలబడి నావైపే చూస్తోందేమో దీనంగా, ఎందుకిలా చేసావ్ అంటూ?

ఏనిమేషన్ సినిమాల్ని విపరీతంగా అభిమానించే నాకు , ఒక్కసారి దాని అమాయకపు మొహాన్ని ఊహించుకోగానే మనసు భారమయింది.

ఆఫీసు పని మీద మనస్సు లగ్నం కావటం లేదు. ఆలోచన మళ్లీ మొదటికొచ్చింది. అస్సలు కరెక్ట్ గా టైములోనే నా కారు అక్కడికెందుకు రావాలి? ఒక రెండు సెకన్లు ముందో వెనకో వచ్చుంటే ఎంత బాగుండేది. అసలే స్పీడ్ లిమిట్ కి ఐదు మైళ్ళు ఎక్కువ వేగం తో వెళ్తా నేనెప్పుడూ. అంతకు మించిన వేగం నాకే ప్రమాదకరం.సో, ముందు రావటం కంటే , స్లో గా , లేట్ గా వచ్చుంటే బాగుండేది.

ఒక్కసారి పొద్దున్న జరిగిందంతా స్లో మోషన్ లో రివైండ్ చేసుకున్నా..

నిజానికి నేను ఆఫీసు కి బయలు దేరేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని సగం మెట్లు కిందకి దిగి అంతలోనే, ఇంకా నిద్ర లేవని శ్రీమతి గుర్తుకు వచ్చి, మళ్లా పైకి బెడ్రూం లోకెళ్ళి , ఒకవేళ తను లేచి ఉంటే "వెళ్ళొస్తా" అని చెప్దామని చూసా. తనింకా నిద్ర లేవలేదు. సరే అనుకోని, కిందకొచ్చాక అప్పుడు గుర్తొచ్చింది, లంచ్ బాక్స్ ని ఇందాక పైకెళ్ళినప్పుడు డైనింగు టేబిల్ మీద పెట్టి మర్చిపోయానని. మళ్ళా ఉసూరుమంటూ వెళ్లి దాన్ని తీసుకొని బయలుదేరా. ఎవరో చెప్పారు వింటర్ లో కారు స్టార్ట్ చేసాక ఇంజన్ వేడెక్కే దాకా కాసేపు గాలి,వెంటనే బయలుదేరకూడదు అని. కాని ఈరోజు ఎనిమిదిన్నరకి మీటింగు ఉంది, దానికి కాస్త ప్రిపేర్ అవ్వాల్సి ఉండటంతో వెంటనే బయలుదేరా. హైవే మీద కూడా ఎవ్వరూ దారివ్వక పోవటంతో వాహనాలను ఓవర్ టెక్ చెయ్యటానికి అక్కడక్కడ స్పీడ్ 80 దాటాల్సోచ్చింది. అలా ఎన్నడూ చేయలేదు. ఎందుకంటే బోడి ఆరు మైళ్ళలో నేనీ తతంగాలన్ని చేసేసరికి నేదిగాల్సిన ఎగ్జిట్ వచ్చేస్తుంది. పైగా ఈరోజు లోకల్ రోడ్డు లో ఒక చోట " No right on red" లో వాహనాలేమీ రావట్లేదు కదా అని టర్నింగు తీసేసుకున్నా. లోకల్ రోడ్డు మీద కొన్ని చోట్ల స్పీడ్ లిమిట్ 35, మరి కొన్ని చోట్ల 45 ఉంటుంది. నేను అన్నిచోట్లా అనుమతించిన దానికన్న పది మైళ్ళు ఎక్కువ వేగం తోనే వెళ్ళా. ఇన్ని చోట్ల నా రోజువారీ దినచర్యనీ, అన్నిటికీ మించి చట్టాన్నీ అతిక్రమించాను కాబట్టి నేరం నాదే అనిపిస్తోంది. వీటిల్లో ఒక్కదాన్ని నేను తద్విరుద్ధంగా చేసుంటే ఆ ఉడత పాటికి తనకి దొరికిన వేరుశనగపప్పు నో , చెట్టు మీంచి పడ్డ కాయనో తింటూ హాయిగా ఉండేది కదా?

జరిగిందేదో జరిగిపోయింది. నేనింటి కెళ్ళాలంటే వేరే దారి లేదు. ఇదొక్కటే దారి. ఇకనుంచి రోజూ అక్కడికి రాగానే నాకా అభాగ్యజీవి గుర్తుకు రావడం తధ్యం. రోజుకు రెండు సార్లు X ప్రాజెక్టు ఉన్నన్నాళ్ళు. ఇది గాక నేనెప్పుడూ ఇష్టంగా చూసే ఏనిమేషన్ సినిమాల్లో ఉడత క్యారెక్టర్ ఉంటే బహుశా అది ఎంత మంచి సినిమా అయినా ఎంజాయ్ చెయ్యలేనేమో.

రోజేమీ బాలేదు నాకు.
Thursday, March 5, 2009

కారు డ్రైవర్ల కథ

ప్రతిఒక్కరికీ జీవితంలో ప్రతి దశలోనూ వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. కొత్తగా వచ్చిన భార్య కావచ్చు.ఇప్పుడే ఈలోకం లోకొచ్చిన మీ బుజ్జి పాపో, బాబో కావచ్చు. ఇవేమీ కాకపోతే ఆఫీసులో మన బాసు కావచ్చు.లేదా ఇంకెవరైనా కావచ్చు. వీరిలో కొంతమందితో రోజూ మాట్లాడక పోయినా,వారితో వ్యవహరించేటప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటాం. నా దృష్టిలో వారందరూ వీఇపీలే. అలానే నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడున్నన్నాళ్ళూ నాకొక వీఐపీ ఉండేవాడు. వుత్తి వీఐపీ కాదు, వీవీఐపీ అన్నమాట.ఎవరో కాదు మా కారు డ్రైవర్. పేరు భిక్షపతి. గత మూడేళ్ళుగా నేను నా ఇండియా ప్రయాణం టికెట్లు కన్ ఫం చేసుకోగానే, ఆ వెంటనే చేసే పని మా అన్నయ్యద్వారా భిక్షపతి కి కబురు పెట్టడం. "స్టార్ట్ ఇమ్మిడియట్లీ" లాగా "భిక్షపతి అవైలబుల్" అన్న హామీ మా అన్నయ్య ఇవ్వందే నాకు ఇండియా వెళ్తున్నానన్న ఆనందపు క్షణాలు మొదలవ్వవు. అ హామీ లభించక ఆ ఆనందాన్ని కొన్ని రోజులపాటు వాయిదా వేసుకున్న సందర్భమూ ఉంది .

స్టాక్ మార్కెట్లో ఒక షేరుంటుంది, నిక్కుతూ నీలుగుతూ ఎక్కడో పదిహేను,ఇరవై మధ్య. ఏ మహానుభావుడు ఏ క్షణాన ఏ మీట నొక్కుతాడో గానీ అది అరవై, డెబ్బై, అలా అలా పెరుగుతూ రెండొందల పైచిలుకు చేరుకుంటుంది. ఈలోపు జనాలు దాన్ని వేలం వెర్రిగా కొనేస్తారు. ఆ తరువాతెప్పుడో అది కొండదిగి, కొంత మంది ఆత్మహత్యలకీ, కాపురాల్లో కలహాలకీ , ఇంకదేనికో దారి తీస్తుంది. నా దృష్టిలో అలా షేర్లలా కొండెక్కి , దిగకుండా ఇప్పటికీ అక్కడే తిష్టవేసుక్కూచ్చున వర్గం అంటే ఈ డ్రైవర్లే. ఒకప్పుడు మా వాడికి డ్రైవింగు వచ్చు, ఎక్కడైనా పనికి కుదిర్చి పెట్టండి అని అడిగేవాళ్ళు. ఇప్పుడాసీను ఏదైనా సినిమాలో పెడితే "అబ్బే అతకలేదు" అనేస్తాం మనం. అంత డిమాండు ఈ డ్రైవర్లకి. ముఖ్యంగా హైదరాబాదులో. (మిగతా వూళ్ళ సంగతి నాకు తెలీదు సుమా).

నేను ఇండియాలో పనిచేసేటప్పుడు అందరూ ముందు ఇల్లు కొనుక్కొని ఆ తరువాత కారు కొంటుంటే, నేను రివర్స్ గేర్ లో ముందు కారు కొని, ఆనక డబ్బుల్లేక ఇల్లు కొనేపనిని నిరవధికంగా వాయిదా వేసాను. దెప్పనివాళ్ళులేరు. అవొక గడ్డురోజులు. ఏంచేస్తాం, వాళ్ల కామెంట్లు విని, విననట్టు నటించి, ఊరుకొనేవాడిని. ఎవరితోనైనా మాటల్లో ఆ టాపిక్కు రాగానే, "ఆ! చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటి, దానికి డైరట్రెవరు?" అని టాపిక్కు మార్చడానికి విఫల ప్రయత్నం చేసేవాడిని.

అదేంటో నేను కారుకొన్న ఆ టైములోనే మన నారా వారి పుణ్యమాని హైదరాబాదు ముఖచిత్రం మారనారంభించింది. లంగా వోణీ వేసుకున్న పదారణాల తెలుగుపిల్ల లాంటి హైదరాబాదు, అరంగుళం మందాన అద్దుకున్న పౌడరూ, లిప్ స్టిక్కూ, టైటు జీన్సూ, టి-షర్ట్ లతో హైటెక్కు సింగారం అందుకుంది. చేతక్ స్కూటర్లూ, దానిమీద సీ.ఆర్.పీ.ఎఫ్ పోలీసుల తరహా గుండ్రటి హెల్మెట్లు పెట్టుకొనే అంకుళ్ళూ,నేరుగా అఫ్జల్‌గంజ్ వెళ్ళి అక్కడితో ఆగకుండా, అలానే సాలార్జెంగ్ మ్యూజియం లోకెళ్ళిపోయారు.ఇప్పుడంతా ఫాస్ట్.నూటయాబై,రెండొందల సీ.సీ బైకులూ, వాటికి డిస్కు బ్రేకులూ,వినగానే పక్కన బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడి,కాళ్ళూచేతులూ స్వాధీనం తప్పేలా చేసే రకరకాల హారన్లూ,వీటన్నిటికీ మించి ప్రతి ఒక్క టూవీలర్కీ నాలుగు కార్ల నిష్పత్తిలో ట్రాఫిక్.నాకంటే నా పక్కవాడిగురించి ఎక్కువగా పట్టించుకునే నా మనసుకి ఇది చూసి చాలా కష్టమేసింది. కష్టం కాదు, బాధ. బాధ కాదు,భయం (ఈ చివరిదే కన్ ఫం చేసుకోండి). ఈ భయం నా బుర్రలోంచి నా చేతుల్లోకీ, కాళ్ళలోకి ప్రవేశించి, నేను కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నన్ను దాటుకెళ్తున్న ప్రతివాళ్ళూ, ఎవడ్రా వీడు అని కొంతమంది ఆసక్తితోనూ, మరికొంత మంది అసహనంతోనూ, ఇంకొంత మంది కోపంతోనూ నావైపు చూసేలా చేసింది. అప్పటికీ పట్టించుకోలేదు. కానీ ఆ చూసేవాళ్ళలో కొంత మంది అమ్మాయిలుండేసరికి నా బ్రహ్మచారి హృదయం తట్టుకోలేకపోయింది. ఆ చూసే అమ్మాయి ఎంత అందంగా ఉంటే బాధ అంత ఎక్కువగా ఉండేది. అది కొన్ని క్షణాల పరిచయమే కావచ్చు, కానీ ఆ పరిచయం ఇలానా? ఈ విధంగానా?

"వాడు వీడే కదూ" అని జనాలు (అంటే అమ్మాయిలు) నన్ను షాపింగు మాళ్ళలోనో, మా కాలనీ కిరాణా కొట్లదగ్గరో గుర్తుపట్టకుండా ఉండాలంటే డ్రైవర్ని పెట్టుకోవడమొక్కటే ఉత్తమం అనిపించింది. అంతే!సడన్ గా మా అపార్ట్మెంటు వాచ్ మెన్ , దానెదురుగా టీ బండి పెట్టుకున్న యాదయ్యా, మా ఇంటికి అవసరమైనప్పుడు వెచ్చాలు తెచ్చిపెట్టే అబ్బాయీ నా ఫ్రెండ్సయ్యారు. వాళ్ళందరికీ చెప్పి పెట్టా, ఒక మాంఛి కత్తి లాటి డ్రయివర్ కావాలి తెలిసినవాళ్ళుంటే చెప్పండి అని. మా సంగతి బాగా తెలిసిన యాదయ్య టీ బండి కంటే ఇందులోనే కాస్త ఎక్కువ డబ్బులు మిగుల్తాయని లెక్కలేసుకొని, ఒకానొక శుభముహుర్తాన,తను తన టీ బండిని మూసేస్తున్నట్టూ, తను పలానా వాళ్ళదగ్గర డ్రయివర్ గా చేరబోతున్నట్టూ,ముందు వీధిలోవారందరికీ చెప్పి,చివరగా నాకు చెప్పేడు. యాదయ్య టీ బండి మూసేసి మరీ నా దగ్గర డ్రయివర్ గా చేరతానంటే నాకెందుకో నిజంగానే భయమేసింది. అప్పటివరకు కుటుంబ బాధ్యత మాత్రమే తెలిసిన నాకు ,మొట్టమొదటి సారిగా ఏదో"సామాజిక బాధ్యత" నామీదపడ్డట్టు సెంటిమెంటు ఫీలయ్యాను. సదరు యాదయ్య, అంతగా నా దగ్గర పని నచ్చకపోతే ,దాన్ని మానేసి, ఒక రెండుగంటల్లో తన టీ బండిని "రీ-ఓపెన్" చెయ్యగల సమర్ధుడని ఊహించలేకపోయాను.

అలా యాదయ్య పనిలోచేరాడు. మొట్టమొదటిరోజు యాదయ్య పొద్దున్నే ఎనిమిదింటికి మా ఇంటి తలుపు తట్టి, తలుపు తియ్యగానే,ఒక నమస్కారం పెట్టి, "కారు తాళాలియ్యండి సార్, మీరొచ్చేలోపు కారు బయటపెట్టి, దుమ్ము దులిపి, అద్దాలు శుభ్రం చేస్తా" అన్నాడు. అప్పుడు కారు తాళాలు అతనికందిస్తూంటే, ఎన్నో యేళ్ళ నుంచి నే పడుతున బాధ గుండెలమీదినుంచి దిగిపోయిన ఫీలింగ్( అప్పటికి నా కారు కొని మూణ్ణెల్లే ). ఇక రోజూ బయటికెళ్ళినప్పుడల్లా నేను ఆ ట్రాఫిక్కులో వొడుపుగా గేర్లు మార్చే యాదయ్య నైపుణ్యానికి ఆశ్చర్యపోయేవాడిని. అదేమిటో యాదయ్య ఫస్ట్ గేర్‌లో నడుపుతుంటే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇంజను ఆగిపోలేదు. నాకెప్పుడూ అలా కాలేదు. నేనైతే ఫస్ట్ గేర్‌లోకి రాగానే రియర్ వ్యూ అద్దం చూస్తా వెనక బకరాలెవరున్నారా అని.

నాదగ్గర పనిలోకి చేరిన ఉత్సాహం ఒకనెల జీతం తిసుకొనే సరికి ఆవిరయ్యింది యాదయ్యకి. ఆదాయం బానే ఉంది.కానీ, రోజూ గంటలకొద్దీ అలా ఏ పనీ లేకుండా నాకోసం వెయిట్ చేస్తూ గడపాలంటే మాపెద్ద కష్టమయింది యాదయ్యకి. పొద్దున్నే నా ఆఫీసు పార్కింగులో కారు పార్కు చేస్తే మళ్ళా సాయంత్రం ఏడింటికే తీయటం. అదే టీ బండి దగ్గర ఎంత సందడిగాఉండేది? రోజంతా ఎవరో ఒకరు పక్కన ఉంటూనే ఉంటారు మాట్లాడడానికి. రాజకీయాలూ,పక్కనున్న బస్తీలో రోజూ జరిగే యవ్వారాలూ, సినిమాలూ.. అబ్బో రోజు ఇట్టే గడిచిపోయేది.ఇలా పనీ పాట లేకుండా రోజంతా రికామీ గా కూర్చోవటం కష్టమయింది యాదయ్యకి. అంతే ఒక ధృఢనిశ్చయానికొచ్చేసాడు. నాకు డ్రయివింగు నేర్పి, "నా" కారుకి "తన" వారసుణ్ణి తయారుచేసి, అప్పుడు పని మానుకోవడం. ఇదీ యాదయ్య తీసుకున్న నిర్ణయం. తనలో ఈ రకమైన అసంతృప్తిని గమనించే నేను యాదయ్యకి నెల జీతం గాక అప్పుడప్పుడు వాటికీ వీటికని డబ్బులు బానే ఇస్తూ ఉండేవాడిని. డబ్బు అన్నిటికీ సమాధానం కాదు సార్ అని సింబాలిక్ గా చెప్పేసాడు యాదయ్య, ముభావంగా ఉండటంద్వారా.

ఒకానొక రోజు, సాయంత్రం నాలుగ్గంటలప్పుడు వనస్థలి పురం బయలుదేరాము కార్లో. ఎల్బీ నగర్ దాటగానే చాయ్ తాగుదామని కారు పక్కన అపమన్నాను. ఆ పక్కనే ఉన్న హోటల్లోకెళ్ళి రెండు చాయ్ లు తిసుకొచ్చాడు యాదయ్య. ఇద్దరం చాయ్ తాగుతున్నాం, ఇంతలో హఠాత్తుగా అన్నాడు యాదయ్య

"సార్, ఇక్కణ్ణుంచి మీరు నడపండి బండి"

నాకు పొలమారినట్టయింది. స్కూళ్ళు వదిలిన సమయం. ఎటుచూసినా ఆటోలూ, సెవెన్ సీటర్ ఆటోలూ, స్కూలు బస్సులూ, సైకిళ్ళ మీదవెళ్ళే పిల్లలూ, కుటుంబాన్నంతా ఎక్కించుకొని బైకులమీద, స్కూటర్లమీద సర్కస్ విన్యాసాలు చేస్తున్న అంకుళ్ళూ, ఇంతలోనే భీకరంగా హారన్ కొడుతూ దూసుకొచ్చే సిటీ బస్సులూ.. శనివారం నాటి చిలుకూరు టెంపుల్ లెవల్లో ఉంది రద్దీ.

తమాయించుకొని చెప్పా.

"ఇప్పుడు కాదులే, ఇంకెక్కడైనా ట్రాఫిక్ లేని చోట నడుపుతాలే"

"రోడ్డు సాఫ్ గా, ట్రాఫిక్‌కు లేకుండా ఉంటే మా ఇంట్ల పోరగాడు కూడా నడుపుతాడు, దిగండి సార్, దిగి ఆ సీట్లో కూర్చోండి, నేనున్నాను కదా పక్కన" అన్నాడు యాదయ్య, నాచేతిలోని ఖాళీ కప్పు తీసుకుంటూ.

మామూలు సమయంలోనయితే యాదయ్య చేసిన కమెంటుకి కోపం రావటమో, చిన్నబుచ్చుకోవడమో చేసేవాడిని. ఇపుడా ఫీలింగులకి కూడా ఆస్కారం లేదు. ఆ రద్దీ అలాంటిది.

యాదయ్య మరీమరీ బలవంతం చేయడం, తాడో పేడో తేల్చుకుందామని నేనుకూడ అప్పటికప్పుడు నిర్ణయించుకొవటంతో డ్రైవింగు సీట్లో కూర్చున్నా. డాష్ బోర్డు మీదున్న ఓబొజ్జ గణపయ్య కి దణ్ణం పెట్టుకొని, రోడ్డుమీద ట్రాఫిక్ ఒక్క క్షణకాలం తెరిపిడి పడి, నాకారు దూరే సందు దొరకడంతో కారు ముందుకు దూకిచ్చా. ఒక వంద మీటర్లు వెళ్ళానో లేదో బైకు మీద ఒక కాలేజీ కుర్రోడు నా ఎడమవైపు నుంచి రయ్యిన దూసుకొచ్చి, కట్ కొట్టి, నా కారు ముందుకొచ్చాడు. ఎక్కడ నాకారు తనకితగులుద్దో అని భయంతో నేను స్పీడు ఒక్కసారిగా తగ్గించా. ఆ దెబ్బకి "నాకు మొదటి గేరే కావాలీ..." అని నా కారు ఇంజను మారాం చేసింది.ఇంకేమంది యధావిధిగా కారు ఆగిపోయింది అదీ రోడ్డు మధ్యలో. నాకేమో చమటలు పట్టేస్తున్నాయ్. కారు స్టార్టు చెయ్యటం, కాస్త ముందుకెళ్ళటం, ఇంజను ఆగిపోవటం. ఇలా నాలుగుసార్లు జరిగింది. రోడ్డువారగా నాకు ఒక పదడుగుల దూరంలో ట్రాఫిక్ కానిస్టేబులు హెల్మెట్ చంకలో పెట్టుకొని టీ తాగుతున్నాడు . రియర్ వ్యూ అద్దం లోకి చూసా. తీరు చూస్తుంటే ఈలోపే నా వెనకాల భారీస్థాయిలో జన సమీకరణ జరిగినట్టూ, వారందరికీ నేను అప్రకటిత, అపరిచిత నాయకుడిని అయినట్టూ అర్ధమయింది. యాదయ్య వైపు చూసా. బీచి ఒడ్డున ఇసకలో కాళ్ళారజాపుకొని ఎదురుగా ఉన్న సముద్రాన్నీ, ఆ పైనున్న ఆకాశాన్నీ చూస్తూ, ఆ అందాన్ని ఆస్వాదిస్తున్న తాలూకు ప్రశాంతత కనపడింది నాకాయన మొహంలో. ఏమాత్రం కంగారు లేదు.

(ఏంటో, భిక్షపతి గురించి రాద్దామనుకుంటే, ఇలా యాదయ్య దగ్గరే ఆగిపోయాను. సమయం దొరికితే దీన్ని కంటిన్యూ చేస్తా.)

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...