ఇదో నాలుగేళ్ల క్రితం సంగతి.
ఎదురింటి పంజాబీవాళ్లతో మాపెద్ద చిక్కొచ్చిపడింది నాకు. వాళ్లొకసారి మాఇంటికొచ్చినప్పుడు ఆరోజు నా టైం బాలేక ఏ చిన్న చీమో,సాలీడో వాళ్ళ కళ్ళబడింది. ఇక కాళ్లెత్తి సోఫాలో పెట్టుకొని ఒకటే అరుపులూ కేకలూ.
అసలే పంజాబీలు. ఫైర్అలారం మోగినట్టే అయింది ఆ కాసేపు.
అప్పట్నుంచి నాతో ఒకటే గొడవ "పెస్ట్ కంట్రొల్"వాళ్లని పిలుస్తావాలేదా?"అని. వాళ్ల చిన్నమ్మాయి అయితే "అంకుల్, ఒక వారంటైమిస్తున్నా, ఈలోపు మీరు పిలవకపోతె నేనే కాల్ చేసి స్కెడ్యూల్ చేసేస్తా" అని బెదిరించేసింది. .
వాళ్లది సరిగ్గా మా ఎదురిల్లే. నేను బయటికెళ్లినప్పుడల్లా వాళ్లు కూడాబయటేగనక ఉంటే అక్కణ్నుంచే కనుబొమ్మలెగరేసో, చేత్తో సైగలూ చేసో వాకబు చేసేవాళ్లు, కాల్ చేసావా లేదా అని.
ఓన్లీ సైగల్. నో మాటల్.
ఆదోరకం టార్చర్.అందరూ కలిసి కూడబలుక్కున్నట్లున్నారు.
చిన్నమ్మాయిగోరు అయితే రోజుకో మేసేజ్ ఫోన్లో. ఆ అమ్మాయికి అస్సలు మొహమాటాల్లేవు.
"అంకుల్, స్టేటస్ ప్లీజ్"
(దానికి రెస్పాన్స్ ఇవ్వటం ఒక ఐదునిమిషాలు లేటయినా )
"డిడ్ యూ గెట్ మై మెసేజ్?"
"ఆర్ యూ దేర్ ?"
"అంకుల్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే?" ( సెంటిమెంటుతో కొట్టడం అన్నమాట).
ఈ టార్చర్ భరించలేక ఓరోజు ఫోన్ చేసి స్కెడ్యూల్ చేసేసా. నాటైం బాలేక ఆ పెస్ట్ కంట్రోల్ ఆయనొచ్చినప్పుడు ఎదురింటి అమ్మాయిలిద్దరూ మా ఇంట్లోనే ఉన్నారు.
ఆయన రాగానే తన దగ్గరున్న టాబ్లెట్లో రకరకాల కీటకాల బొమ్మలు చూపిస్తూ,వాటివల్ల వచ్చేజబ్బుల గురించీ,వాటిని విజయవంతంగా ఎలా చంపేస్తామో చెప్తుంటే వాణ్ణి కాస్త పక్కకి పిలిచి ,ప్రకాష్ రాజ్ స్టైల్లో, చెవిలో రహస్యం చెప్తున్నట్టు..
"మాష్టారూ, ఈ చంపే బిజినెస్ మనకెందుగ్గాని, వాటిని ఇంట్లోకి రానీయకుండా చేసి మార్గమేదైనా ఉందా?" అనడిగా.
వాడు నావైపు చాలా ఆశ్చర్యంగా చూసి,నేను కాంట్రాక్టు సైనప్ చేస్తానో చేయనో అని సందేహపడ్తూ( ఇది నా ఊహే లెండి),
" ఐ నో వేర్ యు అరె కమింగ్ ఫ్రం" అని కాస్తాగి ,మళ్లీ "ఐ గెటిట్ దో " అన్నాడు.
నేనలాగే చూస్తున్నాను ఆయన్ని తన నెక్స్ట్ డైలాగ్ కోసం ప్రకాష్ రాజ్ లా వెర్రిమొహం వేసుకొని .
ఆ తరువాత ఆయనింకేం చెప్పలేదు.
చేతులు కట్టుకొని నేను.నేలచూపులు చూస్తూ ఆయన.
ఓ పదిసెకండ్ల ఇబ్బందికరమైన నిశ్శబ్దం తరువాత ఆయనే "సో, వాట్ నెక్స్ట్ ?" అన్నాడు.
మాటలాపి మా వైపే చూస్తున్న ఆ పంజాబీ అమ్మాయిలవైపు చూసా.పెద్దమ్మాయి కళ్ళెగరేసింది "ఏంటి విషయం?" అన్నట్లు. చిన్నమ్మాయి మాములుగా చూస్తున్నా నాకు మాత్రం వేలు చూపిస్తున్నట్లే ఉంది .
"లెట్స్ గో ఎహెడ్ " అన్నా విధిలేక, పెన్నందుకుంటూ
ఓ వారం తర్వాత మొత్తం సరంజామాతో తగలడ్డాడు వాడు. నాకిష్టం లేని పని కాబట్టి తలుపు తెరిచి మొహాన నవ్వు పులుముకొని ఓ షేక్ హేండిచ్చి( ఇది కరోనా పూర్వం లెండి ) నా ఆఫీసు పనిలో మునిగిపోయా.
కాసేపు ఇంటి బయటా, ఇంకాసేపు పెరట్లో, ఇంటి లోపల కిటికీల దగ్గరా ఏదేదో చెసేస్తున్నాడు.
ఓ అరగంట తరువాత అసలు చడీచప్పుడు లేకపోయెసరికి కొంపతీసి వెళ్లిపొయాడా అని కిందికెళ్లి చూస్తే గరాజ్ నలుమూలలా జిగురు పూసిన అట్టపెట్టెలు లాంటివి పెడ్తూ నన్ను చూసి దొరికిపోయిన దొంగలా అదోలా నవ్వి తిరిగి తను చేస్తున్న పనిలో మునిగిపోయాడు.
మరుసటిరోజు కిచెన్లొ ఒక వైపు గోడవారా పుట్టలుపుట్టలుగా చచ్చిన చీమలు. అయ్యో అనిపించింది నాకు .
కొన్ని రోజుల తరువాత ఒక వీకెండ్ కాస్త గరాజ్ క్లీన్ చేద్దామని వెళ్ల్లినప్పుడు ఆ బాక్సుల్లో జిగురుకతుక్కొని చచ్చిన రకరకాల కీటకాలూ, ఒకట్రెండు నలికీసు పాములూ ( సేలమేండర్ అంటారిక్కడ ఇంగిలిపీసులో).
పాపం అవి ఆ జిగురుకతుక్కొని, కదల్లేక , ఆకలికి అలమటించి..ప్చ్.. ఉసూరుమంది ప్రాణం.
వంటిట్లో చీమలు ఇంకా వస్తుండడం చూసి చిన్నమ్మాయి పెస్ట్ కంట్రోలు వాళ్లతో "ఐయాం నాట్ హ్యాపీ విత్ యువర్ సర్వీస్" అనేసరికి ఆ మరుసటి రోజు మళ్ళీ ఆయనే..
ఎప్పట్లానే వెర్రి నవ్వూ , ఓ హేండ్ షేక్ ..
ఓపావుగంటలో ఆయన ఆ చీమలు ఎక్కడినుంచి వస్తున్నాయో కనిపెట్టాడు. అవి మా నైబరుడు మిస్టర్ చాంగ్ పెరటినుంచి మాపెరట్లోకి అక్కణ్నుంచి మా వంటింట్లోకి వస్తున్నాయి. అర్జెంటుగా హోం ఓనర్ అసోసియేషను వాళ్లకి కంప్లయింటు ఇమ్మన్నాడీయన. అది నావల్ల కాని పని.
ఇక మిస్టర్ చాంగ్ గురించి..
ఈయన నా పొరుగున ఏడేళ్ల నుంచి ఉంటున్నా, మా కళ్లూ కళ్లూ కలిసి "హెలో" చెప్పుకోడానికి ఐదేళ్లు పైనే పట్టింది.
నేనే అనుకుంటె ఈయన నన్నుమించి అన్నమాట.
ఆ చైనా ఇంగ్లీషు అర్ధం చేసుకోవటం కష్టం గానీ, ఎదురుపడి తప్పనిసరై మాట్లాడాల్సొస్తే మాత్రం చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు.
ఈ పెస్ట్ కంట్రోల్ ఆయన రావటానికి ముందు ..
ఓనాల్రోజుల క్రితం..
ఆరోజు శనివారం...
నాకు పొద్దున్నే మెలకువ రాగానే యూట్యూబ్ లో ఒకట్రెండు తెలుగు మెలొడీలు విన్నాకే బెడ్డు దిగటం అలవాటు (రోజూ కాకపోయినా దాదాపు ప్రతిరోజూ ). ఆరోజు అలా వెతుకుతుంటే సూపర్ స్టార్ కృష్ణ,జయప్రదల పాటొకటి కనపడింది.హిట్టయిన పాటే.లంకంత బంగళాలో తెల్లటి లాల్చీ పైజమావేసుకొని, మల్లెపువ్వునే తలదన్నేంత తెల్లగా ఉన్న కృష్ణ బెడ్డు మీద నిద్దరోతుంటే, ఆ బంగళా బయటెక్కడో అల్లంతదూరంలో తోటలో పూలుకోస్తూ జయప్రద పాటందుకొంది. ఆ పాట వినగానే కృష్ణ గారు బద్దకంగా లేచి, అలా వొళ్ళిరుచుకొని... ఇలా ఆవలించారు .
దెబ్బకి నా నిద్రమత్తొదిలిపోయింది. ఇక మళ్లీ నిద్రపట్టే ఛాన్సే లేదు.
కాబట్టి కిందకొచ్చేసి ముందురోజు రాత్రి అనుకున్నట్టు రెండు వాయలు ఇడ్లీ (భయపడకండి. వాయకెనిమిదే.మూడో ఇడ్లీప్లేటుని కాకెత్తుకుపోయింది), పనిలోపనిగా వేయించిన వేరుశెనక్కాయలూ, చట్నీ పప్పూ ,కాస్త కొబ్బరీ అన్నీ వేసి చట్నీ చేసి పడేసా. (చట్నీ చేసుకొనే ఓపిక అన్నిసార్లూ ఉండదు, చాలా వరకు ఏ పొడితోనో కాస్త నెయ్యేసుకొని లాగించెయ్యటమే)
సుష్టుగా ఏడెనిమిది ఇడ్లీలూ ఆ వెంటనే వేడి వేడి కాఫీ గొంతు దిగుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి (చట్నీలో కారం బాగా ఎక్కువై) .
ఇక ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమం పెట్టుకొని, ఇంటిలోపల మెయిన్ డోరు ఎదురూగా ఉండే మెట్లని వ్యాక్యూం చేస్తుండగా బెల్లు మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ టక్కున డోరు తెరిచి చూస్తే వడివడిగా సొంతింట్లోకే దొంగలా పారిపోతూ పక్కింటి మిస్టర్ చాంగ్. బహుశా నేను అంత త్వరగా తలుపుతీస్తానని ఊహించి ఉండడు. బెల్లుకొట్టి నేనొచ్చేలోగా పారిపోదామనుకున్నాడేమో? వాట్సప్ లో ఆన్లైన్ స్టేటస్ లా దొరికిపోయాడు.(పాపం ఆయనేం తొందర్లో ఉన్నాడోలెండి. ఈసారికి బెనిఫిటాఫ్ డౌట్ ఇచ్చేద్దాం)
ఇహ తప్పనిసరై కళ్లజోడు సవరించుకుంటూ పలకరించాడు.
"హాయ్ మిస్టర్ శివా"
శనివారం ఉదయం..పైగా బ్రహ్మండమైన బ్రేక్ ఫాస్టూ.నేనేమైనా తక్కువా..
"హేల్లో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ మిస్టర్ చాంగ్"
ఇంతకి విషయం ఏమిటంటే ఆయన వాళ్ల పెరట్లో పండించిన "చైనా గుమ్మడికాయని" నాకిద్దామన్ని బెల్లుకొట్టాడట . ఆయన ఆమాట చెప్పాక అప్పుడు గమనించా...
ఇంటి గుమ్మంలో ..
అంత పెద్ద గుమ్మడికాయని నేనెప్పుడూ చూడలేదు. మనం చూసే పేద్ద పుచ్చకాయకి మూడింతలుందది. దీన్నిలాగే లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే "బ్యాక్ ఇష్యూస్ " వస్తాయేమో, బెటర్ దీన్నిక్కడే కోసి తీసుకెల్దాం అనిపించేలా ఉందది.
చాంగ్ వాళ్ళ నాన్నకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం . రోజంతా ఆయన పెరట్లోనే ఉంటాడు ఏదో ఒకటి చేస్తూ. వేసవికాలం వాళ్ళ పెరడు అచ్ఛం అడవిలానే ఉంటది. తీగ చెట్లు పాకడానికి వీలుగా పెరడంతా పందిళ్ళే. వాటికిందో మంచం వేసుకొని మధ్యాహ్నం పూట ఓ కునుకేయాలని నాకెన్ని సార్లనిపించిందో. వాళ్ళింటి వైపున్న మా ఫెన్స్ మొత్తం పాకేసాయి ఆ తీగలు. అది చూసి మా ఎదురింటి పంజాబీవాళ్ళు "శివ శివా " అంటూ నన్ను ఎగదోయాలని ప్రయతించారు గానీ నాకేనాడు అదొక సమస్యలా అనిపించలేదు. ఎప్పటికీ అనిపించదు కూడా. వాళ్ళలా అనడానికి ఓ కారణం ఉంది. అది తరువాత చెప్తా.
ఇక కథలోకొస్తే ,చాంగ్ కి థాంక్స్ చెప్పి, దాంతో వండిన కూర ఎలా వచ్చిందో 'డెఫినిట్' గా తనకి చెప్తానని ఒట్టేసి, దాన్నెత్తుకొని లోపలికొచ్చి, కాలితో తలుపేసి, దాన్ని నడుంతో ముక్తాయించి, మెట్లమీద మధ్యలో వదిలేసిన వ్యాక్యూమ్ క్లీనర్నిజాగ్రత్తగా దాటేసి, ఇంకో రెండు మెట్లుండగానే దాన్ని జాగ్రత్తగా లివింగ్ రూమ్ ఫ్లోర్ మీద పెట్టి కిచెన్ లోకి దొర్లించుకుంటూ తెచ్చేసా.
దాన్ని చూస్తుంటే కిచెన్లో సగం అదే వున్నట్టుంది.
ఫ్రిజ్లో పట్టదు కాబట్టి ఈరోజు దీన్ని 'కొయ్యాల్సిందే'.ఇంటిపని పూర్తయ్యాక ఇక ఈ వంట పని చూడాలి అనుకున్నా.
ఆ మధ్యాహ్నం,ఎలా వండాలో తెలీక సరే చూద్దాం అని నాకు తెలిసిన సొరకాయ కూర స్టైల్లో వండిన కూర భలే రుచిగా వచ్చింది.సగం పైగా కూర నేనే తినేసా,పెరుగన్నాన్ని త్యాగం చేసి మరీ.
ఇహ ఆ మిగతా సగం గుమ్మడికాయ ఇంకా నా ఫ్రిజ్లో నిద్దరోతోంది. ఎలా ఇస్తాను కంప్లయింట్ చెప్పండి మరి?
మేమీఇంటికొచ్చిన కొత్తల్లో అప్పటికింకా మిస్టర్ చాంగ్ కి పెళ్లి కాలేదు. ఇంకో చైనా అబ్బాయితో ఉండేవాడు. వీధిలో అందరూ వీళ్ళ బంధాన్ని అపార్ధం చేసుకొని బుగ్గలు తెగ నొక్కేసుకున్నారు. ఓసారి నేను డెక్కు మీద నిలబడి కాఫీ తాగుతూ యధాలాపంగా పక్కకి చూస్తే పక్కింటి పెరట్లో ఈ చాంగ్ గారి రూమ్మేటు. ఓ కుర్చీలో జారగిలబడి ఎదురూగా ఉన్న ఇంకో ఖాళీ కుర్చీలో కాళ్ళు బెట్టుకొని కూర్చోనున్నాడు.చేతిలో బీర్ కేను.ఒంటి మీద మోకాళ్ళదాకా ఉండే బాస్కెట్బాల్ ఆటాడేవాళ్లు వేసుకొనే షార్ట్.అరంగుళం కూడా ఖాళీలేకుండా చేతులమీదా, ఛాతీమీదా (పొట్టతో సహా) పచ్చబొట్లు.(అంతా ఒకటే డిజైన్,పచ్చబొట్టు అనాలేమో).అయినా అసలు పొట్టమీద ఎలా వేయించుకుంటారు, నవ్వురాదూ గిలిగింతలు పుట్టి? నాకైతే మా అమ్మాయి ఎప్పుడైనా "నాన్నా... ఐ విల్ టికిల్ యూ... అంటూ చేయత్తగానే,ఆ వేళ్ళు నాదాకా రాకుండానే నవ్వొస్తది.
'గేంగ్ మెంబర్' లా ఉన్న ఆయన్నలా చూడగానే దడుచుకున్నాను. ఎర్రగా బుర్రగా ,కళ్లజోడుతో చూట్టానికి మంచి ఇంటిలిజెంట్ స్టూడెంట్లా ఉంటాడు చాంగ్. ఆయనకి ఇలాంటి రూమ్మేట్ ఏంటిరా బాబు అనిపించిందోక్షణం.
చాంగ్ వాళ్ళింటి డ్రైవ్వే మీద ఒక కారే పడుతుంది.ఈ రూమ్మేటు తన కారుని ఇంటెదురుగా వీధిలోనే ఓ పక్క పేర్లల్ పార్కింగ్ చేసేవాడు. పంజాబీ వాళ్ళింట్లో అందరికీ తలా ఒకకారు.ఇంటి యజమాని క్యాబ్ తో సహా మొత్తం ఆరుకార్లు.వాళ్ళ కారొకదాన్ని ఈ స్పాట్లోనే పార్క్ చేసేవాళ్లు మొదట్లో.ఈ రూమ్మేటు వచ్చాక ఆ స్పాట్ మీద వాళ్ళ హక్కు హరించుకుపోయింది.ఇక పోటీ మొదలయింది. ఎంతలా అంటే ఆ పంజాబీ ఆయన వెయ్యి తగలేసి ఒక డొక్కు కారు కొని దాన్ని 'పెర్మనెంటు'గా ఈ స్పాట్లో పెట్టేసాడు. (ప్చ్..ఏంటో జనాలు).
పచ్చబొట్టబ్బాయి తక్కువోడేంకాదు.ఒక నెల చూసి ఇక వేరే మార్గం లేదనుకొని ఒకానొక అర్ధరాత్రి ఓ డబ్బా నిండా పెయింట్ తీసుకొచ్చి కారు అద్దాలమీదా, లోపల సీట్ల మీదా పోసేసాడు. కారులోపల రంగెట్లా పోసాడో , బహుశా 'ఆ టాలెంటు' కూడా ఉందేమో.
ఎదురింటాయన మామూలుగానే ఫైర్ బ్రాండ్. ఆయన నాకు 'హలో' చెప్పినా నెత్తి మీద సుత్తితో కొట్టినట్లే ఉంటది. పొద్దునే లేచి ఆయన ఈ రంగు మారిన కారు చూసి 'గుగ్గిలం మీద అగ్గే' అయ్యాడు.
పోలీసులొచ్చారు. చాంగ్ ఇంటి అణువణువూ గాలించారు ఆధారాలకోసం. ఖాళీ రంగు డబ్బాగానీ, ఇంట్లో లేదా గరాజ్ లో ఎక్కడైనా కనీసం ఒక రెండు చుక్కల రంగైనా గానీ దొరుకుద్దేమోనని.
కారు చుట్టూతా క్షుణ్ణంగా పరిశీలించారు ఏవైనా ఆధారాలు చాంగ్ ఇంటి వైపు దారి చూపిస్తాయేమోనని..
నాడ.
అలా ఆధారాలు లేకుండా ఆ కారుని మర్డర్ చేసి పడేసేడా పచ్చబొట్టబ్బాయి. చైనా నా మజాకానా మరి.
అందుకే వాళ్లకి చాంగ్ ని చూస్తే వళ్ళు మంట. నేను ఆయనతో మాట్లాడుతుంటే మొదట్లో వీళ్ళు తెగ ఫీలయ్యేవారు.ఆడవాళ్లు సర్దుకుపోయినా ఆ పంజాబీ ఆయన మాత్రం ఉక్రోషం పట్టలేక ఒకసారి మాఇంటికొచ్చ్చినప్పుడు "వాడొక స్టుపిడ్ ఫెలో. వాడితో మాట్లాడకు" అన్నాడు.ఒక రెండు క్షణాలు ఆయన కళ్లల్లోకి సూటిగా చూసి చిన్నగా నవ్వి ఊరుకున్నాను.
తిరిగి ఏం మాట్లాడలేదు ఆయనతో.
(ఓపికున్నప్పుడు మిగతాది)