Wednesday, February 19, 2014

అమెరి'కతలు -2 ( కొత్తిల్లు)

ఇల్లు మారాలి.

ఇప్పుడున్న ఇంట్లోంచి కొత్తగా కొన్న ఇంట్లోకి.

 పెద్ద దూరమేమీ కాదు.ఇప్పుడున్న ఇంటినుంచి ఒక పది మైళ్ళు అంతే.

వీలైనంత వరకు అన్ని వస్తువుల్నీ అట్టపెట్టెల్లోకి సర్దేసాం. ఇక సామాన్లని మేమున్న నాలుగో అంతస్తు నుంచి దించి ఆ యు-హాల్ వేన్ లో పెట్టడమే.అది మా వల్లయ్యే పని కాదని తెలుసు. ముందే అనుకుంటున్నట్టు, ఆ పనిని , గంటకింతని మాట్లాడుకొని ఇద్దరు,లేక ముగ్గురు ("మక్కూ గాళ్ళు " గా వ్యవహరించబడే)మెక్సికన్ పనివాళ్ళకి  అప్పగించటమే.

నేనూ నా ఫ్రెండూ బయలుదేరాం వాళ్ళుండే అడ్డాకి. ఎంతా, మాఇంటి నుంచి ఒక అరమైలు, అంతే . గ్యాస్ స్టేషనూ , దాని పక్కనే ఉన్న సెవన్ ఎలెవన్  దుకాణపు పరిసరాలు వారి అడ్డా.

అక్కడ వాళ్ళను ఆ దారిని వెళ్తున్నప్పుడు చాలాసార్లు గమనించా. గుంపులు గుంపులుగా జేరి ,పనికోసం రోజంతా ఎదురుచూస్తూ ఉంటారు.

వాళ్ళని చూస్తే నాకు భయం .కారణం? నాకే తెలీదు. వారెవరూ నాకెపుడూ ఎలాంటి హానీ తలపెట్టలేదు.   ఉంటున్న సమాజపు పోకడలూ,కనీసం పక్కనున్న వ్యక్తి ఇష్టా ఇష్టాలు కూడా గమనించలేనంత బిజీ లైఫ్(?) లో ఉన్నప్పుడు,చూసిన సినిమాలూ లేదా ఎవరి ద్వారానో విన్న మాటలే మనకి పలానా వర్గం మీదో, పలానా వ్యక్తి మీదో, ఏదో  దేశం మీదో ఒక అభిప్రాయం కలిగేలా చేస్తాయి. (అ )జ్ఞానం అలాగేగా మరి కలిగేది?

కారు అలా ఆ ఆవరణ లోకి తిరిగిందో లేదో,దాదాపు పది మంది నా కారుని రెండు వైపులా నుంచీ చుట్టుముట్టారు. ఆ అయోమయంలోనే కారు అద్దం కిందికి దించి,మూడు వేళ్ళు  చూపిస్తూ "త్రీ " అన్నా. కాస్త వొడ్డూ  పొడుగూ ఉండి, బలిష్ఠంగా ఉన్న వ్యక్తి  ఒక్క ఉదుటున ముందుకు వచ్చి తననీ ,తన పక్కనున్న ఇంకో ఇద్దరినీ చూపిస్తూ "వన్ ,టూ ,త్రీ "  అన్నాడు. ఇంతలో భారీ కుదుపుతో నా కారు అటూ ఇటూ ఊగింది.చూస్తే, ఎవరో నాకారు కుడివైపు  వెనక డోరు ఒక్క ఉదుటున తెరిచి లొపలికెక్కారు.అప్పటి వరకూ నాతో మాట్లాడుతూ ఉన్న వ్యక్తి  అది చూసి తను కూడా ఒక్క ఉదుటున డోరు తెరిచి లోపలి దూకాడు.తనతో పాటే ఇంకో వ్యక్తీ.నేను అయోమయంలో ఉండగానే నా ఫ్రెండు "ఇంకాసేపు ఆపితే కారు పైనెక్కుతారు, పద పద " మని తొందరపెట్టాడు.

ఆ మిగిలిపోయిన మూడో వ్యక్తి  వైపు తల తిప్పాను.

దాదాపు అరవై ఏళ్ళు ఉంటాయేమో.మాసిన గడ్డం, లోతుగా పీక్కు పోయిన దవడలు. పరీక్షగా చూసానతనివైపు . నిరాశ తాలూకు ఛాయలు నేనూహించిన స్థాయిలో లేవతని మోహంలో . కోపం గానీ, నాలుగు డాలర్లు సంపాదించుకొనే అవకాశం తృటిలో తప్పినందుకు తోటివారిపై నిరసన కూడా ఏమీ కనపడలేదు  నాకు. నన్ను చూసి మాత్రం చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చాలా స్వచ్చంగా  ఉంది.నాకివన్నీ మామూలే  అని నాకే భరోసా ఇస్తున్నట్టూ ఉంది. వెనకున్న వాళ్ళు తోసినట్టున్నారు ,తూలి ముందుకు పడబోయి తమాయించుకున్నాడు. మోహంలో చిరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు

ఇంటి రోడ్డెక్కాను.

మనసు భారమైంది.

కారు నడుపుతూ, దురుసుగా నా కారెక్కిన వ్యక్తి వైపు ఓరగా చూసాను. మధ్య వయస్కుడు. నేను తనని గమనించటం చూసి తల తిప్పేసుకున్నాడు.

 రాగానే ఒక్క నిమిష కూడా వృధా చేయకుండా పనిలోకి దిగారు. మొదట్లో గమనించలేదు గాని, ఆ మూడో వ్యక్తికి కూడా దాదాపు యాభై అరవై ఏళ్ళు ఉంటాయేమో. అయినా  మిగతా ఇద్దరితో పోలిస్తే పనిలో ఆయన ఏ  మాత్రం వెనకంజ వేయలేదు. సోఫా లాంటి బాగా బరువున్న వస్తువులు నుంచి మాత్రం మిగతా ఇద్దరు కలిసి ఈయన్ని దూరంగా ఉంచారనిపించింది

సామానంతా వేన్ లోకి ఎక్కించాక , మిగతా ఇద్దరినీ ఫ్రెండ్ తో వేన్లో పంపించి,ఈ మధ్యవయస్కుడూ,నేనూ నా కార్లో బయలు దేరాం.

మాటలు కలిపాను. ఏవో పొడి పొడి ఇంగ్లీషు మాటలు. అవికూడా నాలుగైదుసార్లు అడిగితే  గానీ అర్ధం గావు. ముగ్గురిలో ఎవరూ మెక్సికన్స్ కారు. ఇతనిది గ్వాటేమోలా. మిగతా ఇద్దరివీ ఇంకేవో ( అతను రెండు మూడు సార్లు చెప్పినా నాకర్ధం కాలేదు). అయితే ముగ్గురూ మెక్సికో సరిహద్దు దాటే (అక్రమంగా) అమెరికాలోకి ప్రవేశించారు, ఏజెంట్లకు పెద్ద మొత్తంలో డబ్బిచ్చి,ప్రాణాలకు తెగించి.

తనకి  ఆరేడేళ్ళ పిల్లలు ఇద్దరు. వాళ్ళను చూసి ఇప్పటికి సరీగ్గా ఐదేళ్ళు.వాళ్ళను చూడ్డానికి వెళితే అమెరికాకి తిరిగొస్తానన్న నమ్మకం లేదు తనకి.

మనసు ఆర్ద్ర మైంది. తరువాతి ప్రశ్నకి గొంతు పెగ ల్లేదు.

ఒక రెండు నిమిషాలు మాట్లాడలేక పోయాను. తనమీద ఇంతకు ముందున్న కోపం ఇప్పుడు మటుమాయం.

ఆ అరగంటలో ఇంకెన్నో చెప్పాడు. బోర్డర్ దాటేటప్పుడు  అమెరికా పోలీసులులకే కాదు, అటువైపుండే మెక్సికన్ గూండాలకు కూడా దొరక్కూ డదు. దొరికితే ,కిడ్నాప్ చేసి  అమెరికాలో ఉన్న వాళ్ళ బంధువుల నుండి డబ్బులు గుంజుతారట. వీళ్ళంతా చాలా వరకు ఒకరొచ్చి,ఇక్కడ కాస్త సెటిలయ్యి నెమ్మదిగా  తమ వారిని రప్పించుకుంటారట తెలిసిన ఏజెంట్ల ద్వారా.


ముందే చేసుకున్న ఒప్పందం,సామాను తిరిగి కొత్తింట్లో పెట్టేటప్పుడు అంతా లివింగు రూములోనో, బేస్ మెంటు లోనో కాకుండా ,ఏ గదిలో పెట్టాల్సిన వస్తువులు అక్కడే పెట్టాలని. అప్పటికే అలసి ఉన్న వాళ్లకి అదెంత కఠినమో నాకు మొదట్లోనే అర్ధమైంది. నేనూ ఒక చేయ్యేసినా వాళ్ళతో పోలిస్తే అదొక లెక్కలోకి రాదు.

మధ్యలో మాత్రం ఆ వృద్ధుడు ఒకసారి మంచి నీళ్ల  గ్లాసందుకున్నప్పుడు, బరువులు మోసీ మోసీ  తన చేయి వణకటం గమనించా.  ఎంతలా అంటే గ్లాసులోని నీళ్ళు సవ్యంగా గొంతులోకొంచుకోలేనంత తీవ్రంగా. సగం తాగి,ఇక తాగలేక చిన్న చిర్నవ్వుతో,మొహం మీద పడ్డ నీళ్ళు తుడుచుకుంటూ గ్లాసు తిరిగిచ్చాడు.

నిశ్చేష్టుణ్ణయిపోయాను కొన్ని క్షణాలు.ఏదో తెలీని గిల్టీ ఫీలింగ్

కారులో తిరిగి వాళ్ళని  తిరిగి తీసుకెళ్తున్నప్పుడు ఏమీ మాట్లాడాలనిపించలేదు  ఎందుకో. వాళ్ళే అప్పుడప్పుడు పొడి పొడిగా వాళ్ళ భాషలో ఏదో మాట్లాడుకున్నారు.

పొద్దున్న నా కారెక్కలేక పోయిన ముసలాయన  నవ్వు మొహం, ఈ వణికే చేయీ , ఆ ఇద్దరు బిడ్డల తండ్రీ  దాదాపు వారం పాటు చాలా తరచుగా గుర్తొస్తూనే ఉన్నారు.

ముఖ్యంగా , దలైలామా నవ్వుని పోలిన ఆ వృద్ధుని స్వచ్చమైన నవ్వు మొహం.

ఇప్పటికీ అటువైపు వెళ్తుంటే నాకు తెలిసిన ఈ మూడు మొహాలు కనపడ తాయేమో  అని చూస్తా.

వాళ్ళు నన్ను గుర్తు పట్టకపోవచ్చు. నేను వాళ్ళ ఒకానొక  కష్టమర్ని కావొచ్చు.

ఆరోజు  ఏదో తెలీని సత్యాన్ని నాకవగతం చేసిన వాళ్ళు మాత్రం నాకు చిరపరిచితులే.

ఆ రోజుటి వారి కష్టం నా ఇంటినిండా ఆవరించుకొని ఉంది. ఎప్పటికీ మర్చిపోను.

Monday, February 17, 2014

మా ఇంటి వార్తలు

1. రాత్రిటి వంట తాలూకు సగం తరిగి వదిలేసిన ఉల్లిపాయ కిచెన్ కౌంటర్ మీద అలానే ఉంది . దాని పక్కనే తరిగిన కూరగాయల తాలూకు తొడిమెలూ,ఫ్రిజ్ లో పెట్టడం మరిచిపోయిన పెరుగు గిన్నె, ఆ పక్కనే సింక్ లో ఉండాల్సిన భోజనం ప్లేటూ. 

2. ఈ మధ్య కార్ ప్రయాణం చాలా నిశ్సబ్దంగా,బోరింగ్ గా ఉంటోంది . వెనకున్న రెండు కార్ సీట్లూ నాలాగే వంటరిగా. ఇక పక్క సీటు సంగతంటారా , ఉమ్మ్మ్... సో సో ..  ఆ సీటు అలా కామ్ గా ఉంటేనే బెటరు .. :)

3. అలవాటు తప్పిపోయింది కదా, ఇంట్లో నాకిష్టమైన పని, నాకిష్ట మొచ్చినప్పుడు చేయడం భలే వింతగా ఉంది. దాన్ని మించి, నాకిష్టం లేని పనిని  వాయిదా వెయ్యగలగడం ఇంకా ఇంకా వింతగా ఉంది.

 4. నాలోని  అరాచకవాది  మేల్కొన్నాడీ మధ్య. కావాలనే మొన్నొకరోజు ఎంచక్కా జీన్స్ పేంటు వేసుకొనే నిద్రపొయా. ఎన్నేళ్ళయింది అలా నిద్ర పోయి? ఎంత చక్కగా నిద్ర పట్టిందో.ఇది బయటికి వేసుకెళ్ళే డ్రస్సు, అదేసుకోవద్దు,ఇదేసుకోవద్దు , అని నిలదీసేవాళ్ళెవరూ లేరింట్లో. మాఇంట్లో నేనే కింగుని(ప్రస్తుతానికి). 

5. వర్క్ ఫ్రం హొమ్ చేసేటప్పుడు, ఇంట్లో అందరూ ఉన్నప్పుడే ఇంకాస్త బాగా పనిచేసేవాడి ననిపిస్తోంది . దీని మీద నాకింకా క్లారిటీ రాలేదు గాని,బహుశా నిజం కావచ్చు.

6. నాకిష్టమైన ఛానల్సు ఎంతసేపైనా చూడొచ్చనుకున్నానా? రెండు రోజులకే మహా బోరు కొట్టేసింది. నాకు డోరా కావాలనో , మరింకేదో కావాలనో పోటీ పడే వాళ్ళుంటే బాగుండు . అలా ఫైట్ చేసి చూడ్డంలోనే మజా. 

7. ఎప్పుడైనా అలా బయటికెళ్ళొచ్చి మెయిన్ డోర్ తాళం తీసి లోనికి రాగానే అక్కడ కనపడే బుజ్జి బుజ్జి బూట్లు కనపడగానే ఇంట్లోకెళ్ళ బుద్ది కావడం  లేదు. నేనుకూడా ఇంకో రెండు నెలలు అలా అలా బయట తిరిగి, వారొచ్చాకే ఇంటికొద్దామని ఉంది . 

8. పెళ్ళంటేనే ఇద్దరికీ కొత్త జీవితం. ఆ "కొత్త" లో సింహభాగం కోల్పోయే స్వేఛ్చేఅని ప్రాక్టికల్ గా అర్ధం అవుతోంది. ఈ విషయం తెలియదని కాదు గానీ , ఏడేళ్ళ తరువాత కదా, మొహం మీద లాగి పెట్టి కొట్టినంత ప్రస్పుటంగా ఉందీ స్వేచ్చానుభవం . :)  

9. హారర్ , సస్పెన్స్ సినిమాలు రాత్రుళ్ళు చూడ్డం మానేసా. ఎంత కింగునైనా , మనిషినే కదా.....  భయం అన్నమాట.  (భయపడని వాళ్ళు అస్సలు మనుషులే కాదు అని నేనంటం లేదు బాబొయ్.. )

10. ఏమాటకామాటే. ఉదయాలు మాత్రం మహాప్రశాంతంగా మొదలవుతున్నాయి,నాకిష్టమైన సినిమాపాటలతోనో లేదా భక్తి సంగీతంతోనో. 

11. బ్రేక్ ఫాస్ట్ లు లంచ్ లవుతున్నాయి.అలాగే లంచ్ లు,లంచ్ టైం కి బాగా తరువాత,డిన్నర్ కి కొద్దిగా ముందు. అన్నమాట.   (కడుపులో బాగా కాలాక అని కవి భావం ). 

12. మొన్నొకరోజు కష్టపడి,చెమటోడ్చి రాత్రి పదింటికి వంట కానిచ్చి, ప్లేట్లో పెట్టుకొని  తింటూ , టీవీ చూస్తూ అలా  అన్నం చేత్తోనే నిద్రపొయా. మెలకువొచ్చాక ఎప్పుడో తెల్లవారు ఝాము నాలుగింటికి మిగతా భోజనం పూర్తి చేశా. (బ్రహ్మచారి జీవితంలో ఒక నాలుగైదు సార్లు ఇలానే జరిగినట్టు గుర్తు. ). 

13. బుర్ర అటెన్షన్ లోకొచ్చి చాలా రోజులయినట్టుంది, ఎవరిచేతైనా ఒక రెండు తిట్లు తిట్టించుకోవా లనిపిస్తోంది. ఏమిటో వింత కోరిక. 

14. బోల్డంత ఫ్రీ టైం . ఎడా పెడా చదివే యొచ్చూ , బర బరా రాసేయొచ్చూ  అనుకున్నానా, దానిక్కావలసింది కూసింత డిసిప్లనూ , టైం మేనేజ్మెంటూ అని అర్ధం అయింది. ( ఇదీ తెలిసిన విషయమే, ఏదో మీ కోసం :) )

15. నేను మర్చిపోయినో ళ్ళకీ ,నన్ను మర్చిపోయినోళ్లకీ ఫోన్ కాంటాక్ట్ లిస్టు వెతికి  మరీ ఫోన్ చేసి విసిగిస్తున్నానీ మధ్య. నా ఫోన్ కాల్  రిసీవ్  చేసుకున్నోళ్ళు  కొంతమంది బహుశాఇప్పటికీ తేరుకోనుండకపోయుండొచ్చు.రిసీవ్ చేసుకోనోళ్ళు  ఇంకా భయపడుతూ ఉండొచ్చు. 

16. బాబోయ్ ,ఇన్నేళ్ళలో , ముఖ్యంగా గత మూడేళ్ళలో నేను మిస్సయిన మంచి సినిమాలు , తెలుగువీ , హిందీవీ ఎన్నున్నాయో. ఒక్కోటొక్కోటి  చూడ్డం మెదలెట్టా.ఇంకా బోల్డున్నాయి. ప్చ్.... 

17. థియేటర్లో సినిమా చూడడం ఏదో గత జన్మ జ్ఞాపకంలా  అయిపోయింది. అటువంటిది ,ఏమిటండీ బాబు, అసలు, అప్పటికప్పుడు అనుకొని , ఒక అరగంటలో షో  ఉంటే , గబ  గబా   తయారయ్యి సినిమా కెళ్ళడం?   అస్సలు నమ్మశక్యంగా లేదు . థియేటర్లో కూర్చున్నాక  కాస్త గిల్లుకొని నిర్ధారించుకుంటున్నా. మొన్నొక రోజు  ఫషో సినిమా చూసి,దార్లో బిరియానీ తిని,ఇంటికొచ్చి ఒక గంట టీవీలో వార్తలు చూసి .. బాబోయ్..  అసలు నేను నేనేనా? నా జీవితమనే కేలండర్లో ఈరోజు నిజమేనా?

18. వేల మైళ్ళ దూరాన , భూగోళానికి ఆవల ఉన్న బుజ్జి తల్లిని , వెబ్ కేమ్ లో "హాయ్ అమ్మలూ" అని పలకరిస్తే, నాకవతల బోల్డు పనులున్నాయి అని మొహం కూడా చూపించటంలేదు. బోల్డు మంది కొత్త నేస్తాలు, ఇక నేనెందుకూ? ఇక్కడికొచ్చాక దాని పని పట్టాలి. ఏడ్చిగీపెట్టినా కార్టూన్ చానల్సు పెట్టనంటే పెట్టను.డోరా అసలే పెట్టను. 

19. ముద్దు ముద్దుగా  కనిపించే టెడ్డీ బేర్ మొహం ఇప్పుడు దిగాలుగా కనిపిస్తోంది . ఇంత కళ్ళేసుకుని  భలే ఫన్నీ  గా ఉండే చేప బొమ్మ ఇప్పుడు ఏదో బిత్తర చూపులు చూస్తున్నట్టుంది. ఇవి కూడా నాటైపే . ఉన్నప్పుడు ఎడా పెడా తొక్కించుకుంటాయి, లేనప్పుడు దిగులేసుకుంటాయి. :(  

20. నెల క్రితం అందిన వార్త. మా ఇంట్లో వాళ్ళందరూ ఇండియాకెళ్లా రండీ నన్నిలా వదిలేసి .. :(


టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...