Tuesday, April 28, 2009
అ'రాచకీయాలు
సొంత పార్టీ తీర్మానానికి వ్యతిరేకంగా చట్టసభల్లో ఓటేయడం వేరేవిషయం. దాన్ని వదిలేస్తే, రిపబ్లికన్ నుంచి డెమొక్రటిక్ పార్టీకి లేదా ఇటు నుంచి అటుకి మారినవారు మొత్తం 13 మంది.
దాదాపు వందేళ్ళలో....
13 మంది. అక్షరాలా పదమూడు మందే. మీరు సరిగ్గానే చదివారు.
మనది "లార్జెస్టు" డెమోక్రసీ కదా, మనకి ఇంతకంటే ఎక్కువ ఉండడం సహజం. కాబట్టి ఆ 13 పక్కన ఒక రెండుసున్నాలో మూడూ సున్నాలో పెట్టుకొండేం?
విద్యా చరణ్ శుక్లా గుర్తుకొచ్చాడు ఒక్కక్షణం. చెయ్యని మినిస్ట్రీ లేదు, చేరని పార్టీ లేదు.
*********************************************************************************
ఇవేమి దీక్షలో...
ఇదొక పక్కరాష్ట్రం పెద్దమనిషి కథ.
ముక్కుపచ్చలారని చిన్నపిల్లల్ని కూడా మెళ్ళో సైనైడ్ గొట్టం వేసి ఆహ్వానం పలికే ఓ ఉగ్రవాద సంస్థ మీదకి ఈయనకి అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది.
ఇంకేముందీ, దీక్షకి రంగం సిద్ధం.
పట్టెమంచం, మెత్తటి పరుపూ, చల్లగా సేద దీరడానికి ఏసీలూ, ఫేన్లూ. మరి దీక్షా మజాకానా? ఆత్మవంచనకి ఆత్మగౌరవం ముసుగేసి ఓట్లడుక్కోడానికి ఆమాత్రం సెటప్పు కావద్దూ?
ఈ సందట్లో ఎవరిమూలాన వైధవ్యం ప్రాప్తించిందో వారినే రక్షించాల్సిన దుస్థితి పాపం ఇంకొకామెది.
రాజకీయం కదా, ఇక్కడ లాజిక్కులుండవు మరి.
Monday, April 20, 2009
చెణుకులు
ఈయన అప్పుడెప్పుడో "అసలు రాముడున్నాడా?" అనీ , "రాముడు తాగుబోతు" అనీ, అనేసి కొట్టుకుచావండ్రా అని చేతులు దులిపేసుకున్నారు. అప్పటి బాధపడ్డ హృదయాలకు ఇప్పుడిదిగో సమాధానం.
ఇన్నాల్టికి ఆయన మనః స్థితి మీద ఒక అంచనా లాంటిది దొరికినట్టయి మనసు ప్రశాంతంగా ఉంది నాకు. ఇప్పుడీయన రాముణ్ణెన్నన్నా నాకేమాత్రం బాధ లేదు. నిజానికి ఎప్పుడంటాడా అని ఎదురుచూస్తున్నా. అన్నాక కాసేపు నవ్వుకోవచ్చుగా.
*********************************************************************************************
ఒకప్పుడది జెంటిల్మన్లాడే ఆట.
ఈ మధ్యే అది ఆ ఎనిమిదిగంటలనుండి రెండుగంటలకీ, కొన్నిసార్లు గంటన్నరకీ కుదించబడింది.
ఇప్పుడు ఆ ఆట చూడ్డానికొచ్చిన అమ్మాయిలకి వేల డాలర్ల నజరానా, బాలీవుడ్ కథానాయికగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే అవకాశం.
ఎప్పుడో వదిలేసుకున్న చెస్ ఆట మీద మక్కువ మళ్ళీ మొదలవుతోంది నాలో.
దేముడా! దానికేమాత్రం ప్రాముఖ్యం వద్దు. దాన్నక్కడే ఉండనివ్వు.
Thursday, April 16, 2009
రెండు సంగతులు
కొన్ని నెలల క్రితం అమ్రీకా అధ్యక్షుడు భూషయ్య మీద, తరువాత చిదంబరం మీద, రీసెంటు గా నవీన్ జిందాల్ మీద.
అయితే సదరు వ్యక్తి తాగి ఉన్నాడనీ, అందుకే క్షమించేసాననీ జిందాల్ వారు సెలవిచ్చారు.
చదువుతూ ఓహో! అని తలూపుతుండగా ఠక్కున వచ్చిందొక ఆలోచన..
తాగితే విచక్షణా జ్ఞానం పోవాలి కదా మరి ఇదేమిటి? ఈయనలో మేల్కొన్నట్టుందే!
ఏంటో?
ఇంత చిన్న విషయమే బోధపడకపోతే, ఇక ఆ పరమ సత్యం నాకెన్నటికి బోధపడేను?
***************************************************************************
ఇంకొకటి.
ఒకానొక శుక్రవారం నాడు.
సమయం సాయంత్రం ఆరు గంటలు. పనుండి ఆఫీసులోనే ఉండిపోయా.
దాదాపు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి అంతా నిశ్శబ్దంగా ఉంది.
నేను కూడా వెళ్ళిపోయాననుకున్నారేమో, నా సహోద్యోగులు, ముగ్గురు తెల్లోళ్ళు మాట్లాడుకుంటున్నారు.
వద్దనుకున్నా చెవిలో వచ్చి పడుతున్నాయి మాటలు.
"సుబ్బారావేడీ? ఈ మధ్య కనపడటం లేదే"
"ఆయన పెళ్ళి. ఇండియా వెళ్ళాడు, వచ్చే సోమవారం వస్తాడు"
మేగన్ అడిగింది.
"అవునూ మీకు తెలుసా, ఇండియాలో పెళ్ళి అయ్యేవరకూ ఆడైనా మగైనా వర్జినిటీ పోగొట్టుకోరట"
"ఏమిటీ! నిజమే?" రెండు మగ గొంతులు ఆశ్చర్యంగా.. నోరెళ్ళబెట్టి..
"ఒకవేళ అమ్మాయి పోగొట్టుకుందని తెలిస్తే వీధుల్లోకి లాక్కొచ్చి రాళ్ళతో కొట్టి చంపుతారట".
ఇంతలో ఎవరో "ష్" అంటూ నేను ఇంకా అక్కడే ఉన్నానని వారికి సైగచేసి చెప్పటం తెలుస్తూనే ఉంది.
కాసేపు నిశ్శబ్దం..
ఆ తరువాత చిన్న చిన్న గుసగుసలు.
కాసేపటికి పూర్తి నిశ్శబ్దం.
కాలం తో కాసేపు పరిగెడతాం.తెలీకుండానే ఎక్కడో ఒకచోటఆగిపోతాం.అక్కణ్ణించి కాలంతో పాటు ఉన్నామనే భ్రమ లో హాయిగా బతికేస్తాం.కనీసం ఎక్కడున్నామో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యం.తీర్పులు మాత్రం ఇచ్చేస్తుంటాం. జ్ఞానాన్ని అడక్కుండానే అందరికీ పంచేస్తుంటాం.
టైంపాస్ కబుర్లు
ఏదైనా ఒక పెయింటింగ్ ని చూడగానే ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో చుట్టూ ఉన్న ఫ్రేమే బావుందనిపిస్తే ఎలావుంటుంది ...

-
ఏదైనా ఒక పెయింటింగ్ ని చూడగానే ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో చుట్టూ ఉన్న ఫ్రేమే బావుందనిపిస్తే ఎలావుంటుంది ...
-
"ఎలాగూ బయటే ఉన్నారుగా . ఇంట్లో పాలైపోయాయి. టెన్నిస్ ఆడటం అయిపోయాక వీలయితే షాపుకెళ్లి పాలు తెమ్మని" ఇంటినుంచి ఫోన్. "వీలయి...
-
నచ్చకో మరెందుకో పబ్లిష్ చేయకుండా వదిలేసిన పాత పోస్టులు చూస్తుంటే ఇదిగో ఇది కనపడింది. తారీఖు చూస్తే జులై 31, 2010. అప్పటికింకా పిల్లలు ప...
