Friday, October 31, 2008

మరచి పోయిన మొదటి జ్ఞాపకం.

ఈ బ్లాగు రాయడం మీద ఇష్టం నాకు రోజురోజుకీ పెరిగి పోతోంది. వచ్చిన ప్రతి ఆలోచననూ ఒడిసిపట్టుకొని దాన్ని బ్లాగులో పెట్టొచ్చా లేదా అని అలోచిస్తూంటే, చివరికి దాన్ని రాసినా రాయకపోయినా, ఆ ఆలోచన మాత్రం నన్ను నేను మరలా మరొక్కసారి తరచి చూసుకొనే అవకాశాన్ని కలిగిస్తోంది. ఏదో పరాకు లో ఉన్నప్పుడో, డ్రైవ్ చేస్తున్నప్పుడో ఎన్నో ఆలోచనలు. ఒకప్పుడు అవి చాలా వరకు అలా వచ్చి ఇలా వెళ్ళేవే. బ్లాగు పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఆలోచనని మధిస్తుంటే నాకు బ్లాగు రాయడానికి మించిన ఆనందం కలుగుతోంది. ఎన్నో జ్ఞాపకాలు, తారసపడే ఎందరో వ్యక్తులు, ఎక్కడో మొదలయ్యే జీవితం. చాలా దూరం వచ్చామని తెలుస్తుంది గాని ఎంతదూరం వచ్చామో తెలీదు, ఇంకెంత దూరం ఉందో అంతకంటే తెలీదు.

నా చిన్నప్పుడు మా అమ్మకంటే ముందు మా బాగోగులు చూసిన వ్యక్తి ఒకరున్నారు. ఆమే మా అవ్వ. మా నానమ్మ వాళ్ళమ్మ. నేను పుట్టే టప్పటికే తనకి దాదాపు ఎనభై యేళ్ళుంటాయేమో. అప్పటికే ఆమెకి ఏదో వ్యాధి వచ్చి నడుం వంగిపోయింది. నడుము నుంచి మొహం వరకు నేలకు సమాతరం గా ఉంచి నడిచేది. మేము తనముందే ఆమెలా నడిచి ఆమెను ఆట పట్టించేవాళ్ళం. మేము ఆట పట్టిస్తున్నా కూడా చిర్నవ్వు తో అలా మమ్మల్ని చూస్తూ మురిసిపోయేది. కోపం అనేది తన మొహంలో చూసి ఎరగను నేను. చిన్నతనం, తెలిసీ తెలియని వయసు. అయినా నాకెందుకో ఇప్పుడు ఆమెనలా ఆటపట్టించటం గుర్తుకువస్తే ఏదో క్షమార్హం కాని నేరం చేసాననిపిస్తోంది. ఆమెకి మేమే లోకం. మా బాగోగులే ఆమెకి దినచర్య. మా నలుగురు పిల్లలకి స్నానాలు చేయించటం, బట్టలు తొడగడం, అన్నం తినిపించటం, మాతో ఆడుకోవడం ఇవే ఆమె ప్రధాన వ్యాపకాలు.

భోజనాల దగ్గర అవ్వను నేను తెగ విసిగించేవాడిని. చెప్పాను కదా ఆమె అలా వంగి నడుస్తూ ఉంటే నేనువింతగా చూసే వాడినని. మా భోజనాల గది వంటిల్లు వేరు వేరు గా ఉండేవి.నేను మొదట అవ్వా పప్పు కావాలి అనేవాడిని, అది తేగానే ఈసారి నెయ్యి, ఆ తరువాత ఇంకేదో. ఇలా అన్నీ ఒక్కసారే అడగకుండా ఆమెని ముప్పు తిప్పలు పెట్టేవాడిని. ప్రతిసారి ఆమె నేనడిగింది తేవటానికి వెనక్కి మళ్ళగానే నేను ఎక్కిరింతగా నవ్వుతూ మిగతా పిల్లలకి చూపించి నవ్వేవాడిని ఎలా నడుస్తోందో చూడండి అని. నేనడిగిన ప్రతిసారి విసుక్కోకుండా పాపం రెండు గడపలు దాటి మరీ వెళ్ళి తీసుకొచ్చేది.గడప దాటడం చాలా కష్టం ఆమెకి, పైగా అవి ఎత్తు గడపలు.రెండు చేతులతో ద్వారం తాలూకు నిలువు బద్ద ని పట్టుకొని ఆ ఊతంతో దాటాల్సొచ్చేది.

నాకు నాలుగైదేళ్ళున్నప్పుడే తను చనిపోయింది. మా ఇంటి పంచలో ఉంచారు ఆమె నిర్జీవ శరీరాన్ని. నాకేమాత్రం ఏడుపు రాలేదు. అలా వింతగా చూస్తూ ఉన్నానంతే. నాకు మూడు పూటలా అన్నం పెట్టి, నా ఆలనా పాలనా చూసిన ఆ చెయ్యి అలా నిర్జీవం గా పడి ఉంటే నాకేమాత్రం కనీసం దిగులు కూడా అనిపించలేదు. ఏదో జరిగిందని తెలుసు, ఏమిటో తెలీదు.
అందరిపిల్లల్లొకి ఆమెకి నేనంటే ఎక్కువ ఇష్టమట. తను చనిపోయిన తరువాత కూడ నేను నాకు అవ్వే అన్నం పెట్టాలి అని ఏడుస్తుంటే మావాళ్ళు భయపడి ఏవో పూజలు పునస్కారాలు చేసారట.

మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా నాన్న ని అడిగాను అవ్వతాలూకు ఫోటో ఎక్కడైనా దొరుకుతుందా అని. నా ఆశ అడియాశే అయ్యింది. మా బంధువుల ఇళ్ళళ్ళో ఉండే అవకాశం కూడా లేదంట.

మరణానంతరం ఏమవుతుందో ఎవరికీ తెలీదు కదా. తను మరలా ఎక్కడైనా పుట్టిందో తెలీదు, లేదా పైన వుండి నన్ను అలా విస్తుపోతూ చూస్తూ ఉందో తెలీదు. ఈ ఒక్కమాట చెప్పాలని ఉంది. నిన్ను మర్చిపోయినా, పూర్తిగా మాత్రం మర్చిపోలేదు, అప్పుడప్పుడూ గుర్తొస్తూనే ఉంటావూ అని చెప్పాలని ఉంది.

ఈ ఉరుకులు పరుగులు ఎందాకో , ఏమి సాధిద్దామనో తెలీదు గానీ , ఈ పరుగుపందెం లో నేను మరచిపోయిన నా మొట్టమొదటి జ్ఞాపకం మా అవ్వ.

Wednesday, October 22, 2008

సుహృద్భావ, స్నేహపూరిత సంభాషణ

ఇద్దరు ఎంపీ ల మధ్య జరిగిన సంభాషణ(??)

*********************************************

"ఆ! చెప్పావులే పెద్ద.."

"నువ్వు నాకు నీతులు చెప్తే వినాలి, నేను చెప్తే తప్పా?"

"ఎక్కువ మాట్లాడుతున్నావ్"

"ఎవడయ్యా? నువ్వా?నేనా?"

"ఇంక మాట్లాడింది చాలు నోర్మూసుకో"

"నువ్వే మూసుకో"

"నిన్న కాక మొన్నొచ్చావ్ నువ్వు నాకు చెప్పేటంతోడివయ్యావా?"

"ఏయ్ వాడు గీడు ఏంటి?మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం తెలీదా?"

"పోరా!, నీ మొహానికో మర్యాద కూడానా?"

"దమ్ముంటే బయటికి రా చూసుకుందాం"

"ఆ!పద, నువ్వు మగాడివో నేను మగాడినో తేల్చుకుందాం.."

**************************************************

ఇదండీ సంగతి. వాళ్ళిద్దరూ అంత చక్కగా మాట్లాడుకుంటే ఈ మీడియా ఏమిటండీ ఇలా ప్రతిదాన్నీ వివాదాస్పదం చేస్తోంది?

Sunday, October 19, 2008

మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా?నిన్న రాత్రి ఒంటిగంటప్పుడు ఆఫీసు సెల్ ఫోను కార్లోనే మర్చిపోయిన విషయం గుర్తొచ్చి, కిందకొచ్చి దాన్ని తీసుకొని, లోపలికి రాబోతూ ఒక్కసారి తల పైకెత్తి చూసాను. ఆ నిశీధి వేళ నల్లటి ఆకాశం, ఒక పక్క పున్నమి చంద్రుడు, చాలా మనోహరం గా ఉందా దృశ్యం. కాసేపలా చూస్తూ ఉండిపోయా..
*****************************************************************

నా చిన్నప్పుడు వేసవొచ్చిందంటే రాత్రుళ్ళు మిద్దేమీదే పడక. గుంటూరు జిల్లా ఎండల గురించి మీకు తెలుసుగా?వేసవి ఉక్కపోత ఎంత ఇబ్బందికరం గా ఉంటుందంటే పిల్లలందరం రాత్రి ఏడు కాగానే అన్నం తినేసి ఎప్పుడు మేడ మీదకెళ్ళి మాటలు చెప్పుకుంటూ పడుకుందామా అని ఆత్ర పడేవాళ్ళం. పడుకొని అలా ఆకాశాన్ని, ఆ నక్షత్రాలను, ఆ మసక చీకటిలో అప్పుడప్పుడు మా మీదగా ఎగిరిపోయే కొంగలగుంపునూ చూస్తూ, మాటలు చెప్పుకుంటూ , ఎప్పటికో నిద్ర పోయేవాళ్ళం. మేమే కాదు, మా పక్కింట్లో అద్దె కుండేవాళ్ళు, ఆ పక్క పెంకుటింట్లో ఉండేవాళ్ళు అందరమూ కలిపి ఒక పెద్ద గుంపు తయరయ్యేది మా మేడ మీద. పిల్లలొక గుంపు, పెద్దలొక గుంపు. ఏ గ్రూపు మాటలు వాళ్ళవే. ఇక పడుకోండ్రా అని పెద్దలు కసరందే మా మాటల కంతుండేది కాదు. వాళ్ళు కసరగానే మేమందరం పిండ్రాప్ సైలెన్స్. మరలా నెమ్మదిగా మా పిల్లల్లో ఎవరో మాటలు మొదలెట్టే వారు, మళ్ళా మాటలు. నాకప్పుడు ఐదారేళ్ళుంటాయేమో. నిద్ర మధ్యలో ఎప్పుడైనా లేచి కళ్ళు తెరిచి చూస్తే, పడుకోపోయే ముందు నా కాళ్ళ వైపు ఉన్న చందమామ నా నడి నెత్తి మీదో, ఇంకాస్త ఆ పైకో ఉండేవాడు. భలే విచిత్రం గా అనిపించేది. మా అన్నయ్యని అడిగినట్టు గుర్తు ఎందుకలా అని. తనేం చెప్పాడో నాకు గుర్తు లేదు. వాడూ చిన్నోడేగా, ఏదో తింగరి సమాధానం చెప్పేఉంటాడు. ఎప్పుడైనా ఆరింటికో ఆరున్నరకో మెలకువస్తే ఆ కాశంలో ఒకపక్క చంద్రుడు, ఇంకోపక్క సూర్యుడు. నాకదొక వింత. కనీసం పదిమందికి చూపించందే మనసూరుకునేది కాదు.

నాకు చిన్నప్పటి నుంచి సైన్సు విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. 1984 లో అనుకుంటా రాకేష్ శర్మ అంతరిక్షం లో అడుగుపెట్టాడు, భారతదేశం తరపున మొదటి వ్యోమగామిగా. TV లో చూసా అప్పటి ప్రధాని ఇందిరాగాంధి రాకేష్ శర్మ తో మాట్లాడడం. దాన్ని చూసినప్పటి నుండి రాత్రిపూట ఆకాశాన్ని చూసినప్పుడల్లా నక్షత్రాలు , చందమామ లను మించి ఆవల ఏముంది అని అలోచించేవాడిని. అన్నయ్య నడిగితే అంతరిక్షం కి అంతే లేదన్నాడు, పోతూ ఉంటే అలా అలా వస్తూ ఉంటుందట. మన లాంటి పాలపుంతలు ఎన్నో లక్షలు కోట్లు ఉన్నాయట.ఆకాశాన్ని చూస్తూ ఈ విశ్వం అనంతం అనే సత్యాన్ని తలచుకుంటూ అసలు అదెలా సాధ్యం అంటు తెగ ఆశ్చర్య పడేవాడిని. (నా బ్లాగు పేరు వెనకున్న కధ ఇదే). ఆ Infinity అనే కాన్సెప్ట్ నాకిప్పటికీ ఆశ్చర్యమే.

ఇక ఆ తరువాత చదువుల్లో పడి ఆకాశాన్ని అంతగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు మేడ మీదికొచ్చి ఆరోజు పౌర్ణమి గనక అయితే హాయ్! వెన్నెల ఎంతబాగుందో అనుకునేవాడిని. కరంటు రాగానే కిందకి పరుగు. TV చూడ్డానికో, లేక పోతే చదూకోడానికో.

ఇంజనీరింగ్ లో కొచ్చాక మాది హైదరాబాద్ నగర శివార్ల లో ఉన్న కాలేజి కాబట్టి రోజూ మెస్ లో రాత్రి భోజనం కానిచ్చి వాకింగ్ కి బయలుదేరేవాళ్ళం. అలా వాకింగ్ చేసేటప్పుడూ, నిండు వేసవిలో హాస్టలు రూము లో ఉక్కపోత భరించలేక మంచాలు బయట వేసుకున్నప్పుడూ , అలా ఆకాశం వైపొక లుక్కేసేవాడిని. హైదరాబాదు కొచ్చిన కొత్తల్లో, బిర్లా పానెటోరియం లో, అసలుకి నకలైనా, ఆకాశాన్ని చూసినప్పుడు చిన్నప్పటి సంగతులు కొన్ని గుర్తొచ్చాయి.

ఆ తరువాత ఉద్యోగాన్వేషణలో ముందు చూపే గాని బొత్తిగా పైచూపు లేకుండా పొయింది. దానికి తోడు అపార్ట్మెంట్ బతుకయిపోవటం మూలాన అదొకటుందన్న ఊహ కూడా కరువైపోయింది. ఒక ఐదేళ్ళ క్రితం అనుకుంటా మేము ముగ్గురం ఫ్రెండ్స్ మి అప్పటికప్పుడు అనుకొని హైదరాబాదు నుంచి శ్రీశైలం బయలు దేరాము మల్లన్న దర్శనం చేసుకుందామని. దర్శనం అయినతరువాత ఎవరో చెప్పారు ఒకటైము తరువాత అటవీశాఖ వారు వాహనాల్ని అడవిలోకి అనుమతించరని. అప్పటికప్పుడు రేడీ అయ్యి బయలుదేరాము తిరిగి హైదరాబాదు కి . చెక్ పోస్టు దాటి అడవి లోపలికొచ్చాక ఎందుకో కాసేపు కారాపి ఆ చల్ల గాలిని ఎంజాయ్ చెయ్యలనిపించి కారు దిగాము. చిమ్మ చీకటి. ఎంత దట్టమైన చీకటంటే పక్కనెవరైనా అడుగుదూరం లో నిలబడ్డా పోల్చుకోలేనంత చీకటి. మాట వినపడితే గాని మనపక్కనొకరున్నారన్న సంగతి తేలీదు. తల పైకెత్తి చూసానొకసారి. నాకళ్ళని నేనే నమ్మలేకపొయాను. నల్లటి ఆకాశంలో పైన ఎన్ని లక్షల నక్షత్రాలో. ఇప్పటికీ ఆదృశ్యం నా బుర్రలో భద్రం. చాలా అందమైన అనుభవం నాకది. హైదరాబాదు లో అన్ని నక్షత్రాలు కనపడవు.

ఆతరువాత , ఒక రెండేళ్ళ క్రితం మా అన్నయ్య అమెరికా నుంచి తెప్పించిన టెలీస్కోపు ని పిల్లలకి చూపిద్దామని పిల్లలనందరిని పోగేసాడు మా అపార్ట్ మెంట్ బాల్కనీలొ . పనిలో పని గా నేనుకూడ మైమరచి పోయాను ఆ చంద్రుని మీది గుంతల్ల్నీ (క్రేటర్స్), శని గ్రహం చుట్టూ ఉన్న వలయాల్నీ చూసి. ఇక పిల్లలందరూ వంతులవారీ గా చూస్తుండగా, ఇంకేమైనా పెద్ద నక్షత్రాలు, టెలీస్కోపు లో చూడదగ్గవి కనపడతాయేమో చూద్దామని ఆ వైపుకి వెళ్ళి అలా అలా వంగి చూడబోయాను. మావదిన అప్పుడే బట్టలుతికినట్టుంది , నేల తడి గాఉండి కాళ్ళ కింద పట్టు తప్పింది. ఎలా తమాయించుకున్ననో నాకు తెలీదు గాని, నిజం చెప్తున్నా, ఆ గుండె దడ ఇప్పటికీ తగ్గలేదు.

ఇక్కడ అమెరికా వచ్చిన కొత్తల్లో ఒహాయో లో ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్ కి బాల్కనీ ఉండేది. అప్పుడప్పుడు అలా వచ్చి కూర్చొని ఆకాశం వైపు చూసినా ఆ ఆలోచనలు కొద్దిగా భిన్నం గా ఉండేవి. రేపు వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం వచ్చే సూచన ఉందా?, నా రైన్ కోటు ఇంట్లో ఉందా , లేక కార్లో ఉందా? ఇట్లాంటివన్నమాట. ఏంచేస్తాం, స్థాన మహిమ.

ఆతరువాత నేను మారిన అపార్ట్ మెంటుల్లో ఒక్కదానికి కూడా బాల్కనీ లేదు. పడుకోబోయే ముందు లైట్లార్పినప్పుడు కిటికీలోంచి పున్నమి చంద్రుడు హాయ్ అన్నాకూడా నాకిప్పుడు లేచి కిటికిదగ్గరికెళ్ళీ ఆ బ్లైండ్స్ పైకి లేపి , ఆ గ్లాసు తలుపు పక్కకి జరిపి , తల బైటికి పెట్టి ఆస్వాదించే ఓపిక లేదు.

ఏతావాతా పైన చెప్పిన రెండుమూడు సందర్భాలను మినహాయిస్తే గత ఇరవై యేళ్ళు గా ఆకాశానికి నాకు బొత్తిగా మాటల్లేవ్. బిజీ లైఫ్ కదా.దానికి తోడు ఆ! నా నెత్తినే ఉండేడ్చింది కదా ఎక్కడికి పోతుందిలే అనే కొద్దిపాటి నిర్లక్ష్యం.
సరే మళ్ళీ మీకదే ప్రశ్న. మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

Wednesday, October 15, 2008

అయ్యో నా BBC

"బిబిసి కి గడ్డు రోజులు"


British Broadcasting Corporation కష్టాల్లో ఉందట.ఇప్పుడే ఈనాడులో చూసాను. ఇది నాకు నిజంగా దుర్వార్తే. చిన్నప్పుడు వెర్రి గా వినేవాడిని. అంతర్జాతీయ వార్తలూ, విశేషాలు. వాటి గురించి కాస్తో కూస్తో లోక జ్ఞానం...దీని చలవే.


ఈ వార్త BBC TV వరకే పరిమితమా?లేక TV , రేడియో రెంటికా?


నావరకు నాకు BBC లేని రేడియో ప్రపంచం అంటే జీర్ణించుకోవటం కష్టం గా ఉంది.


ఏదో ఒక దారి దొరికితే బావుణ్ణు.

Saturday, October 11, 2008

ఒక కాంట్రాక్టరు - ఇద్దరు మేనేజర్లు

అడకత్తెర లో పోకచెక్క అంటే తెలియని దెవరికి? దానిగురించి విన్నాను, అవసరమైనప్పుడు నేనూ ఆ పద ప్రయోగం చేసాను. కాని నా పరిస్థితి ఆ పోకచెక్క లా అవ్వొచ్చని ఏమాత్రం ఊహించలేకపోయాను.
****************************************************************
నేను పని చేసే విభాగం లో నాతో కలిపి దాదాపు పదమూడు మంది ఉంటారు. నేనొక్కణ్ణే భారతీయుడిని వాళ్ళలో. అందులో నలుగురు దాదాపు ఇరవై యేళ్ళ నుంచి ఈ కంపెనీ లోనే పాతుకు పోయి ఉన్నారు.చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న చందాన, సీనియారిటీ తన పని తాను చేసుకు పోవటం మూలాన, ప్రతిభ,పనితీరు ఇత్యాదివన్నీ పక్కన పెట్టబడి వీళ్ళు నలుగురూ కాల క్రమేణ మానేజర్లు అయ్యికూర్చున్నారు. ఇంతలో మా డిపార్టుమెంట్ హెడ్ కొక పెద్ద సమస్యొచ్చిపడింది. ఈ నలుగురు కాక ఈ మధ్యనే ఇంకొకతనికి కూడ సీనియారిటీ పెరిగి మానేజరయ్యే వయసొచ్చేసింది. ఇక సమయం దొరికినప్పుడల్లా మా హెడ్డు హెడ్డు తినటం మొదలెట్టాడు. డిపార్ట్మెంటులొ తిప్పి తిప్పి కొడితే ఇరవై మందిమి కూడా లేము, పని చేసే వాళ్ళు తక్కువ మానేజర్లెక్కువై నలుగుర్లో నగుబాటు అయిపోతుందేమో అని మా హెడ్డు భయం. పైగా ఆయన ఆ కంపనీ లో జేరి ఐదేళ్ళే. బయటి నుంచి వచ్చాడు, పైగా ప్రతిభ ఉంది కాబట్టి టక టకా నిచ్చెన ఎక్కేసాడు. ఎంత హెడ్డైనా ఈ ఐదుగురితో పెట్టుకుంటే పుట్టగతులుండవని తెలుసు కాబట్టి, వీళ్ళు చెప్పేది కనీసం విన్నట్టు నటిస్తాడు, చేసినా చేయకపొయినా. ప్రస్తుతానికి ఈ ఐదో అతనే మా హెడ్డు కున్న పెద్ద సమస్య. సరే, ఎవరినన్నా వెతికి ఈయన కింద వేసి మానేజర్ని చేసేద్దామంటే ఆయన చేసే పని ఇంకెవరూ చెయ్యరు డిపార్టుమెంట్లో. ఆయన పనిచేసే సాఫ్ట్ వేర్ కూడా బిల్గేట్స్ బేసిక్ రాసినప్పటి నాటిది. ఆలోచించి ఆలోచించి చివరికి బయట నుంచి కొత్తగా ఒకరిని రిక్రూట్ చేసుకొని మరీ ఈయన కింద వేసి పడేద్దామన్న నిర్ణయానికొచ్చేసాడు మా హెడ్డు. ఒకానొక దుర్దినాన ,ఆయన అలా తల ఏటవాలుగా పెట్టి గాల్లోకి చూస్తూ (బహుశా) ఈ సమస్య గురించే ఆలోచిస్తున్న సమయాన, కాంట్రాక్టరునైన నేను, ఏదో పని ఉండి ఆయన దగ్గరకి వెళ్ళటం, నన్ను చూడగానే ఒక వెయ్యి క్యాండిల్స్ బల్బు ఆయన్న బుర్రలో వెలగటం, నన్ను ఆ కొత్త మానేజరు కింద వెయ్యటం జరిగింది. నేను అదే డిపార్టుమెంటులో రెండేళ్ళ నుంచి పనిచేస్తున్నా ఈ కొత్త మానేజరు పేరు తప్ప ఇంకేమి తెలీదు. ఆ పేరు కూడా ఎందుకు కనుక్కున్నానంటే రోజూ పొద్దున్నే "గుడ్ మార్నింగ్" కి , సాయంత్రం వెళ్ళేటప్పుడూ "హవ్ ఎ గుడ్ వన్" కి పేరు అవసరం కదా, అందుకు. అసలు ఆయన ఏపని చేస్తాడొ ఎవరికీ తెలీదు. వీక్లీ మీటింగుల్లో కూడా ఒక మూలన కూర్చుంటాడు, ఏమీ మాట్లాడడు.

అసలు కధ ఇప్పుడే మొదలయింది.కొద్దికాలం క్రితం కొత్తగా మేనేజరయిన ఆ నలుగురిలో ఒకతను చేసే పనికీ,నాపనికీ కొద్ది పాటి బాంధవ్యముండటం తో ఆయన నాకు De Facto మేనేజరు అయి కూర్చున్నాడు. పాపం చాలా మంచతను. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడు. పనేలోకం. ఆయనకి, నాకు స్వభావ రీత్యా కూడా పోలికలుండటం తో మా ఇద్దరికి సయోధ్య బాగా కుదిరింది. నేను ఈ కంపనీ లోకి వచ్చినప్పటి నుంచి ఆయన తోనే నా పని. ఇప్పుడు నన్ను ఈయన దగ్గర్నుంచి పీకి సదరు కొత్త మేనేజరు కింద వేసినా అది పేరుకి పేపరుపై మాత్రమే. పని పరంగా గాని, ఇంకేరకంగా గాని ఏ విధమైన మార్పూ లేదు నాకు.

ఈ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు నాకు. ఓ శుభోదయాన కొత్త మేనేజరు నుంచి నాకొక ఈ-మెయిల్ వచ్చింది. దాన్ని తర్జుమా చేస్తే ఇలా ఉంటుంది..

"డియర్ ఉమా, నాకు తెలుసు నువ్వో మంచబ్బాయివి అని. దయచేసి ఇక నుంచి నువ్వు చేసే పనులు, చెయ్యబోయే పనులు మరియు చేస్తున్న పనులు అన్నీ మూడు రకాలుగా విడగొట్టి ఒక లిస్ట్ చేసి నాకు పంపు. అలానే ఇకనుంచి నువ్వు పంపే ప్రతి ఈ-మెయిల్ నాకు సిసి చేస్తే నేను చాలా సంతోషిస్తాను."

చాలా మంది లాగానే నాక్కూడా పనుంటే కుమ్మెయ్యడం తెలుసు గాని, సదరు పనిని నాలుగు వాక్యాల్లో పేపరు మీద పెట్టమంటే మనసు మొరాయిస్తుంది. అంత అవసరమా అనే ఒక బలమైన ఆలోచనతో నా చేతి వేళ్ళకి పక్షవాతం వచ్చినట్టవుతుంది. అధికారిక రహస్యాల చట్టం కింద కుదర్దు అని చెప్పొచ్చు ఈయనకి. కానీ దాన్ని సొంత మేనేజరు మీదే ప్రయోగిస్తే ఇంకేమైనా ఉంటుందా?మనసు రాయి చేసుకొని ఆయన అడిగింది పంపాను. ఏ మూలో కొద్దిపాటి నిర్లక్ష్యం, "ఆ.. ఈయనకి నేను చేసే పనులు ఏం తెలుసునని , పేద్ద.. " అని. నా ఊహ నిజమే. ఆయనకి ఏం తెలీదు. అందుకే టక్కున నాకు రిప్లై వచ్చింది, ఇమ్మీడియట్ గా నువ్వు నాకొక మూడు గంటలు టైము కేటాయించి అసలు నువ్వేం పనులు చేస్తావో నాకు సవివరం గా చెప్పు అని. నాకు గుండె ఆగి నంత పనయింది. ఒక్కక్షణం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తే అనిపించింది. సరే, ఎలాగోలా మూడుగంటలు కష్టపడి ఆయనకి 1950 ల నాటి జపనీస్ సినిమా చూపించాను, నా సొంత సబ్ టైటిల్స్ తో..

ఇదిలా ఉండగా, ఒకరోజెందుకో సెలవు పెట్టాలనిపించింది. ఎందుకంటారా? అబ్బే ఊరికే. మరీ కారణం కావాలి అంటే ఇదుగో వినుకోండి, "అందరికీ పనులుండి ఆఫీసులకెళ్ళే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి మా ఇల్లు ఎలా ఉంటుందో చూద్దామని". పొద్దున్నే లేచి మెయిలు పంపా. పంపిన అరగంటకి గాని గుర్తు రాలేదు అలవాటు ప్రకారం మెయిలు మా పాత మానేజరుకి పంపాను అని. మరుసటి రోజు కొద్దిగా భయపడుతూనే వెళ్ళాను ఆఫీసుకి. మా హెడ్డూ, పాత మానేజరు, కొత్త మానేజరు ల జుట్లు రేగిపోయున్నాయ్. నాకు పంపాల్సిన మెయిలు నీకెందుకు పంపాడు అని ఇద్దరు మానేజర్లు జుట్లు పట్టుకొని, పనిలోపని గా వెళ్ళి మా హెడ్డు జుట్టు పట్టుకున్నారట. నేనెళ్ళి పోతే ఇంతలా పని చెసేవాడూ దొరకడం దుర్లభం అనే ఒక్కగానొక్క కారణం చేత మా హెడ్డు నాకు సవినయం గా మనవి చేసుకున్నాడు ఇకనుంచి జాగ్రత్త గా ఉండమని.

అందరు మానేజర్లు పనున్నా లేక పొయినా రెగ్యులర్ గా టీం మీటింగులెట్టుకుంటారని ఈయనకెలా తెలిసిందో గాని, ఒకరోజు పొద్దున్నే మీటింగ్ రిక్వెస్టు కనపడింది నాకు. దాన్ని మన్నిస్తూ ఎప్పుడా అని చూసా. ప్రతి మంగళ వారం పొద్దున్న పది నుండి పదకొండున్నర వరకు. ఏదో ఒక్కసారికి అంటే జపనీస్ సినిమా చూపించా గాని ప్రతివారం గంటన్నర పాటు అంటే?

ఆరోజు మంగళవారం. భయ భయం గా అడుగుపెట్టా పదింటికి కాన్ ఫరెన్స్ హాల్లోకి. అంతపెద్ద హాల్లో మేమిద్దరమే.ఇక మొదలయింది ఆయన మాటల ప్రవాహం. ఆయన మాట్లాడిన వాటిలో మచ్చుకి కొన్ని.
పొయిన వీకెండు ఏమిచెసావు?
నీ ఇంట్లో కుక్క పిల్లి లాంటి పెంపుడు జంతువులున్నాయా??
మీ ఇండియా వాళ్ళ ఆహారపుటలవాట్లేంటి?

నీకు అమెరికా నచ్చిందా?నచ్చితే ఎందుకు?నచ్చనివి ఎమిటి?

నువ్వు మీ ఇంటి బయట పెరిగిన గడ్డి ప్రతివారం పీకుతావా లెక అప్పుడప్పుడూనా?అప్పుడప్పుడయితే ఎప్పుడెప్పుడు?

ఇలా ఉంటాయి. పైవన్నీ ఏక వాక్యాలేగా అనుకుంటున్నారేమో, ఒక్కొక్క దానిమీద దాదాపు అరగంటకు తగ్గకుండా చర్చలూ, కొద్దోగొప్పో వాదోపవాదాలూ అన్ని ఉంటాయ్.ఈమధ్యే నాకు ఆయన గురించి ఒక భయంకరమైన నిజం తెలిసింది. నేను ఆయన క్యూబ్ కి వెళ్ళినప్పుడల్లా డెస్కు మీద ఒకాయన ఫోటో కనపడేది. నాకు అర్ధం కాక పొయినా నేనేమి అంత గా పట్టించుకోలేదు. ఇంతకీ నాకు తెలిసిన ఆ నిజం ఏమిటంటే సదరు ఫొటో లో ఉన్నాయనా నా కొత్త మానేజరు భార్యా భర్తలట(?). మీకో విషయం చెప్పనేలేదు. ఆ మీటింగుల్లో అంత సరదాగా మాట్లాడే వాడల్లా, ఏదైనా పని విషయం లోకి వస్తే నే చెప్పేది వింటూ నావైపే చూస్తూ ఉంటాడు కన్నార్పకుండా. నాకది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆయనకి నే చెప్పేది అర్ధం అవుతుందా లేదా అనేది నాకర్ధమయ్యేది కాదు. పై విషయం తెలిసాక ఎందుకో కొద్దిగా భయం కూడా కలిగేది మొదట్లో.తరువాత్తరువాత ఆయన చూపు తీరే అంత అని సరిపెట్టుకున్నాను( అది ఆయనిష్టం కాబట్టీ మరియు నేను వ్యక్తిగత స్వేచ్చకి చాలా విలువనిస్తాను కాబట్టీ దీని గురించి ఎక్కువగా రాయదల్చుకోలేదు.)
ప్రస్తుతానికి ఆ పాత,కొత్త మానేజర్ల మధ్య వైరం పతాక స్థాయికి చేరింది.ఏదైనా పని చేయాలంటే పనికి మించి వీరిద్దరిని దృష్టిలో పెట్టుకొని చాలా కసరత్తు చేయాల్సొస్తోంది నాకు. నేను పంపించిన మెయిలు, నా సెలవు, అదీ ఇదీ అనికాదు, ప్రతిదీ పచ్చగడ్డే. పాతాయన్ని దూరం చేసుకుంటే పని కష్టం, కొత్తాయన్ని దూరం చేసుకంటే ఉద్యోగధర్మానికి విరుద్దం.
ఈమధ్యేంటో మా హెడ్డు నాకు ఎప్పటికంటే చాలా చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు.

Tuesday, October 7, 2008

ఇంగిలీసు పేర్లు- తెలుగు అర్భకుడు

నన్ను జీవితకాలం వెంటాడే బాధల్లో ఇదొకటి. చిన్నప్పటి నుంచీ "ఆంధ్రుల ఆరాధ్య తెలుగు వార్తా పత్రిక" ని అమూలాగ్రం చదివే అలవాటు వల్ల సంక్రమించిన చిన్నపాటి బలహీనత. ఏమాట కామాటే చెప్పుకోవాలి ఆ చదివే అలవాటే లేకుంటే ఇప్పటికీ బహుశా నేను అటు తెలుక్కీ ఇటు ఇంగ్లిష్ కీ, రెంటికీ సమాన న్యాయం చేసే సంకర భాషలో మాట్లాడుతూ, అక్షరాలు పట్టి పట్టి చదువుతూ ఉండేవాణ్ణేమో. ఆరకం గా నేను బోల్డు అదృష్టవంతుణ్ణి.

ఇక అసలు విషయానికొస్తే, ఒక నాలుగేళ్ళ క్రితం అనుకొంటా, ఇండియాలో నేను పనిచేసే కంపెనీ తాలూకు H.R విభాగం లోకి అడుగు పెట్టాను, నా అమెరికా ప్రయాణం తాలూకు పేపర్లు అందుకోడానికి. నేను సంప్రదించాల్సిన కిరస్తానీ లలనామణి ఎవరితోనో మాట్లాడుతుండడంతో, అక్కడే నిలబడి ఆమెనే చూస్తూ ఉంటే తేడాలొచ్చేస్తాయని ఆ పక్కనే ఉన్న నోటీసు బోర్డు లో మా కంపనీ వాళ్ళు డబ్బులిచ్చి వేయించుకున్న వార్త తాలూకు పేపర్ కటింగు చదవటం ప్రారంభించాను. కళ్ళటూ, చెవులిటూ అన్నమాట. కాసేపాగాక తలతిప్పి చూస్తే, నేను కలవాల్సిన ఆమె గుమ్మం దాటుతూ కనిపించడం తో మళ్ళా ఈమెని ఎక్కడ వెదికి పట్టుకుంటాం రా బాబూ అనుకుంటూ గట్టి గా పిలిచాను "మిచెల్లీ, మిచెల్లీ" అంటూ. ఆ వెంటనే ఆ గదిలో ఉన్న నాలుగైదు తలకాయలు నావైపే తిరగడం, అందులో కొందరు ఒకరకమైన జాలితో నావైపు చూడడం గమనించా. ఆ తరువాత ఒకరెండు రొజులకు నేను నా కొలీగ్ తో మాట్లాడుతూ మళ్ళీ పొరపాటున "మిచెల్లీ" అనడం, వాడు పొట్ట పట్టుకొని నవ్వడం. నవ్వీ నవ్వీ ఆ తరువాత చెప్పాడు, స్పెల్లింగ్ "మిచెల్లీ" (Michelle) అని ఉన్నా "మిషెల్" అనాలట. నిజానికి ఆ విషయం నాకు గుర్తుంది, కాని అన్నివేళలా గుర్తుండాలంటే కష్టం కదా. ఫుట్టినప్పటి నుండీ బొత్తిగా తెలుగు బుర్రాయె మనది.

ఇక్కడికొచ్చాక ఈ పేర్ల ఇబ్బంది మరీ ఎక్కువైపోయింది . నా ఆంగ్ల భాషా పరిజ్ఞానం మరీ అంత తీసిపారేయాల్సిన తీరులో ఉండదు గాని, ఈ పేర్లే ఇప్పటికీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత గుర్తు పెట్టుకుందామను కున్నా అన్నివేళలా కుదరదుగా.అలవోకగా "అసలుపేరు" బయటికొచ్చేస్తుంది అప్పుడప్పుడూ. "సేరా" "సారా" అయిపొతుంది, "షాన్ కానరీ" "సీన్ కానరీ" అయిపోతాడు, ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. మధ్య మధ్య లో ఈ నిశ్శబ్దాక్షరాలొకటి. ఈ పదాల పుట్టుక (ఎటిమాలజీ) నా కంతగా తెలీదు గాని, ఒక అక్షరాన్ని రాసి మరీ దాని గొంతు ఎందుకు నులిమేస్తారో అర్ధం కాదు నాకు. ఈ భాషకు కూడా కొన్ని వందల యేళ్ళ చరిత్ర ఉంది కాబట్టి, దానికివ్వాల్సిన గౌరవం దానికివ్వాలి కాబట్టి నాలో నేనే సరిపెట్టుకుంటాను. మొన్నటికి మొన్న మా మేనేజర్ తో నాకున్న టెన్నిస్ జ్ఞనాన్నంతా రంగరించి "జాన్ బోర్గ్" గురించి మాట్లాడుతుంటే, అంతా విన్న ఆయన, అప్పుడే జ్ఞానోదయమైన వాడిలా టక్కున నువ్వు మాట్లాడెది "బ్యొన్ బోర్గ్"(Bjorn Borg) గురించికదూ అన్నాడు. "ఆల్ టైం గ్రేట్" ఆటగాడు కాస్తా "అన్నోన్" అయిపొయాడు కాసేపు. నాకేం తెలుసు, మా ఊరి పేపర్లో అలాగే రాస్తారు మరి.

మీటింగుల్లో, వీడియో కాన్ ఫరెన్సుల్లో నా మాటల ప్రవాహానికి ముందరికాళ్ళ బంధం ఈ ఇంగిలీసు పేర్లు.పేర్ల దగ్గర ఏమిటొ పదాలు కరువైనట్టు ఆగిపోతాను, ఎక్కడ తప్పు పలికితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని. తిట్టినా క్షమిస్తారు గాని, పేరు తప్పు పలికితే అదోలా ఫీలవుతారు వీళ్ళు.

ఒక్క మనుషుల పేర్లకే పరిమితం కాదిది. మన పత్రికల్లో సోమర్ విల్ ఇప్పటికీ "సోమర్ విల్లే", "కసీనో" కాస్తా "కేసినో" నే, "ఒహాయో" ఇంకా "ఓహియో" నే, "కెరోలినా" ఇంకా "కరోలినా" నే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టొక చాంతాడు. ఇలాంటి చాలా పదాలను నేను జయించాననుకోండి, అది వేరే విషయం.

అయినా వీళ్ళు మాత్రం మనపేర్లను ఎంత బాగా ఖూనీ చేస్తారంటారూ? చెప్పుకుంటే అదో పెద్ద టపా.

ఏదేమైనా గాని, నాకు ఈ పేర్ల ప్రహాసనం తట్టుకోలేనంత పెద్ద సమస్య అనిపించదు లెండి. ఆ పేపరు పఠనం నాకు ఓనమాలు నేర్పి, నాలో సాహిత్యాభిలాషని రగిలించి, ఎన్నెన్ని మంచి పుస్తకాలని చదివించిందో.. దానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. ఈ బోడి ఇంగిలీసు పేర్లు.........పెద్ద సమస్యే కాదు...

Friday, October 3, 2008

చదవటం, కనుమరుగవుతోంది.

మొన్నీ మధ్య ఫ్రెండ్ రమ్మంటే వాడితో పాటు ఒక బుక్ షాపు కెళ్ళాను. "బార్న్స్ & నొబుల్" అని అమెరికా లో ఒకానొక పెద్ద బుక్ షాపు చెయిన్. అమెరికా మొత్తం మీద వీళ్ళకి దాదాపు 800 షాపులున్నాయి. అసలు వెళ్ళిన పనేమిటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు, ఏడేళ్ళ బుడ్డది, ఆ షాపు వాళ్ళు ఉచితంగా ఇచ్చే కధల పుస్తకం తీసుకోవాలి వెళ్దాం పద అని మారాం చేసిందట పొద్దున్నే. ఉచితంగా ఎందుకిస్తారూ అంటే , వేసవి సెలవుల్లో పిల్లల్లో పఠనాసక్తి ని పెంపొందించే ఉద్దేశ్యం తో స్కూలువారొక కార్డ్ ఇచ్చారట విద్యార్ధులందరికి. ఆ వేసవిలో వాళ్ళు ఆరు లేక అంత కంటే ఎక్కువ పుస్తకాలు చదివి, ఆ చదివిన పుస్తకాల వివరాలు, అంటే పుస్తకం పేరు,రచయిత వివరాలు,ఆ పుస్తకం ఎందుకు నచ్చిందో ఒక వాక్యం, ఆ కార్డ్ లో నమోదు చేసి,దాన్ని ఈ బుక్ షాపు లో యిచ్చి ఒక పుస్తకాన్ని ఉచితంగా పొందొచ్చు.ఆ పిల్ల ఉత్సాహాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది.

సరె, వచ్చాను కదాని ఒక రౌండ్ వేద్దామని షాపంతా కలియ తిరిగాను. షాపంతా ఒకటే సందడి గా ఉంది. ఎంత మంది పుస్తక ప్రియులో? ఆరేళ్ళ పిల్లలనుంచి తొంభైల్లో ఉన్న వృద్ధులదాకా అన్ని వయసులవారూ ఉన్నారు. కొంతమంది షాపు వారు ఏర్పాటు చేసిన సోఫాల్లో, కుర్చీల్లో కూర్చొని అక్కడే చదివేద్దామని పుస్తకాల్తో కుస్తీ పడుతున్నారు.

తిరిగి ఇంటికి వస్తుంటె మనసులో ఒకటే ఆలొచనలు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో కనీసం పది అద్దె పుస్తకాల షాపులుండేవి. వాటి బయట "ఇచ్చట నవలలు అద్దెకివ్వబడును" అని బోర్డుంటుంది . చెక్క అల్మరాల్లొ వందలకొద్దీ నవలలు. షాపు బయట నల్ల బోర్డు మీద కొత్తగా రాబోయే నవలల వివరాలు కూడా ఉండేవి. యండమూరిదో, మల్లాదిదో నవల రిలీజయితే దొరకటం మహా కష్టం. స్వాతి , ఆంధ్రజ్యొతి లాంటి వీక్లీ లు కూడా అద్దెకిదొరికేవి. భూమ్మీద డైనోసార్లు అకస్మాత్తుగా అంతరించిపోయినట్లు, ఈ షాపులు కూడా అంతరించిపోయాయి. ఈ శాటిలైట్ టివి, ముదిరిన సినిమా పిచ్చి జనాల్లో పఠనాసక్తి ని దెబ్బతీసాయంటారు. అవి మరి ఇక్కడ అమెరికా లో కూడా ఉన్నాయే? టివి ఇక్కడ కూడా ఒక నేషనల్ అబ్సెషన్. వారాంతం వస్తే ఇంటిపట్టున ఉండే వాళ్ళు బహు తక్కువ. అయినా కూడ పుస్తకాలకెందుకంత ఆదరణ? నేను వెళ్ళిన షాపువారు అమెరికా మొత్తం మీద సాలుకు అమ్మే పుస్తకాల సంఖ్య 300 మిలియన్లు మాత్రమే. ఇలాంటి బుక్ షాపు చెయిన్లు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కలిపితే ఇంకెన్ని మిలియన్లుంటాయో? దాదాపు ప్రతి షాపింగ్ మాల్ కి ఒక పుస్తకాల షాపు విధిగా ఉంటుంది. ఒక విషయంలో మాత్రం నా ఊహ నిజమేననిపిస్తుంది. ఇండియాలో ఈ ఇంగ్లిషు మీడియం చదువులొచ్చి తెలుగు పత్రికలనీ, పఠనాసక్తిని దారుణం గా దెబ్బతీసాయి. విపరీతం గా పెరిగిన పోటీతత్వం కూడా మరొక కారణం. స్కూలు, ట్యూషన్లకే టైము సరిపోనప్పుడు వేరే వాటిమీదకి వారి ధ్యాస ఎలా మళ్ళుతుంది? నాకు తెలుగు పేపర్ చదవటం రాదు అని చెప్పేవాళ్ళు నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు కోకొల్లలు. సరే, చదివేది తెలుగా, ఇంగ్లీషా అనేది పక్కన పెడితే అసలు "చదవటం" అనేదే పాతకాలపు అలవాటుగా మారిపోయింది. ఇక్కడ అమెరికన్ల విషయంలో మాత్రం చదవడం వీళ్ళ సంస్కృతిలో ఒక భాగమనిపిస్తుంది. ఇప్పటికీ మంచి పాఠకాదరణ పొందిన నవలలు హాలీవుడ్ లో సినిమాల రూపంలోకి మారతాయ్. న్యూయార్క్ టైంస్ పత్రిక ఎంపిక చేసే "న్యూయార్క్ టైంస్ బెస్ట్ సెల్లర్" నవలలకి మంచి గిరాకి. ఎయిర్ పోర్టు లాంజుల్లో , విమానాల్లొ, కారు సర్వీసింగ్ సెంటర్లలో, ఇలా చాలా చోట్ల, నాకు చాలా మంది కనపడతారు సమయం వృధా కానీకుండా నవళ్ళు చదువుతూ.
Reading is the most effective way of conscious learning, nothing can replace that.

ఇండియాలో టివి, ఇంటర్నెట్లు అకస్మాత్తుగా మాయమై, మళ్ళా పాతరోజులొస్తే బాగుణ్ణు.

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...