Thursday, October 29, 2009

మాష్టారుగారమ్మాయి

కొన్నెందుకో అలా గుర్తుండి పోతాయి. ఎన్నేళ్ళయినా మసకబారవు.కారణం తెలీదు.

ఎర్లీ ఎనభైల్లో మాట అన్నమాట. నేనప్పుడు ఆరోతరగతి. మా తెలుగు మాష్టారింటికి ట్యూషను కెళ్ళేవాడిని . ఆయన పేరుకు తెలుగు మాష్టారయినా ఒక్క లెక్కలు తప్ప అన్నీ చెప్పేవారు. అదే ట్యూషనుకి లెక్కలు చెప్పడానికి సత్తార్ అనే మాష్టారింకోకాయన వచ్చేవారు. వారి గురించి ఇంకెప్పుడైనా.

పొద్దున్నే ఆరింటికి ట్యూషను. ఐదు యాభై ఐదు కల్లా వాళ్ళింట్లో ఉండేవాడిని. నాకంటే ముందు వచ్చిన వాళ్ళతో గది మోస్తరుగా నిండి ఉండేది. లోపలికి అడుగు పెట్టగానే చల్లటి ఉదయపు గాలి మాయమై ఒకరకమైన వెచ్చదనం గదంతా పరచుకొని ఉండేది. ఖాళీ దొరికిన చోట కూర్చొని మాష్టారి కోసం ఎదురు చూపులు. మధ్యగది లో ఫ్యాను గాలికి మధ్యగది డోరు కర్టెను కదిలినప్పుడల్లా పంచలో కూర్చొని ఉన్న మాచూపులు అప్రయత్నంగా వైపు కదిలేవి. లోపల మనుషులు అటూ ఇటూ తిరుగుతున్నట్టు కనిపించినా మాటలు అస్సలు వినిపించేవి కావు. భారమైన నిశ్శబ్దం. అప్పుడప్పుడు లంగా వోణీ వేసుకొని ఉన్న మా మాష్టారిగారమ్మాయి క్షణకాలం కనిపించేది. కొన్ని కొన్ని సార్లు తన పట్టీల చప్పుడు మాత్రమె వినిపించేది.డోరు కర్టెను కాస్త పక్కకి జరిగినట్టనిపించినా ఒక రకమైన కంగారుతో తను వెంటనే వచ్చి సరిచేసేది. ఇంతలొ మాష్టారుగారు పూజ ముగించుకుంటున్న సూచనలు. మరి కొద్దిసేపటికి గొంతుసవరించుకుంటూ మాష్టారు గారు మధ్యగది ద్వారం వైపు అడుగు వేస్తున్న చప్పుడు. మేమంతా బిర్ర బిగుసుకు పోయేవాళ్ళం. తను కర్టెను తొలగించుకొని పంచలోకి అడుగుపెడుతుంటే , భయంతోనో, మాష్టారు గారి మీది గౌరవం తోనో నిశ్శబ్దం పదింతలు పెరిగి , గాలి కూడా బరువెక్కి పోయేది.

అదే ట్యూషను సాయంత్రాలు కూడా ఉండేది. సాయంత్రాలు ఉదయమున్నంత గంభీరంగా ఉండేవి కాదు. తేలికైన గాలి. అప్పుడప్పుడు మేము వెళ్ళేసరికి మాష్టారుగారు బజారునుంచి ఇంకా వచ్చి ఉండేవారు కాదు.మాష్టారు గారమ్మాయి పంచలోనే ఏదో చదువుకుంటూ ఉండేది. మధ్య మధ్యలో పాడుతూ ఉండేది. శ్రావ్యమైన కంఠస్వరం . చాలా చక్కగా పాడేది. తను పాడే పాటలోని రెండు లైన్లు నాకిప్పటికీ గుర్తే ..

గురుతు కొచ్చే జ్ఞాపకాలూ
ఎదను గుచ్చే గులాబి ముళ్ళూ..

పల్లవో తెలీదు, చరణమో తెలీదు. సినిమా పాటో, లేక లలిత గీతమో తెలీదు.ఈరెండు లైన్లు మాత్రం నాకు ఇన్నేళ్ళయినా గుర్తుండి పోయాయి. ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనన్ని సార్లు విన్నట్టు గుర్తు. బహుశా తనకిష్టమైన పాట కావచ్చు.

మేము రాగానే మమ్మల్ని చూసి లోపలికెళ్ళి పోయేది. అప్పుడప్పుడు తను పంచలో మర్చిపోయి వదిలి వెళ్ళిన తన కాలేజీ నోటు బుక్కులు చూసేవాళ్ళం. పెద్ద పేద్ద లాంగు నోటు బుక్కులు. దాని నిండా ఆకుపచ్చ, ఎరుపు,గులాబి రంగుల్లో స్కెచ్ పెన్నులతో వేసిన రకకాల బొమ్మలూ, ఎర్ర ఇంకుతో అండర్లైన్ చేసిన లైన్లూ. బయాలజీ విద్యార్ధి అనుకుంటా. మేమూ పెరిగి పెద్దయి అలాంటి లాంగు నోటు బుక్కుల్లో అలా రక రకాల బొమ్మలేయాలని అనుకునేవాళ్ళం.

తను మమ్మల్ని చూడగానే పాడుతున్న పాట ఆపి లోపలికెళ్ళి పోయేది. కొన్నిసార్లు పాట లోపలి నుండి సన్నగా వినిపిస్తుండేది. అప్పుడప్పుడు ట్యూషను జరుగుతున్నప్పుడు , మాకు వెనకవైపున దండెం మీద ఆరేసిన వోణీయో,పరికిణీయో అవసరమైనప్పుడు తను పిల్లిలా చడీ చప్పుడు లేకుండా ఇలా వచ్చి తీసుకొని అలా వెళ్ళిపోయేది.

తను ఇప్పుడు యాభైలకు దగ్గరగా ఉండి ఉంటుంది అనుకుంటా. ఎదురుపడితే పోల్చుకోలేను గాని , ఒక్కసారి గుర్తుపట్టాక, పరిచయం చేసుకొని.. రెండు లైన్లూ ఆమెకి వినిపించి ఆమె కళ్ళలో మెదిలే ఆశ్చర్యాన్ని చూడాలని ఉంది. నాకెందుకో బాగా నమ్మకం తను ఆపాటను ఇంకా గుర్తుపెట్టుకొనే ఉంటుందని..

మీకు ఈపాట గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి.Tuesday, October 13, 2009

నా కొత్త బ్లాగు వివరాలు

ఈరోజు కాస్త తీరిక దొరికి మొత్తానికి నా కొత్త బ్లాగు పని కొంత పూర్తి చేశాను. పన్లో పనిగా రెండు టపాలు కూడా రాసేసా. ప్రస్తుతమున్న ఈ బ్లాగు ఫార్మాట్ ని కొద్దిరోజుల్లో మారుస్తాను.

బ్లాగు పేరు నీలి మేఘాలలో . త్వరలోనే దీన్ని కూడా కూడలి, జల్లెడలలో చేరుస్తాను.

Thursday, October 8, 2009

ప్రాజెక్టు అయిపోతోంది! ప్చ్


ఇక నేడో రేపో Its nice working with you all అనే ఈ-మెయిలు పంపాలి అందరికీ. అసలు ఈ ప్రాజెక్టుకి రావడమే ఒక వింత. మొదట్లో వద్దనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో పనిచేసి వదిలేసిన పురాతన సాఫ్ట్వేర్ వర్షను మీద పని. ముందుకొచ్చాక మళ్ళా వెనక్కి వెళ్ళాలంటే కష్టమే . ఈ సాఫ్ట్వేర్ ఫీల్డులొ అది మరీనూ. అయితే కొన్ని వృత్తిపరమైన మొహమాటాలూ, ఎలాగు ఆర్నెల్ల ప్రాజెక్టు కదా , కన్నుమూసి తెరిచేలోగా ఆర్నెల్లు చిటికెలో గడుస్తాయి అనే ఆలోచనతోనూ, వొహాయో లో ఇల్లు ఖాళీ చేసి , కార్లో మేమిద్దరం సీట్లల్లో కూర్చోగా మిగిలిన ప్రతి స్క్వేర్ ఇంచులోను ఇంటి సామాను మొత్తం కుక్కి పదమూడు గంటల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నాను. ఆర్నెల్ల ప్రాజెక్టు కాస్తా దాదాపు మూడేళ్ళ ప్రాజెక్టు అయి కూర్చుంది. నేను ఊహించలేదు ఇంతకాలం ఇక్కడ పనిచేస్తానని. నన్ను వదిలించుకొని ఖర్చు తగ్గించుకోవాలని మధ్యలో మా మానేజరు ఒక రష్యన్ భామని తెచ్చుకున్నా, తను కంప్యూటర్ మానిటర్ వైపుకంటే తన హేండ్ బాగ్ లో ఉన్న అద్దంలో తన మొహాన్ని ఎక్కువసేపు చూసుకొనేది. ఒక నెల లీవు పెట్టి నేను ఇండియా వెళ్ళిన టైంలో , తనకీ , మా మానేజరుకీ ఏదో విషయంలో యవ్వారం చెడి , "ఐ విల్ సు యు" అని మధ్యవేలు చూపించి తుర్రుమంది. ఒకానొక అర్ధరాత్రి ఇండియాలో ఉన్న నాకు మా మానేజరు నుంచి ఫోన్, ఇండియానుంచి రాత్రుళ్ళు పని చెయ్యగలవా అని. లీవు పొడిగిస్తే సంతోషంగా చేస్తా అన్నా. చక్కగా నాలుగునెలలు, జీతానికి జీతం , వెకేషన్ కి వెకేషన్.కంపెనీ లాప్టాప్ ఎలాగు ఉంది, దానికొక రిలయన్స్ వారి బ్రాడ్ బాండ్ కార్డు తగిలిస్తే ఇక మనం ఎక్కడున్నా పనికి ఢోకా లేదు. ఎటొచ్చీ లాప్టాప్ బ్యాటరీ చార్జ్ ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే చాలు. నాలుగు నెలలు పెద్దగా ఇబ్బందులు లేకుండానే పని లాగించేసా.ఇక్కడంటే అలవాటే గాని, ఇండియాలో షిర్డీ నుంచి వస్తూ బస్సులో ఆఫీసు పని చెయ్యటం ఒక అందమైన అనుభవం. ( కొన్ని మలుపుల్లో ,అప్పుడప్పుడూ సిగ్నల్స్ లేక ఆ బ్రాడ్ బ్యాండ్ కార్డు సతాయించిందనుకోండి. అది వేరే విషయం :) )

ఒక సంవత్సరం క్రితం నేను ప్రస్తుతం పనిచేసే కంపెనీని ఇంకొక కంపెనీ టేకోవర్ చేసింది. వాళ్ళ సిస్టమ్స్ అన్ని వేరే సాఫ్ట్వేర్ లో ఉండటం వల్ల ఇక్కడ మా డిపార్ట్మెంటు లో కూడా బెల్లు మోగింది. కొత్త సిస్టం లోకి వెళ్తున్నాం కాబట్టి ఈ క్రిటికల్ టైంలో మాకు మీ సహాయం కావాలి అని డైరక్టుగానూ, ఒకసారి వెళ్ళాక మిమ్మల్ని ఇక్కడినుంచి సాగనంపటానికి మాత్రం మాకు ఎవరి సహాయం అవసరం లేదు అని ఇన్ డైరక్టుగానూ మా మానేజరు మీటింగు పెట్టి మరీ చెప్పాడు.

మొన్న ఆగస్టులో ఆ పని కూడా పూర్తయింది. ఇక అందరూ ఎదురుచూడ్డం మొదలెట్టారు సెండాఫ్ ఉత్తర్వులకోసం. మొదట నాతో పనిచేసే ముగ్గుర్ని పీకేసారు. ఆ ముగ్గురిలో ఒకడు తెల్లోడయ్యేసరికి Conspiracy theory లకు చోటు లేకా , గాసిప్స్ కి ఆస్కారం లేకా నా తోటి భారతీయ వర్గం చాలా ఇబ్బంది పడింది. ఆతరువాత ఇంకో ఇద్దరిని. మొత్తానికి డిపార్ట్మెంటులో నేను ఒంటరినైపోయాను. నిజానికి ఆఫీసులో మాకు అత్యంత ప్రీతిపాత్రమైన సమయం అంటే కాఫీ బ్రేకే . ఆ టైం లో మా కబుర్లకు అంతుండదు. పది కాగానే గుంపుగా అందరం పొలోమని పరుగు బ్రేక్ రూంకి. అట్లాంటిది ఇప్పుడు నా కాఫీ బ్రేకు వెల వెలా బోతోంది. ఇక లంచ్ టైం అయితే చెప్పనవసరం లేదు. మేమందరం లంచ్ బ్రేక్ లో ఎవరి కుర్చీల్లో వారు కూర్చునే వాళ్ళం. ఎవరైనా లీవు పెట్టి రాకపోతే ఆ సీటు ఖాళీ గా ఉండాల్సిందే. మొదట్లో లంచ్ టైంలో ఆ రెండు ఖాళీ సీట్లను చూసి మాకు బాగా దిగులేసేది. ఇప్పుడు ఇంకెవరూ లేరు. నేనొక్కడినే. అన్ని కుర్చీలూ నావే. దిగులంతా నాదే.

నిన్న సర్వర్ రూం పక్క నుంచి వెళ్తూ అలవాటుగా అద్దంలోంచి నా (పాత) ప్రొడక్షను సర్వర్ వైపు చూసాను. అది చాలా ఒంటరిగా, దిగులుగా ఉన్నట్లు అనిపించింది నాకు. దాని లైట్లుకూడా పాపం దిగులుగా, ఏదో తప్పదు అన్నట్లు మిణుకు మిణుకు మంటూ వెలిగి ఆరిపోతున్నట్లున్నాయి. ఒకప్పుడు అవే లైట్లు చీకట్లో మిణుగురు పురుగుల్లా అందంగా కనిపించేవి. వెలిగి ఆరిపోవటంలో ఒకరకమైన ఠీవి కనిపించేది.నెల క్రితం వరకూ దాన్ని అందరూ అందమైన బుజ్జి కుక్కపిల్లని చూసుకున్నట్టు ప్రేమతో సాకేవారు. దానికి కాస్త వేడి చేస్తే నానా హైరానా పడిపోయేవారు. ఆ బుజ్జి కుక్కపిల్ల కాస్తా ఇప్పుడు గజ్జి కుక్కపిల్ల అయిపొయింది. మొన్నొకసారి సర్వర్ రూంలో ఏసీ లీకయి నీళ్ళు దాదాపు ఆ సర్వర్ దరిదాపుల్లోకి వచ్చినా ఎవరికీ చీమకుట్టినట్లయినా లేదు. అదే ఒకప్పుడయితే మా మానేజరు మీటింగెట్టి మమ్మల్ని చెడా మాడా తిట్టేవాడు.

ఎంత ప్రొడక్షను సర్వర్ కాక పోయినా, దాన్లో ఇంకా నేను రాసిన ప్రోగ్రాములు కొన్ని రన్ అవుతూనే ఉన్నాయి. నేను రిపీటేడ్ గా చేసే పనుల్ని చాలావరకు ప్రోగ్రాములు రాసి షెడ్యూలు చేసి పడేస్తాను. నిర్దేశిత టైంకి అవి నా ప్రమేయం లేకుండా రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ ఉన్నా లేకున్నా , నేను రాసిన ఆ ప్రోగ్రాములు కనీసం ఇంకొన్నేళ్ళు రన్ అవుతూనే ఉంటాయి. అర్ధరాత్రో ,అపరాత్రో అవి ప్రాణం పోసుకుంటాయి. నిర్దేశించిన పని పూర్తి చేసి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాయి.ఈ మనుషులు గుర్తుంచుకున్నా, గుర్తుంచుకోకున్నా , అవి మాత్రం నేను ఒకప్పుడు ఇక్కడున్నాననే నిజాన్ని అవి బ్రతికున్నంతవరకు ( పవర్ ఆఫ్ చేయ్యనంతవరకు) గుర్తు చేసుకుంటాయి. :)

లోపలికెళ్ళి అక్కడున్న సర్వర్లన్నిటినీ ఒక్కసారి కళ్ళారా చూసుకున్నాను. మళ్ళా నాచూపు ఒకప్పటి ప్రొడక్షను సర్వర్ మీద ఆగింది."నువ్వు లేవు నీ పాట ఉంది", అన్నట్లు "నువ్వుండకపోవచ్చు , కానీ నీ ప్రోగ్రాములున్నాయి" అని అది నాతో గుస గుస లాడినట్టనిపించింది నాకు.
Sunday, October 4, 2009

నా కొత్త బ్లాగు

ఇంకా పేరు నిర్ణయించుకోలేదుగాని , "అనంతం" కి అనుబంధంగా మరొక బ్లాగు మొదలెడదామని అనుకుంటున్నాను. "అనంతం" లానే ఇందులో కూడా సుత్తే ఉంటుంది ,అయితే కాస్త సూటిగా ఉంటుంది. చేట భారతాలు కాకుండా , కట్టె, కొట్టె, తెచ్చె రీతిలో రాయాలని ప్లాను. Casual blogging అన్నమాట. ఒక్కొక్క పోస్టు క్లుప్తంగా ఒక పది పదిహేను వాక్యాల్లో, నేను చదివిన పుస్తకం గురించో , చూసిన సినిమా గురించో, నిద్రపట్టక పక్క మీద అటూ ఇటూ దొర్లుతుంటే వద్దన్నా వచ్చి మీదకువాలే ఆలోచన గురించో, దైనందిక జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సరదా సంఘటనలగురించో, ఆఫీసు విషయాల గురించో,రాజకీయాల గురించో, టీవీలో ఈరోజు చూసిన వార్త గురించో, నా కేమెరాకి చిక్కిన అందమైన దృశ్యం గురించో .. ఇలా దేనిగురించైనా కావచ్చు.

చదివి మీ ఆలోచనలని పంచుకుంటే సంతోషిస్తాను. మీ టైం బాలేక కొన్ని కొన్ని సార్లు నేను రాసింది మీకు నచ్చొచ్చు , కానీ అందులో వ్యాఖ్యానించేంత సరుకుండకపోవచ్చు . అలాంటప్పుడు చదివి నిశ్శబ్డంగా నా బ్లాగుని దాటి ముందుకు వెళ్ళిపొండి. చాలా బావుందనో, బాగా రాసాననో, లేదా స్మైలీల తోనో మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఏకీభవించినా, విభేదించినా, సమయం వెచ్చించి నేను రాసింది చదివే వారంటే నాకెప్పుడూ గౌరవమే. అయితే ఎప్పుడూకాకపోయినా అప్పుడప్పుడు సమయాభావం వల్ల మీ కామెంట్లకు నేను జాబివ్వలేక పోవచ్చు. అన్యధా భావించవద్దని మనవి.

వివరాలు ఒకట్రెండు రోజుల్లో మీతో పంచుకుంటాను.

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...