Monday, June 8, 2009

వయసు ముచ్చట్లు

వెకిలితనానికీ, అవకాశవాదానికీ తావివ్వని అమాయకత్వం మూర్తీభవించిన వయసది. ఆ భావనల పరంగా అ ఆ లు దిద్దుకుంటున్న అందమైన వయసది..
********************************************************************

మొదట్లో అస్సలు అర్ధమయ్యేది కాదు.

వారంలో కనీసం ఒక్కసారైనా అమ్మకానీ నాన్నకానీ ఆ మాట అంటూనే ఉండేవారు. అప్పుడప్పుడు కోపం వచ్చేది కూడా. ఏమీ అనలేని అశక్తతతో కోపంగా విసవిసా మేడమీదకి వెళ్ళి, ఎత్తైన ఆ పిట్టగోడ మీద తలవాల్చి ఆ ఎదురుగా కనిపించే గుడి గోపురాన్నీ, సాయంత్రాలైతే ఆ గుళ్ళోంచి వినపడే పాటల్నీ వింటూ "ఇప్పుడు నేనేం చేసాననీ" అంటూ నన్ను నేనే ప్రశ్నించుకొనేవాణ్ణి. కోపం తగ్గటానికి కొంత సమయం పట్టేది. అప్పుడప్పుడు ఎంతసేపటికీ నేను కిందకి రాకపోతే నాన్న మేడమీదకి వచ్చేవాడు ప్రేమగా "చిన్నోడా ఇక్కడేం చేస్తున్నావురా" అని పిలుస్తూ.

ఎంత ప్రేమగా పిలిచినా వారన్న ఆ మాట గుర్తొస్తే ఉక్రోషం కట్టలు తెంచుకొనేది. ఎంతమాటన్నారు?

చదువు మీద శ్రద్ద తగ్గిపొతోందట. నాకైతే అలా అనిపించటంలేదు. నాకొచ్చేమార్కుల్లో ఏమాత్రం తేడా లేదు.కనీసం మార్కులు ఎన్నివస్తున్నాయో కూడా తెలుసుకోరు.మాట మాత్రం అనేస్తారు.

ఈమధ్య గమనిస్తూనే ఉన్నాను వీరి ప్రవర్తన. అక్కయ్య ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే నన్ను మాట్లాడనిచ్చేవారు కాదు. కళ్ళతోనే సైగ చేసేవారు లోపలికెళ్ళు అని. ఒక చెవి ఇటేసి వాళ్ళ మాటలు వింటానని అనుకునేవారో ఏమో ఇటు ఇంటికి ముందు వైపున్న పంచలోకీ వెళ్ళనిచ్చేవారు కాదు. ఇక లోపల మిగిలింది ఆ వంటగదే. ఏదో ఒక పుస్తకం చదూకుంటూనో, గిన్నెలమీద మూతలు తీసి ఏగిన్నెలో ఏముందో చూస్తూనో, లేదా పాలగిన్నె అల్మరాలో పెట్టడం మర్చిపోయారేమో, అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ప్రతి పావుగంటకోకసారి కిటికిలోంచి వంటగదిలోకి దూరే ఆ బుర్ర తక్కువ పిల్లి తల నిమురుతూనో,"వీల్లెప్పుడెళ్ళిపోతారురా బాబూ" అనుకుంటూ భారంగా సమయం వెళ్ళబుచ్చేవాడిని.

అప్పుడప్పుడు ఆ వంటగది పక్కనే ఉన్న గొడ్లచావిడిలోకెళ్ళి కొమ్మిసిరే అలవాటులేని ఆ చిన్నగేదె పక్కనే నిలబడి, దాని తలనిమురుతూ, దాని అరమోడ్పు కన్నులు చూసి ముచ్చటపడుతూ సమయం గడిపేవాడిని.

అప్పటి నావయసు ఏ పద్నాలుగో..పదిహేనో..

********************************************************************************************************************************
నాలో ఆ ఆలోచనలు ఎలా మొదలయ్యాయో, ఎప్పుడు మొదలయ్యాయో అస్సలు గుర్తు లేదు. వాటి క్రమం మాత్రం బాగా గుర్తుంది. చాలామందికిలాగే నాలోనూ ఆ ఆలోచనలకు పునాది సినిమాల ద్వారానే పడింది.

మా ఇంటినుంచి స్కూలు దాదాపు మూడుకిలోమీటర్లు ఉండేది. పెద్దబజారు, దాన్ని దాటితే కన్యకాపరమేశ్వరి గ్రంధాలయం. తరువాత వరుసగా పండ్లకొట్లు. వాటిని దాటి కుడివైపు సాలివారివీధి వైపు తిరగ్గానే మూలమీదే ఉండే రైసుమిల్లూ, దాని తాలూకు పెద్ద గోడమీద అంగుళం కూడా ఖాళీ లేకుండా సినిమా పోస్టర్లు.నవ్వుతూ తుళ్ళుతూ మాటలు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం కాస్తా ఆ పోస్టర్ల దగ్గరికొచ్చేసరికి గంభీరంగా మారిపోయేవాళ్ళం.ఒకరికి తెలీకుండా మరొకరం వాటివైపు దొంగచూపులు చూసేవాళ్ళం. ఆ సినిమాల పేర్లు కూడా విచిత్రంగా ఉండేవి. ఒక్కణ్ణే ఆ దారెంట వెళ్తుంటే నన్నెవరూ చూడటంలేదు కదా అని నిర్ధారించుకొని ఇంకాస్త పరీక్షగా చూసేవాడిని. అదేమిటో ఆ పోస్టర్లలో అందరి చూపులు కలిసేచోట ఒక చిన్న దీర్ఘ చతురస్రం ఉండేది. లేదా ఈ సినిమా పలానా ధియేటర్లో చూడొచ్చు అని తెలిపే ఆ ధియేటర్ తాలూకు స్లిప్పు అంటించి ఉండేది. నా దొంగచూపులన్నీ అక్కడికే. నేను అలా దొంగతనంగా చూసేవాణ్ణా, నాలాగే ఎవరైనా చూస్తూ పట్టుబడితే మాత్రం వారిని నలుగురిలో బాగా ఆటపట్టించేవాడిని. నాలోని హిపోక్రసికి అది తొలిమెట్టేమో.

ఉదయం ఆటగా మాత్రమే నడిచే అటువంటి సినిమా ఒకటి చూసి బయటికివస్తూ ఎవరికంట్లోనో పడ్డ సత్యవతి వాళ్ళ అన్నయ్య బాలు గురించి మేము చాలా రోజులు కథలు కథలుగా చెప్పుకున్నాం. చెడిపోవటం అనే పదానికి అర్ధం తెలీకుండానే మేమందరం తీర్మానించేసాం వాడు చెడిపోయాడని.( ఈ చెడిపోవటం అంటే ఏమిటని అడక్కండి, పెద్దలనోట రోజూ వినపడే మాట అది. అంతకుమించి ఇంకేమీ తెలీదు). ఈ బాలూ గాడు ఎప్పుడు ఎదురుపడ్డా ఆ పోస్టర్లను చూసినంత ఆసక్తిగా వాడి వైపు చూసేవాళ్ళం. వాడెదురుగానే మాలోమేము ముసిముసి నవ్వులు నవ్వుకోనేవాళ్ళం. పాపం వాడికి అర్ధమయీ అవనట్టు ఉండేది.

ఆ సినిమాలని వదిలేస్తే, మామూలు సినిమాల పరంపరలో నాకు బాగా గుర్తున్న వాల్ పోస్టరు "సీతాకోకచిలుక". గులాబిరేకుల కింద కప్పబడిఉన్న ఆ హీరో హీరోయిన్ల ఆఛ్చాదన లేని భుజాలు చూస్తే చిలిపి ఊహలేవో రేగేవి. అంతలోనే సిగ్గూ, దాంతోపాటు నన్నెవరైనా చూస్తున్నారేమో అనే భయమూ నన్ను కప్పేసి ఆ చిలిపి ఊహల్ని ఆమడ దూరం తరిమేసి నా అడుగులు అక్కడినుండి వడి వడిగా పడేలా చేసేది.

అప్పట్లో ఇంగ్లీషు సినిమాలు ఉదయం ఆట మాత్రమే ఆడేవి. రోజర్ మూర్, షాన్ కానరీ నటించిన జేమ్స్ బాండ్ చిత్రాలూ, క్రిస్టోఫర్ రివ్ సూపర్ మాన్, ఎంటర్ ది డ్రాగన్లూ, షావాలిన్ టెంపుళ్ళూ , కింగు కాంగులూ గట్రా అన్నమాట.ఇక ఆ సినిమాల విషాయానికొస్తే వాటిల్లో అక్కడక్కడా కనపడే ఆ ఇంగిలీషు ముద్దులు నాకు వింతగానూ, ఆసక్తిగానూ, అదేటైములో నన్నెవరైనా గమనిస్తుంటే లేని కంపరాన్ని మొహంలో తెచ్చిపోట్టుకొనే విధంగానూ ఉండేవి. సినిమా అయిపోయాక మా అన్నయ్యో లేక ఆయన ఫ్రెండ్సో సినిమా ఎలా ఉందిరా అంటే "చాలా బావుంది గాని మధ్య మధ్యలో ఆ సీన్లేంటి చంఢాలంగా ? " అనేవాడిని మరీ అమాయకంగా. మంచిబాలుడు అనిపించుకోవాలనే నా తాపత్రయం నాది మరి.

హిందీ నేర్చుకున్నాను కాబట్టి హిందీ సినిమాలు కూడా విరివిగా చూసేవాడిని. ఆ పరంపరలో రాజ కపూర్ "రాం తేరీ గంగా మై లీ","బాబీ" చూసిన రోజుల్లో బుర్ర హీటెక్కి చదువు షార్ట్ సర్క్యూట్ అయి, చదువుతున్న పుస్తకం మూసేసి మరీ ఆలోచనల్లో మునిగిపోయేవాడిని.ముఖ్యంగా "రాం తేరీ ..." లో ఆ పాట.ఇప్పటి సెన్సారు ప్రకారం కూడా అలా సినిమాకి సెన్సారు సర్టిఫికేట్ రావటం కష్టం. ఏదయితేనేం, దాదాపు ఒక రెండుమూడేళ్ళు నా ఆలోచనల్లో అంతర్భాగమైపోయారు ఆ ఇద్దరు హీరోయిన్లు (మందాకిని అండ్ డింపుల్ కపాడియా). అలానే టార్జాన్ సినిమాలో కిమీ కట్కర్ కూడా కలలో "అబ్బ చదివింది చాల్లేద్దూ కాస్త పక్కకు చూడుగురూ" అనేసింది నాతొ. "బాబీ" తరువాత "జాన్ బాజ్" లో డింపుల్ కూడా నాతో ఒకాటాడుకుంది.


ఈ కలవరింతలూ, పలవరింతలతో కూడిన నా అనుమానాస్పద ప్రవర్తన మూలానఇంట్లో పోలీసు రాజ్యం మొదలయింది. అమ్మా నాన్నల నిఘా కళ్ళూ, సమయం సందర్భం లేకుండా వినవచ్చే హెచ్చరికలూ మొదట్లో అయోమయానికి తరువాత్తరువాత అసహనానికీ గురిచేసేవి. అంతకుముందు సినిమాకెళ్తున్నా అంటే రూపాయి చేతిలోపెట్టే అమ్మ ఇప్పుడు సినిమాపేరు చెప్తేగాని డబ్బులివ్వటంలేదు. సినిమాచూసి వచ్చాక కాంతారావు సినిమాకెళ్ళానని చెప్పినా నిర్ధారించుకోటానికి కథ చెప్పమనేవాళ్ళు. ఉత్సాహంగా కథ చెప్తుంటే మధ్యలోనే ఆపమనేవాళ్ళు.ఎవరితో కలిసెళ్ళావ్ అంటూ ఆరాలు తీసేవారు. నా చిన్ని బుర్రకి అవన్నీ అర్ధమవటానికి చాలా కాలమే పట్టింది.

రోజులు గడిచిపోతున్నాయి.

ఇంట్లో నిక్కర్లూ, బయటికి వెళ్తున్నప్పుడూ పేంట్లూ కట్టే వయసొచ్చింది.

దీని పర్యవసానమా అన్నట్లు నా టీనేజ్ హాక్కులను కాలరాస్తూ, మా నాన్న నామెడకొక తాడు కట్టి దాని రెండో కొన తీసుకెళ్ళి గుంటూర్ నాజ్ సెంటర్లో అప్పుడెప్పుడొ ఆయన ముచ్చటపడి కొని, మా ఇంటి మధ్యగదిలో వినాయకుడి పటం పక్కన గోడకి తగిలించిన గోడగడియారానికి కట్టేశాడు . దాని పర్యవసానంగా..

కాలేజీనుంచి ఇంటికిరావటం ఐదు నిమిషాలు ఆలస్యం అయితే చాలు ఒక అరగంట సేపు తలంటు..

ట్యూషను నుంచి రావటం ఆలస్యం అయినా .. డిటో డిటో..

సినిమా చూట్టానికి వెళ్ళి రావటం ఆలస్యం అయినా కూడా అదే తంతు. పెద్ద సినిమాలు కాబట్టి "లవకుశ", "మాయా బజార్" లాంటి పౌరాణికాలనుమాత్రం సహృదయంతో అర్ధం చేసుకొనేవాడు. మిగతా ఏ సినిమా అయినా "శుభం" కార్డు పడడమూ, నేను ఇల్లూ చేరటమూ ఒక నిష్పత్తి ప్రకారం జరిగిపోవాల్సిందే..

చివరకు ఈ నిఘా ఎంతలా ముదిరిపోయిందంటే నేను స్నానాలగదిలోంచి బయటిరావటం కాస్త ఆలస్యమయినా "ఏంచేస్తున్నావ్ లోపల ఇంతసేపు?" అని గద్దించేంత...

***********************************************************************************

సినిమాల తరువాత నేను ఎంతో ఇష్టంగా చదివే వారపత్రికలు ఈ విషయంలో తమవంతు పాత్ర విజయవంతంగా పోషించాయి. ఆ సపరివార పత్రికలోని అన్నిపేజీలూ రాజసం ఉట్టిపడేలా ఠీవిగా చదివినా ఆ రెండు పేజీలు మాత్రం చుట్టూ ఎవరూలేరని నిర్ధారించుకొన్నాక, బెరుకు బెరుగ్గా, చీమచిటుక్కుమన్నా ఉలిక్కిపడుతూ హడావిడిగా చదివేవాడిని. చదివాక ఏదో గిల్టీ ఫీలింగ్. ఆ గిల్టీ ఫీలింగ్ అలా ప్రతివారం ఠంచనుగా రిపీటయ్యేది. ఆ పత్రికలో నాకిష్టమైన జోకో, లేదా కార్టూనో ఇంట్లొవాళ్ళకి చూపించటానికి వాళ్ళముందు పేజీలు తిప్పుతుంటే ఆ పేజీ దగ్గరికొచ్చేసరికి సెకనులో వందోవంతులో చప్పున తిప్పేవాడిని. తద్వారా ఆ పేజీ అంటే నాకు అసహ్యం అని వారికి చెప్పి మంచి మార్కులు కొట్టేద్దామనుకొనే తెలివితక్కువతనం నా సొంతం మరి.

ఒక వేసవికాల మధ్యాహ్నం...

రోహిణికార్తె ఎండలు.

హిందీ ట్యూషనుకి ఎందుకో ఆరోజు సెలవు. బయటికి వెళ్ళి ఆడుకోవడానికి పర్మిషను లేదు. ఏమీ తోచక పిచ్చెక్కి పోతోంది నాకు. నాన్న ఇంటికి రావటం ఆరోజు ఎందుకో ఆలస్యం అయింది. అందరూ మధ్యాహ్నభోజనాలు ముగించి ఎవరికి దొరికిన మంచం వారేసుకొని ఆదమరిచి నిద్రపోతున్నారు. మధ్య గదిలో ఎవరూలేరు. మంచం వాల్చుకొని సపరివారపత్రిక తెరిచాను. ఏమీ కనపడటంలేదు అంతా చీకటి. గొడ్లచావిడికీ మధ్యగదికీ ఉన్న కిటికీ తెరిస్తే వెలుతురు బానే వస్తుంది. కానీ ఆపని చేయడానికి బద్దకం వేసి, లేచి, మధ్యగది డొరుకర్టెను తీసి తలుపుమీదికేసి, తల వీధివైపుపెట్టి ఆ వెలుగులో పత్రిక చదవనారంభించాను. ఎందుకో ఒకసారి ఆపేజీ చూద్దామనిపించింది. నాన్న సైకిలు లోపల పెట్టడానికి సైకిలు ముందు చక్రంతో వీధి వాకిలి తలుపుల్ని ఒక్క ఉదుటున నెట్టి లోపలికొస్తాడు. ఇంట్లో ఎక్కడున్నా ఆ శబ్దం వినగానే మాకు తెలిసిపోతుంది నాన్న వచ్చాడని. అంతగా అయితే ఆ శబ్దం వినగానే పేజీ మార్చేయొచ్చులే అనేది నా ధైర్యం.

చదువుతున్నాను...

అర్ధమయీ అవని వయసు. సందర్భాన్ని బట్టి పదాలకర్ధం వెతుక్కొనే వయసు.

అలా చదువుతూ, అంతలోనే ఆలోచిస్తూ అలా ఆ ఆలోచనల సమరాంగణంలో మునిగిఉన్నవేళ..

మొదట పేజీపై ఏదో నీడ కదిలినట్టయింది. వాకిట్లో వేసిన చెట్టు గాలికి కదలగా ఏర్పడ్డ నీడేమో అనుకున్నా. ఎందుకైనా మంచిది అని తల తిప్పి చూస్తే కటకటాల్లోంచి చెయ్యి లోపలికిపెట్టి గడియ తీయడానికి ప్రయత్నిస్తూ నాన్న. బహుశా భోజనం చెయ్యగానే వెంటనే బయటికివెళ్ళే పని ఉందేమో సైకిలు బయటే పెట్టినట్లుంది.

గుండే ఆగినంత పనయ్యింది. చటుక్కున పత్రిక పక్కన పడేసి వచ్చి తలుపుతీసా. తల పైకెత్తి చూడలేనంత గిల్టీ ఫీలింగ్. నాన్న లోపలికి వెళ్ళగానే అక్కడినుంచి నేను పడుకున్న మంచంవైపు చూసా సాలోచనగా. ఇక్కడినుంచి చూస్తే నేను చదువుతున్న పేజీ కనపడుతుందా లేదా అనేది అంచనా వేయలేకపోయాను.

ఆ తర్వాత వారం పాటు నాన్న చెప్పిన ప్రతి పనిని కిక్కురుమనకుండా చేశా.మాములుగానయితే "ప్రతిపనీ నాకే ఎందుకు చెప్తారు, పెద్దోడికి చెప్పొచ్చుగా?" అని మొండికేసేవాడిని.

నేనేమీ చెడుమార్గం పట్టడంలేదు అనే భావాన్ని వ్యక్తం చేయడానికి అప్పట్లో నాకున్న ఏకైక మార్గం చెప్పిన పని చెప్పినట్లు చేయడం.

**********************************************************************************
విధి ఎప్పుడూ నాలుగు స్తంభాలాటే ఆడుతుంది కదా. ప్రస్తుతానికి నేనూ , నాన్న, ఆ గోడగడియారం అనే మూడు కేరక్టర్లే ఉన్నాయి. విధి ముచ్చటపడిందో లేక నా వయసే ముచ్చటపడిందో గానీ నా ఇంటర్మీడియెట్ మొదట్లో ఆ నాలుగో కేరెక్టర్ మా మధ్య ప్రవేశించింది. ఈ కేరెక్టరుకున్న బలం అంతా ఇంతా కాదు. దీని పుణ్యమాని మా నాన్న ఏమాత్రం సహించలేని విప్లవాత్మకమయిన మార్పులు ప్రవేశించాయి నాలో..

పేంట్ వెనక పాకెట్లో దువ్వెన పెట్టుకోవడం, ఒకటికి పదిసార్లు అవసరం లేకపోయినా తల దువ్వుకోవటం, బయటికెళ్ళబోయే ప్రతిసారీ అద్దం ముందు కనీసం ఒక రెండునిమిషాలు గడపటం, రేపటికి ఇస్త్రీ బట్టలున్నాయా లేవా అని ఈరోజే హైరానా పడిపోవడమూ, ఇంతకుముందులా ఇంట్లోనే అమ్మకి "అమ్మా కాలేజికెళ్ళొస్తా" చెప్పకుండా ఆ మాట వీధిబయట సైకిలెక్కి, బెల్లుకొట్టి అరచి మరీ చెప్పడం, కారణమేదీ లేకుండా హడావుడిగా మేడమీదికి పరిగెత్తడం, ఎప్పుడూ కీచులాడే చెల్లెల్నిఅకస్మాత్తుగా వీఐపీ లా చూసుకోవడం గట్రా..

ఆ నాలుగో కేరక్టరు గురించి ఇంకెప్పుడైనా...

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...