Friday, February 28, 2020

పాడుబడ్డ ఇల్లు

అదేమిటో ఈ ట్రాఫిక్ లైట్ దగ్గర రెడ్ లైట్ పడని సందర్భాలు  చాలా అరుదు. నూటికి తొంభై తొమ్మిదిసార్లు  ఆగాల్సిందే. కారాపిన ప్రతిసారీ అప్రయత్నంగా నా చూపు  రోడ్డుకు ఎడమవేపున్న ఆ ఇంటి మీద పడుతుంది. రోడ్డుపక్కనే కాస్త  అవతలగా  కొద్దిగా ఎత్తయిన ప్రదేశంలో ఉందా  ఇల్లు. 

అదొక పాడుబడ్డ ఇల్లు. 

ఇంటి చుట్టూ రక రకాల పిచ్చి మొక్కలు. 

ఇంటి బయట గోడలు ఎండకు ఎండీ వానకి తడిసీ  వంకర్లు తిరిగి ఉన్నాయి. ఆ గోడలకు బిగించిన లైట్లు  స్క్రూలు ఊడిపోయి వేలాడుతూ  ఏక్షణమైనా కిందపడటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి. దుమ్మూ ఎండుటాకులతో నిండి ఉన్న పోర్చ్ లో కవర్లు చినిగి  స్పాంజి బయటకు కనపడుతున్న సోఫా, విసిరేసినట్లుగా  ఒక రెండో మూడో పేము కుర్చీలూ. 

ఇంటి బయట  రంగులెలిసిపోయి ఒక ప్రక్కకి వాలిపోయున్నమెయిల్ బాక్సు. 

ఇంటి కప్పుతాలూకు షింగిల్స్ సగం  గాలికెగిరిపోగా మిగతావన్నీ రంగుతేలి ఉన్నాయి . ఒక రెండు మూడుచోట్ల కప్పు ఐదారడుగులమేర కుంగిపోయిఉంది.  పోర్చ్ పైన, పై అంతస్తులో ఉన్న గది తాలూకు కిటికీ గాజు తలుపుల్లోంచి మాసిన తెల్లటి కర్టెన్ రెప రెప లాడుతోంది. 

అన్నిసార్లూ కాకపోయినా కొన్ని సార్లు ఆ ఇంటిని చూసినప్పుడల్లా నాలో అదో  రకమైన దిగులు.

గతకాలపు వైభవాన్ని తలచుకుంటూ దీనంగా ఉన్నట్లు కనపడుతుందోసారి. 

కొన్నిసార్లు బేలగా, దీనికంటే మరణమే మేలంటున్నట్టుగా ... 

లేదా అందరూ నన్ను వంటరిదాన్ని చేసి వెళ్లిపోయారని తన బాధ చెప్పుకొంటున్నట్లుగా... 

 ఆ ఇల్లనుభవిస్తున్న వేదనకి నేనొక మౌనసాక్షినవుతాను  కాసేపు నా ఊహల్లో ... 

ఎప్పుడయినా  రాత్రిపూట చూడటం తటస్థిస్తే..

ఆ మసక వెలుతురులో.. 

మనిషి లోపలి మనిషిలా కొద్దిగా భయంగొలిపేలా  కూడా ఉంటుందది. 

ఆ నాలుగ్గోడల మధ్య నిరంతరం మారుమ్రోగే ఆ కరుడుగట్టిన నిశబ్దాన్ని భరించాల్సిరావలసినదానికంటే పెద్ద శాపం ఇంకొకటుంటుందా? 

అస్థిత్వాన్ని కోల్పోయి ఉనికి మాత్రమే మిగలటం అంటే ఇదేనేమో బహుశా..

Friday, February 14, 2020

మధ్యాహ్నపు నిద్ర

నచ్చకో మరెందుకో  పబ్లిష్ చేయకుండా వదిలేసిన  పాత పోస్టులు చూస్తుంటే ఇదిగో ఇది కనపడింది.  తారీఖు చూస్తే జులై 31, 2010. అప్పటికింకా పిల్లలు పుట్టలేదు. చదువుతుంటే చాలా నోస్టాల్జిక్  గా అనిపించింది.

**********************************************************************************************************

ఎన్ని రోజులు..కాదు కాదు ..ఎన్ని ఏళ్ళయిందో మధ్యాహ్నం పూట నిద్ర పోయి. ఇదిగో ఈరోజు  మధ్యాహ్నం భోజనం తరువాత ఒంటిగంట నుండి సాయంత్రం దాదాపు ఆరింటి వరకు తనవితీరా నిద్రపోయాను. నిద్రలేచాక బాల్కనీ లోకి వచ్చి చూస్తే చుట్టూ ఉన్న ప్రపంచం చాలా కొత్తగా,ప్రశాంతంగా ఉంది.పక్కనే ఉన్న డల్లాస్  ఎయిర్ పోర్టు లో ఇప్పుడే టేకాఫ్ అయ్యీ, అలానే  దిగటానికి సిద్దమవుతూ ఆకాశంలో ఐదారు విమానాలు.

కదలకుండా విగ్రహంలా నిలబడ్డానేమో ,నా పక్కనే ఒక పిచ్చుకవాలింది. బుజ్జి పిచ్చుక. కంగారు కంగారుగా అటూ ఇటూ గెంతుతూ, దొరికిన వాటిని ముక్కునకరచి (తినడానికి పనికొస్తుందేమో అని) పరీక్షిస్తూ, విదిల్చి వదిలేస్తూ....

కదిలితే ఎక్కడ ఎగిరిపోతుందో అనుకుంటూ కనుచివరలనుండి దాన్నే చూసా కాసేపు. 

ఎదురుగా ఉన్న ప్లే ఏరియా నుంచి పిల్లల  కేరింతలు....... 

ఇదే సాయంత్రం మిగతా రోజుల్లో ఎంత భిన్నంగా ఉంటుందో. ఆకలీ,నీరసం, రేపటిగురించిన ఆలోచనలతో మనసంతా గజిబిజి.ఎంత అసహనంగా ఉంటుందంటే, ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ముప్పై సెకన్లకి మించి ఉండదని తెలిసినా, రెడ్ లైటు పడగానే కారాపటానికి ఎంత చిరాకో . 

ఈ ఐదుగంటల గాఢమైన నిద్ర  రోజూ చూసే ప్రపంచాన్ని నాకు కొత్తగా పరిచయం చేస్తోంది. 

బాల్కనీలో కాసేపుండి లివింగ్ రూంలో కొచ్చాను.

సగం చదివి పక్కన పెట్టిన పుస్తకమూ , టీపాయ్ మీద పొద్దునెప్పుడో  తాగిన కాఫీ కప్పూ , టీవీ ముందు గుడ్లు మిటకరిస్తూ నావైపే చూస్తున్నట్లున్న కప్ప బొమ్మా,క్రితం రోజు మా ఇంటికొచ్చిన  చిట్టి గెస్టు అద్విత స్వారీ చేసీ చేసీ అలసిపోయి పక్కన పడేసిన గుర్రం బొమ్మా, సింక్ లో పడున్న అంట్లూ,తెరిచి చూసి ఇంకా చెత్త బుట్టలో పడేయకుండా సోఫాలోనే ఉంచిన ముందటిరోజు తాలూకు ఉత్తరాలూ ఇవేమీ ఇల్లు  సర్దాలన్న ఆలోచననే  దరికిరానీయక పోగా, ఇందులో కూడా అందముంది చూడగలిగితే అని నాకు చెప్తునట్టనిపిస్తోంది. 

ఇల్లంతా స్థబ్దుగా ,ప్రశాంతంగా .. 

తనింకా నిద్ర లేచినట్టులేదు.  

కిందకెళ్ళి ఇంటి పక్కనే ఉన్న మెక్ డొనాల్డ్స్ లో ఒక కాఫీ, అలాగే అందులోనే ఉన్న రెడ్ బాక్స్లో ఒక డీవీడీ?

ఎలాగూ ఈరోజిక బయటికెళ్లే  ప్లాన్స్ ఏమీ లేవు.

అనుకున్నదే తడవు, ఒక రెండు నిమిషాల తరువాత వేడి నీటి షవర్ కింద..

ఆ వేడి నీళ్ళు వంటిమీద పడుతుంటే అణువణువూ రీచార్జ్ అవుతున్న ఫీలింగ్..ఓ పట్టాన షవర్ వదిలి రాబుద్ది కాదు. ఇప్పుడనేకాదు, పనిదినాల్లోకూడా ఆఫీసుకి లేటుగా వెళ్ళిన ప్రతి పది సందర్భాల్లో  తొమ్మిది సార్లు ఇదే కారణం. ఎంత ఆలస్యంగా నిద్ర లేచినా షవర్ సమయాన్ని కుదించడం నాకు చాలా కష్టం. 

స్నానం చేసి రెడీ అయి అడుగు బయట పెట్టగానే వెచ్చటి వేసవి గాలి. మరీ అంత వేడిగాలేదు.

ఈలోపు తను  నిద్రలేస్తే? సరే, ఫోన్ చేస్తుందిలే.. 

మెట్లమీద మూడో ఫ్లోర్ లో ఎదురు పడ్డాడు వాడు నాయనమ్మ భుజం మీద సేద తీరుతూ. వాడికి ఇప్పుడిప్పుడే  పళ్ళొస్తున్నాయట. నన్ను చూసి ముగ్ద మనోహరంగా నవ్వాడా ఒంటిపన్ను రాక్షసుడు. ఆ నవ్వు మిగతారోజులకంటే ఎంతో అందంగా ఉంది.

"..విలో విరిసిన పారిజాతమో.."

కార్లో కూర్చుని ఇగ్నిషన్ కీ తిప్పగానే సీడీలో క్రితం రోజు సాయంత్రం సగం విన్న పాట ఆటోమేటిగ్గా మొదలయింది. 

సహజంగానే మధురమైన పాట... ఇప్పుడు మరింత మధురంగా.

పాత పాటలంటే ఎందుకంత ఇష్టం? వాటిలోని సాహిత్యమా?సంగీతమా?పాడినవారి ప్రతిభా? 

బహుశా బాల్యం నుంచి వినీ వినీ నా ప్రమేయం లేకుండానే సబ్ కాన్షియస్ గా ఆ  పాట చుట్టూ పెనవేసుకున్న జ్ఞాపకాలూ,అంతులేని ఆపేక్షా  అయిఉంటాయి.

పాట పూర్తయ్యే వరకూ కారుని కదల్చబుద్దికాలేదు. తరువాతి పాట "సిరిమల్లె పువ్వా". 

నాకా సీడీలో ఉన్న పాటలెన్నో తెలుసు. ఈలెక్కన కారు ఇంకో అరగంట పాటు కదలదు. 

బలవంతాన కారు బయటికి తీశాను.

Thursday, February 13, 2020

ప్రయాణాలూ-అనుభవాలూ -2

చెన్నై ఎయిర్ పోర్టు.  నవంబరు 2019. 

ఎప్పటిలానే లగేజి మోతబరువు వదిలించుకొని , బోర్డింగుపాసులు తీసికొని సెక్యూరిటీ లైన్ల దగ్గర నిలబడ్డాము. ఆడవాళ్లకు  విడిగా లైను ఉండటంతో మావిడా, అమ్మాయీ అటెల్లిపోగా నేనూ, మావాడూ మిగిలాం. లాప్ టాప్ కంప్యూటరూ, బెల్టులూ, వగైరాలు పెట్టే  ప్లాస్టిక్కు బిన్నులుండే దగ్గర చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. ముందొచ్చినవాడూ వాడూ, తరవాతొచ్చిన వాడూ లాంటి చచ్చు లాజిక్కులు  లేకుండా  బలవంతుడిదే రాజ్యం. ఒకపక్క మావాడినొక కంట కనిపెడుతూ నా   ప్లాస్టిక్  డబ్బా దొరకబుచ్చుకొనే సరికి నిజంగానే చెమటలు పట్టాయి నాకు. నిజానికి నా అంతట నేను దొరకబుచ్చుకోలేదు.  ఓ దయగల  పెబువు నా అవస్థ చూసి, ఈ యుద్ధంలో నువ్వెప్పటికీ గెలవలేవు అంటూ, ఆయనొకటి తీసుకొని ఇంకొక ప్లాస్టిక్ చిప్ప నా చేతికందించ్చాడు. ఈ నిజానికి మించిన ఇంకో నిష్టూరపు నిజం చెప్పాలంటే, నేను ఆయన కంటే కొద్దిగా ముందుండటం, ఎంతసేపటికీ నేను కదలక పోవడం చూసి ఆయనే విసుక్కుంటూ నాకు సహాయం చేసి ఉంటాడని నా మరొక ఊహ. ఆయనకి  థాంక్స్ చెప్పి, నా వస్తువులన్నీ ఆ చిప్పలో పెట్టి, దాన్ని నా ముందున్న ఇద్దరిమధ్య కొద్దీ కొద్దిగా దూర్చి,తగినంత సందు దొరగ్గానే దాన్ని  స్కానింగ్ మెషిన్ బెల్టు మీదపడేసి  ముందుకు చూస్తే ఆవల  సెక్యూరిటీ చెక్ పూర్తయిన చోట యుద్ధం  ఫేజ్-2 నడుస్తోంది. అదిచూడగానే నీరసం వచ్చినా దూకాక ఈత తప్పదుకాబట్టి నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. 

నాముందు ఒక ముగ్గురు నలుగురున్నారు. మమ్మల్ని పర్యవేక్షిస్తున్న ఆ సెక్యూరిటీ ఆఫీసరుని చూడగానే  నా నీరసం రెట్టింపైంది. ఆయన వాలకం చూస్తే "మీరందరూ కట్టకట్టుకొని ఇక్కడికెందుకొచ్చ్చారు? అసలు నేనెందుకిక్కడున్నాను?"  అని లోలోపల గింజుకుంటున్నట్టే ఉంది. నా ముందున్న ఆ  సూటేసుకున్నాయన ఏదో వస్తువు ఆ చిప్పలో పెట్టడం మర్చిపోయినట్టున్నాడు. ఆ సెక్యూరిటీ ఆఫీసరు మర్యాదగాలేచి ఆయనకి ఏదో చెప్తున్నాడు

మావాడికసలు కాలు నిలవదు.  ప్రతి పదిసెకన్ల కొకసారి సందు దొరికితే నా నుంచి పారిపోదామని చూస్తున్నాడు. వాడు అలాజారుకుందామని చూడటమూ , నేను కోపాన్ని అణచుకుంటూ వాడి కాలరుచ్చుకు లాగటమూనూ. 

ఇంతలో ఉన్నట్టుండి పెద్దగా అరుపులు వినిపించాయి నాకు. ఆ ఆఫీసరు నాముందున్న ఒక ముసలాయన మీద పెద్దగా  తెగ  కేకలేస్తున్నాడు. ఆ ముసలాయన అయోమయంగా అలా చూస్తూనే ఉండటంతో పట్టరాని కోపంతో కుర్చీలోంచి పైకి లేచాడు. ఆయన తీరు చూస్తే ముసలాయన్ని కొట్టినా కొట్టొచ్చనిపించింది నాకు.  

ఆయన్ని  పరీక్షగా చూసాను. బహుశా వయసు అరవైల్లో  ఉంటుందేమో. ముతక దుస్తులు. మనిషి మాత్రం చూడగానే  చాలా సౌమ్యుడిలా అనిపించాడు నాకు. ఆ ఆఫీసరు  అంతలా కేకేలేస్తున్నా ఆయన మాత్రం  నిర్లిప్తంగా నిలబడ్డాడు. అస్సలు నోరిప్పలేదు. అసలీ ప్రయాణం చేయడమే ఆయనకిష్టం లేనట్టుగా , ఏదో  బలవంతం మీద ఈ ప్రయాణం పెట్టుకున్నట్లుగా ఉంది ఆయన వాలకం.  ఆ ఆఫీసరు   భాష ముసలాయన కి అర్ధం కాలేదనుకున్నాడేమో ఏమో, నాముందున్నాయన నెమ్మదిగా వెళ్లి ఆ ముసలాయన చెవిలో ఆ కేకల్ని హిందీలోకి తర్జుమా చేసి చెప్పాడు. 

ఆ ముసలాయన  తన వాలెట్టూ ,బెల్టూ  చిన్న ట్రే లో కాకుండా పెద్ద ట్రే లో పెట్టడం ఈ గొడవకంతటికీ కారణం. స్కానింగ్ మెషిన్ లోకి వెళ్ళబోతున్న ఆ ట్రేని విసురుగాలాగి ఆయన మీదకి విసిరేసినంత పనిచేసాడా ఆఫీసరు. ఇంతలో ఎవరో అందించిన చిన్న ట్రే  లోకి  వణుకుతున్న చేతుల్తో ఆయన అందులోని వస్తువుల్ని మారుస్తుండగా చూసాను. ఒక  బాగా మాసిపోయి చీకిపోయిన వాలెట్టూ, ఒక  బెల్టూ. 

సెక్యూరిటీ చెక్ పూర్తయి నా వస్తువులన్నీ తీసుకుంటూ మరొక్కసారి గమనించానాయన్ని. కొద్దినిమిషాల  క్రితం జరిగిన దాని ఊసే లేకుండా నిర్లిప్తంగా ఉన్నాడతను. తన వస్తువులు తీసుకొని అలా నా ముందునుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 

మనిషి వేషం,కులం, ఆర్ధిక స్థితిగతుల్ని బట్టి వాళ్ళ హక్కుల స్థాయి నిర్ణయించబడే  మన దేశంలో  ఇదేమంత చెప్పుకోదగ్గ  సంఘటనే కాదు. నిజానికి ఇంతకంటే దారుణమైన వార్తలు కోకొల్లలు మన పత్రికల్లో దాదాపు ప్రతిరోజూ. 

ఒక రెండుగంటల తరువాత, మా ఫ్లయిటు బోర్డింగ్ పూర్తయి టేకాఫ్ అవబోతుండగా ఇంకొకసారి ఆ ముసలాయన రూపం నా కళ్ళముందు మెదిలింది. 

బహుశా ఆయన ఫ్లయిట్ కూడా ఈపాటికి ఏ గల్ఫ్ తీరానికో బయలుదేరే  ఉంటుంది. అయినవాళ్ళనీ ,ఆప్తుల్నీ వదిలి జీవిత మలి సంధ్యలో ఆ ఎడారి దీవుల్లో  ఆయన జీవనపోరాటం చేయక తప్పదు. 

కాసేపు మనసు బాధతో బరువెక్కింది. 

Monday, February 10, 2020

ప్రయాణాలూ -అనుభవాలూ -1

జనవరి నెల , 2001. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం.

నా మొట్టమొదటి అమెరికా ప్రయాణం.

--------------------------------------------------------------------------------------

అది విన్నాక నేనేమీ నిశ్చేష్టుణ్ణవ్వలేదు.విన్నది జీర్ణించుకుంటూ,నేను విన్నది నిజమేనా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ అలా చూస్తుండి పోయాను ఒక ఐదారు సెకన్లపాటు. ఆ తరువాత కొద్దిగా భయం కలిగినమాట వాస్తవం. 

ఇంతకీ ఆ  ఇమ్మిగ్రేషన్ ఆఫీసరు ఏమన్నాడంటే 

"ఈ పాస్ పోర్ట్ నీది కాదు, దొంగ పాస్ పోర్టు  మీద  అమెరికా వెళ్తున్నావని నేనంటే ఏంచేస్తావు ?" అని . అంతలోనే చేతికున్న వాచీ చూసుకుంటూ, నేను తలచుకుంటే నీ మొట్టమొదటి అమెరికా ప్రయాణం హుళక్కే అనే అర్ధం ధ్వనించేలా  "ఇంకొక రెండుగంటల్లో నీ ఫ్లయిటు "  అన్నాడు. 

మొదట్లో కౌంటరు దగ్గరికి వచ్చినప్పుడు చూడలేదుగాని ఇప్పుడు పరీక్షగా చూసానాయన వైపు.మనిషి చిక్కటి నలుపు.నీటుగా పక్కకి దువ్వి చక్కగా పాపిడి దీసినజట్టు. పైన నల్లకోటు. 

మెత్తగా, ఓ పద్దతి ప్రకారం పనులు చేసుకుంటూ పోయే బాపు గారి  సినిమాల్లోని  విలన్లా కనబడ్డాడు నాకు.

పాస్ పోర్టుని  నిలువుగా చేసి, టక్ టక్  అనే  శబ్దం వచ్చేలా టేబుల్ మీద కొడుతూ ,అటూ  ఇటూ   చూసి, దరిదాపుల్లో ఎవరూ లేరని  నిర్ధారించుకొని, నివ్వెరపోయి చూస్తున్న నన్ను మళ్ళీ అడిగాడు. 

"ఫారిన్ కరెన్సీ ఎంత తీసుకెళ్తున్నావ్?". 

నేను ఎంత తీసుకెళ్తున్నానో ఆయనకీ తెలుసని నాకు తెలుసు. ఎందుకంటే పాస్ పోర్ట్ లో థామస్ కుక్ వారి స్టాంప్ ఉంది మరి. 

ఇలా ఇవ్వు అన్నట్లు చేయి చాచాడు. అయోమయంగా నేనిచ్చిన   కవరులోని ఆ ఆరు ఇరవై డాలర్ల నోట్లలోంచి ఒక నోటు తీసుకొని,పాస్ పోర్ట్ లో వేయాల్సిన స్టాంపులేసి  ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టుగా చేయి ఆ వైపుకు చూపించాడు. 

నా ముందున్న ప్రయాణికులను గుడ్డిగా అనుసరిస్తూ , జరిగిందాన్ని ఒకసారి  మళ్ళా  రివైండ్ చేసుకున్నాను. కౌంటరు దగ్గరికి రాగానే పలకరింపుగా ఆయన నవ్విన  నవ్వూ , పాస్పోర్ట్ లో అడ్రస్ చూడగానే, "మాదీ గుంటూరు జిల్లానే ,బాపట్ల " అని చెప్పటమూ, ఒక రెండు నిమిషాలు సరదాగా  నా క్షేమసమాచారాలు అడగటమూ ఇవన్నీ  బేసిగ్గా నన్నూ ,నా మానసికస్థితినీ    అంచనా వేయటానికి వేసిన ఉచ్ఛు  అన్నమాట. 

ఈ కౌంటరు దగ్గరికి రావటానికి ఒక అరగంట ముందు.... 

చెక్ ఇన్ కౌంటరు వద్ద నా లగేజీని వదిలించుకొని బోర్డింగ్ పాసు తీసుకోబోయే క్రమంలో  ఆ కౌంటరు లో ఉన్న అమ్మాయి  విమానంలో నాతోపాటు తీసుకెళ్లే లగేజీ ని చూడగానే ఆ ఫ్లయిట్ చాలా చిన్న ఫ్లయిట్ కాబట్టి ఆ లగేజీని కూడా చెక్-ఇన్  చేయాల్సిందే అని పట్టు పట్టింది. నేను ఆ కంగారులో సూటుకేసు తెరిచి నాక్కావలసిన కొన్నిపేపర్లు తీసుకున్నా ,అతి ముఖ్యమైన 
 హెచ్ 1 డాక్యుమెంటూ, అలానే ఎంప్లాయర్ ఇచ్చిన ఆఫర్ లెటర్లు గట్రా అన్నీ మర్చిపోవటమూ, దాదాపు కన్వేయర్ బెల్ట్ మీద పెట్టబోతున్న నా సూట్ కేసుని ఇదంతా గమనిస్తున్న ఒక సీనియర్ ఉద్యోగి చివరినిమిషంలో ఆపి,ఆ అమ్మాయిని చివాట్లు పెట్టి,దగ్గరుండినాకు సహాయంచేయటమూ  జరిగింది. గండం గడిచినా ఈ ప్రహాసనం అంతా నన్నొక షాక్ కి గురిచేసింది. బహుశా ఆ షాక్ ప్రభావమేమో ఈ బాపు గారి విలన్ దగ్గర నేను ఏమాత్రం ప్రతిఘటించలేకపోయాను. 

ఆ విధంగా  .. 

నా మొట్ట మొదటి డాలరు ట్రాన్సాక్షను ..... లంచం అన్నమాట.. 

ఇచ్చిన  లంచం కాదు. బలవంతాన లాక్కున్న లంచం. దోపిడీ అనొచ్చేమో.. 

కవరు మొత్తం ఎందుకు తీసుకోలేదు? బహుశా గుంటూరు జిల్లా కన్సెషనేమో మరి... 
టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...