Tuesday, March 10, 2020

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ?  త్రివిక్రమ్ సినిమాలలాగే ఉంటాయి నాకైతే.

ఆయన సినిమాల్లో కథ కంటే కథనం మీద మరీ ఎక్కువ శ్రద్ద పెట్టడంతో కథలోని సంఘర్షణ  పలుచన అయిపోతుందనిపిస్తుంది నాకు. 'అతడు' సినిమా తీసుకుంటే ముందుగా మనకి ఏం గుర్తుకొస్తుంది? కథ లోని సంఘర్షణా లేక బ్రహ్మానందం కామెడీ, "ఆడు మగాడ్రా బుజ్జీ" లాంటి డైలాగులా?ఏ టైటిల్ తలచుకున్నా కథ కంటే  ముందు  సీన్లు గుర్తొస్తాయి. వినగా వినగా  "మాటల మాంత్రికుడు" అనగానే   మాటలు మాత్రమే, కథ మాత్రం అటకెక్కుతుందనే అర్ధం వస్తోంది నాకైతే. 'విసుగు పుట్టించకుండా, అర్ధంలేని ఫైట్లతో తల  బొప్పి కట్టించక ఆ రెండున్నర గంటలు గడిస్తే చాలు అదే మంచి సినిమా' అనుకునే స్థాయికి వచ్చాం కాబట్టి 'అల వైకుంఠపురంలో' మంచి సినిమానే. 

ఆ సినిమాలో అసలా "సామజవరగమనా.." పాట సంగీత దర్శకుడినీ , ముఖ్యంగా త్రివిక్రంనీ దాటి ముందుకెలా వచ్చిందనేది నాకసలు అర్ధంకాని విషయం. "కాళ్లు","చూపులు",కాటుక" లాంటి అతి సామాన్య పదాలను అనన్యసామాన్యంగా పాడి అవతలకి 'విరిచి' పారేసాడు  సిద్.

 పిట్టకథ :
'గద్దలకొండ గణేష్'(వరుణ్ తేజ్) సినిమాకి మొదట వాల్మీకి అని పేరు పెడితే  అది  మార్చాల్సిందే అని  ఒక వర్గం వారు నానా గొడవ చేసి చివరినిమిషంలో(సెన్సారు కూడా అయిన   తరువాత ?)  పేరు మార్చేలా చేశారు. మరి ఈ సినిమా అంతా  కూడా ఆ వాల్మీకి చుట్టే తిరుగుతుంది.అసూయాపరుడూ,(పెంపుడు) కొడుకుచేత ఛీ కొట్టించుకొని చెంపదెబ్బ తినే ఓ కామెడీ  పాత్ర. ఎందుకోమరి ఆ వర్గం వారు "నో ఆబ్జెక్షన్స్ యువరానర్" అనేసారు . విషయం తెలిసేసరికే బహుశా "ఇట్ వజ్  టూ లేట్ ఇన్ ది గేమ్ " ఏమో మరి.

***************************************************************************************************************
తిరువణ్ణామలై ...

రమణాశ్రమాన్ని చూసి, అరుణాచలం మీదున్న స్కంధాశ్రమాన్నీ, విరూపాక్షుని గుహానీ దర్శించుకొని ఆ ఎగుడు దిగుడు రాళ్ళ బాటలో  కొండదిగి వస్తుండగా ఒక మలుపు తిరగ్గానే అకస్మాత్తుగా ఎదురయ్యాడా విదేశీయుడు.ఈ రాళ్లబాట మీద నడవటమే కష్టంగావుంటే ఆయన ఏకంగా ఆ బండరాళ్లూ ,చెట్ల మధ్యనుంచి  అడ్డంగా నడుచుకుంటూ వస్తున్నాడు. దగ్గరకొచ్చ్చాక "విరూపాక్ష కేవ్ కి దారెటు?" అని అడిగాడు. వయసు దాదాపు నలభై  ఉండొచ్చేమో, ఉఛ్చారణ  చూస్తే మాత్రం పక్కా  అమెరికన్లా ఉన్నాడు.వివరాలు చెప్పగానే థాంక్స్ చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు. 

ఏ ఈజిప్ట్ పిరమిడ్లో, ఐఫిల్ టవరో లేదా ఏ  క్రూజ్ ట్రిప్పో కాకుండా   ఇలా వేల   మైళ్ళు ప్రయాణం చేసి,మాతృదేశంతో ఏమాత్రం సారూప్యత లేని చోట  రమణ మహర్షి ఒకప్పుడు నివసించిన ఆ ఇరుకు చీకటి గుహల  మీద ఆయనకున్న భక్తీ, ఆసక్తీ  చూస్తే ఒకింత ఆశ్చర్యం.

ఇలా బోల్డు మంది కనపడ్డారు తిరువణ్ణామలై లో. 

వీళ్ళందరూ అట్నుంచి  ఇటొస్తుంటే, నేనేమిటీ ఇట్నుంచి అటెళ్లి పడ్డాను అని అనిపించిందో క్షణం. 

***********************************************************************
రాత్రి నిద్రపోయేముందు తెలుగు వార్తా ఛానెళ్లు గానీ లేదా  కలవరపరిచే వార్తలుగానీ, హారర్ టైపు సినిమాలుగానీ చూడగూడదనేది నేను పెట్టుకున్న  నియమం. ఏదో  కాస్త నాలుగు పేజీలు చదవడం లేదా యుట్యూబ్ లో ఏవైనా 'టెడ్ టాక్సో' మరేదైనా వింటూ నిద్రాదేవతని  ఆహ్వానించడం. 

మొన్నొకరోజు నిద్రకుపక్రమిస్తుండగా ఏదో  మెసేజ్ వచ్చినట్లు  ఫోన్ టింగుమంది. చూస్తే  ఒక మెడికల్ గ్రూప్ నుంచి వచ్చిన  మెసేజ్. మనసు చదవద్దంటున్నా  బొటనేలు ఈలోపే టక్కున నొక్కేసింది. ఇక చదవక తప్పదు కదా  :) 

 ఆ మెడికల్ గ్రూపులోని మిగతా సభ్యులకు ఒకామె/ఒకాయన వేసిన ప్రశ్న.. 

"మీకు ఈ జబ్బుందని తెలిసాక మిమ్మల్ని బాగా బాధపెట్టిన  విషయం  ఏమిటి ?"  

దానికి  రకరకాల సమాధానాలు. దాదాపు ప్రతి సమాధానమూ మనసుని పిండేసేదే. ఒక రిప్లై  ఇలా ఉంది... 

"కేన్సర్ స్టేజ్ 4 అని తెలిసాక అన్నయ్యకి రమ్మని కబురు పెట్టాను. హాస్పిటలుకి వచ్చాడు. పర్లేదులే ఏమీ కాదు అన్నాడు. రేపు మళ్ళా వస్తా అన్నాడు. అంతే. మళ్ళా ఇప్పటివరకు మొహం చూపించనేలేదు. ఇప్పటికి మూడేళ్లు పైనే గడిచాయి వాణ్ని చూసి.వాడికంటే నేను చిన్నదాన్నయినా చిన్నప్పటినుంచి ఒక అక్కలా చూసుకున్నాను వాడిని. వాడికున్న చెడలవాట్ల మూలంగా  ఎన్నో సందర్భాలలో వాణ్ని నాన్న చేతిలో దెబ్బలు తినకుండా రక్షించాను. కాస్త పెద్దయ్యాక వాడి   చిన్నా చితకా అవసరాలకు నేను దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఇచ్చాను. "

ఇంకా కింద ఉన్న మిగతావి  చదివే ధైర్యం చేయలేకపోయాను. చదవకుండానే ఒక్కటి మాత్రం చెప్పగలను. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కో జీవిత సత్యం. 

ఆ సత్యాల్ని అవగతం చేసుకోవాల్సిన అగత్యం  రాని వారు అదృష్టవంతులు. 

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...