Wednesday, August 3, 2022

ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ

న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో. 

(తెలియని వారికి: అమెరికాలో కనెటికట్, మెయిన్, రోడ్ ఐలాండ్, మెసాచుసెట్స్ , న్యూ హేంప్  షైర్  చివరగా  వర్మాంట్ ఈ ఆరు రాష్ట్రాల్ని కలిపి న్యూ ఇంగ్లండ్  అంటారు.)  

తెలుసనుకున్న నాకు: ఇప్పడే తెలిసింది. నేనేవో మూడు స్టేట్సేఅనుకున్నా. గూగులమ్మ మొట్టికాయొకటేసి మూడు కాదు ఆరంది.  : ) 

ఇకపోతే మేమున్నది కనెటికట్ సరిహద్దులో.ఆఫీసు మాత్రం మెసాచుసెట్స్ కిందికొస్తుంది.ఇంటి నుంచి కొలువుకి దూరం ఆరు మైళ్ళు మాత్రమే.   

                               ****************************************************


ఈ న్యూఇంగ్లండ్ ని తలచుకున్నప్పుడల్లా అడుగడుగునా కనపడే ఆ ఇటుక రంగు భవనాలూ, శీతాకాలంలో చుక్కల్నిచూపించే చలీ, అడుగుల్లెక్కన పడే మంచూ, ఆ కరిగిన మంచుతో తడిసిన రోడ్లూ, అంతేలేని ఆ నీలి సముద్రమూ,లెక్కలేనన్నిసముద్ర తీరాలూ,లైటు హవుసులూ, రేవుల్లో ఒక వరసలో నిలబెట్టి డాక్ చేసిన బోట్లూ, అనేకానేక చారిత్రాత్మక ప్రదేశాలూ ఇవన్నీకాక ఆకురాలే కాలం ముందటి అద్భుతమైన అందాలూ ఇవన్నీ కళ్ళముందు గిర్రున తిరుగుతాయి.

వీటన్నిలో నీకేమిష్టం అంటే చెప్పటం చాలా కష్టంగానీ  ఎందుకో ఈ దీప స్తంభాలంటే మాత్రం  నాకొక ప్రత్యేకమైన ఆసక్తి.అసలు వాటిల్లోకి అడుగుపెట్టగానే టైము మెషినెక్కి ఓ వంద రెండువందలేళ్ళు వెనక్కి  వెళ్లినట్లే ఉంటుంది. వాటికంటే ఇంకా పురాతనమైన ఏ కోటనో ఇంకాదేన్నో చూసినా కలగని అనుభూతోకటి లైటు హవుసులోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టేస్తుంది.ఇరుగ్గా ఉండే ఆ వలయాకారపు మెట్లెక్కుతుంటే ఘనీభవించిన గతాన్ని ఒరుసుకుంటూ వెళ్తున్నట్లు ఏదో ఒక రకమైన మైకం కమ్మేస్తుంది.

ఇక సాంతం పైకి వెళ్లిన తరువాత నాకు ఓ పట్టాన తిరిగి దిగబుద్ధి కాదు. కానీ చాలా వరకు ఆ ప్రదేశం సందర్శకులతో ఇరుగ్గా  ఉండటమూ లేదా  నాతోపాటు వచ్చినవాళ్లు "ఏవుందిక్కడ అంతసేపు చూడ్డానికి "  అనే విసుర్లూ  విని  అయిష్టంగానే దిగిపోతాను. షాపుల్లో  లేదా ఏ క్యాలండర్ మీదో మరింకెక్కడో  లైటు హవుసుని బొమ్మని అదాటున చూస్తే ఓ రెండుమూడు క్షణాలు మళ్ళీ తేరిపార  చూడాల్సిందే. 

దాదాపు పదమూడేళ్ల క్రితం కనెటికట్లో ఉన్నప్పుడు ఒక వారాంతం ప్రత్యేకంగా వీటిని చూడటానికే వెళ్లానోకసారి.దాదాపు ఎనిమిదో తొమ్మిదో అనుకుంటా. అన్నీ ఒకటేకదా అని మీకనిపించొచ్చు, కానీ  దేనికదే ప్రత్యేకం. దేని అందం దానిదే. మనుషుల్లాగానే, లోపలికెళ్తే  దేని కథ దానిదే.

మొన్నొక షాపులో ఓ పెయింటింగ్ నా కంట పడింది.అంతులేని అగాధం లాంటి సముద్రం, దానొడ్డునే, నిశీధిలో,కాలానికి ఎదురీదుతున్నట్లుగా సముద్రం వైపు వెలుగుని  ప్రసరిస్తూ  ఠీవిగా నిలబడ్డ లైట్ హవుస్.ఆకాశంలో నిండు పున్నమి.ఎంత బావుందో?ఎంతసేపు చూసినా విసుగనిపించదు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

అవి నాకు ఒంటరితనానికి ఒక  ప్రతీకలా కూడా కనిపిస్తాయి. బహుశా నా ఆలోచనా సరళికీ దీనికీ ఏదో సబ్ - కాన్షియస్  కనెక్షనుందేమో  వాటినంతగా ఇష్టపడటానికి. 

*********************************************

వీటి తరువాత   నాకు గుర్తొచ్చేవి న్యూ ఇంగ్లండ్ ఫాల్ కలర్స్. 

ఇక్కడ సెప్టెంబరు అక్టోబరు నెలల్లో పచ్చని చెట్లు కాస్తా చూస్తుండగానే  పసుపు,ముదురు నారింజ రంగుల్లోకి మారిపోయి కనువిందు చేస్తాయి.

సంవత్సరమంతా ఇంటిముందే దిగాలుగా ఓపక్కన పడున్న చెట్టుని అసలు పట్టించుకోం గాని అది కాస్త  ఈ సీజన్లో రంగులు మార్చగానే "వావ్ " అనుకుంటూ కేమెరా దుమ్ము దులిపే కాలం అన్నమాట ఇది. చివరికి చెట్టు కింద రాలిన ఆకుల్ని కూడా  వదలం. ఆ ఆకులు కూడా ఫోటోల్లో పడితేనే ఫోటోకి అందం,చందం, మందం అన్నీ.. 

కారులో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చుట్టూచూస్తే   కనుచూపుమేరా ఒకప్పుడు పచ్చగా కనిపించే కొండలు  ఇప్పుడు శిశిరం అద్దిన  కొత్త కొత్త రంగుల్లో ఎంత శోభాయమానంగా ఉంటాయంటే  మాటల్లో చెప్పలేమసలు.

ఫాల్ కలర్స్ చూద్దామని న్యూ హేంప్  షైర్  వెళ్లి అప్పట్లో కొత్తగా కొనుక్కున్న  ఎస్సెల్లార్ కెమెరాలో నేను తీసిన ఫోటోలు ఇప్పటికీ చూసినప్పుడల్లా ప్రత్యక్షంగా చూస్తున్నప్పటి అనుభూతిని కలుగజేస్తాయి.వర్మాంట్ ఫాల్ కలర్స్ కూడా చాలా బావుంటాయట. వెళదామనుకున్న రెండుసార్లూ ఏవో పనులడ్డంపడి వెళ్లడం కుదరలేదు. సంవత్సరం క్రితం అనుకోకుండా ఇదిగో ట్రౌట్ అండ్ కాఫీ  అనే ఈ వెర్మాంట్ వ్లాగరు  నా కంట పడి మళ్ళీ ఆ అందాలను నాకళ్ల ముందుంచాడు. ప్రకృతి ప్రేమికులకు ఈయన వీడియోలు కనువిందే. అన్నీ చూసే ఓపిక లేని వాళ్ళు ఈ ఫాల్ కలర్స్ వీడియో నొకసారి  చూడండి. 


                                     *************************************************

ఇక న్యూ ఇంగ్లాండ్ చలి సంగతి చెప్పనవసరంలేదు.చావగొట్టి చెవులు మూ(యి )స్తుందీ చలి. 

చలినిలా తిట్టుకున్నా, సీజన్లో మంచు ఎప్పుడు పడుతుందో అని మాత్రం చాలా ఆసక్తితో  ఎదురుచూసేవాడిని. 2009లో అనుకుంటా వెదర్ రిపోర్ట్ ప్రకారం రాత్రి తొమ్మిదిన్నరకి మాకు మంచు పడటం మొదలవ్వాలి. ఎనిమిదింటికి భోజనాలు ముగించి కిటికీ పక్కనే కూర్చొని టీవీ చూస్తూ పదినిమిషాలకొకసారి బయటికి చూడ్డం.ఎంతకీ పడదే? చూడంగా చూడంగా ఓ రెండు సినిమాలూ మూడు కాఫీల తరువాత ఎప్పుడో తెల్లవారు ఝాము మూడున్నరకి మొదలయింది. వీధి దీపం వెలుగులో ఆ దీపం  వెలుగు పడినంతమేరా త్రికోణాకారంలో కనపడుతూ పైనుంచి బర బరా రాలుతున్న మంచుని చూసి  సంతోషంతో కేమెరా  క్లిక్కు మనిపించి, తెల్లవారాక కనబడబోయే ఆ తెల్ల తివాచీనీ, మంచు ఆ మోడువారిన చెట్లకొమ్మలకతుక్కొని వాటికద్దే కొత్త అందాలనూ ఊహించుకుంటూ  నిద్రపోయా. (అది శుక్రవారం లెండి. లేకుంటే ఆ ఫీటు చేయకపోదును.) 

ఒకసారి బాగా మంచు పడిన రోజు  తప్పనిసరై బయటికెళ్లాల్సొచ్చి , కారు విండ్ షీల్డు మీదా పక్కద్దాలమీదా  ఉన్న మంచుని క్లీన్  చేసి, కారు కప్పు మీద దాదాపు మూడు నాలుగు అంగుళాల ఎత్తున పేరుకుపోయిన  మంచుని కదిలించడానికి  బద్దకించి అలానే బయలుదేరా. కారులోపల హీటర్ ఆన్  చేయటంవల్ల పై కప్పు మీదున్న మంచు తాలూకు అడుగు భాగం వేడెక్కి కాస్త కరిగినట్టుంది, ఒక సిగ్నల్ దగ్గర బ్రేకేయగానే పైనున్న మంచు మొత్తం ఒక ప్లేట్ లాగా   అలా జారి  నా విండ్ షీల్డ్ ని పూర్తిగా కప్పేసింది. ఏంచేయాలో అర్ధం గాక ఠారెత్తిపోయాను. ఆ హడావిడిలో వైపర్లు ఆన్ చేయటం తలచుకుంటే నాకిప్పటికీ నవ్వొస్తుంది.  : ) 

                      ***************************************************

ఒక  సమ్మర్లో మెసాచుసెట్స్ లోని కేప్ కాడ్ తాలూకు బీచులన్నీ(  National Sea Shore అంటారనుకుంటా )  కవర్ చేసేద్దాం అని బయలుదేరాం. ఒక్కొక్కటి చూసుకుంటూ అలా అలా పై కొన "ప్రావిన్స్ టౌన్" వరకూ వెళ్ళిపోయాము. అక్కడ వీధుల్లో తిరుగుతుంటే ఆ జనాలూ, పరిసరాలవీ కొత్తగా, వింతగా కనిపించాయి. కాసేపలా తిరిగి వీధులవీ సర్వే  చేసి, ఓ కాఫీ తాగి  కారెక్కి వచ్చేసాం, 

ఆ సోమవారం ఆఫీసులో మాటా మంతీ   సందర్భంగా నేను ఇలా ప్రావిన్స్ టౌన్ వెళ్లాననగానే  విని మౌనంగా ఉన్న  యాంజీ మిగతావాళ్లందరూ  వెళ్ళిపోయాక    "ఎలా ఉందా ప్లేస్?" అని అడిగింది. ఎందుకడిగిందో అర్ధం కాక బానే ఉందన్నా. తను  లో గొంతుకతో  "అది 'గే ' కేపిటల్ అఫ్ ద  నార్తీస్టు" అంది. ఓ అదన్నమాట సంగతి అనుకున్నా. (అమెరికాలో 'గే ' పెళ్లిళ్లని చట్టబద్దం చేసిన మొట్టమొదటి రాష్టం మెసాచుసెట్స్. )

అలా ఒక్కో బీచ్ చూసుకుంటూ వస్తూ మొత్తానికి ఒక బీచ్ లో కారుతాళాలు పోగొట్టుకున్నాను. ఆ ఇసుకలో వెతికి వేసారి మాకెదురుపడ్డ సెక్యూరిటీ అతనికి చెప్తే ఆయన రేడియోలో కబురంపి  ఒకాయన్ని పిలిపించాడు. విషయం ముందే చెప్పాడు కాబట్టి ఆయన రావటమే  మెటల్ డిటెక్టర్ తో సన్నద్ధం గా వచ్చాడు . దాదాపు రెండుగంటలు మేము బీచిలో ఎక్కడెక్కడ తిరిగామో అడిగి మరీ ఓపిగ్గా వెతికాడు. "ఇదేమి ఖర్మరా బాబూ" అనుకుంటూ చివరికి అలసి సొలసి కారు దగ్గరికి వస్తే కారు వెనకసీట్లో వెక్కిరిస్తూ తాళాలు. కారేమో లాకయి ఉంది ఆయనే వెళ్లి ఇంకేదో సరంజామా తీసుకొచ్చి  సన్నని తీగని లోపలకి పంపి కారు అన్ -లాక్ చేసాడు. 

ఈ బీచుల్లోనో మరింకెక్కడో సరిగా గుర్తు లేదు గాని, ఒడ్డున ఒక చిన్న రాతిపలక. దానిమీద సముద్రం వైపు ఒక బాణం గుర్తు వేసి "ఈ దిక్కుగా సముద్రం మీద మూడువేల మైళ్ళు వెళ్తేగాని  నేల తగలదు"  అని అర్ధం వచ్చేలా రాసుంది( exact phrase సరిగా గుర్తు లేదు).  ఆ దేశం పోర్చుగల్  అనుకుంటా.ఓ సారి సాలోచనగా సముద్రం వైపు ఆ దిక్కుగా చూసి, మూడు వేల  మైళ్ళని అంచనా వేస్తుంటే ఈ  విశాలవిశ్వంలో,అందులో ఒక చిన్న రేణువంతటి ఈ భూమ్మీద "నేనూ, నా ఉనికి అసలేపాటివి?"  అనిపించింది.  

                                            ***************************************** 

కనెటికట్లో మేమున్న అపార్ట్మెంట్ లీజింగ్ ఆఫీసులో క్యాథీ అనే ఒకామె ఉండేది. ఈమెకీ నాకూ లంకె ఎలా కుదిరిందో నాకసలు గుర్తు లేదు గాని కనబడినప్పుడలా మెట్ట వేదాంతం తెగ మాట్లాడుకునే వాళ్ళం. ఈమె చెప్పిన వాటిల్లో ఇదొకటి నాకు చాలా బాగా గుర్తుండి  పోయింది. 

"జీవితంలో నీకు తారసపడే ప్రతి వ్యక్తి నీకు ఏదో  ఒకటి నేర్పడానికే నీ పరిధిలోకొస్తాడు. ఆ పరిచయం  దైవికం. అందరిలా తొందరపడి  మంచీ చెడూ 'జడ్జ్ ' చేసి మాయలో  పడిపోకుండా కాస్త 'దూరంగా' ఉండి  గమనించడం నేర్చుకో."

ప్రాక్టికల్ గా అదెంత కష్టమో నెమ్మదిగా తెలిసొచ్చింది. దాదాపు పన్నెండేళ్ల తరువాత కూడా ఈ విషయంలో ఓనమాల స్టేజ్ లోనే ఉన్నా. 

'నా' అన్న భావన బలంగా ఉన్నప్పుడు ఆ "దూరం" దుర్లభం. 

సరే, మెట్ట  వేదాంతపు రోజులు కదా, అప్పట్లో ఆమె చెప్పిన మాట విన్నాక ఇదేదో బావుందే  అని సరదాగా ఎక్సెల్ షీట్లో ఒక నెలపాటు నా  బాల్య స్నేహితులూ,చిన్నప్పటి క్లాస్మేట్లూ,అసలొక్క మాటకూడా మాట్లాడకుండా చూసీ చూడగానే అమాంతం (నేను : ) )  మనసు పారేసుకున్న బోల్డు మంది అమ్మాయిలూ, పాఠాలు నేర్పిన గురువులూ, ఇరికించిన కోలీగ్సూ, సాధించిన మానేజర్లూ  అలా దాదాపు ఓ రెండొందల  పేర్ల  దాకా రాసినట్టు గుర్తు. నిజానికి అలా గుర్తుతెచ్చుకొని రాయడం చాలా బావుండేది. ఆ తరువాత ఆ ప్రాజెక్టు అటకెక్కేసింది. మనం చాలా బిజీ కదా. 

క్యాథీ ఒకసారి నాకు టెన్నిస్ అంటే ఇష్టమని తెలిసి "రేపొకసారి ఆఫీసుకి రా"  అంది. వెళ్ళగానే ఒక వుడెన్ రాకెట్ చూపించి " దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?"  అంది. 

"మీరు చిన్నప్పుడు ఆడిన ఫస్ట్ రాకెట్ ?" అన్న వెంటనే నాలుక్కరుచుకున్నాన్నేను.

 ఆవిడ అసలు నా మాటలు పట్టించుకోకుండా .. 

"కాదు.ఇది క్రిస్ ఎవర్ట్ ఆడిన రాకెట్. మా అక్క కి గిఫ్ట్ గా ఇచ్చింది క్రిస్. తను నాకిచ్చింది."

యాంటీక్ అన్నమాట.

గాల్లో దాన్ని అటూ ఇటూ ఊపబోయినవాణ్ణల్లా రిస్కెందుకని,వెంటనే జాగ్రత్తగా తిరిగిచ్చేస్తూ  అన్నాను. 

"బావుంది.చాలా బావుంది"

అప్పుడప్పుడు  టెన్నిస్ టీవీలో క్రిస్ కనపడినప్పుడు  క్యాథీ గుర్తొస్తది.

ఆమెకి చదివే హాబీ ఉందని తెలుసు కాబట్టి అపార్ట్మెంట్ ఖాళీ  చేసేటప్పుడు ఆమె కి Eckhart Tolle రాసిన "The Power of Now" ఇచ్చాను . 

వర్జీనియా కొచ్చ్చాక దాదాపు ఒక సంవత్సరం పాటు ఆమె నుంచి అప్పుడప్పుడు ఉత్తరాలొచ్చేవి. ఆమె చేతి రాత ఓ పట్టాన అర్ధం కాదు.రెండు పేజీల ఉత్తరం చదవటానికి  నాకు దాదాపు పదిహేను నిమిషాల పైనే పట్టేది(అప్పటికీ కొన్ని పదాలు  అర్ధంగాక విసుగొచ్చి  వదిలేయగా). 

ఆమెలో నేను  గమనించిందీ  ఏమిటంటే  పరిచయాన్నీ,వృత్తిధర్మాన్నీ నిర్దాక్షణ్యంగా వేరు చేయగలగటం. పనికి సంబంధించినదేదైనా చెప్పాల్సొస్తే  నిష్కర్షగా మొహం మీదే చెప్పేస్తుంది.

ఆమె ఒకసారి మొక్కలు పెంచుకునే ఉబలాటం ఉన్నవాళ్ళకి వాళ్ళ వాళ్ళ అపార్ట్మెంట్ బిల్డింగ్ బయట, గోడ పక్కగా ఒక 4X4 అడుగుల మేర  మొక్కలు పెంచుకోవచ్చని  పర్మిషనిచ్చేసింది. కొలవడానికి బద్దకించి నేను ఆ 4X4 ని కాస్త ఒక అడుగు అటూ ఇటూ (అటే, ఇటు కాదులెండి : ) )  చేసేసరికి నేనేదో బోర్డరు  దాటి పాకిస్థాన్ని  ఆక్రమించినంత నేరం మోపి నానా యాగీ చేసిందావిడ. 

ఆ అపార్టుమెంటు కమ్యూనిటీ నిండా 'మన' వాళ్లే. నన్ను చూసి మిగతావాళ్ళు కూడా మొదలెడతారని ఆమె భయం.

ఇప్పుడామె ఎలావుందో, ఏంచేస్తోందో? అపార్ట్మెంట్ ఖాళీ చేసి ఆమెని చివరిసారిగా కలుద్దామని వెళ్ళినప్పుడు క్లబ్ హౌస్ సోఫాలో కూర్చొని ఇద్దరం కలిసిదిగిన ఫోటో గుర్తొచ్చింది.గూగులమ్మ వలలో ఇంకా పడని  రోజులవి. డిజిటల్ కెమెరాలో దిగిన ఆ ఫోటో   పదిహేనేళ్లనాటి డొక్కు డెస్క్ టాప్ హార్డుడిస్క్లో భద్రంగా నిద్దరోతోంది.

                                    *******************************************

ఇక అసలు విషయానికొస్తే......

కొన్ని వారాల క్రితం "అమ్మే'జాన్ ప్రైము లో ఏదైనా మంచి సినిమా చూద్దామని వెతుకుతుంటే కనపడిందీ సినిమా ("మాంచెస్టర్ బై ద సీ ") .

నా ప్రోటోకాల్  ప్రకారం,ముందు సినిమా కథ చదివి  ఆ పై సినిమా ఒక రెండునిమిషాలపాటు చూసి, పాజ్ చేసి,  IMDB ని  కెలికితే సినిమా నేపధ్యం మెసాచుసెట్స్ లోని  మాంచెస్టర్  అనే ఒక చిన్న టౌను అని తెలిసింది. అంతే..  నా ఆసక్తి వందింతలైంది. 

సినిమా మొదలవటమే  నీటి మీద బోటు ప్రయాణంతో మొదలవుతుంది. "బోటు వెళ్లేది నీటిమీదే కదటోయ్" అనకండి. ముందు నీళ్ళూ ఆ తరువాత బోటూ కనపడతాయన్నమాట.నాకు ఈతస్సలు రాదుగాని నీళ్లంటే మాత్రం చాలా చాలా చాలా చా.........లా....  ఇష్టం. సో మొదటి షాట్ తోటే సినిమాతో ప్రేమలో పడిపోయా. "లవ్ ఎట్ ఫస్ట్ షాట్ "  అన్నమాట. పైగా బ్యాక్ గ్రౌండ్లో వచ్ఛే కోరస్ నన్ను కట్టి పడేసింది. ఆ తరువాతెలాగూ  ఆ బ్రిక్ బిల్డింగులూ, మంచూ,ఆ రోడ్లూ, ముసురు పట్టిన ఆకాశమూ, సముద్ర  తీరంలో  ఎగిరే సీగల్స్ పక్షులూ, వాటి  అరుపులూ  ..  అబ్బో ..అవన్నీ నన్ను కట్టకట్టి కనెటికట్లో పడేశాయి. 

వింటర్లో షూట్ చేశారు కాబట్టి చలి కూడా ఈ సినిమాలో ఓ కేరక్టరే. కథ నడుస్తున్నప్పుడు తెరమీద కనపడే పాత్రధారులను ఎంత ఆసక్తితో చూశానో  అంతే ఆసక్తితో పరిసరాలనూ పరికించిన సినిమాఇది.  (తెర మీద కనపడే  పరిసరాలనండోయ్, తెర బయటివి కాదు. : ) .

సినిమా కథ పరంగా పెద్ద చెప్పుకోడానికేమీ లేదు. తన లోకంలో తనుంటూ ప్లంబింగ్ పని చేసుకొని పొట్టపోసుకొనే మన కథా నాయకుడికి  తన అన్నయ్య చనిపోయాడని  ఫోనొస్తుంది. వాళ్ళన్నయ్య  పోతూ పోతూ విల్లులో తన  టీనేజీ కొడుకు బాధ్యత మన కథానాయకుడిమీద పెడతాడు. అప్పటికే గతంలో జరిగిన ఒక విషాదంతో సతమత మవుతున్న  ఈయనా, అకస్మాత్తుగా ఊడిపడ్డ ఈ దత్తపుత్రుడూ ఇద్దరూ కలిసి చేసే కొద్దిపాటి ప్రయాణేమే ఈ సినిమా. పెద్ద మలుపులేవీ లేకుండా సినిమా చాలా సాదా సీదాగా నడుస్తుంది. ఆకట్టుకొనే మంచి 'ఫీల్ బ్యాడ్' సినిమా ఇది. 

ఇంతకీ కథా నాయకుడు యాక్షన్ భలే  చేసాడే ఎవరీయన అని చూద్దును కదా, ఆ సంవత్సరానికి(2017)  ఆ సినిమాకే ఉత్తమ నటుడిగా ఆస్కార్ కొట్టేసాడీ పెద్దమనిషి (కేసీ అఫ్లెక్).  

మీకు వీలయితే మాత్రం ఈ సినిమాని  చూడండి.  నచ్చితే ఒకే. నచ్చకపోతే నన్నూ, ఈ పోస్టునీ మర్చిపోండి. మీ సమయం వృధా అయినందుకు నా ముందస్తు 'సారీ' : ) 

                        **********************************************************

అదండీసంగతి. ఈ సినిమా చూసేసరికి నా న్యూఇంగ్లాండు జ్ఞాపకాలు నన్నిలా ముంచెత్తేసాయన్నమాట. 

పోస్ట్ స్క్రిప్ట్  :

గత  సంవత్సరం నుంచి మాత్రం  కాస్త మార్పుకోసం టెక్సాక్ ,అట్లాంటా లేదా  నార్త్ కెరొలినా కన్నా  వలస పోదామని అనిపిస్తోంది.నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. చూడాలి ఏమవుతుందో?ఈలోపే నార్తీస్టు  ట్రిప్ వేయాలనీ, అప్పట్లో మేమున్న అపార్టుమెంట్లూ, తిరిగిన రోడ్లూ, చూసిన ప్రదేశాలని మరొకసారి చూద్దామనీ,ముఖ్యంగా పిల్లలకి చూపిద్దామనీ   చాలా రోజులుగా ఒక ఆలోచన . 

మనసులో మాత్రం ఏదో  ద్వైదీ భావం. ఏమో, చూద్దాం. 


Saturday, July 16, 2022

ఓ నాలుగు నచ్చిన పాటలు

తొంభైల చివర వరకూ కొద్దో గొప్పో మన తెలుగు సినిమా పాటలు సాహిత్య పరంగా కూసింత ఆస్వాదించగలిగేలా ఉండేవనుకుంటా.తర్వాత్తరవాత  ట్రెండు మారి  వాయిద్యాల హోరెక్కువై  (ఉన్న కొద్దిపాటి )సాహిత్యాన్ని  సంగీతం మింగేయటం మొదలయింది.అయినా ఇప్పుడొస్తున్న కొత్తపాటల్లో  కనీసం ఓ రెండులైన్లయినా నచ్చకపోతాయా అన్నట్లు వెతుకుతూ (వింటూ) ఉంటా.  99% నిరాశ పరిచేవే.చాలా పాటలు పూర్తిగా వినే  అవసరం కూడా ఉండదు. 

అప్పుడెప్పుడో "గమనం" అనే సినిమా ట్రైలరు చూసినప్పుడు పర్లేదు చూడొచ్చేమో అనిపించింది. ఒకానొక  ఆదివారం మధ్యాహ్నం చిన్నకునుకు తీసిన తర్వాత  లేవటానికి బద్దకించి ఏమైనా చూద్దామని వెతుకుతుంటే  ఈ సినిమా యు-ట్యూబ్ లో కనపడింది.ట్రయిలర్ తాలూకు ప్రభావం ఎలానూ ఉంది పైగా ఇప్పటివరకు పేరు వినని దర్శకురాలు (సుజనా రావు ) కాబట్టి ఇంకాస్త ఆసక్తి ఎక్కువైంది. సినిమా కథా,దర్శకత్వం లాంటి మిగతా వివరాల జోలికి పోను గాని సినిమా నాకైతే పర్లేదనిపించింది.పైగా ఈ సినిమా నేపధ్యం నా కెం ........ తో.........   ఇష్టమైన హైదరాబాదు  కాబట్టి ఇంకాస్త ఎక్కువ  నచ్చిందన్నమాట. 

ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో  "ఎంత  ఎంత చూసినా " పాట బావుంటుంది. ఆకట్టుకునే బాణీ,మంచి సాహిత్యం. పైగా పైన చెప్పినట్టు నేపధ్యం హైదరాబాదు.ఇంకేం కావాలి  మరి నాకు?

ఈ పాటలో యవ్వనంలో ఇద్దరి మధ్య ఆకర్షణ ఎంత ఉధృతంగా  ఉంటుందో చెప్తూ "నీడ కూడా రంగుమారే  ప్రాయమే ఇది" అనే లైను మొదటిసారి విన్నప్పుడు నాకు భలే నచ్చేసింది.రాజా గారు పాటని  ఇంకొంచెం  హుషారుగా పాడించి ఉంటే ఇంకా బాగుండేదేమో మరి. పాట రచన కృష్ణకాంత్. 


నాకు నచ్చిన  ఇంకో పాట  ఎప్పుడొచ్చిందో ఎప్పుడెళ్లిందో తెలీని "అర్ధశతాబ్దం"  సినిమాలోని "ఏ కన్నులూ చూడనీ చిత్రమే".సాహిత్యంతో పాటు పాట  చిత్రీకరణ కూడా ఆకట్టుకునేలా ఉంది. (పిడకల వేట : ఈ పాటలో హీరో(?)పైనుంచి పూలు విసిరే సీన్లో కంటిన్యుటీ మిస్సయింది.  కోతి  గురించి మాత్రం ఆలోచించొద్దు అనగానే ఆలోచనలనిండా  కోతే నిండిపోయినట్టు,నాకు ఈ పాట చూస్తున్నంతసేపు అదే గుర్తుకొస్తుంది : ) 

పాటలో నాకు బాగా నచ్చిన లైన్లు.. 

రంగులద్దుకున్న...  సందె పొద్దులాగా ..... 

నువ్వు నవ్వుతుంటే....  దివ్వెలెందుకంటా ... 

రెప్పలేయకుండా.. రెండుకళ్ల నిండా.. 

నిండు పున్నమల్లే  .. నిన్ను నింపుకుంటా

రచన రెహమాన్. 


ఇంకో పాట "రంగ్ దే " చిత్రంలోని "ఊరంతా వెన్నెలా..మనసంతా చీకటీ ...". రచన శ్రీ మణి . ఈయన నాకు మొట్ట మొదటగా తెలిసింది "సెగ" చిత్రంలోని "వర్షం ముందుగా " పాటతో. పోయిన వారం విడుదలయిన "వారియర్" సినిమాలో "బులెట్ " సాంగ్  సగం విని ఆపేసి అలవాటు ప్రకారం రాసిందెవరాని చూస్తే  ఈయనే.... ప్చ్.. 


"మనసున ఏదో రాగం" ( సినిమా పేరు "ఎంత వాడు గాని")

కొన్ని నెలల క్రితం ఒక రాత్రి నాకు నిద్ర పట్టక  కొత్త పాటలకోసం వెతుకుతుంటే  ఈ పాట కనబడింది. హారిస్ జయరాజ్ ట్యూను బావుంటుంది. గాయని   గొంతు అద్భుతం.కానీ  ఒకటి రెండు లైన్లు మినహాయిస్తే  "అయ్యబాబోయ్, ఏంటిది ?" అనిపించే సాహిత్యం. ఈ లైనేదో  బావుందే అనుకొనేలోపు తర్వాతి లైను బొప్పికట్టించేస్తుందన్నమాట .  : ) 

ఏ మాట కామాటే దాదాపు ఒక  రెండు మూడు నెలలపాటు నాకు హాయిగా జోల పాడిన పాట  ఇది. పక్కన  పడుకున్న  పిల్లలకి ఇబ్బంది కలగకూడదని ఇయర్ బడ్స్ పెట్టుకుని,పాటని లూప్ లో పెట్టుకొని పదే పదే ఈ పాట  వింటూ నిద్రపోయిన రాత్రులెన్నో.సగటు తెలుగు సినిమా చూస్తున్నప్పుడు "లాజిక్" అనే పదాన్ని మన బుర్రలోంచి ఎలా చెరిపేస్తామో అలాగే పంటి కింద రాళ్ల లాంటి ఆ  పదాల  మీద దృష్టి పెట్టకుండా జస్ట్ ట్యూన్ నీ, చిన్మయిగారి గానాన్నీ ఆస్వాదిస్తూ నిద్రని ఆహ్వానించేవాడిని. 

 ఈ  పాట రాసింది ఏ .ఎం .రత్నం మరియు శివ గణేష్ అట. 



Monday, July 11, 2022

అమెరి'కతలు -5

 సమయం రాత్రి పదిగంటలు పైనే. 

దేవుని గూట్లో సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు వెలిగించిన దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. 

రోజుటిలాగే మొదట మామూలుగా చెప్పి ఆనక బెదిరించి ఆఖరికి లివింగురూము మొత్తం ప్రతిధ్వనించేలా అరిస్తే గాని చిన్నోడిచెయ్యి టీవీ రిమోట్ ని తడమలేదు.  అప్పటికీ వాడు టీవీని కట్టేయలేదు , వీడియో పాజ్ చేసాడంతే.  సింకులోని అంట్లన్నీ తోమి కిచెన్లో సామాన్లు సర్దుతున్న నేను మళ్లీ నా పనిలోపడి ఇంకొంచెంసేపు వెసులుబాటు కలిగిస్తానేమో అని వాడి ఆశ. ఈరోజు మాత్రం వాడి ఆశ అడియాసే.  

కిందికెళ్లి ఇంటి మెయిన్ డోరు, గరాజ్లోంచి బేస్మెంట్ లోకొచ్చే డోరూ  రెండూ లాక్ చేసున్నాయోలేదో చూసి, కాసిన్ని నీళ్లు తాగి, పిల్లలిద్దరినీ పైకెళ్లి పడుకోమని చెప్పి కాస్త అలసట తీర్చుకుందామని డైనింగు చైర్లో కూలబడ్డాను. 

పొద్దున ఆరున్నరకు లేస్తే రాత్రి దాదాపు పదకొండు గంటల వరకూ ఊపిరి సలపని పని. అటు ఆఫీసు పనీ, ఇటు పిల్లల బాగోగులూ. దేన్నీ పక్కన పెట్టడానికి లేదు. 

నిజానికి వంట చేయడమే పెద్ద పననుకుంటే బెదిరించో బామాలో   వాళ్ల చేత తినిపించడం అంతకంటే పెద్ద పని. దానికితోడు ఈ మధ్యే మొదలైన  సిబ్లింగ్ రైవల్రీ.  నాపిల్లల్నెప్పుడూ ఏ విషయంలోనూ వేరే వాళ్ల పిల్లలతో అస్సలు పోల్చి చూడను కానీ ఈమధ్యే  ఒడ్డూ పొడుగూ విషయంలో అదే పనిగా వాళ్లని తమ ఈడు పిల్లలతో పోల్చిచూడడం ఎక్కువయింది. నిన్నా మొన్నటివరకు పిల్లల విషయంలో ఒక పేరెంట్ గా నాకు నేను ఏర్పరుచుకున్న జాబితాలో తిండికంత ప్రాముఖ్యత లేదు. అలాఅని పట్టించుకోనని కాదు. నిజానికి నా రోజువారీ అరుపులూ,కేకల్లో సింహభాగం డైనింగు టేబులు దగ్గరే. 

పైన బెడ్ రూంలోంచి పిల్లల గుసగుసలు వినబడుతున్నాయి. లేచి లివింగురూములో  పైకి దారితీసే మెట్ల వద్ద కొచ్చి గట్టిగా అరిచాను. 

"హే , నో టాకింగ్ ,గో టు  బెడ్".  

ఓ రెండు నిమిషాల తరువాత  ఆ గుసగుసలు మళ్లీ మొదలవుతాయి. ఈరోజు మాత్రం నాకు అక్కడ నిలబడే ఓపికేమాత్రంలేదు.  

డన్ ఫర్ ద డే.

దానికితోడు ఏకాదశి ఉపవాసాన్ని ముగించుకొని  సాయంత్రం ఏదో  కాస్త కతికినా ఆ నిస్సత్తువింకాపోలేదు.

నిద్రపోబోయే ముందు డేన్ డిలయన్  టీ   తాగటం నాకలవాటు.   కిచెన్ లోకొచ్చి మిగతా సామాన్లన్నీ సర్ది కెటిల్ లో నీళ్లు పోసి ఆన్ చేసాను. గాజు గ్లాసులో  మరిగించిన నీళ్లు అందులో  టీ బ్యాగ్ వేసి ఓ పది నిమిషాలు ఆగితే చాలు.  ప్రతిసారీ కాకపోయినా  కొన్ని సార్లు క్రమంగా రంగుమారే ఆ నీళ్లను  చూడటం సరదా నాకు. 

కానీ ఈ రోజు...  అదీ ఈ టైములో...  నో వే . 

గ్లాసు డైనింగు టేబిలు మీద పెట్టి, ఎప్పటిలాగే ముందు లివింగురూము లైట్లూ , తరువాత కిచెన్, ఆ తరువాత డైనింగు ఏరియా లైట్లు ఆఫ్ చేసేసాను.  దేవుని దగ్గర వెలిగించిన  దీపాన్ని చూస్తూ చిట్ట  చివరి లైటుని ఆఫ్ చేయడం నాకలవాటు. చాలా అసంకల్పితంగా జరిగిపోతుందది,కొన్నేళ్లుగా . 

ఇల్లంతా  మసక చీకటి.

డైనింగు ఏరియాకి కొద్దిదూరంలో,మార్నింగు రూములో, సాయంత్రమెప్పటినుంచో  వెలుగుతున్నా  అసలు ఉనికేలేనట్లున్న ఆ దీపం ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్లయింది.  

పచ్చటి వెలుగు.  

వెళ్లి   దానెదురూగా  బాసింపట్లువేసుక్కూర్చున్నాను . 

చీకట్లో నిశ్చలంగా ఘనీభవించినట్లుగా ఉన్నదా దీపం.ఏసీ మెషిన్ ఆన్ అయివుంటే మాత్రం సీలింగుకున్న వెంట్ లోంచి వచ్చే గాలికి  కొద్దిగా రెప రెప లాడుతుందది . 

కళ్లార్పకుండా ఆ చీకట్లో ఆ పచ్చటి వెలుగుని  చూడటం నాకెంతో ఇష్టం. ఒక అనిర్వచనీయమైన  ధైర్యాన్నిస్తుందది నాకు.దాన్ని ధ్యానమంటారో ఇంకేమంటారో  నాకు తెలీదు కానీ పొద్దుట్నుంచి చెల్లా చెదురైన నన్ను తిరిగి  ఒక్కటిగా పేర్చుకుంటున్నట్లుగా ఒకరకమైన భరోసా మాత్రం దొరుకుతుందా సమయంలో.  పొద్దున్న లేచింది మొదలు నన్ను నిలువునా మింగేసే  రోజు లోంచి  బయటపడి నాకు నేను గా  మిగిలేది బహుశా ఈ కొద్ధి  నిమిషాలేమో మరి. రోజుమధ్యలో కాస్త తీరికి దొరికి ఏదైనా చదువుతున్నప్పుడో లేదా టీవీ చూస్తున్నప్పుడో సందు దొరికితే చాలు నన్నమాంతం మింగేయడానికి సిద్ధంగా రకరకాల ఆలోచనలు. ఈ సమయంలో  మాత్రం  అవన్నీ కొద్దిగా నెమ్మదిస్తాయి.  

కిటికీ బ్లయిండ్స్ వేసున్నా లోపలికెలా  దూరిందోగాని  రోడ్డు మీద వెళ్తున్న కారు హెడ్ లైట్ల  తాలూకు వెలుగు మందిరం వెనకాలున్న  గోడ మీద ఏటవాలుగా మొదలై , గోడంతా పాకి  ఎటెళ్లాలో తెలీనట్లుగా సీలింగుమీద ఒక్కక్షణం తారట్లాడి చప్పున మాయమయింది. ఆ వెంటనే కారు టైర్లు రోడ్డు మీద చేసే మెత్తటి  సన్నని శబ్దం నా పక్కగా .  

రోడ్డు పక్కిల్లు. తప్పదు. అయినా నా ఒంటరితనానికి ఇదోరకంగా మంచిదే. 

డైనింగు టేబులు వెనకాల గోడకి తగిలించిన ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధ  భగవానుడి   పెయింటింగ్ తాలూకు ఫ్రేమ్ మాత్రమే లీలగా కనపడుతోంది. అయితే మందిరం పక్కనే  టేబిలుమీద గోడకానించి పెట్టిన  పెద్ద సాయిబాబా ఫోటో  మాత్రం అదాటుగా చూస్తే ఆ చీకట్లో  గోడవతల్నుంచి నన్నెవరో తీక్షణంగా చూస్తున్నట్టుగా , కొద్దిగా భయం గొలిపేలా ఉంది. ఒక్క క్షణం నవ్వొచ్చింది నాకు. ఈ చిరు చీకటికి నమ్మిన దేవుణ్ణే దయ్యం చేయగల శక్తి ఉన్నప్పుడు మరి మన మనసును కమ్మిన చీకట్ల సంగతో? వాటి ఉనికే తెలియనీయక  ఇదే జీవితం అనుకొమ్మంటూ మనచేత అవి చేయించే విన్యాసాలెన్నో. 

టీ చల్లారిపోతున్న విషయం గుర్తుకొచ్చింది. పైగా రేపు ఆఫీసుంది మరి. 

మరొక్క సారి తదేకంగా దీపాన్ని చూసుకొని పైకి లేచాను. 


Saturday, February 26, 2022

అమెరి'కతలు -4

ఇదో నాలుగేళ్ల క్రితం సంగతి.

ఎదురింటి  పంజాబీవాళ్లతో  మాపెద్ద చిక్కొచ్చిపడింది నాకు. వాళ్లొకసారి మాఇంటికొచ్చినప్పుడు ఆరోజు నా టైం బాలేక   ఏ చిన్న చీమో,సాలీడో  వాళ్ళ కళ్ళబడింది. ఇక కాళ్లెత్తి   సోఫాలో పెట్టుకొని ఒకటే అరుపులూ కేకలూ.

అసలే పంజాబీలు. ఫైర్అలారం మోగినట్టే అయింది ఆ కాసేపు. 

అప్పట్నుంచి నాతో ఒకటే గొడవ "పెస్ట్ కంట్రొల్"వాళ్లని పిలుస్తావాలేదా?"అని. వాళ్ల చిన్నమ్మాయి అయితే  "అంకుల్, ఒక వారంటైమిస్తున్నా, ఈలోపు మీరు పిలవకపోతె నేనే కాల్ చేసి స్కెడ్యూల్ చేసేస్తా" అని  బెదిరించేసింది. .

వాళ్లది సరిగ్గా మా ఎదురిల్లే. నేను బయటికెళ్లినప్పుడల్లా వాళ్లు కూడాబయటేగనక ఉంటే  అక్కణ్నుంచే కనుబొమ్మలెగరేసో, చేత్తో సైగలూ చేసో వాకబు చేసేవాళ్లు, కాల్ చేసావా లేదా అని. 

ఓన్లీ సైగల్. నో మాటల్.

ఆదోరకం టార్చర్.అందరూ కలిసి కూడబలుక్కున్నట్లున్నారు.  

చిన్నమ్మాయిగోరు   అయితే రోజుకో మేసేజ్ ఫోన్లో. ఆ అమ్మాయికి  అస్సలు మొహమాటాల్లేవు. 

"అంకుల్, స్టేటస్ ప్లీజ్"

(దానికి రెస్పాన్స్ ఇవ్వటం ఒక ఐదునిమిషాలు లేటయినా )

"డిడ్ యూ గెట్ మై మెసేజ్?"

"ఆర్ యూ దేర్ ?"

"అంకుల్, ఈజ్   ఎవ్రీథింగ్ ఓకే?" ( సెంటిమెంటుతో కొట్టడం అన్నమాట). 

ఈ టార్చర్ భరించలేక   ఓరోజు ఫోన్ చేసి స్కెడ్యూల్ చేసేసా. నాటైం బాలేక  ఆ పెస్ట్ కంట్రోల్ ఆయనొచ్చినప్పుడు   ఎదురింటి అమ్మాయిలిద్దరూ మా ఇంట్లోనే ఉన్నారు. 

ఆయన  రాగానే  తన దగ్గరున్న టాబ్లెట్లో రకరకాల కీటకాల బొమ్మలు చూపిస్తూ,వాటివల్ల వచ్చేజబ్బుల గురించీ,వాటిని విజయవంతంగా ఎలా చంపేస్తామో  చెప్తుంటే వాణ్ణి కాస్త పక్కకి పిలిచి ,ప్రకాష్ రాజ్ స్టైల్లో, చెవిలో రహస్యం చెప్తున్నట్టు.. 

"మాష్టారూ, ఈ  చంపే  బిజినెస్ మనకెందుగ్గాని, వాటిని ఇంట్లోకి రానీయకుండా చేసి మార్గమేదైనా ఉందా?" అనడిగా. 

వాడు నావైపు చాలా ఆశ్చర్యంగా చూసి,నేను కాంట్రాక్టు సైనప్ చేస్తానో చేయనో అని సందేహపడ్తూ( ఇది నా ఊహే లెండి),

" ఐ నో వేర్ యు అరె కమింగ్ ఫ్రం" అని కాస్తాగి ,మళ్లీ  "ఐ గెటిట్ దో " అన్నాడు. 

నేనలాగే  చూస్తున్నాను ఆయన్ని తన నెక్స్ట్ డైలాగ్ కోసం ప్రకాష్ రాజ్ లా వెర్రిమొహం వేసుకొని .

ఆ తరువాత ఆయనింకేం  చెప్పలేదు. 

చేతులు కట్టుకొని నేను.నేలచూపులు చూస్తూ ఆయన. 

ఓ పదిసెకండ్ల ఇబ్బందికరమైన  నిశ్శబ్దం తరువాత ఆయనే "సో, వాట్ నెక్స్ట్ ?" అన్నాడు.

మాటలాపి మా వైపే చూస్తున్న ఆ పంజాబీ అమ్మాయిలవైపు చూసా.పెద్దమ్మాయి కళ్ళెగరేసింది "ఏంటి విషయం?" అన్నట్లు. చిన్నమ్మాయి మాములుగా చూస్తున్నా నాకు మాత్రం వేలు చూపిస్తున్నట్లే ఉంది . 

"లెట్స్ గో ఎహెడ్ " అన్నా విధిలేక, పెన్నందుకుంటూ

ఓ వారం తర్వాత మొత్తం సరంజామాతో తగలడ్డాడు వాడు. నాకిష్టం లేని పని కాబట్టి తలుపు తెరిచి మొహాన నవ్వు పులుముకొని ఓ షేక్ హేండిచ్చి( ఇది కరోనా పూర్వం  లెండి ) నా ఆఫీసు పనిలో మునిగిపోయా.  

కాసేపు ఇంటి బయటా, ఇంకాసేపు పెరట్లో, ఇంటి లోపల కిటికీల దగ్గరా ఏదేదో  చెసేస్తున్నాడు.

ఓ అరగంట తరువాత అసలు చడీచప్పుడు లేకపోయెసరికి కొంపతీసి వెళ్లిపొయాడా అని కిందికెళ్లి చూస్తే  గరాజ్ నలుమూలలా జిగురు  పూసిన అట్టపెట్టెలు లాంటివి పెడ్తూ నన్ను చూసి దొరికిపోయిన దొంగలా అదోలా నవ్వి తిరిగి తను  చేస్తున్న పనిలో మునిగిపోయాడు.

మరుసటిరోజు కిచెన్లొ ఒక వైపు గోడవారా పుట్టలుపుట్టలుగా చచ్చిన చీమలు. అయ్యో అనిపించింది నాకు . 

కొన్ని రోజుల తరువాత  ఒక వీకెండ్ కాస్త గరాజ్ క్లీన్ చేద్దామని వెళ్ల్లినప్పుడు ఆ  బాక్సుల్లో జిగురుకతుక్కొని  చచ్చిన రకరకాల కీటకాలూ, ఒకట్రెండు నలికీసు పాములూ ( సేలమేండర్ అంటారిక్కడ ఇంగిలిపీసులో). 

పాపం అవి ఆ జిగురుకతుక్కొని, కదల్లేక , ఆకలికి అలమటించి..ప్చ్.. ఉసూరుమంది ప్రాణం.

వంటిట్లో చీమలు ఇంకా వస్తుండడం చూసి చిన్నమ్మాయి పెస్ట్ కంట్రోలు వాళ్లతో "ఐయాం నాట్ హ్యాపీ విత్ యువర్ సర్వీస్" అనేసరికి ఆ మరుసటి రోజు మళ్ళీ  ఆయనే..

ఎప్పట్లానే  వెర్రి నవ్వూ , ఓ హేండ్ షేక్ ..

ఓపావుగంటలో ఆయన ఆ చీమలు ఎక్కడినుంచి వస్తున్నాయో కనిపెట్టాడు. అవి మా నైబరుడు మిస్టర్  చాంగ్ పెరటినుంచి మాపెరట్లోకి అక్కణ్నుంచి మా వంటింట్లోకి వస్తున్నాయి. అర్జెంటుగా హోం ఓనర్ అసోసియేషను వాళ్లకి కంప్లయింటు ఇమ్మన్నాడీయన. అది నావల్ల కాని పని.

ఇక మిస్టర్ చాంగ్ గురించి..

ఈయన నా పొరుగున ఏడేళ్ల నుంచి ఉంటున్నా, మా కళ్లూ కళ్లూ కలిసి  "హెలో" చెప్పుకోడానికి ఐదేళ్లు  పైనే పట్టింది. 

నేనే అనుకుంటె ఈయన నన్నుమించి అన్నమాట.   

ఆ చైనా ఇంగ్లీషు అర్ధం చేసుకోవటం కష్టం గానీ, ఎదురుపడి తప్పనిసరై మాట్లాడాల్సొస్తే మాత్రం  చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు.

ఈ పెస్ట్ కంట్రోల్ ఆయన రావటానికి  ముందు .. 

ఓనాల్రోజుల  క్రితం.. 

ఆరోజు శనివారం... 

నాకు పొద్దున్నే మెలకువ రాగానే  యూట్యూబ్   లో  ఒకట్రెండు తెలుగు మెలొడీలు విన్నాకే బెడ్డు దిగటం అలవాటు (రోజూ కాకపోయినా దాదాపు ప్రతిరోజూ ). ఆరోజు అలా వెతుకుతుంటే  సూపర్  స్టార్ కృష్ణ,జయప్రదల  పాటొకటి కనపడింది.హిట్టయిన పాటే.లంకంత బంగళాలో తెల్లటి  లాల్చీ  పైజమావేసుకొని, మల్లెపువ్వునే  తలదన్నేంత  తెల్లగా ఉన్న కృష్ణ బెడ్డు మీద  నిద్దరోతుంటే, ఆ బంగళా బయటెక్కడో   అల్లంతదూరంలో తోటలో పూలుకోస్తూ జయప్రద పాటందుకొంది. ఆ పాట వినగానే కృష్ణ గారు బద్దకంగా లేచి, అలా వొళ్ళిరుచుకొని...  ఇలా ఆవలించారు .

దెబ్బకి నా నిద్రమత్తొదిలిపోయింది. ఇక మళ్లీ నిద్రపట్టే ఛాన్సే లేదు. 

కాబట్టి  కిందకొచ్చేసి ముందురోజు రాత్రి అనుకున్నట్టు రెండు వాయలు ఇడ్లీ (భయపడకండి. వాయకెనిమిదే.మూడో ఇడ్లీప్లేటుని కాకెత్తుకుపోయింది), పనిలోపనిగా వేయించిన వేరుశెనక్కాయలూ, చట్నీ  పప్పూ ,కాస్త కొబ్బరీ అన్నీ వేసి చట్నీ చేసి పడేసా. (చట్నీ చేసుకొనే ఓపిక అన్నిసార్లూ ఉండదు, చాలా వరకు ఏ పొడితోనో  కాస్త నెయ్యేసుకొని లాగించెయ్యటమే) 

సుష్టుగా ఏడెనిమిది ఇడ్లీలూ  ఆ వెంటనే వేడి వేడి కాఫీ  గొంతు దిగుతుంటే  కళ్లల్లో నీళ్లు తిరిగాయి (చట్నీలో  కారం బాగా ఎక్కువై) .  

ఇక ఇల్లు శుభ్రం చేసే  కార్యక్రమం  పెట్టుకొని, ఇంటిలోపల  మెయిన్ డోరు  ఎదురూగా ఉండే మెట్లని వ్యాక్యూం చేస్తుండగా బెల్లు మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ  టక్కున డోరు తెరిచి చూస్తే వడివడిగా సొంతింట్లోకే దొంగలా పారిపోతూ పక్కింటి మిస్టర్ చాంగ్. బహుశా నేను అంత త్వరగా తలుపుతీస్తానని ఊహించి ఉండడు. బెల్లుకొట్టి నేనొచ్చేలోగా పారిపోదామనుకున్నాడేమో?  వాట్సప్ లో ఆన్లైన్ స్టేటస్ లా దొరికిపోయాడు.(పాపం ఆయనేం తొందర్లో ఉన్నాడోలెండి. ఈసారికి  బెనిఫిటాఫ్ డౌట్ ఇచ్చేద్దాం)   

ఇహ తప్పనిసరై కళ్లజోడు సవరించుకుంటూ పలకరించాడు. 

"హాయ్ మిస్టర్ శివా"

శనివారం ఉదయం..పైగా బ్రహ్మండమైన  బ్రేక్ ఫాస్టూ.నేనేమైనా తక్కువా.. 

"హేల్లో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ   మిస్టర్ చాంగ్" 

ఇంతకి  విషయం ఏమిటంటే ఆయన వాళ్ల పెరట్లో పండించిన  "చైనా గుమ్మడికాయని" నాకిద్దామన్ని బెల్లుకొట్టాడట . ఆయన ఆమాట చెప్పాక అప్పుడు గమనించా... 

ఇంటి గుమ్మంలో .. 

అంత పెద్ద గుమ్మడికాయని నేనెప్పుడూ చూడలేదు. మనం చూసే పేద్ద పుచ్చకాయకి  మూడింతలుందది.  దీన్నిలాగే  లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే "బ్యాక్ ఇష్యూస్ "  వస్తాయేమో, బెటర్  దీన్నిక్కడే కోసి తీసుకెల్దాం అనిపించేలా ఉందది. 

చాంగ్ వాళ్ళ నాన్నకి గార్డెనింగ్ అంటే చాలా  ఇష్టం . రోజంతా ఆయన  పెరట్లోనే ఉంటాడు ఏదో ఒకటి  చేస్తూ. వేసవికాలం  వాళ్ళ పెరడు  అచ్ఛం అడవిలానే ఉంటది.  తీగ చెట్లు పాకడానికి వీలుగా పెరడంతా పందిళ్ళే. వాటికిందో  మంచం వేసుకొని  మధ్యాహ్నం పూట ఓ కునుకేయాలని నాకెన్ని సార్లనిపించిందో. వాళ్ళింటి వైపున్న మా ఫెన్స్ మొత్తం పాకేసాయి  ఆ తీగలు.  అది చూసి మా ఎదురింటి పంజాబీవాళ్ళు "శివ శివా " అంటూ నన్ను ఎగదోయాలని ప్రయతించారు గానీ నాకేనాడు అదొక సమస్యలా అనిపించలేదు. ఎప్పటికీ అనిపించదు కూడా. వాళ్ళలా అనడానికి ఓ కారణం ఉంది. అది తరువాత  చెప్తా. 

ఇక కథలోకొస్తే ,చాంగ్ కి   థాంక్స్ చెప్పి, దాంతో  వండిన కూర ఎలా వచ్చిందో 'డెఫినిట్' గా తనకి చెప్తానని ఒట్టేసి, దాన్నెత్తుకొని లోపలికొచ్చి, కాలితో తలుపేసి, దాన్ని నడుంతో ముక్తాయించి, మెట్లమీద మధ్యలో వదిలేసిన  వ్యాక్యూమ్ క్లీనర్నిజాగ్రత్తగా  దాటేసి, ఇంకో రెండు మెట్లుండగానే దాన్ని  జాగ్రత్తగా లివింగ్ రూమ్ ఫ్లోర్ మీద పెట్టి కిచెన్ లోకి దొర్లించుకుంటూ తెచ్చేసా. 

దాన్ని చూస్తుంటే కిచెన్లో సగం అదే వున్నట్టుంది. 

ఫ్రిజ్లో పట్టదు కాబట్టి ఈరోజు దీన్ని  'కొయ్యాల్సిందే'.ఇంటిపని పూర్తయ్యాక ఇక ఈ వంట పని చూడాలి అనుకున్నా. 

ఆ మధ్యాహ్నం,ఎలా  వండాలో తెలీక సరే చూద్దాం అని నాకు తెలిసిన సొరకాయ కూర స్టైల్లో వండిన కూర భలే రుచిగా వచ్చింది.సగం పైగా కూర నేనే తినేసా,పెరుగన్నాన్ని త్యాగం చేసి మరీ.  

ఇహ ఆ మిగతా సగం గుమ్మడికాయ ఇంకా నా ఫ్రిజ్లో నిద్దరోతోంది. ఎలా ఇస్తాను కంప్లయింట్ చెప్పండి మరి? 

మేమీఇంటికొచ్చిన కొత్తల్లో అప్పటికింకా మిస్టర్ చాంగ్ కి పెళ్లి కాలేదు. ఇంకో చైనా అబ్బాయితో ఉండేవాడు. వీధిలో అందరూ వీళ్ళ బంధాన్ని అపార్ధం చేసుకొని  బుగ్గలు తెగ నొక్కేసుకున్నారు. ఓసారి నేను డెక్కు  మీద నిలబడి కాఫీ తాగుతూ యధాలాపంగా పక్కకి చూస్తే పక్కింటి పెరట్లో ఈ చాంగ్ గారి రూమ్మేటు. ఓ కుర్చీలో జారగిలబడి ఎదురూగా ఉన్న ఇంకో ఖాళీ కుర్చీలో కాళ్ళు బెట్టుకొని కూర్చోనున్నాడు.చేతిలో బీర్ కేను.ఒంటి మీద మోకాళ్ళదాకా ఉండే బాస్కెట్బాల్ ఆటాడేవాళ్లు వేసుకొనే షార్ట్.అరంగుళం కూడా ఖాళీలేకుండా చేతులమీదా, ఛాతీమీదా (పొట్టతో సహా) పచ్చబొట్లు.(అంతా ఒకటే డిజైన్,పచ్చబొట్టు అనాలేమో).అయినా అసలు పొట్టమీద ఎలా వేయించుకుంటారు, నవ్వురాదూ గిలిగింతలు పుట్టి? నాకైతే మా అమ్మాయి ఎప్పుడైనా "నాన్నా... ఐ విల్ టికిల్ యూ... అంటూ చేయత్తగానే,ఆ వేళ్ళు నాదాకా రాకుండానే నవ్వొస్తది.

'గేంగ్  మెంబర్' లా ఉన్న ఆయన్నలా చూడగానే దడుచుకున్నాను.  ఎర్రగా బుర్రగా ,కళ్లజోడుతో  చూట్టానికి మంచి ఇంటిలిజెంట్ స్టూడెంట్లా   ఉంటాడు చాంగ్.  ఆయనకి  ఇలాంటి  రూమ్మేట్ ఏంటిరా బాబు అనిపించిందోక్షణం. 

చాంగ్ వాళ్ళింటి డ్రైవ్వే  మీద ఒక కారే పడుతుంది.ఈ రూమ్మేటు తన కారుని ఇంటెదురుగా వీధిలోనే ఓ పక్క పేర్లల్ పార్కింగ్ చేసేవాడు. పంజాబీ వాళ్ళింట్లో  అందరికీ తలా ఒకకారు.ఇంటి యజమాని  క్యాబ్ తో సహా మొత్తం ఆరుకార్లు.వాళ్ళ కారొకదాన్ని  ఈ స్పాట్లోనే పార్క్ చేసేవాళ్లు మొదట్లో.ఈ రూమ్మేటు వచ్చాక ఆ స్పాట్ మీద వాళ్ళ హక్కు హరించుకుపోయింది.ఇక పోటీ మొదలయింది. ఎంతలా అంటే ఆ పంజాబీ ఆయన వెయ్యి తగలేసి ఒక డొక్కు కారు కొని దాన్ని 'పెర్మనెంటు'గా ఈ స్పాట్లో పెట్టేసాడు. (ప్చ్..ఏంటో జనాలు). 

పచ్చబొట్టబ్బాయి తక్కువోడేంకాదు.ఒక నెల చూసి ఇక వేరే మార్గం లేదనుకొని ఒకానొక అర్ధరాత్రి ఓ డబ్బా నిండా పెయింట్ తీసుకొచ్చి కారు అద్దాలమీదా, లోపల సీట్ల మీదా పోసేసాడు. కారులోపల  రంగెట్లా  పోసాడో , బహుశా 'ఆ టాలెంటు' కూడా ఉందేమో. 

ఎదురింటాయన మామూలుగానే ఫైర్ బ్రాండ్. ఆయన నాకు 'హలో' చెప్పినా నెత్తి మీద సుత్తితో కొట్టినట్లే ఉంటది. పొద్దునే లేచి ఆయన ఈ రంగు మారిన కారు చూసి 'గుగ్గిలం మీద అగ్గే' అయ్యాడు. 

పోలీసులొచ్చారు. చాంగ్ ఇంటి అణువణువూ గాలించారు ఆధారాలకోసం. ఖాళీ రంగు డబ్బాగానీ, ఇంట్లో లేదా గరాజ్ లో  ఎక్కడైనా కనీసం ఒక రెండు చుక్కల  రంగైనా గానీ దొరుకుద్దేమోనని. 

కారు చుట్టూతా క్షుణ్ణంగా పరిశీలించారు ఏవైనా ఆధారాలు చాంగ్ ఇంటి వైపు దారి చూపిస్తాయేమోనని.. 

నాడ. 

అలా ఆధారాలు లేకుండా ఆ కారుని మర్డర్ చేసి పడేసేడా పచ్చబొట్టబ్బాయి.  చైనా నా మజాకానా మరి. 

అందుకే  వాళ్లకి చాంగ్ ని చూస్తే  వళ్ళు మంట. నేను ఆయనతో మాట్లాడుతుంటే మొదట్లో వీళ్ళు తెగ ఫీలయ్యేవారు.ఆడవాళ్లు సర్దుకుపోయినా ఆ పంజాబీ ఆయన మాత్రం ఉక్రోషం పట్టలేక ఒకసారి మాఇంటికొచ్చ్చినప్పుడు "వాడొక స్టుపిడ్ ఫెలో. వాడితో మాట్లాడకు" అన్నాడు.ఒక రెండు క్షణాలు ఆయన కళ్లల్లోకి సూటిగా చూసి  చిన్నగా నవ్వి ఊరుకున్నాను. 

తిరిగి ఏం  మాట్లాడలేదు ఆయనతో. 

                                                                                                      (ఓపికున్నప్పుడు మిగతాది) 

Tuesday, March 10, 2020

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ?  త్రివిక్రమ్ సినిమాలలాగే ఉంటాయి నాకైతే.

ఆయన సినిమాల్లో కథ కంటే కథనం మీద మరీ ఎక్కువ శ్రద్ద పెట్టడంతో కథలోని సంఘర్షణ  పలుచన అయిపోతుందనిపిస్తుంది నాకు. 'అతడు' సినిమా తీసుకుంటే ముందుగా మనకి ఏం గుర్తుకొస్తుంది? కథ లోని సంఘర్షణా లేక బ్రహ్మానందం కామెడీ, "ఆడు మగాడ్రా బుజ్జీ" లాంటి డైలాగులా?ఏ టైటిల్ తలచుకున్నా కథ కంటే  ముందు  సీన్లు గుర్తొస్తాయి. వినగా వినగా  "మాటల మాంత్రికుడు" అనగానే   మాటలు మాత్రమే, కథ మాత్రం అటకెక్కుతుందనే అర్ధం వస్తోంది నాకైతే. 'విసుగు పుట్టించకుండా, అర్ధంలేని ఫైట్లతో తల  బొప్పి కట్టించక ఆ రెండున్నర గంటలు గడిస్తే చాలు అదే మంచి సినిమా' అనుకునే స్థాయికి వచ్చాం కాబట్టి 'అల వైకుంఠపురంలో' మంచి సినిమానే. 

ఆ సినిమాలో అసలా "సామజవరగమనా.." పాట సంగీత దర్శకుడినీ , ముఖ్యంగా త్రివిక్రంనీ దాటి ముందుకెలా వచ్చిందనేది నాకసలు అర్ధంకాని విషయం. "కాళ్లు","చూపులు",కాటుక" లాంటి అతి సామాన్య పదాలను అనన్యసామాన్యంగా పాడి అవతలకి 'విరిచి' పారేసాడు  సిద్.

 పిట్టకథ :
'గద్దలకొండ గణేష్'(వరుణ్ తేజ్) సినిమాకి మొదట వాల్మీకి అని పేరు పెడితే  అది  మార్చాల్సిందే అని  ఒక వర్గం వారు నానా గొడవ చేసి చివరినిమిషంలో(సెన్సారు కూడా అయిన   తరువాత ?)  పేరు మార్చేలా చేశారు. మరి ఈ సినిమా అంతా  కూడా ఆ వాల్మీకి చుట్టే తిరుగుతుంది.అసూయాపరుడూ,(పెంపుడు) కొడుకుచేత ఛీ కొట్టించుకొని చెంపదెబ్బ తినే ఓ కామెడీ  పాత్ర. ఎందుకోమరి ఆ వర్గం వారు "నో ఆబ్జెక్షన్స్ యువరానర్" అనేసారు . విషయం తెలిసేసరికే బహుశా "ఇట్ వజ్  టూ లేట్ ఇన్ ది గేమ్ " ఏమో మరి.

***************************************************************************************************************
తిరువణ్ణామలై ...

రమణాశ్రమాన్ని చూసి, అరుణాచలం మీదున్న స్కంధాశ్రమాన్నీ, విరూపాక్షుని గుహానీ దర్శించుకొని ఆ ఎగుడు దిగుడు రాళ్ళ బాటలో  కొండదిగి వస్తుండగా ఒక మలుపు తిరగ్గానే అకస్మాత్తుగా ఎదురయ్యాడా విదేశీయుడు.ఈ రాళ్లబాట మీద నడవటమే కష్టంగావుంటే ఆయన ఏకంగా ఆ బండరాళ్లూ ,చెట్ల మధ్యనుంచి  అడ్డంగా నడుచుకుంటూ వస్తున్నాడు. దగ్గరకొచ్చ్చాక "విరూపాక్ష కేవ్ కి దారెటు?" అని అడిగాడు. వయసు దాదాపు నలభై  ఉండొచ్చేమో, ఉఛ్చారణ  చూస్తే మాత్రం పక్కా  అమెరికన్లా ఉన్నాడు.వివరాలు చెప్పగానే థాంక్స్ చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు. 

ఏ ఈజిప్ట్ పిరమిడ్లో, ఐఫిల్ టవరో లేదా ఏ  క్రూజ్ ట్రిప్పో కాకుండా   ఇలా వేల   మైళ్ళు ప్రయాణం చేసి,మాతృదేశంతో ఏమాత్రం సారూప్యత లేని చోట  రమణ మహర్షి ఒకప్పుడు నివసించిన ఆ ఇరుకు చీకటి గుహల  మీద ఆయనకున్న భక్తీ, ఆసక్తీ  చూస్తే ఒకింత ఆశ్చర్యం.

ఇలా బోల్డు మంది కనపడ్డారు తిరువణ్ణామలై లో. 

వీళ్ళందరూ అట్నుంచి  ఇటొస్తుంటే, నేనేమిటీ ఇట్నుంచి అటెళ్లి పడ్డాను అని అనిపించిందో క్షణం. 

***********************************************************************
రాత్రి నిద్రపోయేముందు తెలుగు వార్తా ఛానెళ్లు గానీ లేదా  కలవరపరిచే వార్తలుగానీ, హారర్ టైపు సినిమాలుగానీ చూడగూడదనేది నేను పెట్టుకున్న  నియమం. ఏదో  కాస్త నాలుగు పేజీలు చదవడం లేదా యుట్యూబ్ లో ఏవైనా 'టెడ్ టాక్సో' మరేదైనా వింటూ నిద్రాదేవతని  ఆహ్వానించడం. 

మొన్నొకరోజు నిద్రకుపక్రమిస్తుండగా ఏదో  మెసేజ్ వచ్చినట్లు  ఫోన్ టింగుమంది. చూస్తే  ఒక మెడికల్ గ్రూప్ నుంచి వచ్చిన  మెసేజ్. మనసు చదవద్దంటున్నా  బొటనేలు ఈలోపే టక్కున నొక్కేసింది. ఇక చదవక తప్పదు కదా  :) 

 ఆ మెడికల్ గ్రూపులోని మిగతా సభ్యులకు ఒకామె/ఒకాయన వేసిన ప్రశ్న.. 

"మీకు ఈ జబ్బుందని తెలిసాక మిమ్మల్ని బాగా బాధపెట్టిన  విషయం  ఏమిటి ?"  

దానికి  రకరకాల సమాధానాలు. దాదాపు ప్రతి సమాధానమూ మనసుని పిండేసేదే. ఒక రిప్లై  ఇలా ఉంది... 

"కేన్సర్ స్టేజ్ 4 అని తెలిసాక అన్నయ్యకి రమ్మని కబురు పెట్టాను. హాస్పిటలుకి వచ్చాడు. పర్లేదులే ఏమీ కాదు అన్నాడు. రేపు మళ్ళా వస్తా అన్నాడు. అంతే. మళ్ళా ఇప్పటివరకు మొహం చూపించనేలేదు. ఇప్పటికి మూడేళ్లు పైనే గడిచాయి వాణ్ని చూసి.వాడికంటే నేను చిన్నదాన్నయినా చిన్నప్పటినుంచి ఒక అక్కలా చూసుకున్నాను వాడిని. వాడికున్న చెడలవాట్ల మూలంగా  ఎన్నో సందర్భాలలో వాణ్ని నాన్న చేతిలో దెబ్బలు తినకుండా రక్షించాను. కాస్త పెద్దయ్యాక వాడి   చిన్నా చితకా అవసరాలకు నేను దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఇచ్చాను. "

ఇంకా కింద ఉన్న మిగతావి  చదివే ధైర్యం చేయలేకపోయాను. చదవకుండానే ఒక్కటి మాత్రం చెప్పగలను. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కో జీవిత సత్యం. 

ఆ సత్యాల్ని అవగతం చేసుకోవాల్సిన అగత్యం  రాని వారు అదృష్టవంతులు. 

Friday, February 28, 2020

పాడుబడ్డ ఇల్లు

అదేమిటో ఈ ట్రాఫిక్ లైట్ దగ్గర రెడ్ లైట్ పడని సందర్భాలు  చాలా అరుదు. నూటికి తొంభై తొమ్మిదిసార్లు  ఆగాల్సిందే. కారాపిన ప్రతిసారీ అప్రయత్నంగా నా చూపు  రోడ్డుకు ఎడమవేపున్న ఆ ఇంటి మీద పడుతుంది. రోడ్డుపక్కనే కాస్త  అవతలగా  కొద్దిగా ఎత్తయిన ప్రదేశంలో ఉందా  ఇల్లు. 

అదొక పాడుబడ్డ ఇల్లు. 

ఇంటి చుట్టూ రక రకాల పిచ్చి మొక్కలు. 

ఇంటి బయట గోడలు ఎండకు ఎండీ వానకి తడిసీ  వంకర్లు తిరిగి ఉన్నాయి. ఆ గోడలకు బిగించిన లైట్లు  స్క్రూలు ఊడిపోయి వేలాడుతూ  ఏక్షణమైనా కిందపడటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి. దుమ్మూ ఎండుటాకులతో నిండి ఉన్న పోర్చ్ లో కవర్లు చినిగి  స్పాంజి బయటకు కనపడుతున్న సోఫా, విసిరేసినట్లుగా  ఒక రెండో మూడో పేము కుర్చీలూ. 

ఇంటి బయట  రంగులెలిసిపోయి ఒక ప్రక్కకి వాలిపోయున్నమెయిల్ బాక్సు. 

ఇంటి కప్పుతాలూకు షింగిల్స్ సగం  గాలికెగిరిపోగా మిగతావన్నీ రంగుతేలి ఉన్నాయి . ఒక రెండు మూడుచోట్ల కప్పు ఐదారడుగులమేర కుంగిపోయిఉంది.  పోర్చ్ పైన, పై అంతస్తులో ఉన్న గది తాలూకు కిటికీ గాజు తలుపుల్లోంచి మాసిన తెల్లటి కర్టెన్ రెప రెప లాడుతోంది. 

అన్నిసార్లూ కాకపోయినా కొన్ని సార్లు ఆ ఇంటిని చూసినప్పుడల్లా నాలో అదో  రకమైన దిగులు.

గతకాలపు వైభవాన్ని తలచుకుంటూ దీనంగా ఉన్నట్లు కనపడుతుందోసారి. 

కొన్నిసార్లు బేలగా, దీనికంటే మరణమే మేలంటున్నట్టుగా ... 

లేదా అందరూ నన్ను వంటరిదాన్ని చేసి వెళ్లిపోయారని తన బాధ చెప్పుకొంటున్నట్లుగా... 

 ఆ ఇల్లనుభవిస్తున్న వేదనకి నేనొక మౌనసాక్షినవుతాను  కాసేపు నా ఊహల్లో ... 

ఎప్పుడయినా  రాత్రిపూట చూడటం తటస్థిస్తే..

ఆ మసక వెలుతురులో.. 

మనిషి లోపలి మనిషిలా కొద్దిగా భయంగొలిపేలా  కూడా ఉంటుందది. 

ఆ నాలుగ్గోడల మధ్య నిరంతరం మారుమ్రోగే ఆ కరుడుగట్టిన నిశబ్దాన్ని భరించాల్సిరావలసినదానికంటే పెద్ద శాపం ఇంకొకటుంటుందా? 

అస్థిత్వాన్ని కోల్పోయి ఉనికి మాత్రమే మిగలటం అంటే ఇదేనేమో బహుశా..

Friday, February 14, 2020

మధ్యాహ్నపు నిద్ర

నచ్చకో మరెందుకో  పబ్లిష్ చేయకుండా వదిలేసిన  పాత పోస్టులు చూస్తుంటే ఇదిగో ఇది కనపడింది.  తారీఖు చూస్తే జులై 31, 2010. అప్పటికింకా పిల్లలు పుట్టలేదు. చదువుతుంటే చాలా నోస్టాల్జిక్  గా అనిపించింది.

**********************************************************************************************************

ఎన్ని రోజులు..కాదు కాదు ..ఎన్ని ఏళ్ళయిందో మధ్యాహ్నం పూట నిద్ర పోయి. ఇదిగో ఈరోజు  మధ్యాహ్నం భోజనం తరువాత ఒంటిగంట నుండి సాయంత్రం దాదాపు ఆరింటి వరకు తనవితీరా నిద్రపోయాను. నిద్రలేచాక బాల్కనీ లోకి వచ్చి చూస్తే చుట్టూ ఉన్న ప్రపంచం చాలా కొత్తగా,ప్రశాంతంగా ఉంది.పక్కనే ఉన్న డల్లాస్  ఎయిర్ పోర్టు లో ఇప్పుడే టేకాఫ్ అయ్యీ, అలానే  దిగటానికి సిద్దమవుతూ ఆకాశంలో ఐదారు విమానాలు.

కదలకుండా విగ్రహంలా నిలబడ్డానేమో ,నా పక్కనే ఒక పిచ్చుకవాలింది. బుజ్జి పిచ్చుక. కంగారు కంగారుగా అటూ ఇటూ గెంతుతూ, దొరికిన వాటిని ముక్కునకరచి (తినడానికి పనికొస్తుందేమో అని) పరీక్షిస్తూ, విదిల్చి వదిలేస్తూ....

కదిలితే ఎక్కడ ఎగిరిపోతుందో అనుకుంటూ కనుచివరలనుండి దాన్నే చూసా కాసేపు. 

ఎదురుగా ఉన్న ప్లే ఏరియా నుంచి పిల్లల  కేరింతలు....... 

ఇదే సాయంత్రం మిగతా రోజుల్లో ఎంత భిన్నంగా ఉంటుందో. ఆకలీ,నీరసం, రేపటిగురించిన ఆలోచనలతో మనసంతా గజిబిజి.ఎంత అసహనంగా ఉంటుందంటే, ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ముప్పై సెకన్లకి మించి ఉండదని తెలిసినా, రెడ్ లైటు పడగానే కారాపటానికి ఎంత చిరాకో . 

ఈ ఐదుగంటల గాఢమైన నిద్ర  రోజూ చూసే ప్రపంచాన్ని నాకు కొత్తగా పరిచయం చేస్తోంది. 

బాల్కనీలో కాసేపుండి లివింగ్ రూంలో కొచ్చాను.

సగం చదివి పక్కన పెట్టిన పుస్తకమూ , టీపాయ్ మీద పొద్దునెప్పుడో  తాగిన కాఫీ కప్పూ , టీవీ ముందు గుడ్లు మిటకరిస్తూ నావైపే చూస్తున్నట్లున్న కప్ప బొమ్మా,క్రితం రోజు మా ఇంటికొచ్చిన  చిట్టి గెస్టు అద్విత స్వారీ చేసీ చేసీ అలసిపోయి పక్కన పడేసిన గుర్రం బొమ్మా, సింక్ లో పడున్న అంట్లూ,తెరిచి చూసి ఇంకా చెత్త బుట్టలో పడేయకుండా సోఫాలోనే ఉంచిన ముందటిరోజు తాలూకు ఉత్తరాలూ ఇవేమీ ఇల్లు  సర్దాలన్న ఆలోచననే  దరికిరానీయక పోగా, ఇందులో కూడా అందముంది చూడగలిగితే అని నాకు చెప్తునట్టనిపిస్తోంది. 

ఇల్లంతా స్థబ్దుగా ,ప్రశాంతంగా .. 

తనింకా నిద్ర లేచినట్టులేదు.  

కిందకెళ్ళి ఇంటి పక్కనే ఉన్న మెక్ డొనాల్డ్స్ లో ఒక కాఫీ, అలాగే అందులోనే ఉన్న రెడ్ బాక్స్లో ఒక డీవీడీ?

ఎలాగూ ఈరోజిక బయటికెళ్లే  ప్లాన్స్ ఏమీ లేవు.

అనుకున్నదే తడవు, ఒక రెండు నిమిషాల తరువాత వేడి నీటి షవర్ కింద..

ఆ వేడి నీళ్ళు వంటిమీద పడుతుంటే అణువణువూ రీచార్జ్ అవుతున్న ఫీలింగ్..ఓ పట్టాన షవర్ వదిలి రాబుద్ది కాదు. ఇప్పుడనేకాదు, పనిదినాల్లోకూడా ఆఫీసుకి లేటుగా వెళ్ళిన ప్రతి పది సందర్భాల్లో  తొమ్మిది సార్లు ఇదే కారణం. ఎంత ఆలస్యంగా నిద్ర లేచినా షవర్ సమయాన్ని కుదించడం నాకు చాలా కష్టం. 

స్నానం చేసి రెడీ అయి అడుగు బయట పెట్టగానే వెచ్చటి వేసవి గాలి. మరీ అంత వేడిగాలేదు.

ఈలోపు తను  నిద్రలేస్తే? సరే, ఫోన్ చేస్తుందిలే.. 

మెట్లమీద మూడో ఫ్లోర్ లో ఎదురు పడ్డాడు వాడు నాయనమ్మ భుజం మీద సేద తీరుతూ. వాడికి ఇప్పుడిప్పుడే  పళ్ళొస్తున్నాయట. నన్ను చూసి ముగ్ద మనోహరంగా నవ్వాడా ఒంటిపన్ను రాక్షసుడు. ఆ నవ్వు మిగతారోజులకంటే ఎంతో అందంగా ఉంది.

"..విలో విరిసిన పారిజాతమో.."

కార్లో కూర్చుని ఇగ్నిషన్ కీ తిప్పగానే సీడీలో క్రితం రోజు సాయంత్రం సగం విన్న పాట ఆటోమేటిగ్గా మొదలయింది. 

సహజంగానే మధురమైన పాట... ఇప్పుడు మరింత మధురంగా.

పాత పాటలంటే ఎందుకంత ఇష్టం? వాటిలోని సాహిత్యమా?సంగీతమా?పాడినవారి ప్రతిభా? 

బహుశా బాల్యం నుంచి వినీ వినీ నా ప్రమేయం లేకుండానే సబ్ కాన్షియస్ గా ఆ  పాట చుట్టూ పెనవేసుకున్న జ్ఞాపకాలూ,అంతులేని ఆపేక్షా  అయిఉంటాయి.

పాట పూర్తయ్యే వరకూ కారుని కదల్చబుద్దికాలేదు. తరువాతి పాట "సిరిమల్లె పువ్వా". 

నాకా సీడీలో ఉన్న పాటలెన్నో తెలుసు. ఈలెక్కన కారు ఇంకో అరగంట పాటు కదలదు. 

బలవంతాన కారు బయటికి తీశాను.

ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ

న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో.  (తెలియని వారికి: అమెరికాలో...