అదేమిటో ఈ ట్రాఫిక్ లైట్ దగ్గర రెడ్ లైట్ పడని సందర్భాలు చాలా అరుదు. నూటికి తొంభై తొమ్మిదిసార్లు ఆగాల్సిందే. కారాపిన ప్రతిసారీ అప్రయత్నంగా నా చూపు రోడ్డుకు ఎడమవేపున్న ఆ ఇంటి మీద పడుతుంది. రోడ్డుపక్కనే కాస్త అవతలగా కొద్దిగా ఎత్తయిన ప్రదేశంలో ఉందా ఇల్లు.
అదొక పాడుబడ్డ ఇల్లు.
ఇంటి చుట్టూ రక రకాల పిచ్చి మొక్కలు.
ఇంటి బయట గోడలు ఎండకు ఎండీ వానకి తడిసీ వంకర్లు తిరిగి ఉన్నాయి. ఆ గోడలకు బిగించిన లైట్లు స్క్రూలు ఊడిపోయి వేలాడుతూ ఏక్షణమైనా కిందపడటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి. దుమ్మూ ఎండుటాకులతో నిండి ఉన్న పోర్చ్ లో కవర్లు చినిగి స్పాంజి బయటకు కనపడుతున్న సోఫా, విసిరేసినట్లుగా ఒక రెండో మూడో పేము కుర్చీలూ.
ఇంటి బయట రంగులెలిసిపోయి ఒక ప్రక్కకి వాలిపోయున్నమెయిల్ బాక్సు.
ఇంటి కప్పుతాలూకు షింగిల్స్ సగం గాలికెగిరిపోగా మిగతావన్నీ రంగుతేలి ఉన్నాయి . ఒక రెండు మూడుచోట్ల కప్పు ఐదారడుగులమేర కుంగిపోయిఉంది. పోర్చ్ పైన, పై అంతస్తులో ఉన్న గది తాలూకు కిటికీ గాజు తలుపుల్లోంచి మాసిన తెల్లటి కర్టెన్ రెప రెప లాడుతోంది.
అన్నిసార్లూ కాకపోయినా కొన్ని సార్లు ఆ ఇంటిని చూసినప్పుడల్లా నాలో అదో రకమైన దిగులు.
గతకాలపు వైభవాన్ని తలచుకుంటూ దీనంగా ఉన్నట్లు కనపడుతుందోసారి.
కొన్నిసార్లు బేలగా, దీనికంటే మరణమే మేలంటున్నట్టుగా ...
లేదా అందరూ నన్ను వంటరిదాన్ని చేసి వెళ్లిపోయారని తన బాధ చెప్పుకొంటున్నట్లుగా...
ఆ ఇల్లనుభవిస్తున్న వేదనకి నేనొక మౌనసాక్షినవుతాను కాసేపు నా ఊహల్లో ...
ఎప్పుడయినా రాత్రిపూట చూడటం తటస్థిస్తే..
ఆ మసక వెలుతురులో..
మనిషి లోపలి మనిషిలా కొద్దిగా భయంగొలిపేలా కూడా ఉంటుందది.
ఆ నాలుగ్గోడల మధ్య నిరంతరం మారుమ్రోగే ఆ కరుడుగట్టిన నిశబ్దాన్ని భరించాల్సిరావలసినదానికంటే పెద్ద శాపం ఇంకొకటుంటుందా?
అస్థిత్వాన్ని కోల్పోయి ఉనికి మాత్రమే మిగలటం అంటే ఇదేనేమో బహుశా..
3 comments:
అప్పుడప్పుడూ మా ఊరి డౌన్‌టౌన్‌లో ఇలాంటి ఇళ్ళు చూసినప్పుడు చెప్పలేని బాధగా అనిపిస్తుంది :(
అవునండీ.. ఒకప్పుడు జీవంతో కళ కళ లాడిన నిండిన వాటిని అలా చూస్తుంటే చాలా బాధేస్తుంది.
same feeling-;(
Post a Comment