జనవరి నెల , 2001. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం.
నా మొట్టమొదటి అమెరికా ప్రయాణం.
నా మొట్టమొదటి అమెరికా ప్రయాణం.
--------------------------------------------------------------------------------------
అది విన్నాక నేనేమీ నిశ్చేష్టుణ్ణవ్వలేదు.విన్నది జీర్ణించుకుంటూ,నేను విన్నది నిజమేనా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ అలా చూస్తుండి పోయాను ఒక ఐదారు సెకన్లపాటు. ఆ తరువాత కొద్దిగా భయం కలిగినమాట వాస్తవం.
ఇంతకీ ఆ ఇమ్మిగ్రేషన్ ఆఫీసరు ఏమన్నాడంటే
"ఈ పాస్ పోర్ట్ నీది కాదు, దొంగ పాస్ పోర్టు మీద అమెరికా వెళ్తున్నావని నేనంటే ఏంచేస్తావు ?" అని . అంతలోనే చేతికున్న వాచీ చూసుకుంటూ, నేను తలచుకుంటే నీ మొట్టమొదటి అమెరికా ప్రయాణం హుళక్కే అనే అర్ధం ధ్వనించేలా "ఇంకొక రెండుగంటల్లో నీ ఫ్లయిటు " అన్నాడు.
మొదట్లో కౌంటరు దగ్గరికి వచ్చినప్పుడు చూడలేదుగాని ఇప్పుడు పరీక్షగా చూసానాయన వైపు.మనిషి చిక్కటి నలుపు.నీటుగా పక్కకి దువ్వి చక్కగా పాపిడి దీసినజట్టు. పైన నల్లకోటు.
మెత్తగా, ఓ పద్దతి ప్రకారం పనులు చేసుకుంటూ పోయే బాపు గారి సినిమాల్లోని విలన్లా కనబడ్డాడు నాకు.
పాస్ పోర్టుని నిలువుగా చేసి, టక్ టక్ అనే శబ్దం వచ్చేలా టేబుల్ మీద కొడుతూ ,అటూ ఇటూ చూసి, దరిదాపుల్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని, నివ్వెరపోయి చూస్తున్న నన్ను మళ్ళీ అడిగాడు.
"ఫారిన్ కరెన్సీ ఎంత తీసుకెళ్తున్నావ్?".
నేను ఎంత తీసుకెళ్తున్నానో ఆయనకీ తెలుసని నాకు తెలుసు. ఎందుకంటే పాస్ పోర్ట్ లో థామస్ కుక్ వారి స్టాంప్ ఉంది మరి.
ఇలా ఇవ్వు అన్నట్లు చేయి చాచాడు. అయోమయంగా నేనిచ్చిన కవరులోని ఆ ఆరు ఇరవై డాలర్ల నోట్లలోంచి ఒక నోటు తీసుకొని,పాస్ పోర్ట్ లో వేయాల్సిన స్టాంపులేసి ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టుగా చేయి ఆ వైపుకు చూపించాడు.
నా ముందున్న ప్రయాణికులను గుడ్డిగా అనుసరిస్తూ , జరిగిందాన్ని ఒకసారి మళ్ళా రివైండ్ చేసుకున్నాను. కౌంటరు దగ్గరికి రాగానే పలకరింపుగా ఆయన నవ్విన నవ్వూ , పాస్పోర్ట్ లో అడ్రస్ చూడగానే, "మాదీ గుంటూరు జిల్లానే ,బాపట్ల " అని చెప్పటమూ, ఒక రెండు నిమిషాలు సరదాగా నా క్షేమసమాచారాలు అడగటమూ ఇవన్నీ బేసిగ్గా నన్నూ ,నా మానసికస్థితినీ అంచనా వేయటానికి వేసిన ఉచ్ఛు అన్నమాట.
ఈ కౌంటరు దగ్గరికి రావటానికి ఒక అరగంట ముందు....
చెక్ ఇన్ కౌంటరు వద్ద నా లగేజీని వదిలించుకొని బోర్డింగ్ పాసు తీసుకోబోయే క్రమంలో ఆ కౌంటరు లో ఉన్న అమ్మాయి విమానంలో నాతోపాటు తీసుకెళ్లే లగేజీ ని చూడగానే ఆ ఫ్లయిట్ చాలా చిన్న ఫ్లయిట్ కాబట్టి ఆ లగేజీని కూడా చెక్-ఇన్ చేయాల్సిందే అని పట్టు పట్టింది. నేను ఆ కంగారులో సూటుకేసు తెరిచి నాక్కావలసిన కొన్నిపేపర్లు తీసుకున్నా ,అతి ముఖ్యమైన
హెచ్ 1 డాక్యుమెంటూ, అలానే ఎంప్లాయర్ ఇచ్చిన ఆఫర్ లెటర్లు గట్రా అన్నీ మర్చిపోవటమూ, దాదాపు కన్వేయర్ బెల్ట్ మీద పెట్టబోతున్న నా సూట్ కేసుని ఇదంతా గమనిస్తున్న ఒక సీనియర్ ఉద్యోగి చివరినిమిషంలో ఆపి,ఆ అమ్మాయిని చివాట్లు పెట్టి,దగ్గరుండినాకు సహాయంచేయటమూ జరిగింది. గండం గడిచినా ఈ ప్రహాసనం అంతా నన్నొక షాక్ కి గురిచేసింది. బహుశా ఆ షాక్ ప్రభావమేమో ఈ బాపు గారి విలన్ దగ్గర నేను ఏమాత్రం ప్రతిఘటించలేకపోయాను.
ఆ విధంగా ..
నా మొట్ట మొదటి డాలరు ట్రాన్సాక్షను ..... లంచం అన్నమాట..
ఇచ్చిన లంచం కాదు. బలవంతాన లాక్కున్న లంచం. దోపిడీ అనొచ్చేమో..
కవరు మొత్తం ఎందుకు తీసుకోలేదు? బహుశా గుంటూరు జిల్లా కన్సెషనేమో మరి...
5 comments:
గుంటూరు జిల్లా కన్సెషనా లేక మీరు తెగించి కంప్లైంట్ చేయడమో, చుట్టూ ఉన్న వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయడమో చేస్తే మొదటికే మోసం వస్తుందన్న భయమో? ఇలాంటి చిన్న చిన్న 'కక్కుర్తి' అనుభవాలు ఎదురైనప్పుడు, అవతలి వాళ్ళ మొహం మీదే నవ్వేయకుండా ఉండేందుకు నేనెంత కష్టపడతానో నాకే తెలుసు :)) అన్నట్టు, బ్లాగు ప్రపంచంలోకి పునస్వాగతం!! (బ్రేక్ తర్వాత వచ్చారు కదా మరి)
బ్లాగ్ లోకానికి పునరాహ్వానం ఉమాశంకర్ గారూ.. వెరీ ఇంట్రెస్టింగ్ అండీ.. ఇమ్మిగ్రేషన్ ఆఫీసరే ఇలా అడగడం నేనెప్పుడూ వినలేదు. నే విన్న సంఘటనలన్నీ కస్టమ్స్ వే.. సిరీస్ కోసం ఎదురు చూస్తూంటాను..
after long time.....interesting happy to see you uma garu
ఇదే మొదటిసారి మీ బ్లాగ్ చదవడం అనుకుంటా ... మీ అమెరికా ప్రయాణం కబుర్లు బావున్నాయి - ఈదేసిన గోదావరిలా 😊
మా బాపట్ల మనిషి అలా చేయడం బాగోలేదు..
Post a Comment