Friday, December 7, 2018

అమెరి'కతలు -3

"ఎలాగూ బయటే ఉన్నారుగా . ఇంట్లో పాలైపోయాయి. టెన్నిస్ ఆడటం  అయిపోయాక వీలయితే షాపుకెళ్లి పాలు తెమ్మని" ఇంటినుంచి ఫోన్.

"వీలయితే','నీ కిష్టమైతే ' లాంటి పదాలకు సంసారపు నిఘంటవులో బోల్డన్ని అర్ధాలు కదా?(ప్రస్తుతానికీ విషయం అప్రస్తుతం అనుకోండి)

టెన్నిస్ కోర్టు పక్కనే ఓ రెండు నిమిషాల దూరంలో షాపు.

ఒక్క పాల డబ్బానే కదా అని తోపుడుబండి లేదా కనీసం అక్కడుండే ప్లాస్టిక్ బుట్టనైనా తీసుకోకుండా అలా షాపు  మధ్యలోకెళ్లాక అనిపించింది ఎలాగూ  పెరుక్కి తోడు పెట్టాలేమో రెండు డబ్బాలు తీసుకుంటే మంచిదేమో అని.తోపుడుబండి కోసం మళ్ళీ వెనక్కెళ్లే ఓపిక లేక అలానే ముందుకెళ్లి  రెండు పాల డబ్బాలు  తీసుకుని ఉసూరుమంటూ గల్లా పెట్టెలుండే చోటుకి  వచ్చాను .

రాత్రి దాదాపు 9 గంటల సమయం.పైగా చలికాలం.అన్ని కౌంటర్లు మూసి ఉన్నాయి ఒక్కటి తప్ప.నేను వెళ్లి లైన్లో నిలబడబోయే ముందు  అదేసమయంలో అటు వైపు నుంచి ఒక నడి  వయసు స్త్రీ , చేతిలో ఒక బ్రెడ్ ప్యాకెట్ తో అదే వరుసలో నిలబడడానికి వచ్చింది. ఇద్దరం దాదాపు ఒకే సారి వచ్చినా  నేను  ఒక అడుగు ముందు రావటంవల్ల ఆమె మోహంలో కొద్దిపాటి సంకోచం.

చేతిని (పాల డబ్బాతో సహా)  నేల వైపు ముందుకు చూపి  "ప్లీజ్" అన్నాను తనని నా ముందు నిలబడమన్నట్లుగా. ఒకసారి నావైపు చూసి "ఆర్ యు ష్యూర్? " అంది. నేను నవ్వుతూ తలూపాను.మా ఇద్దరి కంటే ముందు లైన్లో ఇంకో ఇద్దరున్నారు.

అప్పటికే చేతులు నొప్పెడుతుండటంతో   ఇక ఆ పాల  డబ్బాలు మోయలేక కింద పెట్టాను. నాతో ఏమైనా మాట్లాడదామనుకుందో ఏమో ఆమె నావైపు వెనక్కి తిరిగి  అదే సమయంలో నేను అక్కడ స్టాండ్ లో ఉన్నమేగజైన్ల వంక చూస్తుండడంతో ఆ ప్రయత్నం విరమించుకుంది. మాఇద్దరి ముందున్న వాళ్ళ కార్టులు ఒక మాదిరి  నిండుగా ఉన్నాయి. మావంతొచ్ఛేసరికి ఎంత లేదన్నా ఒక ఐదునిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువే పట్టొచ్ఛు.ఎదురుగా పలకరిద్దామని అంతలోనే విరమించుకున్న వ్యక్తి.  ఒకప్పుడైతే ఇటువంటి సమయాల్లో నా చేయి అప్రయత్నంగా సెల్ ఫోన్ ని చేతుల్లోకి తీసుకుంటుంది. కొత్త మెసేజీలొ,మెయిళ్ళో  వచ్చాయేమో చూడటం అనేది ఒక నెపం మాత్రమే. నిజానికి  అది నన్ను ఎదుటివాళ్లతో  మాట్లాడాల్సిరావడమనే 'విపత్కర' పరిస్థితులనుంచి రక్షించే డిజిటల్ ఆయుధం అన్నమాట.ఒక మూడేళ్ళ క్రితం నామీద నేనే ఒట్టేసుకున్నాను, ఇకపై అలా చేయకూడదని . వీలయితే  వాళ్ళతో నాలుగు  మాటలు మాట్లాడ్డం లేదా నా మానాన నేను చేతులు కట్టుకొని  నిలబడ్డం. (మరీ ఇబ్బంది అనిపిస్తే  ఎదురుగా ఉన్న ఏదో  ఒక వస్తువు మీద చూపు నిలిపి నా శ్వాస మీద ధ్యాస నిలపటం. ) అంతేగాని అలా పారిపోవటం ఒక చిన్న సైజు మానసిక బలహీనత  అని నా భావన.

ఇక నా ముందున్నామె వంతు రావటమూ, తను కార్డు బయటికితీసి గల్లా పెట్టె అమ్మాయితో ఏదో మాట్లాడడమూ గమనిస్తూ నా ఆలోచనల్లో నేనున్నా.ఇంతలో గల్లాపెట్టె అమ్మాయి నేను కింద పెట్టిన పాల డబ్బాలను తనే తీసికొని చక చకా స్కాన్ చేసేసింది.పని గంటలు ముగిసి బహుశా ఆ అమ్మాయి ఇంటికెళ్లే  తొందర్లో ఉందేమో అనుకొని కార్డుని మెషిన్ లో పెట్టబోతుండగా ఆ అమ్మాయి వారించి అప్పటికే తన బ్రెడ్ పాకెట్ తీసికొని వెళ్తున్న ఆమె వైపు చూపించి " నీ  పాల  డబ్బాల తాలూకు ధర కూడా ఆమె చెల్లించేసింది"  అని చెప్పింది చిన్నపాటి చిరునవ్వుతో.

దాదాపు పదకొండు డాలర్లు. పెద్ద మొత్తమూ కాదు అలా అని చిన్న మొత్తమూ కాదు.

అవాక్కయిన నేను సరిగా విన్నానో లేదో అని ఆ అమ్మాయిని ఇంకోసారి అడిగి నిర్ధారించుకొని  రెండడుగులు గబా గబా వేసి "ఎక్స్ క్యూజ్మీ " అని పిలవగానే వెనుదిరిగిన ఆమె ఏ  విధమైన ఉపోద్ఘాతం లేకుండా నా వంక చూస్తూ చెప్పింది

"ప్లీజ్ డోంట్ వర్రీ ఎబౌట్ ఇట్. ఐ జస్ట్  హేడ్   ఏన్  ఆఫుల్ డే.ఇట్స్ రియల్లీ బ్యాడ్ .... .బట్ యూ సీమ్స్ సో నైస్ ... థాంక్యూ  ఫర్ బీయింగ్  నైస్" 

తన మోహంలో అలసట, గొంతులో కొద్దిపాటి నైరాశ్యం

నాదగ్గర కార్డు తప్పితే నగదు ఎలాగూ లేదు. ఈమెని  ఇక్కడ నిలబెట్టి  గల్లా పెట్టె అమ్మాయి దగ్గర "క్యాష్  బ్యాక్ " తీసుకొని ఆమెకి  ఇచ్ఛే ప్రయత్నం చేస్తే నా హడావిడి అంతా చూసి ఆమె  నొచ్చుకుంటుందేమో.... ?ఇలా ఆలోచిస్తున్న నన్ను  చూస్తూ చిర్నవ్వుతో చెయ్యూపి వెళ్ళిపోయిందామె.

ప్రపంచమంతా నీకెదురుతిరిగినప్పుడు
నీ ఉనికి  నీకే   ప్రశ్నార్ధకమైనప్పుడు
ఏ పసి పిల్లాడి బోసినవ్వో
ఒక అపరిచిత వ్యక్తి చేసే చిన్నపాటి  సాయమో
ఇవేమీకాకపోతే
ఆకాశంలో ఎగిరే కొంగల గుంపో
నిశ్చలంగా ఉండే ఏ చెట్టు కొమ్మో
నీకు నీవు మాత్రమే మిగిలే ఏ నిశిరాత్రో
నీ మూలాన్ని నీకందిస్తాయి
కొండంత బలం కాకపోయినా
కూసింత ఆశ, రేపటి కోసం

ఆమెని అంతగా బాధపెట్టిన విషయాలేవో నాకు  తెలిసే అవకాశం ఎలాగూ లేదు.తరచుగా తారసపడితే తప్ప ఎవరిమొహాలూ అస్సలు గుర్తుండవు నాకు. ఈమె మళ్ళీ ఎదురుపడితే గుర్తు పట్టే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ గుర్తుపట్టినా మాట్లాడే చొరవ తీసుకుంటానా  అనేది ఆ సందర్భం వస్తే కానీ తెలీదు.

ఏదేమైనా ఆమె బాధ ఆరోజు వరకే తాత్కాలికం అయి ఉండాలని కోరుకుంటూ.....


3 comments:

విన్నకోట నరసింహా రావు said...

రెండున్నర సంవత్సరాల విరామం తరువాత తిరిగి బ్లాగులోకొచ్చి చాలా మంచి పోస్ట్ వ్రాశారు, ఉమాశంకర రావు గారూ. ఆవిడ చూపించినది ఒక చక్కటి gesture. బిల్ చెల్లించడం ముఖ్యం కాదు .... మీ సంస్కారానికి కి తనకు చేతనైన రీతిలో ఆవిడ చూపించిన కృతజ్ఞత అనుకోవచ్చు. lovely 👌.

అన్యగామి said...

ఇటువంటి అనుభవాలే మనుషుల మీద నమ్మకాన్ని పునరుద్ధరింపచేస్తాయి. అందరితో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

Prayanam said...

Manam pade kondanta kashtam evari acknowledgment ki nochukonappudu o chinna sayam kuda yedAri Vedi lo unnattundi vachhina hima Sameeram la anipistundi. Mottaniki chala rojula tarvata inta heart touching post to vachhinanduku abhinandanalu

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...