Thursday, February 26, 2009

ఒక చిన్న మాట

కొన్ని నెలల క్రితం నేనొకసారి టెన్నిస్ ఆడడానికి మా ఇంటి దగ్గర్లో, ఒక పార్క్ లోనున్న టెన్నిస్ కోర్టుకెళ్ళాను. ఉన్నవే రెండు కోర్టులు. ఒకదాంట్లో తెల్లవాళ్ళు గ్రూపొకటి , దాదాపు ఐదారుగురు, వంతులవారీ గా ఆడుకుంటున్నారు. రెండవదాంట్లో మన భారతీయ మిత్రులు ఇద్దరు ఆడుతున్నారు. నేను, నాతోపాటు వచ్చిన నా స్నేహితుడు దాదాపు నలభై నిముషాలు వేచిఉన్నాం. మన భారతీయ మిత్రులు అరివీర భయంకరం గా తమ టెన్నిస్ ప్రావీణ్యాన్నంతా మాకు చూపిస్తున్నారు గానీ, తోటి వాళ్ళు వేచి యున్నారు కదా వాళ్ళకి కూడా అవకాశం కలిగిద్దాం అనే కనీసపు ఆలోచన కొరవడింది. మనుషుల మీద మరీ అంత చులకన భావం ఏమిటి అని నాకైతే చిరాకు వేసింది. చివరికి మమ్మల్నిఎంతో సేపు నుంచి గమనిస్తున్న ఆ రెండవ కోర్టు వారు మేము వారిస్తున్నా వినకుండా మాకోసం కోర్టు ఖాళీ చేసి ఆడుకోండంటూ చెప్పి వెళ్ళిపోయారు. రెండు విధాలా తల కొట్టేసినట్లైంది నాకు. మనవాళ్ళు అందరూ ఇలా ఉంటారు అని అనటం నా మూర్ఖత్వమే అవుతుంది. కాని ఇలాంటి పోకడలు ఎంత చిన్నవయినా, సంఖ్యలో తక్కువైనా, ప్రస్తుత పరిస్థితుల్లో వాటి ప్రభావం తిరిగి మనమీద చాలా ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం.

ప్రపంచం మారిపోతోంది. ఒక పదేళ్ళ క్రితం ఉన్న పరిస్థితులకీ, ఇప్పటికీ, ఆలోచనల్లో చాలా మార్పులొచ్చాయి. ఏ దేశాన్ని చూసినా అసహనం రాజ్యమేలుతోంది. పరిధిలు కుచించుకు పోతున్నాయ్. మొన్న నాతో బాగా చనువుగా ఉండే మా మానేజరు ఏదో విషయంలో మాట్లాడుతూ అసలు మీ భారతీయులు ఈ దేశంలో ఉన్నారంటే it is just becoz of your brains అన్నాడు. పైకి అది మెప్పుకోలు లా ఉన్నా ఆ సందర్భాన్ని బట్టి అది ఒకరకమైన నిరసన. ఆ తరువాత అలా నోరు జారినందుకు తను కొద్ది గా నొచ్చుకొన్నాడు కూడా. అసంకల్పితంగా,మాటల్లో ఆయన మనసులోని భావం అలా బయటికి వచ్చింది. ముఖ్యం గా 9/11 తరువాత వాళ్ళ దృక్పధం లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఒక అరబ్(ముస్లిం) ని చూస్తే వాళ్ళ నొసలు ముడిపడుతున్నాయి. ఈ TV, రేడియో టాక్ షోల ప్రభావమేమో మరి, బయటి దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఇంతకి ముందులా మనఃస్పూర్తిగా ఆహ్వానించలేక పోతున్నారు. బయటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ ఉద్యోగాల్ని, తద్వారా తమ నోటికాడ కూడుని లాగేసుకుంటున్నారనే ఒకరకమైన భావం వీళ్ళని స్థిమితపడనివ్వటంలేదు. అవుట్ సోర్సింగ్ అంటేనే ఇంతెత్తున ఎగిరి పడుతున్నారు. పులి మీద పుట్ర లా ఈ ఎకానమీ. ఇటువంటి పరిస్థితుల్లో మరింత జాగరూకతతో మెలగవలసిన బాధ్యత మనదే. మన ప్రవర్తన, మనంవేసే ప్రతి అడుగూ, మనం మాట్లాడే ప్రతి మాటా మనదేశంలో ఉన్న 100కోట్ల పైచిలుకు భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తుందనే స్పృహ ఎల్లవేళలా ఉండాల్సిన అవసరం ఉంది. "వీళ్ళందరూ ఇంతే" అనే నిరసనతో కూడిన అభిప్రాయాన్ని వీళ్ళకు కలగనివ్వకూడదు.

Wednesday, February 18, 2009

అరచేతిలో గ్రంథాలయం
కొన్నేళ్ళ క్రితం, తామరతంపరగా వచ్చిన ఈ టెలివిజన్ ఛానళ్ళూ, లైవ్ కవరేజిలూ, సెల్ ఫోన్లూ, ఇంటెర్నెట్టూ, ఇవన్నీ చూసి నోరెళ్ళబెట్టినా, "కొన్ని విషయాలకు మాత్రం ప్రత్యమ్నాయం ఉండదు ఉండబోదు.చాలా మంది కొన్నిటిని అలా సహజంగా చూడటానికే ఇష్టపడతారు.టెక్నాలజీ వీటినేం చేయలేదు" అని అనుకునేవాడిని. అలా నేను అనుకున్నవాటిలో మొట్టమొదటిది పొద్దున్నే చదివే న్యూస్ పేపరు. కుర్చీ కిటికీ పక్కకు లాక్కొని, ఆ ఉదయపు నీరెండ చురుక్కుమనిపిస్తుంటే, కాఫీ తాగుతూనో, లేదా వేసవిలో బాల్కనీలో ఆ ఉదయపు చల్లగాలిని ఆస్వాదిస్తునో, పేపరు చదవడంలో ఉన్న ఆనందానికి ఏ టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు అని భ్రమపడ్డాను. సరిగ్గా ఐదేళ్ళ తరువాత, మాతృదేశాన్ని వీడి వచ్చాక, ఆ అనుభవం నిజంగానే గతకాలపు స్మృతిలా చురుక్కు మనిపిస్తోంది. దూరంగా ఉన్నాను కాబట్టి సర్దుకుపోవడమే కావచ్చు. కానీ ఇప్పుడు నా ఆన్లైన్ పేపరు పఠనం మరీ అంత అసహజంగా అనిపించటంలేదు. ఇంకొక ఐదేళ్ళు పొతే పేపరు చదవడానికి ఇదే సరైన పద్దతి అని వాదిస్తానేమో. ఇష్టమైన ఆర్టికల్స్ ను కత్తెరుచ్చుకుని కట్ చేసి, పంచ్ చేసి, ఫైళ్ళలో భద్రపర్చుకొని, పాత బడ్డక వాటిని అటు పారేయలేకా ఇటు సర్దనూలేక సతమత మయ్యే బదులు చక్కగా కంప్యూటర్లోనే భద్ర పరచుకోవచ్చు. పది పదిహేను రోజుల కిందటి పేపరు కావాలంటే నిమిషాల్లో లభ్యం. టేబిలు కింద దూరి ఆ దుమ్ములో పాత పేపర్ల కట్ట మీద దాడి చెయ్యాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నాయి నా ప్రస్తుత ఆలోచనలు.

సరే ఈ సుత్తంతా ఎందుకు, డైరక్టు గా విషయం లో కొచ్చేస్తాను. అమెజాన్ వారు ఒక సంవత్సరం క్రితం "కిండిల్" అనే ఒక ఈ-బుక్ రీడర్ ని ప్రవేశపెట్టారు. ఇది పుస్తకానికి ప్రత్యామ్నాయం. ఒక ఐదు వందల పేజిల నవల కూడా మన అరచేతిలో ఇట్టే ఇమిడి పోతుంది.అవసరమనుకుంటే ఇది ఆ పుస్తకాన్ని మనకి చదివి కూడా వినిపిస్తుంది. అయితే ఆ విషయం లో అమెజాన్ వారికి ఎవో న్యాయపరమైన ఇబ్బందులున్నాయట. ఇది 3G వైర్ లెస్ టెక్నాలజీలో పని చేస్తుంది. మనం చదవాల్సిన పుస్తకాన్ని అమెజాన్ వారి సైటు నుంచి ఈ పరికరం లోకి డౌన్ లోడ్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి దాదాపు రెండులక్షల ముప్పై వేల పుస్తకాలు ఈ కిండల్ లొ చదవదగ్గ ఫార్మాట్ లో లభ్యం. ప్రస్తుతానికి మార్కెట్ లోకి రాబోతున్న ది కిండిల్ 2. అంతకు ముందు వచ్చిన మోడల్ తో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేసారు. అమెజాన్ వారి సైటు నుంచి పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని స్టొర్ చేసుకొనే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా దాదాపు పదిహేను వందల పుస్తకాలని మీతోటే ఉంచొకోవచ్చు, తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా. మనం షాపులో కొన్నట్లే ప్రతి పుస్తకానికీ నిర్ణీత రుసుము చెల్లించాలి. అయితే మనం షాపులోకొనే ధర కి ఈ కిండిల్ ధరకి తేడా ఏమీ లేదు. కొన్ని పుస్తకాలు బయటికంటే తక్కువ ధర కి లభ్యం. అలాగే మనం షాపు కి వెళ్ళినప్పుడు మనకి తెలియని పుస్తకమైతె కొన్ని పేజీలు అలా తిరగేసి మనకి నచ్చితే కొంటాం. అలానే ఇందులో కూడా మొదటి చాప్టర్ ఉచితంగా చదువుకోవచ్చు. అది నచ్చితేనే కొనుక్కోవచ్చు. సరే, మరీ ఎక్కువ చెపితే మీరు నన్ను అమెజాన్ తాలూకు సేల్స్ మెన్ అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తాను. మరిన్ని వివరాలకు అమెజాన్ వారి సైటు చూడండి.


మర్చేపోయాను, పుస్తకాల లాగా "కిండిల్ ఎడిషన్" బ్లాగులు కూడ ఉన్నాయి మరి. ఇంకేంటి, అందులో మీకు నచ్చిన బ్లాగులుంటే ఇక కంప్యూటరు తో పని లేదు ముఖ్యం గా ప్రయాణ సమయాల్లో.అలానే కిండల్ న్యూస్ పేపర్లు కూడా...

( నేను పైనున్న చిత్రాలను అమెజాన్ వారి సైటు నుంచి తీసుకున్నాను)

Monday, February 16, 2009

ఈ మధ్య చూసిన సినిమాలు

అదేమిటో, ఎన్నడూ లేని విధంగా, గత పది పదిహేను రోజుల్లో తెలుగు, ఇంగ్లీషు కలిపి దాదాపు 10 సినిమాలు చూశాను. అన్నీ కాకున్నా నాకు బాగా నచ్చిన మూడు ఇంగ్లీషు సినిమాల గురించి ఇక్కడ.

మొదటిది క్లింట్ ఈస్టువుడ్ నటించి దర్శకత్వం వహించిన "గ్రాన్ టోరినో". నాకు బాగా నచ్చిన సినిమా. వాల్ట్ (క్లింట్ ఈస్ట్ వుడ్) మాజీ వియత్నాం యుద్ద సైనికుడు.అంతకుముందు ఫోర్డ్ కంపనీ లో పనిచేసి ఉంటాడు. అణువణువునా అమెరికన్ రక్తం. టయోటా కార్లను చూసినా ఈసడించుకుంటాడు అవి అమెరికనేతర సంస్థ తయారీ కాబట్టి. ఈ వృద్దునికి భార్య చనిపోయి ఉంటుంది. ఉన్న ఇద్దరు కొడుకులూ ఇతని గురించి పట్టించుకోరు. పట్టించుకోరు అనేకంటే, ఇంత వృద్ధుడైనా తమ మాట వినక, నా జీవితం నాఇష్టం అనే ఇతని ధిక్కార స్వరాన్ని నిరసిస్తూ ఉంటారు. ఈయన పొరుగింట్లో వియత్నాం నుంచి వచ్చి సెటిలయిన ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళని చూస్తేనే ఈయనకి వళ్ళుమంట. ఆ వియత్నాం కుటుంబంలో ధావ్ అనే ఒక టీనేజి కుర్రాడుంటాడు. అదే ఏరియా లో ఉండే ఒక వీధి గేంగు ధావ్ ని తమలో కలుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. వాడి సహాయంతో వాల్ట్ తను అపురూపంగా చూసుకొనే కారు "గ్రాన్ టోరినో" ని దొంగిలిదామని వాళ్ళ ప్లాను. వాళ్ళ ఒత్త్తిడి కి లొంగి ధావ్ దొంగతనానికి ప్రయత్నించడం, దాన్ని వాల్ట్ విఫలం చెయ్యటం జరుగుతుంది. దాంతొ ఆ పొరుగునుండే కుటుంబం అంటే వాల్ట్ కి ఇంకాస్త కోపం పెరుగుతుంది. తరువాత నెమ్మదిగా వాల్ట్ కి నిజం తెలియటం, ఆ కుటుంబం మీద తన అభిప్రాయం మారటం జరుగుతుంది. ఈ క్రమంలో థావ్ అక్క సూ ని తుంటరి పిల్లల నుంచి రక్షించడం, సూ తో పరిచయం, చివరికతన్ని ఇంట్లో ఒకడిగా చేస్తుంది. ఇక కరుడు గట్టిన అమెరికన్ తను మొదట్లొ అసహ్యించుకున్న ఆ కుటుంబాన్ని ఆ వీధి గేంగ్ నుంచి రక్షింటానికి పడ్డ తపన సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సూ, థావ్ లు తమ నటనకి జీవం పోసారు. చాలా సహజం గా నటించారు. నన్నడిగితే పాత్ర ధారుల ఎంపికలోనే సినిమా విజయం సగం దాగుందేమో అని. తప్పక చూడవలసిన సినిమా, అయితే ఈ సినిమాలో, నాలుక్షరాల, మూడక్షరాల, పదాలను విరివిగా ఉపయోగించారు ఎంతలా అంటే అలవాటైన వాళ్ళకు కూడా "ఇక చాలు బాబోయ్, మరీ ఇంత డోసా?" అనిపించేలా.

రెండవది, "ది ఇంటర్నేషనల్". ఒక జర్మన్ బేంక్ అంతర్జాతీయ ఆయుధ స్మగ్లింగ్ బ్రోకర్లా వ్యహరించి తమ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నించటం, దాన్ని ఒక అమెరికన్ ఇంటర్ పోల్ ఏజెంట్ ఛేదించటం సినిమా కధాంశం. సినిమా ఉద్దేశ్యం రెండు గంటల పాటు ప్రేక్షకుణ్ణి కట్టిపడేయమే అయితే ఈ సినిమా దాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఈ సినిమాలో కేమెరా పనితనం అద్భుతం. నన్ను కట్టి పడేసింది. నాకు మాత్రం ఈ సినిమా "బోర్న్" సీరిస్ ని గుర్తుకు తెచ్చింది. ఆ సినిమాల స్థాయికి ఏ మాత్రం తగ్గదు. ఇందులో హీరోగా చేసిన క్లైవ్ ఓవెన్ జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్ గా నటించే ఆఫర్ ని వద్దనుకున్నాడట. ఎందుకోమరి..

ఇక మూడవది, మన "స్లం డాగ్ మిలియనీర్". పైన చెప్పినట్టు సినిమా ఉద్దేశం ప్రేక్షకుణ్ణి కధలో లీనం అయ్యేలా చెయ్యటం అయితే, ఈ సినిమాకి ఆ విషయంలో వందమార్కులు. ఆకట్టుకునేలా తీసాడు కాబట్టే ఇన్ని విమర్శలు. చెప్పాల్సిందంతా మన మిత్రులు ఎప్పుడో చెప్పేసారు కాబట్టి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. ఆ లావెట్రీ సీను మినహాయిస్తే సినిమా అద్యంతం కట్టిపడేస్తుంది. మన దేశం పరువు పోయింది అని ఇంత గొడవ చేసిన ఈ పెద్దమనుషులు ఒక రెండేళ్ళు పోయాక మిగతా అన్ని సినిమాల్లాగే ఈ సినిమా పేరు మర్చిపోయి, పేరు గుర్తు రాక బుర్ర గోక్కోవడం ఖాయం. నా ఉద్దేశం ఏమిటంటే ఇది మంచి సినిమా అంతేగాని చరిత్రలో నిలిచిపోయే సినిమా ఏమీ కాదు. దేశం పరువు గురుంచి ఆందోళన అనవసరం.ఈ సినిమాలో చిన్నపిల్లల నటన అద్భుతం. చిన్నపిల్లల నటనని పరమ కృతకంగా చూపించే మన దర్శక మహానుభావులు చూసి నేర్చుకోదగ్గ విషయం.
Sunday, February 15, 2009

మా ఇంటి కధ

దాదాపు రెండేళ్ళుగా నా ప్రమేయం లేకుండా, దానంతటదే వాయిదా పడుతూ వస్తున్న పనొకటుంది. ఊళ్ళో ఉన్న మాఇంటిని పడేసి, తిరిగి కట్టించడం.దాదాపు ఇరవై యేళ్ళ క్రితమే మేము ఇంకొక ఇంటిని కట్టుకున్నా ,అది ఊరి సెంటర్లో ఉండటంవల్లా, ఆ వాహనాల దుమ్మూ, ధ్వని కాలుష్యాల కారణంగా తమకు నివాసయోగ్యం కాదని తేల్చేసారు మా ఇంట్లోవాళ్ళు. దాన్ని అద్దెకిచ్చి ఈ పాత ఇంట్లోనే ఉండటానికి మరొక ముఖ్యమైన కారణం దాదాపు ముప్పైయేళ్ళపైబడిన ఇరుగు-పొరుగు పరిచయాలు.

నిజానికా ఇంటిని మాతాత దాదాపు అరవై యేళ్ళ క్రితం కట్టించాడట. ఒక గది, దాన్నానుకొని ఒక వంటగది. వెనకనున్న ఖాళీ జాగాలో స్నానాదులకోసం ఒక బాత్రుం.ఆ రోజుల్లోనే వాటిని 20 రోజుల వ్యవధిలో నిర్మించారట ఆ నెల్లూరు నుంచొచ్చిన కూలీలు. అదొక రికార్డు. నిజానికి వాళ్ళని మావూళ్ళొ ఎవరో మోతుబరి ఇల్లు కట్టించుకోవటానికి నెల్లూరు నుంచి పిలిపించాడట. వాళ్ళు ఆ పని పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం లో ఉండగా మా తాత కళ్ళబడటం, మంచి పనివారనే నమ్మకం కారణంగా, ఈయన వాళ్ళని కాళ్ళావేళ్ళా బ్రతిమాలి, ఒప్పించి, ఈ ఇల్లు కట్టించడం. పని సగంలో ఉండగా వాళ్ళకి వాళ్ళ ఊరిమీద, ఇంట్లోవారి మీద గుబులు పుట్టినా, పని ఒప్పుకొని మాట ఇచ్చాక మాట తప్పేరోజులు కాకపోవటం వల్ల ,పాపం అందరూ రోజూ దాదాపు 18 గంటలు కష్టపడ్డారట. పొద్దున్నే నాలుగింటికి పని మొదలెట్టి, గుడ్డివెలుతురైనా రాత్రి దాదాపు పదింటి వరకూ పనిచేసేవారట. ఇప్పటికీ ఇంటి మధ్యగదులు రెండూ చాలాపటిష్టం గా ఉంటాయి. కాలక్రమేణా మా నాన్న ముందున్న ఖాలీ జాగాలో పంచ కట్టించి, మధ్యగదినానుకొని వారగా ఇంకొక గది కట్టించి, మేడ మీదికి మెట్లూ, మరికొన్ని మార్పులు చేర్పులూ చేసి ఇంటికి ప్రస్తుతమున్న రూపు తీసుకురావటం జరిగింది. అయితే ఈ మార్పులన్నీ ఇంతకు ముందున్న ఇంటికి అతుకులే కాబట్టి, కాలక్రమేణా ఆ అతుకులు బలహీనపడి, ఎప్పుడైనా విపరీతంగా వర్షం కురిస్తే ఇల్లు కురవడం ప్రారంభించింది. కొత్త ఇంటికి మారడం కుదరదని నిశ్చయమయ్యాక ఈ ఇంటిని మొత్తం పడగొట్టి తిరిగి కట్టించడం గురించి మా నాన్న నాకు స్పష్టం చెయ్యడం జరిగింది.

నిజానికి నేను ఆ ఇంటినీ నన్నూ ఎప్పుడూ వేరు చేసుకొని చూడలేదు. అందువల్ల ఒక సంవత్సర క్రితం ఇండియా వెళ్ళినప్పుడు, చేయాల్సిన పనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ళంతా ఒకసారి పరికించి చూసుకుంటే, మనసంతా ఏదో అలజడి. ఎన్ని జ్ఞాపకాలూ! ఒకటా రెండా? నేను నడక నేర్చిన బండలూ, నేను పుట్టినప్పటి నుంచి నా ఎదుగుదలకి సాక్షీభూతాలయిన ఆ గదులూ,గోడలూ, భగవంతుడనేవాడు నాకు పరిచయమైన పూజగది, చిన్నప్పడు మేమాడుకున్న ఎన్నో ఆటలకి వేదికైన మిద్దె.... ఇవన్నీ నాకు పరిచయం లేని కొత్తరూపు సంతరించుకుకోవడానికి నామనసొప్పుకోవడంలేదు. రాత్రి పడుకున్నా నిద్ర పట్టలేదు. గది పైకప్పూ, చూట్టూ ఉన్న నాలుగు గోడలూ, తలుపులూ, కిటికీలూ అన్నీ నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్లు ఏవేవో ఊహలు. తెలిసీ తెలిసీ జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోబోతున్నట్టు తెలీని బాధ.

ఇంకో రెండురోజుల్లో హైదరాబాదు పయనం, అక్కడినుంచి ఒక వారంలో అమెరికాకి. ఇక ఇంటిని ఇలా చూడడం ఇదే ఆఖరు.బహుశా వేసవి లో పని మొదలు కావచ్చు. పని మొదలయ్యే సమయానికి నేను ఇక్కడుండక పోవటం ఒకరకం గా మంచిదే. నాముందే వాళ్ళు ఇల్లంతా కూలగొడుతుంటే చూడటం నావల్లయితే కాదు

పొద్దున లేచి, టిఫిన్ చేసాక నేను చేసిన మొట్టమొదటిపని నా హేండీకేం లొ ఇల్లంతా వీడియో తీయటం. బహుశా నేను ఆ కేమెరాని కొన్న కొత్తల్లో కూడా అంత శ్రద్దగా దేన్నీ వీడియో తీసుండను. మనసంతా ఏదో చెప్పలేని ఉద్విగ్నతకి లోను కావటం వల్ల నిశ్శబ్దం గా పని పూర్తి చేసాను, సౌండ్ మిక్సింగు తరువాత చేసుకోవచ్చులే అని.


ఇక నా హేండీకాం హడావిడి చూసి, ఆరోజు సాయంత్రం నా చెల్లాయి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు మా అమ్మని అడిగింది "అమ్మా చిన్నన్నయ్య ఈ ఇంట్లో పుట్టాడా లేక హాస్పిటల్లోనా?" అని. నిజానికి మానలుగురు పిల్లల్లో మా చెల్లాయొక్కతే హాస్పిటల్లో పుట్టింది.మేమంతా ఇంట్లోనే పుట్టాం. విషయంలోమా చిన్నప్పుడు చెల్లాయి నేను వాదులాడుకునే వాళ్ళం . తనేమో "నువ్వు ఇంట్లోనే పుట్టావు నేను హాస్పిటల్లో" అని మా గొప్పగా చెప్పుకునేది.నేను చిన్నబుచ్చుకోవటం ఇష్టం లేక మా అమ్మ నాతో "నువ్వు పుట్టింది కూడా హాస్పిటల్లోనేరా" అనేది. అలా అలా అది నాకొక సందేహంగా ఉన్నా, నేను దాన్ని ఎన్నడూ నివృత్తి చేసుకోలేదు. అయితే ఈసారి చెల్లాయి అడిగినదానికి నాకు అమ్మనుంచి కచ్చితమైన సమాధానం దొరికింది.

రోజూ రాత్రి రెండింటి దాకా టివీ చూసే అలవాటున్న నేను, ఆ రోజు పదింటికే టీవీ కట్టేసి, ఎన్నడూలేని విధంగా మధ్యగదిలో చెక్కబీరువా ముందు పక్కేసుకుంటుంటే వింతగా చూసింది మా అమ్మ.

Wednesday, February 4, 2009

నాకు రాజకీయాలంటే పరమ అసహ్యం ఎందుకంటే..

నా చిన్నప్పుడెప్పుడో ఒకసారి స్కూల్ నుంచి ఇంటికొస్తుంటే ఊరి సెంటర్లో పెద్ద గుంపు. ఎవరో అన్నారు "చీప్మినిస్టర్, చీప్మినిస్టర్" ( లేఖిని ఎఫెక్టు కాదు) అని. ఈ చీప్మినిస్టర్ అంటే ఎవరబ్బా అంటూ నేనుకూడా ఉత్సాహంకొద్దీ గుంపులోకి దూరా. ఇది అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య మాఊరొచ్చినప్పుడన్నమాట. ఆతరువాత సోషల్ సైన్సు లో చదువుకున్నా, శాసనసభ, ఎగువసభ, దిగువసభ, రెండింత మూడొంతుల మెజారిటీ, ఓటుహక్కు, ముఖ్యమంత్రీ, ప్రధానమంత్రి, రాష్ట్రపతీ, స్పీకరు ...మన్నూ మశానం అన్నీనూ. జనరల్ నాలెడ్జి కాంపిటీషన్లలో పాల్గొనేవాడిని కాబట్టి అన్నీ బట్టీపట్టా.....మొదటి ప్రధాన మంత్రీ, మొదటి మహిళా ముఖ్యమంత్రీ గట్రా...

నిజానికి రాజకీయాలంటే అనుభవంలో కొచ్చింది మాత్రం ఎంటీయార్ ముఖ్యమంత్రి అయ్యాకే. ఇద్దరు రాజకీయ నాయకులు తిట్టుకోవడం నేను చదివింది ఈయన హయాంలోనే(అప్పట్లో ఈ టీవీ లు ఇంతగా లేవులెండి). ఎంటీయార్, జలగం వెంగళరావు లు తెగ తిట్టుకొనేవారు అప్పట్లో. ఎవరు ఎవరినన్నారో గుర్తు లేదు గాని, " తంతే వెళ్ళి బంగాళాఖాతం లో పడతాడు" అని తిట్టేసుకున్నారు. ఇప్పటి స్టాండర్డ్స్ ప్రకారం ఇదస్సలు తిట్టే కాదు గానీ అప్పట్లొ మా మంచి వినోదం అందరికీ.

అప్పుడు మొదలయ్యిందండి నా ప్రస్థానం, రాజకీయనాయకులంటే మనలాంటి మనుషులే అనే (అమాయకపు) అభిప్రాయం నుంచి "అస్సలు వీళ్లు మనుషులా .. రాక్షసులా.." అని చీదరించుకునేంత వరకు...

నాకు గుర్తుండి ఛీ, ఛీ..ఛీ.. అనిపించిన కొన్ని....

ఇద్దరు సభ్యులతో మొదలెట్టి, మతాన్ని వాడుకొని, రధయాత్రలు చేసి, జనాల్ని రెచ్చగొట్టి, కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా సాగిన పార్టీ ప్రస్థానాన్ని చూసినప్పుడు....

బలపరీక్ష లో జయలలిత వ్యక్తిగత పంతాలకి పోయి ఒక్క ఓటు తేడా తో ప్రభుత్వాన్ని పడగొట్టి, వందల కోట్ల ప్రజా ధనం తో మళ్ళీ ఎన్నికలు జరిపించినప్పుడూ..

సోనియమ్మ సుపుత్రుడు హైదరాబాదు వచ్చినప్పుడు, ఆ కుర్రకుంక దృష్టి లో పడటానికి , తన పెద్దరికాన్ని మరిచి, తన నియోజక వర్గ ప్రజల ఆత్మ గౌరవాన్నీ, అన్నిటికీ మించి తన ఆత్మ గౌరవాన్నీ తాకట్టుపెట్టి, వాడి దృష్టి తన మీద పడితే చాలు అని, ఆ కారెనకాలే, పంచె ఊడి పోతున్నా, కండువా జారిపోతున్నా పట్టించుకోకుండా పరిగెత్తిన రాజకీయ నాయకుడిని చూసినప్పుడూ...

సోనియమ్మ ప్రధాని కావాలి అని "హైడ్రామా" నడిపించి, రోజుకో పుకారు పుట్టించి, చివరికామె, "చూద్దాం" అనగానే, అదేదో మహాప్రసాదం అని భావించి, దాన్ని కళ్ళకద్దుకొని, "మేడం ఒప్పుకున్నారహో" అని, వయసుమరిచి, మన ఎంపీలు చాలా మంది, పార్లమెంటులో , టీవీ కేమెరాలముందు సినిమా స్టెప్పు లేయడం చూసినప్పుడూ..

బిల్ క్లింటన్ పార్లమెంటు లో ప్రసంగించిన తరువాత ఆయన షేక్ హేండ్ కోసం ఎంపీలు ఎగబడినప్పుడూ ..

ఖైరతాబాదు ఫ్లైఓవర్ మీద మండుటెండలో, నిండు వేసవిలో, మిట్టమధ్యాహ్నం, ఆ వాహనాల పొగ పీలుస్తూ, ఎవడో "పెద్ద మనిషి" ఆ దారెంట వెడుతున్నాడని నన్నూ, నాతో పాటు వందలాది మందిని ఆపేసి నప్పుడూ..

రోజువారీ జీతం మీద సినిమా హాల్లో పార్కింగ్ టికెట్లిచ్చే వ్యక్తిని "ఎవడ్రానువ్వు, నీ అంతు చూస్తా" అంటూ ఆ అర్భకుడి మీద నలుగురిముందు తన ప్రతాపం చూపిన ఖద్దరు శాల్తీ ని చూసినప్పుడూ..

గత నాలుగేళ్ళ నుంచి అసెంబ్లీ సమావేశాలని చూసిన ప్రతిసారీ..

ఈ తొడ కొట్టడాలూ, మీసం మెలేయడాలూ, గాల్లోకి ముద్దులూ, కంటి చూపు ప్రసంగాలు చూసినప్పుడూ..

ఆపార్టీ, ఈపార్టీ అని కాదు..
అప్పుడూ ఇప్పుడని కాదు ,
ప్రతిరోజూ, ప్రతిసారీ..
వాళ్ళని చూసినప్పుడల్లా
ఒకటే ఆలోచన..

"దేవుడా రక్షించు నాదేశాన్ని"..

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...