Thursday, February 13, 2020

ప్రయాణాలూ-అనుభవాలూ -2

చెన్నై ఎయిర్ పోర్టు.  నవంబరు 2019. 

ఎప్పటిలానే లగేజి మోతబరువు వదిలించుకొని , బోర్డింగుపాసులు తీసికొని సెక్యూరిటీ లైన్ల దగ్గర నిలబడ్డాము. ఆడవాళ్లకు  విడిగా లైను ఉండటంతో మావిడా, అమ్మాయీ అటెల్లిపోగా నేనూ, మావాడూ మిగిలాం. లాప్ టాప్ కంప్యూటరూ, బెల్టులూ, వగైరాలు పెట్టే  ప్లాస్టిక్కు బిన్నులుండే దగ్గర చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. ముందొచ్చినవాడూ వాడూ, తరవాతొచ్చిన వాడూ లాంటి చచ్చు లాజిక్కులు  లేకుండా  బలవంతుడిదే రాజ్యం. ఒకపక్క మావాడినొక కంట కనిపెడుతూ నా   ప్లాస్టిక్  డబ్బా దొరకబుచ్చుకొనే సరికి నిజంగానే చెమటలు పట్టాయి నాకు. నిజానికి నా అంతట నేను దొరకబుచ్చుకోలేదు.  ఓ దయగల  పెబువు నా అవస్థ చూసి, ఈ యుద్ధంలో నువ్వెప్పటికీ గెలవలేవు అంటూ, ఆయనొకటి తీసుకొని ఇంకొక ప్లాస్టిక్ చిప్ప నా చేతికందించ్చాడు. ఈ నిజానికి మించిన ఇంకో నిష్టూరపు నిజం చెప్పాలంటే, నేను ఆయన కంటే కొద్దిగా ముందుండటం, ఎంతసేపటికీ నేను కదలక పోవడం చూసి ఆయనే విసుక్కుంటూ నాకు సహాయం చేసి ఉంటాడని నా మరొక ఊహ. ఆయనకి  థాంక్స్ చెప్పి, నా వస్తువులన్నీ ఆ చిప్పలో పెట్టి, దాన్ని నా ముందున్న ఇద్దరిమధ్య కొద్దీ కొద్దిగా దూర్చి,తగినంత సందు దొరగ్గానే దాన్ని  స్కానింగ్ మెషిన్ బెల్టు మీదపడేసి  ముందుకు చూస్తే ఆవల  సెక్యూరిటీ చెక్ పూర్తయిన చోట యుద్ధం  ఫేజ్-2 నడుస్తోంది. అదిచూడగానే నీరసం వచ్చినా దూకాక ఈత తప్పదుకాబట్టి నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. 

నాముందు ఒక ముగ్గురు నలుగురున్నారు. మమ్మల్ని పర్యవేక్షిస్తున్న ఆ సెక్యూరిటీ ఆఫీసరుని చూడగానే  నా నీరసం రెట్టింపైంది. ఆయన వాలకం చూస్తే "మీరందరూ కట్టకట్టుకొని ఇక్కడికెందుకొచ్చ్చారు? అసలు నేనెందుకిక్కడున్నాను?"  అని లోలోపల గింజుకుంటున్నట్టే ఉంది. నా ముందున్న ఆ  సూటేసుకున్నాయన ఏదో వస్తువు ఆ చిప్పలో పెట్టడం మర్చిపోయినట్టున్నాడు. ఆ సెక్యూరిటీ ఆఫీసరు మర్యాదగాలేచి ఆయనకి ఏదో చెప్తున్నాడు

మావాడికసలు కాలు నిలవదు.  ప్రతి పదిసెకన్ల కొకసారి సందు దొరికితే నా నుంచి పారిపోదామని చూస్తున్నాడు. వాడు అలాజారుకుందామని చూడటమూ , నేను కోపాన్ని అణచుకుంటూ వాడి కాలరుచ్చుకు లాగటమూనూ. 

ఇంతలో ఉన్నట్టుండి పెద్దగా అరుపులు వినిపించాయి నాకు. ఆ ఆఫీసరు నాముందున్న ఒక ముసలాయన మీద పెద్దగా  తెగ  కేకలేస్తున్నాడు. ఆ ముసలాయన అయోమయంగా అలా చూస్తూనే ఉండటంతో పట్టరాని కోపంతో కుర్చీలోంచి పైకి లేచాడు. ఆయన తీరు చూస్తే ముసలాయన్ని కొట్టినా కొట్టొచ్చనిపించింది నాకు.  

ఆయన్ని  పరీక్షగా చూసాను. బహుశా వయసు అరవైల్లో  ఉంటుందేమో. ముతక దుస్తులు. మనిషి మాత్రం చూడగానే  చాలా సౌమ్యుడిలా అనిపించాడు నాకు. ఆ ఆఫీసరు  అంతలా కేకేలేస్తున్నా ఆయన మాత్రం  నిర్లిప్తంగా నిలబడ్డాడు. అస్సలు నోరిప్పలేదు. అసలీ ప్రయాణం చేయడమే ఆయనకిష్టం లేనట్టుగా , ఏదో  బలవంతం మీద ఈ ప్రయాణం పెట్టుకున్నట్లుగా ఉంది ఆయన వాలకం.  ఆ ఆఫీసరు   భాష ముసలాయన కి అర్ధం కాలేదనుకున్నాడేమో ఏమో, నాముందున్నాయన నెమ్మదిగా వెళ్లి ఆ ముసలాయన చెవిలో ఆ కేకల్ని హిందీలోకి తర్జుమా చేసి చెప్పాడు. 

ఆ ముసలాయన  తన వాలెట్టూ ,బెల్టూ  చిన్న ట్రే లో కాకుండా పెద్ద ట్రే లో పెట్టడం ఈ గొడవకంతటికీ కారణం. స్కానింగ్ మెషిన్ లోకి వెళ్ళబోతున్న ఆ ట్రేని విసురుగాలాగి ఆయన మీదకి విసిరేసినంత పనిచేసాడా ఆఫీసరు. ఇంతలో ఎవరో అందించిన చిన్న ట్రే  లోకి  వణుకుతున్న చేతుల్తో ఆయన అందులోని వస్తువుల్ని మారుస్తుండగా చూసాను. ఒక  బాగా మాసిపోయి చీకిపోయిన వాలెట్టూ, ఒక  బెల్టూ. 

సెక్యూరిటీ చెక్ పూర్తయి నా వస్తువులన్నీ తీసుకుంటూ మరొక్కసారి గమనించానాయన్ని. కొద్దినిమిషాల  క్రితం జరిగిన దాని ఊసే లేకుండా నిర్లిప్తంగా ఉన్నాడతను. తన వస్తువులు తీసుకొని అలా నా ముందునుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 

మనిషి వేషం,కులం, ఆర్ధిక స్థితిగతుల్ని బట్టి వాళ్ళ హక్కుల స్థాయి నిర్ణయించబడే  మన దేశంలో  ఇదేమంత చెప్పుకోదగ్గ  సంఘటనే కాదు. నిజానికి ఇంతకంటే దారుణమైన వార్తలు కోకొల్లలు మన పత్రికల్లో దాదాపు ప్రతిరోజూ. 

ఒక రెండుగంటల తరువాత, మా ఫ్లయిటు బోర్డింగ్ పూర్తయి టేకాఫ్ అవబోతుండగా ఇంకొకసారి ఆ ముసలాయన రూపం నా కళ్ళముందు మెదిలింది. 

బహుశా ఆయన ఫ్లయిట్ కూడా ఈపాటికి ఏ గల్ఫ్ తీరానికో బయలుదేరే  ఉంటుంది. అయినవాళ్ళనీ ,ఆప్తుల్నీ వదిలి జీవిత మలి సంధ్యలో ఆ ఎడారి దీవుల్లో  ఆయన జీవనపోరాటం చేయక తప్పదు. 

కాసేపు మనసు బాధతో బరువెక్కింది. 

4 comments:

మురళి said...

కదిలించే అనుభవం అండీ.. మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ గురించి రాశారు కానీ, డొమెస్టిక్ లో కూడా ఇంతకు మించిన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వేసుకున్న దుస్తులు, మాట్లాడే భాషని బట్టే మర్యాద ఇక్కడ. ప్రయాణపు దుస్తుల్లో కంఫర్ట్ కి ప్రాధాన్యత ఇచ్చే వాళ్లకి దొరికే మర్యాద బహు స్వల్పం. ఆ ఐదు నిమిషాల మర్యాద కోసం మొత్తం ప్రయాణంలో గాడిద బరువు దుస్తులు భరించడం నాబోటి వాళ్ళ వల్లకాదు :)) అన్నట్టు, మొన్నటి పోస్టుకి వ్యాఖ్య రాశాను కానీ, బ్లాగర్ మింగేసినట్టుంది. కామెంట్ బాక్స్ సెట్టింగ్స్ ఏమన్నా మార్చాలేమో ఒకసారి చూడండి. 

Lalitha said...

అయ్యో! Airport లో అంత rude గా వుంటారాండీ? పాపం! ఆ ముసలాయన ఎవరో, ఎంత బాధపడి వుంటారో!

కొత్తావకాయ said...

ప్రయాణాల్లో ఒకలాంటి నిర్లిప్తత అలవాటైపోయిందండీ. 'అమెరికాలో దిగగానే హమ్మయ్య అనిపించడం గిల్టీగా ఉంటుంది ' అని ఒక ఫ్రెండ్ అన్నారు. ఆమాట ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లే గుర్తొస్తుంది.

వేణూశ్రీకాంత్ said...

WTC తర్వాత రూల్స్ కఠినతరం చేస్తున్న సమయంలో నేనిలాంటి విసుగును ఒకటి రెండు సార్లు ఎదుర్కొన్నానండీ. తల కొట్టేసినట్లుగా అనిపించేది. పాపం ఆ పెద్దాయనని తలుచుకుంటే అయ్యో అనిపిస్తుంది.

టైంపాస్ కబుర్లు

ఏదైనా ఒక పెయింటింగ్ ని  చూడగానే  ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కంటే నగీషీలూ చక్కని డిజైన్ తో  చుట్టూ ఉన్న ఫ్రేమే  బావుందనిపిస్తే ఎలావుంటుంది ...