సమయం రాత్రి పదిగంటలు పైనే.
దేవుని గూట్లో సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు వెలిగించిన దీపం ఇంకా వెలుగుతూనే ఉంది.
రోజుటిలాగే మొదట మామూలుగా చెప్పి ఆనక బెదిరించి ఆఖరికి లివింగురూము మొత్తం ప్రతిధ్వనించేలా అరిస్తే గాని చిన్నోడిచెయ్యి టీవీ రిమోట్ ని తడమలేదు. అప్పటికీ వాడు టీవీని కట్టేయలేదు , వీడియో పాజ్ చేసాడంతే. సింకులోని అంట్లన్నీ తోమి కిచెన్లో సామాన్లు సర్దుతున్న నేను మళ్లీ నా పనిలోపడి ఇంకొంచెంసేపు వెసులుబాటు కలిగిస్తానేమో అని వాడి ఆశ. ఈరోజు మాత్రం వాడి ఆశ అడియాసే.
కిందికెళ్లి ఇంటి మెయిన్ డోరు, గరాజ్లోంచి బేస్మెంట్ లోకొచ్చే డోరూ రెండూ లాక్ చేసున్నాయోలేదో చూసి, కాసిన్ని నీళ్లు తాగి, పిల్లలిద్దరినీ పైకెళ్లి పడుకోమని చెప్పి కాస్త అలసట తీర్చుకుందామని డైనింగు చైర్లో కూలబడ్డాను.
పొద్దున ఆరున్నరకు లేస్తే రాత్రి దాదాపు పదకొండు గంటల వరకూ ఊపిరి సలపని పని. అటు ఆఫీసు పనీ, ఇటు పిల్లల బాగోగులూ. దేన్నీ పక్కన పెట్టడానికి లేదు.
నిజానికి వంట చేయడమే పెద్ద పననుకుంటే బెదిరించో బామాలో వాళ్ల చేత తినిపించడం అంతకంటే పెద్ద పని. దానికితోడు ఈ మధ్యే మొదలైన సిబ్లింగ్ రైవల్రీ. నాపిల్లల్నెప్పుడూ ఏ విషయంలోనూ వేరే వాళ్ల పిల్లలతో అస్సలు పోల్చి చూడను కానీ ఈమధ్యే ఒడ్డూ పొడుగూ విషయంలో అదే పనిగా వాళ్లని తమ ఈడు పిల్లలతో పోల్చిచూడడం ఎక్కువయింది. నిన్నా మొన్నటివరకు పిల్లల విషయంలో ఒక పేరెంట్ గా నాకు నేను ఏర్పరుచుకున్న జాబితాలో తిండికంత ప్రాముఖ్యత లేదు. అలాఅని పట్టించుకోనని కాదు. నిజానికి నా రోజువారీ అరుపులూ,కేకల్లో సింహభాగం డైనింగు టేబులు దగ్గరే.
పైన బెడ్ రూంలోంచి పిల్లల గుసగుసలు వినబడుతున్నాయి. లేచి లివింగురూములో పైకి దారితీసే మెట్ల వద్ద కొచ్చి గట్టిగా అరిచాను.
"హే , నో టాకింగ్ ,గో టు బెడ్".
ఓ రెండు నిమిషాల తరువాత ఆ గుసగుసలు మళ్లీ మొదలవుతాయి. ఈరోజు మాత్రం నాకు అక్కడ నిలబడే ఓపికేమాత్రంలేదు.
డన్ ఫర్ ద డే.
దానికితోడు ఏకాదశి ఉపవాసాన్ని ముగించుకొని సాయంత్రం ఏదో కాస్త కతికినా ఆ నిస్సత్తువింకాపోలేదు.
నిద్రపోబోయే ముందు డేన్ డిలయన్ టీ తాగటం నాకలవాటు. కిచెన్ లోకొచ్చి మిగతా సామాన్లన్నీ సర్ది కెటిల్ లో నీళ్లు పోసి ఆన్ చేసాను. గాజు గ్లాసులో మరిగించిన నీళ్లు అందులో టీ బ్యాగ్ వేసి ఓ పది నిమిషాలు ఆగితే చాలు. ప్రతిసారీ కాకపోయినా కొన్ని సార్లు క్రమంగా రంగుమారే ఆ నీళ్లను చూడటం సరదా నాకు.
కానీ ఈ రోజు... అదీ ఈ టైములో... నో వే .
గ్లాసు డైనింగు టేబిలు మీద పెట్టి, ఎప్పటిలాగే ముందు లివింగురూము లైట్లూ , తరువాత కిచెన్, ఆ తరువాత డైనింగు ఏరియా లైట్లు ఆఫ్ చేసేసాను. దేవుని దగ్గర వెలిగించిన దీపాన్ని చూస్తూ చిట్ట చివరి లైటుని ఆఫ్ చేయడం నాకలవాటు. చాలా అసంకల్పితంగా జరిగిపోతుందది,కొన్నేళ్లుగా .
ఇల్లంతా మసక చీకటి.
డైనింగు ఏరియాకి కొద్దిదూరంలో,మార్నింగు రూములో, సాయంత్రమెప్పటినుంచో వెలుగుతున్నా అసలు ఉనికేలేనట్లున్న ఆ దీపం ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్లయింది.
పచ్చటి వెలుగు.
వెళ్లి దానెదురూగా బాసింపట్లువేసుక్కూర్చున్నాను .
చీకట్లో నిశ్చలంగా ఘనీభవించినట్లుగా ఉన్నదా దీపం.ఏసీ మెషిన్ ఆన్ అయివుంటే మాత్రం సీలింగుకున్న వెంట్ లోంచి వచ్చే గాలికి కొద్దిగా రెప రెప లాడుతుందది .
కళ్లార్పకుండా ఆ చీకట్లో ఆ పచ్చటి వెలుగుని చూడటం నాకెంతో ఇష్టం. ఒక అనిర్వచనీయమైన ధైర్యాన్నిస్తుందది నాకు.దాన్ని ధ్యానమంటారో ఇంకేమంటారో నాకు తెలీదు కానీ పొద్దుట్నుంచి చెల్లా చెదురైన నన్ను తిరిగి ఒక్కటిగా పేర్చుకుంటున్నట్లుగా ఒకరకమైన భరోసా మాత్రం దొరుకుతుందా సమయంలో. పొద్దున్న లేచింది మొదలు నన్ను నిలువునా మింగేసే రోజు లోంచి బయటపడి నాకు నేను గా మిగిలేది బహుశా ఈ కొద్ధి నిమిషాలేమో మరి. రోజుమధ్యలో కాస్త తీరికి దొరికి ఏదైనా చదువుతున్నప్పుడో లేదా టీవీ చూస్తున్నప్పుడో సందు దొరికితే చాలు నన్నమాంతం మింగేయడానికి సిద్ధంగా రకరకాల ఆలోచనలు. ఈ సమయంలో మాత్రం అవన్నీ కొద్దిగా నెమ్మదిస్తాయి.
కిటికీ బ్లయిండ్స్ వేసున్నా లోపలికెలా దూరిందోగాని రోడ్డు మీద వెళ్తున్న కారు హెడ్ లైట్ల తాలూకు వెలుగు మందిరం వెనకాలున్న గోడ మీద ఏటవాలుగా మొదలై , గోడంతా పాకి ఎటెళ్లాలో తెలీనట్లుగా సీలింగుమీద ఒక్కక్షణం తారట్లాడి చప్పున మాయమయింది. ఆ వెంటనే కారు టైర్లు రోడ్డు మీద చేసే మెత్తటి సన్నని శబ్దం నా పక్కగా .
రోడ్డు పక్కిల్లు. తప్పదు. అయినా నా ఒంటరితనానికి ఇదోరకంగా మంచిదే.
డైనింగు టేబులు వెనకాల గోడకి తగిలించిన ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధ భగవానుడి పెయింటింగ్ తాలూకు ఫ్రేమ్ మాత్రమే లీలగా కనపడుతోంది. అయితే మందిరం పక్కనే టేబిలుమీద గోడకానించి పెట్టిన పెద్ద సాయిబాబా ఫోటో మాత్రం అదాటుగా చూస్తే ఆ చీకట్లో గోడవతల్నుంచి నన్నెవరో తీక్షణంగా చూస్తున్నట్టుగా , కొద్దిగా భయం గొలిపేలా ఉంది. ఒక్క క్షణం నవ్వొచ్చింది నాకు. ఈ చిరు చీకటికి నమ్మిన దేవుణ్ణే దయ్యం చేయగల శక్తి ఉన్నప్పుడు మరి మన మనసును కమ్మిన చీకట్ల సంగతో? వాటి ఉనికే తెలియనీయక ఇదే జీవితం అనుకొమ్మంటూ మనచేత అవి చేయించే విన్యాసాలెన్నో.
టీ చల్లారిపోతున్న విషయం గుర్తుకొచ్చింది. పైగా రేపు ఆఫీసుంది మరి.
మరొక్క సారి తదేకంగా దీపాన్ని చూసుకొని పైకి లేచాను.
No comments:
Post a Comment