కారు డ్రైవర్ల కథ

Thursday, March 5, 2009

ప్రతిఒక్కరికీ జీవితంలో ప్రతి దశలోనూ వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. కొత్తగా వచ్చిన భార్య కావచ్చు.ఇప్పుడే ఈలోకం లోకొచ్చిన మీ బుజ్జి పాపో, బాబో కావచ్చు. ఇవేమీ కాకపోతే ఆఫీసులో మన బాసు కావచ్చు.లేదా ఇంకెవరైనా కావచ్చు. వీరిలో కొంతమందితో రోజూ మాట్లాడక పోయినా,వారితో వ్యవహరించేటప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటాం. నా దృష్టిలో వారందరూ వీఇపీలే. అలానే నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడున్నన్నాళ్ళూ నాకొక వీఐపీ ఉండేవాడు. వుత్తి వీఐపీ కాదు, వీవీఐపీ అన్నమాట.ఎవరో కాదు మా కారు డ్రైవర్. పేరు భిక్షపతి. గత మూడేళ్ళుగా నేను నా ఇండియా ప్రయాణం టికెట్లు కన్ ఫం చేసుకోగానే, ఆ వెంటనే చేసే పని మా అన్నయ్యద్వారా భిక్షపతి కి కబురు పెట్టడం. "స్టార్ట్ ఇమ్మిడియట్లీ" లాగా "భిక్షపతి అవైలబుల్" అన్న హామీ మా అన్నయ్య ఇవ్వందే నాకు ఇండియా వెళ్తున్నానన్న ఆనందపు క్షణాలు మొదలవ్వవు. అ హామీ లభించక ఆ ఆనందాన్ని కొన్ని రోజులపాటు వాయిదా వేసుకున్న సందర్భమూ ఉంది .

స్టాక్ మార్కెట్లో ఒక షేరుంటుంది, నిక్కుతూ నీలుగుతూ ఎక్కడో పదిహేను,ఇరవై మధ్య. ఏ మహానుభావుడు ఏ క్షణాన ఏ మీట నొక్కుతాడో గానీ అది అరవై, డెబ్బై, అలా అలా పెరుగుతూ రెండొందల పైచిలుకు చేరుకుంటుంది. ఈలోపు జనాలు దాన్ని వేలం వెర్రిగా కొనేస్తారు. ఆ తరువాతెప్పుడో అది కొండదిగి, కొంత మంది ఆత్మహత్యలకీ, కాపురాల్లో కలహాలకీ , ఇంకదేనికో దారి తీస్తుంది. నా దృష్టిలో అలా షేర్లలా కొండెక్కి , దిగకుండా ఇప్పటికీ అక్కడే తిష్టవేసుక్కూచ్చున వర్గం అంటే ఈ డ్రైవర్లే. ఒకప్పుడు మా వాడికి డ్రైవింగు వచ్చు, ఎక్కడైనా పనికి కుదిర్చి పెట్టండి అని అడిగేవాళ్ళు. ఇప్పుడాసీను ఏదైనా సినిమాలో పెడితే "అబ్బే అతకలేదు" అనేస్తాం మనం. అంత డిమాండు ఈ డ్రైవర్లకి. ముఖ్యంగా హైదరాబాదులో. (మిగతా వూళ్ళ సంగతి నాకు తెలీదు సుమా).

నేను ఇండియాలో పనిచేసేటప్పుడు అందరూ ముందు ఇల్లు కొనుక్కొని ఆ తరువాత కారు కొంటుంటే, నేను రివర్స్ గేర్ లో ముందు కారు కొని, ఆనక డబ్బుల్లేక ఇల్లు కొనేపనిని నిరవధికంగా వాయిదా వేసాను. దెప్పనివాళ్ళులేరు. అవొక గడ్డురోజులు. ఏంచేస్తాం, వాళ్ల కామెంట్లు విని, విననట్టు నటించి, ఊరుకొనేవాడిని. ఎవరితోనైనా మాటల్లో ఆ టాపిక్కు రాగానే, "ఆ! చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటి, దానికి డైరట్రెవరు?" అని టాపిక్కు మార్చడానికి విఫల ప్రయత్నం చేసేవాడిని.

అదేంటో నేను కారుకొన్న ఆ టైములోనే మన నారా వారి పుణ్యమాని హైదరాబాదు ముఖచిత్రం మారనారంభించింది. లంగా వోణీ వేసుకున్న పదారణాల తెలుగుపిల్ల లాంటి హైదరాబాదు, అరంగుళం మందాన అద్దుకున్న పౌడరూ, లిప్ స్టిక్కూ, టైటు జీన్సూ, టి-షర్ట్ లతో హైటెక్కు సింగారం అందుకుంది. చేతక్ స్కూటర్లూ, దానిమీద సీ.ఆర్.పీ.ఎఫ్ పోలీసుల తరహా గుండ్రటి హెల్మెట్లు పెట్టుకొనే అంకుళ్ళూ,నేరుగా అఫ్జల్గంజ్ వెళ్ళి అక్కడితో ఆగకుండా, అలానే సాలార్జెంగ్ మ్యూజియం లోకెళ్ళిపోయారు.ఇప్పుడంతా ఫాస్ట్.నూటయాబై,రెండొందల సీ.సీ బైకులూ, వాటికి డిస్కు బ్రేకులూ,వినగానే పక్కన బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడి,కాళ్ళూచేతులూ స్వాధీనం తప్పేలా చేసే రకరకాల హారన్లూ,వీటన్నిటికీ మించి ప్రతి ఒక్క టూవీలర్కీ నాలుగు కార్ల నిష్పత్తిలో ట్రాఫిక్.నాకంటే నా పక్కవాడిగురించి ఎక్కువగా పట్టించుకునే నా మనసుకి ఇది చూసి చాలా కష్టమేసింది. కష్టం కాదు, బాధ. బాధ కాదు,భయం (ఈ చివరిదే కన్ ఫం చేసుకోండి). ఈ భయం నా బుర్రలోంచి నా చేతుల్లోకీ, కాళ్ళలోకి ప్రవేశించి, నేను కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నన్ను దాటుకెళ్తున్న ప్రతివాళ్ళూ, ఎవడ్రా వీడు అని కొంతమంది ఆసక్తితోనూ, మరికొంత మంది అసహనంతోనూ, ఇంకొంత మంది కోపంతోనూ నావైపు చూసేలా చేసింది. అప్పటికీ పట్టించుకోలేదు. కానీ ఆ చూసేవాళ్ళలో కొంత మంది అమ్మాయిలుండేసరికి నా బ్రహ్మచారి హృదయం తట్టుకోలేకపోయింది. ఆ చూసే అమ్మాయి ఎంత అందంగా ఉంటే బాధ అంత ఎక్కువగా ఉండేది. అది కొన్ని క్షణాల పరిచయమే కావచ్చు, కానీ ఆ పరిచయం ఇలానా? ఈ విధంగానా?

"వాడు వీడే కదూ" అని జనాలు (అంటే అమ్మాయిలు) నన్ను షాపింగు మాళ్ళలోనో, మా కాలనీ కిరాణా కొట్లదగ్గరో గుర్తుపట్టకుండా ఉండాలంటే డ్రైవర్ని పెట్టుకోవడమొక్కటే ఉత్తమం అనిపించింది. అంతే!సడన్ గా మా అపార్ట్మెంటు వాచ్ మెన్ , దానెదురుగా టీ బండి పెట్టుకున్న యాదయ్యా, మా ఇంటికి అవసరమైనప్పుడు వెచ్చాలు తెచ్చిపెట్టే అబ్బాయీ నా ఫ్రెండ్సయ్యారు. వాళ్ళందరికీ చెప్పి పెట్టా, ఒక మాంఛి కత్తి లాటి డ్రయివర్ కావాలి తెలిసినవాళ్ళుంటే చెప్పండి అని. మా సంగతి బాగా తెలిసిన యాదయ్య టీ బండి కంటే ఇందులోనే కాస్త ఎక్కువ డబ్బులు మిగుల్తాయని లెక్కలేసుకొని, ఒకానొక శుభముహుర్తాన,తను తన టీ బండిని మూసేస్తున్నట్టూ, తను పలానా వాళ్ళదగ్గర డ్రయివర్ గా చేరబోతున్నట్టూ,ముందు వీధిలోవారందరికీ చెప్పి,చివరగా నాకు చెప్పేడు. యాదయ్య టీ బండి మూసేసి మరీ నా దగ్గర డ్రయివర్ గా చేరతానంటే నాకెందుకో నిజంగానే భయమేసింది. అప్పటివరకు కుటుంబ బాధ్యత మాత్రమే తెలిసిన నాకు ,మొట్టమొదటి సారిగా ఏదో"సామాజిక బాధ్యత" నామీదపడ్డట్టు సెంటిమెంటు ఫీలయ్యాను. సదరు యాదయ్య, అంతగా నా దగ్గర పని నచ్చకపోతే ,దాన్ని మానేసి, ఒక రెండుగంటల్లో తన టీ బండిని "రీ-ఓపెన్" చెయ్యగల సమర్ధుడని ఊహించలేకపోయాను.

అలా యాదయ్య పనిలోచేరాడు. మొట్టమొదటిరోజు యాదయ్య పొద్దున్నే ఎనిమిదింటికి మా ఇంటి తలుపు తట్టి, తలుపు తియ్యగానే,ఒక నమస్కారం పెట్టి, "కారు తాళాలియ్యండి సార్, మీరొచ్చేలోపు కారు బయటపెట్టి, దుమ్ము దులిపి, అద్దాలు శుభ్రం చేస్తా" అన్నాడు. అప్పుడు కారు తాళాలు అతనికందిస్తూంటే, ఎన్నో యేళ్ళ నుంచి నే పడుతున బాధ గుండెలమీదినుంచి దిగిపోయిన ఫీలింగ్( అప్పటికి నా కారు కొని మూణ్ణెల్లే ). ఇక రోజూ బయటికెళ్ళినప్పుడల్లా నేను ఆ ట్రాఫిక్కులో వొడుపుగా గేర్లు మార్చే యాదయ్య నైపుణ్యానికి ఆశ్చర్యపోయేవాడిని. అదేమిటో యాదయ్య ఫస్ట్ గేర్లో నడుపుతుంటే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇంజను ఆగిపోలేదు. నాకెప్పుడూ అలా కాలేదు. నేనైతే ఫస్ట్ గేర్లోకి రాగానే రియర్ వ్యూ అద్దం చూస్తా వెనక బకరాలెవరున్నారా అని.

నాదగ్గర పనిలోకి చేరిన ఉత్సాహం ఒకనెల జీతం తిసుకొనే సరికి ఆవిరయ్యింది యాదయ్యకి. ఆదాయం బానే ఉంది.కానీ, రోజూ గంటలకొద్దీ అలా ఏ పనీ లేకుండా నాకోసం వెయిట్ చేస్తూ గడపాలంటే మాపెద్ద కష్టమయింది యాదయ్యకి. పొద్దున్నే నా ఆఫీసు పార్కింగులో కారు పార్కు చేస్తే మళ్ళా సాయంత్రం ఏడింటికే తీయటం. అదే టీ బండి దగ్గర ఎంత సందడిగాఉండేది? రోజంతా ఎవరో ఒకరు పక్కన ఉంటూనే ఉంటారు మాట్లాడడానికి. రాజకీయాలూ,పక్కనున్న బస్తీలో రోజూ జరిగే యవ్వారాలూ, సినిమాలూ.. అబ్బో రోజు ఇట్టే గడిచిపోయేది.ఇలా పనీ పాట లేకుండా రోజంతా రికామీ గా కూర్చోవటం కష్టమయింది యాదయ్యకి. అంతే ఒక ధృఢనిశ్చయానికొచ్చేసాడు. నాకు డ్రయివింగు నేర్పి, "నా" కారుకి "తన" వారసుణ్ణి తయారుచేసి, అప్పుడు పని మానుకోవడం. ఇదీ యాదయ్య తీసుకున్న నిర్ణయం. తనలో ఈ రకమైన అసంతృప్తిని గమనించే నేను యాదయ్యకి నెల జీతం గాక అప్పుడప్పుడు వాటికీ వీటికని డబ్బులు బానే ఇస్తూ ఉండేవాడిని. డబ్బు అన్నిటికీ సమాధానం కాదు సార్ అని సింబాలిక్ గా చెప్పేసాడు యాదయ్య, ముభావంగా ఉండటంద్వారా.

ఒకానొక రోజు, సాయంత్రం నాలుగ్గంటలప్పుడు వనస్థలి పురం బయలుదేరాము కార్లో. ఎల్బీ నగర్ దాటగానే చాయ్ తాగుదామని కారు పక్కన అపమన్నాను. ఆ పక్కనే ఉన్న హోటల్లోకెళ్ళి రెండు చాయ్ లు తిసుకొచ్చాడు యాదయ్య. ఇద్దరం చాయ్ తాగుతున్నాం, ఇంతలో హఠాత్తుగా అన్నాడు యాదయ్య

"సార్, ఇక్కణ్ణుంచి మీరు నడపండి బండి"

నాకు పొలమారినట్టయింది. స్కూళ్ళు వదిలిన సమయం. ఎటుచూసినా ఆటోలూ, సెవెన్ సీటర్ ఆటోలూ, స్కూలు బస్సులూ, సైకిళ్ళ మీదవెళ్ళే పిల్లలూ, కుటుంబాన్నంతా ఎక్కించుకొని బైకులమీద, స్కూటర్లమీద సర్కస్ విన్యాసాలు చేస్తున్న అంకుళ్ళూ, ఇంతలోనే భీకరంగా హారన్ కొడుతూ దూసుకొచ్చే సిటీ బస్సులూ.. శనివారం నాటి చిలుకూరు టెంపుల్ లెవల్లో ఉంది రద్దీ.

తమాయించుకొని చెప్పా.

"ఇప్పుడు కాదులే, ఇంకెక్కడైనా ట్రాఫిక్ లేని చోట నడుపుతాలే"

"రోడ్డు సాఫ్ గా, ట్రాఫిక్కు లేకుండా ఉంటే మా ఇంట్ల పోరగాడు కూడా నడుపుతాడు, దిగండి సార్, దిగి ఆ సీట్లో కూర్చోండి, నేనున్నాను కదా పక్కన" అన్నాడు యాదయ్య, నాచేతిలోని ఖాళీ కప్పు తీసుకుంటూ.

మామూలు సమయంలోనయితే యాదయ్య చేసిన కమెంటుకి కోపం రావటమో, చిన్నబుచ్చుకోవడమో చేసేవాడిని. ఇపుడా ఫీలింగులకి కూడా ఆస్కారం లేదు. ఆ రద్దీ అలాంటిది.

యాదయ్య మరీమరీ బలవంతం చేయడం, తాడో పేడో తేల్చుకుందామని నేనుకూడ అప్పటికప్పుడు నిర్ణయించుకొవటంతో డ్రైవింగు సీట్లో కూర్చున్నా. డాష్ బోర్డు మీదున్న ఓబొజ్జ గణపయ్య కి దణ్ణం పెట్టుకొని, రోడ్డుమీద ట్రాఫిక్ ఒక్క క్షణకాలం తెరిపిడి పడి, నాకారు దూరే సందు దొరకడంతో కారు ముందుకు దూకిచ్చా. ఒక వంద మీటర్లు వెళ్ళానో లేదో బైకు మీద ఒక కాలేజీ కుర్రోడు నా ఎడమవైపు నుంచి రయ్యిన దూసుకొచ్చి, కట్ కొట్టి, నా కారు ముందుకొచ్చాడు. ఎక్కడ నాకారు తనకితగులుద్దో అని భయంతో నేను స్పీడు ఒక్కసారిగా తగ్గించా. ఆ దెబ్బకి "నాకు మొదటి గేరే కావాలీ..." అని నా కారు ఇంజను మారాం చేసింది.ఇంకేమంది యధావిధిగా కారు ఆగిపోయింది అదీ రోడ్డు మధ్యలో. నాకేమో చమటలు పట్టేస్తున్నాయ్. కారు స్టార్టు చెయ్యటం, కాస్త ముందుకెళ్ళటం, ఇంజను ఆగిపోవటం. ఇలా నాలుగుసార్లు జరిగింది. రోడ్డువారగా నాకు ఒక పదడుగుల దూరంలో ట్రాఫిక్ కానిస్టేబులు హెల్మెట్ చంకలో పెట్టుకొని టీ తాగుతున్నాడు . రియర్ వ్యూ అద్దం లోకి చూసా. తీరు చూస్తుంటే ఈలోపే నా వెనకాల భారీస్థాయిలో జన సమీకరణ జరిగినట్టూ, వారందరికీ నేను అప్రకటిత, అపరిచిత నాయకుడిని అయినట్టూ అర్ధమయింది. యాదయ్య వైపు చూసా. బీచి ఒడ్డున ఇసకలో కాళ్ళారజాపుకొని ఎదురుగా ఉన్న సముద్రాన్నీ, ఆ పైనున్న ఆకాశాన్నీ చూస్తూ, ఆ అందాన్ని ఆస్వాదిస్తున్న తాలూకు ప్రశాంతత కనపడింది నాకాయన మొహంలో. ఏమాత్రం కంగారు లేదు.

(ఏంటో, భిక్షపతి గురించి రాద్దామనుకుంటే, ఇలా యాదయ్య దగ్గరే ఆగిపోయాను. సమయం దొరికితే దీన్ని కంటిన్యూ చేస్తా.)

24 comments:

teresa said...

ఇలా అర్థాంతరంగా ఆపేస్తే చదూతున్నా వీ ఐ పీ లకి కష్టం. సమయం చిక్కించుకుని రేపీపాటికల్లా భిక్షపతి పార్ట్ తో కనబడండి :)

ఉమాశంకర్ said...

@ teresa గారు,
ధన్యవాదాలు. ప్రయత్నిస్తానండీ.

ఈవారాంతం లోపు అయితే రాయగలనే అనుకుంటున్నాను.. :)

ప్రపుల్ల చంద్ర said...

నేను కూడా భిక్షపతి ఎంట్రీ కోసం ఎదురు చూసా :)
బాగా రాసారు....

Indian Minerva said...

అయితే ఆ"తన" వారసులు మీరేనన్న మాట.

GIREESH K. said...

Nicely written. waiting for the next part...

dhrruva said...

meeee paddathi em baagoledhu.. sudden gaaa aaapesthey elaaa andi??

Mahi said...

:(

idem baledu sagam story cheppatam.

మురళి said...

బాగుంది కానీ, అసంపూర్తిగా ఉండండి.. యాదయ్య ఇంట్రడక్షన్, చివర్లో అతని వర్ణన అద్భుతం..దీని కొనసాగింపుతో పాటు, నేను నుంచి మరో టపా కోసం కూడా ఎదురు చూస్తున్నానండి..

రవిగారు said...

మీ యెరికిన ఎవరన్నా డ్రైవర్ వుంటే నాకు కూడా చూడండి . నేను ఈ మద్యనే మార్గదర్శి లో చేరా ఒక పెద్ద కార్ తీసుకుని నా చిన్న కారు ఇంట్లో వాళ్ళకి ఇచేద్దామని డిసైడ్ అయి పోయా .అయిన ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో నానో అయితేనే సేఫ్ అని పిస్తోంది . సైకిల్ వాడు వచ్చి కారు ని గుద్దిన కారు వెళ్లి సైకిల్ ని గుద్దినా కారు కే బొక్క .అరిటాకు ముళ్ళు సామెత లా .

ఉమాశంకర్ said...

@ ప్రపుల్ల చంద్ర,Indian Minerva ,GIREESH K.,dhrruva ,Mahi ,మురళి ,రవిగారు :
మీ వ్యాఖ్య లకు ధన్యవాదాలు.
@ మురళి గారు: మీరడుగుతున్న టపా నాకు గుర్తుంది. మర్చిపోలేదు, మర్చిపోను కూడా :). గత వారం రోజులుగా ఆ టపా ఎలా మొదలెట్టాలా అని తెగ ఆలోచిస్తున్నానండీ.

@ GIREESH K గారు:
అదేమిటండీ "రాధా మాధవీయం" దగ్గరే ఆగిపోయారు? నేను చాలాసార్లు మీ బ్లాగు చూసా కొత్త్తవేమన్నా రాసారేమో అని..

అందరికీ:

నాకూ ఇలా మధ్యలో ఆపెయ్యడం అస్సలు నచ్చదు. నా పద్దతికి విరుద్దం. అన్యమనస్కంగానే పబ్లిష్ బటన్ నొక్కాను.ఇకనుంచి టపా సైజు ఎంతున్నా సరే, ఇలా ఆపకూడదని నిర్ణయించుకున్నాను. :)

చిన్ని said...

చాల బాగుందండి మీరు చెప్పే విధానం, మీ యాదయ్య లానే మా హస్బెండ్ కార్ నేర్పిస్తానని తీస్కెళ్ళి , ఇక జీవితం లో డ్రైవింగ్ చేయనని నేను శపథం చేసుకునేలా చేసారండి. నేనైతే రోడ్ కి అడ్డంగా కార్ వదిలేసి ఎంచక్కా,ఇంటికివచ్చేసా .అప్పటినుండి కార్ డ్రైవింగ్ సీట్ లో ఇప్పటివరకు కూర్చోలేదు.

ఉమాశంకర్ said...

@ చిన్ని గారు:
నేనూ మీలా మొదట్లో అలానే నీరసపడ్డాను. పట్టుబట్టి నేర్చుకున్నా..now happies.. మీరుకూడా మళ్ళీ మీ రెండో దండయాత్ర మొదలెట్టండి..

చిన్ని said...

ఉమా శంకర్ గారు , మీ కొత్త పోస్ట్ చదివాను ,అక్కడ కామెంట్ రాద్దామంటే కుదరలేదు ,మీరు నిన్న నాకు ఎంతో ప్రోతాహం ఇచ్చారు ,డ్రైవింగ్ మళ్ళిమొదలు పెట్టమని ,సరేనని అనుకుని ,మా ఆఫిసీకార్ మీదే ముందు ప్రయోగం మొదలు పెట్టాలనుకున్న, ఇంతలో మీరు చేసిన ఘోరమైన accident ,దాని తాలుక మీ వేదన ,వ్యధ , ఇక నా వల్ల కాదండి ,ఇన్ని కస్టాలు . మన "వుడుత గారి " ఆత్మా కి నివాళి అర్పిస్తున్న.ఇదంతా మర్చిపోవటానికి ఈ వీకెండ్ అద్బుతంగా ప్లాన్ చేస్కొండి .

ఉమాశంకర్ said...

@ చిన్ని గారు:
అయ్యో, జరిగిన దాన్నుంచి నేను తేరుకుంటున్నాను నెమ్మదిగా.

దీని కారణంగా మీరు మీ ప్రయత్నాన్ని విరమించుకోకండి..

GIREESH K. said...

Thank you ఉమాశంకర్, for following my blog.

కాస్త పని ఒత్తిడి వలన, రాయడానికి కుదరలేదు. త్వరలో, తప్పకుండా కొత్తటపాతో మళ్ళీ ప్రత్యక్షమౌతాను.

మీరు మాత్రం చాలా చక్కగా వ్రాస్తున్నారు. అచ్చుతప్పులు అస్సలు లేకుండా, మీ రచనలు చదవడానికి చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. అభినందనలు.

ఉమాశంకర్ said...

గిరీష్ గారు,
Thank you.

పని ఒత్తిడి అంటున్నారు, అర్ధం చేసుకోగలను. I sincerely feel you should write more whenever you get some free time.

భాస్కర్ రామరాజు said...

అన్నయ్యా, ఉడత ఆత్మకి శాంతిసందేశం పంపుదాం అని అనుకుంటే కామెంటెయ్యటానికి వెసులుబాటు కలించలేదుగా మీరు...
హైద్ రోడ్లమీద కార్ నడపడం మహా ఆనందంగా ఉంటుంది నాకు, మావిడ పాపం చెవుల్లో దూది పెట్టుకునేది, అడ్డంవచ్చిన ప్రతీవోణ్ని మనం మన వాడుకభాషలో పలకరిస్తుంటే..

ఉమాశంకర్ said...

భాస్కర్ జీ,
ధన్యవాదాలండి. మైండ్ డిస్టర్బ్ అయి రాసానది. ఇక పబ్లిష్ బటన్ నొక్కబోతుండగా ఎందుకో దీనికి వ్యాఖ్యల సదుపాయం తీసేద్దామనిపించింది. దీనిమీద వ్యాఖ్యలు, దానికి నా ప్రతి సమాధానాలు ఎందుకు అనిపించి తీసేసా..

ఆహ, బావుంది, హైద్ లో నడపగలిగారంటే ప్రపంచంలో ఇంకెక్కడైనా నడపగలరు..

సుజాత said...

ఉమా శంకర్ గారు, ఈ టపా ఎలా మిస్సయ్యానో అర్థం కావట్లేదు. భలే రాశారు.

ప్రద్దానికీ అలా భయపడకూడదండీ! సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారుగా పెద్ద వాళ్ళూ! నన్ను చూడండి, I have learned driving several times! వెనకడుగు వేశానా? అప్పుడప్పుడూ కారు తీస్తూనే ఉంటా, ఒకటో, రెండో గీతల్తో ఇల్లు చేర్తూనే ఉంటా!

కానీ మరీ కాస్త దూరం వెళ్లాలంటే (ఇంటాయనకు, అప్పుడే ఏ కాన్ ఫరెన్స్ కాలో ఉంటే మాత్రం) "రాం చందర్"అని ఒక్క కేకపెడితే "జీ మేం" అని ప్రత్యక్షమవుతాడు రాముడు.
ఒకసారి వీలైతే ఇది చూడండి!
http://manishi-manasulomaata.blogspot.com/2008_04_01_archive.html

భాస్కర్ గారు!
మీరూనా! మా ఆయన కూడా అడ్డదిడ్డంగా తోలేవాడెవడైనా సరే వాడుక భాషలో ఆప్యాయంగా చెవులు చిల్లులు పడేలా పలకరిస్తూ, ఒక్కోసారి వాడిని ఐదారు కిలోమీటర్లు వెంటాడి...ఇలా తోల్తారు కారు. ఒక్కడు కూడా ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించకూడదట!

మన పాత సినిమాల్లో వందేళ్ల బట్టీ పని చేస్తోన్న డ్రైవర్ ని అయినా సరే యజమానులు "డ్రైవర్ కారాపు" అంటూ ఉంటారు గానీ ఒక్కరు కూడా పేరుతో పిలవరు. నిజ జీవితంలో అలా డ్రైవర్ ని "డ్రైవర్" అని పిల్చేవాళ్లని ఒక్కళ్ళని కూడా చూడలేదు నేను.

ఉమాశంకర్ said...

సుజాత గారు,

Thank you.

అప్పట్లో కొన్నాళ్ళు ఇండియాలో, కొన్నాళ్ళు అమెరికాలో ఉండేవాడిని. నేర్చుకొనే టైం లో టచ్ పోయిందంటే మళ్ళా మొదలెట్టాల్సిందే కదా. అలా నాది కూడా గజనీ తరహా దండయాత్రే..

మీ టపా చదివాను, చాలా బావుంది.. మీ మిగతా టపాల్లాగే.. :)

భాస్కర్ రామరాజు said...

కొన్ని కొన్ని సార్లు తగాదాలు అయ్యి, వాడుకభాష శృతిముంచిన రోజులు, ఆటోవాళ్లు వెంబడించిన రోజులు కూడా ఉన్నాయి...

Giridhar Pottepalem said...

ఉమా శంకర్,
తెలుగు లో మీ ఆలోచనలూ, రచనలూ చాలా అద్భుతంగా వున్నాయి. మీ తరువాతి పార్ట్ కోసం ఎదురుచూస్తున్నాను.
గిరిధర్ పొట్టేపాళెం

ఉమాశంకర్ said...

గిరిధర్ గారూ,

Thank you. త్వరలొనే..:)

కొత్త పాళీ said...

"లంగా వోణీ వేసుకున్న పదారణాల తెలుగుపిల్ల లాంటి హైదరాబాదు, అరంగుళం మందాన అద్దుకున్న పౌడరూ, లిప్ స్టిక్కూ, టైటు జీన్సూ, టి-షర్ట్ లతో హైటెక్కు సింగారం అందుకుంది."
సెబ్బాష్!

 
అనంతం - by Templates para novo blogger