ఇది కూడా దాదాపు ఓ ముప్పై ఆరేళ్ళ క్రితం సంగతే.
అప్పటికి నా ఎనిమిదో తరగతి క్లాసులు మొదలై రెండు రోజులే .
అప్పటికి నా ఎనిమిదో తరగతి క్లాసులు మొదలై రెండు రోజులే .
కొత్త యూనిఫాం ,కొత్త నోటు పుస్తకాలు. అప్పటికి ఇంకా టెక్స్ట్ బుక్స్ చేతికందలేదు. అయినా ఆసక్తి కొద్దీ నాకంటే ఒక తరగతి పెద్దదైన రవణమ్మ ( రమణమ్మ) దగ్గరున్న తెలుగూ,సోషలూ పుస్తకాలు తీసుకొని అసలు పాఠాలేమున్నాయా అని అలా బొమ్మలు చూస్తూ పైపైన తిరగేసా. కొత్త టెక్స్ట్ బుక్స్ చేతికందగానే వాటిని కూడా సంచిలో పెట్టుకొని బడికెప్పుడెల్తానా అని ఒకటే ఎదురు చూపులు .
తరగతిలో మిగతా వాళ్ళందరూ కనపడుతున్నారు గానీ నా ఆప్తమిత్రుడు సత్యనారాయణ జాడే లేదు.అప్పటికీ వాడింటి దగ్గరుండే తోటి వాళ్ళందరిని ఆడిగా. అందరూ మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. ఆ తరువాత ఒక రెండు రోజులకి శేఖర్ గాడు చెప్పాడు సత్తి గాడు మొన్న వాడికి సాంబయ్య టీ స్టాలు దగ్గర కనబడ్డాడనీ ,మాట్లాడబోతే తలతిప్పుకొని వెళ్లిపోయాడనీ. నాలో ఆదుర్దా ఎక్కువైంది.
ఒక రెండడుగులు పక్కకేస్తే వాడిల్లు నేను స్కూలు నుంచి ఇంటికెళ్ళే దారిలోనే. వాడి గురించి అంత ఆదుర్దా ఉన్నా ఆ రెండడుగులు పక్కకేసే స్వాతంత్య్రం లేని వయసది. స్కూలునుంచి సరాసరి ఇంటికి రాకుండా దారి మళ్ళానని ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా?
సత్తిగాడు అంతకుముందు ఒకట్రెండు సార్లు నన్ను వాడింటికి తీసుకెళ్లాడు.ఒకటే గది. అది కూడా చాలా చిన్న గది.ఆ గదిలోనే ఒక మూలన చిన్న కిరోసిన్ స్టవ్వూ,కొన్ని సత్తు వంట గిన్నెలూ. ఆ గదిముందు అంతే పరిమాణంలో పేడతో అలికిన చిన్న మెల్లా, నిలబెట్టిన రెండు నులక మంచాలూ.బహుశా రాత్రుళ్ళు అక్కడే పడుకుంటారేమో.వాడి నాన్న నాకెప్పుడూ కనపడలేదు. అడిగితే దాటేసేవాడు. వీడికి తోడుగా అక్కా తమ్ముళ్లు ఎవరూ లేరు వాడికి. అమ్మ మాత్రం ట్రంకురోడ్డు మీదున్న మిల్లులో గ్రేడింగు పనికె ళ్లేది.
తెల్ల చొక్కా- ఖాకీ నిక్కరూ మా స్కూలు యునిఫామ్. అందరి చొక్కాలు తెల్లగా తళ తళ లాడుతూ ఉంటే వాడి చొక్కా ముతక రంగులో అసలది తెలుపా?పసుపా? అన్నట్లుగా ఉండేది. నిక్కరు కూడామొద్దుగాబండకేసి బలంగా రాసినా దానికేమీ కాదనే రీతిలో ఉండేది. మా అమ్మ తరపు బంధువుల ద్వారా ఇటువంటి పరిస్థితులు నాకు పరిచయమున్నా,వీడి సాహచర్యంలో నాకవి మరింత ప్రస్ఫుటంగా కనిపించేవి.ఇంటర్ బెల్లు ( ఇంటర్వెల్ ) లో మేము ఏ జామకాయలో రేగ్గాయలో కొనుక్కోటానికి పరిగెడితే వాడు క్లాసులో అలా వంటరిగా ఉండిపోయేవాడు ఏదో ఒకటి చదూకుంటూ
ఎనిమిదో తరగతి 'అసలు' క్లాసులు మొదలయ్యాయి. అటెండెన్స్ రిజిస్టర్లు కూడా తయారయ్యాయి కానీ వాడి జాడ లేదు . ప్రతి క్లాసులో వాడి పేరు లేని అటెండెన్స్ నాకు అసంపూర్తిగా కనిపించేది. ఒక నెల గడచినా ఎప్పటికైనా వాడు వస్తాడనీ, రెండు పేర్ల మధ్య వాడిపేరు(ఆ నెలకి) రిజిస్టర్లో ఇరికించి రాస్తారనే ఆశ చావలేదు నాలో. కొత్త వాళ్ళతో నేస్తం కట్టి, చదువులో మునిగిపోయినా ఏదో రూపేణా గుర్తొస్తూనే ఉన్నాడు వాడు.
ఒక రోజు...మధ్యాహ్నం నాలుగుగంటల సమయం
భోజనాలు ఆలస్యమైనట్లున్నాయి.ఇంట్లో వాళ్లింకా మాంఛి మధ్యాహ్నపు నిద్రలో ఉన్నారు. అలికిడి చేయకుండా పుస్తకాల సంచి దేవుడి గదిలో ఒక మూల ఉంచి ఇంటి ముందు భాగంలో ఉన్న మేడమెట్ల మొదటి మలుపులో నిలబడి ఆ పిట్టగోడపై రెండు మోచేతులానించి వీధిలోకి చూస్తున్నాను. పేరుకి వేసవి కాస్త మందగించినా ఆ వేడి భరించనలవి కానంతగా ఉంది. కొలిమి పక్క నిలబడ్డట్టు ఒకటే ఆవిరి. వీధి నిర్మానుష్యంగా ఉంది.
కాస్త ముందొస్తే బేరాలెక్కువ దొరుకుతా యనుకున్నాడో ఏమో సోడాలబ్బాయి అప్పుడే వీధిలోకి మలుపు తిరిగాడు.
ఎదురింటి సామ్రాజ్యం అప్పుడే నిద్ర లేచి ఆవలించుకుంటూ తలపైకెత్తి వాళ్ళింటి జాజి చెట్టు వంక చూస్తోంది పూలెటువైపు ఎక్కువున్నాయో అట్నుంచి మొదలెడదాం అనుకుంటున్నట్టు.
ఇంతలో వీధికిటువైపు నుంచి ఎవరో సైకిల్ మీద వస్తున్నట్టు గమనించా నా కనుచివరలనుండి. ఎవరోలే అనుకొని పట్టించుకోలేదు. ఆ సైకిలు నన్ను దాటి వెళ్లిన తరువాత గమనిస్తే వాడు సత్తి గాడి లానే కనపడ్డాడు వెనకనుంచి.
వాడికి సొంత సైకిలు లేదు కాబట్టి వాడు కాదేమో అని అనిపించినా కానీ అచ్ఛం వాడిలానే ఉన్నాడే అని ఒకింత అనుమానం. "సత్తిగా" అని గట్టిగా నేను పిలవగానే ఆ మనిషి సీటు మీద నుంచి లేచి ఇంకాస్త వేగంగా సైకిలు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. నా అనుమానం బలపడింది..
మరుసటి రోజు అదే సమయానికి కాపు కాసాను. వాడు మావీధి మలుపు తిరగ్గానే మెట్లు గబ గబా దిగి వాడు నన్ను దాటిపోకుండా రెండుచేతులు బార్లా అడ్డుపెట్టి ఎదురెళ్లా "రేయ్ సత్తిగా " అంటూ. తప్పించుకునే వీలు లేక వాడు పాపం సైకిలు దిగాడు( నేలకి కాళ్ళందవు మరి).నేను ఎందుకైనా మంచిదని ఒక బ్రేకు బిగించి పట్టుకున్నా.
గుంటూరు జిల్లా ఎండలు కదా వాడప్పటికే తడిసి ముద్దయి ఉన్నాడు.జుట్టులోంచి కారిన చెమట పాయొకటి చెవి వెనుకగా జారి చొక్కా కాలరు వెనుక మాయమైంది . వాడి మొహం లో అలసట కంటే పట్టుబడ్డానన్న బాధే ఎక్కువగా కనపడుతోంది నాకు.
అప్పుడు గమనించా వాడి సైకిలు ముందు భాగానికి తగిలించిన పెద్ద అట్ట.దాని నిండా క్లిప్పులతో రక రకాల లాటరీ టిక్కెట్లు.
వాడితో ఏమి మాట్లాడానో అస్సలు గుర్తు లేదు. "ఈ లాటరీ టిక్కెట్లు ఏందిరా ?" అని అడిగుంటాను. "స్కూలుకి రావట్లేదేమిటి?" అని కూడా. బహుశా వాడు "వేరే స్కూల్లో జేరా" అని బుకాయించీ ఉంటాడు. నాకు గుర్తున్నదల్లా నిప్పులు చెరిగే ఆ మధ్యాహ్నపుటెండలో తడిసిన ముద్దయిన వాడి మొహమూ అందులో (నా కళ్ళకు) కనపడిన దిగులూను.
అదే ఆఖరు సారి వాడిని చూడ్డం.. తరువాత ఎప్పుడు చూసినా ఆ ఇంటికి తాళం వెక్కిరిస్తూ కనపడేది. (కప్పు కూలిపోయి మొండిగోడలతో పాడుబడి ఆ గది ఇప్పటికి ఉంది. )
ఆరోజుల్లో ఆర్థిక స్తొమత అంతంత మాత్రం ఉండే కుటుంబాల్లో చదువు మాన్పించి పనిలోపెట్టే ప్రక్రియలో మొదటి మలుపు ఏడో తరగతయితే ఇంకాస్త స్తొమత ఉన్నవాళ్లకి అది పదోతరగతి. ఆ సరికి వాళ్ళు ప్రయోజకులైనట్టే లెక్క చదువు పరంగా.
పన్నెండేళ్ల వయసులోనే ఇంటి బాధ్యత నెత్తి మీద పడి ఆ మండుటెండలో మావూరికి చుట్టుపక్కల ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న చిన్న పల్లెటూళ్లలో లాటరీ టికెట్లమ్మడానికి బయల్దేరిన వాడు మరి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో? అసలు నేను గుర్తున్నానో లేదో?
3 comments:
ఉమా శంకర్ గారూ, చాలా చక్కగా రాశారు.
ఉమా శంకర్ గారూ, చాలా చక్కగా రాశారు.
touching!
Post a Comment