మరచి పోయిన మొదటి జ్ఞాపకం.

Friday, October 31, 2008

ఈ బ్లాగు రాయడం మీద ఇష్టం నాకు రోజురోజుకీ పెరిగి పోతోంది. వచ్చిన ప్రతి ఆలోచననూ ఒడిసిపట్టుకొని దాన్ని బ్లాగులో పెట్టొచ్చా లేదా అని అలోచిస్తూంటే, చివరికి దాన్ని రాసినా రాయకపోయినా, ఆ ఆలోచన మాత్రం నన్ను నేను మరలా మరొక్కసారి తరచి చూసుకొనే అవకాశాన్ని కలిగిస్తోంది. ఏదో పరాకు లో ఉన్నప్పుడో, డ్రైవ్ చేస్తున్నప్పుడో ఎన్నో ఆలోచనలు. ఒకప్పుడు అవి చాలా వరకు అలా వచ్చి ఇలా వెళ్ళేవే. బ్లాగు పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఆలోచనని మధిస్తుంటే నాకు బ్లాగు రాయడానికి మించిన ఆనందం కలుగుతోంది. ఎన్నో జ్ఞాపకాలు, తారసపడే ఎందరో వ్యక్తులు, ఎక్కడో మొదలయ్యే జీవితం. చాలా దూరం వచ్చామని తెలుస్తుంది గాని ఎంతదూరం వచ్చామో తెలీదు, ఇంకెంత దూరం ఉందో అంతకంటే తెలీదు.

నా చిన్నప్పుడు మా అమ్మకంటే ముందు మా బాగోగులు చూసిన వ్యక్తి ఒకరున్నారు. ఆమే మా అవ్వ. మా నానమ్మ వాళ్ళమ్మ. నేను పుట్టే టప్పటికే తనకి దాదాపు ఎనభై యేళ్ళుంటాయేమో. అప్పటికే ఆమెకి ఏదో వ్యాధి వచ్చి నడుం వంగిపోయింది. నడుము నుంచి మొహం వరకు నేలకు సమాతరం గా ఉంచి నడిచేది. మేము తనముందే ఆమెలా నడిచి ఆమెను ఆట పట్టించేవాళ్ళం. మేము ఆట పట్టిస్తున్నా కూడా చిర్నవ్వు తో అలా మమ్మల్ని చూస్తూ మురిసిపోయేది. కోపం అనేది తన మొహంలో చూసి ఎరగను నేను. చిన్నతనం, తెలిసీ తెలియని వయసు. అయినా నాకెందుకో ఇప్పుడు ఆమెనలా ఆటపట్టించటం గుర్తుకువస్తే ఏదో క్షమార్హం కాని నేరం చేసాననిపిస్తోంది. ఆమెకి మేమే లోకం. మా బాగోగులే ఆమెకి దినచర్య. మా నలుగురు పిల్లలకి స్నానాలు చేయించటం, బట్టలు తొడగడం, అన్నం తినిపించటం, మాతో ఆడుకోవడం ఇవే ఆమె ప్రధాన వ్యాపకాలు.

భోజనాల దగ్గర అవ్వను నేను తెగ విసిగించేవాడిని. చెప్పాను కదా ఆమె అలా వంగి నడుస్తూ ఉంటే నేనువింతగా చూసే వాడినని. మా భోజనాల గది వంటిల్లు వేరు వేరు గా ఉండేవి.నేను మొదట అవ్వా పప్పు కావాలి అనేవాడిని, అది తేగానే ఈసారి నెయ్యి, ఆ తరువాత ఇంకేదో. ఇలా అన్నీ ఒక్కసారే అడగకుండా ఆమెని ముప్పు తిప్పలు పెట్టేవాడిని. ప్రతిసారి ఆమె నేనడిగింది తేవటానికి వెనక్కి మళ్ళగానే నేను ఎక్కిరింతగా నవ్వుతూ మిగతా పిల్లలకి చూపించి నవ్వేవాడిని ఎలా నడుస్తోందో చూడండి అని. నేనడిగిన ప్రతిసారి విసుక్కోకుండా పాపం రెండు గడపలు దాటి మరీ వెళ్ళి తీసుకొచ్చేది.గడప దాటడం చాలా కష్టం ఆమెకి, పైగా అవి ఎత్తు గడపలు.రెండు చేతులతో ద్వారం తాలూకు నిలువు బద్ద ని పట్టుకొని ఆ ఊతంతో దాటాల్సొచ్చేది.

నాకు నాలుగైదేళ్ళున్నప్పుడే తను చనిపోయింది. మా ఇంటి పంచలో ఉంచారు ఆమె నిర్జీవ శరీరాన్ని. నాకేమాత్రం ఏడుపు రాలేదు. అలా వింతగా చూస్తూ ఉన్నానంతే. నాకు మూడు పూటలా అన్నం పెట్టి, నా ఆలనా పాలనా చూసిన ఆ చెయ్యి అలా నిర్జీవం గా పడి ఉంటే నాకేమాత్రం కనీసం దిగులు కూడా అనిపించలేదు. ఏదో జరిగిందని తెలుసు, ఏమిటో తెలీదు.
అందరిపిల్లల్లొకి ఆమెకి నేనంటే ఎక్కువ ఇష్టమట. తను చనిపోయిన తరువాత కూడ నేను నాకు అవ్వే అన్నం పెట్టాలి అని ఏడుస్తుంటే మావాళ్ళు భయపడి ఏవో పూజలు పునస్కారాలు చేసారట.

మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా నాన్న ని అడిగాను అవ్వతాలూకు ఫోటో ఎక్కడైనా దొరుకుతుందా అని. నా ఆశ అడియాశే అయ్యింది. మా బంధువుల ఇళ్ళళ్ళో ఉండే అవకాశం కూడా లేదంట.

మరణానంతరం ఏమవుతుందో ఎవరికీ తెలీదు కదా. తను మరలా ఎక్కడైనా పుట్టిందో తెలీదు, లేదా పైన వుండి నన్ను అలా విస్తుపోతూ చూస్తూ ఉందో తెలీదు. ఈ ఒక్కమాట చెప్పాలని ఉంది. నిన్ను మర్చిపోయినా, పూర్తిగా మాత్రం మర్చిపోలేదు, అప్పుడప్పుడూ గుర్తొస్తూనే ఉంటావూ అని చెప్పాలని ఉంది.

ఈ ఉరుకులు పరుగులు ఎందాకో , ఏమి సాధిద్దామనో తెలీదు గానీ , ఈ పరుగుపందెం లో నేను మరచిపోయిన నా మొట్టమొదటి జ్ఞాపకం మా అవ్వ.

10 comments:

jyothi said...

నిజంగా మీరు మీ అవ్వ గురించి చెప్ఠూ ఉంటె నాకు కూడ మా అమ్మమ్మ గుర్థుకొచ్చ్హింది. ఇన్ని సంవథ్సరాలు గదిచిపొయినా ఇంకా మీ అవ్వ ని గుర్ఠు పెట్టుకున్నారు. అది చాలు ఆమె ఎక్కదున్నా సంథొషంగా వుండటానికి ...... జ్యొతి

ramya said...

మర్చిపోలేని జ్ఞాపకాలు...
అవ్వలు ఇచ్చిన ఆ ఆప్యాయత మనం మన పసివాల్లకి ఇవ్వగలిగితే అదే పోయిన వాళ్ళకి మనం తీర్చుకునే ఋణం అనిపిస్తుంది నాకు.

Purnima said...

Writing clarifies thoughts అంటే ఏమో అనుకున్నా గానీ, బ్లాగు ప్రయాణంలోనే అది అనుభవంలోకి వస్తుంది. ప్రతీది నిశితంగా చూస్తూ ఉండేదాన్నేమో, చూస్తున్నా అని ఇప్పుడే తెలుస్తోంది. ఆలోచనా వాహినిలో పడి మునకలేయడం .. వావ్ ఫీలింగ్!

ఇక "మరిచిపోయిన జ్ఞాపకాలు" అంటే గబగబా కొన్ని ప్రశ్నలు వచ్చేస్తున్నాయి: జ్ఞాపకాలు మర్చిపోతామా? మరుగునపడేస్తామా? మర్చిపోతే మర్చిపోయినట్టు తెలీడం కూడా జ్ఞాపకమే కదా? అసలు మర్చిపోవడం సాధ్యమా? మనం మర్చిపోయామనుకుంటూనే జ్ఞప్తికి తెచ్చుకోవడం నిదర్శనమేమో!

మిమల్ని ప్రశ్నించడం లేదు సుమా, నా ఆలోచనల్ని మీరే తట్టిలేపారు కావున ఇక్కడే పెట్టానంతే! నేనూ రాస్తానేమో జ్ఞాపకాల గురించి త్వరలో!

మంచి టపా అందించినందుకు నెనర్లు!

పూర్ణిమ (ఊహలన్నీ ఊసులై)

బొల్లోజు బాబా said...

warmth post

felt the warmth

bollojubaba

ఉమాశంకర్ said...

@జ్యొతి: మా అవ్వ స్థానాన్ని మా అమ్మమ్మ భర్తీ చేసింది. దాని గురించి మరొక్కసారి చెప్తా.

@రమ్య: బాగా చెప్పారు.


@పూర్ణిమ: ధాంక్యూ. ఆలస్యమెందుకు రాసేయండి చదివి పెడతాం..

@బాబాగారు: మీరు క్రమం తప్పకుండా నా బ్లాగు కొస్తారు. మీ వ్యాఖ్య కి నా ధన్యవాదాలు.

Sree said...

I read the Telugu blogs a lot but never attempt to write(Blog or comments). But I cant stop writing for your post.
I hate the words like Love, I love you, I miss you etc.. I feel that listening to them or saying them really artificial... like plastic flowers..
I always think that the real love, like, affection will not sound, they will give a feel...
Now I can see another instance of such feel from you on another human(your avva). She wont die for ever.. she will live in your Thoughts... I am reading this post at very late hours of my work now. Tears turned in my eyes.. I just remembered my mom who is far away in India now. (being the last kid of my family, only my Maternal Grand Mother was alive when I was born, but she used to live with my Maternal uncle, so, I almost didn't get that unspoken love and affection of grand parents..) thanks for your post..

ఉమాశంకర్ said...

@Sree:

I can feel what you meant. I strongly feel it is so inhuman if we don't remember those elderly people who felt we are the extn of their lives. Its pure love, they expect nothing in return. They know they won't be there for long.

Even while writing that post i was so emotional about my great grand maa and equally ashamed of running after something in life by burying all those memories. After writing now i have a little sense of satisfaction that i have reinstated her in my thought process..

BTW, Thanks for commenting.

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by a blog administrator.
Vinay Chakravarthi.Gogineni said...

kanneelu vachhay......naku ma amamma garu tatagaru esp taatagarito....ilanti relation vundedi.........recent ga chanipoyaaaru..........gurtuvachhinappudalla............chaala badha anipistundi...........

ఉమాశంకర్ said...

@ వినయ్ గారు,

I can understand what you are going through.

జ్ఞాపకాలు పదిలపరచుకొని ముందుకు సాగండి.

 
అనంతం - by Templates para novo blogger