ఇది కథ కాదు

Thursday, November 12, 2009

"ఏమిటి, వెళ్ళక తప్పదా?"

"నీ ఇష్టం"

మూడక్షరాల సమాధానమైనా , ముప్పై మూడు విరుపులు వినపడ్డాయి నాకు.

అలవాటు ప్రకారం టీవీ కింద డీవీఆర్ కి ఉన్న ఎలక్ట్రానిక్ క్లాక్ వైపు దృష్టి సారించాను. సమయం సాయంత్రం ఏడు గంటలు.

కిటికీ వైపు తల తిప్పాను. నవంబరు నెల. అప్రయత్నంగా పొద్దున్న చూసిన వెదర్ రిపోర్ట్ గుర్తుకొచ్చింది. సన్ సెట్ ఎట్ 4:30. నాలుగున్నరకే సూర్యాస్తమయం. ఏడింటికే దట్టమైన చీకట్లు. రాత్రి పదో పదకొండో అన్నట్లుగా ఉంది. రాత్రికి వర్షం పడొచ్చు అని చదివినట్టు గుర్తు. ఆరింటప్పుడు ఆఫీసులోంచి బయటకు వస్తున్నప్పుడే ఎందుకో అనీజీగా అనిపించింది. నవంబరు మాసం చలికితోడు ఒక మోస్తరు బలంగా వీస్తున్న గాలి.చల్లటి గాలి...వర్షం పడబోయేముందు వీచే చల్లటి గాలి...

"ఒక కప్పు కాఫీ ఇస్తావా మరి, త్వరగా తాగి బయల్దేరుదాం? "సోఫాలో కూర్చొనే తలతిప్పకుండా అడిగా.

సమాధానంగా అన్నట్టు నావెనుక ఫ్రిజ్ తలుపు తెరచిన చప్పుడు.ఆతరువాత పాలు కప్పులోకి వంచుతున్నప్పుడు వచ్చే శబ్దం. ఒక రెండు క్షణాల తరువాత మైక్రోవేవ్ చేసే సన్నని శబ్దం.

సోఫాలో కూర్చునే పూర్తిగా ముందుకువాలి విప్పిన షూ లేసులు మళ్ళీ కట్టుకుంటూ చివరి ప్రయత్నంగా అడిగా.

"ఇంతకీ ఈరోజు వెదర్ రిపోర్ట్ చూసావా?"

కిటికీలోంచి బయటికి చూస్తూ అంది. "లేదు. బానే ఉన్నట్టుందిగా?"

మారుమాట్లాడకుండా తనిచ్చిన కాఫీ తాగి ఇద్దరం అపార్ట్ మెంటు బయటికొచ్చాం. చల్లగాలి విసురుగా తగిలింది. అంతకు రెండు నిముషాల క్రితం తాగిన వేడి వేడి కాఫీ నా వంట్లో వణుకునేమాత్రం ఆపలేకపోయింది.

కారు స్టార్ట్ చేస్తూ నాలోనేను అనుకుంటున్నట్టే పైకన్నాను "వర్షం ఉన్నట్లుంది ఈరోజు"

కారు టేలర్ రోడ్డు మీదకి తిరిగింది. దానిమీద ఒక రెండు మైళ్ళు వెళితే 91 వస్తుంది. దానిమీద ఉత్తర దిక్కు దాదాపు పదిహేను మైళ్ళు వెళితే నేను చేరాల్సిన గమ్యం దాదాపు చేరినట్టే. హైవే మీద అస్సలు ట్రాఫిక్ లేదు. అక్కడక్కడ ఒకటీ అరా కార్లు కనపడటం తప్పితే రోడ్డంతా ఖాళీ. ఎక్కడో ఒక కారు కనపడుతుంది. ఒక రెండు నిముషాలాగి చూస్తే కనపడదు. నావెనకాలె ఏదో ఒక ఎగ్జిట్ లోకి జారుకుంటూ కనపడుతుంది అద్దంలో.

ఆతరువాత కాసేపు ఒంటరిప్రయాణం.... ఇంకోకారు కనపడేదాకా.

కారులో పూర్తి నిశ్శబ్దం. అస్సలు మాటలు లేవు. నా చూపు కారులోని స్టీరియో మీదకి మళ్ళింది. ఆన్ చేద్దామా అనిపించిందొక క్షణం. ఆఫీసులో పోద్దుటినించి ఊపిరిసలపని పని తాలూకు అలసటో , నాయిష్టం లేకుండా బలవంతంగా బయల్దేరిరావటమో, ఏదయితేనేం చేయి ముందుకు చాచి స్టీరియో ఆన్ చేయటానిక్కూడా ఓపిక లేనంత నిస్సత్తువ, నిరాసక్తత.

హఠాత్తుగాగుర్తొచ్చి అడిగాను, "ఇంతకీ షాపు ఎప్పటివరకు ఉంటుంది? ఫోన్ చేసి అడిగావా?"

"లేదు"

"కనుక్కోవాల్సింది" సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాను, నా జేబులోంచి సెల్ ఫోన్ తీస్తూ.

తను కూడా తన సెల్ ఫోన్ తీస్తూ అంది. "నువ్వు డ్రైవ్ చెయ్యి. నేను కనుక్కుంటాను"

ఫోన్ కాసేపు చెవికానించుకొని, ఏదో విని నావైపు తిరిగింది. తల పూర్తిగా తిప్పకుండా, కను చివరల నుండే తన మొహంలో కనిపించే భావాన్నిపసిగట్టాను నేను.

పాల గ్లాసు ఒలకబోసిన చిన్నపిల్లాడు, మరుక్షణం , దాన్ని గమనించిందేమో అని చప్పున అమ్మవైపు చూసి పడే తత్తరపాటు, వెనువెంటనే పడే భయం , తరువాత తోడు తెచ్చుకొనే బింకం. ఇవన్నీ కనపడ్డాయినాకు తనలో. ఆతరువాత వాటన్నిటినీ తుడిపేస్తూ నిరాశ. నిరాశని గమనించినా, గమనించనట్టు నటిస్తూ అడిగాను.

"ఏమిటంట?"

"ఈరోజు సిక్స్ కి క్లోజ్ అనుకుంటా. ఫోన్ ఎవరూ ఎత్తడంలేదు. వాయిస్ ఆన్సరింగ్ సిస్టం కేల్తోంది."

టైము చూసా . ఎనిమిదయింది. పొద్దున్న చూసిన వెదర్ రిపోర్ట్ ప్రభావమో , లేక నిజంగానే అలాఉందో తెలీదుగాని ఆకాశం బాగా మేఘావృతం అయిఉందని అనిపించింది నాకు. చుట్టూ చిమ్మ చీకటి.

"ఏం చేద్దాం మరి?"

షాపింగుల విషయంలో నిర్ణయమైనా తన నోటినుంచే రావాలి.అనుభవం నేర్పిన పాఠం.

"ఇంటికెళ్దాం. కారు వెనక్కు తిప్పు."

అప్పుడే నా కళ్ళ బడ్డ ఎగ్జిట్ నంబరు ని బట్టి హైవే మీద దాదాపు పదిమైళ్ళ పైనే వచ్చినట్టు నాకర్ధమయింది. నెక్స్ట్ ఎగ్జిట్ ఇంకొక అరమైలు దూరంలో ఉంది. ఎసెక్స్ విలేజ్ ఎగ్జిట్.

"ఎసెక్స్ విలేజ్ , ఈపేరు ఎప్పుడైనా విన్నావా?" సాలోచనగా అడిగా. తెలీదన్నట్టుగా తలూపింది. మళ్ళా నేనే అన్నా

"అయినా మనకెందుకు. ఎగ్జిట్ తీసుకొని. జాగ్రత్తగా వెనక్కి వెళ్ళే రోడ్దేక్కితే సరి"

వర్షం మొదలైంది.

మొదట్లో టాప్ టాప్ మంటూ విడి విడిగా విండ్ షీల్డ్ ని ముద్దాడిన చినుకులు నేను వైపర్లు ఆన్ చేద్దామనుకోలోపే పూర్తిస్థాయి వర్షపు రూపు సంతరించుకున్నాయి. నాకు కుడివైపు ఆకాశంలో ఒకటే మెరుపులు. గాలి వేగం పెరిగినట్టు తెలుస్తోంది. కారుని నా డ్రైవింగు లైన్లో కుదురుగా ఉంచాలంటే రెండుచేతులతో స్టీరింగుని గట్టిగా పట్టుకోవాల్సి రావడమే దానికి సాక్ష్యం. గాలి కారుని ఒకవైపుకు తోసేస్తోంది.

నాకు నేను ధైర్యం చేప్పుకోడానికన్నానో , లేక తనకి ధైర్యం చెప్పదానికన్నానో గాని మొత్తానికి పైకనేసాను..

బాగా గాలి ఉంటే వర్షం ఎక్కువసేపు పడదట".

ఎసెక్స్ విలేజ్ ఎగ్జిట్ తీసుకున్నాను. కారు వేగం బాగా తగ్గించాను. తనకి డ్రైవింగు రాకపోయినా డైరక్షన్ల విషయంలో తను నాకు చాలా చేదోడు వాదోడుగా ఉంటుంది.

తనతో చెప్పాను. "91 సౌత్ ఎటుందో చూడు"


వర్షం బాగా పెరిగింది. ఒక ఐదు మీటర్ల ముందేముందో కూడా కనపడటం లేదు. అలాంటప్పుడు రహదారులని సూచించే బోర్డులు కనపడతాయని ఆశించటం అత్యాశే. చాలా వరకు హైవే దిగిన ఒక పావుమైలు లోపే తిరిగి వెనకి వెళ్ళే హైవే తాలూకు బోర్డులు కనపడతాయి.

"ఏం చేద్దాం , కారు పక్కకి తీసి ఆపనా?".

నిజానికి
ఇప్పుడు నేను హైవే ఎగ్జిట్ రేంప్ మీద ఉన్నానో, లేక హైవే పూర్తిగా దిగి లోకల్ రోడ్డు మీదకు వచ్చానో కూడా తెలీని పరిస్థితి. సింగిల్ లైనో, డబల్ లైనో , రోడ్డు మధ్యలో ఉన్నానో, లేక షోల్డర్ లో ఉన్నానో. అంతా అయోమయం.

"ఆపకు.స్లో గానే కాస్త ముందుకి పోనీ"

జాగ్రత్తగా ముందుకు పోనిస్తున్నా. అన్ని సార్లు కాకపోయినా , కొన్ని కొన్ని సార్లు సైన్ బోర్డు మిస్సయ్యామంటే తరువాత అధమపక్షం ఒక అరగంట పైనే పడుతుంది తిరిగి మనం ఎక్కాల్సిన రోడ్డు ఎక్కటానికి. ఇటువంటి వాతావరణంలో అరగంట అంటే అదృష్టంకిందే లెక్క.

పిడుగు పడిన శబ్దం. ఎక్కడో కాదు , పక్కనే పడినంత భయంకరంగా ఉంది శబ్దం. నాకు ఎడమవైపున ఏవో లైట్లు. గ్యాస్ స్టేషను అయ్యుండొచ్చు. కారు నెమ్మదిగా ముందుకు వెళ్తోంది.

"ఏమయినా బోర్డులు కనపడ్డాయా?"

"ఇంకా నెమ్మదిగా పోనీ ఇక్కడ ఏదో బోర్డు కనపడుతోంది."

"అబ్బా ఇదో తలనొప్పి "కారు విండ్ షీల్డ్ పైన పేరుకుంటున్న ఆవిరిని గమనించి అన్నాను.గబ గబా కారు డీఫ్రాస్టరు ఆన్ చేశా. అప్పుడప్పుడు అది సరిగా పనిచేయదు.చూస్తుండగానే ఆవిరి విండ్ షీల్డ్ అద్దం అంతా అల్లుకుపోయింది. ఇంకొక నిమిషం వ్యవధిలో నాకారు వెనక గ్లాసు మీదా, కారు డోరు అద్దాలన్నిటిమీద ఆవిరి అల్లుకుపోయింది.

కారు ఆగకుండా వెళ్తూనే ఉంది. ముందు ఏముందో అస్సలు కనపడటం లేదు.

" పేపర్ నేప్కిన్ అందుకో, అర్జంట్"

ఒకచేత్తో డ్రైవ్ చేస్తూనే తనిచ్చిన నేప్కిన్ తో గబగబా నావైపు విండ్ షీల్డ్ మీద ఆవిరిని తుడిచాను.ఇంతలో తను హఠాత్తుగా అరిచింది...

"ఇక్కడ రైట్ తీసుకో"

"ఎక్కడ?"

"ఇక్కడే ఇక్కడే , దాటి పోతున్నావ్ " చాలా ఫ్రాంటిగ్గా అరిచింది.

"91 సౌతేనా?

"అనుకుంటా"

ఏదయితే అవుతందని కారు బర బారా రైటుకి తిప్పేసాను. ఏదో గుంతలోకి దిగి కారు ముందు భాగం బలంగా నేలకు గుద్దుకున్న చప్పుడు. చటుక్కున బ్రేక్ మీదకి కాలు వెళ్ళింది. కారాగిపోయింది.

అసహనంగా అరిచాను. "అసలిక్కడ రోడ్డుందా?

కొద్దిగా రివర్స్ తీసుకొని , తనని హెచ్చరించకుండానే తన వైపు అద్దం కిందకి దించాను. బయట గాలి ఎంత బలంగా ఉందో అర్ధమయింది. తన మొహం పూర్తిగా తడిచిపోగా, కెవ్వున కేకేసింది.పట్టించుకొనే స్థితిలో లేను నేను. కళ్ళు చికిలించి చూసా. నిజమే , ఏదో రోడ్డు ఉన్నట్టుంది. కారు రోడ్డెక్కింది.,నెమ్మదిగా..

ఒక మైలు, మైలున్నర వెళ్ళాక అక్కడ ఎక్కడా హైవే కి దారితీసే ఆనవాళ్ళేమీ లేవు.

"సరైన దార్లోనే ఉన్నామంటావా?"

"నాకేం తెలుసు. నువ్వు తిప్పమన్నావు , నేను తిప్పాను" నాలో అసహనం..

వర్షం ఏమాత్రం తగ్గలేదు. వర్షం ధాటికి అనుకుంటా,చుట్టూ ఉన్న చీకటి పదిరెట్లు పెరిగినట్లనిపిస్తోంది. కన్నుపొడుచుకున్నా రోడ్డుపక్కన ఏముందో కనపడటంలేదు. కారు పోతూనే ఉంది. ఒకటి రెండు సార్లు నాకిలాంటి అనుభవమే ఎదురయింది. అయితే అది పగటిపూట. ఒకసారయితే "యు" టర్న్ తీసుకోవటానికి కూడా వీలు లేనటువంటి సన్నని ఇరుకైన రోడ్డుమీద దాదాపు పదిహేను మైళ్ళు ప్రయాణించాల్సి వచ్చింది. అప్పుడు రోడ్డుకి రెండువైపులా పొలాలు. నరమానవుడు లేదు. చివరికి గతిలేక అతికష్టం మీద "యు" టర్న్ తీసుకొని , వచ్చిన దారెంటే వెనక్కి వచ్చి హైవే ఎక్కడం జరిగింది.

నా వెన్ను జలదరించింది. కొంపతీసి ఇప్పుడలాంటి రోడ్డుమీదే ఉన్నానా?

అకస్మాత్తుగా నేను అప్పుడెప్పుడో చూసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా "బ్లాక్ కాడిలాక్" గుర్తుకొచ్చింది. అందులో ఇలాగే దారితప్పిన ఒక కారు చిమ్మ చీకట్లో, దారితెన్నూ లేకుండా , అడవిమధ్యలోంచి, ఒక సన్నని రహదారిపై వెళ్తూ ఉంటుంది. పైనుంచి తీసిన షాట్ బాగా గుర్తుంది . అడవి మధ్యలో సన్నని దారి, చీకటిని చీలుస్తూ కారు హెడ్ లైట్లు. రాబోయే ఉపద్రవం వైపు పరిగెత్తే కారు. దానికీ నాకూ తేడా అల్లా సినిమాలో వారిని దారి పొడుగూతా ఒక బ్లాక్ కలర్ కాడిలాక్ వెంబడిస్తూ ఉంటుంది. నా అదృష్టంకొద్దీ ప్రస్తుతానికి నాకా భయంలేదు. అలాంటిదేమీ లేదనుకుంటూనే, ఎందుకైనా మంచిదని రియర్ వ్యూ అద్దం వైపొకసారి చూసి, నిర్ధారించుకొని, నాలోనేనే నవ్వుకున్నాను అంత టెన్షన్లోనూ.

ప్రకృతి ముందు మనిషి ఎప్పటికీ బలహీనుడే అని చెప్పటానికి, వాయుగుండాలు సృష్టించే వరద భీభత్సాన్నో, టొర్నడో వలయ విధ్వంసాన్నో, లేదా సునామీలనో ఉదహరించనక్కరలేదు. 24 గంటలకొకసారి ప్రకృతి కప్పే నల్లటి దుప్పటిచాలు, మన మనుగడ ఎవరి దయా దాక్షణ్యాలమీద అధారపడిఉందో చెప్పటానికి. దానికి తగ్గట్టు మనం మన జీవితాల్ని సవరించుకోవాల్సిందే మరి.మా అపార్ట్ మెంట్లలో మాదే చిట్టచివరి అపార్ట్ మెంటు. అపార్ట్మెంటు ఆవలివైపు అంతా అడవిలా ఉంటుంది. దట్టమైన చెట్లు. రాత్రుళ్ళు నాకు వైపు కిటికీ తెరవాలన్నా భయం. సినిమాలెక్కువ చూస్తానేమో, "ఆచెట్లలో ఎవరో ఉండి మా కిటికీ వైపే చూస్తుంటారేమో, ఎందుకు వాళ్ళ కళ్ళలో పడటం?" లాంటి ఊహలొస్తుంటాయినాకు. అదే కిటికీలోంచి తెల తెల వారే ఉదయాన్ని చూడటమంటె నాకెంతో ఇష్టం. ఆకురాలే కాలాన్ని మినహాయిస్తే సంవత్సరం అంతా చక్కటి, చిక్కటి పచ్చదనం. కానీ అదేమిటొ రాత్రయ్యేసరికి ఆహ్లదం స్థానంలో భయం చోటు చేసుకుంటుంది. పొద్దునలేచి "దీన్ని చూసా నేను భయపడింది" అని నవ్వుకుంటుంటాను. బహుశా రేపు నేను మళ్ళా ఇదే రోడ్డు మీద పగటిపూట రావల్సివస్తే ఇప్పటి నా భయాన్ని తలచుకొని అలాగే నవ్వుకుంటానేమో.


రోడ్డుమీద గుంటల్లో పడ్డట్టు కారు దడ దడ లాడింది. దానికి కొద్ది క్షణాల ముందు కనపడ్డ "X" మార్కుని బట్టి అర్ధమయింది,. గుంటలు కాదు,రైలు పట్టాలు. రైల్ రోడ్ క్రాసింగన్నమాట. లోకల్ మ్యాప్ లో ఎప్పుడైనా రైల్వే ట్రాక్ చూసిన గుర్తేమైనా ఉందా అని కాసేపు ఆలోచించా. ఊహు.. లాభం లేదు.

మలుపు తీసుకున్నాక ఒక ఏడెనిమిది మైళ్ళు వచ్చే ఉంటాం. హైవే కనపడే ఆశలు ఇద్దరిలోను అడుగంటాయి. దానిస్థానంలో దారి ఎంచుకున్నందుకు పశ్చాత్తాపం.

ఇక లాభం లేదని, జాగ్రత్తగా కారు రోడ్డువారగా ఆపి పార్కింగ్ లైట్లు ఆన్ చేశా. హఠాత్తుగా గుర్తొచ్చి కారు ఫ్యూయల్ ఇండికేటరు వైపు చూసా. గుండె ఆగినట్టయింది. గేస్ అయిపోయినట్టు సూచించే లైటు వెలిగాక నాకారు మహా అయితే ఒక ముప్పై మైళ్ళు ప్రయాణించగలదు. నేను ఆఫీసునుంచి వచ్చేటప్పుడే లైటు వెలిగినట్టు గుర్తు. ఈలెక్కన ముప్పైమైళ్ళు ఎప్పుడో పూర్తయిఉంటాయి. సో, కారు క్షణమైనా ఆగిపోవచ్చు. ఆలోచన వచ్చిందే తడవు టక్కున ఇంజను ఆఫ్ చేశా.

నిశ్శబ్దం. పార్కింగ్ లైట్ల తాలూకూ టిక్కుం టిక్కుం అనే శబ్దం భయంకరంగా వినపడుతోంది. బయట ధారగా కురుస్తున్న వర్షం. చుట్టూ పరచుకున్న చిక్కటి చీకటి. నిర్మానుష్యమైన రోడ్డు మీద కారులో మేమిద్దరమే. ఎక్కడున్నామో కూడా తెలీని స్థితిలో..

ఇంతలొ నా కళ్ళ ముందు ఏదో చిన్న వెలుగు మెరిసినట్టయింది. రియర్ వ్యూ అద్దంలో ఏదో వెలుగు. టక్కున తల తిప్పి వెనక్కి చూసి అన్నా.

"మన వెనక ఎవరో వస్తున్నట్టున్నారు."

"ఎవరో మనలాగా దారి తప్పారేమో?"

రియర్ వ్యూ అద్దంలో వెలుగు తీవ్రతని బట్టి కారు మాకు బాగా దగ్గరయిందని నా కర్ధమయింది. ఇంకొక పావు నిమిషంలో మమ్మల్ని దాటి మా పక్కనుంచి వెళ్లి , సడన్ బ్రేక్ వేసినట్టు టక్కున ఆగిపోయింది. గబ గబా నేప్ కిన్ తో విండ్ షీల్డ్ ని మరొక్కసారి తుడిచాను. ఈసారి స్పష్టంగా కనపడుతోంది. పాతిక ముప్పై యేళ్ళ నాటి డొక్కు షెవీ వేన్ .

నా మనసులో ఏవేవో ఆలోచనలు. ఎందుకాపి ఉండొచ్చు? మాలాగే దారి తప్పారా? నాకారు రోడ్డువార పార్కింగ్ లైట్లు వేసి కనపడేసరికి మాకు సహాయం చేద్దామని ఆపారా?లేక...

నాచెయ్యి ఇగ్నిషన్ కీ చుట్టూ బిగుసుకుంది. వెనక్కి ఎలాగూ తిరగలేను. వేన్ పక్క నుంచి ముందుకు దూసుకెళ్ళటానికి తగినంత స్థలం ఉందాలేదా అనేది అంచనా వేస్తోంది నా మనసు. ఇంకొకసారి కళ్లు చికిలించి వేన్ వైపు చూసా. డ్రైవరు వైపు డోరు ఒక క్షణం తెరుచుకొని, వెంటనే మూసుకొంది. నా మనసెందుకో ప్రమాదాన్ని శంకించింది.

***********************************************
ఒక రెండు గంటల తర్వాత.....

ఇంకా వర్షం పడుతూనే ఉంది.

రిక్లయినర్ సోఫాలో వెనక్కివాలి, వెచ్చగా దుప్పటి కప్పుకొని , టీవీ చూస్తూ నేను..గాఢ నిద్రలో తను..
(ఇంక లేదు, మీన్, సమాప్తం :) )

32 comments:

సుజాత said...

మొత్తం ఎంత సస్పెన్స్ తో నడిపించారంటే మీ ఇద్దరితో పాటు వెనకసీట్లో నేను కూడా ఉన్నాను మరి మీరు చూళ్ళేదు గానీ ! మీతో పాటే తీసుకెళ్ళారు. ఉమా శంకర్ గారు,లాభం లేదు, మీరు రెగ్యులర్ గా కథలు రాయాల్సిందే! లేకపోతే ఒప్పుకునేది లేదు.

కానీ, ఇంత పట్టుతో, పకడ్బందీ గా నడిపించిన కథను చివరికి "కల" గా తేల్చెయ్యడం చాలా రచయితలు చేసే క్షమించరాని తప్పు. మీరూ అదే తప్పు చేశారు కాబట్టి శిక్షగా ఇంకో కథ వెంటనే రాయడమే మరి! అర్జెంటు!

భావ వ్యక్తీకరణ చాలా ప్రొఫెషనల్ గా ఉంది నిజంగా! ఆల్ ది బెస్ట్! తరచుగా రాస్తూ ఉండాలి మీరు..కథలు!

Malakpet Rowdy said...

I dont think its a dream.

"ఒక రెండు గంటల తర్వాత" gives it a different dimension. But a very nice narration though.

ఉమాశంకర్ said...

సుజాత గారూ,
మిగతా వారు కూడా అది "కల" అనుకోకముందే నా వివరణ.

అక్కడక్కడా కొద్ది అతిశయోక్తి అలంకారం తప్పితే ఇది నిజంగా (నిజ్జంగా) జరిగిందే. కల కాదు. అందుకే "ఇది కథ కాదు" :)

ధన్యవాదాలండీ..

భవాని said...

Wow! it is sooooooo absorbing. I agree with sujatha garu. I think you should keep writing frequently.

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగా రాసారండీ...సినిమా చూస్తున్నట్టే అనిపించింది...

KumarN said...

Whoa!! So engaging..
I knew that it was a real incident..By the way who was the savior or was there one?

చిన్ని said...

మీరు రెగ్యులర్ గా కథలు రాయాల్సిందే ...మాటల్లో చెప్పలేను ...ఎంత బాగుందో !

KumarN said...

Whoa.. So engaging..
I knew that it was a real incident. By the way who was the savior, or was there one?

సిరిసిరిమువ్వ said...

ఇంతకీ ఆ వానులో ఉంది ఎవరో మీరు ఇంటికి ఎలా చేరారో చెప్పనే లేదు!

కథ మాత్రం చాలా అద్భుతంగా ఆ సంఘటన నా పక్కనే జరుగుతున్నట్లుగా నడిపించారు. నా ఆఫీసు పని కూడా పక్కన పెట్టేసి మీ కథ చదువుతూ కూర్చున్నాను.

మీ నుండి ఇలాంటి మరిన్ని మంచి కథలు రావాలని ఆశిస్తున్నాను.

Karuna said...

bagundandi mee story. suspense to champesaru, edo horror movie chustunnattu anipinchindi nakaite. kakapote climax nachaledu naku manchi suspence point deggara samaptam anesaru. asalu intiki ela cheri vuntara ani nenu enta sepu alochinchano :-),
memu kuda ilanti situation face chesamu kakapote maree highway ekkaledu, main road meedane one hour tiragalsi vachindi, almost accident ainanta pani aindi. bale thrilling experience.
Annattu malanti valla kosamaina meeru regular ga edo okati rayochu kadandi. meeru eppudeppudu blog rastara ani eduru chudalsi vastundi.

మాలా కుమార్ said...

మీ కల , కథ కాని , " ఇది కథ కాదు " బాగుంది .

మురళి said...

మీకు బద్ధకం అనేది ఒక్కటి లేకపోతేనా(ఇది నా ఫిర్యాదు సుమా) .. యెంత మంచి టపాలు వచ్చేవో రెగ్యులర్గా.. ఈ టపా విషయంలో అందరి మాటే నాదీను.. కలాన్ని ఆపకండి..

పరిమళం said...

అంత ఉత్కంఠ భరితంగా రాసి .....చివర్న ఎంత సింపుల్ గా ముగించేశారు ? నిజమే మీరు కధలు తరుచూ రాయాల్సిందే ..

sunita said...

చాలా బాగా రాశారు. మిగిలినదంతా అందరూ పైన చెప్పేసారు.

Sravya Vattikuti said...

వావ్ ! చాల చాల బాగుంది ! కాకపోతే ఆ పరిస్థితి లో మీరు ఎంత టెన్షన్ పడిఉంటారో :(

నిషిగంధ said...

నెరేషన్ చాలా చాలా బావుంది! సుజాత చెప్పినట్టు మీ వెనుక సీట్లో కూర్చున్న ఫీలింగ్ కలిగింది..

"ప్రకృతి ముందు మనిషి ఎప్పటికీ బలహీనుడే అని చెప్పటానికి, వాయుగుండాలు సృష్టించే వరద భీభత్సాన్నో, టొర్నడో ల వలయ విధ్వంసాన్నో, లేదా ఏ సునామీలనో ఉదహరించనక్కరలేదు. 24 గంటలకొకసారి ప్రకృతి కప్పే ఈ నల్లటి దుప్పటిచాలు, మన మనుగడ ఎవరి దయా దాక్షణ్యాలమీద అధారపడిఉందో చెప్పటానికి. "

SO TRUE!!

అసలు ఇలా దారి తప్పినప్పుడు 'నువ్వే చెప్పావ్.. లేదు నువ్వే తిప్పేశావ్ ' అంటూ ఒకరిమీద ఒకరు అరుచుకుంటూ ఇంకొన్ని తప్పులు చేస్తాం.. నిజంగా ఆ పరిస్థితుల్లో భూదేవికున్నంత సహనం ఉండాలి!

మేధ said...

కధ కాని కధలో కధనం చాలా బావుంది..

శ్రీనివాస్ చింతకింది said...

మీ కథ కాని కథ చాల బాగుంది. నేను చెప్పాల్సిందంతా అందరు ఆల్రెడీ చెప్పేసారు. మీరు తరుచుగా ఏదో ఒకటి రాయాల్సిందే.

కొత్త పాళీ said...

very well done.
కథలు రాయాలి అన్న డిమాండుకి నా గొంతుకూడా కలుపుతున్నాను.

teresa said...

Very skillful narration !!

ప్రవీణ్ గార్లపాటి said...

ఇంత మంది కథ వ్రాయమన్నాక ఇక మీరు వ్రాయాల్సిందే :)
చాలా బాగుంది. ముగింపే మరీ ఠక్కున అయిపోయింది.

ramya said...

ఇది కథ కాదు! చక్కటి కథలా మలిచారు. వెనకసీటులో కూర్చున్నట్టుగా కాదు స్వయంగా ప్రయాణం చేస్తున్నట్టుగానే ఫీలింగ్ ఎందుకంటే ఓ సారి నాకూ ఇలాంటి అనుభవం కలిగింది.
(మీ కారులో ఇద్దరే ఐతే, మా వెంట చంటాడు,ముచ్చటగా ముగ్గురం. తెలియని కొంDa దారిలో చిమ్మచీకటి గతుకులరోడ్డులో...దాదాపు ఇరవై మైళ్ళు. అబ్బో అదిక్కడ రాస్తే మీకథకంటే పెద్దదైపోయెట్టుంది.)

ఉమాశంకర్ said...

వ్యాఖ్యలు రాసిన అందరికీ నా ధన్యవాదాలు.

@Malakpet Rowdy ఓపిగ్గా చదవటమే కాకుండా, మీ ఆలోచన పంచుకున్నందుకు థాంక్స్:)

@భవాని, శేఖర్, చిన్ని : ధన్యవాదాలు.

@KumarN, సిరి సిరి మువ్వ ,Karuna: నిడివి ఎక్కువైపోతుందని కావాలనే రాయలేదండీ.
పైగా అలా క్లుప్తంగా రాస్తేనే బావుంటుందనిపించింది అప్పుడు. వాళ్ళు వేను ఎందుకు ఆపారో నాకు తెలీదు. ఆ రెండు నిమిషాలు నేను చాలా టెన్షను పడ్డాను. అవసరమైతే నేనే వారి దగ్గరికి వస్తానని వాళ్ళు వెయిట్ చేసారేమో? నాకెందుకో నేను అంతకుముందు చూసిన లైట్లు గేస్ స్టేషనువే అయి ఉంటాయని నమ్మకం కలిగింది. తెలీని దారిలో వెళ్ళే కంటే తెలిసిన (?) దారి బెటరనిపించి, ఊపిరిబిగపెట్టి, వాళ్ళు వెళ్ళిన తరువాత, "యు" టర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళాము. అది గేస్ స్టేషనే. అక్కడ కనుక్కుంటే తెలిసింది హైవే అక్కడిక అరమైలు దూరం...అంటే మేము పూర్తి వ్యతిరేక దిశలో వెళ్ళామన్నమాట.. అదీ సంగతి..

@మాలా కుమార్,పరిమళం,sunitha , మేధ, శ్రీనివాస్ చింతకింది , కొత్తపాళీ, teresa, ప్రవీణ్ గార్లపాటి : ధన్యవాదాలు

@ మురళి: బద్దకం పాళ్ళు తక్కువేనండీ..ఒక పది శాతం ఉంటుందేమో..ఆఫీసు టెన్షన్స్, ఇంకా మరికొన్ని చికాకుల వల్ల ఆలోచనలు కుదురుగా ఉండవు. ఏదో సగం రాయడం, మధ్యలో ఆపేయడం..బుద్ది పుడితే,ఆ టాపిక్ మీద ఇంకా ఆసక్తి ఉంటే, ఆ వదిలేసిన వాటిని పూర్తిచేయడం..ఏదో అలా జరిగిపోతోంది.. :)

@Sravya Vattikuti : మామూలు టెన్షన్ కాదు.. చాలా .. :)

@ నిషిగంధ: అవునండీ. అయితే నేను గమనించిందొకటుంది. (చాలా వరకు) ఎవరు డ్రైవ్ చేస్తున్నాగాని, పాసింజరు సీటుకి డ్రైవరు సీటు ఎప్పుడూ లోకువే.. ధన్యవాదాలు..

ఉమాశంకర్ said...

@Ramya : ధన్యవాదాలు. అలాగా? రాసేయండి మరి, మేం చదివేస్తాం..ఇలాంటివి వేటికవే ప్రత్యేకం ..

ramya said...

అడిగారూ... ఐతే వినండి :) (చదవండి):)
"ప్రకృతి ముందు మనిషి ఎప్పటికీ బలహీనుడే అని చెప్పటానికి, వాయుగుండాలు సృష్టించే వరద భీభత్సాన్నో, టొర్నడో ల వలయ విధ్వంసాన్నో, లేదా ఏ సునామీలనో ఉదహరించనక్కరలేదు. 24 గంటలకొకసారి ప్రకృతి కప్పే ఈ నల్లటి దుప్పటిచాలు, మన మనుగడ ఎవరి దయా దాక్షణ్యాలమీద అధారపడిఉందో చెప్పటానికి."
నిజం!
ఎత్తైన కొండలూ అడవీ పగటిపూటే గుబులు తెప్పిస్తాయి, అలాంటి దారుల్లో చీకటివేళ మాదొక అడ్వెంచర్.

వెళ్ళి రెండేళ్ళైనా మాకింకా ఆ పట్టణం పూర్తిగా పరిచయం కాలేదు. దగ్గర్లోని ఓ పల్లెటూరి పెద్ద ఐన ఒకరి ఆహ్వానం పై ఆ వూరు వెళ్ళాం.
పట్టణం శివార్లనుండి సరిగ్గా ఇరవై ఐదు కిమి. అని తప్పించి ఆ వూరు ఎక్కడ ఎలా వుంటుందో తెలియదు. సాయంత్రం ప్రయాణమయ్యాం, నేను ఆయన, బాబు. ఇరవై ఐదు దాటి ముఫై కిలోమీటర్లు పోయినా ఆ పేరుగల వూరు రాలేదు. దారంతా కొడలు వాటి మద్యగా మెలితిరిగి సాగుతున్న రోడ్డు. ఎక్కడో ఒక చిన్న పల్లె. ఓ పది ఇండ్లు ఉన్న పల్లెలూ ఉన్నై. ఓ కొండపై నాలుగు గుడిసెలు, ఇంకోనాలుగు సిమెంటు ఇటుకల ఇండ్లు వాటితో ఓ వూరు అలా.... పోన్ సిగ్నల్స్ లేని దారిలో.. కొండలు అడవులు వాగులు వంకలు, తోటలు దాటుకుని చివరాకరికి చీకటి పడేవేళకి ఆ వూరు చేరుకున్నాం.
పని పూర్తయ్యి వెనుతిరిగి దాదాపు వచ్చింత సేపు తిరిగి ప్రయాణించాం, కానీ అదేంటో మా వూరు రాలేదు సరికదా, అసలు వచ్చేప్పుడు కనిపించిన కొండగుర్తులూ మళ్ళీ తారసపడలేదనిపించింది. చివరికి డిమ్ లైట్లు వెలుగుతున్న మసక చీకట్లో దయ్యాలలా ఒకరు అరా మనుష్లున్న ఓ ఊర్లో విచారించగా తెలిసిందేంటంటే మేము వెళ్ళాల్సిన తోవకి సరిగ్గా వెనక్కే ప్రయాణిస్తున్నామని. అలాగే ఆ ఊరెళ్ళి రాత్రి గడిపేయాలా, వెనిక్కి తిరిగి పట్టణం వైపు వెళ్ళాలా అని అలోచించి ఎటైనా అంతే దూరం ప్రయాణించాలి ఏదైతే అదే అయ్యిందని దైర్యం చేసి జుట్టు పీక్కుంటూ వెనుతిరిగాం..
ఇంక చూస్కొండి వచ్చేప్పుడూ ఆహ్లాదపరచిన ఆ కొండలూ అడవి మా పాలిట విలన్లై పోయాయి . హాయిగా సోగయా ఏ జహా సోగయీ ఆసుమా అని పాడుకుంటూ వున్న నాగొంతు మూగపోయింది. దేవుడా ఈ రాత్రికి ఇల్లు చేరతామా.. అన్నదొక్కటే పాటైపోయింది.
ఆ దారంతా గతుకులమయం, పెట్రోల్ కాదుగదా మంచినీళ్ళు కూడా దొరికేట్టు లేవు. అందరి పిల్లలాగే మా వాడికి సరిగ్గా నీళ్ళు అయిపోయినప్పుడే దాహం. తినడానికి ఏవీ లేనప్పుడే ఆకలి లాంటి అలవాటు.
వాడి ముందు మా టెన్షన్స్ చూపించకూడదనేది మా ఒప్పందం. కానీ వాడేమో నిద్రపోకుండా మా మాటలన్నీ శ్రద్దగా వింటూ అంత గుడ్లేసుకుని మమ్మల్ని గమనిస్తూ ఏదో అయిపోయిందని గమనించేసి ప్రశ్నలు మొదలు పెట్టేశాడు.

నాకేమో ఏదారిదొంగలు అటాక్ చేస్తారో, లేకపోతే ఆ అడవి మధ్య కారు ట్రబుల్ ఇస్తుందేమో, ఇలా ఏవేవో సందేహాలు, భయాలు.

అంతకు ముందు ఓసారి ఓప్రయాణంలో అడవిజంతువు మా కారుని గుద్దేసిన అనుభవం పొందివున్నాం గనక ఎంత త్వరగా ఇంటికెళ్ళిపడాలనుకున్నా వేగంగా వెళ్ళే దైర్యం చేయలేకపోయాం.
“అసలు మనదారిలో ఓ నది రావాలి నేను చెప్తూనే ఉన్నా మీరే అంతా చేశారు” అని నేను అంతా ఆయనమీదకు తోసేస్తూ నస మొదలెట్టేశాను.
“అసలు తొక్కలో తోటలు చూడాలనే నీ కోరికే ఈ పరిస్థికి దారితీసింది.” అని పాపం ఆయన మాత్రం నన్నలేదండీ.

ఆ దారిలో వూళ్ళకి పేర్లు బోర్డులూ ఏవీలేవు,(అసలు నిజానికి అవి ఊళ్ళే కాదు చిన్న చిన్న గూడేలు అంతప్రయాణంలో ఓ నాలుగు తగిలాయేమో అంతే,బాషా తేడాగా ఉంది) పైగా ఊళ్ళన్నీ ఒకేలాగున్నాయ్.

సరే ఇంతకీ ఏవైదంటే సిటీ నుండి రెండు దారులున్నాయంట ఒకటి నేరుగా కొండల నడుమనుండి, మరొకటి చిన్న చిన్న మరికొన్ని వూళ్ళని కలుపూతూ డొంకరోడ్డు. మేం ఆ చీకట్లో ఎక్కడో నేరుగా వెళ్ళేరోడ్డు నుండి టర్న్ తీసుకుని పట్టణం వైపు వెళ్ళకుండా సగం దూరం ప్రయాణించి ఇంకోటర్న్ తీసుకుని తిరిగి వచ్చిన ఊరివైపే ఇంకో డొంక దారిలో వెళ్ళామన్న మాట.

GIREESH K. said...

ఉమాశంకర్, నేను చెప్పాలనుకున్నదంతా పైన అందరూ చెప్పేసారు. ఎక్కడా బిగి సడలకుండా చాలా చక్కగా కథని నడిపారు. మీరు మరిన్ని రచనలు చెయ్యాలని కోరుకుంటున్నాను! కంగ్రాట్స్!

భావన said...

బాగుందండి.. మీరు మరీనండి మీ మిసెస్ చూడకపోయినా,ఏదో అప్పుడప్పుడు కాస్త ఆవేశ పడితే మీరు చూసేరు గా వెధర్, కూసంత గేస్ నింపుకుని బయలు దేరితే మీ సొమ్మేమి పోతుంది.. కధ మాత్రం బాగా చెప్పేరు.. :-)

వేణూ శ్రీకాంత్ said...

అందరూ చెప్పినదే అయినా నాదీ అదేమాట ఉమాశంకర్ గారు. మీ కారు వెనుకసీట్లో కూర్చోబెట్టి తిప్పారు నన్ను కూడా. చాలా బాగారాశారు. మీ బ్లాగ్ టెంప్లేట్ కూడా చాలా బాగుంది.

కొత్త పాళీ said...

Boss, it's been a long time since you wrote. After such a nice write up, you can't take such long hiatus - you have a moral obligation to your readers

ఉమాశంకర్ said...

కొత్తపాళీగారు,
రాయడంలో ఉన్న ఆనందాన్ని చవిచూసేలోగా ప్రతిసారీ ఏదోఒక అవాంతరం..ప్రస్తుతానికి వృత్తిపరమైన చికాకుల్లో ఉన్నానండీ.. బహుశా త్వరలోనే.....

భాస్కర్ రామరాజు said...

"ఒక కప్పు కాఫీ ఇస్తావా మరి, త్వరగా తాగి బయల్దేరుదాం? "సోఫాలో కూర్చొనే తలతిప్పకుండా అడిగా.

సమాధానంగా అన్నట్టు నావెనుక ఫ్రిజ్ తలుపు తెరచిన చప్పుడు.ఆతరువాత పాలు కప్పులోకి వంచుతున్నప్పుడు వచ్చే శబ్దం. ఒక రెండు క్షణాల తరువాత మైక్రోవేవ్ చేసే సన్నని శబ్దం.


-------
సోడ(ద)రా!! అత్భుతంగా ఉందీ నెరేషన్...

ఈ మధ్యన కుదరలేదు మీబ్లాగ్ వైపు రావటం..మీరూ నా మీద అలిగినట్టున్నారు...
అంతా మంచేనా?

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Excellent Narration.
I can't express, my appreciation in words.

 
అనంతం - by Templates para novo blogger