మాష్టారుగారమ్మాయి

Thursday, October 29, 2009

కొన్నెందుకో అలా గుర్తుండి పోతాయి. ఎన్నేళ్ళయినా మసకబారవు.కారణం తెలీదు.

ఎర్లీ ఎనభైల్లో మాట అన్నమాట. నేనప్పుడు ఆరోతరగతి. మా తెలుగు మాష్టారింటికి ట్యూషను కెళ్ళేవాడిని . ఆయన పేరుకు తెలుగు మాష్టారయినా ఒక్క లెక్కలు తప్ప అన్నీ చెప్పేవారు. అదే ట్యూషనుకి లెక్కలు చెప్పడానికి సత్తార్ అనే మాష్టారింకోకాయన వచ్చేవారు. వారి గురించి ఇంకెప్పుడైనా.

పొద్దున్నే ఆరింటికి ట్యూషను. ఐదు యాభై ఐదు కల్లా వాళ్ళింట్లో ఉండేవాడిని. నాకంటే ముందు వచ్చిన వాళ్ళతో గది మోస్తరుగా నిండి ఉండేది. లోపలికి అడుగు పెట్టగానే చల్లటి ఉదయపు గాలి మాయమై ఒకరకమైన వెచ్చదనం గదంతా పరచుకొని ఉండేది. ఖాళీ దొరికిన చోట కూర్చొని మాష్టారి కోసం ఎదురు చూపులు. మధ్యగది లో ఫ్యాను గాలికి మధ్యగది డోరు కర్టెను కదిలినప్పుడల్లా పంచలో కూర్చొని ఉన్న మాచూపులు అప్రయత్నంగా వైపు కదిలేవి. లోపల మనుషులు అటూ ఇటూ తిరుగుతున్నట్టు కనిపించినా మాటలు అస్సలు వినిపించేవి కావు. భారమైన నిశ్శబ్దం. అప్పుడప్పుడు లంగా వోణీ వేసుకొని ఉన్న మా మాష్టారిగారమ్మాయి క్షణకాలం కనిపించేది. కొన్ని కొన్ని సార్లు తన పట్టీల చప్పుడు మాత్రమె వినిపించేది.డోరు కర్టెను కాస్త పక్కకి జరిగినట్టనిపించినా ఒక రకమైన కంగారుతో తను వెంటనే వచ్చి సరిచేసేది. ఇంతలొ మాష్టారుగారు పూజ ముగించుకుంటున్న సూచనలు. మరి కొద్దిసేపటికి గొంతుసవరించుకుంటూ మాష్టారు గారు మధ్యగది ద్వారం వైపు అడుగు వేస్తున్న చప్పుడు. మేమంతా బిర్ర బిగుసుకు పోయేవాళ్ళం. తను కర్టెను తొలగించుకొని పంచలోకి అడుగుపెడుతుంటే , భయంతోనో, మాష్టారు గారి మీది గౌరవం తోనో నిశ్శబ్దం పదింతలు పెరిగి , గాలి కూడా బరువెక్కి పోయేది.

అదే ట్యూషను సాయంత్రాలు కూడా ఉండేది. సాయంత్రాలు ఉదయమున్నంత గంభీరంగా ఉండేవి కాదు. తేలికైన గాలి. అప్పుడప్పుడు మేము వెళ్ళేసరికి మాష్టారుగారు బజారునుంచి ఇంకా వచ్చి ఉండేవారు కాదు.మాష్టారు గారమ్మాయి పంచలోనే ఏదో చదువుకుంటూ ఉండేది. మధ్య మధ్యలో పాడుతూ ఉండేది. శ్రావ్యమైన కంఠస్వరం . చాలా చక్కగా పాడేది. తను పాడే పాటలోని రెండు లైన్లు నాకిప్పటికీ గుర్తే ..

గురుతు కొచ్చే జ్ఞాపకాలూ
ఎదను గుచ్చే గులాబి ముళ్ళూ..

పల్లవో తెలీదు, చరణమో తెలీదు. సినిమా పాటో, లేక లలిత గీతమో తెలీదు.ఈరెండు లైన్లు మాత్రం నాకు ఇన్నేళ్ళయినా గుర్తుండి పోయాయి. ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనన్ని సార్లు విన్నట్టు గుర్తు. బహుశా తనకిష్టమైన పాట కావచ్చు.

మేము రాగానే మమ్మల్ని చూసి లోపలికెళ్ళి పోయేది. అప్పుడప్పుడు తను పంచలో మర్చిపోయి వదిలి వెళ్ళిన తన కాలేజీ నోటు బుక్కులు చూసేవాళ్ళం. పెద్ద పేద్ద లాంగు నోటు బుక్కులు. దాని నిండా ఆకుపచ్చ, ఎరుపు,గులాబి రంగుల్లో స్కెచ్ పెన్నులతో వేసిన రకకాల బొమ్మలూ, ఎర్ర ఇంకుతో అండర్లైన్ చేసిన లైన్లూ. బయాలజీ విద్యార్ధి అనుకుంటా. మేమూ పెరిగి పెద్దయి అలాంటి లాంగు నోటు బుక్కుల్లో అలా రక రకాల బొమ్మలేయాలని అనుకునేవాళ్ళం.

తను మమ్మల్ని చూడగానే పాడుతున్న పాట ఆపి లోపలికెళ్ళి పోయేది. కొన్నిసార్లు పాట లోపలి నుండి సన్నగా వినిపిస్తుండేది. అప్పుడప్పుడు ట్యూషను జరుగుతున్నప్పుడు , మాకు వెనకవైపున దండెం మీద ఆరేసిన వోణీయో,పరికిణీయో అవసరమైనప్పుడు తను పిల్లిలా చడీ చప్పుడు లేకుండా ఇలా వచ్చి తీసుకొని అలా వెళ్ళిపోయేది.

తను ఇప్పుడు యాభైలకు దగ్గరగా ఉండి ఉంటుంది అనుకుంటా. ఎదురుపడితే పోల్చుకోలేను గాని , ఒక్కసారి గుర్తుపట్టాక, పరిచయం చేసుకొని.. రెండు లైన్లూ ఆమెకి వినిపించి ఆమె కళ్ళలో మెదిలే ఆశ్చర్యాన్ని చూడాలని ఉంది. నాకెందుకో బాగా నమ్మకం తను ఆపాటను ఇంకా గుర్తుపెట్టుకొనే ఉంటుందని..

మీకు ఈపాట గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి.15 comments:

చిన్ని said...

అలా జరగాలని మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను .చాలా బాగుంది మీ జ్ఞాపకం .

sunita said...

I wish the same like chinni.manchi జ్ఞాపకం.

శేఖర్ పెద్దగోపు said...

ఇన్నేళ్ళయినా మీకు భలే గుర్తుందే! ఆవిడ మన తెలుగు బ్లాగ్లోకంలోనే ఎక్కడో ఉండి మీకు తారస పడాలని కోరుకుంటున్నాను.

జయ said...

చాలా మంచి జ్ఞాపకాల పందిరి మీది. మీ కోరిక తప్పక తీరుతుంది. మీ ఊరేగా, కనుక్కుంటే తనిప్పుడెక్కడుందో తెలుసుకోవచ్చు. తను మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయినా, మీరు గుర్తుపట్టగలరు. ఇట్లాంటి కోరికలు తీరితే ఆ థ్రిల్లే వేరు. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.

srujana said...

మీ తీపి గుర్తులు బాగున్నాయి.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

అర్ధరాత్రి, ఆఫీసులో, ఒంటరిగా, నిసాచరజీవిలాగా పనిచేసుకుంటున్న, నా జ్ఞాపకాల తేనేతుట్టని, ఒక్కసారి కదిపింది మీ టపా. బాల్యంలోని ట్యూషన్ అనుభవాలన్నీ, ఒక్క సారి, కళ్ళముందు కదలాడాయి.

మురళి said...

మగవాళ్ళందరికీ కామన్ గా ఉండే ఫ్లాష్ బ్యాకులు కొన్ని వుంటాయి.. ఇలాంటివన్న మాట.. ఇప్పుడు తను కనిపిస్తే మీరు నిరాశ పడతారేమో :):) ..కనిపించాలనే కోరుకుంటున్నా...

ఉమాశంకర్ said...

@చిన్ని, Sunita, జయ, సృజన,వీరుభొట్ల వెంకట గణేష్, శేఖర్ పెద్దగోపు ,మురళి : అందరికీ ధన్యవాదాలు.

@ మురళి: నిరాశ ఎందుకండీ? తనకి పాట గుర్తు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నారా? నాకెందుకో గట్టి నమ్మకం, గుర్తుండొచ్చు అని.

Sree said...

I came across my first gurl friend(one side only) recently, after many years of search. Still I was unable to talk to her what I want to talk. I just talked very briefly, she is a mom of a kid, me as well, but its still as of I was talking to her for the first time.
I think these are called sweet memories. In any event, thanks for reminding those sweet moments with your post

Ruth said...

:) మా లెక్కల మాష్టారి ట్యుషన్ గుర్తు తెచ్చారు. ఈయన కూడా మీ మాష్టారిలాగే, అన్ని సబ్జెక్టులూ తనే చెప్పేవారు. మేము ఉదయానే సైకిల్ తొక్కుకుంటూ ట్యుషంకి వెళ్ళడాలూ, ఫ్రెండ్స్ మాకోసం ప్లేస్ ఉంచటాలు, ఆఖరు వరుసలో కూర్చుని పాఠం వినకుండా ముందు రోజు టివీ లో వచ్చిన సీరియల్ గురించి మా ఫ్రెండు సౌండ్ ఎఫెక్ట్సుతొ సహా చెప్తుంటె, మాష్టారు మమ్మల్ని విడివిడిగా కూర్చోబెట్టడాలు..... చాలా ఙాపకాలు రేపారు. థాంక్స్.

బ్లాగాగ్ని said...

అనందోబ్రహ్మలో బిస్సీయాజీ గుర్తొచ్చాడు ఉన్నట్టుండి, మీ టపా చదివాక :) మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను.

భాస్కర్ రామరాజు said...

ఇలా సైలెంటుగా పోస్టేస్తే ఎలా అద్దెచ్చా?

హ్మ్!! మొత్తానికి బాగున్నాయి మీ జ్ఞాపకాల దొంతరలు, ముఖ్యంగా ఈ పేజీ. ఆమె కనిపిస్తే, కనుక్కోగలరా? కనుక్కున్నా తను అవన్నీ తిరిగి తోడుకోగలదా?
ఏమో, ఆమె మీకు ఏదోరోజు తారసపడాలని కోరుకుంటా.
అలా జరిగితే మాత్రం ఏమైందో మీరు తప్పక మాతో పంచుకోవాలి సుమా!!
నా టీవీకి ఇంకో ప్లే దొరికిందన్నమాట.
ఏమంటారు సునీతగారు??
:):)

ఉమాశంకర్ said...

@sree: బావుందండీ. మీరు ఎటువంటి అనుభూతికి లోనై ఉంటారో నేను ఊహించుకోగలను. ధన్యవాదాలు.

@Ruth: :) ధన్యవాదాలు.

@బ్లాగాగ్ని: ఎన్నాళ్ళకొచ్చారండీ నా బ్లాగుకి. :) .. ఏమిటీ, ఆనందోబ్రహ్మే?.... ధన్యవాదాలు...

@భాస్కర్: సైలంటా? పంచభూతాల సాక్షిగా కాకున్నా, కూడలి, జల్లెడల సాక్షిగా రాసానండీ ఇది. మీరే ఫ్లూ తో ఇబ్బందిపడుతూ చూడలేదేమో?
ఏమా టీవీ, ఏమా కథ? చెప్పండి మాకు...

కొత్త పాళీ said...

Beautiful and heart-wrenching.
ఆ పాట గాయకుడు రామకృష్ణ పాడిన "మనసులేని బ్రతుకొక నరకం" అనే సినిమా పాట, బహుశ దేవదాసు మళ్ళిపుట్టాడు సినిమాలో అయుండొచ్చు.

ఉమాశంకర్ said...

కొత్తపాళీగారు,

గ్రేట్. మీ వ్యాఖ్య చూడగానే బెల్లు మోగింది :).. నెట్లో వెతికితే అది "సెక్రటరీ" సినిమాలోదని తేలింది. ఇపుడే విన్నాను. మహాదేవన్ గారి మార్కు సంగీతంతో మధురంగా ఉంది పాట. పాతపాటలు తరచుగా వింటుంటాను . కానీ ఈపాట విని చాలా చాలా యేళ్ళు అయింది. ..

నేను రాసిన దాంట్లో చిన్న సవరణ. అది "గురుతుకొచ్చే" కాదు" "తరుముకొచ్చే"

తరుముకొచ్చే జ్ఞాపకాలూ
ఎదనుగుచ్చే గులాబి ముల్లు
గురుతుతెచ్చే అందాలూ
కూలిపోయిన శిల్పాలూ

Thanks once again


ఫాట వినాలనుకునేవారు ఇక్కడ వినొచ్చు http://www.chimatamusic.com/allmovies1.php

 
అనంతం - by Templates para novo blogger