చరిత్రంటే నాకిష్టం.
చరిత్రకి సంబంధించి ఏమైనా చదివినా, టీవీలో ఏదైనా ప్రొగ్రాము చూసినా వెంటనే దానిలో లీనమైపోతాను. కవితా సౌరభాలు వెల్లి విరిసిన రాయల వారి కాలం గురించి చదివినా, రాజ్య కాంక్షతో జీవితాంతం యుద్దాలతో గడిపేసిన అలెక్జాండరు జ్ఞప్తికి వచ్చినా, ఉన్మాదంతో ప్రపంచాన్ని అగ్నిగుండంగా మార్చేసిన హిట్లర్ మీద ఏదైనా ప్రోగ్రాము చూసినా ఏదో అవ్యక్తానుభూతి. అది దుఃఖమూ కాదు, సంతోషమూ కాదు.ఈ రెంటికీ అతీతంగా, ఏదో భావన.
కొన్ని సార్లు ఆ భావన ఎంత విచిత్రంగా ఉంటుందంటే జరిగిన చరిత్ర మీద కంటే జరిగిపోయినఆ కాలం మీద ఒక రకమైన బలమైన ఆకర్షణ కలగజేసేలా ఉంటుంది.
******************************************************************************
కనెక్టికట్ కి వచ్చినకొత్తల్లో, ప్రాజెక్టులో కుదురుకోగానే మొట్టమొదట చేసిన పని ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలేమున్నాయా అని చూడటం. గూగుల్ లో వెతికిన ప్రతిసారీ కనపడేది "Mystic Seaport" అని. చూసినప్పుడల్లా "ఆ! సీ పోర్టులో ఏముంటుందిలే" అని పట్టించుకోలేదు. ఒక రెండేళ్ళ తరువాత, చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేసాక , ఈ సీపోర్టేమయిఉండొచ్చబ్బా ఒకసారి వెళ్ళి చూస్తేపోలా అనుకున్నా. మొత్తానికి ఒక శనివారం రోజు వెళ్ళా.
ఈ సీపోర్టొక ఓపెన్ ఎయిర్ మ్యూజియం లాంటిది. 1800 లలో , సముద్రం మీద ఆధారపడి జీవించే వారుండే ఒక సగటు అమెరికన్ గ్రామాన్ని యధాతధంగా పునర్నిర్మించారు. అప్పటిలానే ఇళ్ళూ, వీధులూ, షాపులూ, ఒక బేంకూ , పోస్టాఫీసూ, ప్రింటింగు ప్రెస్సూ, కిరాణా షాపూ, బేకరీ, మెడికల్ షాపూ అన్నీ. అన్నీ ఒక వంద,నూటేభై ఏళ్ళ క్రితం ఎలా ఉండేవో అలానే ఉన్నాయి. వాటిల్లో ఆ కాలపు దుస్తులు ధరించి, అప్పటి ఆ వస్తు విశేషాల్ని వివరిస్తూ సీపోర్టు ఉద్యోగులు. చాలా ముచ్చటేసింది.
పారిశ్రామిక విప్లవం మొదలైన ఆ రోజుల్లో , కొత్తగా కనుగొన్న ఆ యంత్రాలకు లూబ్రికేషను కావాలి అంటే తిమింగలాలను చంపగా వచ్చిన ఆయిలే శరణ్యం. అలా మొదలయింది తిమింగలాల వేట. పెద్ద పెద్ద షిప్పులు మీద ఏకబిగిన సంవత్సరాల తరబడి సముద్ర జలాలమీద తిమింగాలాలకై వేటకెళ్ళేవారట. అప్పట్లో, టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో, ఆ అనంత జలరాసి లో, రాత్రనక పగలనక వేటాడేవారు.ఆ షిప్పుల్లో ఒక్క కెప్టన్ కి మాత్రమే భార్యని వెంట తీసుకెళ్ళే సౌలభ్యం ఉంటుందట. మిగతా వాళ్లందరూ ఒంటరిగా భార్యలనీ పిల్లల్నీ,తల్లితండ్రుల్నీ వదిలి వెళ్ళాల్సిందే. ఆ ఓడల్లోనే కొన్నిసార్లు ఆ కేప్టన్ల భార్యలు పిల్లల్ని కనేవారు. కొన్నిసార్లు అనారోగ్యం కారణంగా కెప్టన్ చనిపోతే వాళ్ళ భార్యలే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని కెప్టన్ బాధ్యతలు నిర్వహించేవారట. చీకటి గుయ్యారాల్లాంటి ఆ కేప్టన్ల డెక్కుల్నీ, అంతకంటే ఇరుగ్గాఉండే నావికుల కేబిన్లని చూస్తే అయ్యో అనిపించింది.ఇలాంటి ప్రతి ఊరికీ సముద్రపొడ్డున ఒక చిన్న గ్రౌండ్ లాంటిది ఉంటుంది. సముద్రంలో సుదూరంగా ఏదైనా ఓడ కనపడితే పిల్లా,పాపలంతా అక్కడ గుమి గూడేవారట ఆ ఓడలో తమవారు తిరిగొస్తున్నారేమో అనే ఆశతో. ఎంత ఎమోషనల్ దృశ్యమో కదా ఊహించుకుంటే.
అప్పట్లో వేటకు వాడిన, దాదాపు ఒక పాతిక పైగా ఓడల్ని సేకరించి నీళ్ళలో నిలిపి ఉంచారు ఈ మ్యూజియంలో. వాటిల్లోకెళ్ళి కలియతిరుగుతుంటే ఎన్నో ఆలోచనలు.ఎంతమంది ఆశల్నీ , కలల్నీ మోసుకెళ్ళిందో ఆ ఓడ. ఎంతమంది జీవితాలు ఇందులోనే తెల్లారిపోయాయో కదా. ఆ షిప్పులో మెట్లెక్కినా , దిగినా , అప్పట్లో వాళ్ళు నడిచిన చోటే నేను నడుస్తున్నాననే ఆలోచన నాలో కలిగించే ఉద్విగ్నత. ఆ చెక్క దూలాల మీద వాళ్ళు చెక్కిన గుర్తులు చూస్తుంటే ఏ మధ్యాహ్నం నాడో, లేదా ఏ నిశిరాత్రో, ఎవరో నావికుడు, ఎక్కడో ఈ అనంత జలరాసి కావల ఉన్న తన పిల్లల్నీ, వృధ్ధులైన తల్లితండ్రుల్నీ , భార్యనీ తలచుకొని ఆ ఆవేదనని దిగమింగటానికి , ఉబికివస్తున్న కన్నీళ్ళనాపుకుంటూ చేసిన గుర్తులేమో అవి..
అంతా చేసి అప్పుడప్పుడు సంవత్సరాలపాటు వేటాడినా సరైన సంఖ్యలో తిమింగలాలు దొరక్కపోతే ఆ నావికులే కెప్టన్ కి డబ్బులు బాకీ పడేవారట. దారుణం కదా? ఇది నా దేశం కాదు. నా సంస్కృతీ కాదు. కానీ మనిషి ఎక్కడైనా మనిషేకదా.సుఖానికేమో గాని, కష్టానికీ, దుఃఖానికీ, ఆవేదనకీ, అన్యాయానికీ దేశాలూ, సంస్కృతీ - సంప్రదాయాలూ అతీతం కదా.
మెట్లు దిగి బయటికొచ్చాక కూడా మళ్ళా ఎప్పుడు చూస్తానో అని చేత్తో తడిమాను, మోర్గాన్ అనే ఆ పెద్ద చెక్క ఓడని.
******************************************************************************
నేను ఇంజనీరింగు చేసిన కాలేజి హైదరాబాదు ఊరి శివార్లలో ఉంటుంది. సిటీ నుంచి మా కాలేజీకి వెళ్ళాలంటే గోల్కొండ కోట మీదగా వెళ్ళాలి.బస్సు కిటికీలోంచి ఆ కోటని ఒక్కసారి పరికించి వెంటనే రోడ్డు కిరుపక్కలున్న పోలాలవైపు దృష్టి సారిస్తాను. కోటని ఆక్రమించటానికి తొమ్మిది నెలలపాటు కష్టపడ్డ ఔరంగజేబు ఇదిగో ఈ చుట్టుపక్కలే తన సైన్యాన్ని మొహరించి ఉంటాడు. ఇప్పటి పచ్చటి పోలాలున్న ఈ భూమి ఒకప్పుడు వెచ్చటి రక్తంతో తడిసి ఉంటుంది . కుట్రలకీ కుతంత్రాలకీ మూగ సాక్షి అయి ఉంటుంది.
రాత్రిపూటో,ఏదో ఎక్జాము టెన్షన్స్ ఉన్నప్పుడో, మరెప్పుడో తప్పితే దాదాపు ప్రతిసారీ అక్కడికి రాగానే ఇదే ఆలోచన.
గోల్కొండ కోట చూసినపుడూ ఇలాంటివే ఆలోచనలు. అవి మొండి గోడలే కావచ్చు. కానీ మనకెవ్వరికీ తెలీని రాచరిక రహస్యాలు తమలో ఇముడ్చుకున్నవవి. వైభవాన్నీ,పతనాన్నీ రెంటినీ సమానంగా నిశ్చలంగా వీక్షించిన గవాక్షాలవి.
****************************************************************************
కొన్నేళ్ళ క్రితం అలానే యాదగిరి గుట్ట నుంచి తిరిగి హైదరాబాదు వస్తూ ఆ భువనగిరి కోట ఎక్కాము. చాలా చిన్న కోట. నిజానికి అదొక ఖైదీల్ని ఉంచటానికి వాడే జైలు(అట). అలానే ఒక రకమైన గార్డు పాయింటు లాంటిదట ఆ కోట. శత్రువు లెవరైనా గోల్కొండ మీద దాడికి వస్తుంటే ముందే తెలియడానికి కట్టుకున్న కోటన్నమాట. ఫ్రెండ్స్ అందరు కిందికి చూసి ఆ వ్యూ బావుంది ఈ వ్యూ బావుంది అంటున్నారు. నాక్కూడా అవి బావున్నా, నా బుర్రలో మాత్రం అంతకు మించిన ఆలోచనలు.
ఎప్పుడు కట్టారో దీన్ని? ఎన్ని వందల వేలమంది కష్టపడ్డారో కదా.
ఆ మెట్ల మీద నడుస్తున్నా,అక్కడక్కడ ఉన్న అరుగులమీద కూర్చున్నా ఎన్నో ఆలోచనలు. ఇప్పుడంటే పాడుపడి పోయింది కానీ కొన్ని వందల ఏళ్ళ క్రితం అదొక సజీవ దృశ్యం. ఎన్ని సాయంత్రాలు ఆకోట దివిటీల వెలుగులో ఆ మసక వెలుతురులో తన ఉనికి నిలుపుకుందో.ఆ చీకటి గదుల్లో ఒకప్పుడు ఎన్ని గొంతులు ప్రతిధ్వనించాయో కదా.
అక్కడ కట్టిన గోడని చూసినా, ద్వారాన్ని చూసినా ఎన్నో ఆలోచనలు. రాయి పై రాయి పెట్టి వాటిని నిలబెట్టిన చేతులు ఎవరివో కదా? భుక్తో , ప్రభుభక్తో ఏదయితేనేం, ప్రభు దాసుడో, కారాగారవాసో ఎవరైతేనేం, ఏ చెమటలుగక్కే మధ్యాహ్నమో, మసక చీకటి నాటి సాయంత్రమో, చల్లగాలులు వీచే ప్రాతః వేళో ఆ రాయి అక్కడ పెట్టబడింది. ఎవరు పెట్టారో దాన్ని.ఒక్కసారి తడిమి చూద్దాం అనిపిస్తుంది నాకు. ఆ శ్రమజీవి తాలూకు తరాలకి తరాలు గడిచిపోయినా నాటి శ్రమ ఇప్పటికీ సజీవంగా,మన కళ్ళ ముందు.ఎవరై ఉంటారా వ్యక్తి?..
**************************************************************************
కోపెన్ హేగన్ (డెన్మార్కు) ...2003 ఒక వేసవి కాలపు మధ్యాహ్నం.
ఆఫీసు పని ముందే ముగించుకొని బయటపడ్డాను.ఇంతముందే ఇంటికి వెళ్లి ఏంచేస్తాను అని, అనుకున్నదే తడవు తరువాతి స్టేషనులో ట్రైన్ ఆగగానే దిగేశా. జనంతో కిటకిటలాడుతున్న ఉన్న ఆ ఇరుకు వీదుల్లో తిరుగుతూ ఉంటే ఏవేవో ఆలోచనలు. యూరోప్ అనగానే నాకు మొట్టమొదటగా గుర్తుకొచ్చేది,హిట్లర్ -రెండో ప్రపంచయుద్దం .(అంతకుముందు యూరప్ కి చరిత్రేమీలేనట్టు :) ). రెండో ప్రపంచ యుద్ధం గురించి ఎంత విన్నా, ఎంత చదివినా, ఎన్ని సినిమాలు చూసినా నాకు ఎప్పటికీ తరగని ఆసక్తి.
ఎడతెరిపి లేకుండా వాహనాలు పరిగెడుతూ ఉండే ప్రధాన వీధినానుకొనే,చిన్న చిన్న నాపరాళ్ళు పరిచి ఉన్న పెద్ద మైదానం లాంటి ప్రదేశం, దానికి మూడువైపులా అద్భుతమైన భవనాలు. చర్చిలా కనపడే పెద్ద భవనం ముందు మెట్లపై కూర్చున్నాను.
హిట్లర్ లాంటి వ్యక్తిని కూడా స్నేహపూర్వకంగా ఉంటే ఎవరూ మనవైపు చూడరులే అని అమాయకంగా నమ్మి మోసపోయిన దేశం డెన్మార్క్ . బహుశా 63 ఏళ్ళ క్రితం ఈ ప్రదేశం కూడా సైనికుల పద ఘట్టనల కింద నలిగి పోయి ఉంటుంది. దాడి అనివార్యం అని తెలిసిన మరుక్షణం అప్పటి ప్రజల మానసిక స్థితి ఎలా ఉండుంటుంది? రక్తం ఏరులై పారక పోయినా, బహుశా ఈ ప్రదేశం భయ గుప్పిట్లో గిజగిజలాడిపోయి,నిర్మానుష్యమై ఉండి ఉంటుంది. సైరన్లతో,ఆకాశంలో జర్మన్ యుద్దవిమానాల రొదతో దద్దరిల్లి ఉంటుంది.
ఇలా ఏవేవో ఆలోచనలు.అక్కడే అలా తిరుగుతూ ఉండిపోయాను. రాత్రి పదిన్నర వరకూ.పశ్చిమాన సూర్యుడస్తమించేవరకూ ..
****************************************************************************
ఆ సీపోర్టు లో ఒకాయన మాటల్లో ఇలా అన్నాడు. "అప్పట్లో అది వాళ్ళ జీవన విధానం. రోజు తర్వాత రోజు గడిపేయడమే వాళ్ళు చేసింది.అప్పట్లో వాళ్ళు అనుభవించిన దానికంటే ఎక్కువ ఇప్పుడు మనం ఆ రోజుల గురించి ఆలోచించి అనుభవిస్తాం. గతం తో రోమాన్స్ అంటే ఇదే" అని పెద్దగా నవ్వేసాడు.
నిజమే కదా.ఆలోచించే హృదయం ఉండాలేకానీ ఆ రోమాన్స్ ఎంత బాగుంటుందో కదా.సంతోషం, దుఃఖం, బాధ, దిగులు, అన్నీ ఏక కాలంలో కలుగుతాయి. మన ప్రాంతం అయినా కాకున్నా, మన సంబంధీకులు అయినా,కాకున్నా, కొన్ని వందల ఏళ్ళ క్రితం జీవించి కాల గర్భంలో కలసి పోయినా, వాళ్ళని తలచుకొని ఆనందపడతాం. దిగులు పడతాం. ఏదైనా విషాదగాధ వింటే ఉబికివచ్చే కన్నీళ్ళ నాపుకుంటాం.
నేర్చుకోగాలగాలే గాని, చరిత్ర నేర్పే పాఠాలెన్నో.చూపించే జీవిత సత్యాలెన్నో.