మూగమ్మ

Wednesday, March 19, 2014

మేమందరం తనని మూగమ్మ అని  పిలిచేవాళ్ళం.మా అమ్మమ్మ తరపు బంధువు.అమ్మమ్మ తరపు బంధువులంతా చాలా వరకు ఏదో కూలీ నాలీ చేసుకొనే వారే. అతి కొద్ది మందికి మాత్రం ఏదో ఎకరం అరెకరం పొలాలు అంతే. అయితే వాళ్ళు కూడా చాలావరకు వాటిని కౌలుకిచ్చి పొలం పనులకెళ్ళేవాళ్ళే .

తన అసలు పేరు ఇప్పటికీ తెలీదు.మాటలు రావు  పైగా పుట్టెడు చెముడు కూడా.మొదటిసారి తనని చూసినప్పుడు నాకప్పుడు ఏడెందేళ్ళ వయసుంటుందేమో.ఎవరు చెప్పారో తెలీదుగాని మూగవాళ్ళకి ఎదురుగా నిలబడి చూపుడు వేలుతో మన ముక్కు గిల్లుకుంటే వాళ్ళని ఆటపట్టించినట్టట.ఇంకేముంది మేం నలుగురు పిల్లలం సందు దొరికినప్పుడల్లా తనని ఆట పట్టించేవాళ్ళం.అప్పటికి తన వయసు ఇరవై కూడా ఉండక పోవచ్చు.చాలా వరకు సంయమనం పాటించినా,మా అల్లరి శృతిమించినప్పుడు మాత్రం మామీద అలిగేది.ఒకట్రెండుసార్లు చేతిలోని వస్తువుని విసిరి కొట్టి కోపంతో మేడ మీద కెళ్లి కూర్చుంటే మా అమ్మో అమ్మమ్మో తనని బ్రతిమాలి కిందికి తీసికొచ్చి తనెదురుగానే మమ్మల్ని  కసిరేవాళ్ళు.కాసేపు గప్ చుప్ .ఆ తరువాత అంతా మామూలే. 

ఆ తరువాత తనని చూసింది చాలా కొద్ది సార్లే. అయితే మాఇంట జరిగే ప్రతి శుభకార్యానికీ తప్పనిసరిగా వచ్చేదట. కలిసినప్పుడు సైగలతోనే బావున్నావా అని అడిగేది. తను మూగది కాబట్టేమో, అలా అడుగుతున్నప్పుడు నేను తన ముఖ కవళికల్ని శ్రద్దగా గమనించేవాణ్ణి. ఆ మోహంలో మాపట్ల ఎంతో  ఆప్యాయత. స్వతహాగా నేను సిగ్గరిని కాబట్టి సైగలతొనొ,పెద్దగా అరుస్తూనో తనతో మాట్లాడలేక ఆ ఒక్క మాటకి సమాధానం చెప్పి పక్కకి తప్పుకునేవాడిని బతుకు జీవుడా అనుకుంటూ( నిజంగా అలానే అనుకునేవాడిని ). 

ఆ తరువాత దాదాపు ఇరవైఏళ్ళ  తరువాత తనని నా పెళ్లి రిసెప్షనులో  చూట్టమే. సూటూ బూటూ వేసుకున్న నన్ను చూసి దాదాపు పరిగెత్తుకుంటూ వచ్చింది నాదగ్గరికి. ఇంటికి రాకుండా డైరక్టుగా రిసెప్షను కొచ్చినట్టుంది. నన్ను చూడగానే తన మోహంలో పట్టరానంత ఆనందం. సైగలతోనే "ఇంతుండే  వాడివి,ఎంత పెద్దయిపోయావు" అని మురిసిపోయింది. చేతి బోటనవేలినీ,చూపుడు వేలినీ కలిపి సున్నాలా చేసి, సూట్లో చాలా బావున్నావు అంది .కొద్దిగా వయసు మీదపడిన ఛాయలు   కనిపిస్తున్నా చలాకీతనం ఏమాత్రం తగ్గలేదు.

రిసెప్షన్ ఆద్యంతం వీలు కుదిరినప్పుడల్లా ఆ స్టేజి మీద నుంచి  తనెక్కడుందా  అని తనని వెతుకుతూనే ఉన్నాయి నాకళ్ళు. ఒకట్రెండు సార్లు నేను తన వంక చూడడం గమనించి చెయ్యూపుతూ  నవ్వింది కూడా.ఆ సాయంత్రం  నాకు అత్యంత సంతృప్తి కలిగించిన విషయం ఏమైనా ఉన్నదంటే అది ఇన్నేళ్ల  తరువాత తనని చూడటమే.నా చూపులతోనో,చేతలతోనో నేను తనని మర్చిపోలేదనే భావాన్ని వ్యక్త పరచాననే అనుకున్నానా సాయంత్రం. 

రిసెప్షను ఒక అరగంటలో ముగుస్తుందనగా తనను భోజనాల దగ్గర చూసా.ఆ తరువాత లేటుగా వచ్చిన మిగతా  బంధువులని  పలకరించి,కాసేపు వాళ్ళతో పిచ్చాపాటీ మాట్లాడి,అమ్మ కనపడితే "మూగమ్మెక్కడా?" అని అడిగితే , అమ్మ వాకబు చేసి  చెప్పింది వెళ్ళిపోయిందని. 

మనసు చివుక్కుమందొక క్షణం. 

అయినా మా అమ్మమ్మ బంధువుల విషయంలో అది కొత్తేమీ కాదు.చెప్పా పెట్టకుండా మాయమవుతారు.అలానే ఇంట్లో ఏదైనాపనుండి కబురు పెడితే, తెల్లారకుండానే తలుపు తడతారు. రావడంతోనే ఏవిధమైన భేషజాలు లేకుండా,మనం చెప్పే అవసరం లేకుండానే చొరవగా పనుల్లోకి జొరబడి పోతారు. 

కాస్త నగదూ, కొన్ని ఆస్తులూ ఆశ చూపి ఇల్లరికం వచ్చేలా చూసి మూగమ్మకి  పెళ్లి చేసారు. ఆ వచ్చినతను   ఏడాది తిరక్కుండానే ఆస్తులమ్మి డబ్బులియ్యమని నానా యాగీ చేసి తననొదిలి వెళ్లి పోయాడు. తన చెల్లెలి దగ్గర వాళ్ళ పిల్లల బాగోగులు చూస్తూ పొలం పనులకెళ్తూ రోజులు వెళ్ళదీస్తుందని  చెప్పింది అమ్మ పొద్దున్న ఫోన్ చేసినప్పుడు. "నువ్వు ఇండియా వచ్చినప్పుడు కబురు పెడితే ఎందుకు రాదూ, పరిగెత్తుకుంటూ వస్తుంది నువ్వంటే" అంది కూడా. 

నేనే వాళ్ళ వూరు వెళ్ళాలి. వెళ్లి "అసలు ఆరోజు నాకు చెప్పకుండా వచ్చేసావేం" అని సరదాగా నిలదీయాలి. అయితే ఎలా అడగాలి అన్నదే పెద్ద ప్రశ్న మరి. 


WW-II

Thursday, March 13, 2014

 రెండో ప్రపంచ యుద్ధం.  టూకీగా WW-II

దాదాపు ఐదేళ్ళ పాటు(1939-1945), రోజుకి సగటున ఇరవై ఏడు వేల మంది ప్రాణాలు  బలితీసుకున్న మారణహోమం. 
                                     ***********************

యుద్ధరంగాన్నుంచి అప్పుడే తిరిగొచ్చిన బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ డేవిడ్ క్రూక్,అంతకు క్రితమే మరణించిన తన సహచరుడిని తలచుకొని, తన డైరీలో రాసుకున్న మాటలు...

(లండన్)

కొద్ది గంటల క్రితమే మరణించిన తన సహచరుడు వాడిన వస్తువులు చూస్తుంటే అంతా ఏదో మాయలా ఉంది . గదిలో తను పొద్దున్న కిటికీకి తగిలించిన టవల్ అలాగే ఉంది.పొద్దున్న నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడిన పీటర్ ఇప్పుడు కూలిన యుద్దవిమానపు కాక్  పీట్లో ఇంగ్లీషు చానల్ అడుగున నిర్జీవంగా పడిఉన్నాడన్న ఊహ భరింపనలవి గాకుండా ఉంది. ఈరోజు మధ్యాహ్నమే పీటర్ భార్య  సెలవు గురించి అడగడానికి ఫోన్ చేసినప్పు డతని మరణవార్త తనకి చెప్పాల్సి వచ్చింది. ఒక వ్యక్తి  మరణించినప్పుడు దగ్గరివాళ్ళు పడే ఈ బాధకి సాక్షి కావడం అంతులేని వ్యధ కలిగిస్తోంది.

                            ********************************

(ఫిన్లాండ్, ఒక సైనికుడు)

ఈ గుర్రాన్ని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది.

రాతి నేలపై నడిచీ నడిచీ,సత్తువలేక,శుష్కించిపోయి,నీరసించిన దీన్ని ఇక్కడే వదిలేయక తప్పదు.దాని వీపుమీదున్న నా సంచి  తీసుకొని మిగాతావారిలాగే నేను కూడా  నడక మొదలెట్టాలి ఇక .

 మెడ వెనుక నెమ్మదిగా నిమిరి దాన్ని ముద్దు పెట్టుకున్నాను. అదొక జంతువే కావొచ్చు,కానీ ఈ యద్ధంలో అది నా సహచరి. చాలా సార్లు ఇద్దరం మృత్యువుకి చాలా దగ్గరగా వెళ్ళొచ్చాం . యుద్దరంగపు భయానకమైన రాత్రుళ్ళూ , పగళ్ళూ ఎన్నో చూసాం కలిసి.

దాన్ని వదిలి ఒక రెండడుగులు ముందుకేయగానే అది నా వైపు  చూసింది . నేను తట్టుకోలేకపోయా నాచూపుని.

నాకు గట్టిగా ఏడవాలనిపించింది. కానీ కన్నీళ్లు  ఎప్పుడో ఇంకి పొయాయి. పైగా యుద్దంలో ఏడుపుకి చోటే లేదు.

ఒక్క క్షణం దాన్ని చంపేస్తే .. అనిపించింది. కానీ ధైర్యం చాల్లేదు.

నేను ముందుకు కదిలాను .

అది నిలబడి నావైపే చూస్తోంది ,మలుపు తిరిగి ఈ పెద్ద బండరాయి వెనక్కి  నేను కనుమరుగయ్యేదాకా ....
                                   ********************************
సగం సగం పంచుకుందామని స్టాలిన్-హిట్లర్ ఒప్పందం కుదుర్చుకొన్నాక ,జర్మనీ  పోలెండు మీద భీకర దాడి చేసిన రోజుల్లో హాస్పిటల్లో పనిచేసే నర్సు  డైరీలో ఒకరోజు 

(వార్సా ,పోలెండ్ )

గాయపడ్డ వాళ్ళ తో హాస్పిటల్ నిండిపోయింది . కరెంటు లేదు . డాక్టర్లు నర్సులు  కొవ్వొత్తుల వెలుగులో  గాయపడ్డ వారికి వైద్యం చేస్తున్నారు. రెండు ఆపరేషన్  థియేటర్లూ , అవుట్ పేషెంట్ గదీ  బాంబు దాడిలో ధ్వంస మయ్యాయి. వైద్యవిద్యార్దుల కుద్దేశించిన  లెక్చర్ రూముల్లోనూ, అక్కడక్కడా దొరికిన మామూలు చెక్క బల్లలమీదా  వైద్యం జరుగుతోంది . వైద్య పరికరాలు స్టెరిలైజ్ చేసే వీలు లేక వాటిని ఆల్కహాల్ లో ముంచి తుడిచి వాడుతున్నారు. ఒక డాక్టరు టేబుల్ మీదున్న వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి  విఫల ప్రయత్నం చేస్తున్నాడు.

ఒక విషాదాన్ని వెన్నంటే మరొక విషాదం.

ఈ గాయపడ్డ పదహారేళ్ళ అమ్మాయి, బంగారు రంగు జుట్టుతో అంతకంటే అందమైన మోముతో  ఉంది. అయితే ఆ నీలి కళ్ళ నిండా నీళ్ళు. ఆమె రెండు కాళ్ళు మొకాలి కిందినుంచి నుజ్జు నుజ్జయి ఉన్నాయి. రెండు కాళ్ళూ తీసే యాల్సిందే అంటూ సర్జను ఆ పని చేయబోయే ముందు నేను ముందుకు వంగి ఆ అమ్మాయి నుదురు మీద ముద్దు పెట్టుకొని నా నిస్సహాయమైన చేతిని తన బంగారు రంగు చేతిలో వేసాను ధైర్యం చెబుతున్నట్టు.

వికసించాల్సిన ఓ అందమైన పువ్వును మొగ్గలోనే ఓ కర్కశమైన చెయ్యి నిర్దాక్షణ్యంగా తుంచేసినట్టు.... .

ఆ రోజు తెల్లవారు జామున  తను నిశ్శబ్దంగా మృత్యువు ఒడి లోకి జారిపోయింది .
                             
  (Max Hastings రాసిన  Inferno, The world at war (1939-1945) నుంచి)

నిద్ర పట్టని రాత్రి

Monday, March 10, 2014

రాత్రి ఎందుకో అస్సలు నిద్రపట్టలేదు.

అలవాటుగా పక్కనే టేబుల్ మీదున్న రేడియో ఆన్ చేసాను.

ఎప్పుడూ వినే స్టేషనే . NPR. అయితే రాత్రుళ్ళు మాత్రంఅదే స్టేషన్లో BBC ప్రసారాలు వస్తాయి.

వార్తలు.

ఉక్రెయిన్ గురించి ఏదో వార్త.

అసలీ పుతిన్ కేమయింది? అంది వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకొని క్రీమియాని ఆక్రమించుకుందామనుకుంటున్నాడా లేక ఉక్రెయిన్లో  యురోపియన్ యూనియన్ ప్రాబల్యం ఎప్పటికైనా తన పక్కలో బల్లెమే అని మొత్తం ఉక్రెయిన్ కే ఎసరుపెట్టి, క్రీమియారూపంలో కొసరు ముందు లాక్కుందామనుకుంటున్నాడా?ఏదయితేనేం ఇరు దేశాల సైన్యాల్ని పక్కనపెడితే అక్కడి జనాల్ని తమలో  తామే కొట్టుకునేలా చేసాడు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?

నిద్రపట్టేలా లేదనుకొని లేచి కూర్చొని లైటేసాను. పక్కనే గోడమీద పెద్ద వరల్డ్ మ్యాపు. చందా కట్టినందుకు నేషనల్ జియోగ్రాఫిక్ వారు ఉచితంగా పంపారు దాన్ని.


అలా దానిముందు నిలబడి అన్నేసి దేశాల్నీ, ఆ మహాసముద్రాల్నీ చూడ్డం  నాకు చాలా ఇష్టం. చూస్తూ ఉంటే ఎంత సేపైనా అలానే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఏదో తెలీని ఆకర్షణ. అన్నిసార్లూ కాకపోయినా కొన్నిసార్లు అలా కాసేపు చూసి బలవంతాన దాన్ని  వదిలించుకొనేముందు, చివరగా అమెరికాలో నేనున్న రాష్టాన్నీ , ఇండియానీ , రెంటినీ చూసి, "అబ్బో చాలా దూరం,మధ్యలో పెద్ద సముద్రం కూడా" అనుకొని ఒకరకమైన దిగులుతో పక్కకొచ్చేస్తా.

ఇప్పుడు లేచెళ్లి చేతులు కట్టుకొని దానిముందు  నిలబడ్డాను.

అంత నిశిరాత్రి , ఆ నిశ్శబ్దంలో దాన్నలా చూస్తుంటే ఇంకేదో కొత్తగా ఉంది నాకు.

ఎన్నో దేశాలూ, (రూపు రేఖల పరంగా) ఎన్నెన్నో  రకాల మనుషులూ,భిన్న సంస్కృతులూ,సముద్రాలూ, మహారణ్యాలూ, ఎడారులూ ,పర్వతాలూ...

అందులో నేనొకచోట..  చిన్ని బిందువునై .. ఇదిగో  ఇలా ఈ మ్యాప్ వైపు చూస్తూ ...

రేడియో తన పని తను చేసుకుపోతోంది ..

ఈ సారి సిరియా...

ఎక్కడుంది సిరియా? సిరియా నాకు తెలియకపోవటమేంది . ఇదిగో ఇక్కడ.

నిద్ర పట్టకపోవడంతో , నా జిజ్ఞాస కొద్దీ సిరియా  వైపు చూస్తూ ఇక్కడ నేను...

కానీ అక్కడ?

రోజు మొదలయి ఉంటుంది.  అలానే  యుద్ధం కూడా ..

కొన్ని నెలల క్రితం టైం పత్రికలో చూసిన ఫోటో గుర్తుకొచ్చింది. మొహమంతా రక్త సిక్తమై ఉన్న ఒక నాలుగేళ్ల బాలుడిని ఒక తండ్రి రెండు చేతులతో ఎత్తుకొని ఎటో పరుగు తీస్తున్నాడు. ఆయన మోహంలో భయమో,నిస్సహాయతో లేక కళ్ళముందే చేజారిపోతున్న కొడుకును చూస్తూ పడుతున్న యాతనో ... నాకైతే "చోద్యం చూస్తున్నార్రా  మీరు?"  అంటూ మనల్ని నిగ్గదీసి అడుగుతున్నట్టే అనిపించింది .  రక్తం పోకుండా ఉండటానికి ఆ బాలుడు తలకి గుడ్డ కట్టబడి ఉంది. ఎన్నో రోజుల పాటు నా మనసుని కకావికలం చేసిన ఫోటో అది

ఏం  పాపం చేసాడా చిన్నారి?

ఇలా ఎంత మందో?  వందలు..వేలు.. కాదు లక్షలు..

ఇలా ఒక్క దేశం కాదు ఎన్నో.. నా ముందున్న మ్యాపులో ఇలాంటి రావణ కాష్టాలు ఎన్నో ...

సిరియా, ఆఫ్ఘనిస్తాన్ , ఇరాక్,  సూడాన్, అల్జీరియా, యెమన్, ఇజ్రాయిల్-పాలస్తీనా ,ఈజిప్ట్, నిన్నా మొన్నటి దాకా లిబియా,చెచెన్యా.. ఇప్పుడు ఉక్రెయిన్ ... రేపు మరెన్నో ...

మా ఆఫీసుకి కూతవేటు దూరంలో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యుజియం లో ఆస్ట్రానమీ విభాగంలో అంతరిక్షం నుంచి భూమిని చూసి, ఆ అనుభవాన్ని మనతో పంచుకున్న ప్రసిద్ద అంతరిక్ష యాత్రికుల మాటలు పొందు పరచబడి ఉన్నాయి. సరిగ్గా గుర్తు లేదు గాని, వాటిల్లో ఒకటిది

"నాకైతే నీలి రంగులో మిల మిలా మెరిసిపోతున్న గ్రహమే కనబడుతోంది. ఈ దేశాలూ,వాటి   సరిహద్దులూ  ఏవీ కనపడటం లేదు."

నెట్లో నేను చూసిన, ఇప్పటి పరిస్థితికి చక్కగా సరిపోయే ఇంకొక వ్యాఖ్య. 1974 లోనే ఈ మాట చెప్పిన ఆస్ట్రోనాట్  ఎడ్గార్ మిషెల్ కి హేట్సాఫ్..

You develop an instant global consciousness, a people orientation, an intense dissatisfaction with the state of the world, and a compulsion to do something about it. From out there on the moon, international politics look so petty. You want to grab a politician by the scruff of the neck and drag him a quarter of a million miles out and say, "Look at that, you son of a bitch."

— Edgar Mitchell, Apollo 14 astronaut, People magazine, 8 April 1974.

ఎన్నో ఏళ్ళుగా వెతుకున్నా ఇప్పటివరకూ విశ్వంలో ఇలాంటి నీలి గ్రహం ఇంతవరకూ కనపడలేదు. ఈగోలూ ,స్వార్ధాలతో మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం దీన్ని ... తరువాతెప్పుడో నిద్రపట్టింది..  అదీ మగతగా.

రేడియో మాత్రం  తన పని తను చేసుకుపోతూనే ఉంది రాత్రంతా . ..

పొద్దున్న నేను లేచి దాని గొంతు నొక్కే దాకా. 

 
అనంతం - by Templates para novo blogger