కొన్నెందుకో అలా గుర్తుండి పోతాయి. ఎన్నేళ్ళయినా మసకబారవు.కారణం తెలీదు.
ఎర్లీ ఎనభైల్లో మాట అన్నమాట. నేనప్పుడు ఆరోతరగతి. మా తెలుగు మాష్టారింటికి ట్యూషను కెళ్ళేవాడిని . ఆయన పేరుకు తెలుగు మాష్టారయినా ఒక్క లెక్కలు తప్ప అన్నీ చెప్పేవారు. అదే ట్యూషనుకి లెక్కలు చెప్పడానికి సత్తార్ అనే మాష్టారింకోకాయన వచ్చేవారు. వారి గురించి ఇంకెప్పుడైనా.పొద్దున్నే ఆరింటికి ట్యూషను. ఐదు యాభై ఐదు కల్లా వాళ్ళింట్లో ఉండేవాడిని. నాకంటే ముందు వచ్చిన వాళ్ళతో గది ఓ మోస్తరుగా నిండి ఉండేది. లోపలికి అడుగు పెట్టగానే చల్లటి ఉదయపు గాలి మాయమై ఒకరకమైన వెచ్చదనం ఆ గదంతా పరచుకొని ఉండేది. ఖాళీ దొరికిన చోట కూర్చొని మాష్టారి కోసం ఎదురు చూపులు. మధ్యగది లో ఫ్యాను గాలికి మధ్యగది డోరు కర్టెను కదిలినప్పుడల్లా పంచలో కూర్చొని ఉన్న మాచూపులు అప్రయత్నంగా ఆ వైపు కదిలేవి. లోపల మనుషులు అటూ ఇటూ తిరుగుతున్నట్టు కనిపించినా మాటలు అస్సలు వినిపించేవి కావు. భారమైన నిశ్శబ్దం. అప్పుడప్పుడు లంగా వోణీ వేసుకొని ఉన్న మా మాష్టారిగారమ్మాయి క్షణకాలం కనిపించేది. కొన్ని కొన్ని సార్లు తన పట్టీల చప్పుడు మాత్రమె వినిపించేది.డోరు కర్టెను కాస్త పక్కకి జరిగినట్టనిపించినా ఒక రకమైన కంగారుతో తను వెంటనే వచ్చి సరిచేసేది. ఇంతలొ మాష్టారుగారు పూజ ముగించుకుంటున్న సూచనలు. మరి కొద్దిసేపటికి గొంతుసవరించుకుంటూ మాష్టారు గారు మధ్యగది ద్వారం వైపు అడుగు వేస్తున్న చప్పుడు. మేమంతా బిర్ర బిగుసుకు పోయేవాళ్ళం. తను కర్టెను తొలగించుకొని పంచలోకి అడుగుపెడుతుంటే , భయంతోనో, మాష్టారు గారి మీది గౌరవం తోనో ఆ నిశ్శబ్దం పదింతలు పెరిగి , గాలి కూడా బరువెక్కి పోయేది.
అదే ట్యూషను సాయంత్రాలు కూడా ఉండేది.ఆ సాయంత్రాలు ఉదయమున్నంత గంభీరంగా ఉండేవి కాదు. తేలికైన గాలి. అప్పుడప్పుడు మేము వెళ్ళేసరికి మాష్టారుగారు బజారునుంచి ఇంకా వచ్చి ఉండేవారు కాదు.మాష్టారు గారమ్మాయి పంచలోనే ఏదో చదువుకుంటూ ఉండేది. మధ్య మధ్యలో పాడుతూ ఉండేది. శ్రావ్యమైన కంఠస్వరం . చాలా చక్కగా పాడేది. తను పాడే పాటలోని ఈ రెండు లైన్లు నాకిప్పటికీ గుర్తే ..
గురుతు కొచ్చే జ్ఞాపకాలూ
ఎదను గుచ్చే గులాబి ముళ్ళూ..
పల్లవో తెలీదు, చరణమో తెలీదు. సినిమా పాటో, లేక లలిత గీతమో తెలీదు.ఈరెండు లైన్లు మాత్రం నాకు ఇన్నేళ్ళయినా గుర్తుండి పోయాయి. ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనన్ని సార్లు విన్నట్టు గుర్తు. బహుశా తనకిష్టమైన పాట కావచ్చు.
మేము రాగానే మమ్మల్ని చూసి లోపలికెళ్ళి పోయేది. అప్పుడప్పుడు తను పంచలో మర్చిపోయి వదిలి వెళ్ళిన తన కాలేజీ నోటు బుక్కులు చూసేవాళ్ళం. పెద్ద పేద్ద లాంగు నోటు బుక్కులు. దాని నిండా ఆకుపచ్చ, ఎరుపు,గులాబి రంగుల్లో స్కెచ్ పెన్నులతో వేసిన రకకాల బొమ్మలూ, ఎర్ర ఇంకుతో అండర్లైన్ చేసిన లైన్లూ. బయాలజీ విద్యార్ధి అనుకుంటా. మేమూ పెరిగి పెద్దయి అలాంటి లాంగు నోటు బుక్కుల్లో అలా రక రకాల బొమ్మలేయాలని అనుకునేవాళ్ళం.
తను మమ్మల్ని చూడగానే పాడుతున్న పాట ఆపి లోపలికెళ్ళి పోయేది. కొన్నిసార్లు ఆ పాట లోపలి నుండి సన్నగా వినిపిస్తుండేది. అప్పుడప్పుడు ట్యూషను జరుగుతున్నప్పుడు , మాకు వెనకవైపున దండెం మీద ఆరేసిన ఏ వోణీయో,పరికిణీయో అవసరమైనప్పుడు తను పిల్లిలా చడీ చప్పుడు లేకుండా ఇలా వచ్చి తీసుకొని అలా వెళ్ళిపోయేది.
తను ఇప్పుడు యాభైలకు దగ్గరగా ఉండి ఉంటుంది అనుకుంటా. ఎదురుపడితే పోల్చుకోలేను గాని , ఒక్కసారి గుర్తుపట్టాక, పరిచయం చేసుకొని..ఆ రెండు లైన్లూ ఆమెకి వినిపించి ఆమె కళ్ళలో మెదిలే ఆశ్చర్యాన్ని చూడాలని ఉంది. నాకెందుకో బాగా నమ్మకం తను ఆపాటను ఇంకా గుర్తుపెట్టుకొనే ఉంటుందని..
మీకు ఈపాట గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి.