న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో.
(తెలియని వారికి: అమెరికాలో కనెటికట్, మెయిన్, రోడ్ ఐలాండ్, మెసాచుసెట్స్ , న్యూ హేంప్ షైర్ చివరగా వర్మాంట్ ఈ ఆరు రాష్ట్రాల్ని కలిపి న్యూ ఇంగ్లండ్ అంటారు.)
తెలుసనుకున్న నాకు: ఇప్పడే తెలిసింది. నేనేవో మూడు స్టేట్సేఅనుకున్నా. గూగులమ్మ మొట్టికాయొకటేసి మూడు కాదు ఆరంది. : )
ఇకపోతే మేమున్నది కనెటికట్ సరిహద్దులో.ఆఫీసు మాత్రం మెసాచుసెట్స్ కిందికొస్తుంది.ఇంటి నుంచి కొలువుకి దూరం ఆరు మైళ్ళు మాత్రమే.
ఇక సాంతం పైకి వెళ్లిన తరువాత నాకు ఓ పట్టాన తిరిగి దిగబుద్ధి కాదు. కానీ చాలా వరకు ఆ ప్రదేశం సందర్శకులతో ఇరుగ్గా ఉండటమూ లేదా నాతోపాటు వచ్చినవాళ్లు "ఏవుందిక్కడ అంతసేపు చూడ్డానికి " అనే విసుర్లూ విని అయిష్టంగానే దిగిపోతాను. షాపుల్లో లేదా ఏ క్యాలండర్ మీదో మరింకెక్కడో లైటు హవుసుని బొమ్మని అదాటున చూస్తే ఓ రెండుమూడు క్షణాలు మళ్ళీ తేరిపార చూడాల్సిందే.
దాదాపు పదమూడేళ్ల క్రితం కనెటికట్లో ఉన్నప్పుడు ఒక వారాంతం ప్రత్యేకంగా వీటిని చూడటానికే వెళ్లానోకసారి.దాదాపు ఎనిమిదో తొమ్మిదో అనుకుంటా. అన్నీ ఒకటేకదా అని మీకనిపించొచ్చు, కానీ దేనికదే ప్రత్యేకం. దేని అందం దానిదే. మనుషుల్లాగానే, లోపలికెళ్తే దేని కథ దానిదే.
మొన్నొక షాపులో ఓ పెయింటింగ్ నా కంట పడింది.అంతులేని అగాధం లాంటి సముద్రం, దానొడ్డునే, నిశీధిలో,కాలానికి ఎదురీదుతున్నట్లుగా సముద్రం వైపు వెలుగుని ప్రసరిస్తూ ఠీవిగా నిలబడ్డ లైట్ హవుస్.ఆకాశంలో నిండు పున్నమి.ఎంత బావుందో?ఎంతసేపు చూసినా విసుగనిపించదు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
అవి నాకు ఒంటరితనానికి ఒక ప్రతీకలా కూడా కనిపిస్తాయి. బహుశా నా ఆలోచనా సరళికీ దీనికీ ఏదో సబ్ - కాన్షియస్ కనెక్షనుందేమో వాటినంతగా ఇష్టపడటానికి.
వీటి తరువాత నాకు గుర్తొచ్చేవి న్యూ ఇంగ్లండ్ ఫాల్ కలర్స్.
ఇక్కడ సెప్టెంబరు అక్టోబరు నెలల్లో పచ్చని చెట్లు కాస్తా చూస్తుండగానే పసుపు,ముదురు నారింజ రంగుల్లోకి మారిపోయి కనువిందు చేస్తాయి.
సంవత్సరమంతా ఇంటిముందే దిగాలుగా ఓపక్కన పడున్న చెట్టుని అసలు పట్టించుకోం గాని అది కాస్త ఈ సీజన్లో రంగులు మార్చగానే "వావ్ " అనుకుంటూ కేమెరా దుమ్ము దులిపే కాలం అన్నమాట ఇది. చివరికి చెట్టు కింద రాలిన ఆకుల్ని కూడా వదలం. ఆ ఆకులు కూడా ఫోటోల్లో పడితేనే ఫోటోకి అందం,చందం, మందం అన్నీ..
కారులో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చుట్టూచూస్తే కనుచూపుమేరా ఒకప్పుడు పచ్చగా కనిపించే కొండలు ఇప్పుడు శిశిరం అద్దిన కొత్త కొత్త రంగుల్లో ఎంత శోభాయమానంగా ఉంటాయంటే మాటల్లో చెప్పలేమసలు.
ఫాల్ కలర్స్ చూద్దామని న్యూ హేంప్ షైర్ వెళ్లి అప్పట్లో కొత్తగా కొనుక్కున్న ఎస్సెల్లార్ కెమెరాలో నేను తీసిన ఫోటోలు ఇప్పటికీ చూసినప్పుడల్లా ప్రత్యక్షంగా చూస్తున్నప్పటి అనుభూతిని కలుగజేస్తాయి.వర్మాంట్ ఫాల్ కలర్స్ కూడా చాలా బావుంటాయట. వెళదామనుకున్న రెండుసార్లూ ఏవో పనులడ్డంపడి వెళ్లడం కుదరలేదు. సంవత్సరం క్రితం అనుకోకుండా ఇదిగో ట్రౌట్ అండ్ కాఫీ అనే ఈ వెర్మాంట్ వ్లాగరు నా కంట పడి మళ్ళీ ఆ అందాలను నాకళ్ల ముందుంచాడు. ప్రకృతి ప్రేమికులకు ఈయన వీడియోలు కనువిందే. అన్నీ చూసే ఓపిక లేని వాళ్ళు ఈ ఫాల్ కలర్స్ వీడియో నొకసారి చూడండి.
*************************************************
ఇక న్యూ ఇంగ్లాండ్ చలి సంగతి చెప్పనవసరంలేదు.చావగొట్టి చెవులు మూ(యి )స్తుందీ చలి.
చలినిలా తిట్టుకున్నా, సీజన్లో మంచు ఎప్పుడు పడుతుందో అని మాత్రం చాలా ఆసక్తితో ఎదురుచూసేవాడిని. 2009లో అనుకుంటా వెదర్ రిపోర్ట్ ప్రకారం రాత్రి తొమ్మిదిన్నరకి మాకు మంచు పడటం మొదలవ్వాలి. ఎనిమిదింటికి భోజనాలు ముగించి కిటికీ పక్కనే కూర్చొని టీవీ చూస్తూ పదినిమిషాలకొకసారి బయటికి చూడ్డం.ఎంతకీ పడదే? చూడంగా చూడంగా ఓ రెండు సినిమాలూ మూడు కాఫీల తరువాత ఎప్పుడో తెల్లవారు ఝాము మూడున్నరకి మొదలయింది. వీధి దీపం వెలుగులో ఆ దీపం వెలుగు పడినంతమేరా త్రికోణాకారంలో కనపడుతూ పైనుంచి బర బరా రాలుతున్న మంచుని చూసి సంతోషంతో కేమెరా క్లిక్కు మనిపించి, తెల్లవారాక కనబడబోయే ఆ తెల్ల తివాచీనీ, మంచు ఆ మోడువారిన చెట్లకొమ్మలకతుక్కొని వాటికద్దే కొత్త అందాలనూ ఊహించుకుంటూ నిద్రపోయా. (అది శుక్రవారం లెండి. లేకుంటే ఆ ఫీటు చేయకపోదును.)
ఒకసారి బాగా మంచు పడిన రోజు తప్పనిసరై బయటికెళ్లాల్సొచ్చి , కారు విండ్ షీల్డు మీదా పక్కద్దాలమీదా ఉన్న మంచుని క్లీన్ చేసి, కారు కప్పు మీద దాదాపు మూడు నాలుగు అంగుళాల ఎత్తున పేరుకుపోయిన మంచుని కదిలించడానికి బద్దకించి అలానే బయలుదేరా. కారులోపల హీటర్ ఆన్ చేయటంవల్ల పై కప్పు మీదున్న మంచు తాలూకు అడుగు భాగం వేడెక్కి కాస్త కరిగినట్టుంది, ఒక సిగ్నల్ దగ్గర బ్రేకేయగానే పైనున్న మంచు మొత్తం ఒక ప్లేట్ లాగా అలా జారి నా విండ్ షీల్డ్ ని పూర్తిగా కప్పేసింది. ఏంచేయాలో అర్ధం గాక ఠారెత్తిపోయాను. ఆ హడావిడిలో వైపర్లు ఆన్ చేయటం తలచుకుంటే నాకిప్పటికీ నవ్వొస్తుంది. : )
***************************************************
ఒక సమ్మర్లో మెసాచుసెట్స్ లోని కేప్ కాడ్ తాలూకు బీచులన్నీ( National Sea Shore అంటారనుకుంటా ) కవర్ చేసేద్దాం అని బయలుదేరాం. ఒక్కొక్కటి చూసుకుంటూ అలా అలా పై కొన "ప్రావిన్స్ టౌన్" వరకూ వెళ్ళిపోయాము. అక్కడ వీధుల్లో తిరుగుతుంటే ఆ జనాలూ, పరిసరాలవీ కొత్తగా, వింతగా కనిపించాయి. కాసేపలా తిరిగి వీధులవీ సర్వే చేసి, ఓ కాఫీ తాగి కారెక్కి వచ్చేసాం,
ఆ సోమవారం ఆఫీసులో మాటా మంతీ సందర్భంగా నేను ఇలా ప్రావిన్స్ టౌన్ వెళ్లాననగానే విని మౌనంగా ఉన్న యాంజీ మిగతావాళ్లందరూ వెళ్ళిపోయాక "ఎలా ఉందా ప్లేస్?" అని అడిగింది. ఎందుకడిగిందో అర్ధం కాక బానే ఉందన్నా. తను లో గొంతుకతో "అది 'గే ' కేపిటల్ అఫ్ ద నార్తీస్టు" అంది. ఓ అదన్నమాట సంగతి అనుకున్నా. (అమెరికాలో 'గే ' పెళ్లిళ్లని చట్టబద్దం చేసిన మొట్టమొదటి రాష్టం మెసాచుసెట్స్. )
అలా ఒక్కో బీచ్ చూసుకుంటూ వస్తూ మొత్తానికి ఒక బీచ్ లో కారుతాళాలు పోగొట్టుకున్నాను. ఆ ఇసుకలో వెతికి వేసారి మాకెదురుపడ్డ సెక్యూరిటీ అతనికి చెప్తే ఆయన రేడియోలో కబురంపి ఒకాయన్ని పిలిపించాడు. విషయం ముందే చెప్పాడు కాబట్టి ఆయన రావటమే మెటల్ డిటెక్టర్ తో సన్నద్ధం గా వచ్చాడు . దాదాపు రెండుగంటలు మేము బీచిలో ఎక్కడెక్కడ తిరిగామో అడిగి మరీ ఓపిగ్గా వెతికాడు. "ఇదేమి ఖర్మరా బాబూ" అనుకుంటూ చివరికి అలసి సొలసి కారు దగ్గరికి వస్తే కారు వెనకసీట్లో వెక్కిరిస్తూ తాళాలు. కారేమో లాకయి ఉంది ఆయనే వెళ్లి ఇంకేదో సరంజామా తీసుకొచ్చి సన్నని తీగని లోపలకి పంపి కారు అన్ -లాక్ చేసాడు.
ఈ బీచుల్లోనో మరింకెక్కడో సరిగా గుర్తు లేదు గాని, ఒడ్డున ఒక చిన్న రాతిపలక. దానిమీద సముద్రం వైపు ఒక బాణం గుర్తు వేసి "ఈ దిక్కుగా సముద్రం మీద మూడువేల మైళ్ళు వెళ్తేగాని నేల తగలదు" అని అర్ధం వచ్చేలా రాసుంది( exact phrase సరిగా గుర్తు లేదు). ఆ దేశం పోర్చుగల్ అనుకుంటా.ఓ సారి సాలోచనగా సముద్రం వైపు ఆ దిక్కుగా చూసి, మూడు వేల మైళ్ళని అంచనా వేస్తుంటే ఈ విశాలవిశ్వంలో,అందులో ఒక చిన్న రేణువంతటి ఈ భూమ్మీద "నేనూ, నా ఉనికి అసలేపాటివి?" అనిపించింది.
*****************************************
కనెటికట్లో మేమున్న అపార్ట్మెంట్ లీజింగ్ ఆఫీసులో క్యాథీ అనే ఒకామె ఉండేది. ఈమెకీ నాకూ లంకె ఎలా కుదిరిందో నాకసలు గుర్తు లేదు గాని కనబడినప్పుడలా మెట్ట వేదాంతం తెగ మాట్లాడుకునే వాళ్ళం. ఈమె చెప్పిన వాటిల్లో ఇదొకటి నాకు చాలా బాగా గుర్తుండి పోయింది.
"జీవితంలో నీకు తారసపడే ప్రతి వ్యక్తి నీకు ఏదో ఒకటి నేర్పడానికే నీ పరిధిలోకొస్తాడు. ఆ పరిచయం దైవికం. అందరిలా తొందరపడి మంచీ చెడూ 'జడ్జ్ ' చేసి మాయలో పడిపోకుండా కాస్త 'దూరంగా' ఉండి గమనించడం నేర్చుకో."
ప్రాక్టికల్ గా అదెంత కష్టమో నెమ్మదిగా తెలిసొచ్చింది. దాదాపు పన్నెండేళ్ల తరువాత కూడా ఈ విషయంలో ఓనమాల స్టేజ్ లోనే ఉన్నా.
'నా' అన్న భావన బలంగా ఉన్నప్పుడు ఆ "దూరం" దుర్లభం.
సరే, మెట్ట వేదాంతపు రోజులు కదా, అప్పట్లో ఆమె చెప్పిన మాట విన్నాక ఇదేదో బావుందే అని సరదాగా ఎక్సెల్ షీట్లో ఒక నెలపాటు నా బాల్య స్నేహితులూ,చిన్నప్పటి క్లాస్మేట్లూ,అసలొక్క మాటకూడా మాట్లాడకుండా చూసీ చూడగానే అమాంతం (నేను : ) ) మనసు పారేసుకున్న బోల్డు మంది అమ్మాయిలూ, పాఠాలు నేర్పిన గురువులూ, ఇరికించిన కోలీగ్సూ, సాధించిన మానేజర్లూ అలా దాదాపు ఓ రెండొందల పేర్ల దాకా రాసినట్టు గుర్తు. నిజానికి అలా గుర్తుతెచ్చుకొని రాయడం చాలా బావుండేది. ఆ తరువాత ఆ ప్రాజెక్టు అటకెక్కేసింది. మనం చాలా బిజీ కదా.
క్యాథీ ఒకసారి నాకు టెన్నిస్ అంటే ఇష్టమని తెలిసి "రేపొకసారి ఆఫీసుకి రా" అంది. వెళ్ళగానే ఒక వుడెన్ రాకెట్ చూపించి " దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?" అంది.
"మీరు చిన్నప్పుడు ఆడిన ఫస్ట్ రాకెట్ ?" అన్న వెంటనే నాలుక్కరుచుకున్నాన్నేను.
ఆవిడ అసలు నా మాటలు పట్టించుకోకుండా ..
"కాదు.ఇది క్రిస్ ఎవర్ట్ ఆడిన రాకెట్. మా అక్క కి గిఫ్ట్ గా ఇచ్చింది క్రిస్. తను నాకిచ్చింది."
యాంటీక్ అన్నమాట.
గాల్లో దాన్ని అటూ ఇటూ ఊపబోయినవాణ్ణల్లా రిస్కెందుకని,వెంటనే జాగ్రత్తగా తిరిగిచ్చేస్తూ అన్నాను.
"బావుంది.చాలా బావుంది"
అప్పుడప్పుడు టెన్నిస్ టీవీలో క్రిస్ కనపడినప్పుడు క్యాథీ గుర్తొస్తది.
ఆమెకి చదివే హాబీ ఉందని తెలుసు కాబట్టి అపార్ట్మెంట్ ఖాళీ చేసేటప్పుడు ఆమె కి Eckhart Tolle రాసిన "The Power of Now" ఇచ్చాను .
వర్జీనియా కొచ్చ్చాక దాదాపు ఒక సంవత్సరం పాటు ఆమె నుంచి అప్పుడప్పుడు ఉత్తరాలొచ్చేవి. ఆమె చేతి రాత ఓ పట్టాన అర్ధం కాదు.రెండు పేజీల ఉత్తరం చదవటానికి నాకు దాదాపు పదిహేను నిమిషాల పైనే పట్టేది(అప్పటికీ కొన్ని పదాలు అర్ధంగాక విసుగొచ్చి వదిలేయగా).
ఆమెలో నేను గమనించిందీ ఏమిటంటే పరిచయాన్నీ,వృత్తిధర్మాన్నీ నిర్దాక్షణ్యంగా వేరు చేయగలగటం. పనికి సంబంధించినదేదైనా చెప్పాల్సొస్తే నిష్కర్షగా మొహం మీదే చెప్పేస్తుంది.
ఆమె ఒకసారి మొక్కలు పెంచుకునే ఉబలాటం ఉన్నవాళ్ళకి వాళ్ళ వాళ్ళ అపార్ట్మెంట్ బిల్డింగ్ బయట, గోడ పక్కగా ఒక 4X4 అడుగుల మేర మొక్కలు పెంచుకోవచ్చని పర్మిషనిచ్చేసింది. కొలవడానికి బద్దకించి నేను ఆ 4X4 ని కాస్త ఒక అడుగు అటూ ఇటూ (అటే, ఇటు కాదులెండి : ) ) చేసేసరికి నేనేదో బోర్డరు దాటి పాకిస్థాన్ని ఆక్రమించినంత నేరం మోపి నానా యాగీ చేసిందావిడ.
ఆ అపార్టుమెంటు కమ్యూనిటీ నిండా 'మన' వాళ్లే. నన్ను చూసి మిగతావాళ్ళు కూడా మొదలెడతారని ఆమె భయం.
ఇప్పుడామె ఎలావుందో, ఏంచేస్తోందో? అపార్ట్మెంట్ ఖాళీ చేసి ఆమెని చివరిసారిగా కలుద్దామని వెళ్ళినప్పుడు క్లబ్ హౌస్ సోఫాలో కూర్చొని ఇద్దరం కలిసిదిగిన ఫోటో గుర్తొచ్చింది.గూగులమ్మ వలలో ఇంకా పడని రోజులవి. డిజిటల్ కెమెరాలో దిగిన ఆ ఫోటో పదిహేనేళ్లనాటి డొక్కు డెస్క్ టాప్ హార్డుడిస్క్లో భద్రంగా నిద్దరోతోంది.
*******************************************
ఇక అసలు విషయానికొస్తే......
కొన్ని వారాల క్రితం "అమ్మే'జాన్ ప్రైము లో ఏదైనా మంచి సినిమా చూద్దామని వెతుకుతుంటే కనపడిందీ సినిమా ("మాంచెస్టర్ బై ద సీ ") .
నా ప్రోటోకాల్ ప్రకారం,ముందు సినిమా కథ చదివి ఆ పై సినిమా ఒక రెండునిమిషాలపాటు చూసి, పాజ్ చేసి, IMDB ని కెలికితే సినిమా నేపధ్యం మెసాచుసెట్స్ లోని మాంచెస్టర్ అనే ఒక చిన్న టౌను అని తెలిసింది. అంతే.. నా ఆసక్తి వందింతలైంది.
సినిమా మొదలవటమే నీటి మీద బోటు ప్రయాణంతో మొదలవుతుంది. "బోటు వెళ్లేది నీటిమీదే కదటోయ్" అనకండి. ముందు నీళ్ళూ ఆ తరువాత బోటూ కనపడతాయన్నమాట.నాకు ఈతస్సలు రాదుగాని నీళ్లంటే మాత్రం చాలా చాలా చాలా చా.........లా.... ఇష్టం. సో మొదటి షాట్ తోటే సినిమాతో ప్రేమలో పడిపోయా. "లవ్ ఎట్ ఫస్ట్ షాట్ " అన్నమాట. పైగా బ్యాక్ గ్రౌండ్లో వచ్ఛే కోరస్ నన్ను కట్టి పడేసింది. ఆ తరువాతెలాగూ ఆ బ్రిక్ బిల్డింగులూ, మంచూ,ఆ రోడ్లూ, ముసురు పట్టిన ఆకాశమూ, సముద్ర తీరంలో ఎగిరే సీగల్స్ పక్షులూ, వాటి అరుపులూ .. అబ్బో ..అవన్నీ నన్ను కట్టకట్టి కనెటికట్లో పడేశాయి.
వింటర్లో షూట్ చేశారు కాబట్టి చలి కూడా ఈ సినిమాలో ఓ కేరక్టరే. కథ నడుస్తున్నప్పుడు తెరమీద కనపడే పాత్రధారులను ఎంత ఆసక్తితో చూశానో అంతే ఆసక్తితో పరిసరాలనూ పరికించిన సినిమాఇది. (తెర మీద కనపడే పరిసరాలనండోయ్, తెర బయటివి కాదు. : ) .
సినిమా కథ పరంగా పెద్ద చెప్పుకోడానికేమీ లేదు. తన లోకంలో తనుంటూ ప్లంబింగ్ పని చేసుకొని పొట్టపోసుకొనే మన కథా నాయకుడికి తన అన్నయ్య చనిపోయాడని ఫోనొస్తుంది. వాళ్ళన్నయ్య పోతూ పోతూ విల్లులో తన టీనేజీ కొడుకు బాధ్యత మన కథానాయకుడిమీద పెడతాడు. అప్పటికే గతంలో జరిగిన ఒక విషాదంతో సతమత మవుతున్న ఈయనా, అకస్మాత్తుగా ఊడిపడ్డ ఈ దత్తపుత్రుడూ ఇద్దరూ కలిసి చేసే కొద్దిపాటి ప్రయాణేమే ఈ సినిమా. పెద్ద మలుపులేవీ లేకుండా సినిమా చాలా సాదా సీదాగా నడుస్తుంది. ఆకట్టుకొనే మంచి 'ఫీల్ బ్యాడ్' సినిమా ఇది.
ఇంతకీ కథా నాయకుడు యాక్షన్ భలే చేసాడే ఎవరీయన అని చూద్దును కదా, ఆ సంవత్సరానికి(2017) ఆ సినిమాకే ఉత్తమ నటుడిగా ఆస్కార్ కొట్టేసాడీ పెద్దమనిషి (కేసీ అఫ్లెక్).
మీకు వీలయితే మాత్రం ఈ సినిమాని చూడండి. నచ్చితే ఒకే. నచ్చకపోతే నన్నూ, ఈ పోస్టునీ మర్చిపోండి. మీ సమయం వృధా అయినందుకు నా ముందస్తు 'సారీ' : )
**********************************************************
అదండీసంగతి. ఈ సినిమా చూసేసరికి నా న్యూఇంగ్లాండు జ్ఞాపకాలు నన్నిలా ముంచెత్తేసాయన్నమాట.
పోస్ట్ స్క్రిప్ట్ :
గత సంవత్సరం నుంచి మాత్రం కాస్త మార్పుకోసం టెక్సాక్ ,అట్లాంటా లేదా నార్త్ కెరొలినా కన్నా వలస పోదామని అనిపిస్తోంది.నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. చూడాలి ఏమవుతుందో?ఈలోపే నార్తీస్టు ట్రిప్ వేయాలనీ, అప్పట్లో మేమున్న అపార్టుమెంట్లూ, తిరిగిన రోడ్లూ, చూసిన ప్రదేశాలని మరొకసారి చూద్దామనీ,ముఖ్యంగా పిల్లలకి చూపిద్దామనీ చాలా రోజులుగా ఒక ఆలోచన .
మనసులో మాత్రం ఏదో ద్వైదీ భావం. ఏమో, చూద్దాం.


2 comments:
కనెక్టికట్ కాదండి. కనెటికట్ అని పలకాలి. గూగులమ్మని అడగండి - మొట్టికాయ వెయ్యకుండా చెప్తుంది. ఇంతకీ కనెటికట్‌లో ఏ ఊరో రాయలేదు. నేను అమెరికా వచ్చిన కొత్తలో ఒక 6 నెలలు డాన్‌బరీ లో ఉన్నాను. మీ కనెటికట్ కథలు బావున్నాయి.
అవునండీ.. మొన్న సరదాకి పిల్లలకి చదివి వినిపిస్తే వాళ్ళు కూడా పడి పడి నవ్వి అదే అన్నారు.మార్చుదామనుకొని బద్దకించా.. అలానే వెర్మాంట్, వర్మాంట్, మేస..చూ.. సెట్స్ ఆలా... కొన్ని రాసాక కూడా సవరిస్తా కొన్నలా వదిలేస్తా..
'కనెటికట్' లో నేనున్నది మొదట్లో ఎన్ ఫీల్డ్(Enfield) ఆ తరువాత ఈస్ట్ విండ్సర్.
Post a Comment