నచ్చకో మరెందుకో పబ్లిష్ చేయకుండా వదిలేసిన పాత పోస్టులు చూస్తుంటే ఇదిగో ఇది కనపడింది. తారీఖు చూస్తే జులై 31, 2010. అప్పటికింకా పిల్లలు పుట్టలేదు. చదువుతుంటే చాలా నోస్టాల్జిక్ గా అనిపించింది.
**********************************************************************************************************
ఎన్ని రోజులు..కాదు కాదు ..ఎన్ని ఏళ్ళయిందో మధ్యాహ్నం పూట నిద్ర పోయి. ఇదిగో ఈరోజు మధ్యాహ్నం భోజనం తరువాత ఒంటిగంట నుండి సాయంత్రం దాదాపు ఆరింటి వరకు తనవితీరా నిద్రపోయాను. నిద్రలేచాక బాల్కనీ లోకి వచ్చి చూస్తే చుట్టూ ఉన్న ప్రపంచం చాలా కొత్తగా,ప్రశాంతంగా ఉంది.పక్కనే ఉన్న డల్లాస్ ఎయిర్ పోర్టు లో ఇప్పుడే టేకాఫ్ అయ్యీ, అలానే దిగటానికి సిద్దమవుతూ ఆకాశంలో ఐదారు విమానాలు.
కదలకుండా విగ్రహంలా నిలబడ్డానేమో ,నా పక్కనే ఒక పిచ్చుకవాలింది. బుజ్జి పిచ్చుక. కంగారు కంగారుగా అటూ ఇటూ గెంతుతూ, దొరికిన వాటిని ముక్కునకరచి (తినడానికి పనికొస్తుందేమో అని) పరీక్షిస్తూ, విదిల్చి వదిలేస్తూ....
కదిలితే ఎక్కడ ఎగిరిపోతుందో అనుకుంటూ కనుచివరలనుండి దాన్నే చూసా కాసేపు.
ఎదురుగా ఉన్న ప్లే ఏరియా నుంచి పిల్లల కేరింతలు.......
ఇదే సాయంత్రం మిగతా రోజుల్లో ఎంత భిన్నంగా ఉంటుందో. ఆకలీ,నీరసం, రేపటిగురించిన ఆలోచనలతో మనసంతా గజిబిజి.ఎంత అసహనంగా ఉంటుందంటే, ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ముప్పై సెకన్లకి మించి ఉండదని తెలిసినా, రెడ్ లైటు పడగానే కారాపటానికి ఎంత చిరాకో .
ఈ ఐదుగంటల గాఢమైన నిద్ర రోజూ చూసే ప్రపంచాన్ని నాకు కొత్తగా పరిచయం చేస్తోంది.
బాల్కనీలో కాసేపుండి లివింగ్ రూంలో కొచ్చాను.
సగం చదివి పక్కన పెట్టిన పుస్తకమూ , టీపాయ్ మీద పొద్దునెప్పుడో తాగిన కాఫీ కప్పూ , టీవీ ముందు గుడ్లు మిటకరిస్తూ నావైపే చూస్తున్నట్లున్న కప్ప బొమ్మా,క్రితం రోజు మా ఇంటికొచ్చిన చిట్టి గెస్టు అద్విత స్వారీ చేసీ చేసీ అలసిపోయి పక్కన పడేసిన గుర్రం బొమ్మా, సింక్ లో పడున్న అంట్లూ,తెరిచి చూసి ఇంకా చెత్త బుట్టలో పడేయకుండా సోఫాలోనే ఉంచిన ముందటిరోజు తాలూకు ఉత్తరాలూ ఇవేమీ ఇల్లు సర్దాలన్న ఆలోచననే దరికిరానీయక పోగా, ఇందులో కూడా అందముంది చూడగలిగితే అని నాకు చెప్తునట్టనిపిస్తోంది.
ఇల్లంతా స్థబ్దుగా ,ప్రశాంతంగా ..
తనింకా నిద్ర లేచినట్టులేదు.
కిందకెళ్ళి ఇంటి పక్కనే ఉన్న మెక్ డొనాల్డ్స్ లో ఒక కాఫీ, అలాగే అందులోనే ఉన్న రెడ్ బాక్స్లో ఒక డీవీడీ?
ఎలాగూ ఈరోజిక బయటికెళ్లే ప్లాన్స్ ఏమీ లేవు.
అనుకున్నదే తడవు, ఒక రెండు నిమిషాల తరువాత వేడి నీటి షవర్ కింద..
ఆ వేడి నీళ్ళు వంటిమీద పడుతుంటే అణువణువూ రీచార్జ్ అవుతున్న ఫీలింగ్..ఓ పట్టాన షవర్ వదిలి రాబుద్ది కాదు. ఇప్పుడనేకాదు, పనిదినాల్లోకూడా ఆఫీసుకి లేటుగా వెళ్ళిన ప్రతి పది సందర్భాల్లో తొమ్మిది సార్లు ఇదే కారణం. ఎంత ఆలస్యంగా నిద్ర లేచినా షవర్ సమయాన్ని కుదించడం నాకు చాలా కష్టం.
స్నానం చేసి రెడీ అయి అడుగు బయట పెట్టగానే వెచ్చటి వేసవి గాలి. మరీ అంత వేడిగాలేదు.
ఈలోపు తను నిద్రలేస్తే? సరే, ఫోన్ చేస్తుందిలే..
మెట్లమీద మూడో ఫ్లోర్ లో ఎదురు పడ్డాడు వాడు నాయనమ్మ భుజం మీద సేద తీరుతూ. వాడికి ఇప్పుడిప్పుడే పళ్ళొస్తున్నాయట. నన్ను చూసి ముగ్ద మనోహరంగా నవ్వాడా ఒంటిపన్ను రాక్షసుడు. ఆ నవ్వు మిగతారోజులకంటే ఎంతో అందంగా ఉంది.
"..విలో విరిసిన పారిజాతమో.."
కార్లో కూర్చుని ఇగ్నిషన్ కీ తిప్పగానే సీడీలో క్రితం రోజు సాయంత్రం సగం విన్న పాట ఆటోమేటిగ్గా మొదలయింది.
సహజంగానే మధురమైన పాట... ఇప్పుడు మరింత మధురంగా.
పాత పాటలంటే ఎందుకంత ఇష్టం? వాటిలోని సాహిత్యమా?సంగీతమా?పాడినవారి ప్రతిభా?
బహుశా బాల్యం నుంచి వినీ వినీ నా ప్రమేయం లేకుండానే సబ్ కాన్షియస్ గా ఆ పాట చుట్టూ పెనవేసుకున్న జ్ఞాపకాలూ,అంతులేని ఆపేక్షా అయిఉంటాయి.
పాట పూర్తయ్యే వరకూ కారుని కదల్చబుద్దికాలేదు. తరువాతి పాట "సిరిమల్లె పువ్వా".
నాకా సీడీలో ఉన్న పాటలెన్నో తెలుసు. ఈలెక్కన కారు ఇంకో అరగంట పాటు కదలదు.
బలవంతాన కారు బయటికి తీశాను.
3 comments:
బావున్నాయండీ కబుర్లు.. తీరికగా ఆస్వాదించ గలిగితే అన్నిటిలో అందాన్ని చూడగలమేమో..
meetho manmmalni teesuku vellipoyaaru ....!!
బద్ధకపు మధ్యాహ్నాలు తెచ్చే ఆనందమే బోల్డంత 😊
Post a Comment