ఇంగిలీసు పేర్లు- తెలుగు అర్భకుడు

Tuesday, October 7, 2008

నన్ను జీవితకాలం వెంటాడే బాధల్లో ఇదొకటి. చిన్నప్పటి నుంచీ "ఆంధ్రుల ఆరాధ్య తెలుగు వార్తా పత్రిక" ని అమూలాగ్రం చదివే అలవాటు వల్ల సంక్రమించిన చిన్నపాటి బలహీనత. ఏమాట కామాటే చెప్పుకోవాలి ఆ చదివే అలవాటే లేకుంటే ఇప్పటికీ బహుశా నేను అటు తెలుక్కీ ఇటు ఇంగ్లిష్ కీ, రెంటికీ సమాన న్యాయం చేసే సంకర భాషలో మాట్లాడుతూ, అక్షరాలు పట్టి పట్టి చదువుతూ ఉండేవాణ్ణేమో. ఆరకం గా నేను బోల్డు అదృష్టవంతుణ్ణి.

ఇక అసలు విషయానికొస్తే, ఒక నాలుగేళ్ళ క్రితం అనుకొంటా, ఇండియాలో నేను పనిచేసే కంపెనీ తాలూకు H.R విభాగం లోకి అడుగు పెట్టాను, నా అమెరికా ప్రయాణం తాలూకు పేపర్లు అందుకోడానికి. నేను సంప్రదించాల్సిన కిరస్తానీ లలనామణి ఎవరితోనో మాట్లాడుతుండడంతో, అక్కడే నిలబడి ఆమెనే చూస్తూ ఉంటే తేడాలొచ్చేస్తాయని ఆ పక్కనే ఉన్న నోటీసు బోర్డు లో మా కంపనీ వాళ్ళు డబ్బులిచ్చి వేయించుకున్న వార్త తాలూకు పేపర్ కటింగు చదవటం ప్రారంభించాను. కళ్ళటూ, చెవులిటూ అన్నమాట. కాసేపాగాక తలతిప్పి చూస్తే, నేను కలవాల్సిన ఆమె గుమ్మం దాటుతూ కనిపించడం తో మళ్ళా ఈమెని ఎక్కడ వెదికి పట్టుకుంటాం రా బాబూ అనుకుంటూ గట్టి గా పిలిచాను "మిచెల్లీ, మిచెల్లీ" అంటూ. ఆ వెంటనే ఆ గదిలో ఉన్న నాలుగైదు తలకాయలు నావైపే తిరగడం, అందులో కొందరు ఒకరకమైన జాలితో నావైపు చూడడం గమనించా. ఆ తరువాత ఒకరెండు రొజులకు నేను నా కొలీగ్ తో మాట్లాడుతూ మళ్ళీ పొరపాటున "మిచెల్లీ" అనడం, వాడు పొట్ట పట్టుకొని నవ్వడం. నవ్వీ నవ్వీ ఆ తరువాత చెప్పాడు, స్పెల్లింగ్ "మిచెల్లీ" (Michelle) అని ఉన్నా "మిషెల్" అనాలట. నిజానికి ఆ విషయం నాకు గుర్తుంది, కాని అన్నివేళలా గుర్తుండాలంటే కష్టం కదా. ఫుట్టినప్పటి నుండీ బొత్తిగా తెలుగు బుర్రాయె మనది.

ఇక్కడికొచ్చాక ఈ పేర్ల ఇబ్బంది మరీ ఎక్కువైపోయింది . నా ఆంగ్ల భాషా పరిజ్ఞానం మరీ అంత తీసిపారేయాల్సిన తీరులో ఉండదు గాని, ఈ పేర్లే ఇప్పటికీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత గుర్తు పెట్టుకుందామను కున్నా అన్నివేళలా కుదరదుగా.అలవోకగా "అసలుపేరు" బయటికొచ్చేస్తుంది అప్పుడప్పుడూ. "సేరా" "సారా" అయిపొతుంది, "షాన్ కానరీ" "సీన్ కానరీ" అయిపోతాడు, ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. మధ్య మధ్య లో ఈ నిశ్శబ్దాక్షరాలొకటి. ఈ పదాల పుట్టుక (ఎటిమాలజీ) నా కంతగా తెలీదు గాని, ఒక అక్షరాన్ని రాసి మరీ దాని గొంతు ఎందుకు నులిమేస్తారో అర్ధం కాదు నాకు. ఈ భాషకు కూడా కొన్ని వందల యేళ్ళ చరిత్ర ఉంది కాబట్టి, దానికివ్వాల్సిన గౌరవం దానికివ్వాలి కాబట్టి నాలో నేనే సరిపెట్టుకుంటాను. మొన్నటికి మొన్న మా మేనేజర్ తో నాకున్న టెన్నిస్ జ్ఞనాన్నంతా రంగరించి "జాన్ బోర్గ్" గురించి మాట్లాడుతుంటే, అంతా విన్న ఆయన, అప్పుడే జ్ఞానోదయమైన వాడిలా టక్కున నువ్వు మాట్లాడెది "బ్యొన్ బోర్గ్"(Bjorn Borg) గురించికదూ అన్నాడు. "ఆల్ టైం గ్రేట్" ఆటగాడు కాస్తా "అన్నోన్" అయిపొయాడు కాసేపు. నాకేం తెలుసు, మా ఊరి పేపర్లో అలాగే రాస్తారు మరి.

మీటింగుల్లో, వీడియో కాన్ ఫరెన్సుల్లో నా మాటల ప్రవాహానికి ముందరికాళ్ళ బంధం ఈ ఇంగిలీసు పేర్లు.పేర్ల దగ్గర ఏమిటొ పదాలు కరువైనట్టు ఆగిపోతాను, ఎక్కడ తప్పు పలికితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని. తిట్టినా క్షమిస్తారు గాని, పేరు తప్పు పలికితే అదోలా ఫీలవుతారు వీళ్ళు.

ఒక్క మనుషుల పేర్లకే పరిమితం కాదిది. మన పత్రికల్లో సోమర్ విల్ ఇప్పటికీ "సోమర్ విల్లే", "కసీనో" కాస్తా "కేసినో" నే, "ఒహాయో" ఇంకా "ఓహియో" నే, "కెరోలినా" ఇంకా "కరోలినా" నే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టొక చాంతాడు. ఇలాంటి చాలా పదాలను నేను జయించాననుకోండి, అది వేరే విషయం.

అయినా వీళ్ళు మాత్రం మనపేర్లను ఎంత బాగా ఖూనీ చేస్తారంటారూ? చెప్పుకుంటే అదో పెద్ద టపా.

ఏదేమైనా గాని, నాకు ఈ పేర్ల ప్రహాసనం తట్టుకోలేనంత పెద్ద సమస్య అనిపించదు లెండి. ఆ పేపరు పఠనం నాకు ఓనమాలు నేర్పి, నాలో సాహిత్యాభిలాషని రగిలించి, ఎన్నెన్ని మంచి పుస్తకాలని చదివించిందో.. దానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. ఈ బోడి ఇంగిలీసు పేర్లు.........పెద్ద సమస్యే కాదు...

18 comments:

రిషి said...

హహ..బాగా చెప్పారు. నాకు కూడా ఇక్కడ చాలా పేర్లు ఎలా పలకాలో తెలీక తిక్క రేగిపోతూ ఉంటుంది.

'ఒక అక్షరాన్ని రాసి మరీ దాని గొంతు ఎందుకు నులిమేస్తారో అర్ధం కాదు నాకు' - ఇది మాత్రం కేక :)

ప్రపుల్ల చంద్ర said...

నాకు మొదటినుండి ఇలాగే అనిపించేది... ఒక విధంగా వ్రాయడం మరో విధంగా చదవడం ఏంటీ అని....

Anonymous said...

Las Angeles వచ్చిన కొత్తలో california maap లో ఎంతవెదికానో... ' సానోసే ' , ' ల హోయా ' కొరకు.

ఎక్కడా కనపడవే...తరువాత్తెలిసింది అవి San Jose , La Jolla అని.

:-)

-భరత్

వేణూ శ్రీకాంత్ said...

'ఒక అక్షరాన్ని రాసి మరీ దాని గొంతు ఎందుకు నులిమేస్తారో అర్ధం కాదు నాకు' - భలే చెప్పారండీ నాదీ ఇదే ఫీలింగ్. ఆ మాత్రం సైలంట్ అయిన కాడికి వ్రాసి ఛావడం ఎందుకుట అని తిట్టుకునే వాడ్ని. మొదట్లో నేనూ ఇంచు మించు ఇవే ఇబ్బందులు పడ్డాను.

laxmi said...

ivanni oka ettu, akkada unde chinki (ade china jathi ki chedina vallu)vallatho matladatam, valla perlu palaktam oka etttu. cinema chupinchestaru. bagundi tapa :)

బొల్లోజు బాబా said...

భలేగా వ్రాసారు. ఉచ్చారణలో ఉండే తేడాల వల్ల ఒక్కోసారి ఇబ్బంది గానే ఉంటుంది.
నేను తమిళనాడులో చదూకొనే రోజుల్లో నా పేరుని (బాబా) పాపా అని పిలిచే వారు. మొదట్లో ఇదెక్కడ గొడవెహె అనుకొనేవాడిని. తరువాత తెలిసింది నేను వారికి బ కి ప కి ఒకే అక్షరం కనుక నా పేరు పాపా అయిపోయింది.

బొల్లోజు బాబా

మీనాక్షి said...

chaalaa baundi mee post..
oka aksharanni rasi maree daani gontu enduku nulimestaaro--ba raasaaru..

చైతన్య క్రిష్ణ పాటూరు said...

బావుంది మీ టపా. ఈ సమస్య మన భారతీయులందరికి వున్నదేలెండి. మన భాషల్లో ఎలా రాస్తామో అలాగే పలికే మనకు, ఇలా అక్షరాలు మింగెయ్యటం ఉచ్చారణా దోషం క్రింద లెక్క. యజ్ఞయాగాదుల్లో మంత్రోచ్చారణలో తేడా వస్తే యాగ ఫలితమే మారిపోతుందని మన పూర్వీకుల నమ్మకం. ఆ వారసత్వంతో వచ్చిన మనకి, ఇలా అక్షరాలు మింగేసి చదవటం కొంచం కష్టమే మరి.

ఇంగ్లీషులో ఈ నిశబ్దాక్షరాల గొడవేమిటని కనుక్కుంటే తెలిసినదేమిటంటే, ఈ నిశబ్దాక్షరాలలో ఆ పదాల గత చరిత్ర(etymology) ఉందని. లాటిన్, ఫ్రెంచ్ మొదలైన యూరోపియన్ భాషల నుంచి అరువు తెచ్చుకున్న పదాల ఉచ్చారణ ఇంగ్లీషులోకొచ్చాక మారిపోయినా, వాటి అసలు పుట్టుక తెలుసుకోటానికి వీలుగా స్పెల్లింగ్ మాత్రం అలాగే ఉంచేసారట. దీనికి తోడు అక్షరాలు తక్కువ.

తెలుగు కంటే 26 అక్షరాల ఇంగ్లీష్ సులువని వాదిస్తాం కానీ, ప్రతి పదానికి స్పెల్లింగు, ఉచ్చారణా, సందర్భం విడివిడిగా గుర్తుపెట్టుకోవాలి ఈ భాషలో. బయటకి సులువైన పదాలు కనిపిస్తాయిగానీ, మిగతా contextual processing అంతా మన మెదడులోనే జరగాలి. మనకా శ్రమని తగ్గించటానికి క్లిష్టమైన శబ్దాలు, అక్షరాలు తనలో ఉంచుకుని తెలుగు కష్టమైన భాషగా పేరు తెచ్చుకుంది.

రమణి said...

హ హ హ బాగుందండీ ఈ ఆంగ్ల పేర్ల ప్రహసనం. నిజమే వాళ్ళు మనలా "వీర వెంకట నాగ శివ పార్వతీ పరమేశ్వర రావు " అని పిలవమనండి చూద్దాము. ఎవరి కంఠం నెప్పి ఎవరికి తెలుస్తుంది చెప్పండి చాలా హాస్యంగా రాసారు. బాగుంది. సరదాగా నవ్వేసుకొన్నా

teresa said...

:))

yavan said...

మానం ఇంకా నయం,
పాపం హిందీ వారు ఇంగ్లిషు ని ఎలా రాస్తారో చూస్తే అసలు ఇంగ్లిషు ని మర్చి పోతాం.

కొత్త పాళీ said...

పొల్లోజు పాపా అవర్ఘళే .. వణక్కం!:)

ఉమాశంకర్, బాగుంది మీ ఆంగ్ల నామ ప్రహసనం. ఐతే ఒహాయో, కేరలైనా ఇత్యాది పేర్లలో తేడా అక్షరాల గొంతు నులిమివేత వల్ల గాక కేవలం ఉచ్చారణలోని తుగు వల్ల వచ్చినదని గమనించండి.
ఐనా ఏం పర్లేదు, ఏతావాతా, మన దేశంలో సైన్ బోర్డుల మీద ఇంగ్లీషుని దారుణంగా చిత్ర వధ చేసి అన్నిటికీ పగ తీర్చుకుంటున్నాం లేండి :)

ఉమాశంకర్ said...

@రిషి, ప్రపుల్ల, భరత్, వేణూ శ్రీకాంత్, లక్ష్మి, బాబా, మీనాక్షి, చైతన్యకృష్ణ, రమణి, teresa, యవన్, కొత్తపాళి గార్లకు: మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

@చైతన్య కృష్ణ గారు: మీరన్నది కరెక్ట్. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే national spelling bee పోటీ చూస్తూంటాను. పదం పుట్టుకని బట్టి దాని స్పెల్లింగ్ ఉంటుంది. కొన్ని పదాల స్పెల్లింగులైతే ఊహకందవు, మన అదృష్టం వాటిని మనం మన పత్రికలలో అంతగా చూడం తెనుగీకరించబడి.

@బాబాగారు: మీ కొత్తపేరు బావుంది.

@కొత్తపాళి గారు: అవునండి. కొన్నేమో అక్షరాల "గప్ చుప్" అయితే, మరి కొన్ని ఉచ్చారణ లో ఉన్న భేదం తెలుగులో కొచ్చేసరికి.

నాలాంటి వారు మరికొందరు ఉంటారు అని అనిపించి సరదాగా రాసింది మాత్రమే ఇది.

అబ్రకదబ్ర said...

పాపం పత్రికలోళ్లని మరీ అంతలా ఆడిపోసుకుంటే ఎలా? ఇప్పుడంటే ఇంటర్నెట్ ప్రభంజనం వల్లా, ఇతర సాంకేతిక విప్లవాల వల్లా ప్రపంచమో కుగ్రామమైపోయి, రకరకాల దేశాల్లో ఆంగ్ల పదాల ఉచ్ఛారణ ఎలా ఉంటుందో ఇండియాలో ఇంట్లో కూర్చునే తెలుసుకునే సదుపాయాలున్నాయి గానీ పదేళ్ల క్రితం దాకా ఆ అవకాశం అందరికీ లేదు కదా. అందుకే పదాల్లోని అన్ని అక్షరాలనీ తనివితీరా ఒత్తొత్తి పలికే అలవాటైపోయుంటుంది.

చంద్ర మోహన్ said...

ఇంగ్లీషు వాళ్ళు మన ఊరి పేర్లను శాశ్వతంగా మార్చిపారేయగా లేనిది మనం కొంచెం అటూ ఇటూగా పలికితే ఫరవాలేదులెండి. వారి నోళ్ళలో పడి తిరువళ్ళిక్కేణి ట్రిప్లికేన్ గా విశాఖపట్నం వైజాగ్ గా కోజికోడ్ (జి ని zh వ్రాయాలి నిజానికి) కాలికట్ గా, ఇంకా చాలా వందల పేర్లని మరిన్న వందల రకాలుగా మార్చేశారు కదా. ఇప్పటికి కూడా ఇండియాను ఫ్రెంచి వారు 'ఆండ్'అని (l'Inde ) జర్మనీ వారు 'ఇండియెన్' అని (Indien)వ్రాస్తారు, పలుకుతారు. అందుకు వారేమీ నామోషీ ఫీలవరు. వారి భాషా నియమాలకనుగుణంగా ఉన్నదే వారి దృష్టిలో సరైన ఉచ్చారణ.

సరదాగా ఉంది మీ టపా!

ఉమాశంకర్ said...

@అబ్రకదబ్ర: ఆడిపోసుకోవడం ఏమీ లేదండి. నిజానికి ఇండియా వదిలి రాకపోతే అసలు సమస్యే లేదు. చెప్పానుకదా హాస్యానికి రాసాను అని.

@చంద్రమోహన్ గారు: భేషైన మాట సెలవిచ్చారు.

చిన్ని said...

భలే నవ్విస్తారండి ........మిచెల్లి బాగుందండి .

ఉమాశంకర్ said...

ఒబామా వాళ్ళావిడ పేరు మిషెల్. ఆయన ఎన్నికయిన రోజు తెలుగు పేపర్లో ఎక్కడ చూసినా "మిచెల్లీ" యే.. :(

ఓపిగ్గా నాబ్లాగులో దాదాపు అన్ని పోస్టులూ చదివి కమెంట్లు రాసినందుకు ధన్యవాదాలండీ.

 
అనంతం - by Templates para novo blogger