మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

Sunday, October 19, 2008

మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా?నిన్న రాత్రి ఒంటిగంటప్పుడు ఆఫీసు సెల్ ఫోను కార్లోనే మర్చిపోయిన విషయం గుర్తొచ్చి, కిందకొచ్చి దాన్ని తీసుకొని, లోపలికి రాబోతూ ఒక్కసారి తల పైకెత్తి చూసాను. ఆ నిశీధి వేళ నల్లటి ఆకాశం, ఒక పక్క పున్నమి చంద్రుడు, చాలా మనోహరం గా ఉందా దృశ్యం. కాసేపలా చూస్తూ ఉండిపోయా..
*****************************************************************

నా చిన్నప్పుడు వేసవొచ్చిందంటే రాత్రుళ్ళు మిద్దేమీదే పడక. గుంటూరు జిల్లా ఎండల గురించి మీకు తెలుసుగా?వేసవి ఉక్కపోత ఎంత ఇబ్బందికరం గా ఉంటుందంటే పిల్లలందరం రాత్రి ఏడు కాగానే అన్నం తినేసి ఎప్పుడు మేడ మీదకెళ్ళి మాటలు చెప్పుకుంటూ పడుకుందామా అని ఆత్ర పడేవాళ్ళం. పడుకొని అలా ఆకాశాన్ని, ఆ నక్షత్రాలను, ఆ మసక చీకటిలో అప్పుడప్పుడు మా మీదగా ఎగిరిపోయే కొంగలగుంపునూ చూస్తూ, మాటలు చెప్పుకుంటూ , ఎప్పటికో నిద్ర పోయేవాళ్ళం. మేమే కాదు, మా పక్కింట్లో అద్దె కుండేవాళ్ళు, ఆ పక్క పెంకుటింట్లో ఉండేవాళ్ళు అందరమూ కలిపి ఒక పెద్ద గుంపు తయరయ్యేది మా మేడ మీద. పిల్లలొక గుంపు, పెద్దలొక గుంపు. ఏ గ్రూపు మాటలు వాళ్ళవే. ఇక పడుకోండ్రా అని పెద్దలు కసరందే మా మాటల కంతుండేది కాదు. వాళ్ళు కసరగానే మేమందరం పిండ్రాప్ సైలెన్స్. మరలా నెమ్మదిగా మా పిల్లల్లో ఎవరో మాటలు మొదలెట్టే వారు, మళ్ళా మాటలు. నాకప్పుడు ఐదారేళ్ళుంటాయేమో. నిద్ర మధ్యలో ఎప్పుడైనా లేచి కళ్ళు తెరిచి చూస్తే, పడుకోపోయే ముందు నా కాళ్ళ వైపు ఉన్న చందమామ నా నడి నెత్తి మీదో, ఇంకాస్త ఆ పైకో ఉండేవాడు. భలే విచిత్రం గా అనిపించేది. మా అన్నయ్యని అడిగినట్టు గుర్తు ఎందుకలా అని. తనేం చెప్పాడో నాకు గుర్తు లేదు. వాడూ చిన్నోడేగా, ఏదో తింగరి సమాధానం చెప్పేఉంటాడు. ఎప్పుడైనా ఆరింటికో ఆరున్నరకో మెలకువస్తే ఆ కాశంలో ఒకపక్క చంద్రుడు, ఇంకోపక్క సూర్యుడు. నాకదొక వింత. కనీసం పదిమందికి చూపించందే మనసూరుకునేది కాదు.

నాకు చిన్నప్పటి నుంచి సైన్సు విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. 1984 లో అనుకుంటా రాకేష్ శర్మ అంతరిక్షం లో అడుగుపెట్టాడు, భారతదేశం తరపున మొదటి వ్యోమగామిగా. TV లో చూసా అప్పటి ప్రధాని ఇందిరాగాంధి రాకేష్ శర్మ తో మాట్లాడడం. దాన్ని చూసినప్పటి నుండి రాత్రిపూట ఆకాశాన్ని చూసినప్పుడల్లా నక్షత్రాలు , చందమామ లను మించి ఆవల ఏముంది అని అలోచించేవాడిని. అన్నయ్య నడిగితే అంతరిక్షం కి అంతే లేదన్నాడు, పోతూ ఉంటే అలా అలా వస్తూ ఉంటుందట. మన లాంటి పాలపుంతలు ఎన్నో లక్షలు కోట్లు ఉన్నాయట.ఆకాశాన్ని చూస్తూ ఈ విశ్వం అనంతం అనే సత్యాన్ని తలచుకుంటూ అసలు అదెలా సాధ్యం అంటు తెగ ఆశ్చర్య పడేవాడిని. (నా బ్లాగు పేరు వెనకున్న కధ ఇదే). ఆ Infinity అనే కాన్సెప్ట్ నాకిప్పటికీ ఆశ్చర్యమే.

ఇక ఆ తరువాత చదువుల్లో పడి ఆకాశాన్ని అంతగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు మేడ మీదికొచ్చి ఆరోజు పౌర్ణమి గనక అయితే హాయ్! వెన్నెల ఎంతబాగుందో అనుకునేవాడిని. కరంటు రాగానే కిందకి పరుగు. TV చూడ్డానికో, లేక పోతే చదూకోడానికో.

ఇంజనీరింగ్ లో కొచ్చాక మాది హైదరాబాద్ నగర శివార్ల లో ఉన్న కాలేజి కాబట్టి రోజూ మెస్ లో రాత్రి భోజనం కానిచ్చి వాకింగ్ కి బయలుదేరేవాళ్ళం. అలా వాకింగ్ చేసేటప్పుడూ, నిండు వేసవిలో హాస్టలు రూము లో ఉక్కపోత భరించలేక మంచాలు బయట వేసుకున్నప్పుడూ , అలా ఆకాశం వైపొక లుక్కేసేవాడిని. హైదరాబాదు కొచ్చిన కొత్తల్లో, బిర్లా పానెటోరియం లో, అసలుకి నకలైనా, ఆకాశాన్ని చూసినప్పుడు చిన్నప్పటి సంగతులు కొన్ని గుర్తొచ్చాయి.

ఆ తరువాత ఉద్యోగాన్వేషణలో ముందు చూపే గాని బొత్తిగా పైచూపు లేకుండా పొయింది. దానికి తోడు అపార్ట్మెంట్ బతుకయిపోవటం మూలాన అదొకటుందన్న ఊహ కూడా కరువైపోయింది. ఒక ఐదేళ్ళ క్రితం అనుకుంటా మేము ముగ్గురం ఫ్రెండ్స్ మి అప్పటికప్పుడు అనుకొని హైదరాబాదు నుంచి శ్రీశైలం బయలు దేరాము మల్లన్న దర్శనం చేసుకుందామని. దర్శనం అయినతరువాత ఎవరో చెప్పారు ఒకటైము తరువాత అటవీశాఖ వారు వాహనాల్ని అడవిలోకి అనుమతించరని. అప్పటికప్పుడు రేడీ అయ్యి బయలుదేరాము తిరిగి హైదరాబాదు కి . చెక్ పోస్టు దాటి అడవి లోపలికొచ్చాక ఎందుకో కాసేపు కారాపి ఆ చల్ల గాలిని ఎంజాయ్ చెయ్యలనిపించి కారు దిగాము. చిమ్మ చీకటి. ఎంత దట్టమైన చీకటంటే పక్కనెవరైనా అడుగుదూరం లో నిలబడ్డా పోల్చుకోలేనంత చీకటి. మాట వినపడితే గాని మనపక్కనొకరున్నారన్న సంగతి తేలీదు. తల పైకెత్తి చూసానొకసారి. నాకళ్ళని నేనే నమ్మలేకపొయాను. నల్లటి ఆకాశంలో పైన ఎన్ని లక్షల నక్షత్రాలో. ఇప్పటికీ ఆదృశ్యం నా బుర్రలో భద్రం. చాలా అందమైన అనుభవం నాకది. హైదరాబాదు లో అన్ని నక్షత్రాలు కనపడవు.

ఆతరువాత , ఒక రెండేళ్ళ క్రితం మా అన్నయ్య అమెరికా నుంచి తెప్పించిన టెలీస్కోపు ని పిల్లలకి చూపిద్దామని పిల్లలనందరిని పోగేసాడు మా అపార్ట్ మెంట్ బాల్కనీలొ . పనిలో పని గా నేనుకూడ మైమరచి పోయాను ఆ చంద్రుని మీది గుంతల్ల్నీ (క్రేటర్స్), శని గ్రహం చుట్టూ ఉన్న వలయాల్నీ చూసి. ఇక పిల్లలందరూ వంతులవారీ గా చూస్తుండగా, ఇంకేమైనా పెద్ద నక్షత్రాలు, టెలీస్కోపు లో చూడదగ్గవి కనపడతాయేమో చూద్దామని ఆ వైపుకి వెళ్ళి అలా అలా వంగి చూడబోయాను. మావదిన అప్పుడే బట్టలుతికినట్టుంది , నేల తడి గాఉండి కాళ్ళ కింద పట్టు తప్పింది. ఎలా తమాయించుకున్ననో నాకు తెలీదు గాని, నిజం చెప్తున్నా, ఆ గుండె దడ ఇప్పటికీ తగ్గలేదు.

ఇక్కడ అమెరికా వచ్చిన కొత్తల్లో ఒహాయో లో ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్ కి బాల్కనీ ఉండేది. అప్పుడప్పుడు అలా వచ్చి కూర్చొని ఆకాశం వైపు చూసినా ఆ ఆలోచనలు కొద్దిగా భిన్నం గా ఉండేవి. రేపు వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం వచ్చే సూచన ఉందా?, నా రైన్ కోటు ఇంట్లో ఉందా , లేక కార్లో ఉందా? ఇట్లాంటివన్నమాట. ఏంచేస్తాం, స్థాన మహిమ.

ఆతరువాత నేను మారిన అపార్ట్ మెంటుల్లో ఒక్కదానికి కూడా బాల్కనీ లేదు. పడుకోబోయే ముందు లైట్లార్పినప్పుడు కిటికీలోంచి పున్నమి చంద్రుడు హాయ్ అన్నాకూడా నాకిప్పుడు లేచి కిటికిదగ్గరికెళ్ళీ ఆ బ్లైండ్స్ పైకి లేపి , ఆ గ్లాసు తలుపు పక్కకి జరిపి , తల బైటికి పెట్టి ఆస్వాదించే ఓపిక లేదు.

ఏతావాతా పైన చెప్పిన రెండుమూడు సందర్భాలను మినహాయిస్తే గత ఇరవై యేళ్ళు గా ఆకాశానికి నాకు బొత్తిగా మాటల్లేవ్. బిజీ లైఫ్ కదా.దానికి తోడు ఆ! నా నెత్తినే ఉండేడ్చింది కదా ఎక్కడికి పోతుందిలే అనే కొద్దిపాటి నిర్లక్ష్యం.
సరే మళ్ళీ మీకదే ప్రశ్న. మీరు ఆకాశాన్నెప్పుడైనా చూసారా?

14 comments:

ప్రపుల్ల చంద్ర said...

నగర జీవనం అయ్యేసరికి, ఆకాశం వైపు చూసినా నక్షత్రాలు కనపడటం లేదు :(, అందుకే చూసినా వావ్ అనిపించడం లేదు...
చిన్నప్పటి ఙ్ఞాపకాలని తట్టిలేపారు, ధన్యవాదాలు.

ఉమాశంకర్ said...

@ప్రపుల్ల గారు: మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు.

ఏం చేస్తాం చెప్పండి. కాలుష్యమా.. మజాకా

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మీరు మరీ ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలడిగితే ఎలాగండి ??

బొల్లోజు బాబా said...

దానికి తోడు అపార్ట్మెంట్ బతుకయిపోవటం మూలాన అదొకటుందన్న ఊహ కూడా కరువైపోయింది.

exactly same feeling

bollojubaba

బ్లాగాగ్ని said...

"ఈ విశ్వం అనంతం అనే సత్యాన్ని తలచుకుంటూ" >> నాదీ అచ్చు ఇదే పరిస్థితి. ఈ అనంత విశ్వంతో పోలిస్తే మనిషి, భూమి, సూర్యుడు మళ్ళీ మాట్లాడితే సౌరకుటుంబం ఇవన్నీ ఎంత చిన్నవో తలచుకుంటే ఒక రకమైన ఉద్వేగం లాంటిది ఆవరిస్తుంది. చాలా చక్కని టపా. నగరీకరణలో పడిపోయి ఇలాంటి చిన్నా పెద్దా ఆనందాలు మనమింకా ఎన్ని కోల్పోతామో?
-ఫణి

కొత్త పాళీ said...

http://pratibimbamu.blogspot.com/search/label/%E0%B0%86%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%82

ఉమాశంకర్ said...

@రాజేంద్ర కుమార్ గారు:
అవునండీ. :)

@బాబా గారు:
మొన్నీ మధ్యనే ఆ బాల్కనీ కి దొంగల భయం చేత ఇనుప గ్రిల్ పెట్టించారు. ఇప్పుడిక పిల్లలకి ఆకాశం లో ఉన్న విమానాన్ని చూపించాలన్నా కష్టమే ఆ బాల్కనీ నుంచి.

@ఫణి గారు:
నిజం. ఈ నగరీకరణ ఈ విశాల ప్రపంచాన్ని చిన్న కుగ్రామం చేస్తే పర్లేదు, జ్ఞాపకాల్ని కూడా లాగేసుకుంటోంది.

@కొత్తపాళి గారు: బావుంది. ఆలోచించటమే కాదు ఆ ఆలోచనల్ని చిత్రీకరించటమూ చేసారన్నమాట.

sujata said...

Marvellous. I watch the sky regularly. Atleast on full-moon days. I made it a point to watch it from our balcony. It gives me immense pleasure to watch the moon. Please visit http://chillipeppar.blogspot.com/2008/10/my-chandrayaan.html to see some of my craziness.

ఉమాశంకర్ said...

@Sujata:

It is nice to know there is some more people out there thinking same way as I am. Sujaata gaaru, Thanks for your comment in my Blog and BTW, nice photos.

shanthi said...

Mee post's ani chadivanu...chaala bagunnai...
meelo manchi creativity undi!!!

ఉమాశంకర్ said...

@Shanthi: Thanks for visiting my Blog and for leaving a comment.

చిన్ని said...

ప్చ్....ఇంత మారిపోయారా ! నేను ఇప్పటికి ఆకాశాన్ని చూస్తుంటేనే ఉంటాను .శ్రీశైలం లో మీ అనుభవం అధ్బుతంగా వుంది ....చివరి పేరాలు నాకు భాద అన్పించింది

ఉమాశంకర్ said...

మారిపోయాననే అనుకుంటున్నానండీ.. అదేమిటో ఈ పోస్టు రాసినతరువాత కూడా పెద్దగా చూసింది లేదు..నిన్ననే ప్లానెటోరియం కి వెళ్ళాము.. అక్కడ North Star, Big Dipper(మన తెలుగులో సప్తర్షి మండలం అంటారనుకుంటా) అవన్నీ చూసాను. ఎలాగైనా రాత్రి అపార్ట్మెంటు బయటికెళ్ళి వాటిని చూద్దామనుకున్నా... అలానే టీవీ చూస్తూ నిద్రపోయా.. . All bad habits.. :(

చిన్ని said...

అంతేలెండి మీ తప్పేమీ లేదు . మన చుట్టూ వున్నా ఎన్విరాన్మెంట్ కూడా మన మీద ప్రభవాం చూపిస్తుంది .

 
అనంతం - by Templates para novo blogger