చదవటం, కనుమరుగవుతోంది.

Friday, October 3, 2008

మొన్నీ మధ్య ఫ్రెండ్ రమ్మంటే వాడితో పాటు ఒక బుక్ షాపు కెళ్ళాను. "బార్న్స్ & నొబుల్" అని అమెరికా లో ఒకానొక పెద్ద బుక్ షాపు చెయిన్. అమెరికా మొత్తం మీద వీళ్ళకి దాదాపు 800 షాపులున్నాయి. అసలు వెళ్ళిన పనేమిటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు, ఏడేళ్ళ బుడ్డది, ఆ షాపు వాళ్ళు ఉచితంగా ఇచ్చే కధల పుస్తకం తీసుకోవాలి వెళ్దాం పద అని మారాం చేసిందట పొద్దున్నే. ఉచితంగా ఎందుకిస్తారూ అంటే , వేసవి సెలవుల్లో పిల్లల్లో పఠనాసక్తి ని పెంపొందించే ఉద్దేశ్యం తో స్కూలువారొక కార్డ్ ఇచ్చారట విద్యార్ధులందరికి. ఆ వేసవిలో వాళ్ళు ఆరు లేక అంత కంటే ఎక్కువ పుస్తకాలు చదివి, ఆ చదివిన పుస్తకాల వివరాలు, అంటే పుస్తకం పేరు,రచయిత వివరాలు,ఆ పుస్తకం ఎందుకు నచ్చిందో ఒక వాక్యం, ఆ కార్డ్ లో నమోదు చేసి,దాన్ని ఈ బుక్ షాపు లో యిచ్చి ఒక పుస్తకాన్ని ఉచితంగా పొందొచ్చు.ఆ పిల్ల ఉత్సాహాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది.

సరె, వచ్చాను కదాని ఒక రౌండ్ వేద్దామని షాపంతా కలియ తిరిగాను. షాపంతా ఒకటే సందడి గా ఉంది. ఎంత మంది పుస్తక ప్రియులో? ఆరేళ్ళ పిల్లలనుంచి తొంభైల్లో ఉన్న వృద్ధులదాకా అన్ని వయసులవారూ ఉన్నారు. కొంతమంది షాపు వారు ఏర్పాటు చేసిన సోఫాల్లో, కుర్చీల్లో కూర్చొని అక్కడే చదివేద్దామని పుస్తకాల్తో కుస్తీ పడుతున్నారు.

తిరిగి ఇంటికి వస్తుంటె మనసులో ఒకటే ఆలొచనలు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో కనీసం పది అద్దె పుస్తకాల షాపులుండేవి. వాటి బయట "ఇచ్చట నవలలు అద్దెకివ్వబడును" అని బోర్డుంటుంది . చెక్క అల్మరాల్లొ వందలకొద్దీ నవలలు. షాపు బయట నల్ల బోర్డు మీద కొత్తగా రాబోయే నవలల వివరాలు కూడా ఉండేవి. యండమూరిదో, మల్లాదిదో నవల రిలీజయితే దొరకటం మహా కష్టం. స్వాతి , ఆంధ్రజ్యొతి లాంటి వీక్లీ లు కూడా అద్దెకిదొరికేవి. భూమ్మీద డైనోసార్లు అకస్మాత్తుగా అంతరించిపోయినట్లు, ఈ షాపులు కూడా అంతరించిపోయాయి. ఈ శాటిలైట్ టివి, ముదిరిన సినిమా పిచ్చి జనాల్లో పఠనాసక్తి ని దెబ్బతీసాయంటారు. అవి మరి ఇక్కడ అమెరికా లో కూడా ఉన్నాయే? టివి ఇక్కడ కూడా ఒక నేషనల్ అబ్సెషన్. వారాంతం వస్తే ఇంటిపట్టున ఉండే వాళ్ళు బహు తక్కువ. అయినా కూడ పుస్తకాలకెందుకంత ఆదరణ? నేను వెళ్ళిన షాపువారు అమెరికా మొత్తం మీద సాలుకు అమ్మే పుస్తకాల సంఖ్య 300 మిలియన్లు మాత్రమే. ఇలాంటి బుక్ షాపు చెయిన్లు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కలిపితే ఇంకెన్ని మిలియన్లుంటాయో? దాదాపు ప్రతి షాపింగ్ మాల్ కి ఒక పుస్తకాల షాపు విధిగా ఉంటుంది. ఒక విషయంలో మాత్రం నా ఊహ నిజమేననిపిస్తుంది. ఇండియాలో ఈ ఇంగ్లిషు మీడియం చదువులొచ్చి తెలుగు పత్రికలనీ, పఠనాసక్తిని దారుణం గా దెబ్బతీసాయి. విపరీతం గా పెరిగిన పోటీతత్వం కూడా మరొక కారణం. స్కూలు, ట్యూషన్లకే టైము సరిపోనప్పుడు వేరే వాటిమీదకి వారి ధ్యాస ఎలా మళ్ళుతుంది? నాకు తెలుగు పేపర్ చదవటం రాదు అని చెప్పేవాళ్ళు నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎవరూ లేరు. ఇప్పుడు కోకొల్లలు. సరే, చదివేది తెలుగా, ఇంగ్లీషా అనేది పక్కన పెడితే అసలు "చదవటం" అనేదే పాతకాలపు అలవాటుగా మారిపోయింది. ఇక్కడ అమెరికన్ల విషయంలో మాత్రం చదవడం వీళ్ళ సంస్కృతిలో ఒక భాగమనిపిస్తుంది. ఇప్పటికీ మంచి పాఠకాదరణ పొందిన నవలలు హాలీవుడ్ లో సినిమాల రూపంలోకి మారతాయ్. న్యూయార్క్ టైంస్ పత్రిక ఎంపిక చేసే "న్యూయార్క్ టైంస్ బెస్ట్ సెల్లర్" నవలలకి మంచి గిరాకి. ఎయిర్ పోర్టు లాంజుల్లో , విమానాల్లొ, కారు సర్వీసింగ్ సెంటర్లలో, ఇలా చాలా చోట్ల, నాకు చాలా మంది కనపడతారు సమయం వృధా కానీకుండా నవళ్ళు చదువుతూ.
Reading is the most effective way of conscious learning, nothing can replace that.

ఇండియాలో టివి, ఇంటర్నెట్లు అకస్మాత్తుగా మాయమై, మళ్ళా పాతరోజులొస్తే బాగుణ్ణు.

6 comments:

Raj said...

మీరు చెప్పేది నిజమే. ఇక్కడ చాలా మంది బస్సుల్లో, రైళ్ళల్లో కూడా పుస్తకాలు చదువుతుంటారు. mp3 ప్లేయర్ల వినియోగమూ ఎక్కువే.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

చాలా చక్కగా చెప్పారు,మంచి పరిశీలన,మిగిలిన విషయాలు మీ అనుభవం లోకి వచ్చినవి,వచ్చేవి ఇలాగే వివరించండి.

Purnima said...

కొద్దో, గొప్పో పుస్తక పఠనం పెరుగుతుందనుకుంటున్నాను. ఇక్కడ క్రాస్ వర్డ్స్, హిమాలయా బుక్ డిపో, వాల్డన్, ఒడిస్సీలకి ఎప్పుడెళ్ళినా జనాలు బానే ఉంటున్నారు. చదువుల భారం మరీ భూతద్దంలో చూపించి, మిగితా పుస్తకాల జోలికి పోనివ్వక పోవటం కూడా ఒక కారణమేమో. "కూడు" పెట్టే పుస్తకాలే చదవాలనేవారు కోకొల్లలు కదా!

మనిషి తర్వాత మనిషికి గొప్ప స్నేహం పుస్తకం!

మరిన్ని టపాలకై ఎదురుచూస్తుంటాను.

బైదవే, బ్లాగు టైటిల్ "అనంతం", శ్రీశ్రీ ఇన్సిపిరేషనా?

ఉమాశంకర్ said...

@రాజ్, రాజేంద్ర కుమార్, పూర్ణిమ గార్లకు: వ్యాఖ్యానించినందులకు ధన్యవాదాలు.

పూర్ణిమ గారు, కాదండి, ఆ పదం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విశ్వం అనంతం కదా. నా చిన్నప్పుడు( నేను అప్పుడు ఎనిమిదో తగతిలో ఉన్నాననుకుంటా) అలా రాత్రి పూట వెల్లకిలా పడుకొని ఆకాశం లో కనపడే నక్షత్రాల వైపు చూస్తూ అంతం అనేది లేకుండా ఉండడం అనేదాని గురించి ఆలోచించి, అదెలా సాధ్యమా ని ఆశ్చర్యపోయేవాడిని. అదే సంవత్సరం రాకెష్ శర్మ అంతరిక్షయానం చేసిన తొలి భారత వ్యోమగామి కావటం, తను స్పేస్ షటిల్ నుండి అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తొ మాట్లాడుతుంటే టీవీ లో చూడడం నా ఆసక్తి కి కారణం. సైన్సు ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఈ విశ్వానికి "అంచులు" ఉన్నాయని నిరూపించలేకపోయారు. టూకీగా అదన్నమాట విషయం.

కత్తి మహేష్ కుమార్ said...

పుస్తకాలు చదవడం చాలావరకూ తగ్గిందనేమాట వాస్తవమేగానీ, అప్పుడప్పుడూ మళ్ళీ అది తిరోగమనంలో ఉందనిపిస్తుంది.

నిన్నటికినిన్న నామిని గారి "మిట్టూరోడి పుస్తకం" చదువుతూ, ఢిల్లీ ప్రయాణంకోసం మన హైదరాబాద్ ఎయిపోర్టులో కూర్చొనుంటే, కనీసం 50 మంది ఆసక్తిగా పుస్తకాన్ని చూస్తే,10 మంది ఏకంగా పుస్తకాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో కొందరు, కొని చదవాలనే కోరికను వెళ్ళడించారు.

బహుశా చదివేవాళ్ళ ప్రొఫైల్ మారుతుందేమోగానీ, చదివేవాళ్ళు మళ్ళీ బయల్దేరినట్టే ఉన్నారు.

ఉమాశంకర్ said...

@ మహేష్ గారు మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు

అయితే మీరు, పూర్ణిమ గారు చెప్పినట్టు చదివేవాళ్ళు పెరుగుతున్నారన్న మాట. సంతోషం .. ఒకరకమైన నిరాశ, ఒక్కప్పటి నా పాత జ్ఞాపకాలు కలగలిసి రాసిన పోస్టిది.

 
అనంతం - by Templates para novo blogger