Saturday, October 27, 2018

సొట్ట బిందె


( నా వయసుముచ్చట్లు కి కొనసాగింపుగా......) . 


సంజె చీకట్లు ముసురు కుంటున్నాయి .


వీధిలో సోడాలబ్బాయి ఎదురింటి సీతారావమ్మకి సోడా ఇచ్చి వాళ్ళింటి గోడ మీద పెన్సిల్ తో లెక్క  రాస్తున్నాడు . లెక్కంటే ఏమీ లెదు. ఇఛ్చిన  ప్రతి సోడాకో నిలువు గీత. ఓ వారానికో పదిరొజులకొ రొక్కం  పుచ్చుకొని ఇచ్చిన వాటి మేరా వాటి మీద అడ్డగీతలు.

వంటింటి గడప మీద కూర్చొని మసిపట్టిన  లాంతరు  గ్లాసుని ముగ్గుతో శుభ్రం చేస్తున్న అమ్మ సోడా అబ్బాయి గొంతు విని అక్కడినుంచే నాకు కేకేసింది   ఒక సోడా తీసుకొమ్మంటూ. 

వీధి వైపు, మూడు మలుపుల్లో మేడమీదికి దారితీసే మెట్ల మొదటి మలుపు దగర నిలబడి మోచేతిని పిట్టగోడ మీద పెట్టి వీధిని పరికించి చూస్తున్న నేను అమ్మ మాట వినగానే అక్కడ్నుంచే సోడాలబ్బాయిని చిన్నగా పిలిచాను..

"ఇదిగో సోడా, నలకల్లేకుండా చూసి ఒక సోడా కొట్టు"

సోడా కోసం మెట్లు దిగి వీధి వాకిట్లోకి రాగానే మా ఇంటి మెట్లెక్కుతూ ఎదురయింది తను.

క్షణాల క్రితంవరకూ వరకూ వీధిని ఆమూలాగ్రం పరికిస్తున్న నేను తను అంత  అకస్మాత్తుగా నా ముందు ఎలా ప్రత్యక్షమయిందో అర్ధం కాక విస్తుపోయాను ఒక్కక్షణం.ఆ మరుక్షణమే ఒక వెల్లువలా మనసంతా పట్టరాని ఆనందం.తనని చూసి అప్పటికే రెండు రోజులు.

చంకలో ఖాళీ బిందె. నీళ్ళు మోయడానికి సన్నద్ధం అన్నట్టు లంగాని కొద్దిగా పైకి దోపుకొని  గాజుల్ని దాదాపు మోచేయి వరకు లాక్కొని ఉంది. 

మనసులోని ఆనందాన్నణచుకుంటూ  తనని గమనించనట్టే  సోడా తీసుకోవడానికి వీధి మెట్లు దిగాను.

ఇంటిముందు మెల్లా లో బోరింగు పంపు ఇంకా పెట్టక పోవడం గమనించి బిందెని  పంచలోని  చెక్క బల్ల  మీద ఉంచి,  లంగా సవరించుకుంటూ  అమ్మని పలకరించటానికన్నట్టు తను లోనికి అడుగులు వేసింది.

తనను తప్పించుకొని ముందుకెళ్లే  వీలు లేక చేతిలో సోడాతో తన వెనుకే నేను. 

రెండు గదుల ఆవల ఉన్న అమ్మను గమనిస్తూనే ఓ రెండు క్షణాలు ట్యూబు లైటు వెలుగులో తనను పరీక్షగా చూసాను. 

టీనేజీలో ఉండే సహజ ఆకర్షణా  దానికితోడు  కేవలం రెండు మూడడుగుల  ఆ సాన్నిహిత్యమూ  నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి... 

                                                                                                                                                                                             (ఇంకావుంది) 

Wednesday, October 24, 2018

కాలం కథలు - సత్తి గాడు



ఇది కూడా దాదాపు ఓ ముప్పై ఆరేళ్ళ  క్రితం సంగతే.

అప్పటికి నా ఎనిమిదో తరగతి క్లాసులు మొదలై రెండు రోజులే . 

కొత్త యూనిఫాం ,కొత్త నోటు పుస్తకాలు. అప్పటికి ఇంకా టెక్స్ట్ బుక్స్ చేతికందలేదు. అయినా ఆసక్తి కొద్దీ నాకంటే ఒక తరగతి పెద్దదైన రవణమ్మ ( రమణమ్మ) దగ్గరున్న తెలుగూ,సోషలూ పుస్తకాలు తీసుకొని అసలు పాఠాలేమున్నాయా  అని అలా బొమ్మలు చూస్తూ పైపైన తిరగేసా. కొత్త  టెక్స్ట్ బుక్స్  చేతికందగానే వాటిని కూడా సంచిలో పెట్టుకొని బడికెప్పుడెల్తానా  అని ఒకటే ఎదురు చూపులు .


తరగతిలో మిగతా వాళ్ళందరూ కనపడుతున్నారు గానీ నా ఆప్తమిత్రుడు సత్యనారాయణ జాడే లేదు.అప్పటికీ వాడింటి దగ్గరుండే తోటి  వాళ్ళందరిని  ఆడిగా. అందరూ మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. ఆ తరువాత ఒక రెండు రోజులకి శేఖర్ గాడు చెప్పాడు సత్తి గాడు మొన్న వాడికి   సాంబయ్య టీ  స్టాలు దగ్గర కనబడ్డాడనీ ,మాట్లాడబోతే తలతిప్పుకొని వెళ్లిపోయాడనీ. నాలో ఆదుర్దా   ఎక్కువైంది. 
 ఒక  రెండడుగులు పక్కకేస్తే వాడిల్లు నేను స్కూలు నుంచి ఇంటికెళ్ళే దారిలోనే. వాడి గురించి అంత ఆదుర్దా ఉన్నా ఆ రెండడుగులు పక్కకేసే స్వాతంత్య్రం  లేని వయసది. స్కూలునుంచి సరాసరి ఇంటికి రాకుండా దారి మళ్ళానని ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా?

సత్తిగాడు అంతకుముందు ఒకట్రెండు సార్లు నన్ను వాడింటికి  తీసుకెళ్లాడు.ఒకటే గది. అది కూడా చాలా చిన్న గది.ఆ గదిలోనే ఒక మూలన  చిన్న కిరోసిన్ స్టవ్వూ,కొన్ని సత్తు వంట గిన్నెలూ. ఆ గదిముందు అంతే పరిమాణంలో పేడతో అలికిన చిన్న మెల్లా, నిలబెట్టిన రెండు నులక మంచాలూ.బహుశా  రాత్రుళ్ళు అక్కడే పడుకుంటారేమో.వాడి నాన్న నాకెప్పుడూ కనపడలేదు. అడిగితే దాటేసేవాడు. వీడికి తోడుగా అక్కా తమ్ముళ్లు   ఎవరూ లేరు వాడికి. అమ్మ మాత్రం ట్రంకురోడ్డు మీదున్న  మిల్లులో గ్రేడింగు పనికె ళ్లేది. 

తెల్ల చొక్కా- ఖాకీ నిక్కరూ మా స్కూలు యునిఫామ్. అందరి చొక్కాలు  తెల్లగా తళ తళ లాడుతూ ఉంటే వాడి చొక్కా ముతక రంగులో అసలది తెలుపా?పసుపా? అన్నట్లుగా ఉండేది. నిక్కరు కూడామొద్దుగాబండకేసి బలంగా రాసినా దానికేమీ కాదనే రీతిలో ఉండేది. మా అమ్మ తరపు బంధువుల ద్వారా ఇటువంటి పరిస్థితులు నాకు పరిచయమున్నా,వీడి సాహచర్యంలో నాకవి  మరింత ప్రస్ఫుటంగా కనిపించేవి.ఇంటర్ బెల్లు ( ఇంటర్వెల్ ) లో మేము ఏ జామకాయలో రేగ్గాయలో కొనుక్కోటానికి పరిగెడితే వాడు క్లాసులో అలా వంటరిగా ఉండిపోయేవాడు ఏదో ఒకటి చదూకుంటూ

ఎనిమిదో తరగతి 'అసలు' క్లాసులు మొదలయ్యాయి. అటెండెన్స్ రిజిస్టర్లు కూడా తయారయ్యాయి కానీ వాడి జాడ లేదు . ప్రతి క్లాసులో వాడి పేరు లేని అటెండెన్స్ నాకు అసంపూర్తిగా కనిపించేది. ఒక నెల గడచినా ఎప్పటికైనా వాడు వస్తాడనీ, రెండు పేర్ల మధ్య వాడిపేరు(ఆ నెలకి) రిజిస్టర్లో ఇరికించి  రాస్తారనే ఆశ చావలేదు నాలో. కొత్త వాళ్ళతో నేస్తం కట్టి, చదువులో మునిగిపోయినా ఏదో రూపేణా గుర్తొస్తూనే ఉన్నాడు వాడు. 

ఒక రోజు...మధ్యాహ్నం నాలుగుగంటల సమయం 

భోజనాలు ఆలస్యమైనట్లున్నాయి.ఇంట్లో వాళ్లింకా మాంఛి మధ్యాహ్నపు నిద్రలో ఉన్నారు.  అలికిడి చేయకుండా పుస్తకాల సంచి దేవుడి గదిలో ఒక మూల ఉంచి ఇంటి ముందు భాగంలో ఉన్న మేడమెట్ల మొదటి మలుపులో నిలబడి ఆ పిట్టగోడపై రెండు మోచేతులానించి  వీధిలోకి చూస్తున్నాను. పేరుకి వేసవి కాస్త మందగించినా ఆ వేడి   భరించనలవి కానంతగా ఉంది. కొలిమి పక్క నిలబడ్డట్టు ఒకటే ఆవిరి. వీధి నిర్మానుష్యంగా ఉంది. 

కాస్త ముందొస్తే బేరాలెక్కువ దొరుకుతా యనుకున్నాడో ఏమో సోడాలబ్బాయి అప్పుడే వీధిలోకి మలుపు తిరిగాడు. 

ఎదురింటి సామ్రాజ్యం  అప్పుడే నిద్ర లేచి ఆవలించుకుంటూ  తలపైకెత్తి  వాళ్ళింటి జాజి చెట్టు వంక చూస్తోంది పూలెటువైపు   ఎక్కువున్నాయో  అట్నుంచి మొదలెడదాం అనుకుంటున్నట్టు.

ఇంతలో  వీధికిటువైపు నుంచి ఎవరో సైకిల్ మీద వస్తున్నట్టు గమనించా నా కనుచివరలనుండి.  ఎవరోలే అనుకొని పట్టించుకోలేదు. ఆ సైకిలు  నన్ను దాటి వెళ్లిన తరువాత  గమనిస్తే  వాడు సత్తి గాడి లానే కనపడ్డాడు వెనకనుంచి. 

వాడికి సొంత సైకిలు లేదు కాబట్టి  వాడు కాదేమో అని అనిపించినా  కానీ అచ్ఛం వాడిలానే ఉన్నాడే అని ఒకింత అనుమానం. "సత్తిగా" అని గట్టిగా నేను పిలవగానే ఆ మనిషి సీటు మీద నుంచి లేచి ఇంకాస్త వేగంగా సైకిలు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. నా అనుమానం బలపడింది.. 

మరుసటి రోజు అదే సమయానికి కాపు కాసాను. వాడు మావీధి మలుపు తిరగ్గానే మెట్లు  గబ  గబా దిగి వాడు నన్ను దాటిపోకుండా రెండుచేతులు బార్లా అడ్డుపెట్టి ఎదురెళ్లా "రేయ్ సత్తిగా " అంటూ. తప్పించుకునే వీలు లేక వాడు పాపం సైకిలు దిగాడు( నేలకి   కాళ్ళందవు మరి).నేను ఎందుకైనా మంచిదని ఒక బ్రేకు బిగించి పట్టుకున్నా.

గుంటూరు జిల్లా ఎండలు కదా వాడప్పటికే తడిసి ముద్దయి ఉన్నాడు.జుట్టులోంచి కారిన  చెమట పాయొకటి  చెవి వెనుకగా జారి  చొక్కా కాలరు వెనుక మాయమైంది . వాడి మొహం లో  అలసట కంటే పట్టుబడ్డానన్న బాధే ఎక్కువగా కనపడుతోంది నాకు. 

అప్పుడు గమనించా వాడి సైకిలు ముందు భాగానికి తగిలించిన పెద్ద అట్ట.దాని నిండా క్లిప్పులతో రక రకాల లాటరీ టిక్కెట్లు.

వాడితో ఏమి మాట్లాడానో  అస్సలు గుర్తు లేదు.  "ఈ లాటరీ టిక్కెట్లు ఏందిరా ?" అని అడిగుంటాను.  "స్కూలుకి   రావట్లేదేమిటి?" అని కూడా. బహుశా వాడు "వేరే స్కూల్లో జేరా" అని బుకాయించీ  ఉంటాడు. నాకు గుర్తున్నదల్లా నిప్పులు చెరిగే ఆ మధ్యాహ్నపుటెండలో  తడిసిన ముద్దయిన వాడి  మొహమూ  అందులో (నా కళ్ళకు) కనపడిన  దిగులూను. 

అదే ఆఖరు సారి వాడిని చూడ్డం.. తరువాత ఎప్పుడు చూసినా ఆ ఇంటికి  తాళం  వెక్కిరిస్తూ కనపడేది. (కప్పు కూలిపోయి మొండిగోడలతో పాడుబడి ఆ గది ఇప్పటికి ఉంది. )

ఆరోజుల్లో ఆర్థిక స్తొమత అంతంత మాత్రం ఉండే కుటుంబాల్లో చదువు మాన్పించి పనిలోపెట్టే ప్రక్రియలో  మొదటి మలుపు ఏడో తరగతయితే  ఇంకాస్త స్తొమత ఉన్నవాళ్లకి  అది  పదోతరగతి. ఆ సరికి వాళ్ళు ప్రయోజకులైనట్టే లెక్క చదువు పరంగా.

పన్నెండేళ్ల  వయసులోనే ఇంటి బాధ్యత నెత్తి  మీద పడి ఆ మండుటెండలో మావూరికి చుట్టుపక్కల ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న చిన్న పల్లెటూళ్లలో లాటరీ టికెట్లమ్మడానికి  బయల్దేరిన వాడు మరి ఇప్పుడు  ఎక్కడున్నాడో ఏం  చేస్తున్నాడో? అసలు నేను గుర్తున్నానో లేదో?

Sunday, October 21, 2018

ఓ జ్ఞాపకం

దాదాపు నలభై ఏళ్ళ కిందటి మాట. 

ఎక్కడికో గుర్తులేదు గాని అమ్మతో  బయటికి వెళ్తున్నాను. బహుశా గుడికి  అయుండొచ్చు. మా ఇంట్లోంచి బయటకొచ్చి ఓ పదడుగులు వేస్తే వస్తుంది మెయిన్ రోడ్డు.  దానిమీద కుడివైపుకి తిరిగి ఇంకొక పదడుగులేస్తే వస్తుందొక పెద్ద వాణిజ్య కూడలి. ఒక రిక్షా స్టాండూ,మెడికల్ షాపులూ,కిరాణాదుకాణాలూ,పళ్ళ బండ్లూ,సినిమాహాలూ ,హొటళ్ళూ,సైకిళ్ళ  రిపేరూ షాపులూ, పిండి మరలూ, చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళకెళ్లే ప్రయివేటు బస్సులూ.. ఇలా  సమస్తం. ఏదైనా  ప్రత్యేకమైన  పని ఉంటే తప్ప మాకు ఆ సెంటరు దాటి  పోవాల్సిన అవసరం  ఉండదు  చాలా వరకు.  

మేము మెయిన్ రోడ్డు  మీదకు  తిరగగానే మాకెదురుగా వస్తూ నా దృష్టినాకర్షించిందొక రిక్షా.మిగతా రిక్షాల్లాగా దానికేమీ హంగూ ఆర్భాటాలేవీ  లేవు. తళ తళ లాడే  రిమ్ములూ, హ్యాండిల్ కి రెండువైపులా వేలాడే  తోలు పటకాలూ, ఆ (గూడు)రిక్షా  రెండు  వైపులా ఎన్టీఆర్-ఏఎన్నార్ బొమ్మలూ..  ఇవేమీ  లేవు . బ్రేకులు జారిపోయి ,రిమ్ములు తుప్పు పట్టి, రిక్షా రంగులు వెలిసిపోయి ఏ క్షణమైనా  కూలిపోవడానికి సిద్దంగా ఉన్నట్టుంది.నిజానికి అదొక అస్థిపంజరాన్ని తలపించేలా ఉంది.   

ఆ వయసులొ సహజంగా ఉండే  ఆసక్తి కొద్దీ దాన్నే చూస్తూ ఉండిపోయాను. రిక్షా మమ్మల్ని దాటి  వెళ్తుండగా ఆసక్తి కొద్దీ ఆ రిక్షా లోపల ఎవరు కూర్చొని ఉన్నారా అని చూసాను. ఎవరూ కనబడలేదు  గాని ఒక తాటి చాపలో  ఏదో వస్తువు చుట్టబడి  ఉన్నట్లనిపించింది. పరికించి  చూస్తే అవొక మనిషి కాళ్ల లాగా అనిపించాయి నాకు. వెంటనే  అమ్మ చెయ్యి  పట్టుకొని  గట్టిగా  అరిచి చెప్పా  "అమ్మా! అటు చూడు, ఎవరివో కాళ్ళు " అని . అమ్మ అటు చూసి చటుక్కున  తల తిప్పి "కాళ్లూ లేవు గీళ్లూ లేవు  పద " అంటూ నా చేయి గట్టిగా  పట్టుకొని  ముందుకు లాగింది . 

అమ్మతో వడివడిగా ముందుకు నడుస్తూ   ఆసక్తిని చంపుకోలేక  ఆ రిక్షాని  అలా తలతిప్పి చూస్తూ ఉన్నా. 

ఆ తాటి  చాపలో  బయటికి తొంగిచూస్తూ , దాదాపు కట్టెపుల్లల్లా సన్నగా,నల్లగా కమిలి నట్టున్న మనిషి కాళ్ళు. 

పేరుకి  తార్రోడ్డయినా  అడుగడుగునా ఉండే  గుంటల్లో పడి ,ఆ కుదుపుకి ఒక్క సారిగా  చాప మొత్తం  ఎగిరిపడిన దృశ్యం అలా గుర్తుండి పోయింది నాకు .

                  
అక్కడికి ఓ అర కిలోమీటరు దూరం లోనే  మావూరి వాగు. దాన్ని  దాటుకొని ఆ ఇసుకమేటలకు కొద్దిగా అవతలగా...  రుద్రభూమి. 
               

ఆ తర్వాత కొన్నేళ్ళకి కలిమి-లేములూ, కష్ట సుఖాలూ, బాధలూ-బాంధవ్యాలూ  గురించి  తోచినంతలో ఏదో  కొద్ది అవగాహన కుదిరాక  నేను చూసిన ఆ దృశ్యం కొద్దికొద్దిగా బోధపడినట్లనిపించేది నాకు.

Monday, February 15, 2016

మౌనం

"ఏమైనా మాట్లాడొచ్చుగా?"

ఈ పదేళ్ళలో లెక్కలేనన్ని సార్లు వినుంటానీ  మాట. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తరచుగా. 

ఏం మాట్లాడాలి? ఈ ప్రశ్న నెదుర్కొన్న ప్రతిసారీ కాకపోయినా కొన్ని కొన్ని సార్లు  ఈ అభియోగాన్ని తిప్పి కొట్టడానికి  చేసే ప్రయత్నంలో ఏదో మాట్లాడుతాను.ఆ మాటలు చాలా వరకు అప్పటి మా ఇద్దరి మనస్థితికీ , నేను (తెచ్చి పెట్టుకొని) మాట్లాడే మాటలకీ  పొంతన కుదరక తేలిపోతాయి.ఇంట్లో అయితే తను మళ్ళా ఏ టీవీనో లేక వంటగదినో ఆశ్రయిస్తుంది. ఎప్పటిలా నేను తిరిగి నా లోకంలోకి.

ఈ ప్రశ్న నాకు గుర్తుండి  మొట్టమొదటిసారి నాన్న నుంచి విన్నాను నా ఇంటర్లో." ఏంట్రా ఎప్పుడూ అలా ఏదో ఆలోచిస్తూ ఉంటావ్, ఏం  ఆలోచిస్తున్నావ్?" అంటూ. ప్రతి పదం గుర్తే ఇప్పటికీ.అప్పటినుంచి కూసింత ఆసక్తితో నన్ను నేను గమనించుకోవటం  మొదలు పెట్టినట్టు గుర్తు. అది మొదటి దశ .

ఇంటర్ అయిపొయింది.అలానే ఇంజనీరింగు రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరం మొదలయిన  మొదట్లో నేను మళ్ళా ఈ "మాటల"  విషయంలో నాలోని మార్పుని ప్రస్పుటంగా గమనించాను.మొదటి రెండేళ్ళూ హాస్టలు రూముల్లో అర్ధరాత్రీ ఆపరాత్రీ లేకుండా పిచ్చాపాటీలు మాట్లాడినా,మూడో సంవత్సరం నుంచి నాలో ఏదో  మార్పు. అప్పుడు  మాత్రం దాదాపు అందరికీ ఉండే  ఏవో కొద్దిపాటి  సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుసు.  సిటీ బస్సెక్కినా కనీసం నాపక్కన ఎవరు కూర్చున్నారో కూడా గమనించనంతగా ఆలోచనల్లో కూరుకుపోయేవాడిని. అడపాదడపా నేను దిగాల్సిన స్టాపు మిస్సయిన సందర్భాలూ గుర్తే. ఆ ఆలోచనలకి ఊతమియ్యడానికి యూనివర్సిటీ కేంపస్లో గంటలకొద్దీ  అలా నడుస్తూ ఉండేవాడిని. అది  రెండో దశ .

 జీవితంలో  కాస్త నిలదొక్కుకొని జీవితం పట్ల నాకంటూ ఏవో కొన్ని స్థిర అభిప్రాయాలు ఏర్పరుచుకున్నాక మౌనాన్ని ఆశ్రయించటం మూడో దశ.  ఆఫీసులో,అడపాదడపా పార్టీల్లో,దైనందిన చర్యల్లో ఎదుటివారు  మాట్లాడే మాటల్లో ముప్పాతిక వంతు నా ఆసక్తికి సరిపడనివైన కారణంగా  తెచ్చిపెట్టుకున్న మౌనం.

"ఎందుకలా కామ్ గా ఉంటావ్?"  అన్న వాళ్ళతో "నాతోనేను ఎన్ని మాటలు మాట్లాడుకుంటానో  మీకేం  తెలుసు?" అని  అనాలనిపిస్తుందోసారి.అదయినా ఎందుకు మాట్లాడడం అని నా గొంతు నోక్కేసుకుంటా.మాట్లాడడం వాళ్ళకిష్టం. మాట్లాడక పోవడం నాకిష్టం. రెండూ ఒకటే. వాళ్ళు చనువుగా నన్ను నిలదీస్తారు. నేను తిరిగి సమాధానం చెప్పను. ఎందుకంటే నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు కనక :)

పిల్లల విషయంలో మాత్రం ఒట్టు గట్టు మీదే .

Wednesday, March 19, 2014

మూగమ్మ

మేమందరం తనని మూగమ్మ అని  పిలిచేవాళ్ళం.మా అమ్మమ్మ తరపు బంధువు.అమ్మమ్మ తరపు బంధువులంతా చాలా వరకు ఏదో కూలీ నాలీ చేసుకొనే వారే. అతి కొద్ది మందికి మాత్రం ఏదో ఎకరం అరెకరం పొలాలు అంతే. అయితే వాళ్ళు కూడా చాలావరకు వాటిని కౌలుకిచ్చి పొలం పనులకెళ్ళేవాళ్ళే .

తన అసలు పేరు ఇప్పటికీ తెలీదు.మాటలు రావు  పైగా పుట్టెడు చెముడు కూడా.మొదటిసారి తనని చూసినప్పుడు నాకప్పుడు ఏడెందేళ్ళ వయసుంటుందేమో.ఎవరు చెప్పారో తెలీదుగాని మూగవాళ్ళకి ఎదురుగా నిలబడి చూపుడు వేలుతో మన ముక్కు గిల్లుకుంటే వాళ్ళని ఆటపట్టించినట్టట.ఇంకేముంది మేం నలుగురు పిల్లలం సందు దొరికినప్పుడల్లా తనని ఆట పట్టించేవాళ్ళం.అప్పటికి తన వయసు ఇరవై కూడా ఉండక పోవచ్చు.చాలా వరకు సంయమనం పాటించినా,మా అల్లరి శృతిమించినప్పుడు మాత్రం మామీద అలిగేది.ఒకట్రెండుసార్లు చేతిలోని వస్తువుని విసిరి కొట్టి కోపంతో మేడ మీద కెళ్లి కూర్చుంటే మా అమ్మో అమ్మమ్మో తనని బ్రతిమాలి కిందికి తీసికొచ్చి తనెదురుగానే మమ్మల్ని  కసిరేవాళ్ళు.కాసేపు గప్ చుప్ .ఆ తరువాత అంతా మామూలే. 

ఆ తరువాత తనని చూసింది చాలా కొద్ది సార్లే. అయితే మాఇంట జరిగే ప్రతి శుభకార్యానికీ తప్పనిసరిగా వచ్చేదట. కలిసినప్పుడు సైగలతోనే బావున్నావా అని అడిగేది. తను మూగది కాబట్టేమో, అలా అడుగుతున్నప్పుడు నేను తన ముఖ కవళికల్ని శ్రద్దగా గమనించేవాణ్ణి. ఆ మోహంలో మాపట్ల ఎంతో  ఆప్యాయత. స్వతహాగా నేను సిగ్గరిని కాబట్టి సైగలతొనొ,పెద్దగా అరుస్తూనో తనతో మాట్లాడలేక ఆ ఒక్క మాటకి సమాధానం చెప్పి పక్కకి తప్పుకునేవాడిని బతుకు జీవుడా అనుకుంటూ( నిజంగా అలానే అనుకునేవాడిని ). 

ఆ తరువాత దాదాపు ఇరవైఏళ్ళ  తరువాత తనని నా పెళ్లి రిసెప్షనులో  చూట్టమే. సూటూ బూటూ వేసుకున్న నన్ను చూసి దాదాపు పరిగెత్తుకుంటూ వచ్చింది నాదగ్గరికి. ఇంటికి రాకుండా డైరక్టుగా రిసెప్షను కొచ్చినట్టుంది. నన్ను చూడగానే తన మోహంలో పట్టరానంత ఆనందం. సైగలతోనే "ఇంతుండే  వాడివి,ఎంత పెద్దయిపోయావు" అని మురిసిపోయింది. చేతి బోటనవేలినీ,చూపుడు వేలినీ కలిపి సున్నాలా చేసి, సూట్లో చాలా బావున్నావు అంది .కొద్దిగా వయసు మీదపడిన ఛాయలు   కనిపిస్తున్నా చలాకీతనం ఏమాత్రం తగ్గలేదు.

రిసెప్షన్ ఆద్యంతం వీలు కుదిరినప్పుడల్లా ఆ స్టేజి మీద నుంచి  తనెక్కడుందా  అని తనని వెతుకుతూనే ఉన్నాయి నాకళ్ళు. ఒకట్రెండు సార్లు నేను తన వంక చూడడం గమనించి చెయ్యూపుతూ  నవ్వింది కూడా.ఆ సాయంత్రం  నాకు అత్యంత సంతృప్తి కలిగించిన విషయం ఏమైనా ఉన్నదంటే అది ఇన్నేళ్ల  తరువాత తనని చూడటమే.నా చూపులతోనో,చేతలతోనో నేను తనని మర్చిపోలేదనే భావాన్ని వ్యక్త పరచాననే అనుకున్నానా సాయంత్రం. 

రిసెప్షను ఒక అరగంటలో ముగుస్తుందనగా తనను భోజనాల దగ్గర చూసా.ఆ తరువాత లేటుగా వచ్చిన మిగతా  బంధువులని  పలకరించి,కాసేపు వాళ్ళతో పిచ్చాపాటీ మాట్లాడి,అమ్మ కనపడితే "మూగమ్మెక్కడా?" అని అడిగితే , అమ్మ వాకబు చేసి  చెప్పింది వెళ్ళిపోయిందని. 

మనసు చివుక్కుమందొక క్షణం. 

అయినా మా అమ్మమ్మ బంధువుల విషయంలో అది కొత్తేమీ కాదు.చెప్పా పెట్టకుండా మాయమవుతారు.అలానే ఇంట్లో ఏదైనాపనుండి కబురు పెడితే, తెల్లారకుండానే తలుపు తడతారు. రావడంతోనే ఏవిధమైన భేషజాలు లేకుండా,మనం చెప్పే అవసరం లేకుండానే చొరవగా పనుల్లోకి జొరబడి పోతారు. 

కాస్త నగదూ, కొన్ని ఆస్తులూ ఆశ చూపి ఇల్లరికం వచ్చేలా చూసి మూగమ్మకి  పెళ్లి చేసారు. ఆ వచ్చినతను   ఏడాది తిరక్కుండానే ఆస్తులమ్మి డబ్బులియ్యమని నానా యాగీ చేసి తననొదిలి వెళ్లి పోయాడు. తన చెల్లెలి దగ్గర వాళ్ళ పిల్లల బాగోగులు చూస్తూ పొలం పనులకెళ్తూ రోజులు వెళ్ళదీస్తుందని  చెప్పింది అమ్మ పొద్దున్న ఫోన్ చేసినప్పుడు. "నువ్వు ఇండియా వచ్చినప్పుడు కబురు పెడితే ఎందుకు రాదూ, పరిగెత్తుకుంటూ వస్తుంది నువ్వంటే" అంది కూడా. 

నేనే వాళ్ళ వూరు వెళ్ళాలి. వెళ్లి "అసలు ఆరోజు నాకు చెప్పకుండా వచ్చేసావేం" అని సరదాగా నిలదీయాలి. అయితే ఎలా అడగాలి అన్నదే పెద్ద ప్రశ్న మరి. 


Thursday, March 13, 2014

WW-II

 రెండో ప్రపంచ యుద్ధం.  టూకీగా WW-II

దాదాపు ఐదేళ్ళ పాటు(1939-1945), రోజుకి సగటున ఇరవై ఏడు వేల మంది ప్రాణాలు  బలితీసుకున్న మారణహోమం. 
                                     ***********************

యుద్ధరంగాన్నుంచి అప్పుడే తిరిగొచ్చిన బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ డేవిడ్ క్రూక్,అంతకు క్రితమే మరణించిన తన సహచరుడిని తలచుకొని, తన డైరీలో రాసుకున్న మాటలు...

(లండన్)

కొద్ది గంటల క్రితమే మరణించిన తన సహచరుడు వాడిన వస్తువులు చూస్తుంటే అంతా ఏదో మాయలా ఉంది . గదిలో తను పొద్దున్న కిటికీకి తగిలించిన టవల్ అలాగే ఉంది.పొద్దున్న నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడిన పీటర్ ఇప్పుడు కూలిన యుద్దవిమానపు కాక్  పీట్లో ఇంగ్లీషు చానల్ అడుగున నిర్జీవంగా పడిఉన్నాడన్న ఊహ భరింపనలవి గాకుండా ఉంది. ఈరోజు మధ్యాహ్నమే పీటర్ భార్య  సెలవు గురించి అడగడానికి ఫోన్ చేసినప్పు డతని మరణవార్త తనకి చెప్పాల్సి వచ్చింది. ఒక వ్యక్తి  మరణించినప్పుడు దగ్గరివాళ్ళు పడే ఈ బాధకి సాక్షి కావడం అంతులేని వ్యధ కలిగిస్తోంది.

                            ********************************

(ఫిన్లాండ్, ఒక సైనికుడు)

ఈ గుర్రాన్ని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది.

రాతి నేలపై నడిచీ నడిచీ,సత్తువలేక,శుష్కించిపోయి,నీరసించిన దీన్ని ఇక్కడే వదిలేయక తప్పదు.దాని వీపుమీదున్న నా సంచి  తీసుకొని మిగాతావారిలాగే నేను కూడా  నడక మొదలెట్టాలి ఇక .

 మెడ వెనుక నెమ్మదిగా నిమిరి దాన్ని ముద్దు పెట్టుకున్నాను. అదొక జంతువే కావొచ్చు,కానీ ఈ యద్ధంలో అది నా సహచరి. చాలా సార్లు ఇద్దరం మృత్యువుకి చాలా దగ్గరగా వెళ్ళొచ్చాం . యుద్దరంగపు భయానకమైన రాత్రుళ్ళూ , పగళ్ళూ ఎన్నో చూసాం కలిసి.

దాన్ని వదిలి ఒక రెండడుగులు ముందుకేయగానే అది నా వైపు  చూసింది . నేను తట్టుకోలేకపోయా నాచూపుని.

నాకు గట్టిగా ఏడవాలనిపించింది. కానీ కన్నీళ్లు  ఎప్పుడో ఇంకి పొయాయి. పైగా యుద్దంలో ఏడుపుకి చోటే లేదు.

ఒక్క క్షణం దాన్ని చంపేస్తే .. అనిపించింది. కానీ ధైర్యం చాల్లేదు.

నేను ముందుకు కదిలాను .

అది నిలబడి నావైపే చూస్తోంది ,మలుపు తిరిగి ఈ పెద్ద బండరాయి వెనక్కి  నేను కనుమరుగయ్యేదాకా ....
                                   ********************************
సగం సగం పంచుకుందామని స్టాలిన్-హిట్లర్ ఒప్పందం కుదుర్చుకొన్నాక ,జర్మనీ  పోలెండు మీద భీకర దాడి చేసిన రోజుల్లో హాస్పిటల్లో పనిచేసే నర్సు  డైరీలో ఒకరోజు 

(వార్సా ,పోలెండ్ )

గాయపడ్డ వాళ్ళ తో హాస్పిటల్ నిండిపోయింది . కరెంటు లేదు . డాక్టర్లు నర్సులు  కొవ్వొత్తుల వెలుగులో  గాయపడ్డ వారికి వైద్యం చేస్తున్నారు. రెండు ఆపరేషన్  థియేటర్లూ , అవుట్ పేషెంట్ గదీ  బాంబు దాడిలో ధ్వంస మయ్యాయి. వైద్యవిద్యార్దుల కుద్దేశించిన  లెక్చర్ రూముల్లోనూ, అక్కడక్కడా దొరికిన మామూలు చెక్క బల్లలమీదా  వైద్యం జరుగుతోంది . వైద్య పరికరాలు స్టెరిలైజ్ చేసే వీలు లేక వాటిని ఆల్కహాల్ లో ముంచి తుడిచి వాడుతున్నారు. ఒక డాక్టరు టేబుల్ మీదున్న వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి  విఫల ప్రయత్నం చేస్తున్నాడు.

ఒక విషాదాన్ని వెన్నంటే మరొక విషాదం.

ఈ గాయపడ్డ పదహారేళ్ళ అమ్మాయి, బంగారు రంగు జుట్టుతో అంతకంటే అందమైన మోముతో  ఉంది. అయితే ఆ నీలి కళ్ళ నిండా నీళ్ళు. ఆమె రెండు కాళ్ళు మొకాలి కిందినుంచి నుజ్జు నుజ్జయి ఉన్నాయి. రెండు కాళ్ళూ తీసే యాల్సిందే అంటూ సర్జను ఆ పని చేయబోయే ముందు నేను ముందుకు వంగి ఆ అమ్మాయి నుదురు మీద ముద్దు పెట్టుకొని నా నిస్సహాయమైన చేతిని తన బంగారు రంగు చేతిలో వేసాను ధైర్యం చెబుతున్నట్టు.

వికసించాల్సిన ఓ అందమైన పువ్వును మొగ్గలోనే ఓ కర్కశమైన చెయ్యి నిర్దాక్షణ్యంగా తుంచేసినట్టు.... .

ఆ రోజు తెల్లవారు జామున  తను నిశ్శబ్దంగా మృత్యువు ఒడి లోకి జారిపోయింది .
                             
  (Max Hastings రాసిన  Inferno, The world at war (1939-1945) నుంచి)

Monday, March 10, 2014

నిద్ర పట్టని రాత్రి

రాత్రి ఎందుకో అస్సలు నిద్రపట్టలేదు.

అలవాటుగా పక్కనే టేబుల్ మీదున్న రేడియో ఆన్ చేసాను.

ఎప్పుడూ వినే స్టేషనే . NPR. అయితే రాత్రుళ్ళు మాత్రంఅదే స్టేషన్లో BBC ప్రసారాలు వస్తాయి.

వార్తలు.

ఉక్రెయిన్ గురించి ఏదో వార్త.

అసలీ పుతిన్ కేమయింది? అంది వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకొని క్రీమియాని ఆక్రమించుకుందామనుకుంటున్నాడా లేక ఉక్రెయిన్లో  యురోపియన్ యూనియన్ ప్రాబల్యం ఎప్పటికైనా తన పక్కలో బల్లెమే అని మొత్తం ఉక్రెయిన్ కే ఎసరుపెట్టి, క్రీమియారూపంలో కొసరు ముందు లాక్కుందామనుకుంటున్నాడా?ఏదయితేనేం ఇరు దేశాల సైన్యాల్ని పక్కనపెడితే అక్కడి జనాల్ని తమలో  తామే కొట్టుకునేలా చేసాడు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?

నిద్రపట్టేలా లేదనుకొని లేచి కూర్చొని లైటేసాను. పక్కనే గోడమీద పెద్ద వరల్డ్ మ్యాపు. చందా కట్టినందుకు నేషనల్ జియోగ్రాఫిక్ వారు ఉచితంగా పంపారు దాన్ని.


అలా దానిముందు నిలబడి అన్నేసి దేశాల్నీ, ఆ మహాసముద్రాల్నీ చూడ్డం  నాకు చాలా ఇష్టం. చూస్తూ ఉంటే ఎంత సేపైనా అలానే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఏదో తెలీని ఆకర్షణ. అన్నిసార్లూ కాకపోయినా కొన్నిసార్లు అలా కాసేపు చూసి బలవంతాన దాన్ని  వదిలించుకొనేముందు, చివరగా అమెరికాలో నేనున్న రాష్టాన్నీ , ఇండియానీ , రెంటినీ చూసి, "అబ్బో చాలా దూరం,మధ్యలో పెద్ద సముద్రం కూడా" అనుకొని ఒకరకమైన దిగులుతో పక్కకొచ్చేస్తా.

ఇప్పుడు లేచెళ్లి చేతులు కట్టుకొని దానిముందు  నిలబడ్డాను.

అంత నిశిరాత్రి , ఆ నిశ్శబ్దంలో దాన్నలా చూస్తుంటే ఇంకేదో కొత్తగా ఉంది నాకు.

ఎన్నో దేశాలూ, (రూపు రేఖల పరంగా) ఎన్నెన్నో  రకాల మనుషులూ,భిన్న సంస్కృతులూ,సముద్రాలూ, మహారణ్యాలూ, ఎడారులూ ,పర్వతాలూ...

అందులో నేనొకచోట..  చిన్ని బిందువునై .. ఇదిగో  ఇలా ఈ మ్యాప్ వైపు చూస్తూ ...

రేడియో తన పని తను చేసుకుపోతోంది ..

ఈ సారి సిరియా...

ఎక్కడుంది సిరియా? సిరియా నాకు తెలియకపోవటమేంది . ఇదిగో ఇక్కడ.

నిద్ర పట్టకపోవడంతో , నా జిజ్ఞాస కొద్దీ సిరియా  వైపు చూస్తూ ఇక్కడ నేను...

కానీ అక్కడ?

రోజు మొదలయి ఉంటుంది.  అలానే  యుద్ధం కూడా ..

కొన్ని నెలల క్రితం టైం పత్రికలో చూసిన ఫోటో గుర్తుకొచ్చింది. మొహమంతా రక్త సిక్తమై ఉన్న ఒక నాలుగేళ్ల బాలుడిని ఒక తండ్రి రెండు చేతులతో ఎత్తుకొని ఎటో పరుగు తీస్తున్నాడు. ఆయన మోహంలో భయమో,నిస్సహాయతో లేక కళ్ళముందే చేజారిపోతున్న కొడుకును చూస్తూ పడుతున్న యాతనో ... నాకైతే "చోద్యం చూస్తున్నార్రా  మీరు?"  అంటూ మనల్ని నిగ్గదీసి అడుగుతున్నట్టే అనిపించింది .  రక్తం పోకుండా ఉండటానికి ఆ బాలుడు తలకి గుడ్డ కట్టబడి ఉంది. ఎన్నో రోజుల పాటు నా మనసుని కకావికలం చేసిన ఫోటో అది

ఏం  పాపం చేసాడా చిన్నారి?

ఇలా ఎంత మందో?  వందలు..వేలు.. కాదు లక్షలు..

ఇలా ఒక్క దేశం కాదు ఎన్నో.. నా ముందున్న మ్యాపులో ఇలాంటి రావణ కాష్టాలు ఎన్నో ...

సిరియా, ఆఫ్ఘనిస్తాన్ , ఇరాక్,  సూడాన్, అల్జీరియా, యెమన్, ఇజ్రాయిల్-పాలస్తీనా ,ఈజిప్ట్, నిన్నా మొన్నటి దాకా లిబియా,చెచెన్యా.. ఇప్పుడు ఉక్రెయిన్ ... రేపు మరెన్నో ...

మా ఆఫీసుకి కూతవేటు దూరంలో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యుజియం లో ఆస్ట్రానమీ విభాగంలో అంతరిక్షం నుంచి భూమిని చూసి, ఆ అనుభవాన్ని మనతో పంచుకున్న ప్రసిద్ద అంతరిక్ష యాత్రికుల మాటలు పొందు పరచబడి ఉన్నాయి. సరిగ్గా గుర్తు లేదు గాని, వాటిల్లో ఒకటిది

"నాకైతే నీలి రంగులో మిల మిలా మెరిసిపోతున్న గ్రహమే కనబడుతోంది. ఈ దేశాలూ,వాటి   సరిహద్దులూ  ఏవీ కనపడటం లేదు."

నెట్లో నేను చూసిన, ఇప్పటి పరిస్థితికి చక్కగా సరిపోయే ఇంకొక వ్యాఖ్య. 1974 లోనే ఈ మాట చెప్పిన ఆస్ట్రోనాట్  ఎడ్గార్ మిషెల్ కి హేట్సాఫ్..

You develop an instant global consciousness, a people orientation, an intense dissatisfaction with the state of the world, and a compulsion to do something about it. From out there on the moon, international politics look so petty. You want to grab a politician by the scruff of the neck and drag him a quarter of a million miles out and say, "Look at that, you son of a bitch."

— Edgar Mitchell, Apollo 14 astronaut, People magazine, 8 April 1974.

ఎన్నో ఏళ్ళుగా వెతుకున్నా ఇప్పటివరకూ విశ్వంలో ఇలాంటి నీలి గ్రహం ఇంతవరకూ కనపడలేదు. ఈగోలూ ,స్వార్ధాలతో మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం దీన్ని ... 



తరువాతెప్పుడో నిద్రపట్టింది..  అదీ మగతగా.

రేడియో మాత్రం  తన పని తను చేసుకుపోతూనే ఉంది రాత్రంతా . ..

పొద్దున్న నేను లేచి దాని గొంతు నొక్కే దాకా. 

ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ

న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో.  (తెలియని వారికి: అమెరికాలో...