Wednesday, July 3, 2013

ఓ పుస్తకం నుండి ఓ రెండు లైన్లు

Friend seems to be a small ,superficial word until you get older.Then friendship takes on a deeper meaning as you lose your friends....

As you get older friendship becomes more important and memories more precious.Don't take true friends for granted."Grapple them to thy soul with hoops of steel". Appreciate them before it's too late.

చదువుతున్న పుస్తకం లోని ఈ లైన్లు నన్ను రోజంతా  వెంటాడాయి.దిగాల్సిన స్టాప్ మర్చిపోయేంతగా ఆలోచనలు.

చాట్ లో  "ఎలా ఉన్నారు?" అని ఆప్యాయంగా అడిగిన వారికి ఒక వారం తరువాతో,ఒక నెల తరువాతో  "బావున్నాను, మీరెలా ఉన్నారు" అనే నా సమాధానాన్ని అందుకున్నవారూ,"నీకు ఈ మెయిల్ ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే" అని తిట్టేసినోళ్ళూ, "ఏం మేము మాత్రం బిజీ కాదా, మేమేమీ పనీపాటా లేకుండా ఉన్నామా?" అని నాతో స్నేహపూర్వక వాగ్యుద్దానికి దిగినవాళ్ళూ, ఈసారికి కానీలే అని సర్దిపెట్టుకున్న స్నేహితులూ,ఉన్న కొద్దిపాటి పరిచయంతో, అడిగే చనువు లేక దూరంగా జరిగిన  వాళ్ళూ,చెప్పీ చెప్పీ విసిగి వేసారి నన్ను వదిలేసినవ్యక్తులూ గుర్తొస్తూనే ఉన్నారు రోజంతా.

(పైనున్న రెండు లైన్లూ హాలివుడ్ నటుడు Kirk Douglas రాసుకున్న ఆత్మకథ Let's Face It"  లోంచి. I recommend it if you like non-fiction. )



Monday, April 23, 2012

అమెరి'కతలు-1(మిగతా భాగం)

మా రమేష్ గాడి నోట్లో రహస్యం ఎంతోసేపు దాగదు. రెట్టించి అడిగితే వెంటనే కక్కేస్తాడు. చాలా సార్లు అలా అడగాల్సిన అవసరం కూడా ఉండదు.

పది నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయి వస్తా అని బాత్ రూం లోకెళ్ళి తలుపేసుకున్నాడు.

ల్యాప్ టాప్ తెర మీద ఒక్కొక్కటిగా అలుముకుంటున్న పాప్ అప్ విండో లను భయ భయంగా చూస్తూ , ఇండియా కాల్ చేసి నాన్నతో ఓ పది నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసా. ఈలోపు రమేష్ రెడీ అయి, నాముందు కొచ్చి నిలబడి,రెండు చేతులూ వేసుకున్న జీన్స్ ప్యాంటు జేబుల్లోకి దూర్చి, అన్నాడు.

"వెళ్దామా?"

మెట్లు దిగి కిందకొచ్చాక అడిగాడు.

"నీ కారెక్కడ పెట్టావ్?"

"అదిగో"

"సరే నన్ను ఫాలో అవ్వు సరేనా?"

"ఓకే"

ఓ పది నిమిషాల్లో మా కార్లు కారు సర్వీసింగ్ సెంటర్ పార్కింగ్ లాట్లోకి ప్రవేశించాయి.వాడు కారు దిగి,లాక్ చేసి నావేపు చూసే దాకా ఆగి , నేను కార్లోంచే వాడికి "నేను కూడా దిగాలా?" అన్నట్టు సైగ చేసాను. వాడు "పర్లేదు " అన్నట్టు సైగ చేసి కౌంటర్ వేపు వెళ్ళాడు. నేను నా కారు సీటు కొద్దిగా వెనక్కి వాల్చి , వాడింటికి వస్తూ వస్తూ నా పోస్టల్ మెయిల్ బాక్స్ లోంచి తెచ్చుకున్న టైం మేగజైన్ తెరిచాను. కార్లో అలా చదవడం నాకిష్టమైన వ్యాపకాల్లో ఒకటి. వస్తూ వస్తూ దార్లో కనపడే మెక్ డొనాల్డ్స్ డ్రైవ్ త్రూ లో కాఫీ తీసుకుందామనుకొని ,వీడి కారు ఫాలో అయ్యే హడావిడిలో ఆ విషయం మర్చిపోయినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.

ఒక పదిహేను నిమిషాల తరువాత పాసింజరు సైడు విండో అద్దం మీద టక టక మని చప్పుడు. డోరు అన్ లాక్ చేసాక వాడు సీట్లో కూర్చొని,సర్వీసుకిచ్చిన కార్లోంచి తెచ్చిన ఏవేవో పేపర్లూ,ఇంటి తాళాలూ నాసీటు పక్కనున్న కప్ హోల్డర్ లో వేసి అన్నాడు.

"పద"

కారు రోడ్డెక్కాక అడిగాను.

"ఎంత బాదేడు?"

" రెండొందలు "

ఎమ్మెస్ నారాయణలా కామెడీ గా అడగం నాకు రాదు. అలాని సాయి కుమార్ లా అడగడం అసలే ఇష్టం లేదు. అందుకే నాగార్జునలా అడిగా..

"అస్సలు నీకా టైం లో బయటికెళ్ళాల్సిన అవసరం ఏమిటి? నాకు తెలియాలి"

"నువ్వే కార్డ్ వాడతావ్?" అడిగాడు.

"క్రెడిట్ కార్డా? అమెక్స్ చాలా వరకు."

"నేను డిస్కవర్ వాడతాను"

"సో?"

"నీకు తెలుసుగా వాడు కార్డ్ యూసేజ్ మీద కేష్ బ్యాక్ ఇస్తాడని?"

"విన్నాను "

"ఆదివారం రాత్రి పదకొండప్పుడు నిద్రపట్టక , పక్క మీద దొర్లుతూ టీవీ చూస్తుంటే అందులో డిస్కవర్ కార్డ్ తాలూకు యాడ్ ఏదో వచ్చింది. అప్పుడు సడన్ గా గుర్తొచ్చింది జాన్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా వాడు గేస్ మీద ఫైవ్ పర్సెంట్ కేష్ బ్యాక్ ఇస్తాడనీ , నా మినీ వేన్ గేక్ టాంక్ ఆల్మోస్ట్ ఎమ్టీ అని. రేపు ఆఫీసయిపోగానే అట్నుంచటే బోస్టన్ వెళ్ళాలి ఈవెనింగ్ ఫ్లైట్ కి. మళ్ళా శుక్రవారం గానీ రాను.ఓ పనైపోద్ది కదాని అప్పటికప్పుడు లేచి షా రోడ్డు మీదున్న షెల్ కెళ్ళి గేస్ కొట్టించా. దాన్ని పార్క్ చేసి మెట్లెక్కుతుంటే,పనిలో పనిగా నా రెండోకారు కేమ్రీ లో కూడా గేస్ కొట్టిస్తే ఓ పనై పోతుంది కదా అనుకున్నా. కేమ్రీ లో గేస్ కొట్టించి తిరిగి ఇంటికొస్తుంటే ఇదిగో ఈ ఆక్సిడెంట్"

నేనేం మాట్లాడలేదు. కారు వాడింటి ముందాపగానే వాడు ఇంటి తాళాలు తీసుకొని, థాంక్స్ చెప్పి కారు దిగాడు.

నేను ఇంటికొచ్చి కారు పార్క్ చేసి దిగబోతుండగా నా చూపు కప్ హోల్దర్ లో వాడు మర్చిపోయిన పేపర్ల మీద పడ్డాయి. వాటిని చేతిలోకి తీసుకొని ,కారు లాక్ చేసి మెట్లెక్కి పైకొస్తూ, వాటి వైపొకసారి చూసాను. ఒకటేమో సర్వీసు సెంటర్ వాడిచ్చిన రసీదు. ఇంకొకటి షెల్ గేస్ రిసీట్. వీడెంత సేవ్ చేసాడు చూద్దాం అని దాన్ని పరిశీలనగా చూసాను. వాడు కొట్టించిన గేస్ రెండున్నర గేలన్లు. మొత్తం ఎమౌంట్ పది డాలర్ల పదిహేడు సెంట్లు. అంటే వీడికి డిస్కవర్ వాడిచ్చిన కేష్ బ్యాక్ యాభై సెంట్లు.

వీడింటికీ షెల్ గేస్ స్టేషనుకీ రెండున్నర మైళ్ళు, అంటే రానూ పోనూ ఐదు మైళ్ళు.

నమ్మశక్యం గాక ఆ రసీదు తాలూకు తారీఖు చూసాను.

వాడు చెప్పిన రోజుదే ఆ రిసీట్. మార్చి 25 రాత్రి 11:45PM




Saturday, April 21, 2012

అమెరి'కతలు -1

శనివారం తెల్లవారుజాము తొమ్మిదింటికి రమేష్ గాడి దగ్గిర్నుంచి ఫోన్.
"ఏంట్రా"
"రేయ్ నేను రమేష్ ని. ఆ ఏంలేదు చిన్న హెల్ప్ కావాలి"
రమేష్ గాడి సంగతి నాకు బాగా తెలుసు. ఫోన్ చేసి ,విషయం పూర్తిగా చెప్పకుండా "ఆ ఏంలేదు" తో మొదలెట్టాడంటే ఏదో దాస్తున్నట్టే లెక్క.
"ఏమిటి?"
"ఆ ఏంలేదు .నా కారు సర్వీసింగ్ కివ్వాలి"
నాలో అనుమానం బలపడింది. మళ్ళీ "ఏంలేదు" అన్నాడంటే డెఫినెట్ గా ఏదో ఉంది.
"నువ్వు కూడా నాతోపాటు నీకార్లో వస్తే, వచ్చేటప్పుడు నన్ను మాఇంటి దగ్గిర వదిలేద్దువుగాని" చెప్పాడు,

వివరాలు కనుక్కొని ఫోన్ పెట్టేసాను.

మధ్యరాత్రి లేపాడుకదా ఒకటే కళ్ళు మండుతున్నాయి.

పని చేసీ,చేస్తున్నట్టు నటించీ,బుధవారంనుంచి పనిని క్రమ క్రమంగా వచ్చేవారానికి వాయిదావేసీ బాగా అలసిపోయుంటానేమో, శుక్రవారం సాయంత్రం కాగానే నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. ఇంటి విషయాల్లో దక్కే వీటో అధికారం దీనికి అదనం. తనేం పని చెప్పినా "ఏం ఇది శుక్రవారం సాయంత్రం, తెలీదా?" అన్నట్టు చూస్తుంటాను తనవైపు. జస్ట్ చూస్తాను. అంతే. ఏం అనను, ఎందుకొచ్చిన గొడవ అని. చాలా వరకు నాకు అనుకూలంగానే వర్కవుట్ అవుతుందా చూపు.ఇంతాచేసి శుక్రవారం సాయంత్రం నేనేం చేస్తానూ ఆంటే, నాకిష్టమైన సినిమా,లేక సినిమాన్నరో, ఆపై ఏదైనా పుస్తకంలో ఓ వంద పేజీలూ నమిలేసి ,ఆపై మళ్ళా టీవీ చూస్తూ ,నా కిష్టమైన చోట, అనగా సోఫాలో, నిద్ర పోతాను . బ్రహ్మచారి గా ఉన్నప్పుడు పడుకోటానికి బెడ్డున్నా,నేను టీవీ చూస్తూ సోఫాలోనే నిద్రపోయేవాడిని నాకిదే సౌకర్యం అంటూ. నా రూమ్మేట్లు వింతగా చూసేవారు,వీడి కిదేం (నిద్ర) పోయేకాలం అని. అలా ఆనందమయ జీవితానికి సోఫా ఒక సింబల్ అయి కూర్చుంది నాకు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గెస్టు లెక్కువై , హోస్టులు హైరానా పడుతుంటే నేను నెమ్మదిగా సోఫానాక్రమించుకొని నామోహాన ఒక కంఫర్టర్ పడేస్తే నా నిద్ర నేనుపోతాను అని చెప్తా ఏదో త్యాగం చేస్తున్నట్టు మొహం పెట్టి.

సరేలెండి, విషయానికొస్తే,సో, అలా నేను నిద్రపోయే సరికి శనివారం ఉదయం ఏ నాలుగో ఐదో అవుతుంది మరి.బహుశా అందుకే అనుకుంటా , ఆ మరుసటి రోజు, నేను క్రితం రాత్రి చూసిన సినిమాలు గుర్తుంటాయి గాని, వాటి పేర్లు మాత్రం చచ్చినా గుర్తు రావు.

********************************************************************

ఉసూరు మంటూ రెడీ అయి పదకొండూ పదకొండున్నర మధ్య రమేష్ గాడింటి కెళ్ళాను. వాడే తలుపు తీసాడు.వాళ్ళావిడ ఇండియా వెళ్ళింది. ఇంట్లో వీడొక్కడే. కలర్లో చూస్తున్న WW-II స్టిల్ ఫోటోగ్రాఫ్ లా ఉంది ఇల్లు. ఏ వస్తువునీ తాకకుండా, తొక్కకుండా జాగ్రత్తగా ఒక డైనింగు టేబుల్ తాలూకు కుర్చీలో సెటిలయ్యాను. వాడేమో డైనింగ్ టేబిల్ మీద పెట్టిన ల్యాప్ టాప్ లో పాటలు వింటూ వంటింట్లో స్టవ్ దగ్గర ఏదో కుస్తీ పడుతున్నాడు. ఆ పాట వింటుంటే విన్న ట్యూన్ లానే ఉంది. మ్యూజిక్కులో మాత్రం రెహ్మాన్ మార్కు స్పష్టంగా కనపడుతోంది.

"రెహ్మాన్ పాటలా ఉంది. ఏం సినిమా? " అడిగాను.

వాడు నావైపు అదోలా చూసి,గబా గబా నాదగ్గరకొచ్చి . ల్యాప్ టాప్ నావైపు తిప్పాడు. స్క్రీన్ నిండా పాపప్ విండోలు.

"ఏదో వైరస్ ఎక్కిందిరా. నీ దగ్గరేమైనా ఏంటీ వైరస్ ఉందా?" అంటూ టిక్కుం టిక్కుం అని వాటిని ఒక్కొక్కటే క్లోజ్ చేస్తున్నాడు. ఒక స్క్రీన్లో ఏవో వార్తలు వస్తున్నాయి. ఇంకో దాంట్లో ఇంట్లో కూర్చొని నెలకి ఇరవై వేల డాలర్లు ఎలా సంపాదిచ్చొచ్చో చెప్తూ ప్రకటన, ఇంకో దాంట్లో బరువు తగ్గటం ఎలా అనే విషయం మీద ఒకామె ఊదరకొట్టేస్తోంది. ఇంకొన్ని స్క్రీన్లు చెప్పకూడనివీనూ. అలా వాడు దాదాపు ఒక ఏడెనిమిది విండోలు మూసేసాక అప్పుడు వినపడింది పాట స్పష్టంగా "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి" అంటూ.

"అరె, మన ఇళయరాజా పాట. అనవసరంగా కాపీ ట్యూన్ అని రెహ్మాన్ ని ఆడిపోసుకున్నానే" నోచ్చుకున్నాన్నేను. పైకలా అన్నా నాకు రెహ్మాన్ మ్యూజిక్ అసలు నచ్చదు. వంటింట్లో ఉన్న స్టీలు పాత్రలన్నీ కౌంటర్ టాప్ మీద పెట్టి , ఒక్కసారిగా వాటన్నిటినీ నేల మీదికి తోసేసినట్టుగా ఉంటుంది నాకు ఆయన సంగీతం.

స్టవ్ దగ్గర్నుంచే వాడు ఆఫర్ చేసిన బ్రేక్ ఫాస్ట్ ని లోపల భయమేస్తున్నా,పైకి సున్నితంగా,పొట్ట రుద్దుకుంటూ ఇంట్లోనే తినొచ్చా అని చెప్పి తప్పించుకున్నాను.

వాడు తింటుండగా అడిగాను.

"ఇంతకీ ఏంటి విషయం?"

"దేని గురించి?"

"అదే , కారు సర్వీసింగ్ అన్నావు, ఆయిల్ చేంజా?"

"కాదు"

"మరి?"

వ్యక్తిగత విషయాలైనా,మొహమాటం లేకుండా,ప్రశ్నలతో వేధించగల చనువున్న అతి కొద్ది మంది (ఇద్దరు) ఫ్రెండ్స్ లో వీడొకడు నాకు.

వాడు నావైపు సాలోచనగా చూసాడు.చెప్పాలా వద్దా అని సంకోచిస్తున్నట్టుగా అర్ధమయింది నాకు. ఇప్పుడు కాకపొతే, కింద కారు దగ్గరి కెళ్ళాకో, లేదా సర్వీసు సెంటర్ లోనో విషయం నాకు వాడు చెప్పక పోయినా (చూచాయగా నైనా)తెలుస్తుందని నెమ్మదిగా అర్ధమయినట్టుంది బడుద్దాయికి. తింటున్నదాపి కాస్త నీళ్ళు తాగి గొంతు సవరించుకున్నాడు.

"ఏక్సిడెంటు చేశా"

వాణ్ని పైనించి కిందదాకా పరీక్షగా చూస్తూ అన్నా "ఏమిటీ? ఎక్కడ? ఎలా అయింది?ఏం కాలేదు కదా?"

"తిక్క మొహంది. వెళ్తూ వెళ్తూ సడన్గా బ్రేకేసింది, నేను చూసుకోలేదు" ఆమెదే తప్పన్నట్టు మొదలెట్టాడు. "వెనకనుంచి ముద్దెట్టుకున్నా"

"వాటెవర్ ఇట్ ఈజ్ . నీదే తప్పు. బాగా డామేజయిందా ?"

"ఆమె కారుకేం కాలేదు. నాకారు బానేట్ కొద్దిగా వంకర పోయింది."

"ఎప్పుడు జరిగిందిది?"

"మొన్న , సండే నైటు పదకొండప్పుడు "

"ఆ టైమ్లో బయటి కెందుకెళ్ళావురా?"

" "

దొరికి పోయాడు. సో, ఆ ఏదో, ఇక్కడుంది అన్నమాట.

పొద్దున్నే ఆఫీసు పెట్టుకొని ఆ టైమ్లో బయటికెందుకెళ్ళాడు? ఎందుకు?ఎందుకు?ఎందుకు?
(ఇంకాఉంది)


Monday, April 9, 2012

ఒక పరిచయం

తను నావైపు చూసి సన్నగా నవ్వింది.

నాలో క్షణకాలపు తడబాటు.

నన్నేనా లేక నా పక్కనున్న తన పరిచయస్తులెవరినైనా ఉద్దేశించి నవ్విందా?సమాధానంగా నేను తిరిగి నవ్వితే,ఒకవేళ ఆ నవ్వు నున్నుద్దేశించింది కాకపొతే ?

సమాధానంగా నేను నవ్వీ నవ్వనట్టు నవ్వినా, నా తడబాటు కలిగించిన ఆ క్షణకాలపు ఆలస్యం నా సమాధానాన్ని తనవరకూ చేరనిచ్చినట్టు లేదు. ఆసరికే తను తలకిందికి దించుకొని కుడి చేతి బొటనవేలిని స్మార్ట్ ఫోన్ తెర మీద ఆడిస్తోంది.

తలతిప్పి నా కుడి ఎడమలకు చూసాను. వారెవరూ తన పరిచయస్తుల్లా అనిపించలేదు.నాలో చెలరేగే సంచలనాన్ని అణచుకుంటూ, ఒక అరనిమిషం కదులుతున్న బస్సులోంచి బయటికి చూసి మళ్ళా తనవైపు ఓరగా చూసాను. తను అలానే తలవంచుకొని ఫోన్ వైపు చూస్తోంది.

నేను తనకు ఎంత కాలంనుంచి తెలుసో తెలీదు గాని, మాటా మంతీ లేని మా పరిచయానికి నావైపు నుంచి దాదాపు ఒక సంవత్సరపు వయసుంటుంది. ఇద్దరం ఆఫీసుకెళ్ళే సమయం ఒకటే కాబట్టి తరచుగా తను నాకెదురవుతూనే ఉంటుంది. మొదటిసారి చూసిన సందర్భం గుర్తులేదు కాని తనని చూడగానే ఏదో చాలా కాలం నుంచి పరిచయమున్న వ్యక్తిలా, ఒక అందమైన చిన్నప్పటి జ్ఞాపకంలా అపురూపమైనదీ, అరుదైనదీ అన్న భావన కలిగిందా క్షణాన.అప్పుడు నాకేమీ స్పురణకు రాలేదు గాని ఇది జరిగిన ఒక వారం రోజుల తరువాత , భోరున కుండపోతలా వర్షం కురుస్తున్న రోజు, బస్సులో ఎప్పటిలా తనని చూసిన క్షణాన , (బహుశా) ఆవర్షపు వాతావరణం ఒక ఉద్దీపనలా దాదాపు పాతికేళ్ళ క్రితపు నా యవ్వనపు పరిచయాన్ని గుర్తుకు తెచ్చింది. అంతటితో ఆగకుండా ఆ జ్ఞాపకానికీ నేను ఇప్పుడు చూస్తున్న వ్యక్తికీ ఏ తర్కానికీ అందని లంకె కుదిర్చి మిగతా ఖాళీని నువ్వే పూరించుకో అంటూ నిర్మొహమాటంగా నన్నో జ్ఞాపకాల జడివాన లోకి తోసేసింది..

***********************************************************************************
కాలపరీక్షకి ఎదురునిలిచే కొన్ని జ్ఞాపకాలు ఒంటరిగా గుర్తురావేమో.

ఆ సంఘటనలూ, వాటిని ఆవరించుకొని ఉన్న నేపధ్యం కూడా దాంతో పెనవేసుకొని గుర్తుండిపోతుంది. బహుశా మెదడు మనకిష్టమైన ఆ జ్ఞాపకాన్ని నిక్షిప్తం చేసే పద్దతే అదేమో నాకు తెలీదు..

ఎప్పుడో పాతికేళ్ళ క్రితపు ముసురు పట్టిన వినాయక చవితి నాటి సాయంత్రమూ..

వెన్నెల్లో మేడ మీద సిరివెన్నెల పాటలూ..

గుళ్ళో వెలిగించిన కార్తీకమాసపు దీపాలూ..

రోహిణీకార్తె మిట్టమధ్యాహ్నం ఆవిర్లు కక్కుతూ ,నిర్మానుష్యంగా ఉండి, ఏ ఐదింటికో తిరిగి జీవంపోసుకొనే వీధీ.. ఎప్పుడు సాయంత్రమవుతుందా ?తనెప్పుడు కనబడుతుందా?అని నా ఎదురుచూపులూ..

ఇవన్నీ ఆ అందమైన పరిచయానికి అంతే అందమైన నేపధ్యాలు...
*********************************************************************************


ఓరగా చూసి చటుక్కున తలతిప్పుకొనే నేను ఆరోజు తనని మొట్టమొదటి సారి పరిశీలనగా చూసాను. గుండ్రటి మొహం,ఆరోగ్యకరమైన పలకరింపుతో కూడిన కళ్ళూ, చెవులకు చిన్నప్పుడెప్పుడో పెట్టుకొని ఇప్పటివరకూ ఒక్కసారి కూడా తీయలేదేమో అనిపించే పాతకాలపు బుట్టలూ, మెడలో సన్నని బంగారపు గొలుసూ, అన్నిటికీ మించి మొహంలో పట్నవాసపు పోకడ తెలీదనిపించే ఒకరకమైన అందమైన అమాయకత్వమూ. తను తలవంచుకొనే విధానమూ , తలవంచుకొని చేస్తున్న పనిలోకి లీనమయే తీరూ ,తన నడకా ఇలా ప్రతిదీ నా జ్ఞాపకానికి ప్రతిరూపంగా అనిపించ సాగాయి ఆరోజునించి.

ఒకే అపార్ట్మెంట్ ఆవరణ లో ఉండే మాదొక మూడంచెల ఆఫీసు ప్రయాణం. ఒక రెండుమైళ్ళ కారు ప్రయాణం, తరువాత ఒక 20 నిమిషాల బస్సు, ఆపై దాదాపు ఒక 25 నిమిషాల సబ్వే రైలు ప్రయాణం. రైలు బయలు దేరిన 14 నిమిషాలకు తను దిగిపోతుంది.కొన్ని సార్లు బస్సు ఎక్కేటప్పుడు కనపడకపోయినా ట్రైన్ స్టేషన్లో కనపడుతుంది ప్లాట్ ఫారం మీద ఎస్కలేటర్ పక్కనే నిలబడి రైలు కోసం వేచి చూస్తూ.ప్రతిరోజూ అక్కడే నిలబడుతుంది ఒక అడుగు అటూ ఇటుగా.

దాదాపు ప్రతిరోజూ కారు పార్క్ చేసి నాలుగంతస్తులు మెట్లు దిగి కిందకొస్తూ, పక్కనున్న ఆద్దాలలోంచి కింద లైనులో నిలబడ్డ వాళ్ళలో ఆత్రంగా తనని వెదుక్కునేవి నాకళ్ళు. తను నాకు బస్ స్టేషనులో కనపడని రోజున నేను రైల్వే ప్లాట్ఫాం మీద ఎస్కలేటర్ పక్కనున్న ఆ స్థలాన్ని మనసులో మెదిలే ఆత్రత ఏమాత్రం పైకి కనపడనీయకుండా చాలా యధాలాపంగా గమనించేవాడిని. సరాసరి ప్రతి నాలుగు నిమిషాలకు ఒక ట్రైన్ ఉండే ఆ రూట్లో తను నాకు కనపడే అవకాశం బహు తక్కువ. చాలా వరకు ఆ స్థలం నన్ను వెక్కిరిస్తూ కనపడేది. వాక్యూముక్లీనర్లా ప్రయాణీకులందరినీ తుడుచు కెళ్ళిన రైలు వెళ్లి మరీ ఎక్కువసమయం కాకపొతే అది ఇంకాస్త ఖాళీగా , బోసి పోయి కనపడుతూ,ఆ నిశ్శబ్దంలో పక్కనున్న ఎస్కలేటర్ అప్పుడప్పుడూ చేసే కిర్రు మనే చప్పుడు అప్పుడేవెళ్ళిన తనగురించి నాకేదో చెప్తున్నట్టనిపించేది.

మా ప్రయాణంలో నేను పుస్తకం చదువుతూ, తను పాటలు వింటూ అప్పుడప్పుడు క్షణకాలం కలిసే కళ్ళను సభ్యత విడదీసేది. ఎప్పుడో అమావాస్యకో పౌర్ణానికో , ఏ తెలీని ధైర్యమో ఆ క్షణానికింకో క్షణాన్ని కలిపేది. నాగుండె లయ తప్పేలా ఆ రెండో క్షణం అచ్చంగా నా గత జ్ఞాపకం నన్నుచూసి పలకరింపుగా నవ్వినట్టుండేది. ఆసమయంలో తనుకూడా నన్ను చూస్తున్నదన్న ధైర్యం అనుకుంటా, అమాంతం వెళ్లి పక్కన కూర్చొని నన్ను తనకి పరిచయం చేసుకుందామనిపించేది.కానీ ఇలాంటి విషయాల్లో బహుశా నా నిరాశాపూరిత ఆలోచనల కారణంగా కావచ్చు , నా అందమైన ఊహల కొలనులో రాయి వేయటానికి నాకు మనస్కరించేది కాదు. కళ్ళముందున్న వాస్తవానికీ,నేనెరిగిన జ్ఞాపకానికీ స్థల,కాల పరంగా సహజంగా ఉండే దూరం ఒక భయమై, మాట్లాడకుంటే తను నాగురించి ఏమైనా చెడుగా అనుకునే అవకాశం ఉంటుందేమో అన్న ఆలోచని కూడా తోక్కిపట్టేసింది.అప్పుడప్పుడూ తన పేరేమిటో అన్న ఆలోచన మాత్రం నాలో పొడసూపేది. బహుశా తనపేరు కూడా అదేనేమో?నాలోనేను నవ్వుకునేవాడిని ఆ ఊహ రాగానే.కొన్ని కొన్ని సార్లు నేను తలతిప్పుకొని కిటికీ బయటికి చూస్తున్నప్పుడు తను నావైపే కళ్ళార్పకుండా చూస్తున్నట్టనిపించేది. అది నిజమో కాదో గాని ఆ ఆ ఊహ మాత్రం భలే గమ్మత్తుగా ఉండేది.

మాటల్లేని ఈ పరిచయం ఇలానే కొనసాగి ఉంటే బాగుండేది.

Monday, July 11, 2011

భజ గోవిందం

కొన్ని ఉదయాలు మొదలవడమే ఎంతో ఉత్తేజపూరితంగా మొదలవుతాయి. మిగతా రోజులు నీరసంగానూ, నిస్తేజంగానూ.

ఎందుకలాగ అని కొన్ని సార్లు అనిపిస్తుంది. క్రితం రోజు ఏమేమి పనులు చేసానా, ఈ ఉల్లాసానికీ, ఉత్సాహానికి కారణమేమిటా? అని ఆలోచిస్తే , ఆ క్రితం రోజు మిగతా రోజుల్లాగే సర్వ సాధారణంగా గడిచి ఉంటుంది.పేద్ద చెప్పుకోదగ్గవేమీ ఉండవు.

నీరసంగా మొదలైన రోజుల్లో మాత్రం ఉదయాన్నే లేవగానే , కాఫీ కప్పు పుచ్చుకొని కంప్యూటరు ముందు తిష్ట వేస్తాను ఒక అరగంట. యు ట్యూబు లో పాటలు చూడ్డంతో నా రోజు మొదలవుతుంది. మిగతా పాటల సంగతెలా ఉన్నా, మొట్ట మొదటగా వినేది మాత్రం "భజగోవిందం " . ఎమ్మెస్ గళం లో "స్థాపకాయచ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే" వింటూనే అప్పటివరకూ తిష్టవేసుక్కూర్చున్న నిరాశా నిస్పృహలు నెమ్మదిగా మాయమై ఏదో ధైర్యం నాలో గూడు కట్టుకొనడం మొదలవుతుంది. ఈ "చిన్న చిన్న చికాకులూ,సమస్యలూ అసలు సమస్యలే కావూ, నిజం తెలుసుకో" అంటూ ఎవరో శ్రేయోభిలాషి నా పక్కనే ఉండి నాకు బోధ పరుస్తున్నట్టు అనిపిస్తుంది.

"సంప్రాప్తే,సన్నిహితే కాలే" ఈ జీవితాన్ని ఎంత నిరర్ధకంగా గడుపుతున్నానో అని హెచ్చరిస్తుంది. సమస్యలు దూదిపింజలై పోతాయి ..

2004 నుంచి ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు.

విచిత్రమేమిటంటే అంతకు ముందు ఒకటి అరా సార్లు దీన్ని విన్నా, అంతగా పట్టించుకోలేదు. దీన్ని నాకు పరిచయం చేసి, దీని వెనుకున్న కథనీ, అర్ధాన్నీ నాకు తెలియజేసింది ఒకమ్మాయి,అదికూడా ఎవరూ ఊహించని టైములో..


2004 లో ఉద్యోగార్ధం అమెరికాకి ప్రయాణమైన నాకు ముంబై ఎయిర్ పోర్టులో పరిచయమయిందీ హైదరాబాదీ తెలుగమ్మాయి. ఫ్లైటు ఎక్కబోయే ముందు ఎస్టీడీ బూత్ దగ్గర హైదరాబాదు ఫోన్ చేసి అమ్మకి ఫ్లైటు ఎక్కబోతున్నాను అనిచెబ్దామనుకుంటున్నప్పుడు ,తన పేరెంట్స్ కి ఫోన్ చేయటానికి అదే ఫోన్ దగ్గరికి తనూ రావటంతో మొదలయింది పరిచయం.


తను వెళ్ళేదేమో న్యూయార్క్ కి , నేను విస్కాన్సిన్ కి. ఆమ్ స్టర్ డాం లో మెయిల్ ఐడీ తీసుకొని బై బై చెప్పేసుకున్నాం.ఆ తరువాత తరచుగా ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం. తన కాలేజీ కష్టాలూ, నా ఉద్యోగపు వెతలూ, నా ఒంటరితనమూ ( కారు లేదు. అపార్టు మెంటులో నేను ఒక్కడినే, విస్కాన్సిన్ లో ఒక చిన్న పల్లెటూళ్ళో.అందునా జనవరి మాసం , ఫారెన్ హైట్లో సైతం మైనస్ లలో ఉండే ఉష్ణోగ్రత ..డిప్రెషను రాదూ అంటే ఎందుకు రాదు మరి?) ..ఒకరి కొకరం ధైర్యం చెప్పుకొనే వాళ్ళం.ఇప్పుడాలోచిస్తే గమ్మత్తుగా ఉంటుంది.

ఫోన్ లో మేము కవర్ చేయని టాపిక్కంటూ ఉండేది కాదు.తను రాసిన కవితో, చదివిన పుస్తకమో, వినాయక చవితి పండగో, కేంపస్ లో జరిగిన మగ్గింగో .. టాపిక్కు లకు కొదవుండేది కాదు.

ఒకసారెప్పుడో శుక్రవారం రాత్రి 11 గంటలకు తననుంచి ఫోన్...బహుశా నిద్ర పట్టలేదేమో..లేదా ఏదో చికాకులో ఉందో..సరిగా గుర్తు లేదు..

ఓ గంట తరువాత సంభాషణ ఎలా వెళ్లిందో గుర్తు లేదు గాని ,టక్కున అడిగింది "మీరు భజ గోవిందం, ఎప్పుడైనా విన్నారా" అని. "లేదండీ " అని నేను.

తన మాటల ప్రవాహం ఎలా ఉంటుందంటే తను చదివిన పుస్తకం గానీ, లేదా చూసిన సినిమానో లాంటి విషయాలు తను చెప్తుంటే వినే అవతలి వ్యక్తి చేయగలిగేది "ఊ" కొట్టడం మాత్రమే. ఇప్పుడూ అంతే..నాకు ఆశ్చర్యమని పించిది మాత్రం తను "భజ గోవిందం" స్తోత్రం మొత్తాన్నీ పాడి వినిపించటం, దాని అర్ధాన్ని తనకి తోచిన ఉదాహరణలతో నాకు వివరించటం. ఎప్పుడో తెల్లవారు ఝాము మూడూ,మూడున్నరకి మా సంభాషణ ముగిసింది.

ఉద్యోగం పేరిట నేను చేసే నిర్లక్ష్యానికి ప్రతీకగా ఆ పరిచయం కూడా ఎప్పుడో ముగిసింది. కొన్ని జ్ఞాపకాలు మాత్రం మిగిలాయి. వాటిల్లో ఇదొక మధురమైన జ్ఞాపకం.

నాకిష్టమైన మరి రెండు లైన్లు, నేను మరీ మరీ రివైండు చేసుకొని మరీ వినేవి..

"పునరపి జననం, పునరపి మరణం........"

"అర్ధ మనర్ధం, భావయే నిత్యం...."

తనకి... "వన్స్ అగైన్ , థాంక్యు "

శుభమస్తు..

Friday, May 14, 2010

చరిత్రంటే నాకిష్టం.


చరిత్రంటే నాకిష్టం.

చరిత్రకి సంబంధించి ఏమైనా చదివినా, టీవీలో ఏదైనా ప్రొగ్రాము చూసినా వెంటనే దానిలో లీనమైపోతాను. కవితా సౌరభాలు వెల్లి విరిసిన రాయల వారి కాలం గురించి చదివినా, రాజ్య కాంక్షతో జీవితాంతం యుద్దాలతో గడిపేసిన అలెక్జాండరు జ్ఞప్తికి వచ్చినా, ఉన్మాదంతో ప్రపంచాన్ని అగ్నిగుండంగా మార్చేసిన హిట్లర్ మీద ఏదైనా ప్రోగ్రాము చూసినా ఏదో అవ్యక్తానుభూతి. అది దుఃఖమూ కాదు, సంతోషమూ కాదు.ఈ రెంటికీ అతీతంగా, ఏదో భావన.

కొన్ని సార్లు ఆ భావన ఎంత విచిత్రంగా ఉంటుందంటే జరిగిన చరిత్ర మీద కంటే జరిగిపోయినఆ కాలం మీద ఒక రకమైన బలమైన ఆకర్షణ కలగజేసేలా ఉంటుంది.

******************************************************************************

కనెక్టికట్ కి వచ్చినకొత్తల్లో, ప్రాజెక్టులో కుదురుకోగానే మొట్టమొదట చేసిన పని ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలేమున్నాయా అని చూడటం. గూగుల్ లో వెతికిన ప్రతిసారీ కనపడేది "Mystic Seaport" అని. చూసినప్పుడల్లా "ఆ! సీ పోర్టులో ఏముంటుందిలే" అని పట్టించుకోలేదు. ఒక రెండేళ్ళ తరువాత, చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేసాక , ఈ సీపోర్టేమయిఉండొచ్చబ్బా ఒకసారి వెళ్ళి చూస్తేపోలా అనుకున్నా. మొత్తానికి ఒక శనివారం రోజు వెళ్ళా.


ఈ సీపోర్టొక ఓపెన్ ఎయిర్ మ్యూజియం లాంటిది. 1800 లలో , సముద్రం మీద ఆధారపడి జీవించే వారుండే ఒక సగటు అమెరికన్ గ్రామాన్ని యధాతధంగా పునర్నిర్మించారు. అప్పటిలానే ఇళ్ళూ, వీధులూ, షాపులూ, ఒక బేంకూ , పోస్టాఫీసూ, ప్రింటింగు ప్రెస్సూ, కిరాణా షాపూ, బేకరీ, మెడికల్ షాపూ అన్నీ. అన్నీ ఒక వంద,నూటేభై ఏళ్ళ క్రితం ఎలా ఉండేవో అలానే ఉన్నాయి. వాటిల్లో ఆ కాలపు దుస్తులు ధరించి, అప్పటి ఆ వస్తు విశేషాల్ని వివరిస్తూ సీపోర్టు ఉద్యోగులు. చాలా ముచ్చటేసింది.

పారిశ్రామిక విప్లవం మొదలైన ఆ రోజుల్లో , కొత్తగా కనుగొన్న ఆ యంత్రాలకు లూబ్రికేషను కావాలి అంటే తిమింగలాలను చంపగా వచ్చిన ఆయిలే శరణ్యం. అలా మొదలయింది తిమింగలాల వేట. పెద్ద పెద్ద షిప్పులు మీద ఏకబిగిన సంవత్సరాల తరబడి సముద్ర జలాలమీద తిమింగాలాలకై వేటకెళ్ళేవారట. అప్పట్లో, టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో, ఆ అనంత జలరాసి లో, రాత్రనక పగలనక వేటాడేవారు.ఆ షిప్పుల్లో ఒక్క కెప్టన్ కి మాత్రమే భార్యని వెంట తీసుకెళ్ళే సౌలభ్యం ఉంటుందట. మిగతా వాళ్లందరూ ఒంటరిగా భార్యలనీ పిల్లల్నీ,తల్లితండ్రుల్నీ వదిలి వెళ్ళాల్సిందే. ఆ ఓడల్లోనే కొన్నిసార్లు ఆ కేప్టన్ల భార్యలు పిల్లల్ని కనేవారు. కొన్నిసార్లు అనారోగ్యం కారణంగా కెప్టన్ చనిపోతే వాళ్ళ భార్యలే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని కెప్టన్ బాధ్యతలు నిర్వహించేవారట. చీకటి గుయ్యారాల్లాంటి ఆ కేప్టన్ల డెక్కుల్నీ, అంతకంటే ఇరుగ్గాఉండే నావికుల కేబిన్లని చూస్తే అయ్యో అనిపించింది.ఇలాంటి ప్రతి ఊరికీ సముద్రపొడ్డున ఒక చిన్న గ్రౌండ్ లాంటిది ఉంటుంది. సముద్రంలో సుదూరంగా ఏదైనా ఓడ కనపడితే పిల్లా,పాపలంతా అక్కడ గుమి గూడేవారట ఆ ఓడలో తమవారు తిరిగొస్తున్నారేమో అనే ఆశతో. ఎంత ఎమోషనల్ దృశ్యమో కదా ఊహించుకుంటే.


అప్పట్లో వేటకు వాడిన, దాదాపు ఒక పాతిక పైగా ఓడల్ని సేకరించి నీళ్ళలో నిలిపి ఉంచారు ఈ మ్యూజియంలో. వాటిల్లోకెళ్ళి కలియతిరుగుతుంటే ఎన్నో ఆలోచనలు.ఎంతమంది ఆశల్నీ , కలల్నీ మోసుకెళ్ళిందో ఆ ఓడ. ఎంతమంది జీవితాలు ఇందులోనే తెల్లారిపోయాయో కదా. ఆ షిప్పులో మెట్లెక్కినా , దిగినా , అప్పట్లో వాళ్ళు నడిచిన చోటే నేను నడుస్తున్నాననే ఆలోచన నాలో కలిగించే ఉద్విగ్నత. ఆ చెక్క దూలాల మీద వాళ్ళు చెక్కిన గుర్తులు చూస్తుంటే ఏ మధ్యాహ్నం నాడో, లేదా ఏ నిశిరాత్రో, ఎవరో నావికుడు, ఎక్కడో ఈ అనంత జలరాసి కావల ఉన్న తన పిల్లల్నీ, వృధ్ధులైన తల్లితండ్రుల్నీ , భార్యనీ తలచుకొని ఆ ఆవేదనని దిగమింగటానికి , ఉబికివస్తున్న కన్నీళ్ళనాపుకుంటూ చేసిన గుర్తులేమో అవి..


అంతా చేసి అప్పుడప్పుడు సంవత్సరాలపాటు వేటాడినా సరైన సంఖ్యలో తిమింగలాలు దొరక్కపోతే ఆ నావికులే కెప్టన్ కి డబ్బులు బాకీ పడేవారట. దారుణం కదా? ఇది నా దేశం కాదు. నా సంస్కృతీ కాదు. కానీ మనిషి ఎక్కడైనా మనిషేకదా.సుఖానికేమో గాని, కష్టానికీ, దుఃఖానికీ, ఆవేదనకీ, అన్యాయానికీ దేశాలూ, సంస్కృతీ - సంప్రదాయాలూ అతీతం కదా.

మెట్లు దిగి బయటికొచ్చాక కూడా మళ్ళా ఎప్పుడు చూస్తానో అని చేత్తో తడిమాను, మోర్గాన్ అనే ఆ పెద్ద చెక్క ఓడని.

******************************************************************************
నేను ఇంజనీరింగు చేసిన కాలేజి హైదరాబాదు ఊరి శివార్లలో ఉంటుంది. సిటీ నుంచి మా కాలేజీకి వెళ్ళాలంటే గోల్కొండ కోట మీదగా వెళ్ళాలి.బస్సు కిటికీలోంచి ఆ కోటని ఒక్కసారి పరికించి వెంటనే రోడ్డు కిరుపక్కలున్న పోలాలవైపు దృష్టి సారిస్తాను. కోటని ఆక్రమించటానికి తొమ్మిది నెలలపాటు కష్టపడ్డ ఔరంగజేబు ఇదిగో ఈ చుట్టుపక్కలే తన సైన్యాన్ని మొహరించి ఉంటాడు. ఇప్పటి పచ్చటి పోలాలున్న ఈ భూమి ఒకప్పుడు వెచ్చటి రక్తంతో తడిసి ఉంటుంది . కుట్రలకీ కుతంత్రాలకీ మూగ సాక్షి అయి ఉంటుంది.

రాత్రిపూటో,ఏదో ఎక్జాము టెన్షన్స్ ఉన్నప్పుడో, మరెప్పుడో తప్పితే దాదాపు ప్రతిసారీ అక్కడికి రాగానే ఇదే ఆలోచన.

గోల్కొండ కోట చూసినపుడూ ఇలాంటివే ఆలోచనలు. అవి మొండి గోడలే కావచ్చు. కానీ మనకెవ్వరికీ తెలీని రాచరిక రహస్యాలు తమలో ఇముడ్చుకున్నవవి. వైభవాన్నీ,పతనాన్నీ రెంటినీ సమానంగా నిశ్చలంగా వీక్షించిన గవాక్షాలవి.

****************************************************************************

కొన్నేళ్ళ క్రితం అలానే యాదగిరి గుట్ట నుంచి తిరిగి హైదరాబాదు వస్తూ ఆ భువనగిరి కోట ఎక్కాము. చాలా చిన్న కోట. నిజానికి అదొక ఖైదీల్ని ఉంచటానికి వాడే జైలు(అట). అలానే ఒక రకమైన గార్డు పాయింటు లాంటిదట ఆ కోట. శత్రువు లెవరైనా గోల్కొండ మీద దాడికి వస్తుంటే ముందే తెలియడానికి కట్టుకున్న కోటన్నమాట. ఫ్రెండ్స్ అందరు కిందికి చూసి ఆ వ్యూ బావుంది ఈ వ్యూ బావుంది అంటున్నారు. నాక్కూడా అవి బావున్నా, నా బుర్రలో మాత్రం అంతకు మించిన ఆలోచనలు.

ఎప్పుడు కట్టారో దీన్ని? ఎన్ని వందల వేలమంది కష్టపడ్డారో కదా.

ఆ మెట్ల మీద నడుస్తున్నా,అక్కడక్కడ ఉన్న అరుగులమీద కూర్చున్నా ఎన్నో ఆలోచనలు. ఇప్పుడంటే పాడుపడి పోయింది కానీ కొన్ని వందల ఏళ్ళ క్రితం అదొక సజీవ దృశ్యం. ఎన్ని సాయంత్రాలు ఆకోట దివిటీల వెలుగులో ఆ మసక వెలుతురులో తన ఉనికి నిలుపుకుందో.ఆ చీకటి గదుల్లో ఒకప్పుడు ఎన్ని గొంతులు ప్రతిధ్వనించాయో కదా.

అక్కడ కట్టిన గోడని చూసినా, ద్వారాన్ని చూసినా ఎన్నో ఆలోచనలు. రాయి పై రాయి పెట్టి వాటిని నిలబెట్టిన చేతులు ఎవరివో కదా? భుక్తో , ప్రభుభక్తో ఏదయితేనేం, ప్రభు దాసుడో, కారాగారవాసో ఎవరైతేనేం, ఏ చెమటలుగక్కే మధ్యాహ్నమో, మసక చీకటి నాటి సాయంత్రమో, చల్లగాలులు వీచే ప్రాతః వేళో ఆ రాయి అక్కడ పెట్టబడింది. ఎవరు పెట్టారో దాన్ని.ఒక్కసారి తడిమి చూద్దాం అనిపిస్తుంది నాకు. ఆ శ్రమజీవి తాలూకు తరాలకి తరాలు గడిచిపోయినా నాటి శ్రమ ఇప్పటికీ సజీవంగా,మన కళ్ళ ముందు.ఎవరై ఉంటారా వ్యక్తి?..

**************************************************************************

కోపెన్ హేగన్ (డెన్మార్కు) ...2003 ఒక వేసవి కాలపు మధ్యాహ్నం.

ఆఫీసు పని ముందే ముగించుకొని బయటపడ్డాను.ఇంతముందే ఇంటికి వెళ్లి ఏంచేస్తాను అని, అనుకున్నదే తడవు తరువాతి స్టేషనులో ట్రైన్ ఆగగానే దిగేశా. జనంతో కిటకిటలాడుతున్న ఉన్న ఆ ఇరుకు వీదుల్లో తిరుగుతూ ఉంటే ఏవేవో ఆలోచనలు. యూరోప్ అనగానే నాకు మొట్టమొదటగా గుర్తుకొచ్చేది,హిట్లర్ -రెండో ప్రపంచయుద్దం .(అంతకుముందు యూరప్ కి చరిత్రేమీలేనట్టు :) ). రెండో ప్రపంచ యుద్ధం గురించి ఎంత విన్నా, ఎంత చదివినా, ఎన్ని సినిమాలు చూసినా నాకు ఎప్పటికీ తరగని ఆసక్తి.

ఎడతెరిపి లేకుండా వాహనాలు పరిగెడుతూ ఉండే ప్రధాన వీధినానుకొనే,చిన్న చిన్న నాపరాళ్ళు పరిచి ఉన్న పెద్ద మైదానం లాంటి ప్రదేశం, దానికి మూడువైపులా అద్భుతమైన భవనాలు. చర్చిలా కనపడే పెద్ద భవనం ముందు మెట్లపై కూర్చున్నాను.

హిట్లర్ లాంటి వ్యక్తిని కూడా స్నేహపూర్వకంగా ఉంటే ఎవరూ మనవైపు చూడరులే అని అమాయకంగా నమ్మి మోసపోయిన దేశం డెన్మార్క్ . బహుశా 63 ఏళ్ళ క్రితం ఈ ప్రదేశం కూడా సైనికుల పద ఘట్టనల కింద నలిగి పోయి ఉంటుంది. దాడి అనివార్యం అని తెలిసిన మరుక్షణం అప్పటి ప్రజల మానసిక స్థితి ఎలా ఉండుంటుంది? రక్తం ఏరులై పారక పోయినా, బహుశా ప్రదేశం భయ గుప్పిట్లో గిజగిజలాడిపోయి,నిర్మానుష్యమై ఉండి ఉంటుంది. సైరన్లతో,ఆకాశంలో జర్మన్ యుద్దవిమానాల రొదతో దద్దరిల్లి ఉంటుంది.

ఇలా ఏవేవో ఆలోచనలు.అక్కడే అలా తిరుగుతూ ఉండిపోయాను. రాత్రి పదిన్నర వరకూ.పశ్చిమాన సూర్యుడస్తమించేవరకూ ..

****************************************************************************
ఆ సీపోర్టు లో ఒకాయన మాటల్లో ఇలా అన్నాడు. "అప్పట్లో అది వాళ్ళ జీవన విధానం. రోజు తర్వాత రోజు గడిపేయడమే వాళ్ళు చేసింది.అప్పట్లో వాళ్ళు అనుభవించిన దానికంటే ఎక్కువ ఇప్పుడు మనం ఆ రోజుల గురించి ఆలోచించి అనుభవిస్తాం. గతం తో రోమాన్స్ అంటే ఇదే" అని పెద్దగా నవ్వేసాడు.

నిజమే కదా.ఆలోచించే హృదయం ఉండాలేకానీ ఆ రోమాన్స్ ఎంత బాగుంటుందో కదా.సంతోషం, దుఃఖం, బాధ, దిగులు, అన్నీ ఏక కాలంలో కలుగుతాయి. మన ప్రాంతం అయినా కాకున్నా, మన సంబంధీకులు అయినా,కాకున్నా, కొన్ని వందల ఏళ్ళ క్రితం జీవించి కాల గర్భంలో కలసి పోయినా, వాళ్ళని తలచుకొని ఆనందపడతాం. దిగులు పడతాం. ఏదైనా విషాదగాధ వింటే ఉబికివచ్చే కన్నీళ్ళ నాపుకుంటాం.

నేర్చుకోగాలగాలే గాని, చరిత్ర నేర్పే పాఠాలెన్నో.చూపించే జీవిత సత్యాలెన్నో.

Tuesday, May 11, 2010

విరామానంతరం

వారం క్రితం "హమ్మయ్య , సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక రాయడం మొదలెట్టొచ్చు" అనుకున్నా. వారం గడిచినా అక్షరం ముక్క కూడా రాయలేదు. కొత్త ఊరు.కొత్త ఆఫీసు. పని ఎక్కువ.కానీ ఇవన్నీ కారణాలు కావు. అసలు తప్పంతా రోజుకి మూడు గంటల పైనే తినేస్తున్న ఆఫీసు ప్రయాణానిదే. ఒక నాలుగు మైళ్ళ కారు ప్రయాణం, అక్కడి నుంచి ఒక ఇరవై ఐదు నిమిషాల బస్సు ప్రయాణం. అక్కడినుంచి మళ్ళా ఇంకొక ఇరవై నిమిషాల రైలు ప్రయాణం. పోస్టేజి ఖర్చులు అదనం అన్నట్టు, బస్స్టాండు లోనూ, రైల్వే స్టేషనులోనూ వెయిటింగు టైము అదనం.ఇలా తెల్లవారు ఝామునే ఆరింటికి నిద్ర లెగవాలంటే నాబోటి వారికి చాలా కష్టం. పొట్ట కోసం తప్పదు కదా.ఇప్పుడు ఆవలింతలతో ఆఫీసుకి రావడం, కునికిపాట్లు పడుతూ పని చేయడం, మళ్ళా కాళ్ళీడ్చుకుంటూ రైలు,బస్సు కారు ప్రయాణం. అలా సప్త సముద్రాలు దాటి, ఆవలించుకుంటూ ఇంట్లోకి ప్రవేశం. ఏదో ఇంత తినటం, టీవీలో మా ఊరి వార్తలు చూస్తూ అలానే నిద్ర పోవటం.ఇలా రోజంతా ఆవలింతలతోనే సరిపోతోంది.

ఏదేమైనా "రాయకుండా ఇంకానా? ఇకమీదట సాగదు" అని ఈరోజే ఘాట్టిగా నిర్ణయించుకున్నాను. "ఇంత కష్టపడి రాయాలా? నీ పిచ్చిగానీ" అని నాకనిపించినా, ఎవరి పిచ్చి వారికానందం కదా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను :) అదన్నమాట సంగతి.

మొన్నీ మధ్య ఒక బ్లాగులో చదివా. వ్యాఖ్యలు రాసినా వాటికి బ్లాగు రచయితలు సమాధానమీయకపోవటం మర్యాదకరం కాదు అని. నేను తెలిసీ చేసే తప్పుల్లో ఇదొకటి.అలా నేను చాలాసార్లు చేశా.ఇక మీదట అలా ఉండకూడదు అనుకుంటున్నా. వ్యాఖ్యలంటూ వస్తే, దానికి సమాధానమంటూ ఉంటుంది. తిరిగి రాయడానికేమీ లేకపోతే కనీసం "ధన్యవాదాలు" అనన్నా... :) .

ప్రస్తుతానికి అదండీ సంగతి.

ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ

న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో.  (తెలియని వారికి: అమెరికాలో...