Thursday, August 13, 2009

గమ్మత్తయిన సంఘటనలు -2

అవి నేను హైదరాబాదులో ఒక బహుళ జాతి సంస్థ లో పనిచేసే రోజులు.

నేను పనిచేసే ప్రాజెక్టు చాలా పెద్దది. దాంట్లొ దాదాపు 70 మంది పనిచేస్తూ ఉండేవారు . అన్ని రకాల భాషలూ వినపడేవి . వాటిల్లో తమిళందే పైచేయి. వాళ్ళది చాలా పెద్ద గ్రూపు. ఇచ్చుకున్నా, పుచ్చుకున్నా వాళ్ళలో వాళ్ళే.వాళ్ల ఐకమత్యం చూసి బాగా ముచ్చటేసేది. అయితే వాళ్ళలో తప్పుపుట్టాడొకడు. పేరు పరమ్ గురు. తనకి తెలుగు నేర్చుకోవాలని మహా ఉబలాటం. అంతా ఇంతని కాదు. చాలా. మేము మాట్లాడుకుంటుంటే "బగున్నారా (బాగున్నారా)? " అంటూ మధ్యలో దూరేవాడు. తెలుగులో అదెలా అంటారు, ఇదెలా అంటారు అని మమ్మల్ని,ముఖ్యంగా నన్ను బాగా విసిగించేవాడు. "వాడికి ఒక (రహస్య) తెలుగు గర్ల్ ఫ్రెండ్ ఉండుండొచ్చు , అందుకే మనదగ్గర ఇంత గారాలు పోతూ నేర్చుకుంటున్నాడు" అని అనుకునేవాళ్ళం (కుళ్ళు కునేవాళ్ళం,లో లోపల) . అమ్మాయెవరో కనుక్కుందామని, ఒకరిద్దరు వీడిమీద కొన్నాళ్ళు ఒక కన్నేసి , కన్ను నొప్పెట్టి, చివరికి ఏమీ తేలక కేసు మూసేసారు.

ఇక మా ప్రాజెక్టు మానేజరు గురించి. ఆయన ఇంగ్లీషులో మాట్లాడేది బహు తక్కువ. అలాగని రాదని కాదు. భేషుగ్గా వచ్చ్చు. ఎంతో అవసరమైతే తప్ప ఇంగ్లీషు వాడడు. మీటింగుల్లో కూడా వేరే వారికి అర్ధమవ్వాలి అనుకున్నవి మాత్రమే ఇంగ్లీషులో,మిగతావి అన్నీ తెలుగులోనే. మీటింగుల్లో తెలుగు మాట్లాడినందుకు తెలుగేతరులు ఎవరూ లోలోపల కూడా ఏమీ అనుకునేవారు కాదు. మనకి తెలియాల్సిన విషయమైతే ఆయన ఇంగ్లీషులోనే మాట్లాడుతాడులే అని వారికి ఆయనమీద మంచి గురి. ఆయన గుంటూరు వైపు పల్లెల్లో మాట్లాడే యాసతో బహు చక్కగా తెలుగు మాట్లాడేవాడు. పెద్ద ప్రాజెక్టు కదా, ఒక ఫ్లోరు మొత్తం మాదే. విశాలమైన హాలు. ఒక మూల నిలబడి పరికిస్తే దాదాపు ప్రాజెక్టులో ఉన్న వారందరూ కనపడతారు. మా మానేజరు ఎవరితోనైనా ఏమైనా చెప్పాలంటే ఆయన ఉన్నచోటునుంచే గట్టిగా తెలుగులో అరచి చెప్పేవాడు. నాకది మోతుబరి పొలంలో గట్టుమీద నిలబడి కూలోళ్ళతో మాట్లాడినట్టే ఉండేది. ( no offense, ఆయన యాస గురించి మాత్రమే చెప్తున్నా ).

మేము పనిచేసే ప్రాజెక్టు తాలూకు సర్వర్లు యూరోపు లో ఉండేవి. ఒకసారి సముద్రగర్భంలో కేబుళ్ళు తెగటం వల్లో , మరెందుకో మాకు సర్వర్లతో లింక్ తెగిపోయింది. పనిలేదు కాబట్టి అందరూ పని ఉన్నప్పటికంటే ఎక్కువ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఫ్లోరంతా సందడి సందడిగా ఉంది. నెట్ వర్కింగ్ వాళ్ళకి కబురు పెట్టడంతో వాళ్లోచ్చి పరమ్ గురు కంప్యుటర్ నుంచే ఏవేవో చేస్తూ, మధ్య మధ్య ఫోన్లు చేస్తూ ఏదో కుస్తీ పడుతున్నారు. సదరు పరమ్ గురు తో పాటు నేను, ఇంకో ఐదారుగురం కంప్యుటర్ మీదకి వాలి ఆసక్తిగా చూస్తున్నాం. వాళ్లు చేసేది ఏమైనా అర్ధం అయితే మా రెజ్యుమే లో "నెట్వర్కింగ్ ఎక్స్ పర్ట్ " అనే తోక తగిలించి దాని బరువు పెంచొచ్చు అని మా దురాలోచన.

అదేటైంలో లోపలికి అడుగుపెట్టాడు మా మానేజరు. హడావిడిగా, లేని ఆందోళనని మొహంలోకి తెచ్చుకొని అటూ ఇటూ పరిగెడుతున్న వాళ్ళని చూడగానే ఆయన మనసు కీడు శంకించింది. మా వైపు చూసాడు. అదేటైం లో పరమ్ గురు "లింక్" ని తెలుగులో ఏమంటారు అని అడిగినట్టున్నాడు. ఆలోచిస్తూ నేను బుర్ర గోక్కుంటున్నాను. అలవాటు ప్రకారం మా మానేజరు పరమ్ గురు నుద్దేశించి అక్కడి నించే గట్టిగా అరిచాడు.

"పరమ్, ఏమయింది?"

"లింక్ , లింక్" ఇక్కడినుంచే గట్టిగా అరచి చెప్పాడు పరమ్ గురు .

ఆయనకర్ధం కాలేదు. మళ్ళా గట్టిగా అదే అడిగాడు.

ఈసారి పరమ్ గురు చేతి చూపుడువేళ్ళు రెంటినీ కొంకీలా చేసి, ఒకదాని కొకటి మెలేసి , పైకెత్తి చూపిస్తూ అన్నాడు

"లింకు, లింకు సార్ " అని , మేలేసిన వేళ్ళని బలవంతాన విడదీసినట్టు నటించి "పగిలి పోయింది సార్" అన్నాడు.

లింకు ని తెలుగులో ఏమంటారా అంటూ బుర్ర గోక్కుంటున్న నాకు వాడి నోటిద్వారా "పగిలిపోయింది" అనే పదం వినగానే కాస్త మతి తప్పినట్టయింది. మా మానేజరుక్కుడా అదే పరిస్థితి.దగ్గరికొచ్చి విషయం కనుక్కొని తరువాత , టెన్షన్ ని కూడా పక్కనపెట్టి, ఒకటే నవ్వడం. అప్పుడెపుడో వాడు నాదగ్గర నేర్చుకున్న "బ్రేక్" అనేపదాన్ని వాడు అలా తెనుగీకరించాడు అన్నమాట.

తరువాత మీటింగుల్లో కూడా అప్పుడప్పుడు మా మానేజరు "ఈరోజు, ఏం పగల్లేదా, పరమ్? " అంటూ పరమ్ గురు మీద జోకులేసేవాడు.

**********************************************************************

తమిళం వంతు అయిపొయింది కదా, ఇప్పుడిక కన్నడం వంతు.

నాకు మంజునాథ్ అనే ఫ్రెండొకడున్నాడు. వాడు పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాదులోనైనా ఇంట్లో కన్నడం, బయట హైదరాబాదు హిందీ, ఉర్దూ , అక్కడక్కడ తెలుగూ, విని చాలా వింతైన తెలుగు మాట్లాడేవాడు. తెలుగులో ఆవేశంగా ఏదైనా మాట్లాడుతూ , మాటల ప్రవాహంలో ఎక్కడైనా సరైన తెలుగు పదం తట్టకపోతే ఫిట్స్ వచ్చినవాడిలా కొట్టుకొనేవాడు. వెంటనే ఇంగ్లీషుకో, హిందీకో మారి గట్టెక్కినా , సంభాషణ ముగియగానే నా పీక పట్టుకోనేవాడు ఇందాకటి పలానా దాన్ని తెలుగులో ఏమంటారో చెప్పు అని.

ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేసేవాళ్ళం. కేరీరు మొదటి రోజులు. కంప్యూటరు పాఠాలు చెప్పుకొని పోట్టపోసుకోనేవాళ్ళం. స్టూడెంట్ల నుంచి ఫీజు వసూలు కావటం ఆలస్యం, డబ్బులు బిల్డింగు ఓనరుకో, ఎలక్ట్రిసిటీ వాళ్ళకో, కంప్యూటర్లు రిపేరు చేసేవాళ్ళకో, ఇన్స్టిట్యూట్ తెరచినప్పటి నుంచి బాకీ ఉన్న ఇంటీరియర్ డెకరేటరుకో ,మరింకెవరికో వెళ్ళిపోయేవి. మా ఓనరు పాపం ఓపెన్ గానే చెప్పేవాడు స్టూడెంట్లు ఫీజులు చెల్లిస్తేనే మీకు జీతాలు అని.దానికి తోడు మాకు సరిగ్గా సరిపోయే అకౌంటెంట్ దొరికాడు మా ఓనర్ కి . జీతాలు నెల తారీకు ప్రకారం గాక ఆయనకిష్టమయిన పద్దతి ప్రకారం ఇచ్చేవాడు. ముందు జీతాలు ఎవరికి ఇవ్వాలి అనేదానికి ఆయన వేసుకున్న ఆర్డర్ ఇదీ..

పెళ్ళయి , కాస్త పెద్ద పిల్లలుండి , ఇంటి ఖర్చు ఎక్కువ ఉండేవారు
పెళ్ళయి పిల్లలున్నవారు
పెళ్లయినవారు
పెళ్ళికాని ఆడవారు ( కౌన్సిలర్లు, తోటి టీచరమ్మలు )
(డబ్బులు మిగిలితే) పై వాళ్ళు గాక చివర్లో మిగిలిన, దిక్కు, దివాణం లేని మగ బ్రహ్మచారులు ( అంటే మేము)

ఈనెల పదో తారీఖున జీతం ఇస్తే, వచ్చేనెల ఇరవైనో, ఇరవై ఐదునో ఇచ్చేవాడు.. అలా కొన్నాళ్ళకు మాకు మేము నెల జీతం అందుకున్నామో తెలియక , అందుకున్నాం అంతే చాలు అని ఆరోజుకి ఆనందపడి , తరువాత రోజు "అవునూ, నిన్నిచ్చింది నెల జీతం? " అని వాకబు చేసేవాళ్ళం..(విషయం పక్కదోవ పడుతున్నట్టుంది).

సరే, ఒకానొక రోజు, ఎంతో ఆశతో ఈరోజు జీతం ముడుతుంది అని ఆఫీసుకోచ్చిన నా కన్నడ మిత్రునికి "అబ్బా ఆశ" అంటూ ఆశా భంగం కలిగించాడు మా అకౌంటెంట్. ఇక వాడు పొద్దున్నించి ఆయన్ని బండ బూతులు తిడుతూ పని చేసి,ఆనక లంచ్ కి ఇద్దరం బయటికి వచ్చాం. నా ఫ్రెండ్ ఆపకుండా హిందీలో, ఉర్దూలో, కన్నడంలో, వచ్చీరాని తెలుగులో తెగ తిడుతున్నాడు అకౌంటెంట్ ని. వాడికి కామన్ సెన్స్ లేదట. కష్టపడుతున్న వారిని గుర్తించే టాలెంట్ అస్సలే లేదట. "బ్యాచిలర్ల మయినా మనం తిండి లేకుండా బతికేస్తామా, మనకి మాత్రం అవసరాలుండవా? వాడూ,వాడి పీచు గడ్డం" అంటూ ఆవేశంతో ఊగిపోతున్నాడు. వాణ్ని మధ్యలో ఆపి "నీకు మరీ అంత డబ్బవసరం ఉంటే ప్రస్తుతానికి నేనిస్తా" అని అనటానికి కూడా భయపడ్డాన్నేను, మధ్యలో ఆపినందుకు ఎక్కడ నన్ను కరుస్తాడో అని. అలా తిడుతూనే నా చేయి పట్టుకొని బర బరా లాక్కుంటూ వెళ్లి రోడ్డు సగం దాటి , అవతలి వైపు ఆగకుండా వాహనాలు వస్తుండడంతో రోడ్డు మధ్యలోనున్న ఆరంగుళాల వెడల్పు ఉన్న డివైడరుపై సర్కస్ ఫీట్ చేస్తూ నిలబడ్డాం.

మావాడు ఫీట్ చేస్తూ కూడా వాడి తిట్ల దండకం ఆపలేదు.

"అస్సలు ఎవడ్రా, ఇలాంటివాడికి ఉద్యోగం ఇచ్చింది, అస్సలు కామన్ సెన్స్ లేదు, వెధవకి"
" ఒరేయ్ , పోనీలేరా, వదిలేయి"
"ఏందిరా వదిలేది, M.D కి కంప్లయింట్ ఇస్తా."
"M.D చెప్పినట్లే వాడు చేస్తున్నాడురా, పాపం వాడికేం తెలీదు. వాడూ మనలాంటి ఉద్యోగస్తుడే కదా"

"ఏమిటీ వాడికేం తెలీదా", ఆవేశంతో మావాడు వణికిపోతున్నాడు. తరువాత తెలుగులో ఇంకేమనాలో వాడికి తట్టలేదు. "తెలీదంటావా?తెలీకపోడానికి వాడేమన్నా చిన్నపిల్లోడా, రెండు బిడ్డల నాన్న"

"రెండు బిడ్డల నాన్నా?"

" అవును, రెండు బిడ్డల నాన్న. I mean he has two kids" అన్నాడు అదే ఆవేశంతో.

అప్పటి వరకు సానుభూతితో వాడి బాధనంతా వింటున్న నాకు ఒక్కసారిగా తట్టుకోలేనంత నవ్వొచ్చింది. ఎంతలా అంటే డివైడరు మీద నిలబడలేనంత. మాకు ముందూ వెనక రయ్యిన వాహనాలు దూసుకుపోతున్నాయి. ఇక అక్కడే ఉంటే ఏమైనా జరగొచ్చని, అతి కష్టం మీద నవ్వాపుకొని అర్జెంటుగా రోడ్డు దాటాను. దాటాక కడుపు పట్టుకొని ఒకటే నవ్వటం. ఇక నిలబడే ఓపిక లేక అక్కడే ఫుట్ పాత్ మీద కూర్చుండిపోయా కాసేపు.

తెలుగు గురించి ఏమైనా డిస్కషను వస్తే ఇప్పటికీ వాడిని ఆట పట్టిస్తా "నువ్వూ, నీ రెండు బిడ్డల నాన్న" అంటూ ..






Monday, July 13, 2009

వయసు మీద పడుతోందా?

ముచ్చటగా మూడు విషయాలు.

మొదటిది..

ఒక రెండు వారాల క్రితం...

బోస్టన్లో ఉండే స్నేహితున్ని కలుద్దామని కారెక్కా. హైవే ఎక్కిన పదినిముషాలకే చిన్నపాటి చిరుజల్లు మొదలయింది. బయటికి వెళ్ళే పని ఉన్నా లేకున్నాప్రతిరోజూ వాతావరణం ఎలా ఉంటుందో అని నెట్లో కుతూహలంగా చూసే నేను ఈరోజు బయటికి వెళ్ళే పని పెట్టుకొనికూడా దాన్ని పట్టించుకోనందుకు నన్ను నేను తిట్టుకున్నాను. కాసేపలా అద్దం మీద పడి గాలి విసురుకి అద్దం పైకి ఎగబాకే నీటి బిందువులను చూస్తూ ముచ్చటపడ్డా, వర్షం ఇంకాస్త పెరిగేసరికి ఇక తప్పదు అనుకుంటూ విండ్ షీల్డ్ వైపర్లు ఆన్ చేశా. ఇంకా దాదాపు గంటన్నర పైనే ప్రయాణం మిగులుంది. ఆలా ఒక పదిమైళ్ళు వెళ్ళానో లేదో వర్షం మటుమాయం. అక్కడసలు వర్షం పడిన ఛాయలే లేవు. నేలంతా పొడిగానే ఉంది. అక్కడినుంచి బోస్టన్ వరకు సూర్యుడు కనపడకపోయినా వర్షం మాత్రం లేనేలేదు.

ఫ్రెండ్ ఇంటిముందు కారు పార్క్ చేసి ఇంజన్ ఆఫ్ చేశా. టప టపా కొట్టుకుంటున్న వైపర్లు కరెక్టుగా కారు అద్దం మీద మధ్యలోకొచ్చి ఆగాయి. అప్పుడుగానీ అర్ధంకాలేదు. గత గంటన్నరగా వర్షం లేకున్నా నా పరధ్యానం పుణ్యమాని పొడి అద్దం మీద టప టపా కొట్టుకుంటూనే ఉన్నాయి వైపర్లు.

రెండవది..

మొన్నొకసారి ఏకబిగిన మూడుగంటలు టెన్నిస్ ఆడేసరికి మరుసటిరోజు ఎన్నడూ లేనిది ఒళ్ళంతా ఒకటే నొప్పులు. భుజం కాస్త మరీ ఎక్కువ నొప్పిగా ఉండేసరికి అప్పుడెప్పుడో ఏదో స్పోర్ట్స్ షాపులో కొన్న Hot pack కోసం వెతికా. దాన్ని కాసేపు మైక్రోవేవ్లో వేడి చేసి దాంతోపాటు వచ్చిన ఒక చిన్న వెడల్పాటి బెల్టులో పెట్టుకొని దాన్ని భుజానికి బెల్టు సాయంతో చుట్టుకోవడమే.

కాస్త వెతగ్గా, Hot pack దొరికిందిగాని దాని తాలూకు బెల్టు ఎక్కడ పెట్టానో తల బద్దలుకొట్టుకున్నాగుర్తుకురాలేదు. నిన్నో మొన్నో ఎక్కడో చూసినట్టే ఉంది. ఎక్కడ చూసానో గుర్తుకు రావటం లేదు. ఇంట్లో ఉన్న నాలుగు క్లోజేట్లనీ, వాటిల్లో ఉన్న బట్టల్నీ అటువిటూ ఇటువటూ అల్లకల్లోలం చేసి మరీ వెతికా. ఊహు, లాభం లేదు. లివింగు రూములో, ఆఖరికి కిచెన్ లో కూడా వెతికా. ఇక ఇంట్లో వెతికే పనిని మావిడకి అప్పజెప్పి నేను అపార్ట్మెంటు బేస్మెంటు లో ఉండే స్టోర్ రూం లో కెళ్ళి, రెండేళ్ళలో కొద్ది కొద్దిగా మేము కూడబెట్టిన చెత్తలో నిండా తలబెట్టి మరీ వెతికా. ఊహు. దొరక్కపోగా భుజం నొప్పి ఎక్కువయింది. ఈసురోమని, కాళ్ళీడ్చుకుంటూ, మావిడని స్టేటస్ రిపోర్ట్ అడుగుదామని పైకొచ్చేసరికి తను అప్పటికే సీరియస్ గా వంట పనిలో తలమునకలై ఉంది. ఒకవేళ దొరికిఉంటే తను చేసే హడావిడి నాకు తెలుసు కాబట్టి , విషయం అర్ధమై, ఏమీ అడగకుండా లోపలికి వెళ్ళా.

నాకు ఒకవేళ ఏదైనా వస్తువు కనపడకపోతే దాంతోపాటే ఉండే వేరే వస్తువులు గుర్తు తెచ్చుకుంటా. అప్పుడప్పుడు ట్రిక్ బానే పని చేస్తుంది. అలా ఆలోచించగా ఆలోచించగా అది బొత్తిగా ఒంటరి వస్తువనీ, దానికి బాయ్ ఫ్రెండ్సు, గర్ల్ ఫ్రెండ్స్ లాంటి చిన్న చిన్న సరదాలు కూడాఏవీ లేవనీ, దానిముందు నా బోడి ట్రిక్కు పనిచేయదనీ అర్ధం అయింది.

ఇక స్టోర్ రూంలో వెదుకులాట కారణంగా మొహానికి పట్టిన చెమట పోయేలా మొహం కడుక్కొని, బెడ్ రూం లోకొచ్చి సపోర్టు కోసం కుడిచేతి మోచేయి ఎక్సర్సైజ్ సైకిలు మీద వేసి "ఎక్కడుండొచ్చబ్బా ?" అని చార్మినార్ రామయ్యలా ఆలోచిస్తుండగా, చేతికి ఏదో మెత్తగా తగిలినట్టనిపించింది. తలతిప్పి చూస్తే సైకిలు హేండిల్ పై ఆ బెల్టు. దాదాపు ప్రతిరోజూ అధమపక్షం ఒక అరగంట అది నా కళ్ళముందే ఉంటుంది, సైకిలుపై నేను ఎక్సర్సైజు చేస్తున్నంతసేపూ .

దొరికింది అని తనకి చెప్పటానికి కూడాసిగ్గేసింది నాకు.


ఇంకొకటి.. ఇది మరీ దారుణం..

ఇది మెళ్ళో మంగళసూత్రంలా , సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మెళ్ళో వేలాడే ఐడెంటిటీ కార్డు గురించన్నమాట.

మంగళసూత్రం తాలూకు తాడు మరీ పాతపడినట్టనిపించి , సరే కొత్తది తీసుకుందామని హెచ్చార్ వాళ్ల దగ్గరికెళ్ళా . ఎప్పటిలానే కళ్ళింత చేసుకొని నవ్వుతూ " ష్యూర్" అంటు కొత్త తాడొకటి చేతికందించింది ఆ హెచ్చారమ్మాయి. తీరా చూస్తే అది తాడులా లేదు. రిబ్బనులా ఉంది. దానికి నా ఐడెంటిటీ కార్డు తగిలిస్తే ఒక రెండు క్షణాలకే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరునని లోకానికి చెప్పటానికి తనకి సిగ్గేస్తుందేమో అన్నట్లుగా కార్డు మొహం చాటేస్తోంది. అంటే వెనక్కి తిరిగిపోతోంది. అప్పటినుంచి ఒక వారం పాటు గుర్తొచ్చినప్పుడల్లా దాని వైపు చూడ్డం, అది అటు తిరిగిఉంటే, పెనం మీద దోశ తిరగేసినట్టు దాన్ని తిరగేయడం. అది ఎటు తిరిగి ఉన్నా, అసలు నా మెళ్ళో ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఉండదు అనుకున్నా, కష్టపడి వెళ్లి మరీ రిబ్బను తెచ్చుకునేందుకు పడ్డ శ్రమకు న్యాయం చేయాలనిపించింది. ఒకవారం ఇలా తంటాలుపడ్డాక ఒక "మెరుపు" లాంటి ఆలోచన వచ్చింది. ఏమీ లేదు, మా ఐడెంటిటీ కార్డు లామినేట్ చేసిన తరహాలో, రెండు వైపులా పారదర్శకంగా ఉండే చిన్న ప్లాస్టిక్ పాకెట్ లాంటి దాంట్లో ఉంటుంది.దాట్లోంచి నా కార్డు బయటికిలాగి, దాన్ని ఇటు తిప్పి మళ్ళా పాకెట్లో పెట్టేసా. అంతే..

వారం తరువాత వచ్చిన మెరుపు లాంటి ఆలోచనకి "హుర్రే" లాంటి పదాలు మరీ చిన్నవనిపించి, బుద్దిగా తలొంచుకొని పనిలో మునిగిపోయా.


Monday, June 8, 2009

వయసు ముచ్చట్లు

వెకిలితనానికీ, అవకాశవాదానికీ తావివ్వని అమాయకత్వం మూర్తీభవించిన వయసది. ఆ భావనల పరంగా అ ఆ లు దిద్దుకుంటున్న అందమైన వయసది..
********************************************************************

మొదట్లో అస్సలు అర్ధమయ్యేది కాదు.

వారంలో కనీసం ఒక్కసారైనా అమ్మకానీ నాన్నకానీ ఆ మాట అంటూనే ఉండేవారు. అప్పుడప్పుడు కోపం వచ్చేది కూడా. ఏమీ అనలేని అశక్తతతో కోపంగా విసవిసా మేడమీదకి వెళ్ళి, ఎత్తైన ఆ పిట్టగోడ మీద తలవాల్చి ఆ ఎదురుగా కనిపించే గుడి గోపురాన్నీ, సాయంత్రాలైతే ఆ గుళ్ళోంచి వినపడే పాటల్నీ వింటూ "ఇప్పుడు నేనేం చేసాననీ" అంటూ నన్ను నేనే ప్రశ్నించుకొనేవాణ్ణి. కోపం తగ్గటానికి కొంత సమయం పట్టేది. అప్పుడప్పుడు ఎంతసేపటికీ నేను కిందకి రాకపోతే నాన్న మేడమీదకి వచ్చేవాడు ప్రేమగా "చిన్నోడా ఇక్కడేం చేస్తున్నావురా" అని పిలుస్తూ.

ఎంత ప్రేమగా పిలిచినా వారన్న ఆ మాట గుర్తొస్తే ఉక్రోషం కట్టలు తెంచుకొనేది. ఎంతమాటన్నారు?

చదువు మీద శ్రద్ద తగ్గిపొతోందట. నాకైతే అలా అనిపించటంలేదు. నాకొచ్చేమార్కుల్లో ఏమాత్రం తేడా లేదు.కనీసం మార్కులు ఎన్నివస్తున్నాయో కూడా తెలుసుకోరు.మాట మాత్రం అనేస్తారు.

ఈమధ్య గమనిస్తూనే ఉన్నాను వీరి ప్రవర్తన. అక్కయ్య ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే నన్ను మాట్లాడనిచ్చేవారు కాదు. కళ్ళతోనే సైగ చేసేవారు లోపలికెళ్ళు అని. ఒక చెవి ఇటేసి వాళ్ళ మాటలు వింటానని అనుకునేవారో ఏమో ఇటు ఇంటికి ముందు వైపున్న పంచలోకీ వెళ్ళనిచ్చేవారు కాదు. ఇక లోపల మిగిలింది ఆ వంటగదే. ఏదో ఒక పుస్తకం చదూకుంటూనో, గిన్నెలమీద మూతలు తీసి ఏగిన్నెలో ఏముందో చూస్తూనో, లేదా పాలగిన్నె అల్మరాలో పెట్టడం మర్చిపోయారేమో, అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ప్రతి పావుగంటకోకసారి కిటికిలోంచి వంటగదిలోకి దూరే ఆ బుర్ర తక్కువ పిల్లి తల నిమురుతూనో,"వీల్లెప్పుడెళ్ళిపోతారురా బాబూ" అనుకుంటూ భారంగా సమయం వెళ్ళబుచ్చేవాడిని.

అప్పుడప్పుడు ఆ వంటగది పక్కనే ఉన్న గొడ్లచావిడిలోకెళ్ళి కొమ్మిసిరే అలవాటులేని ఆ చిన్నగేదె పక్కనే నిలబడి, దాని తలనిమురుతూ, దాని అరమోడ్పు కన్నులు చూసి ముచ్చటపడుతూ సమయం గడిపేవాడిని.

అప్పటి నావయసు ఏ పద్నాలుగో..పదిహేనో..

********************************************************************************************************************************
నాలో ఆ ఆలోచనలు ఎలా మొదలయ్యాయో, ఎప్పుడు మొదలయ్యాయో అస్సలు గుర్తు లేదు. వాటి క్రమం మాత్రం బాగా గుర్తుంది. చాలామందికిలాగే నాలోనూ ఆ ఆలోచనలకు పునాది సినిమాల ద్వారానే పడింది.

మా ఇంటినుంచి స్కూలు దాదాపు మూడుకిలోమీటర్లు ఉండేది. పెద్దబజారు, దాన్ని దాటితే కన్యకాపరమేశ్వరి గ్రంధాలయం. తరువాత వరుసగా పండ్లకొట్లు. వాటిని దాటి కుడివైపు సాలివారివీధి వైపు తిరగ్గానే మూలమీదే ఉండే రైసుమిల్లూ, దాని తాలూకు పెద్ద గోడమీద అంగుళం కూడా ఖాళీ లేకుండా సినిమా పోస్టర్లు.నవ్వుతూ తుళ్ళుతూ మాటలు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం కాస్తా ఆ పోస్టర్ల దగ్గరికొచ్చేసరికి గంభీరంగా మారిపోయేవాళ్ళం.ఒకరికి తెలీకుండా మరొకరం వాటివైపు దొంగచూపులు చూసేవాళ్ళం. ఆ సినిమాల పేర్లు కూడా విచిత్రంగా ఉండేవి. ఒక్కణ్ణే ఆ దారెంట వెళ్తుంటే నన్నెవరూ చూడటంలేదు కదా అని నిర్ధారించుకొని ఇంకాస్త పరీక్షగా చూసేవాడిని. అదేమిటో ఆ పోస్టర్లలో అందరి చూపులు కలిసేచోట ఒక చిన్న దీర్ఘ చతురస్రం ఉండేది. లేదా ఈ సినిమా పలానా ధియేటర్లో చూడొచ్చు అని తెలిపే ఆ ధియేటర్ తాలూకు స్లిప్పు అంటించి ఉండేది. నా దొంగచూపులన్నీ అక్కడికే. నేను అలా దొంగతనంగా చూసేవాణ్ణా, నాలాగే ఎవరైనా చూస్తూ పట్టుబడితే మాత్రం వారిని నలుగురిలో బాగా ఆటపట్టించేవాడిని. నాలోని హిపోక్రసికి అది తొలిమెట్టేమో.

ఉదయం ఆటగా మాత్రమే నడిచే అటువంటి సినిమా ఒకటి చూసి బయటికివస్తూ ఎవరికంట్లోనో పడ్డ సత్యవతి వాళ్ళ అన్నయ్య బాలు గురించి మేము చాలా రోజులు కథలు కథలుగా చెప్పుకున్నాం. చెడిపోవటం అనే పదానికి అర్ధం తెలీకుండానే మేమందరం తీర్మానించేసాం వాడు చెడిపోయాడని.( ఈ చెడిపోవటం అంటే ఏమిటని అడక్కండి, పెద్దలనోట రోజూ వినపడే మాట అది. అంతకుమించి ఇంకేమీ తెలీదు). ఈ బాలూ గాడు ఎప్పుడు ఎదురుపడ్డా ఆ పోస్టర్లను చూసినంత ఆసక్తిగా వాడి వైపు చూసేవాళ్ళం. వాడెదురుగానే మాలోమేము ముసిముసి నవ్వులు నవ్వుకోనేవాళ్ళం. పాపం వాడికి అర్ధమయీ అవనట్టు ఉండేది.

ఆ సినిమాలని వదిలేస్తే, మామూలు సినిమాల పరంపరలో నాకు బాగా గుర్తున్న వాల్ పోస్టరు "సీతాకోకచిలుక". గులాబిరేకుల కింద కప్పబడిఉన్న ఆ హీరో హీరోయిన్ల ఆఛ్చాదన లేని భుజాలు చూస్తే చిలిపి ఊహలేవో రేగేవి. అంతలోనే సిగ్గూ, దాంతోపాటు నన్నెవరైనా చూస్తున్నారేమో అనే భయమూ నన్ను కప్పేసి ఆ చిలిపి ఊహల్ని ఆమడ దూరం తరిమేసి నా అడుగులు అక్కడినుండి వడి వడిగా పడేలా చేసేది.

అప్పట్లో ఇంగ్లీషు సినిమాలు ఉదయం ఆట మాత్రమే ఆడేవి. రోజర్ మూర్, షాన్ కానరీ నటించిన జేమ్స్ బాండ్ చిత్రాలూ, క్రిస్టోఫర్ రివ్ సూపర్ మాన్, ఎంటర్ ది డ్రాగన్లూ, షావాలిన్ టెంపుళ్ళూ , కింగు కాంగులూ గట్రా అన్నమాట.ఇక ఆ సినిమాల విషాయానికొస్తే వాటిల్లో అక్కడక్కడా కనపడే ఆ ఇంగిలీషు ముద్దులు నాకు వింతగానూ, ఆసక్తిగానూ, అదేటైములో నన్నెవరైనా గమనిస్తుంటే లేని కంపరాన్ని మొహంలో తెచ్చిపోట్టుకొనే విధంగానూ ఉండేవి. సినిమా అయిపోయాక మా అన్నయ్యో లేక ఆయన ఫ్రెండ్సో సినిమా ఎలా ఉందిరా అంటే "చాలా బావుంది గాని మధ్య మధ్యలో ఆ సీన్లేంటి చంఢాలంగా ? " అనేవాడిని మరీ అమాయకంగా. మంచిబాలుడు అనిపించుకోవాలనే నా తాపత్రయం నాది మరి.

హిందీ నేర్చుకున్నాను కాబట్టి హిందీ సినిమాలు కూడా విరివిగా చూసేవాడిని. ఆ పరంపరలో రాజ కపూర్ "రాం తేరీ గంగా మై లీ","బాబీ" చూసిన రోజుల్లో బుర్ర హీటెక్కి చదువు షార్ట్ సర్క్యూట్ అయి, చదువుతున్న పుస్తకం మూసేసి మరీ ఆలోచనల్లో మునిగిపోయేవాడిని.ముఖ్యంగా "రాం తేరీ ..." లో ఆ పాట.ఇప్పటి సెన్సారు ప్రకారం కూడా అలా సినిమాకి సెన్సారు సర్టిఫికేట్ రావటం కష్టం. ఏదయితేనేం, దాదాపు ఒక రెండుమూడేళ్ళు నా ఆలోచనల్లో అంతర్భాగమైపోయారు ఆ ఇద్దరు హీరోయిన్లు (మందాకిని అండ్ డింపుల్ కపాడియా). అలానే టార్జాన్ సినిమాలో కిమీ కట్కర్ కూడా కలలో "అబ్బ చదివింది చాల్లేద్దూ కాస్త పక్కకు చూడుగురూ" అనేసింది నాతొ. "బాబీ" తరువాత "జాన్ బాజ్" లో డింపుల్ కూడా నాతో ఒకాటాడుకుంది.


ఈ కలవరింతలూ, పలవరింతలతో కూడిన నా అనుమానాస్పద ప్రవర్తన మూలానఇంట్లో పోలీసు రాజ్యం మొదలయింది. అమ్మా నాన్నల నిఘా కళ్ళూ, సమయం సందర్భం లేకుండా వినవచ్చే హెచ్చరికలూ మొదట్లో అయోమయానికి తరువాత్తరువాత అసహనానికీ గురిచేసేవి. అంతకుముందు సినిమాకెళ్తున్నా అంటే రూపాయి చేతిలోపెట్టే అమ్మ ఇప్పుడు సినిమాపేరు చెప్తేగాని డబ్బులివ్వటంలేదు. సినిమాచూసి వచ్చాక కాంతారావు సినిమాకెళ్ళానని చెప్పినా నిర్ధారించుకోటానికి కథ చెప్పమనేవాళ్ళు. ఉత్సాహంగా కథ చెప్తుంటే మధ్యలోనే ఆపమనేవాళ్ళు.ఎవరితో కలిసెళ్ళావ్ అంటూ ఆరాలు తీసేవారు. నా చిన్ని బుర్రకి అవన్నీ అర్ధమవటానికి చాలా కాలమే పట్టింది.

రోజులు గడిచిపోతున్నాయి.

ఇంట్లో నిక్కర్లూ, బయటికి వెళ్తున్నప్పుడూ పేంట్లూ కట్టే వయసొచ్చింది.

దీని పర్యవసానమా అన్నట్లు నా టీనేజ్ హాక్కులను కాలరాస్తూ, మా నాన్న నామెడకొక తాడు కట్టి దాని రెండో కొన తీసుకెళ్ళి గుంటూర్ నాజ్ సెంటర్లో అప్పుడెప్పుడొ ఆయన ముచ్చటపడి కొని, మా ఇంటి మధ్యగదిలో వినాయకుడి పటం పక్కన గోడకి తగిలించిన గోడగడియారానికి కట్టేశాడు . దాని పర్యవసానంగా..

కాలేజీనుంచి ఇంటికిరావటం ఐదు నిమిషాలు ఆలస్యం అయితే చాలు ఒక అరగంట సేపు తలంటు..

ట్యూషను నుంచి రావటం ఆలస్యం అయినా .. డిటో డిటో..

సినిమా చూట్టానికి వెళ్ళి రావటం ఆలస్యం అయినా కూడా అదే తంతు. పెద్ద సినిమాలు కాబట్టి "లవకుశ", "మాయా బజార్" లాంటి పౌరాణికాలనుమాత్రం సహృదయంతో అర్ధం చేసుకొనేవాడు. మిగతా ఏ సినిమా అయినా "శుభం" కార్డు పడడమూ, నేను ఇల్లూ చేరటమూ ఒక నిష్పత్తి ప్రకారం జరిగిపోవాల్సిందే..

చివరకు ఈ నిఘా ఎంతలా ముదిరిపోయిందంటే నేను స్నానాలగదిలోంచి బయటిరావటం కాస్త ఆలస్యమయినా "ఏంచేస్తున్నావ్ లోపల ఇంతసేపు?" అని గద్దించేంత...

***********************************************************************************

సినిమాల తరువాత నేను ఎంతో ఇష్టంగా చదివే వారపత్రికలు ఈ విషయంలో తమవంతు పాత్ర విజయవంతంగా పోషించాయి. ఆ సపరివార పత్రికలోని అన్నిపేజీలూ రాజసం ఉట్టిపడేలా ఠీవిగా చదివినా ఆ రెండు పేజీలు మాత్రం చుట్టూ ఎవరూలేరని నిర్ధారించుకొన్నాక, బెరుకు బెరుగ్గా, చీమచిటుక్కుమన్నా ఉలిక్కిపడుతూ హడావిడిగా చదివేవాడిని. చదివాక ఏదో గిల్టీ ఫీలింగ్. ఆ గిల్టీ ఫీలింగ్ అలా ప్రతివారం ఠంచనుగా రిపీటయ్యేది. ఆ పత్రికలో నాకిష్టమైన జోకో, లేదా కార్టూనో ఇంట్లొవాళ్ళకి చూపించటానికి వాళ్ళముందు పేజీలు తిప్పుతుంటే ఆ పేజీ దగ్గరికొచ్చేసరికి సెకనులో వందోవంతులో చప్పున తిప్పేవాడిని. తద్వారా ఆ పేజీ అంటే నాకు అసహ్యం అని వారికి చెప్పి మంచి మార్కులు కొట్టేద్దామనుకొనే తెలివితక్కువతనం నా సొంతం మరి.

ఒక వేసవికాల మధ్యాహ్నం...

రోహిణికార్తె ఎండలు.

హిందీ ట్యూషనుకి ఎందుకో ఆరోజు సెలవు. బయటికి వెళ్ళి ఆడుకోవడానికి పర్మిషను లేదు. ఏమీ తోచక పిచ్చెక్కి పోతోంది నాకు. నాన్న ఇంటికి రావటం ఆరోజు ఎందుకో ఆలస్యం అయింది. అందరూ మధ్యాహ్నభోజనాలు ముగించి ఎవరికి దొరికిన మంచం వారేసుకొని ఆదమరిచి నిద్రపోతున్నారు. మధ్య గదిలో ఎవరూలేరు. మంచం వాల్చుకొని సపరివారపత్రిక తెరిచాను. ఏమీ కనపడటంలేదు అంతా చీకటి. గొడ్లచావిడికీ మధ్యగదికీ ఉన్న కిటికీ తెరిస్తే వెలుతురు బానే వస్తుంది. కానీ ఆపని చేయడానికి బద్దకం వేసి, లేచి, మధ్యగది డొరుకర్టెను తీసి తలుపుమీదికేసి, తల వీధివైపుపెట్టి ఆ వెలుగులో పత్రిక చదవనారంభించాను. ఎందుకో ఒకసారి ఆపేజీ చూద్దామనిపించింది. నాన్న సైకిలు లోపల పెట్టడానికి సైకిలు ముందు చక్రంతో వీధి వాకిలి తలుపుల్ని ఒక్క ఉదుటున నెట్టి లోపలికొస్తాడు. ఇంట్లో ఎక్కడున్నా ఆ శబ్దం వినగానే మాకు తెలిసిపోతుంది నాన్న వచ్చాడని. అంతగా అయితే ఆ శబ్దం వినగానే పేజీ మార్చేయొచ్చులే అనేది నా ధైర్యం.

చదువుతున్నాను...

అర్ధమయీ అవని వయసు. సందర్భాన్ని బట్టి పదాలకర్ధం వెతుక్కొనే వయసు.

అలా చదువుతూ, అంతలోనే ఆలోచిస్తూ అలా ఆ ఆలోచనల సమరాంగణంలో మునిగిఉన్నవేళ..

మొదట పేజీపై ఏదో నీడ కదిలినట్టయింది. వాకిట్లో వేసిన చెట్టు గాలికి కదలగా ఏర్పడ్డ నీడేమో అనుకున్నా. ఎందుకైనా మంచిది అని తల తిప్పి చూస్తే కటకటాల్లోంచి చెయ్యి లోపలికిపెట్టి గడియ తీయడానికి ప్రయత్నిస్తూ నాన్న. బహుశా భోజనం చెయ్యగానే వెంటనే బయటికివెళ్ళే పని ఉందేమో సైకిలు బయటే పెట్టినట్లుంది.

గుండే ఆగినంత పనయ్యింది. చటుక్కున పత్రిక పక్కన పడేసి వచ్చి తలుపుతీసా. తల పైకెత్తి చూడలేనంత గిల్టీ ఫీలింగ్. నాన్న లోపలికి వెళ్ళగానే అక్కడినుంచి నేను పడుకున్న మంచంవైపు చూసా సాలోచనగా. ఇక్కడినుంచి చూస్తే నేను చదువుతున్న పేజీ కనపడుతుందా లేదా అనేది అంచనా వేయలేకపోయాను.

ఆ తర్వాత వారం పాటు నాన్న చెప్పిన ప్రతి పనిని కిక్కురుమనకుండా చేశా.మాములుగానయితే "ప్రతిపనీ నాకే ఎందుకు చెప్తారు, పెద్దోడికి చెప్పొచ్చుగా?" అని మొండికేసేవాడిని.

నేనేమీ చెడుమార్గం పట్టడంలేదు అనే భావాన్ని వ్యక్తం చేయడానికి అప్పట్లో నాకున్న ఏకైక మార్గం చెప్పిన పని చెప్పినట్లు చేయడం.

**********************************************************************************
విధి ఎప్పుడూ నాలుగు స్తంభాలాటే ఆడుతుంది కదా. ప్రస్తుతానికి నేనూ , నాన్న, ఆ గోడగడియారం అనే మూడు కేరక్టర్లే ఉన్నాయి. విధి ముచ్చటపడిందో లేక నా వయసే ముచ్చటపడిందో గానీ నా ఇంటర్మీడియెట్ మొదట్లో ఆ నాలుగో కేరెక్టర్ మా మధ్య ప్రవేశించింది. ఈ కేరెక్టరుకున్న బలం అంతా ఇంతా కాదు. దీని పుణ్యమాని మా నాన్న ఏమాత్రం సహించలేని విప్లవాత్మకమయిన మార్పులు ప్రవేశించాయి నాలో..

పేంట్ వెనక పాకెట్లో దువ్వెన పెట్టుకోవడం, ఒకటికి పదిసార్లు అవసరం లేకపోయినా తల దువ్వుకోవటం, బయటికెళ్ళబోయే ప్రతిసారీ అద్దం ముందు కనీసం ఒక రెండునిమిషాలు గడపటం, రేపటికి ఇస్త్రీ బట్టలున్నాయా లేవా అని ఈరోజే హైరానా పడిపోవడమూ, ఇంతకుముందులా ఇంట్లోనే అమ్మకి "అమ్మా కాలేజికెళ్ళొస్తా" చెప్పకుండా ఆ మాట వీధిబయట సైకిలెక్కి, బెల్లుకొట్టి అరచి మరీ చెప్పడం, కారణమేదీ లేకుండా హడావుడిగా మేడమీదికి పరిగెత్తడం, ఎప్పుడూ కీచులాడే చెల్లెల్నిఅకస్మాత్తుగా వీఐపీ లా చూసుకోవడం గట్రా..

ఆ నాలుగో కేరక్టరు గురించి ఇంకెప్పుడైనా...

Wednesday, May 20, 2009

గమ్మత్తైన సంఘటనలు -1

కొన్ని కొన్ని సార్లు మనం కలలో కూడా ఊహించని సంఘటనలు ఇలలో ఎదురై మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. వీటిల్లో కొన్ని అప్పటికి సీరియస్ యవ్వారాలే. కానీ కాలం గడిచేకొద్దీ అవి కామెడీగా మారి తలచుకున్నకొద్దీ మాంఛి కిక్ ఇస్తుంటాయి. అలాంటివి కొన్ని....

***************************************************************************************


చానాళ్ళ..కాదు కాదు చానా ఏళ్ళ కిందట సంగతి.


నేను అప్పుడప్పుడే ఒక సాఫ్టువేర్ ఇంజనీరుగా సంఘంలో పేరు తెచ్చుకుంటున్న రోజులు.....


ఎదురుపడ్డ ప్రతివాడూ "నువ్వు అమెరికా ఎప్పుడెల్తావ్?" అని నన్ను నిలదీస్తున్నట్టు ఊహించుకొనే రోజులు....


వాళ్ళు నిలదీయకపోయినా వాళ్ళతరపున నన్నునేను నిలదీసుకునే రోజులు....


ఆఫీసులో ట్రావెల్ డెస్క్ ముందునుంచి వెళ్ళే ప్రతిసారీ "ఏదో ఒకరోజు నాపీరు మీద అమెరికా టిక్కెట్టు ఇక్కడ రెడీ అవకపోదు.నేనూ అబిడ్స్లో రెండు పెద్ద పేద్ద సూట్కేసులుకొని, వాటిని షాపు బయట ఫుట్ పాత్ మీదపెట్టి "ఏయ్ ఆటో" అని స్టయిల్గా ఆటోవాణ్ణి పిలవకనూపోను" అని ఊహించుకుంటూ నా వెన్ను నేనే తట్టుకునే రోజులు.......


ఇంకా చెప్పాలంటే పైకి నవ్వుతూ,లోపల కుళ్ళుకుంటూ నా తోటివాళ్ళకి "హేపీ జర్నీరా మామా" చెప్పే రోజులు......

అటువంటి రోజుల్లో....

ఆఫీసులో తెగ కష్టపడేవాడిని(పెద్ద గొప్పేం కాదు. నాలాంటి వాళ్ళు బోల్డు మంది ఉండేవారు). రోజుకి దాదాపు 12-14 గంటలు పని చేసేవాడిని. మా ఆఫీసులో ఒక మానేజరున్నాడు.ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లాగా ఆన్ సైట్ స్పెషలిస్ట్ అంటూ ఆయనకో మెగా ఇమేజి ఉండేది.ఈయన టీములో పడితే ఒక కాలు అమెరికాలో పెట్టినట్టే అనిన్నూ, ఇక అమెరికా షాపింగు మొదలెట్టడమే తరువాయి అంటూన్నూ అందరూ ఆశగా అనుకొనేవారు. నా ట్రైనింగు పూర్తికాగానే నన్ను ఆయన టీములోనే వేసారు. హమ్మయ్య! ఒక కాలు అమెరికాలో పెట్టేసా.ఇక రోజుకు పదహారు గంటలు కష్టపడితే ఆ రెండోకాలు కూడా అమెరికాలో పెట్టెయ్యొచ్చు అని ఊహల్లో తేలిపోతూ నా ప్రాజెక్టు తాలూకు క్లయింటుప్లేసులో టెంపరేచరు ఎంతుందో రెండురోజులకోకసారి చూసుకుంటూ ఉండేవాడిని.



ఒకానొక దుర్దినాన ...


పొద్దున్నే ఆఫీసుకి బయలుదేరా.ఇంటినుంచి ఆఫీసు దాదాపు ఇరవై కిలోమీటర్లు. హైదరాబాదు ఈ చివర నుంచి ఆ చివరకు ప్రధాన వీధుల్ని సర్వే చేస్తూ సాగేది నా టూవీలర్ ప్రయాణం. అంతదూరం ఆ హైదరాబాదు ట్రాఫిక్లో వెళ్తే తెల్ల చొక్కా నల్లగా మారటమేమోగాని ఆ వాహనాల పొగా, రోడ్లమీద దుమ్మూ తలకంటుకొని జుట్టు బరక బరగ్గా తయారయ్యేది.రెండురోజులకోకసారి తలస్నానం చెయ్యకపోతే ఆ మూడో రోజు పని పక్కనపెట్టి బుర్రగోక్కోటంతోటే సరిపోయేది. ఇది అటువంటి ఒకానొక మూడోరోజన్న మాట.


ఆఫీసుకి ఠంచనుగా టైముకే చేరుకున్నా. ఇంకా ఎవరూ వచ్చినట్టు లేరు. ఫ్లోరంతా ఖాళీగా ఉంది. ఇదే మంచి అవకాశం అని అప్పటికే ఈనాడు చదివి ఉన్నాను కాబట్టి నెట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేశా. అవి ఇంటర్నెట్ విప్లవం భారతదేశ తీరాన్ని తాకీ తాకనట్టు తాకుతున్న రేషను రోజులన్నమాట.ఆఫీసులో "టైమ్స్ ఆఫ్ ఇండియా" సైటునుకూడా అదేదో చూస్తున్నట్టు రహస్యంగా చూడాల్సొచ్చేది.


చదూతుండగా తలలో ఏదో కదిలినట్టయింది.


ఏదోలే అనుకుంటే.. కాసేపాగి మళ్ళీ


ఈసారి అటూ ఇటూ చూసి ఎవరు లేరు కదా అని జేబులోంచి దువ్వెన తీసి బరబరా తల దువ్వి ఏవైనా జీవులు తలలో తిష్టవేసుక్కూర్చున్నాయేమో అని దువ్వెనని కిటికీ వెలుతురుకి ఎదురుగా పెట్టి చూసా.ఊహు! ఏమీ కనపడలేదు. సరే అని మళ్ళా టైమ్స్ ఆఫ్ ఇండియా మీదకి దృష్టి మరల్చబోయేంతలో...


మరోసారి.....


ఈసారి చికాగ్గా చేతిగోళ్ళతో మాడు ఘాట్టిగా గోక్కుంటుండగా నా కుడిచేతిమధ్యవేలుగోట్లో ఏదో ఇరుక్కున్నట్లనిపించింది. చూస్తే ఎన్నడూలేనిది, పేనులాగా ఉంది. చచ్చినట్టు పడుంది.


ఆహా నామీద కూడా ఆధారపడ్డ జీవులున్నాయన్నమాట అనుకుంటూ ఉండగా చిన్నప్పుడెప్పుడో మా ఇంట్లోవాళ్ళు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. తలలో పేను చేతికి చిక్కినా, దువ్వెనకి చిక్కినా దాన్నలాగే వదిలేస్తే దరిద్రం అట. వెంటాడి వేటాడి వేటకొడవళ్ళతో కాకున్నా కనీసం చేతి గోళ్ళతో దాన్ని హత్య చేయాల్సిందే అట.సరే, ఇంట్లో వదిలేస్తే ఇంటికి దరిద్రం. మరి ఆఫీసులో వదిలేస్తే అది ఏరకమైన దరిద్రం?ఒకవేళ ఏదోఒక దరిద్రం చుట్టుకున్నా మా CEOనో MDనో పట్టుకుంటుంది. నాకేమిటిలే నష్టం అని అనుకుంటుండగా నాకు ఇంకొక ఆలోచన వచ్చింది.సపోజు, ఫర్ సపోజు ఇది నా డెస్కు వదిలిపెట్టకుండా ఏదో ఒకమూల స్థిరనివాసమేర్పరచుకొని ప్రతిరోజూ నన్నే వెక్కిరిస్తూ చూస్తూ తన శేషజీవితాన్ని హాయిగా గడిపేసిందనుకోండి. అంటే ఆ దరిద్రం నా డెస్కుకూ తద్వారా నాకూ పాకినట్టేగా? అమ్మో ఇది బతికితే నా అమెరికా ప్రయాణం హుళక్కి అన్నమాట.ఆ ఆలోచన రాగానే నాకు దానిమీద విపరీతమయిన కోపం వచ్చేసింది. దాన్నలా టేబుల్ మిద పెట్టి కుడిచేతి బొటనవేలి గోరుతో టక్కున నొక్కా. చావటానికి ముందు పేను "టిక్" అనే శబ్దంతో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చి మరీ చస్తుంది కదా. కన్ఫర్మేషన్ రాకపోయే సరికి నా పట్టుదల హెచ్చింది. ఇంకాస్త శ్రద్దగా నెమ్మదిగా సినిమాల్లోలాగా స్లోమోషన్లో ట్రై చేశా. ఈసారి కూడా నో కన్ఫర్మేషన్ .ఈసారిలా కాదని నా ఎడమచేతి బొటనవేలి గోరు సపోర్టుగాపెట్టి కుడిచేతి గోటితో "చావవే నీ..." అంటూ దాన్ని పరలోకానికి పంపి నేను అమెరికా వెళ్దామని కసిగా నొక్కబోతుండగా నా కుడిపక్క ఏదో అలికిడి. కనుచివరలనుండి తెలుస్తోంది పక్కనెవరో ఉన్నారని.


తలతిప్పి చూస్తే....


అచ్చం సినిమాల్లోలానే.... ముందు ఆ శాల్తీ వేసుకున్న బూట్లు కనపడ్డాయి. ఆతరువాత నెమ్మదిగా తలెత్తి చూస్తే..


ఎవరోకాదు నా మేనేజరే...


టక్కున చేతులు రెండూ వెనక్కి లాక్కుని కుర్చీలో సర్దుక్కూర్చొని నా కంప్యూటరు వైపు చూసా. ఎదురుగా "టైమ్స్ అఫ్ ఇండియా" వెక్కిరిస్తూ. ఆయన నా వైపే చూస్తున్నాడు. "ఆహా! ఒకవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకో వైపు పేను నొక్కుడు.ఏమి వైభోగంరా నీది" అంటూ చూస్తున్నట్టనిపించింది. ఈయన మరో స్పెషాలిటీ ఏమిటంటే మొహంలో హావభావాలేమీ ఉండవు. నిమ్మకి నీరెత్తినట్లో లేదా ఏ విస్కీ ఎత్తినట్లో ఉంటుంది ఈయన మొహం.


ఏమీమాట్లాడలేదు. నన్నూ నా కంప్యుటర్ స్క్రీన్నీ మార్చి మార్చి చూసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు అంతే.


ఇండియాలో ఉన్న నా రెండోకాలు అమెరికాలో పెట్టడం మాట దేముడెరుగు, (ఊహల్లో)అమెరికాలో ఉన్న నా మొదటికాలు వణకడం ఆరంభించింది.ఆ తరువాతి నుంచి చాలారోజులపాటు మీటింగుల్లోగానీ, మరెక్కడైనా, చివరికి కేంటిన్లో కూడా ఆయన నావైపు చూస్తే నాకాసంఘటనే గుర్తుకొచ్చేది. నాకు మోక్షం ప్రాప్తిస్తుందేమో అన్న ఆశతో దాదాపు రెండేళ్ళు ఆయనకిందే పనిచేసాను.ఒకసారి ప్రమోషనూ మిగతా వాళ్ళతో పోలిస్తే అప్పుడప్పుడూ జీతం పెంపూ బానే ఇచ్చాడు గానీ అమెరికాని మాత్రం "ఆ ఒక్కటీ తప్ప" అనే కేటగిరీలో ఉంచేసాడు.


ఇప్పుడంటే సరదాగా రాస్తున్నానుగాని మేనేజరు కరుణాకటాక్ష వీక్షణాలకోసం తపించిపోయే ఓ పిల్ల సాఫ్టువేర్ ఇంజనీరునైన నన్ను అప్పట్లో ఈ సంఘటన ఒక వారం పాటు డిప్రెషన్ లోకి నెట్టేసింది.


దాదాపు నూటయాభై మంది ఆయనకింద పనిచేసేవారు.కాబట్టి ఆయన ఈ సంఘటనని గుర్తుపెట్టుకొని మరీ నన్ను పక్కన పెట్టుండొచ్చు అన్న ఆలోచన నాకు ఇప్పుడు సమర్ధనీయంగా లేదు.కానీ అప్పట్లో మాత్రం నా ఆలోచనలు అలానే ఉండేవి. ప్రతిదాన్నీ ఈ సంఘటనతో ముడిపెట్టేవాడిని చానాళ్ళపాటు. ఆయన నన్ను చూసి నవ్వినా దీనివల్లే, నవ్వకపోయినా దీనివల్లే అననుకునేవాడిని.


ఇంతాచేసి ఆరోజు నా తల తవ్వకంలో బయటపడ్డ ఆ జీవి పేను కాదు. అసలది జీవే కాదు. హైదరాబాదు ట్రాఫిక్ లోంచో లేదా ఏ చెట్టుమీంచో ఎగిరొచ్చి నా తల్లో దూరిన ఆ జీవంలేని ఆవగింజంత ఘనపదార్ధం ఏంటో నాకిప్పటికీ తెలీదు.

Tuesday, April 28, 2009

అ'రాచకీయాలు

పోలికలు తేకూడదు అని ఎంత అనుకున్నా కొన్ని విషయాల్లో నిభాయించుకోలేను. అలాంటివార్తొకటి ఈరోజు చదివాను. ఆ వార్త ఇదిగోండి . అమెరికాలో గత తొంభయ్యారేళ్ళలో పార్టీ ఫిరాయించిన వారు 13 మంది.

సొంత పార్టీ తీర్మానానికి వ్యతిరేకంగా చట్టసభల్లో ఓటేయడం వేరేవిషయం. దాన్ని వదిలేస్తే, రిపబ్లికన్ నుంచి డెమొక్రటిక్ పార్టీకి లేదా ఇటు నుంచి అటుకి మారినవారు మొత్తం 13 మంది.

దాదాపు వందేళ్ళలో....

13 మంది. అక్షరాలా పదమూడు మందే. మీరు సరిగ్గానే చదివారు.

మనది "లార్జెస్టు" డెమోక్రసీ కదా, మనకి ఇంతకంటే ఎక్కువ ఉండడం సహజం. కాబట్టి ఆ 13 పక్కన ఒక రెండుసున్నాలో మూడూ సున్నాలో పెట్టుకొండేం?

విద్యా చరణ్ శుక్లా గుర్తుకొచ్చాడు ఒక్కక్షణం. చెయ్యని మినిస్ట్రీ లేదు, చేరని పార్టీ లేదు.

*********************************************************************************

ఇవేమి దీక్షలో...

ఇదొక పక్కరాష్ట్రం పెద్దమనిషి కథ.

ముక్కుపచ్చలారని చిన్నపిల్లల్ని కూడా మెళ్ళో సైనైడ్ గొట్టం వేసి ఆహ్వానం పలికే ఓ ఉగ్రవాద సంస్థ మీదకి ఈయనకి అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది.

ఇంకేముందీ, దీక్షకి రంగం సిద్ధం.

పట్టెమంచం, మెత్తటి పరుపూ, చల్లగా సేద దీరడానికి ఏసీలూ, ఫేన్లూ. మరి దీక్షా మజాకానా? ఆత్మవంచనకి ఆత్మగౌరవం ముసుగేసి ఓట్లడుక్కోడానికి ఆమాత్రం సెటప్పు కావద్దూ?

ఈ సందట్లో ఎవరిమూలాన వైధవ్యం ప్రాప్తించిందో వారినే రక్షించాల్సిన దుస్థితి పాపం ఇంకొకామెది.

రాజకీయం కదా, ఇక్కడ లాజిక్కులుండవు మరి.

Monday, April 20, 2009

చెణుకులు

ఈయన అప్పుడెప్పుడో "అసలు రాముడున్నాడా?" అనీ , "రాముడు తాగుబోతు" అనీ, అనేసి కొట్టుకుచావండ్రా అని చేతులు దులిపేసుకున్నారు. అప్పటి బాధపడ్డ హృదయాలకు ఇప్పుడిదిగో సమాధానం.


ప్రభాకరన్ ఉగ్రవాది కాడు.


ఇన్నాల్టికి ఆయన మనః స్థితి మీద ఒక అంచనా లాంటిది దొరికినట్టయి మనసు ప్రశాంతంగా ఉంది నాకు. ఇప్పుడీయన రాముణ్ణెన్నన్నా నాకేమాత్రం బాధ లేదు. నిజానికి ఎప్పుడంటాడా అని ఎదురుచూస్తున్నా. అన్నాక కాసేపు నవ్వుకోవచ్చుగా.


*********************************************************************************************

ఒకప్పుడది జెంటిల్మన్లాడే ఆట.


రోజుకి ఎనిమిది గంటల చొప్పున ఐదురోజులపాటు దాదాపు నలభై గంటలపాటు ఆడే ఆట. స్వఛ్చతకీ , హుందాతనానికీ ప్రతీకగా తెల్లని దుస్తులు.


ఒక రెండు దశాబ్దాల క్రితం ఆ ఆట నలభై గంటలనుంచి ఎనిమిది గంటలకి కుదించంబడింది. తెల్లని దుస్తులు కాస్త మసకబారాయి. అయితే అప్పుడప్పుడు వాటిని కాస్త ఉతుక్కున్నారు కాబట్టి ఆ మసకదనం అంతగా కనబడలేదు.


ఈ మధ్యే అది ఆ ఎనిమిదిగంటలనుండి రెండుగంటలకీ, కొన్నిసార్లు గంటన్నరకీ కుదించబడింది.


ఇప్పుడు ఆ ఆట చూడ్డానికొచ్చిన అమ్మాయిలకి వేల డాలర్ల నజరానా, బాలీవుడ్ కథానాయికగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే అవకాశం.



మార్పుకి సాక్షీభూతమవటం చాలావరకు దుఖః కారణం. . అప్పుడప్పుడూ మాత్రమే గర్వకారణం. నేను చివరిసారిగా గర్వపడిందెప్పుడా అంటే అస్సలు గుర్తుకు రావటంలేదు. ఈ క్రమంలో సినిమాలూ, రాజకీయాలూ,విద్యా, వైద్యం అవన్నీ గుర్తుకొచ్చి ఇంకాస్త ఏడుపొచ్చింది.


ఎప్పుడో వదిలేసుకున్న చెస్ ఆట మీద మక్కువ మళ్ళీ మొదలవుతోంది నాలో.



దేముడా! దానికేమాత్రం ప్రాముఖ్యం వద్దు. దాన్నక్కడే ఉండనివ్వు.



Thursday, April 16, 2009

రెండు సంగతులు

ఏమిటో! ఈ మధ్య బూట్లు విసరడం ఎక్కువైంది.

కొన్ని నెలల క్రితం అమ్రీకా అధ్యక్షుడు భూషయ్య మీద, తరువాత చిదంబరం మీద, రీసెంటు గా నవీన్ జిందాల్ మీద.

అయితే సదరు వ్యక్తి తాగి ఉన్నాడనీ, అందుకే క్షమించేసాననీ జిందాల్ వారు సెలవిచ్చారు.

చదువుతూ ఓహో! అని తలూపుతుండగా ఠక్కున వచ్చిందొక ఆలోచన..

తాగితే విచక్షణా జ్ఞానం పోవాలి కదా మరి ఇదేమిటి? ఈయనలో మేల్కొన్నట్టుందే!

ఏంటో?

ఇంత చిన్న విషయమే బోధపడకపోతే, ఇక ఆ పరమ సత్యం నాకెన్నటికి బోధపడేను?

***************************************************************************

ఇంకొకటి.

ఒకానొక శుక్రవారం నాడు.

సమయం సాయంత్రం ఆరు గంటలు. పనుండి ఆఫీసులోనే ఉండిపోయా.

దాదాపు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి అంతా నిశ్శబ్దంగా ఉంది.

నేను కూడా వెళ్ళిపోయాననుకున్నారేమో, నా సహోద్యోగులు, ముగ్గురు తెల్లోళ్ళు మాట్లాడుకుంటున్నారు.

వద్దనుకున్నా చెవిలో వచ్చి పడుతున్నాయి మాటలు.

"సుబ్బారావేడీ? ఈ మధ్య కనపడటం లేదే"

"ఆయన పెళ్ళి. ఇండియా వెళ్ళాడు, వచ్చే సోమవారం వస్తాడు"

మేగన్ అడిగింది.

"అవునూ మీకు తెలుసా, ఇండియాలో పెళ్ళి అయ్యేవరకూ ఆడైనా మగైనా వర్జినిటీ పోగొట్టుకోరట"

"ఏమిటీ! నిజమే?" రెండు మగ గొంతులు ఆశ్చర్యంగా.. నోరెళ్ళబెట్టి..

"ఒకవేళ అమ్మాయి పోగొట్టుకుందని తెలిస్తే వీధుల్లోకి లాక్కొచ్చి రాళ్ళతో కొట్టి చంపుతారట".

ఇంతలో ఎవరో "ష్" అంటూ నేను ఇంకా అక్కడే ఉన్నానని వారికి సైగచేసి చెప్పటం తెలుస్తూనే ఉంది.

కాసేపు నిశ్శబ్దం..

ఆ తరువాత చిన్న చిన్న గుసగుసలు.

కాసేపటికి పూర్తి నిశ్శబ్దం.


కాలం తో కాసేపు పరిగెడతాం.తెలీకుండానే ఎక్కడో ఒకచోటఆగిపోతాం.అక్కణ్ణించి కాలంతో పాటు ఉన్నామనే భ్రమ లో హాయిగా బతికేస్తాం.కనీసం ఎక్కడున్నామో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యం.తీర్పులు మాత్రం ఇచ్చేస్తుంటాం. జ్ఞానాన్ని అడక్కుండానే అందరికీ పంచేస్తుంటాం.

ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ

న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో.  (తెలియని వారికి: అమెరికాలో...