Thursday, March 5, 2009

కారు డ్రైవర్ల కథ

ప్రతిఒక్కరికీ జీవితంలో ప్రతి దశలోనూ వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. కొత్తగా వచ్చిన భార్య కావచ్చు.ఇప్పుడే ఈలోకం లోకొచ్చిన మీ బుజ్జి పాపో, బాబో కావచ్చు. ఇవేమీ కాకపోతే ఆఫీసులో మన బాసు కావచ్చు.లేదా ఇంకెవరైనా కావచ్చు. వీరిలో కొంతమందితో రోజూ మాట్లాడక పోయినా,వారితో వ్యవహరించేటప్పుడు వొళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటాం. నా దృష్టిలో వారందరూ వీఇపీలే. అలానే నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడున్నన్నాళ్ళూ నాకొక వీఐపీ ఉండేవాడు. వుత్తి వీఐపీ కాదు, వీవీఐపీ అన్నమాట.ఎవరో కాదు మా కారు డ్రైవర్. పేరు భిక్షపతి. గత మూడేళ్ళుగా నేను నా ఇండియా ప్రయాణం టికెట్లు కన్ ఫం చేసుకోగానే, ఆ వెంటనే చేసే పని మా అన్నయ్యద్వారా భిక్షపతి కి కబురు పెట్టడం. "స్టార్ట్ ఇమ్మిడియట్లీ" లాగా "భిక్షపతి అవైలబుల్" అన్న హామీ మా అన్నయ్య ఇవ్వందే నాకు ఇండియా వెళ్తున్నానన్న ఆనందపు క్షణాలు మొదలవ్వవు. అ హామీ లభించక ఆ ఆనందాన్ని కొన్ని రోజులపాటు వాయిదా వేసుకున్న సందర్భమూ ఉంది .

స్టాక్ మార్కెట్లో ఒక షేరుంటుంది, నిక్కుతూ నీలుగుతూ ఎక్కడో పదిహేను,ఇరవై మధ్య. ఏ మహానుభావుడు ఏ క్షణాన ఏ మీట నొక్కుతాడో గానీ అది అరవై, డెబ్బై, అలా అలా పెరుగుతూ రెండొందల పైచిలుకు చేరుకుంటుంది. ఈలోపు జనాలు దాన్ని వేలం వెర్రిగా కొనేస్తారు. ఆ తరువాతెప్పుడో అది కొండదిగి, కొంత మంది ఆత్మహత్యలకీ, కాపురాల్లో కలహాలకీ , ఇంకదేనికో దారి తీస్తుంది. నా దృష్టిలో అలా షేర్లలా కొండెక్కి , దిగకుండా ఇప్పటికీ అక్కడే తిష్టవేసుక్కూచ్చున వర్గం అంటే ఈ డ్రైవర్లే. ఒకప్పుడు మా వాడికి డ్రైవింగు వచ్చు, ఎక్కడైనా పనికి కుదిర్చి పెట్టండి అని అడిగేవాళ్ళు. ఇప్పుడాసీను ఏదైనా సినిమాలో పెడితే "అబ్బే అతకలేదు" అనేస్తాం మనం. అంత డిమాండు ఈ డ్రైవర్లకి. ముఖ్యంగా హైదరాబాదులో. (మిగతా వూళ్ళ సంగతి నాకు తెలీదు సుమా).

నేను ఇండియాలో పనిచేసేటప్పుడు అందరూ ముందు ఇల్లు కొనుక్కొని ఆ తరువాత కారు కొంటుంటే, నేను రివర్స్ గేర్ లో ముందు కారు కొని, ఆనక డబ్బుల్లేక ఇల్లు కొనేపనిని నిరవధికంగా వాయిదా వేసాను. దెప్పనివాళ్ళులేరు. అవొక గడ్డురోజులు. ఏంచేస్తాం, వాళ్ల కామెంట్లు విని, విననట్టు నటించి, ఊరుకొనేవాడిని. ఎవరితోనైనా మాటల్లో ఆ టాపిక్కు రాగానే, "ఆ! చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటి, దానికి డైరట్రెవరు?" అని టాపిక్కు మార్చడానికి విఫల ప్రయత్నం చేసేవాడిని.

అదేంటో నేను కారుకొన్న ఆ టైములోనే మన నారా వారి పుణ్యమాని హైదరాబాదు ముఖచిత్రం మారనారంభించింది. లంగా వోణీ వేసుకున్న పదారణాల తెలుగుపిల్ల లాంటి హైదరాబాదు, అరంగుళం మందాన అద్దుకున్న పౌడరూ, లిప్ స్టిక్కూ, టైటు జీన్సూ, టి-షర్ట్ లతో హైటెక్కు సింగారం అందుకుంది. చేతక్ స్కూటర్లూ, దానిమీద సీ.ఆర్.పీ.ఎఫ్ పోలీసుల తరహా గుండ్రటి హెల్మెట్లు పెట్టుకొనే అంకుళ్ళూ,నేరుగా అఫ్జల్గంజ్ వెళ్ళి అక్కడితో ఆగకుండా, అలానే సాలార్జెంగ్ మ్యూజియం లోకెళ్ళిపోయారు.ఇప్పుడంతా ఫాస్ట్.నూటయాబై,రెండొందల సీ.సీ బైకులూ, వాటికి డిస్కు బ్రేకులూ,వినగానే పక్కన బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడి,కాళ్ళూచేతులూ స్వాధీనం తప్పేలా చేసే రకరకాల హారన్లూ,వీటన్నిటికీ మించి ప్రతి ఒక్క టూవీలర్కీ నాలుగు కార్ల నిష్పత్తిలో ట్రాఫిక్.నాకంటే నా పక్కవాడిగురించి ఎక్కువగా పట్టించుకునే నా మనసుకి ఇది చూసి చాలా కష్టమేసింది. కష్టం కాదు, బాధ. బాధ కాదు,భయం (ఈ చివరిదే కన్ ఫం చేసుకోండి). ఈ భయం నా బుర్రలోంచి నా చేతుల్లోకీ, కాళ్ళలోకి ప్రవేశించి, నేను కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నన్ను దాటుకెళ్తున్న ప్రతివాళ్ళూ, ఎవడ్రా వీడు అని కొంతమంది ఆసక్తితోనూ, మరికొంత మంది అసహనంతోనూ, ఇంకొంత మంది కోపంతోనూ నావైపు చూసేలా చేసింది. అప్పటికీ పట్టించుకోలేదు. కానీ ఆ చూసేవాళ్ళలో కొంత మంది అమ్మాయిలుండేసరికి నా బ్రహ్మచారి హృదయం తట్టుకోలేకపోయింది. ఆ చూసే అమ్మాయి ఎంత అందంగా ఉంటే బాధ అంత ఎక్కువగా ఉండేది. అది కొన్ని క్షణాల పరిచయమే కావచ్చు, కానీ ఆ పరిచయం ఇలానా? ఈ విధంగానా?

"వాడు వీడే కదూ" అని జనాలు (అంటే అమ్మాయిలు) నన్ను షాపింగు మాళ్ళలోనో, మా కాలనీ కిరాణా కొట్లదగ్గరో గుర్తుపట్టకుండా ఉండాలంటే డ్రైవర్ని పెట్టుకోవడమొక్కటే ఉత్తమం అనిపించింది. అంతే!సడన్ గా మా అపార్ట్మెంటు వాచ్ మెన్ , దానెదురుగా టీ బండి పెట్టుకున్న యాదయ్యా, మా ఇంటికి అవసరమైనప్పుడు వెచ్చాలు తెచ్చిపెట్టే అబ్బాయీ నా ఫ్రెండ్సయ్యారు. వాళ్ళందరికీ చెప్పి పెట్టా, ఒక మాంఛి కత్తి లాటి డ్రయివర్ కావాలి తెలిసినవాళ్ళుంటే చెప్పండి అని. మా సంగతి బాగా తెలిసిన యాదయ్య టీ బండి కంటే ఇందులోనే కాస్త ఎక్కువ డబ్బులు మిగుల్తాయని లెక్కలేసుకొని, ఒకానొక శుభముహుర్తాన,తను తన టీ బండిని మూసేస్తున్నట్టూ, తను పలానా వాళ్ళదగ్గర డ్రయివర్ గా చేరబోతున్నట్టూ,ముందు వీధిలోవారందరికీ చెప్పి,చివరగా నాకు చెప్పేడు. యాదయ్య టీ బండి మూసేసి మరీ నా దగ్గర డ్రయివర్ గా చేరతానంటే నాకెందుకో నిజంగానే భయమేసింది. అప్పటివరకు కుటుంబ బాధ్యత మాత్రమే తెలిసిన నాకు ,మొట్టమొదటి సారిగా ఏదో"సామాజిక బాధ్యత" నామీదపడ్డట్టు సెంటిమెంటు ఫీలయ్యాను. సదరు యాదయ్య, అంతగా నా దగ్గర పని నచ్చకపోతే ,దాన్ని మానేసి, ఒక రెండుగంటల్లో తన టీ బండిని "రీ-ఓపెన్" చెయ్యగల సమర్ధుడని ఊహించలేకపోయాను.

అలా యాదయ్య పనిలోచేరాడు. మొట్టమొదటిరోజు యాదయ్య పొద్దున్నే ఎనిమిదింటికి మా ఇంటి తలుపు తట్టి, తలుపు తియ్యగానే,ఒక నమస్కారం పెట్టి, "కారు తాళాలియ్యండి సార్, మీరొచ్చేలోపు కారు బయటపెట్టి, దుమ్ము దులిపి, అద్దాలు శుభ్రం చేస్తా" అన్నాడు. అప్పుడు కారు తాళాలు అతనికందిస్తూంటే, ఎన్నో యేళ్ళ నుంచి నే పడుతున బాధ గుండెలమీదినుంచి దిగిపోయిన ఫీలింగ్( అప్పటికి నా కారు కొని మూణ్ణెల్లే ). ఇక రోజూ బయటికెళ్ళినప్పుడల్లా నేను ఆ ట్రాఫిక్కులో వొడుపుగా గేర్లు మార్చే యాదయ్య నైపుణ్యానికి ఆశ్చర్యపోయేవాడిని. అదేమిటో యాదయ్య ఫస్ట్ గేర్లో నడుపుతుంటే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇంజను ఆగిపోలేదు. నాకెప్పుడూ అలా కాలేదు. నేనైతే ఫస్ట్ గేర్లోకి రాగానే రియర్ వ్యూ అద్దం చూస్తా వెనక బకరాలెవరున్నారా అని.

నాదగ్గర పనిలోకి చేరిన ఉత్సాహం ఒకనెల జీతం తిసుకొనే సరికి ఆవిరయ్యింది యాదయ్యకి. ఆదాయం బానే ఉంది.కానీ, రోజూ గంటలకొద్దీ అలా ఏ పనీ లేకుండా నాకోసం వెయిట్ చేస్తూ గడపాలంటే మాపెద్ద కష్టమయింది యాదయ్యకి. పొద్దున్నే నా ఆఫీసు పార్కింగులో కారు పార్కు చేస్తే మళ్ళా సాయంత్రం ఏడింటికే తీయటం. అదే టీ బండి దగ్గర ఎంత సందడిగాఉండేది? రోజంతా ఎవరో ఒకరు పక్కన ఉంటూనే ఉంటారు మాట్లాడడానికి. రాజకీయాలూ,పక్కనున్న బస్తీలో రోజూ జరిగే యవ్వారాలూ, సినిమాలూ.. అబ్బో రోజు ఇట్టే గడిచిపోయేది.ఇలా పనీ పాట లేకుండా రోజంతా రికామీ గా కూర్చోవటం కష్టమయింది యాదయ్యకి. అంతే ఒక ధృఢనిశ్చయానికొచ్చేసాడు. నాకు డ్రయివింగు నేర్పి, "నా" కారుకి "తన" వారసుణ్ణి తయారుచేసి, అప్పుడు పని మానుకోవడం. ఇదీ యాదయ్య తీసుకున్న నిర్ణయం. తనలో ఈ రకమైన అసంతృప్తిని గమనించే నేను యాదయ్యకి నెల జీతం గాక అప్పుడప్పుడు వాటికీ వీటికని డబ్బులు బానే ఇస్తూ ఉండేవాడిని. డబ్బు అన్నిటికీ సమాధానం కాదు సార్ అని సింబాలిక్ గా చెప్పేసాడు యాదయ్య, ముభావంగా ఉండటంద్వారా.

ఒకానొక రోజు, సాయంత్రం నాలుగ్గంటలప్పుడు వనస్థలి పురం బయలుదేరాము కార్లో. ఎల్బీ నగర్ దాటగానే చాయ్ తాగుదామని కారు పక్కన అపమన్నాను. ఆ పక్కనే ఉన్న హోటల్లోకెళ్ళి రెండు చాయ్ లు తిసుకొచ్చాడు యాదయ్య. ఇద్దరం చాయ్ తాగుతున్నాం, ఇంతలో హఠాత్తుగా అన్నాడు యాదయ్య

"సార్, ఇక్కణ్ణుంచి మీరు నడపండి బండి"

నాకు పొలమారినట్టయింది. స్కూళ్ళు వదిలిన సమయం. ఎటుచూసినా ఆటోలూ, సెవెన్ సీటర్ ఆటోలూ, స్కూలు బస్సులూ, సైకిళ్ళ మీదవెళ్ళే పిల్లలూ, కుటుంబాన్నంతా ఎక్కించుకొని బైకులమీద, స్కూటర్లమీద సర్కస్ విన్యాసాలు చేస్తున్న అంకుళ్ళూ, ఇంతలోనే భీకరంగా హారన్ కొడుతూ దూసుకొచ్చే సిటీ బస్సులూ.. శనివారం నాటి చిలుకూరు టెంపుల్ లెవల్లో ఉంది రద్దీ.

తమాయించుకొని చెప్పా.

"ఇప్పుడు కాదులే, ఇంకెక్కడైనా ట్రాఫిక్ లేని చోట నడుపుతాలే"

"రోడ్డు సాఫ్ గా, ట్రాఫిక్కు లేకుండా ఉంటే మా ఇంట్ల పోరగాడు కూడా నడుపుతాడు, దిగండి సార్, దిగి ఆ సీట్లో కూర్చోండి, నేనున్నాను కదా పక్కన" అన్నాడు యాదయ్య, నాచేతిలోని ఖాళీ కప్పు తీసుకుంటూ.

మామూలు సమయంలోనయితే యాదయ్య చేసిన కమెంటుకి కోపం రావటమో, చిన్నబుచ్చుకోవడమో చేసేవాడిని. ఇపుడా ఫీలింగులకి కూడా ఆస్కారం లేదు. ఆ రద్దీ అలాంటిది.

యాదయ్య మరీమరీ బలవంతం చేయడం, తాడో పేడో తేల్చుకుందామని నేనుకూడ అప్పటికప్పుడు నిర్ణయించుకొవటంతో డ్రైవింగు సీట్లో కూర్చున్నా. డాష్ బోర్డు మీదున్న ఓబొజ్జ గణపయ్య కి దణ్ణం పెట్టుకొని, రోడ్డుమీద ట్రాఫిక్ ఒక్క క్షణకాలం తెరిపిడి పడి, నాకారు దూరే సందు దొరకడంతో కారు ముందుకు దూకిచ్చా. ఒక వంద మీటర్లు వెళ్ళానో లేదో బైకు మీద ఒక కాలేజీ కుర్రోడు నా ఎడమవైపు నుంచి రయ్యిన దూసుకొచ్చి, కట్ కొట్టి, నా కారు ముందుకొచ్చాడు. ఎక్కడ నాకారు తనకితగులుద్దో అని భయంతో నేను స్పీడు ఒక్కసారిగా తగ్గించా. ఆ దెబ్బకి "నాకు మొదటి గేరే కావాలీ..." అని నా కారు ఇంజను మారాం చేసింది.ఇంకేమంది యధావిధిగా కారు ఆగిపోయింది అదీ రోడ్డు మధ్యలో. నాకేమో చమటలు పట్టేస్తున్నాయ్. కారు స్టార్టు చెయ్యటం, కాస్త ముందుకెళ్ళటం, ఇంజను ఆగిపోవటం. ఇలా నాలుగుసార్లు జరిగింది. రోడ్డువారగా నాకు ఒక పదడుగుల దూరంలో ట్రాఫిక్ కానిస్టేబులు హెల్మెట్ చంకలో పెట్టుకొని టీ తాగుతున్నాడు . రియర్ వ్యూ అద్దం లోకి చూసా. తీరు చూస్తుంటే ఈలోపే నా వెనకాల భారీస్థాయిలో జన సమీకరణ జరిగినట్టూ, వారందరికీ నేను అప్రకటిత, అపరిచిత నాయకుడిని అయినట్టూ అర్ధమయింది. యాదయ్య వైపు చూసా. బీచి ఒడ్డున ఇసకలో కాళ్ళారజాపుకొని ఎదురుగా ఉన్న సముద్రాన్నీ, ఆ పైనున్న ఆకాశాన్నీ చూస్తూ, ఆ అందాన్ని ఆస్వాదిస్తున్న తాలూకు ప్రశాంతత కనపడింది నాకాయన మొహంలో. ఏమాత్రం కంగారు లేదు.

(ఏంటో, భిక్షపతి గురించి రాద్దామనుకుంటే, ఇలా యాదయ్య దగ్గరే ఆగిపోయాను. సమయం దొరికితే దీన్ని కంటిన్యూ చేస్తా.)

Thursday, February 26, 2009

ఒక చిన్న మాట

కొన్ని నెలల క్రితం నేనొకసారి టెన్నిస్ ఆడడానికి మా ఇంటి దగ్గర్లో, ఒక పార్క్ లోనున్న టెన్నిస్ కోర్టుకెళ్ళాను. ఉన్నవే రెండు కోర్టులు. ఒకదాంట్లో తెల్లవాళ్ళు గ్రూపొకటి , దాదాపు ఐదారుగురు, వంతులవారీ గా ఆడుకుంటున్నారు. రెండవదాంట్లో మన భారతీయ మిత్రులు ఇద్దరు ఆడుతున్నారు. నేను, నాతోపాటు వచ్చిన నా స్నేహితుడు దాదాపు నలభై నిముషాలు వేచిఉన్నాం. మన భారతీయ మిత్రులు అరివీర భయంకరం గా తమ టెన్నిస్ ప్రావీణ్యాన్నంతా మాకు చూపిస్తున్నారు గానీ, తోటి వాళ్ళు వేచి యున్నారు కదా వాళ్ళకి కూడా అవకాశం కలిగిద్దాం అనే కనీసపు ఆలోచన కొరవడింది. మనుషుల మీద మరీ అంత చులకన భావం ఏమిటి అని నాకైతే చిరాకు వేసింది. చివరికి మమ్మల్నిఎంతో సేపు నుంచి గమనిస్తున్న ఆ రెండవ కోర్టు వారు మేము వారిస్తున్నా వినకుండా మాకోసం కోర్టు ఖాళీ చేసి ఆడుకోండంటూ చెప్పి వెళ్ళిపోయారు. రెండు విధాలా తల కొట్టేసినట్లైంది నాకు. మనవాళ్ళు అందరూ ఇలా ఉంటారు అని అనటం నా మూర్ఖత్వమే అవుతుంది. కాని ఇలాంటి పోకడలు ఎంత చిన్నవయినా, సంఖ్యలో తక్కువైనా, ప్రస్తుత పరిస్థితుల్లో వాటి ప్రభావం తిరిగి మనమీద చాలా ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం.

ప్రపంచం మారిపోతోంది. ఒక పదేళ్ళ క్రితం ఉన్న పరిస్థితులకీ, ఇప్పటికీ, ఆలోచనల్లో చాలా మార్పులొచ్చాయి. ఏ దేశాన్ని చూసినా అసహనం రాజ్యమేలుతోంది. పరిధిలు కుచించుకు పోతున్నాయ్. మొన్న నాతో బాగా చనువుగా ఉండే మా మానేజరు ఏదో విషయంలో మాట్లాడుతూ అసలు మీ భారతీయులు ఈ దేశంలో ఉన్నారంటే it is just becoz of your brains అన్నాడు. పైకి అది మెప్పుకోలు లా ఉన్నా ఆ సందర్భాన్ని బట్టి అది ఒకరకమైన నిరసన. ఆ తరువాత అలా నోరు జారినందుకు తను కొద్ది గా నొచ్చుకొన్నాడు కూడా. అసంకల్పితంగా,మాటల్లో ఆయన మనసులోని భావం అలా బయటికి వచ్చింది. ముఖ్యం గా 9/11 తరువాత వాళ్ళ దృక్పధం లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఒక అరబ్(ముస్లిం) ని చూస్తే వాళ్ళ నొసలు ముడిపడుతున్నాయి. ఈ TV, రేడియో టాక్ షోల ప్రభావమేమో మరి, బయటి దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఇంతకి ముందులా మనఃస్పూర్తిగా ఆహ్వానించలేక పోతున్నారు. బయటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ ఉద్యోగాల్ని, తద్వారా తమ నోటికాడ కూడుని లాగేసుకుంటున్నారనే ఒకరకమైన భావం వీళ్ళని స్థిమితపడనివ్వటంలేదు. అవుట్ సోర్సింగ్ అంటేనే ఇంతెత్తున ఎగిరి పడుతున్నారు. పులి మీద పుట్ర లా ఈ ఎకానమీ. ఇటువంటి పరిస్థితుల్లో మరింత జాగరూకతతో మెలగవలసిన బాధ్యత మనదే. మన ప్రవర్తన, మనంవేసే ప్రతి అడుగూ, మనం మాట్లాడే ప్రతి మాటా మనదేశంలో ఉన్న 100కోట్ల పైచిలుకు భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తుందనే స్పృహ ఎల్లవేళలా ఉండాల్సిన అవసరం ఉంది. "వీళ్ళందరూ ఇంతే" అనే నిరసనతో కూడిన అభిప్రాయాన్ని వీళ్ళకు కలగనివ్వకూడదు.

Wednesday, February 18, 2009

అరచేతిలో గ్రంథాలయం




కొన్నేళ్ళ క్రితం, తామరతంపరగా వచ్చిన ఈ టెలివిజన్ ఛానళ్ళూ, లైవ్ కవరేజిలూ, సెల్ ఫోన్లూ, ఇంటెర్నెట్టూ, ఇవన్నీ చూసి నోరెళ్ళబెట్టినా, "కొన్ని విషయాలకు మాత్రం ప్రత్యమ్నాయం ఉండదు ఉండబోదు.చాలా మంది కొన్నిటిని అలా సహజంగా చూడటానికే ఇష్టపడతారు.టెక్నాలజీ వీటినేం చేయలేదు" అని అనుకునేవాడిని. అలా నేను అనుకున్నవాటిలో మొట్టమొదటిది పొద్దున్నే చదివే న్యూస్ పేపరు. కుర్చీ కిటికీ పక్కకు లాక్కొని, ఆ ఉదయపు నీరెండ చురుక్కుమనిపిస్తుంటే, కాఫీ తాగుతూనో, లేదా వేసవిలో బాల్కనీలో ఆ ఉదయపు చల్లగాలిని ఆస్వాదిస్తునో, పేపరు చదవడంలో ఉన్న ఆనందానికి ఏ టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు అని భ్రమపడ్డాను. సరిగ్గా ఐదేళ్ళ తరువాత, మాతృదేశాన్ని వీడి వచ్చాక, ఆ అనుభవం నిజంగానే గతకాలపు స్మృతిలా చురుక్కు మనిపిస్తోంది. దూరంగా ఉన్నాను కాబట్టి సర్దుకుపోవడమే కావచ్చు. కానీ ఇప్పుడు నా ఆన్లైన్ పేపరు పఠనం మరీ అంత అసహజంగా అనిపించటంలేదు. ఇంకొక ఐదేళ్ళు పొతే పేపరు చదవడానికి ఇదే సరైన పద్దతి అని వాదిస్తానేమో. ఇష్టమైన ఆర్టికల్స్ ను కత్తెరుచ్చుకుని కట్ చేసి, పంచ్ చేసి, ఫైళ్ళలో భద్రపర్చుకొని, పాత బడ్డక వాటిని అటు పారేయలేకా ఇటు సర్దనూలేక సతమత మయ్యే బదులు చక్కగా కంప్యూటర్లోనే భద్ర పరచుకోవచ్చు. పది పదిహేను రోజుల కిందటి పేపరు కావాలంటే నిమిషాల్లో లభ్యం. టేబిలు కింద దూరి ఆ దుమ్ములో పాత పేపర్ల కట్ట మీద దాడి చెయ్యాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నాయి నా ప్రస్తుత ఆలోచనలు.

సరే ఈ సుత్తంతా ఎందుకు, డైరక్టు గా విషయం లో కొచ్చేస్తాను. అమెజాన్ వారు ఒక సంవత్సరం క్రితం "కిండిల్" అనే ఒక ఈ-బుక్ రీడర్ ని ప్రవేశపెట్టారు. ఇది పుస్తకానికి ప్రత్యామ్నాయం. ఒక ఐదు వందల పేజిల నవల కూడా మన అరచేతిలో ఇట్టే ఇమిడి పోతుంది.అవసరమనుకుంటే ఇది ఆ పుస్తకాన్ని మనకి చదివి కూడా వినిపిస్తుంది. అయితే ఆ విషయం లో అమెజాన్ వారికి ఎవో న్యాయపరమైన ఇబ్బందులున్నాయట. ఇది 3G వైర్ లెస్ టెక్నాలజీలో పని చేస్తుంది. మనం చదవాల్సిన పుస్తకాన్ని అమెజాన్ వారి సైటు నుంచి ఈ పరికరం లోకి డౌన్ లోడ్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి దాదాపు రెండులక్షల ముప్పై వేల పుస్తకాలు ఈ కిండల్ లొ చదవదగ్గ ఫార్మాట్ లో లభ్యం. ప్రస్తుతానికి మార్కెట్ లోకి రాబోతున్న ది కిండిల్ 2. అంతకు ముందు వచ్చిన మోడల్ తో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేసారు. అమెజాన్ వారి సైటు నుంచి పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని స్టొర్ చేసుకొనే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా దాదాపు పదిహేను వందల పుస్తకాలని మీతోటే ఉంచొకోవచ్చు, తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా. మనం షాపులో కొన్నట్లే ప్రతి పుస్తకానికీ నిర్ణీత రుసుము చెల్లించాలి. అయితే మనం షాపులోకొనే ధర కి ఈ కిండిల్ ధరకి తేడా ఏమీ లేదు. కొన్ని పుస్తకాలు బయటికంటే తక్కువ ధర కి లభ్యం. అలాగే మనం షాపు కి వెళ్ళినప్పుడు మనకి తెలియని పుస్తకమైతె కొన్ని పేజీలు అలా తిరగేసి మనకి నచ్చితే కొంటాం. అలానే ఇందులో కూడా మొదటి చాప్టర్ ఉచితంగా చదువుకోవచ్చు. అది నచ్చితేనే కొనుక్కోవచ్చు. సరే, మరీ ఎక్కువ చెపితే మీరు నన్ను అమెజాన్ తాలూకు సేల్స్ మెన్ అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తాను. మరిన్ని వివరాలకు అమెజాన్ వారి సైటు చూడండి.


మర్చేపోయాను, పుస్తకాల లాగా "కిండిల్ ఎడిషన్" బ్లాగులు కూడ ఉన్నాయి మరి. ఇంకేంటి, అందులో మీకు నచ్చిన బ్లాగులుంటే ఇక కంప్యూటరు తో పని లేదు ముఖ్యం గా ప్రయాణ సమయాల్లో.అలానే కిండల్ న్యూస్ పేపర్లు కూడా...

( నేను పైనున్న చిత్రాలను అమెజాన్ వారి సైటు నుంచి తీసుకున్నాను)

Monday, February 16, 2009

ఈ మధ్య చూసిన సినిమాలు

అదేమిటో, ఎన్నడూ లేని విధంగా, గత పది పదిహేను రోజుల్లో తెలుగు, ఇంగ్లీషు కలిపి దాదాపు 10 సినిమాలు చూశాను. అన్నీ కాకున్నా నాకు బాగా నచ్చిన మూడు ఇంగ్లీషు సినిమాల గురించి ఇక్కడ.

మొదటిది క్లింట్ ఈస్టువుడ్ నటించి దర్శకత్వం వహించిన "గ్రాన్ టోరినో". నాకు బాగా నచ్చిన సినిమా. వాల్ట్ (క్లింట్ ఈస్ట్ వుడ్) మాజీ వియత్నాం యుద్ద సైనికుడు.అంతకుముందు ఫోర్డ్ కంపనీ లో పనిచేసి ఉంటాడు. అణువణువునా అమెరికన్ రక్తం. టయోటా కార్లను చూసినా ఈసడించుకుంటాడు అవి అమెరికనేతర సంస్థ తయారీ కాబట్టి. ఈ వృద్దునికి భార్య చనిపోయి ఉంటుంది. ఉన్న ఇద్దరు కొడుకులూ ఇతని గురించి పట్టించుకోరు. పట్టించుకోరు అనేకంటే, ఇంత వృద్ధుడైనా తమ మాట వినక, నా జీవితం నాఇష్టం అనే ఇతని ధిక్కార స్వరాన్ని నిరసిస్తూ ఉంటారు. ఈయన పొరుగింట్లో వియత్నాం నుంచి వచ్చి సెటిలయిన ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళని చూస్తేనే ఈయనకి వళ్ళుమంట. ఆ వియత్నాం కుటుంబంలో ధావ్ అనే ఒక టీనేజి కుర్రాడుంటాడు. అదే ఏరియా లో ఉండే ఒక వీధి గేంగు ధావ్ ని తమలో కలుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. వాడి సహాయంతో వాల్ట్ తను అపురూపంగా చూసుకొనే కారు "గ్రాన్ టోరినో" ని దొంగిలిదామని వాళ్ళ ప్లాను. వాళ్ళ ఒత్త్తిడి కి లొంగి ధావ్ దొంగతనానికి ప్రయత్నించడం, దాన్ని వాల్ట్ విఫలం చెయ్యటం జరుగుతుంది. దాంతొ ఆ పొరుగునుండే కుటుంబం అంటే వాల్ట్ కి ఇంకాస్త కోపం పెరుగుతుంది. తరువాత నెమ్మదిగా వాల్ట్ కి నిజం తెలియటం, ఆ కుటుంబం మీద తన అభిప్రాయం మారటం జరుగుతుంది. ఈ క్రమంలో థావ్ అక్క సూ ని తుంటరి పిల్లల నుంచి రక్షించడం, సూ తో పరిచయం, చివరికతన్ని ఇంట్లో ఒకడిగా చేస్తుంది. ఇక కరుడు గట్టిన అమెరికన్ తను మొదట్లొ అసహ్యించుకున్న ఆ కుటుంబాన్ని ఆ వీధి గేంగ్ నుంచి రక్షింటానికి పడ్డ తపన సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సూ, థావ్ లు తమ నటనకి జీవం పోసారు. చాలా సహజం గా నటించారు. నన్నడిగితే పాత్ర ధారుల ఎంపికలోనే సినిమా విజయం సగం దాగుందేమో అని. తప్పక చూడవలసిన సినిమా, అయితే ఈ సినిమాలో, నాలుక్షరాల, మూడక్షరాల, పదాలను విరివిగా ఉపయోగించారు ఎంతలా అంటే అలవాటైన వాళ్ళకు కూడా "ఇక చాలు బాబోయ్, మరీ ఇంత డోసా?" అనిపించేలా.

రెండవది, "ది ఇంటర్నేషనల్". ఒక జర్మన్ బేంక్ అంతర్జాతీయ ఆయుధ స్మగ్లింగ్ బ్రోకర్లా వ్యహరించి తమ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నించటం, దాన్ని ఒక అమెరికన్ ఇంటర్ పోల్ ఏజెంట్ ఛేదించటం సినిమా కధాంశం. సినిమా ఉద్దేశ్యం రెండు గంటల పాటు ప్రేక్షకుణ్ణి కట్టిపడేయమే అయితే ఈ సినిమా దాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఈ సినిమాలో కేమెరా పనితనం అద్భుతం. నన్ను కట్టి పడేసింది. నాకు మాత్రం ఈ సినిమా "బోర్న్" సీరిస్ ని గుర్తుకు తెచ్చింది. ఆ సినిమాల స్థాయికి ఏ మాత్రం తగ్గదు. ఇందులో హీరోగా చేసిన క్లైవ్ ఓవెన్ జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్ గా నటించే ఆఫర్ ని వద్దనుకున్నాడట. ఎందుకోమరి..

ఇక మూడవది, మన "స్లం డాగ్ మిలియనీర్". పైన చెప్పినట్టు సినిమా ఉద్దేశం ప్రేక్షకుణ్ణి కధలో లీనం అయ్యేలా చెయ్యటం అయితే, ఈ సినిమాకి ఆ విషయంలో వందమార్కులు. ఆకట్టుకునేలా తీసాడు కాబట్టే ఇన్ని విమర్శలు. చెప్పాల్సిందంతా మన మిత్రులు ఎప్పుడో చెప్పేసారు కాబట్టి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. ఆ లావెట్రీ సీను మినహాయిస్తే సినిమా అద్యంతం కట్టిపడేస్తుంది. మన దేశం పరువు పోయింది అని ఇంత గొడవ చేసిన ఈ పెద్దమనుషులు ఒక రెండేళ్ళు పోయాక మిగతా అన్ని సినిమాల్లాగే ఈ సినిమా పేరు మర్చిపోయి, పేరు గుర్తు రాక బుర్ర గోక్కోవడం ఖాయం. నా ఉద్దేశం ఏమిటంటే ఇది మంచి సినిమా అంతేగాని చరిత్రలో నిలిచిపోయే సినిమా ఏమీ కాదు. దేశం పరువు గురుంచి ఆందోళన అనవసరం.ఈ సినిమాలో చిన్నపిల్లల నటన అద్భుతం. చిన్నపిల్లల నటనని పరమ కృతకంగా చూపించే మన దర్శక మహానుభావులు చూసి నేర్చుకోదగ్గ విషయం.




Sunday, February 15, 2009

మా ఇంటి కధ

దాదాపు రెండేళ్ళుగా నా ప్రమేయం లేకుండా, దానంతటదే వాయిదా పడుతూ వస్తున్న పనొకటుంది. ఊళ్ళో ఉన్న మాఇంటిని పడేసి, తిరిగి కట్టించడం.దాదాపు ఇరవై యేళ్ళ క్రితమే మేము ఇంకొక ఇంటిని కట్టుకున్నా ,అది ఊరి సెంటర్లో ఉండటంవల్లా, ఆ వాహనాల దుమ్మూ, ధ్వని కాలుష్యాల కారణంగా తమకు నివాసయోగ్యం కాదని తేల్చేసారు మా ఇంట్లోవాళ్ళు. దాన్ని అద్దెకిచ్చి ఈ పాత ఇంట్లోనే ఉండటానికి మరొక ముఖ్యమైన కారణం దాదాపు ముప్పైయేళ్ళపైబడిన ఇరుగు-పొరుగు పరిచయాలు.

నిజానికా ఇంటిని మాతాత దాదాపు అరవై యేళ్ళ క్రితం కట్టించాడట. ఒక గది, దాన్నానుకొని ఒక వంటగది. వెనకనున్న ఖాళీ జాగాలో స్నానాదులకోసం ఒక బాత్రుం.ఆ రోజుల్లోనే వాటిని 20 రోజుల వ్యవధిలో నిర్మించారట ఆ నెల్లూరు నుంచొచ్చిన కూలీలు. అదొక రికార్డు. నిజానికి వాళ్ళని మావూళ్ళొ ఎవరో మోతుబరి ఇల్లు కట్టించుకోవటానికి నెల్లూరు నుంచి పిలిపించాడట. వాళ్ళు ఆ పని పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం లో ఉండగా మా తాత కళ్ళబడటం, మంచి పనివారనే నమ్మకం కారణంగా, ఈయన వాళ్ళని కాళ్ళావేళ్ళా బ్రతిమాలి, ఒప్పించి, ఈ ఇల్లు కట్టించడం. పని సగంలో ఉండగా వాళ్ళకి వాళ్ళ ఊరిమీద, ఇంట్లోవారి మీద గుబులు పుట్టినా, పని ఒప్పుకొని మాట ఇచ్చాక మాట తప్పేరోజులు కాకపోవటం వల్ల ,పాపం అందరూ రోజూ దాదాపు 18 గంటలు కష్టపడ్డారట. పొద్దున్నే నాలుగింటికి పని మొదలెట్టి, గుడ్డివెలుతురైనా రాత్రి దాదాపు పదింటి వరకూ పనిచేసేవారట. ఇప్పటికీ ఇంటి మధ్యగదులు రెండూ చాలాపటిష్టం గా ఉంటాయి. కాలక్రమేణా మా నాన్న ముందున్న ఖాలీ జాగాలో పంచ కట్టించి, మధ్యగదినానుకొని వారగా ఇంకొక గది కట్టించి, మేడ మీదికి మెట్లూ, మరికొన్ని మార్పులు చేర్పులూ చేసి ఇంటికి ప్రస్తుతమున్న రూపు తీసుకురావటం జరిగింది. అయితే ఈ మార్పులన్నీ ఇంతకు ముందున్న ఇంటికి అతుకులే కాబట్టి, కాలక్రమేణా ఆ అతుకులు బలహీనపడి, ఎప్పుడైనా విపరీతంగా వర్షం కురిస్తే ఇల్లు కురవడం ప్రారంభించింది. కొత్త ఇంటికి మారడం కుదరదని నిశ్చయమయ్యాక ఈ ఇంటిని మొత్తం పడగొట్టి తిరిగి కట్టించడం గురించి మా నాన్న నాకు స్పష్టం చెయ్యడం జరిగింది.

నిజానికి నేను ఆ ఇంటినీ నన్నూ ఎప్పుడూ వేరు చేసుకొని చూడలేదు. అందువల్ల ఒక సంవత్సర క్రితం ఇండియా వెళ్ళినప్పుడు, చేయాల్సిన పనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ళంతా ఒకసారి పరికించి చూసుకుంటే, మనసంతా ఏదో అలజడి. ఎన్ని జ్ఞాపకాలూ! ఒకటా రెండా? నేను నడక నేర్చిన బండలూ, నేను పుట్టినప్పటి నుంచి నా ఎదుగుదలకి సాక్షీభూతాలయిన ఆ గదులూ,గోడలూ, భగవంతుడనేవాడు నాకు పరిచయమైన పూజగది, చిన్నప్పడు మేమాడుకున్న ఎన్నో ఆటలకి వేదికైన మిద్దె.... ఇవన్నీ నాకు పరిచయం లేని కొత్తరూపు సంతరించుకుకోవడానికి నామనసొప్పుకోవడంలేదు. రాత్రి పడుకున్నా నిద్ర పట్టలేదు. గది పైకప్పూ, చూట్టూ ఉన్న నాలుగు గోడలూ, తలుపులూ, కిటికీలూ అన్నీ నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్లు ఏవేవో ఊహలు. తెలిసీ తెలిసీ జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోబోతున్నట్టు తెలీని బాధ.

ఇంకో రెండురోజుల్లో హైదరాబాదు పయనం, అక్కడినుంచి ఒక వారంలో అమెరికాకి. ఇక ఇంటిని ఇలా చూడడం ఇదే ఆఖరు.బహుశా వేసవి లో పని మొదలు కావచ్చు. పని మొదలయ్యే సమయానికి నేను ఇక్కడుండక పోవటం ఒకరకం గా మంచిదే. నాముందే వాళ్ళు ఇల్లంతా కూలగొడుతుంటే చూడటం నావల్లయితే కాదు

పొద్దున లేచి, టిఫిన్ చేసాక నేను చేసిన మొట్టమొదటిపని నా హేండీకేం లొ ఇల్లంతా వీడియో తీయటం. బహుశా నేను ఆ కేమెరాని కొన్న కొత్తల్లో కూడా అంత శ్రద్దగా దేన్నీ వీడియో తీసుండను. మనసంతా ఏదో చెప్పలేని ఉద్విగ్నతకి లోను కావటం వల్ల నిశ్శబ్దం గా పని పూర్తి చేసాను, సౌండ్ మిక్సింగు తరువాత చేసుకోవచ్చులే అని.


ఇక నా హేండీకాం హడావిడి చూసి, ఆరోజు సాయంత్రం నా చెల్లాయి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు మా అమ్మని అడిగింది "అమ్మా చిన్నన్నయ్య ఈ ఇంట్లో పుట్టాడా లేక హాస్పిటల్లోనా?" అని. నిజానికి మానలుగురు పిల్లల్లో మా చెల్లాయొక్కతే హాస్పిటల్లో పుట్టింది.మేమంతా ఇంట్లోనే పుట్టాం. విషయంలోమా చిన్నప్పుడు చెల్లాయి నేను వాదులాడుకునే వాళ్ళం . తనేమో "నువ్వు ఇంట్లోనే పుట్టావు నేను హాస్పిటల్లో" అని మా గొప్పగా చెప్పుకునేది.నేను చిన్నబుచ్చుకోవటం ఇష్టం లేక మా అమ్మ నాతో "నువ్వు పుట్టింది కూడా హాస్పిటల్లోనేరా" అనేది. అలా అలా అది నాకొక సందేహంగా ఉన్నా, నేను దాన్ని ఎన్నడూ నివృత్తి చేసుకోలేదు. అయితే ఈసారి చెల్లాయి అడిగినదానికి నాకు అమ్మనుంచి కచ్చితమైన సమాధానం దొరికింది.

రోజూ రాత్రి రెండింటి దాకా టివీ చూసే అలవాటున్న నేను, ఆ రోజు పదింటికే టీవీ కట్టేసి, ఎన్నడూలేని విధంగా మధ్యగదిలో చెక్కబీరువా ముందు పక్కేసుకుంటుంటే వింతగా చూసింది మా అమ్మ.

Wednesday, February 4, 2009

నాకు రాజకీయాలంటే పరమ అసహ్యం ఎందుకంటే..

నా చిన్నప్పుడెప్పుడో ఒకసారి స్కూల్ నుంచి ఇంటికొస్తుంటే ఊరి సెంటర్లో పెద్ద గుంపు. ఎవరో అన్నారు "చీప్మినిస్టర్, చీప్మినిస్టర్" ( లేఖిని ఎఫెక్టు కాదు) అని. ఈ చీప్మినిస్టర్ అంటే ఎవరబ్బా అంటూ నేనుకూడా ఉత్సాహంకొద్దీ గుంపులోకి దూరా. ఇది అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య మాఊరొచ్చినప్పుడన్నమాట. ఆతరువాత సోషల్ సైన్సు లో చదువుకున్నా, శాసనసభ, ఎగువసభ, దిగువసభ, రెండింత మూడొంతుల మెజారిటీ, ఓటుహక్కు, ముఖ్యమంత్రీ, ప్రధానమంత్రి, రాష్ట్రపతీ, స్పీకరు ...మన్నూ మశానం అన్నీనూ. జనరల్ నాలెడ్జి కాంపిటీషన్లలో పాల్గొనేవాడిని కాబట్టి అన్నీ బట్టీపట్టా.....మొదటి ప్రధాన మంత్రీ, మొదటి మహిళా ముఖ్యమంత్రీ గట్రా...

నిజానికి రాజకీయాలంటే అనుభవంలో కొచ్చింది మాత్రం ఎంటీయార్ ముఖ్యమంత్రి అయ్యాకే. ఇద్దరు రాజకీయ నాయకులు తిట్టుకోవడం నేను చదివింది ఈయన హయాంలోనే(అప్పట్లో ఈ టీవీ లు ఇంతగా లేవులెండి). ఎంటీయార్, జలగం వెంగళరావు లు తెగ తిట్టుకొనేవారు అప్పట్లో. ఎవరు ఎవరినన్నారో గుర్తు లేదు గాని, " తంతే వెళ్ళి బంగాళాఖాతం లో పడతాడు" అని తిట్టేసుకున్నారు. ఇప్పటి స్టాండర్డ్స్ ప్రకారం ఇదస్సలు తిట్టే కాదు గానీ అప్పట్లొ మా మంచి వినోదం అందరికీ.

అప్పుడు మొదలయ్యిందండి నా ప్రస్థానం, రాజకీయనాయకులంటే మనలాంటి మనుషులే అనే (అమాయకపు) అభిప్రాయం నుంచి "అస్సలు వీళ్లు మనుషులా .. రాక్షసులా.." అని చీదరించుకునేంత వరకు...

నాకు గుర్తుండి ఛీ, ఛీ..ఛీ.. అనిపించిన కొన్ని....

ఇద్దరు సభ్యులతో మొదలెట్టి, మతాన్ని వాడుకొని, రధయాత్రలు చేసి, జనాల్ని రెచ్చగొట్టి, కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా సాగిన పార్టీ ప్రస్థానాన్ని చూసినప్పుడు....

బలపరీక్ష లో జయలలిత వ్యక్తిగత పంతాలకి పోయి ఒక్క ఓటు తేడా తో ప్రభుత్వాన్ని పడగొట్టి, వందల కోట్ల ప్రజా ధనం తో మళ్ళీ ఎన్నికలు జరిపించినప్పుడూ..

సోనియమ్మ సుపుత్రుడు హైదరాబాదు వచ్చినప్పుడు, ఆ కుర్రకుంక దృష్టి లో పడటానికి , తన పెద్దరికాన్ని మరిచి, తన నియోజక వర్గ ప్రజల ఆత్మ గౌరవాన్నీ, అన్నిటికీ మించి తన ఆత్మ గౌరవాన్నీ తాకట్టుపెట్టి, వాడి దృష్టి తన మీద పడితే చాలు అని, ఆ కారెనకాలే, పంచె ఊడి పోతున్నా, కండువా జారిపోతున్నా పట్టించుకోకుండా పరిగెత్తిన రాజకీయ నాయకుడిని చూసినప్పుడూ...

సోనియమ్మ ప్రధాని కావాలి అని "హైడ్రామా" నడిపించి, రోజుకో పుకారు పుట్టించి, చివరికామె, "చూద్దాం" అనగానే, అదేదో మహాప్రసాదం అని భావించి, దాన్ని కళ్ళకద్దుకొని, "మేడం ఒప్పుకున్నారహో" అని, వయసుమరిచి, మన ఎంపీలు చాలా మంది, పార్లమెంటులో , టీవీ కేమెరాలముందు సినిమా స్టెప్పు లేయడం చూసినప్పుడూ..

బిల్ క్లింటన్ పార్లమెంటు లో ప్రసంగించిన తరువాత ఆయన షేక్ హేండ్ కోసం ఎంపీలు ఎగబడినప్పుడూ ..

ఖైరతాబాదు ఫ్లైఓవర్ మీద మండుటెండలో, నిండు వేసవిలో, మిట్టమధ్యాహ్నం, ఆ వాహనాల పొగ పీలుస్తూ, ఎవడో "పెద్ద మనిషి" ఆ దారెంట వెడుతున్నాడని నన్నూ, నాతో పాటు వందలాది మందిని ఆపేసి నప్పుడూ..

రోజువారీ జీతం మీద సినిమా హాల్లో పార్కింగ్ టికెట్లిచ్చే వ్యక్తిని "ఎవడ్రానువ్వు, నీ అంతు చూస్తా" అంటూ ఆ అర్భకుడి మీద నలుగురిముందు తన ప్రతాపం చూపిన ఖద్దరు శాల్తీ ని చూసినప్పుడూ..

గత నాలుగేళ్ళ నుంచి అసెంబ్లీ సమావేశాలని చూసిన ప్రతిసారీ..

ఈ తొడ కొట్టడాలూ, మీసం మెలేయడాలూ, గాల్లోకి ముద్దులూ, కంటి చూపు ప్రసంగాలు చూసినప్పుడూ..

ఆపార్టీ, ఈపార్టీ అని కాదు..
అప్పుడూ ఇప్పుడని కాదు ,
ప్రతిరోజూ, ప్రతిసారీ..
వాళ్ళని చూసినప్పుడల్లా
ఒకటే ఆలోచన..

"దేవుడా రక్షించు నాదేశాన్ని"..

Thursday, January 22, 2009

ఒక చలిలో వణికిన రాత్రి

పెద్ద పెద్ద మంచు మేఘాలు దూసుకొస్తున్నాయ్ మావైపు. వెదర్ ఛానల్ వారి ప్రకారం మంచు కురవడం రాత్రి తొమ్మిదింటికి మొదలవుతుంది. ఇక రేపొద్దున ఆఫీసు కి టైము కి చేరుకోవాలంటే ఎంతైనా ఒక అరగంట ముందు లేవాల్సిందే. నిద్ర లేవగానే కిటికీ లోంచి చూస్తే ఎంత అందంగా ఉంటుందో, అంత నరకాన్నీ చూపిస్తుందీ మంచు బయటికి రాగానే. 2001 లో మొట్టమొదటి సారి నేను అమెరికాలో కాలుపెట్టినప్పుడు న్యూజెర్సీ లో ఈ చలి వాతావరణాన్ని , మంచు తుఫానుల్నీ చూసి అబ్బురపడిపోయినా, ఆజ్ఞాపకం అంతవరకే పరిమితం. పెద్ద చెప్పుకోదగ్గ సంఘటనలేమీ లేవు. ఆ ప్రాజెక్టు తరువాత తిరిగి ఇండియా వెళ్ళిపోయి మరలా 2003 జనవరి లో ఇదిగో యీ విస్కాన్సిన్ ప్రయాణం. ఆఫీసులో అందరూ విస్కాన్సిన్ చలి గురించి ఊదరగొట్టినా ఇదేమీ నాకు కొత్త కాదు అని ఫోజు కొట్టాను. అయినా నాజాగ్రత్తల్లొ నేనున్నాను. లెదర్ జాకెట్లూ, గ్లోవ్స్ , ధర్మల్ వేర్ గట్రా అన్నీ రెడీ గా పెట్టుకోవడం ద్వారా.

బొంబాయి లో విమానం రెండుగంటలు లేటు. దీని పుణ్యమా అని ఆమ్ స్టర్ డాం లో కనెక్టింగు విమానం కూడా గాల్లోకి ఒక రెండు గంటలు లేటు గా లేచింది. మినియాపోలిస్ లోని సెయింట్ పాల్ విమానాశ్రయం చేరే సరికి రాత్రి ఎనిమిదయింది. విమానం నేలమీదికి దిగినప్పటి నుంచి, అది గేటు వద్దకి వచ్చి, ఆగి, విమానం తలుపు తెరచుకొనేవరకు క్షణమొక యుగం గా గడిచింది నాకు. గేటు తెరుచుకోవడమే తరువాయి, నేను నా పద్దతికి విరుద్దం గా, "ఎక్స్క్యూజ్ మి,ఎక్స్క్యూజ్ మి" అంటూ జనాల కాళ్ళు తొక్కుకుంటూ, వాళ్ళు నావైపు విచిత్రం గా చూస్తున్నా పట్టించుకోకుండా, వాళ్ళు అడగకున్నా "నేను ఇంకొక పదిహేను నిమిషాలలో నా నెక్స్టు ఫ్లైట్ అందుకోవాలి" అంటూ వాళ్ళకి వివరణలిచ్చుకుంటూ గేటు వైపు దూసుకు పోయాను. నిజానికి తోమ్మిదింబావు కి నా చిట్టచివరి విమానం, విస్కాన్సిన్ లోని లక్రోస్ అనే ఒక చిన్ని కుగ్రామానికి. ఇమ్మిగ్రేషన్ పూర్తయ్యేసరికి దాదాపు గంట పట్టింది. ఈ గంట మనసు మనసులో లేదు నాకు. ఇమ్మిగ్రేషన్ ఆఫీసరు పాసుపోర్టు నా చేతిలో పెట్టడం తరువాయి, దూసుకుపోయాను లగేజి బెల్టుల వైపు. ఇక్కడ ఇంకొక సస్పెన్స్ సినిమా నాకు. నా లగేజీ తప్ప మిగతా వాళ్ళందరి లగేజీ తోందరగా వచ్చినట్టనిపించింది. కస్టమ్సు పూర్తి చేసుకొని , లగేజి ని మరలా నార్త్ వెస్టు వారి మొహాన పడేసి విమానాల రాకపోకలు చూపించే ఎలక్ట్రానిక్ తెరల వైపు పరిగెత్తాను. గేటు నంబరు సరిగానే చూసుకున్నా. కానీ ఆ తొందరలో బుర్ర పనిచెయ్యదు కదా! ఆసాంతం సరిగానే వెళ్ళినా చివర్లో కుడివైపుకి తిరగాల్సింది ఎడమవైపుకి తిరిగి నాగేటుకి దూరంగా వెళ్ళిపోయా. ఈ పదినిమిషాల్లోనే నాపేరు రెండు సార్లు వినపడింది మైకులో "మహాశయా తొందరగా రండి ఇంకొక రెండు నిమిషాలలో గేటు మూయబడుతుంది" అని. అది విన్నప్పుడల్లా నా బీ.పీ ఇంకొక పది పాయింట్ల చొప్పున పెరుగుతూ పోయింది. చివరికి నాలిక్కరచుకొని వెనక్కి పరిగెత్తి నాగేటు దగ్గరికొచ్చేసరికి అక్కడున్న దొరసాని విమానాన్ని అప్పటికే గాల్లోకి పంపించి పక్కనున్న దొరబాబుతో కబుర్లాడుతూ కనిపించింది. నేను ఆమె ముందుకెళ్ళి బిక్కమొగం వేయడం, ఆమె కూడ నా దుస్థితికి కడు చింతించినదై, తరుణొపాయముగా రాత్రి పదిన్నరకి ఉన్న చిట్టచివరి ఫ్లైట్లొ నాపేరు చేర్చి, కొత్త బోర్డింగు పాసూ, ఒక పది డాలర్ల విలువగల ఫూడ్ కూపనూ నా చేతిలో పెట్టి, వాటికి ఒక చిరునవ్వుని కూడా జతచేసి, కళ్ళతొనే చెప్పేసింది ఇకనువ్వు నాముందు నుంచి దయచేయొచ్చు అని.

ఈసురో మంటూ ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాను. నాకింకా మింగుడు పడడం లేదు ఫ్లైటు మిస్సవడం అనేది. ఒక పదినిమిషాలు అలానే కూర్చొని బీ.పీ కాస్త తగ్గాక తినదగ్గదేమైనా దొరుకుతుందేమో అని బయలుదేరాను. నేను ఫక్తు శాకాహారిని కాబట్టి నాకు నచ్చిన ఫుడ్డు దొరకడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఏదో తిందామని బయలుదేరి, ఒక పిజ్జా ముక్కతో కడుపునింపుకొని వచ్చిన రోజులు కోకొల్లలు. కాబట్టి ఎప్పటిలానే పిజ్జా తిని నా గేటు వద్దకు వచ్చి కూర్చున్నా. ఈ పది పదిహేను నిమిషాలలొ నేను నావాచీ వైపు, ఎలక్ట్రానిక్ తెర మీదున్న నా ఫ్లైట్ నంబరు వైపు ఏ వెయ్యి సార్లో చూసుంటా.

ఎలాగూ రాత్రి భోజనం అయిపొయింది కదా, ఇక ఈ ఫ్లైట్ మిస్సుకాకుండా ఎక్కితేచాలు, నా గమ్యాన్ని చేరుకొని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోవచ్చు అనుకున్నా. నిజానికి అసలు కధ అప్పుడే మొదలవబోతోందనీ ఆక్షణాన నాకు తెలీదు.

పది గంటలప్పుడు నా ఫ్లైటు బోర్డింగు అనౌన్సుమెంటు చేసారు. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఒక్క క్షణం భయం వేసింది మళ్ళా నేను తప్పు గేటు దగ్గర కూర్చున్నానేమో అని. ఇక ఉపేక్షించి లాభం లేదని ఆ గేటు దగ్గరి అమ్మడి దగ్గరికెళ్ళి, కన్ఫమ్ చేసుకొని,ఆమె చింపి ఇచ్చిన బోర్డింగు పాసు తాలూకు ముక్క లో సీటు నంబరు చూసుకుంటూ ముందుకుకదిలాను. గేటు దగ్గర ఎయిర్ హొస్టెస్ చిరునవ్వుతో పలకరించింది. ఫ్లైటు లోపలికి అడుగుబెట్ట బోతూ ఉంటే నా తల ఆ ఫ్లైటు గుమ్మం పైభాగానికి కొట్టుకున్నంత పనైంది. అంత చిన్న ఫ్లైటు నేనెప్పుడూ ఎక్కలేదు. ఫ్లైటు లోపల కూడా అంతే.నిటారుగా నిలబడితే నాతల దాదాపు ఫ్లైటు పైకప్పుకి తగులుతోంది. ఇక ఫ్లైట్లో ప్రయాణికులకంటే క్రూ సంఖ్యే ఎక్కువ ఉంది. ఇద్దరు ప్రయాణికులు(నాతో కలిపి), ముగ్గురు క్రూ మెంబర్స్ మొత్తం అయిదుగురం అన్నమాట. అది ప్రొపెల్లర్ ప్లేన్. మన ఇంట్లో ఉండే టేబుల్ ఫేన్ సైజుకి ఒక ఐదారింతలు పెద్దగా ఉండే రెండు ప్రోపెల్లరులున్నై ప్లేన్ రెండు వైపులా. అయితే అటువైపు ఉన్న ప్రోపెల్లరు తిరుగుతోంది గానీ, నా వైపున్నది తిరగటం లేదు. పైలటు మర్చిపోయాడేమో. నాకేమో టెన్షను. మరుసటి రోజు ఈనాడు లో "అమెరికా లో విమానం కూలి ప్రవాసాంధ్రుని మృతి" అనేవార్త నాకళ్ళముందు మెదిలింది. దాన్నే చూస్తూ కూర్చున్నా. గేటు దగ్గరి నించి బయలుదేరి టేకాఫ్ కోసం రన్ వే మీదకు వచ్చేదాకా ఆ రెండో ప్రొపెల్లర్ అలానే ఉంది నిశ్చలంగా. ఇక టేకాఫ్ అనవున్సు చేసాక అది తిరగడం ప్రారంభింది. అమ్మయ్య గండం గడిచింది అనుకున్నా నేను. (బహుశా ఇంధనం వృధా కాకుండా ఉండటానికి అలా చేస్తారనుకుంటా. )

రాత్రి పదకొండింటికి లక్రోస్ లో దిగాను. నేను ఫ్లైటు మిస్సయినా నా లగేజీ మాత్రం మిస్సవకుండా అంతకుముందు ఫ్లైటులోనే నాకంటే ముందుగానే చేరుకుంది. లగేజి క్లెయిం దగ్గర కాసేపు చూసి పక్కనున్న కౌంటర్ లో అడిగితే వారు సెలవిచ్చారు ఫలానా చోట మీ లగేజి దొరకొచ్చు అని. అక్కడికెళ్ళి దాన్ని తీసుకొని తోపుడుబండి మీద పెట్టుకొని టేక్సీ సర్వీసు తాలూకు ఫోన్లుండే చోటుకు చేరుకున్నాను. చేతిలో అడ్రసు రెడీ గా పెట్టుకొని, టేక్సీ సర్వీసుకి ఫోన్ జేసి, నేనెక్కడున్నానో, ఎక్కడికెళ్ళాలో వాడికి వివరించేసరికి తిన్న పిజ్జా ముక్క అరిగిపోయి శోష వచ్చినట్టయింది.

ఎయిర్ పోర్టు లోపలినుండే గాజు తలుపుల గుండా చూస్తూ టేక్సీ వాడికోసం వెయిటింగు. చిన్న ఎయిర్ పోర్టు కాబట్టి టేక్సీ వాడంటూ వస్తే నాకోసమే అన్న ధైర్యం తో లోపలేఉన్నా. బయట పసుపు రంగు టేక్సీ కనపడటం తరువాయి , కార్టు తోసుకుంటూ బయటికొచ్చాను. చర్మాన్ని కోసేస్తున్న రీతిలో చల్లటిగాలి విసురుగా తగిలింది మొహానికి. చలిగా ఉంటుందని అనుకున్నాగాని మరీ అంత చలి ఉంటుందనుకోలేదు. గబగబా లెదర్ జాకెట్ జేబుల్లో కుక్కుకొన్న చేతి గ్లౌజులు తొడుక్కొని టేక్సి దగ్గరకెళ్ళేసరికి కార్లో కూర్చొనే ట్రంక్ ఓపెన్ చేసి లగేజి అక్కడపెట్టు అన్నట్టు సైగ చేసాడు టేక్సీ డ్రయివరు. నా లగేజీ మొత్తాన్ని అందులో సర్దేసరికి చుక్కలు కనిపించాయి నాకు. వచ్చిందాంతో ఇండియాలో హాయిగా పడుండక ఈ పరాయి దేశంలో ఈ చలిలో ఈ పాట్లేమిటిరా బాబూ అని ఏ వందసార్లో అనుకున్నా. ఇక టేక్సీ లో కూర్చోగానే మాట్లాడే ఓపిక లేక అడ్రసు కాగితాన్ని డ్రయివరు కందించా. ఆ చలికి దిమ్మ తిరిగిపోయి, డ్రయివరు తో కనీసపు పిచ్చాపాటీ కి కూడ ఓపిక లేక, అది పద్దతి కాదని తెలిసినా బయటికిచూస్తూ కూర్చుండిపోయాను. దాదాపు రాత్రి పన్నెండింటికి టేక్సీ నేనుండాల్సిన అపార్ట్మెంటు ఆవరణలోకి ప్రవేశించింది. నేను దిగాల్సిన బ్లాకు ముందు టేక్సీ ఆపి నావైపు చూసాడు డ్రయివరు. ఆయన తీరు చూస్తే టేక్సీ దిగి నాకు సహాయం చేసేలా అనిపించలేదు. ఎయిర్పోర్టు నుంచి ఇక్కడిదాకా ఏమీ మాట్లాడకుండా మూగమొద్దులా కూర్చున్నందుకు బదులు తీర్చుకుంటున్నాడేమో అనిపించింది.

ఆయన కివ్వాల్సిన డబ్బులు ప్లస్ టిప్ యిచ్చేసి, జైవీరాంజనేయా! అంటూ దిగి నా లగేజీ మొత్తం కిందకి దింపేసరికి ఈసారి ఆ చుక్కలమధ్య ముక్కోటిదేవతలు కూడా కనిపించారు. చిమ్మ చీకటి. అంత చీకట్లోను తెల్లగా మెరుస్తూ పెద్ద పెద్ద మంచుకుప్పలు. లగేజి అక్కడేపెట్టి మెయిన్ డోరు వైపు కదిలాను. నిజానికి ఆ డోరుకూడా లాక్ చేసిఉంటుంది. కానీ ఆ సమయంలో నాకా ఊహేలేదు. లోపలికెళ్ళి నేను ఉండాల్సిన అపార్ట్మెంటు గ్రవుండ్ ఫ్లోర్ (ఇక్కడ ఫస్ట్ ఫ్లోరంటారు) లోనే ఉండటంతొ చాలా సంతోషించా. లేకుంటే అంత లగేజి ని మెట్లమీద మోసుకెళ్ళడమంటే అంత ఈజీ కాదు. అపార్ట్మెంటు నంబరు సరిచూసుకొని డోరు కొడితే లోపలినించి ఉలుకూ పలుకూ లేదు. నేనువస్తున్నానని నా కాబోయే రూమ్మేటు కి ముందే మా ఆఫీసువారు ఉప్పందించారు కదా, మధ్యలో ఇదేమిట్విస్టు రాబాబూ అనుకొని అలా ఒక ఐదు నిమిషాలు కొడుతూనే ఉన్నా.ఎంతకీ సమాధానం లేకపోయేసరికి నా వెన్ను జలదరించింది. ఇదేమి ఖర్మ రా బాబూ, నేనురావటం లేటయ్యేసరికి ఈయనగారు ఎదురుచూసి, ఇక ఈరోజురాననుకొని ఏ ఫ్రెండింటికో వెళ్ళిపోయాడేమో! ఇంకాసేపు ట్రై చేద్దామని అలా కొడుతూనే ఉన్నా. ఆయన ఇంట్లో ఉండకపోవచ్చు అనే ఊహ ని ఒప్పుకోవడానికి నా మనసు ఏమాత్రం అంగీకరించటం లేదు. ఇంకొక ఐదు నిముషాలు గడిచేసరికి నాకు అప్పుడు గుర్తొచ్చింది నా లగేజీ అంతా అలా ఆరుబయట వదిలేసొచ్చానని. ముఖ్యంగా నా పాస్ పోర్టు, హెచ్-1 పేపర్లూ. దీని సంగతి తరువాత ముందు అవి ముఖ్యం అనిపించింది. వడి వడిగా మరలా మెయిన్ డోరు దగ్గరకొచ్చి బయటికి రాబోతుండగా అప్పుడు వచ్చిందా ధర్మసందేహం,ఈ డోరుకి లాకుందా లేదా అని. అంతకుముందు వచ్చినోళ్ళు డోరు సరిగా క్లోజు చెయ్యలేదేమో? ఒకవేళ నేను బయటికి వెళ్ళి డోరు వేయగానే అది లాకయితే? ఆ చలిలో నాగతేం గాను? చేతిలో సెల్ ఫోన్ లాంటివేమీ లేవు. ఉంటే ఇన్నితిప్పలుండవుకదా? ఇప్పుడేమిచేయాలి? డోరు ని వదిలేయకుండా మరలా జాగ్రత్తగా లోపలికొచ్చి డోరుని నెమ్మదిగా మూసాను. ఈసారి డోరుహేండిల్ ని తిప్పకుండా డోరుని నెట్టాను. తెరుచుకుంది. దానర్ధం లాకు లేనట్టేగా? ఎందుకో నమ్మకం కుదరలేదు. డోరుని నెమ్మదిగా వదిలేస్తే అది పూర్తిగా మూసుకోకుండా లాకుకు కొద్దిదూరంలో ఆగుతోంది. సరే అనుకొని ధైర్యం గా బయటికి వచ్చి, డోరుని అలానే పట్టుకొని ముందు ఏమైనా రాయి రప్ప దొరుకుతుండేమో అనిచూసా ఆ చీకట్లో. చివరికి అదృష్టానికి కూడా నోచుకోలేదు నేను. సరే అని దేముడి మీద భారం వేసి డోరుని నెమ్మదిగా వదిలి, తెరుచుకుంటుందోలేదో సరిచూసుకొని, మరలా రెండోసారి అలానే వదిలి నా లగేజిదగ్గరకొచ్చి కేబిన్ బేగ్ తీసుకొచ్చి ఆ డోరు దగ్గరకొచ్చా. కొద్దిగా భయంగానే ఉన్నా, అదృష్టం నా పక్షాన ఉండటంతో ఆ డోరు ఓపెన్ కావటంతో నా బేగ్ ని దానికి అడ్డం పెట్టి ఒకపెద్ద సూట్కేసుని లోపలికి తీసుకొచ్చా. ఎంత గ్లవుజులున్నా ఆ చలికి నా చేతివేళ్ళు కొంకర్లు పోతున్నాయి. మొహం మొద్దుబారి పోయింది. చేతులతో ఒక్కసారి బుగ్గల మీద రుద్దుకుంటే అస్సలా స్పర్శే లేదు. ప్రయాణంలో నా లగేజీ మొత్తాన్ని ఒకటికి పదిసార్లు చూసుకొనే అలవాటున్న నాకు, ఈ ఒక్కసూట్కేసు, నా పాస్ పోర్టు, హెచ్-1 పేపర్లు చాలు ఇక మిగతా లగేజి ఎటుపోయినా నాకనవసరం, ఇక లోపలే ఉండిపోదాం అన్నంత విరక్తి కలిగింది ఆఒక్క సూట్కేసుని లోపలికి తెచ్చేసరికి. కాసేపు లోపలే ఉండి తమాయించుకొన్నాక ఎలాగోలా నా లగేజీ మొత్తాన్ని నా అపార్ట్మెంటు ముందు పెట్టుకున్నా.ఈసారి ఎవరేమనుకుంటే నాకేమని నా అరచేయి మొత్తం డోరుకితగిలేలా ధబీ దభీ మని కొట్టా. ఊహు. లాభం లేదు. నా కొట్టుడికి ఆ వరండా మొత్తం ప్రతిధ్వనిస్తోంది గాని లోపలి నించి ఏ సమాధానం లేదు. ఇక ఆ వరండా ఆ రాత్రి పడుకోవటానికి వీలుగా ఉంటుందా అని చూసా. ఇరుకుగా ఉండటమేగాక, అంతకుముందు ఆందరూ అక్కడ నడిచిన కారణాన అక్కడక్కడ నల్లటిమురికిమంచు.

"మినియాపోలీస్ ఎయిర్ పోర్టు లో ఉన్నప్పుడే, ధేభ్యం మొహం వేసుకొని వెయిట్ చేయకుండా, కాస్త ఓపిగ్గా, ఫోన్ రిసీవ్ చేసుకొనే దాకా నీ మానేజరుకి అదేపనిగా ఫోన్ చేసుంటే ఈ బాధలుండేవికాదుగా? ఎందుకు రా ఎదుటిమనుషులమీద నీకంత అతి నమ్మకం? నీవేదో వీ.ఐ.పీ వైనట్లు, ఆయన నీకోసమే చకోర పక్షిలా ఎదురుచూస్తూ ఉంటాడన్నట్లు ఏదో ఫీలైపోయావుగా? అనుభవించు" అని నా ఆత్మారాముడు తిట్ల దండకం అందుకున్నాడు. ఇక లాభం లేదు, నిండా మునిగాక చలేంటి అని పక్క అపార్టుమెంటు తలుపుతట్టా . లోపల భయం గానే ఉంది. ఆ తలుపు తీసేవాడు భయస్తుడైతే తలుపు తీసి, నా మంకీ కేప్, నా వాలకం చూసి దొంగేమో అనుకొని ఒక రెండురవుండ్లు కాల్చి ఆ తరువాత "ఊప్స్" అంటాడేమో అని. నా ఊహకి భిన్నంగా తలుపుతెరిచాడొక తొంభయ్యేళ్ళ ముసలాయన. చేతిలో గన్నులేదు. పైగా ఆయన వాలకం చూస్తుంటే నిటారుగా నిలబడడానికే సర్వ శక్తులూ కేంద్రీకరిస్తున్నట్లు అనిపించింది. యధావిధిగా అంత రాత్రివేళ నిద్రాభంగం చేసినందుకు ఆయనకి క్షమాపణలు చెప్పుకొని, నా బాధ చెప్పుకొని, మీరేమనుకోకపోతే మీ ఫోనొకసారిస్తే నేను నా ప్రాజెక్టు మానేజరుకి ఒక ఫోను చేసుకుంటా అన్నా.
ఆయనడిగాడు.
"లోకలా, లాంగ్ డిస్టెన్సా?"
"తెలీదు"
"నంబరేది?"
నాచేతిలో ఉన్న కాగితం అందివ్వభోయి, ఈయన దాన్ని కూడబలుక్కుని చదివేసరికి తెల్లారుతుందనుకొని, నంబరు మొత్తాన్ని పైకి చదివా. నా ఖర్మ కాలి అది మా మానేజరు మొబైల్ నంబరు. ఆయన నిజానికి కేలిఫోర్నియా వాస్తవ్యుడవటం తో అది లాంగ్ డిస్టెన్సు నంబరే.

నిజం చెప్పొద్దూ ఆయన పాపం కాస్త తటపటాయిస్తూనే అన్నాడు.

"పది డాలర్లవుతుంది"

"నో ప్రాబ్లెం". నేనున్న పరిస్థితికి పదేంఖర్మ, వందయినా ఇస్తా, బయటేమైనా మామూలు చలా? ప్రాణాలతో చెలగాటం.

మా మానేజరుకి ఫోన్ చేశా.

"హాయ్ నిర్మల్, నేను ఉమాశంకర్ని"

"ఏంటి ఇంకా ఇండియాలోనే ఉన్నావా?" ఆయన నిద్రమత్తు తెలుస్తూనే ఉంది గొంతులో.

"లేదు అపార్టుమెంటు దగ్గరున్నా"

"ఓ, వచ్చేసావా? సరే మరి రేపు ఆఫీసులో కలుద్దాం".

పైకి నవ్వుతూ, లోపల తిట్టుకుంటూ చెప్పా.

"ఇప్పుడు మీరు వచ్చి నాకు సహాయం చెయ్యక పొతే బహుశా రేపు మీరు నా డెడ్ బాడీ ని ఇండియా కి పంపాల్సొస్తుంది."

ఆయన వివరం అంతా కనుక్కొని, నేవస్తున్నా, అక్కడే ఉండు అని ఫోన్ పెట్టేసాడు.

ఈయన కి ధేంక్స్ చెప్పుకొని పది డాలర్ల నోటందించా. ఆయన దాన్నందుకొని, అప్పటికి నామీద తను జాలి చూపించాలి అన్నది నిర్ధారణ చేసుకొని, "నీక్కావాలంటే లోపలికి వచ్చి వెయిట్ చెయ్యి, బయట చలికదా" అన్నాడు. ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. పైగా నా ప్రాజెక్టు మానేజరు గొంతు వినగానే నాకు అప్పటికే వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది. ప్రేమలొ నిండా మునిగినోడికి ఒక పదిరోజుల తరువాత తన ప్రియురాలి గొంతు వింటే కలిగే అనుభూతి కంటే ఒక వెయ్యి రెట్లెక్కువ.

నిర్మల్ వచ్చాడు. నార్త్ ఇండియన్. కొంతమందిని మొదటిసారి కలవగానే " అబ్బా! వీడేమి శాడిస్టు వెధవ రా బాబూ" అనుకుంటాం . నిర్మొహమాటం, మాటలో కరకుతనం ఈయనకి నిత్యాలంకారాలు. కానీ వాటివెనుక ఉన్న అంతరార్ధం గ్రహించిన వారికి ఈయన అత్యంత ఆప్తుడు. మీదవేసుకొనే ముసుగు ఎంత పలచనైతే అంత దగ్గరవుతారేమో. ఆ రకంగా చూస్తే ఈయనసలు ముసుగు మనిషేకాదు.

రాగానే నాతో మాటమాత్రం మాట్లాడకుండా అపార్టుమెంటు డోరు దగ్గరికి దారితీసాడు నిర్మల్. ధబీ ధభీ మనికొట్టాడు. ఊహూ. సరే లాభం లేదని బయటికివెళ్ళి అపార్టుమెంటు వెనకవైపు నుంచి, లివింగు రూము లోపి దారితీసే గాజు తలుపుల లోంచి కళ్ళు చికిలించి చూశాడు. ఆ గుడ్డి వెలుతురులో ఆయనకేం కనపడిందో, చిన్నగా నవ్వుకుంటూ ఇవతలికొచ్చాడు. నేనడిగాను ఏమిటీ అని?

సమాధానం చెప్పకుండా కుడిచేతి గుప్పిటమూసి , థంప్స్ అప్ లాగా బొటనవేలిని పైకి లేపి చేతిని పైకీ కిందకీ ఆడించాడు. అర్ధం అయింది. గురుడు లోపల మందుగొట్టి కలలో దేవకన్యలతో విహరిస్తున్నాడన్నమాట. సరేగానీ, ఏమిటీ?, నారూమ్మేటు తాగుబోతా? హతవిధీ..

నిజానికి నా రూమ్మేటుది మా కంపెనీ కాదు. అనుకున్న టైముకి ఇక్కడ అమెరికా లో ఎవరూ దొరక్క, ఇక్కడ దొరికిన వేరే కంపెనీ వాణ్ణి పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడు నేను దొరికాను కాబట్టి మాకంపనీ కి డబ్బులు (ఎక్కువ)మిగలాలంటే వీణ్ణి సాగనంపి ఆ స్థానం లో నన్ను కూర్చోబెట్టాలి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎలాగూ వెళ్ళిపోతున్నాముకదా అని "సహాయ నిరాకరణ" ని మనసా వాచా కర్మణా తు.చ తప్పకుండా పాటిస్తారు చాలామంది. నాకెందుకో ఈ తాగుబోతు రూమ్మేటు సహాయ నిరాకరణ లో ఆరితేరి ఉంటాడనీ, ఇక ఆఫీసులో నాపని గోవిందో గోవింద అనుకున్నా.

ఇక లాభం లేదని నిర్మల్ తన ఇంటికెళ్ళి అపార్టుమెంటు తాలూకు డూప్లికెటు తాళాల్ని తీసుకొచ్చాడు. ఇద్దరం లోపలికెళ్ళి గురుడు పడుకున్న బెడ్రూం లోకెళ్ళాము. ఎక్కడా కనపడడే. తీరా చూస్తే మంచానికి, క్లోజెట్ కి మధ్యలో ఉన్న ఇరుకైన ప్రదేశంలో బోర్లా పడుకొని ఉన్నాడు. నాకైతే డౌటు, పాపం మంచం మీద నుండి పడుంటాడని. నిర్మల్ "ఊహు" అన్నాడు. బహుశా ఆయనేకైనా పూర్వానుభవం ఉందేమో గురుడితో. రూములో డ్రెస్సింగు టేబిలు మీద సింబాలిక్ గా ఖాళీ మందు సీసా(ఇంక సింబాలిక్ ఏంటి నా మొహం). అదిచూసి ఓహో ఇందాక బయటినుంచి ఈ సీసాని చూసే నిర్మల్ కన్ ఫం చేసుకున్నాడేమో అనుకున్నా.

చిన్నఫ్ఫటినుంచి నాకు తాగేవారంటే భయం. దీనివెనకో భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. నేను మూడో తరగతి చదివేటప్పుడు ఒకతాగుబోతాయన నేను స్కూలుకి వెళుతుంటే నా వెంటపడటం, నేను ఆ భయం తో నూటొక్క డిగ్రీల జ్వరంతో మంచమెక్కి, రోజూ రాత్రుళ్ళు పక్క తడపటం. ఇంకెప్పుడు స్కూలుకి ఆదారెంట వెళ్ళలేదు. ఆదెబ్బతో నాకు తాగేవాళ్ళంటే అదో ఫోబియా పుట్టేసుకుంది. వాళ్ళలో మంచి వాళ్ళుంటారనే నిజాన్ని నా బుర్ర అస్సలు ఒప్పుకునేదికాదు.

నా రూమ్మేటు గురించి ఇంత మంచి అభిప్రాయం నాలో ఏర్పడ్డాక ఆరాత్రే డిసైడు చేసుకున్నా ఇక ఆఫీసులో ఒంటరిగానే పోరాటం సాగించాలి, వీడి మీద ఆశ పెట్టుకోవటం వేస్ట్ అని.

ఇక ఆరాత్రి నేను లివింగు రూములోనే సోఫాలో ముడుక్కొని పడుకున్నా రేపొద్దున్నే చూడాల్సిన నా రూమ్మేటు మొహం తలుచుకుంటూ. నేను పొద్దున్న లేచేసరికి ఎనిమిదయింది. లీలగా నారూమ్మేటు ఆఫీసుకి రెడీ అవటం తెలుస్తూనే ఉంది. అలానే మత్తుగా పడుకున్నా. కాసేపాగి చూస్తే టైము పది. ఉలిక్కిపడి లేచా. మొదటి రోజే ఆఫీసుకి లేటు గావెళితే క్లైంటు ఏమనుకుంటాడొ అనుకుంటూ రెడీ అవుతుంటే ఫోనుమోగింది.

"హాయ్, నాపేరు రమేష్, మీ రూమ్మేటు ని"
"హాయ్ రమేష్"
"రాత్రి బాగా నిద్ర పట్టిందా?"
ఆబ్బా, ఎకసెక్కాలు కూడానా అయ్యగారికి అనుకున్నా. పైకి మాత్రం....
"ఓ, యా"
"సరే, నేను నిర్మల్ కి ఆల్రెడీ చెప్పా, లేటయిందని కంగారు పడొద్దు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పికప్ చేసుకుంటా. ఇంకాసేపు నిద్ర పోతారా?"
"లేదు, మరీ లేటయితే బాగోదు. ఇంకొక అరగంటలో రాగలరా?"

అరగంటలో ఠంచనుగా నా ముందు ప్రత్యక్షమయ్యాడు రమేష్.

రాత్రి నేనూహించుకున్న రూపానికి పూర్తిగా విరుద్దం. రాగానే నవ్వుతూ చెయ్యి ముందుకు చాపాడు "హాయ్" అంటూ..

అప్రయత్నంగా చేయికలిపాను.

"i am really sorry about last night. నిజానికి మీకోసం పదింటిదాక ఎదురుచూసా, మీకోసం డిన్నర్ కూడా ప్రిపేర్ చేసా. ఎదురు చూసి చూసి ఇక రారేమోననుకొని.. అంటూ ఆగిపోయాడు.

రాత్రి పడ్డ కష్టాన్నంతా పక్కనబెట్టి, " సహాయ నిరాకరణ" ని దృష్టి లో పెట్టుకొని, ముఖం మీద నవ్వు పులుముకొని అన్నాను.

"పర్లేదు."

ఆతరువాత రమేష్ తనున్న వారం రోజులు నాకు చేసిన సహాయం నాకు అతని మీదున్న నెగటివ్ ఆలోచనల్ని సమూలంగా కాలరాయటమే కాకుండా, నిజం గా చెప్పాలంటే తన గురించి అలా ఊహించుకున్నందుకు నన్ను అనుక్షణం సిగ్గు పడేలా చేసింది. ఏదడిగినా విసుక్కోకుండా చెప్పడం, సాయంత్రం ఐదింటికి తను ఇంటికి వెళ్ళగలిగి ఉన్నా, నాకోసం, తను వెళ్ళాక నాకు ప్రాజెక్టు లో ఏ ఇబ్బంది ఎదురవకుండా ఉండటానికి, రాత్రి పదింటివరకూ ఉండి అన్ని వివరాలూ చెప్పటం... నిజానికి మా సొంత కంపనీ వ్యక్తులు కూడ అంత శ్రద్ద తీసుకోరేమో.. Hats-off to him.


ఆతరువాత తను ప్రాజెక్టు వదిలి వెళ్ళినా ఒక రెండు సంవత్సరాలవరకు కనీసం వారానికొకసారి మాట్లాడుకునేవాళ్ళం. ఆ తరువాత కారణమేదీ లేకుండానే గేప్ రావడం, అలా అలా నేనూ నా పనిలో పడి తనని మర్చిపోవటం జరిగింది. కొన్ని స్నేహాలంతే. రమేష్ కి "బాబాయ్" అనేది ఊతపదం. సరదాగా నన్నలాగే పిలిచేవాడు. ఇప్పటికి బాబాయ్ అనేపదం వినపడితే వాడే గుర్తొస్తాడు.

ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, కొలీగ్స్ గానీ ఇండియా నుంచి వస్తున్నారనే కబురు నా చెవిన పడితే వాళ్ళు ఎయిర్ పోర్టు నుండి ఇంటికి రావటానికి సరైనా ఏర్పాట్లు చేసుకున్నారా లేదా అని వాకబు చేస్తా. ఇండియా నుంచి మొదటిసారి వస్తున్న వాళ్ళయితే ఇంకాస్త జాగ్రత్తగా... ఆ అనుభవం అలాంటిది మరి..

ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ

న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో.  (తెలియని వారికి: అమెరికాలో...