Sunday, January 18, 2009

టెన్నిస్ పండగ మొదలయిందోచ్!

దాదాపు గత ఇరవై రోజులుగా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. 2009 లో మొట్టమొదటి గ్రాండ్ స్లాం టెన్నిస్ టొర్నమెంటు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఈరోజే మొదలు. నేను ఎప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేది రెండు సందర్భాల్లోనే. ఒకటి టికెట్లు బుక్ చేసాక ఎదురుచూసే ఇండియా ప్రయాణం అయితే, రెండోది ఈ నాలుగు గ్రాండ్ శ్లాం టొర్నమెంట్లు. ఒక టొర్నమెంటు అయిపోగానే వెంటనే తరువాతి టోర్నమెంటు ఎప్పుడు ఉందా అని చూసుకుంటా. ఊహ తెలిసాక క్రికెట్ నేను మొదట్లో అమితంగా ఇష్టపడ్డ ఆటైనా, ప్రస్తుతం ఆ ఆటంటేనే మొహమ్మొత్తే స్థితి కొచ్చేశా. అదేమి ఖర్మో గానీ ఇండియాలో క్రికెట్ ఆట కంటే దాని చుట్టూరా ఉండే వాటిమీద చర్చ ఎక్కువ జరుగుతుంది. ప్రతి సీరీస్ కి ముందు సెలక్టర్లు ఎవర్ని పక్కన పెడతారా అనో (ఎవర్ని తీసుకుంటారా అని కాదు), టీములో ఎవరెరికి పడదు అనో, ఏ క్రికెటరు ఏ అమ్మాయి తో తిరుగుతున్నాడనో, బోర్డు రాజకీయాల గురించో, ఇలాంటి పనికిమాలిన విషయాలమీద తప్ప ఆట గురించి ఎవరూ అంత పట్టించుకున్నట్టు కనపడదు. ఇవి ఎంతవరకు వచ్చాయంటే మొన్నెప్పుడో సెలక్టర్లు ఫోన్ చేస్తే ధోనీ ఆ ఫోన్ కాల్ ఎందుకు రిసీవ్ చేసుకోలేదో అని జాతీయ మీడియా దానిమీద కధనాలు ప్రచురించేటంత. సిగ్నల్ లేక ఫోను రిసీవ్ చేసుకోలేదని మన ధోనీ సెలచిచ్చుకున్నాడట. గెలిస్తే సంబరాలు చేసుకోవడం, ఓడితే తిట్టుకోవడం. వ్యక్తిగతం గా అమోఘమైన రికార్డులు, ఒక టీముగా క్షమించరాని విధంగా విఫలం. ఇంతకంటే చెప్పుకోవడానికేమీ లేదు. అందుకే క్రికెట్ ని చూడడం ఎంతగా తగ్గించేసానంటే, ఇప్పుడు నాకు ఆటగాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు "ఈనాడు" దయవల్ల. ఆమాత్రం తెలుసుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది, కానీ ఎందుకో ఆట కోసం కాకున్నా ఒక భారతీయుడిగా నా మూలాలు ఏవిషయంలో కూడా తెంపుకోవడం ఇష్టం లేదు కాబట్టి మాత్రమే ఈమాత్రపు ఆసక్తి.

నిజానికి టెన్నిస్ మీద ఆసక్తి నాకు క్రికెట్ కంటే ముందే మొదలయిందనుకుంటా.క్రికెట్ మీద ఆసక్తి రిలయన్స్ కప్ టైము(1987) లో మొదలయితే, అంతకు ఒక రెండుమూడేళ్ళ ముందే టెన్నిస్ చూడటం మొదలెట్టా.మిగతా గ్రాండ్ శ్లాం టోర్నమెంట్ల సంగతేమో గానీ అప్పట్లో దూరదర్శన్ లో ప్రతిసంవత్సరం వింబుల్డన్ ని మాత్రం ఠంచనుగా చూసేవాడిని. 1989 లో మైఖేల్ చాంగ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుపు, 1987 వింబుల్డన్ లో ఇవాన్ లెండిల్ మీద పాట్ కాష్ గెలుపు నాకిప్పటికీ గుర్తుండే జ్ఞాపకాలు.

ఇక ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ విషయానికొస్తే ఎన్నడూ లేనివిధంగా పురుషుల విభాగంలో గానీ, మహిళల విభాగంలో గానీ విజేత ఎవరో ఊహించటం కుదరక టెన్నిస్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకు ముందు కనీసం పురుషుల విభాగంలో కొద్దిపాటి స్పష్టత ఉండేది ఫెడెరర్ రూపంలో. కానీ 2008 లో ఫెడెరర్ కోట బీటలు వారడం, ప్రస్తుత నంబర్ వన్ నదాల్ ఆటలో స్థిరత్వం లోపించటం, ఆండీ మర్రే తన ఆటతీరులో గణనీయమైన వృద్ధి సాధించి ఇద్దరికీ అడ్డుగోడ గా నిలవటం, దానికితోడు లీటన్ హెవిట్, సోంగా, జకోవిక్, దెల్ పాత్రో లాంటి మరికొంత మంది ఆటగాళ్ళు మంచి ఆటతీరుతో, వారిదైన రోజు అద్భుతాలు సృష్టించగల నైపుణ్యం తో ముందుకు దూసుకు రావటం, ఇవన్నీ ఈసారి విజేతని వూహించటం కష్టతరం చేస్తున్నాయి. నిజానికి టెన్నిస్ లో మిగతా టొర్నమెంట్ల తో పొలిస్తే గ్రాండ్ శ్లాం టోర్నమెంట్ల తీరు వేరు. అనుభవం, వత్తిడిని తట్టుకోనేవారికే విజయావకాశాలు ఎక్కువ. కాబట్టి యువతరం అంచనాలకు మించి రాణిస్తున్నా,పాత కాపుల ముందు వీరేమాత్రం నిలవగలరో వేచి చూడాల్సిందే.

ఇక మహిళల విషయాలకొస్తే, ఏ శుభముహుర్తంలో హెనిన్ తన రిటైర్మెంటు ప్రకటించిందో గాని, అప్పటినుంచి మహిళల నంబర్ వన్ ర్యాంకు కుర్చీలాట లాగా తయారయింది. ప్రస్తుత నంబర్ వన్ యాంకోవిక్, ఆటతీరు తో కాకుండా కంప్యూటరు గణాంకాల ప్రకారం ఒకటోస్థానం లో ఉంది. విలియంస్ సోదరీమణుల ఆటతీరుకి, ఈమె ఆటతీరుకి మరీ ఎక్కువ కానున్నా, ఎంతోకొంత అంతరం ఉంది. చూద్దాం మరి యాంకోవిచ్ ఈటొర్నమెంట్లొ ఏ మాత్రం పరిణిచూపుతుందో. ఇక ఇవానివిచ్ ఎలా నంబర్ వన్ స్థానానికి చేరుకుందో అంతేవేగంగా దిగిపోయింది. ఈమె, మారత్ సఫిన్ చెల్లెలు సఫీనా, కుజునెత్సోవా ఇంకా మరికొంత మంది, మహిళల టెన్నిస్ ని చాలా ఆసక్తికరం చేసారు. ఒకప్పుడు మహిళల టెన్నిస్ ని శాసించి, మహిళల టెన్నిస్ అంటేనే విసుగెత్తించేలా చేసిన విలియంస్ సోదరీమణుల కాలపు పరిస్థితితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగు. ఆసక్తి కరంగా ఉంటేనే ఏ ఆటకైనా అందం మరి.

ఇకపొతే నేనుండే న్యూయార్క్ టైముకీ మెల్బోర్న్ టైముకి పదహారు గంటల వత్యాసం కాబట్టి మరీఅంత ఇబ్బంది లేకుండా మార్నింగు సెషన్ ని చక్కగా చూసేయొచ్చు. ఎటొచ్చీ రెండో సెషన్ చూడడమే ఇబ్బంది . రెకార్డు చేసుకొని చూడొచ్చు గాని లైవ్ చూడడం లోని మజాయే వేరు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ టొర్నమెంటు ముగిసాక టోర్నమెంటు మొత్తం ఎలాసాగిందో, మరియు అందులో నాకు ఆసక్తికరం గా అనిపించిన విషయాల గురించీ, రాస్తాను వీలైతే.




Friday, December 12, 2008

డాక్టర్ సానియా మీర్జా

(ముందుగా బ్లాగర్లందరికీ ఈ ఆదివారం తెలుగు బ్లాగర్ల దినోత్సవం సందర్భం గా నా శుభాకాంక్షలు. )
ఈరోజు ఈనాడు లో ఒక వార్త చదివాను. భారత టెన్నిస్ ఆశాకిరణం సానియా మీర్జా కి గౌరవ డాక్టరేటు ప్రదానం చేసారు అనేది ఆ వార్త సారాంశం. ఆ వార్త చదవగానే నాకొచ్చిన మొట్టమొదటి ఆలోచన అసలు ఈ గౌరవ డాక్టరేటు ని ఏ ప్రాతిపదిక మీద ప్రదానం చేస్తారు? ఆయా రంగాలలో విశేష కృషి చేసినవారికా?ఏవైనా విజయాలు సొంతం చేసుకున్న వారికా?లేక సదరు వ్యక్తుల పేర్లు మీడియాలో హోరుమని కొన్నాళ్ళ పాటు వినిపిస్తే చాలా?


వ్యక్తి గతంగా ఆమె సాధించిన విజయాలేమీ నాకు స్ఫురణకు రావటం లేదు. నాకు గుర్తుండి ఏదో ఒక గ్రాండ్ స్లాం లో ఆమె నాలుగవ రౌండ్ కి చేరుకుంది.గ్రాండ్ స్లాం టోర్నమెంట్లలో అదే ఆమె అత్యుత్తమ ప్రదర్శన.ఆదపాదడపా ఏవో చిన్నా చితకా విజయాలు తప్పితే కెరీర్ టైటిల్స్ కూడ పెద్దగా ఏమీ లేవు.ఆమె చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసి ఏవో కొన్ని ఆశలు రేకెత్తించేలోగా పిడుగులాంటి వార్త వింటాం ,గాయాల బారిన పడిందనో, ఫిట్నెస్ సరిగాలేదనో.ఆమెను స్పూర్తిగా తీసుకొని మరికొంత మంది టెన్నిస్ ఆటగాళ్ళు తయారయ్యారు అనేచిన్నపాటి సంతృప్తి తప్పితే ఆమె భారత టెన్నిస్ కి ఒరగ బెట్టిందేమీ లేదనిపిస్తుంది.నాకు ఇంకొక చిరాకు కలిగించే విషయం ఆమె టెన్నిస్ క్రీడాకారిణి అయ్యుండీ, టెన్నిసేతర కారణాలతో వార్తల్లో ఉండటం. వ్యక్తిగతం అని సరిపెట్టుకుందామనుకున్నా, కోర్టుల్లొ చెప్పుకొదగ్గ విజయాలు లేకపోవటం విమర్శలకు ఊతమిస్తోంది.



పెద్ద పెద్ద టోర్నమెంట్లలో మొదటి రౌండ్ దాటడం,అభిమానులంతా "హమ్మయ్య, ఒక గండం గడిచింది" అని ఊపిరి పీల్చుకొనేలోపు రెండవ రౌండ్లో ఆమె చేతులెత్తేయడం.కెరీర్లో పెద్దగా ఏమీ సాధించకుండానే,టెన్నిస్ అకాడెమీ పెట్టి కోచింగ్ ఇస్తానని రాష్ట్రప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకోవడం,మకాం దుబాయి కి మారుస్తాననడం లాంటివి భారత టెన్నిస్ ప్రియులకు కొద్దిగా కష్టం కలిగించేవే. మీడియా అత్యుత్సాహం ఇబ్బంది కలిగించేదే అయినా,వారడిగిన ప్రశ్నలకు చిరాకుపడి సమావేశం మధ్యలోనే లేచెళ్ళి పోవడం ఈమెకే చెల్లింది.


ఆటలో వత్తిడి ఉంటుంది.దాన్ని జయించడం అంత ఈజీ కాదు.అందునా దాదాపు వంద కోట్ల మంది ఆశల్ని మోస్తున్నప్పుడు,ఓడినా గెలిచినా అత్యుత్సాహాన్ని ప్రదర్శించే మీడియా చూస్తున్నప్పుడు,అది ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. దాన్ని జయించినవారే నిజమైన ఛాంపియన్.


సానియా ఆటని చూడాలని ఎప్పటినించో అనుకోగా పోయిన సంవత్సరం ఆ కోరిక తీరింది. 2007 బేంక్ ఆఫ్ వెస్ట్ టోర్నమెంటు. ఫైనల్స్ , మన సానియా మీర్జా, అన్నా చక్వతద్జే ల మధ్య. అప్పటికి సానియా ఒక మాదిరి విజయాలతొ మాంచి ఊపు మీద ఉంది. ఆట ఒక్కక్షణం కూడా మిస్ కాకూడదనే ఉద్దేశ్యం తో కాఫీ ముందే కలుపుకొని, మధ్యలో ప్రకటనలు వచ్చినప్పుడు చదవటానికుంటుందని ఒక పుస్తకం పెట్టుక్కూర్చున్నాను. మొదటి సారి ఆమె ఆట చూడటం కాబట్టి నా మనసు మనసులో లేదు. ఆట మొదలయింది. చూస్తున్నానే గానీ ఆమె ఆటలో ఏదో తేడా. మిగతా అంతర్జాతీయ ఆటగాళ్ళలో వెదికినా కనపడని లోపం ఈమెలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది.కాసేపటికి అర్ధమయింది, గెలవాలనే పట్టుదల, కసి కాగడా వేసి వెతికినా ఆమె మొహంలో ఎక్కడా లేశ మాత్రమైనా లేదని.ఒక టొర్నమెంటు ఫైనల్స్ ఆడుతున్నానని, ఇంకొక్క అడుగు జాగ్రత్తగా ముందుకు వేస్తే టైటిల్ తన సొంత మవుతుందనే అలోచనేమాత్రం లేనట్టు ఆడుతొంది. ఈ విషయం లో లియాండర్ పేస్ చాలా బెటరు. పాయింటు పాయింటు కీ గెలవాలనే తపన,భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నననే స్పృహ అనుక్షణం కనపడుతుంది నాకు ఆయనలో.సరే,నాకొచ్చిన ఆలోచన ఆ టివీ కామెంటేటరుకు కూడా వచ్చినట్లుంది, ఆట మధ్యలో కొద్ది పాటి విరామం దొరికితే ఆమె మైకు పట్టుకొని ఆట చూస్తున్న సానియా వాళ్ళమ్మ దగ్గరికెళ్ళి ఇలా అడిగింది.

(మక్కీకి మక్కీ సంభాషణ నాకు గుర్తు లేదు గాని, దాని సారాంశం మాత్రం ఇదే)..

"ఇది టొర్నమెంటు ఫైనల్ కదా, కొంచెం కష్టపడితే టైటిల్ సానియా సొంతం, కానీ తను ఆ ధ్యాసే లేనట్టు ఆడుతొంది"

""

"తనకేమైనా గాయాలున్నాయా, ఫిట్నెస్ సరిగాలేదా?"
"అదేమీ లేదు, షి ఈజ్ జస్ట్ ఫైన్."

"మరెందుకలా ఆడుతోంది?"

"బహుశా ఫైనల్స్ వరకు వచ్చానుకదా అదేచాలనుకుందేమో?"

టీవీ కామెంటేటర్ ఇంకేమీ మాట్లాడకుండా తన బాక్సు దగ్గరకెళ్ళి, తన సహ కామెంటేటర్ని అడిగింది.

"సానియా వాళ్ళమ్మ అన్నది నీకేమైనా అర్ధం అయిందా, అదేమిటి?ఫైనల్స్ వరకు వస్తే చాలా? గెలవాల్సిన అవసరం లేదా?"

"ఏమో నాకూ అదే అర్ధం కాలేదు" అన్నాడు రెండో కామెంటేటరు.

నాకయితే మాత్రం "హమ్మయ్య, ఈమాత్రం ప్రదర్శన చాలు, ఇక ఇండియాలో విమర్శకుల నోళ్ళు మూయించొచ్చు" అన్నదే సానియా, సానియా వాళ్ళమ్మ మనసుల్లో ఉన్నట్టనిపించింది.

మీలో కొంతమంది ఊరికే విమర్శించటం కాదు,ఆడితే తెలుస్తుంది అందులోని కష్టం అనుకోవచ్చు. స్వతహాగా టెన్నిస్ ప్రియుణ్ణి, కొన్నేళ్ళుగా ఆమె ఆట గురించి వింటున్న వాణ్ణి, ఈక్వేషను లో ఏదో తేడా ఉంది అని అనిపించింది కాబట్టి రాస్తున్నాను.

సరేగానీ, ఇంతకీ ఈ డాక్టరేటు ల సంగతేమిటి? అసలు ఇవి ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు? ఎందుకిస్తారు మీకేమయినా తెలుసా? అరకొర విజయాలతో మరీ ఇరవై రెండేళ్ళకే సానియా డాక్టరయి కూర్చుంది. ఇప్పుడేమో గానీ కొన్నేళ్ళ క్రితం మన యూనివర్సిటీలు పోటీలుపడి మరీ సత్కరించాయి మన మహానటుల్ని గౌరవ డాక్టరేట్లతో. నాకయితే ప్రస్తుతానికీ గౌరవ డాక్టరేట్లో మరీ అంత గౌరవించాల్సిందేమీ లేదనిపిస్తొంది.


PS: నా అభిమాన నటుడు వేణుమాధవ్ కి ఎవరైనా డాక్టరేటు ఇస్తే చూడాలనుంది.





Tuesday, December 9, 2008

నా తెలుగు సినీదర్శకులు

సరదాగా రాసుకున్న టపా ఇది.


నేను ఎవరైనా సినీ దర్శకుడిని గుర్తుచేసుకుంటే అసంకల్పితంగా, ఒక సినీ ప్రేక్షకుడిగా, చటుక్కున నాకు స్ఫురణకి వచ్చే అంశాన్ని ఆయా దర్శకుల పేర్లతో జోడించి రాసాను. మీకు నే రాసినది గాక ఇంకేమైనా గుర్తుకొస్తే మీ చూపలాంటిది అనుకొని సరిపెట్టుకోండేం?

బి. విఠలాచార్య: మాయలూ, మంత్రాలూ , రాకుమారుడూ-రాకుమారి

కె. విశ్వనాధ్ : మొహంలో అవసరమైన దానికన్నా ఎక్కువ సాత్వికత

మణిరత్నం: అందమైన కేమెరా

రాం గోపాల్ వర్మ : జులపాల జుట్టు రౌడీలు, హింస తో కూడుకున్న చీకటి

జంధ్యాల : మధ్యతరగతి ఇళ్ళు, అందమైన తిట్లు, వైజాగ్

రేలంగి నరసిఁహారావ్: సాదా సీదా మధ్యతరగతి మనుషులు

బాల చందర్: విప్లవ ధోరణిలొ సాగే ప్రేమకధలు

ఈ.వి.వి సత్యనారాయణ: అందాల ఆరబోత తో కూడిన హాస్యం

చంద్రశేఖర్ యేలేటి: వైవిధ్యం, వైవిధ్యం, వైవిధ్యం... వెరసి ఉలిపికట్టె

వంశీ: యాసతో కూడిన హాస్యం, మూడు నిముషాల పాటకి మూడొందల ఫ్రేములు

శంకర్: అవినీతి, ఒక మెలోడీ,ఒక ఫాస్ట్ బీట్ , ఒక జానపద పాట, హింస

కృష్ణవంశీ: రంగు రంగుల ముగ్గులు, అవసరమైన దానికన్న ఎక్కువ నోరు చేసుకొనే హీరోయిన్లు, తడిసిన తలలతో హీరోలు

వి. వినాయక్ : ఫ్యాక్షనిజం

గుణశేఖర్: భారీ సెట్టింగులు

కోదండరామిరెడ్డి: చిరంజీవి, యండమూరి, ఇళయరాజా, లోక్ సింగ్ (ల కాంబినేషన్ )

యస్.వి. కృష్ణారెడ్డి: చిన్నపిల్లల హాస్యం

టి.కృష్ణ: తిరుగుబాటు

త్రివిక్రం శ్రీనివాస్: ప్రాస తో కూడిన ప్రయాస

బాపు: పదారణాల తెలుగుదనం,కొంటె చూపులూ, పెదవి విరుపులూ, పొడవాటి జడ ఇంకా చాలా...

రాఘవేంద్రరావు : అవసరమా? ఆహ, అవసరమా అని అడుగుతున్నా..

Tuesday, December 2, 2008

నే చదివిన ఒకానొక మంచి కధ

నేనప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను,నేను నా చిన్నప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్ని సినిమాలు చూసిఉంటాను? అని. నాలుగొందలు? ఆరొందలు? వెయ్యి? అమ్మో వెయ్యా? అన్నుండవు. ఏమో లే,తెలుసుకొని చేసేదేముంది.
మొన్నీమధ్య అదేరీతిలో ఇంకొక ఆలోచనొచ్చింది. చిన్నప్పటినుంచి ఇప్పటివరకు ఎన్ని కధలు చదివి ఉంటాను అని.వెయ్యేం ఖర్మ ఆపైన ఇంకో వెయ్యి కూడా వేసుకోవచ్చు అనిపిస్తుంది.సరే మరి, ఆ చదివిన వాటన్నిటిలోకల్లా మంచి కధ ఏది? చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే చదివిన వాటిల్లో ముప్పాతికొంతు అసలు గుర్తేలేవు కనుక.ఈ ఇంటెర్నెట్ పుణ్యమా అని ఇప్పటికీ రెగ్యులర్ గా ఆన్లైన్లో దొరికిన కధనల్లా చదువుతూనే ఉన్నా. వాటిల్లో నాకు బాగా నచ్చిన కధ శ్రీరమణ గారి "బంగారు మురుగు". మొట్టమొదటసారి ఆ కధని చదివేటప్పుడు కధ చివరకు రాగానే మనసంత ఏదో దిగులుగా అయిపోయింది. ఆ కధని ఆరొజే దాదాపు ఏ పదిసార్లో చదువుకొని ఉంటాను.అంత బాగా నచ్చింది నాకా కధ. నేను ఆన్ లైన్లో రాసిన మొట్టమొదటి కామెంటు కూడా ఆ కధకే. ఆతరువాత నేను చేసిన పని ఆ కధని ప్రింటవుటు తీసుకోవడం.ఈ నాలుగేళ్ళలో ఆ కధని ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు.
ఇక కధ విషయానికొస్తే ఇది ఒక బామ్మా మనవళ్ళ కధ. ఏదొ చాదస్తపు బామ్మ కాదు. ఎందుకు పుట్టామో చెపుతుంది, ఎలా బ్రతకాలో చెప్తుంది, ప్రేమంటే ఏమిటొ చెప్తుంది, సాటి ప్రాణి మీద దయలేని దైవభక్తి ఎంత నిరర్ధకమో చెప్తుంది,త్యాగమంటే ఏమిటో చెప్తుంది. చిట్టచివరిగా ఈ కధ అందరికీ తమ అమ్మమ్మల్నో, నానమ్మల్నో గుర్తు చేస్తుంది.
చక్కటి కధ. ఎక్కడా ఆగకుండా అలా చదివించే కధనం. ఇది శ్రీరమణ గారు రాసిన మొట్టమొదటి కధ అంటే నమ్మబుద్ది కాదు.
సరె, ఇక్కడ ఆకధ మీకోసం.


P.S: ఆ కధ కింద వచ్చిన కామెంట్లలో ఒకరు శ్రీరమణ గారు రాసిన "షోడానాయుడు" కధ గురించి ప్రస్తావించారు. మీకెవరికైనా ఆ కధ ఎక్కడైన ఆన్లైన్లో కనపడితే వివరాలిచ్చి పుణ్యం కట్టుకోగలరు.

Tuesday, November 25, 2008

వారసులొచ్చేస్తున్నారు జాగ్రత్త!!

గుండమ్మకధ.
అప్పుడు నేను చదివేది ఏ ఆరో తరగతో, ఏడోతరగతో.
అప్పటికి గుండమ్మకధ ఏ పదో రిలీజో, పదకొండో రిలీజో.మ్యాటినీ హవుస్ ఫుల్. ఈసురో మని వెళ్తే ఫషో మళ్ళీ హావుస్ ఫుల్. ఆ తరువాత ఒక రెండు రోజులకి గానీ దొరకలేదు టిక్కెట్లు.

ఎంటీఆర్, ఏఎన్నార్, రాజ్యన్నేలిన రోజుల్లో అందరూ పాపం చక్కగా వారి సినిమాల్ని ఎంజాయ్ చేసారు.వాళ్ళకి నీరాజనాలు పట్టారు. నెత్తికెక్కించుకున్నారు. ఏదో మర్యాదా, మన్ననలు కాలమేలిన రోజులు, నెత్తిమీద పెట్టుకున్నన్ని రోజులు పెట్టుకొని ఆ తరువాత దిగండి సారూ అంటే వారు కూడా మర్యాదగా దిగి అస్త్ర సన్యాసం చేస్తారనుకున్నారు గానీ ఇలా కొంప కొల్లేరు అవుతుందని సగటు ప్రేక్షకుడు ఎవడూ అనుకోలేదు. "హవ్వ! మనమరాలి వయసు అమ్మాయితో గంతులూ , కుప్పి గంతులూనా" అనుకున్నా, ఆ ఫీలింగుని కడుపులోనే దాచుకున్నారు, వారు వింటే బాధపడతారని. వారు నటించిన పాత చిత్ర రాజాలను చూసి పెద్దమనసుతో క్షమించేసారు. అంతటితో ఆగిందా? లేదు. రోజులు మారాయి. వాళ్ళూ మనలాంటి మనుషులేగా. వాళ్ళకంటూ ఒక కుటుంబం , పిల్లలూ...

ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యారు.మనకి గుది బండయ్యారు. అయినా భరించాం...
బక్క పలచగా ఉన్నా భరించాం...
బొద్దుగా ఉన్నా భరించాం..
మొదట్లో చాలా కష్టపడి పైకొచ్చి ఆ తరువాత నేను స్టార్ ని, నా కధలింతే మీ గతంతే..అంటే భరించాం...
తరం మారింది..
వీళ్ళూ యాభై, అరవైల్లోకొచ్చారు. వీళ్ళకీ ఒకటో రెండో పెళ్ళీళ్ళూ ఇద్దరో ముగ్గురో పిల్లలూ...
పాపం సగటు ప్రేక్షకుడికి ఇక చాలు బాబో అనే ఓపిక కూడా లేదు...
************************************

మొన్నీ మధ్య మేము నలుగురు ఫ్రెండ్స్ మి ఒక పార్టీ సందర్భంగా కలుసుకున్నప్పుడు ఇప్పుడున్న నటుల్లో(?) ఎవరెవరికి ఎంత మంది పిల్లలు, వాళ్ళ వయసెంత, ఇంకెంతమంది ఈ సినీలోకం మీద దాడికి రెడీ గా ఉన్నారు అని భయ భయం గా చర్చించుకున్నాం.
ఏమిటో, ఓ సంవత్సరం క్రితం పెళ్ళై, ఈ మధ్యే తండ్రైన నటుణ్ణి చూసినా భయపడాల్సొస్తోంది..హతవిధీ......

Monday, November 24, 2008

నా వానా కాలం చదువు

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సాగిన నా పఠనా ప్రస్థానాన్ని అక్షరబద్దం చేద్దామనే ఆలోచన ఈ టపా కి ప్రేరణ. ఇది రాస్తున్నంత సేపూ నాకని పిస్తూనే ఉంది ఇది సమగ్రమైన టపా కాక పోవచ్చు అని.కొన్నేమో లీలగా గుర్తున్నాయ్, మరి కొన్ని గుర్తుకు వచ్చినప్పుడు ఆ ఒక్క విషయానే ఒక పెద్ద టపా లా రాయొచ్చు అనిపించేది. ఇక్కడ కుదించి రాసి రెంటికీ చెడ్డ రేవడి లా అవుతున్నదేమో అన్న అసంతృప్తి.దానికితోడు అభిరుచి కొద్దీ నేను చేసిన జర్నలిజం కోర్సు లో నేర్చుకున్న "క్లుప్తత" పాఠం, నన్ను పేజీ లకు పేజీలు రాయనివ్వలేదు. వెరసి ఇదిలా తయారైంది.
************************************************************

మొత్తం మీద చూస్తే నేనేమి పెద్దగా ఏమీ చదూకోలేదు అనిపిస్తుంది నాకు.స్కూలో ఉన్నప్పుడు,కాలేజీ లో ఉన్నప్పుడు ఎడా పెడా చదివి పారేసినా ఉద్యోగపర్వం లోకి వచ్చాక పెద్దగా చదివింది అంతగా లేదు.అదే నాకు కొద్దిగా బాధ కలిగించే విషయం.ఈ పన్నెండేళ్ళలో ఎన్ని వేల గంటల్ని వృధా చేసానో అనిపిస్తుంది నాకు.సద్వినియోగం చేసుకొని ఉంటే ఇంకొన్ని పుస్తకాలు నేను చదివిన లిస్టు లోకి చేరి ఉండేవి కదా.ఏమాట కామాటే చెప్పూకోవాలి నా ఉద్యోగజీవితం మొదలైన కొత్తల్లో పని పరమైన ఒత్తిడి విపరీతంగా ఉండేది. మిగతావారి కంటే వెనక పడ కూడదనే గట్టి పట్టుదలా, ఆ మొదటి నాలుగేళ్ళూ నా సాంకేతిక జ్ఞానాన్ని వృద్ధి పరచుకోవాల్సిన ఆవశ్యకతా, నన్ను నాకిష్టమైన పనికి దూరం చేసాయి. మనకిష్టమైన పనిని ఎన్ని ఇబ్బందులొచ్చినా కొనసాగించటం లోనే గొప్పతనం దాగుంటుంది. నేను మాత్రం ఆ విషయం లో పెద్ద ఫెయిల్యూర్.

నాకు ఊహ తెలిసి నేను చదివిన మొదటి పుస్తకం చందమామ.ఆ తరువాత బాలజ్యోతి,బాలమిత్ర,జాబిల్లి. వీటివల్లనేమో నాకు జానపద చిత్రాలంటే విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.నా చిన్నప్పుడు నేను జానపద చిత్రాల్ని విపరీతంగా చూసేవాడిని. పొద్దున్నే స్కూలు కి వెళ్ళేటప్పుడు ఎన్.టి.రామారావు గారి ఏ "అగ్గి పిడుగో", లేక కాంతా రావు గారి "జ్వాలా ద్వీప రహస్యం" తాలూకు వాల్ పోస్టర్ కనపడిందంటే ఇక మనసంతా ఒకటే ఆలోచన, ఈ సినిమా చూసే వీలు ఎప్పుడూ కలుగుతుందా అని.ఇప్పుడంటే రెండు ఫోన్ నంబర్లు గుర్తుపెట్టు కోవాలంటే బుర్ర కి కొద్దిగా కష్టమవుతుంది గాని చిన్నపుడు నేను ఏకసంధా గ్రాహిని.బాగా చదువుతాననే పేరుండటం చేత ఇంట్లో కూడా నా సినిమా పిచ్చి కి పెద్ద అడ్డుండేది కాదు. అమ్మ దగ్గర ఒక రూపాయుచ్చుకుంటే సినిమా టిక్కెట్టు తోపాటు ఇంటర్వెల్ లో ఉడకబెట్టిన వేరుశెనక్కాయలు కూడా నా వళ్ళో పడేవి(నావన్నీ నేల టిక్కెట్టు సినిమాలు లెండి).సరే విషయం పక్క దారి పడుతోందనుకుంటా. నా చదువు గోల కాస్తా సినిమా గోల గా మారకముందే దీన్ని ఆపేస్తా.ఆ రోజుల్లో చిన్న చిన్న పాకెట్ సైజు జానపద కధల పుస్తకాలు ఉండేవి.నాదగ్గరున్న ట్రంకు పెట్టెలో దాదాపు ఒక వంద పుస్తకాలుండేవి అట్లాంటివి.అప్పట్లో అవి నాప్రాణం.పాఠ్య పుస్తకాలకుక్కూడా అంత సీనుండేది కాదు వాటిముందు.వాటిని పాన్ షాపుల్లో క్లిప్పులతో ఒక దడి లాగా కట్టి వేలాడదీసి అమ్మేవారు.అట్టమీద బొమ్మ, కధ పేరు కాస్త ఆసక్తికరంగా కనపడిందంటే చాలు ఆ పుస్తకాన్ని కర కరా నమిలి మింగాల్సిందే. లేకుంటే మనసులో చెప్పలేనంత దిగులు.

నాకు ఈనాడు పేపరు చదవటం నా పదోయేటే అలవాటైంది. అతిశయోక్తి అనుకోకుంటే ఒక్క మాట.నా ఈనాడు పఠనం అప్పటినుండి ఇప్పటిదాకా అప్రతిహతం గా కొనసాగుతూనే ఉంది.నేను చదవనిదల్లా పండగలప్పుడు "పండగ సందర్భం గా ఈనాడు కార్యాలయానికి సెలవు"అని వారు సెలవిచ్చినప్పుడే. అప్పటినుంచి ఇప్పటివరకు నేను "ఈనాడు" వీరాభిమానిని(ఈ కుళ్ళు రాజకీయాలని పక్క పెడితే). నా ఆరోతరగతిలో యేసురత్నం గారని సోషల్ టీచరొకరుండేవారు. ఆయన ఆరోజుల్లోనే మాకు డైరీ రాయటం నేర్పించారు. రోజూ ఆయన క్లాసులో మేము క్రితం రోజు రాసిన మా దిన చర్య చూపించాలి. దానితో పాటు ఆరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైనా వార్తలు కూడా రాయాలి. అలా ఒకానొక శుభదినాన నా "ఈనాడు" పఠనం మొదలయింది. నా ఆనాటి దినచర్యలో మొదటి మూడు వాక్యాలు ప్రతిరోజూ ఒకేలా ఉండేవి ఇలా..

"ఈరోజు నేను పొద్దున్నే ఏడుగంటలకు నిద్ర లేచితిని. ఆ వెంటనే పళ్ళుతోమితిని. అటుపిమ్మట కాలకృత్యములు తీర్చుకొని కాసేపు చదువుకొంటిని".

నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆ డైరీ అనుకోకుండా నా కంట పడితే ఒక రోజంతా నవ్వుకున్నా మళ్ళీ మళ్ళీ చదువుకొని.
అప్పుడు నేనుచదివిన ఈనాడు లో నాకిప్పటికీ గుర్తున్న వార్తలు కొన్నున్నాయ్. అవి , రష్యా అధ్యక్షుడు అంద్రోప్రొవ్ మరణం, ఎయిర్ ఇండియా విమానం కనిష్క కూల్చివేత, బందిపోటు రాణి పూలన్ దేవి లొంగుబాటు, మహా కవి శ్రీ శ్రీ మరణం. ఇంకా ఆలోచిస్తే మరికొన్ని గుర్తొస్తాయి గానీ, నాకే అనిపిస్తొంది ఇక్కడ రాయటం అంత అవసరమా అని. మరి చదివే వారు మీకేమనిపించొచ్చో నాకుతెలుసు. సరే, పేపరు నాచేతికి రాగానే మొదట నేను చదివేది మూడో పేజీ లో కుడివైపు కింద భాగం లో ఉండే బొమ్మల కధ. ఒక రెండేళ్ళ పాటు వీటిని కట్ చేసి పుస్తకంగా కుట్టుకున్నాను కూడా. తరువాత క్రీడా వార్తలు, మొదటిపేజీ వార్తలు. కాస్త బుర్ర పెరిగాక మూడో పేజి సంపాదకీయాలూ, కులదీప్ నయ్యరు (లోగుట్టు), ఎ.జి. నూరానీ, చంద్రచూడ్ సింగ్ లాంటీ మహా మహుల వ్యాసాలూ , పుణ్యభూమీ, చలసాని కబుర్లూ వగైరా వగైరా.

ఎప్పుడు , ఎందుకు చదివానో నాకు తెలీదు గానీ నేను నా జీవితంలో చదివిన మొట్టమొదటి నవల మల్లాది వారి "మేఘమాల". నా అదృష్టమేమో నా మొట్టమొదటి నవలే మల్లాది ది కావటం. నాకానవల విపరీతంగా నచ్చింది. ఇంకేముంది జబ్బు ముదిరింది నాకు. దొరికిన నవల్నల్లా చదివి పారెయ్యటమే.దానికి తోడు మా అన్నయ్య ఫ్రెండొకతనికి అద్దె పుస్తకాల షాపుండేది. మల్లాది,యండమూరి, సూర్యదేవర, చందు సోంబాబు,అల్లాణి శ్రీధర్,యర్రంశెట్టి ఒకరేమిటి, పేరున్న, పేరు లేని, పేరుండి ఆ తరువాత పిచ్చి రాతలు రాసి పేరు చెడగొట్టుకున్న వారందరి నవళ్ళూ చదివేసా. మల్లాది కి వీరాభిమానిని కదా ఆయన రూపాయి పత్రిక స్రవంతి నీ పోషించా అదున్నన్నాళ్ళూ. నాకు బాగా నచ్చిన నవలలు బోలెడున్నాయ్ అన్నీ గుర్తు కు రావు గానీ, యండమూరి ఆనందో బ్రహ్మ, ప్రార్ధన, వెన్నెల్లో ఆడపిల్ల, మల్లాది మేఘమాల, సావిరహే,అందమైన జీవితం,మందాకిని వాటిలో కొన్ని. నాకు మల్లాది రాసిన వాటిల్లొ నచ్చని దంటే ఏకలింగం అడ్వెంచర్స్. ఆ తరువాత ఆయన రాసిన రచనల్లో శృంగారం పాళ్ళు ఎక్కువ ఉండటం కూడా నాకు నచ్చలేదు. మొత్తానికి ఆ టైంలో నాకు బాగా నచ్చిన రచయితలంటే వారిద్దరే , మల్లాది, యండమూరి.

మల్లాది నవలల్లో హైదరాబాదు ప్రస్తావన దాదాపు అన్ని నవలల్లో కనపడేది.అప్పట్లో సావిరహే చదివి నేను డంగైపోయాను.నేను కూడా హైదరాబాదు వెళ్ళి అర్జంటుగా ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి షికార్లు కొడుతున్నట్ట్లు ఊహల్లో తేలిపోయేవాడిని. ఛీ ఇంకా ఎన్నాళ్ళీ పేట జీవితం, హైదరాబాదు ఎప్పుడెల్తాను అనిపించేది నాకు. అందుకే నాకు ఇంజనీరింగు సీటు హైదరాబాదు లో వస్తే, సీటు వచ్చినందుకంటే, హైదరాబాదు వెళ్తున్నందుకు చాలా సంతోషం వేసింది నాకు.

అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా, మల్లాది గారి కో నియమం ఉండేది. ఆయన రాసే ప్రతి నవల లో పాత్రల పేర్లు ఏవీ కూడా రిపీట్ కాకూడదు. అంటే అంతకుముందు తను రాసిన ఏ నవల్లోను పెట్టని పేర్లై ఉండాలి. అందుకే ఆయన రచనల్లో కొన్ని పాత్రల పేరు చాలా విచిత్రం గా ఉండేవి. ఆ పేర్లు ఆ పాత్ర స్వభావాన్ని, వయసునీ దృష్టిలో పెట్టుకొని ఎన్నుకున్నట్టే ఉంటుంది కానీ , అసహజం గా ఏమాత్రం ఉండేవి కావు. యండమూరి లా భావుకత ని పండించక పోయినా, చాలా సింపుల్ గా, ఒక సన్నివేశం తరువాత మరొక సన్నివేశం , అలా అలా .. నవలంతా కళ్ళముందు జరిగిపోతున్న సినిమాలా ఉండేదే తప్ప, ఒక నవల చదువుతున్నట్టు ఏమాత్రం ఉండేది కాదు నాకు. నాకు డైరీ రాసే అలవాటున్నప్పుడు, ఏదో ఒక డైరీ వెనక పేజీ లో మల్లాది పాత్రల పేర్లు అని హెడ్డింగు పెట్టి నాకు గుర్తున్న పేర్లన్నీ రాసినట్టు గుర్తు. యెర్రంశెట్టి హాస్యం అన్నా నాకు చాలా ఇష్టం. ఆయన ఒక కాలనీ ని ఆధారంగా చేసుకొని రాసిన కధలు చాలా బావుండేవి(అది నిర్భయ్ నగర్ కాలనీ నేనా?). శాయి గారు అంతకుముందు సీరియస్ గా ఉండే రచనలు చేసారనుకుంటా. కార్నర్ సీట్ అని ఒక చిన్న నవల ఈయనదే చదివినట్టు గుర్తు.(రచయిత ఆయన కాకపోతే సరిదిద్దండేం?).

వార , మాస పత్రికలూ తెగ చదివేవాడిని. నాకు గుర్తుండి నేను చదివిన మొట్టమొదటి కధ "ప్రిస్టేజ్" అని అంధ్ర సచిత్ర వార పత్రిక లోనిది. నవలలు ఎంత ఇష్టం గా చదివేవాడినో పత్రికల్లో కధలు కూడా అంతే ఇష్టం గా చదివేవాడిని. ఇప్పుడెలా ఉందో తెలీదు ,చదవటం మానేసాను గాని,అప్పట్లో నా అభిమాన వార పత్రిక అంటే అంధ్రభూమి. కొన్న రెండు గంటల్లో మొత్తం చదివిపారేసి నిట్టూర్చేవాడిని అప్పుడే అయిపోయిందే అని. మొత్తం చదివేయక పోతే ఒక రెండు కధలో సీరియల్సో రేపటికి మిగుల్చుకుంటే బాగుండేది కదా అనుకొనేవాడిని. ఆతర్వాత కొన్ని సంవత్సరాలకు అదే ఆంధ్రభూమి కారణంగా నాకు కధల మీద ఆసక్తి పోయింది. ప్రతిభ ఏమాత్రం లేని కొత్త రచయితల కధలు ప్రచురిత మవటం ప్రారంభమయింది. కొన్ని కధలైతే అసలిది కధేనా అనిపించేటంత. డబ్బులిచ్చి వేయించు కున్నట్లుంది అనే కొన్ని వాఖ్యలు వినపడినా నాకైతే అందులో నిజమెంతుందో తెలీదు. ఆ రోజుల్లో నేను క్రమం తప్పకుండా చదివిన మరికొన్ని పత్రికలు అంటే అంధ్ర జ్యోతి, అంధ్ర ప్రభ, రచన,మిసిమి ( ఇందులో కొన్ని వ్యాసాల స్థాయి ఎలా ఉంటుందంటే నాకసలు అర్ధమయేవి కావు, బహుశా యిప్పటికీ కూడా). ఇంకా మరికొన్ని ఉండేవి గాని పేర్లు గుర్తు రావటం లేదు. సినిమా పత్రికల్లో సితార, జ్యోతిచిత్ర క్రమం తప్పకుండా చదివేవాడిని. మహానటి సావిత్రి చనిపోయినప్పుడు "రాలిపోయిన తార" అని హెడ్డింగు పెట్టి రాసారు జ్యోతిచిత్రలో(అనుకుంటా). అప్పటికి నేనింకా చాలా చిన్నపిల్లోడిని, నాకు సావిత్రి తెలీదు. అందరూ "అయ్యో" అంటూ చదువుతుంటే, నేను యధాలాపంగా ఆపేజీ చూసానంతే.

ఈనాడు ఆదివారం సంచికలో వచ్చే కధ అంటే నాకు చాలా క్రేజ్. నేను ఇంజనీరింగు చదివే రోజుల్లో నేను సైతం అని ఒక కధ రాసి ఈనాడు లో పనిచేసే మా పిన్ని ద్వారా పంపిస్తే చలసాని వారు బహు మర్యాదగా దాన్ని తిప్పి పంపిం"చేరు". దాంతో మా పిన్ని అప్పటి అంధ్ర ప్రభ ఏడిటర్ గా ఉన్న వాకాటి వారి వద్దకి పంపిస్తా, వెళ్ళి, మాట్లాడి, రాయడం లో కొన్ని కిటుకులు తెలుసుకోమంటే, కధ రిజక్ట్ అయిన బాధలో నేను ఆమెతో "ఊ" అన్నా, నాతోనేను "ఊహూ" అనుకొని బయటకొచ్చేసాను. అప్పటి కధని కొన్నేళ్ళ తరువాత తిరిగి చదువుకుంటే , ఆ రోజు వాకాటి వారి వద్దకు వెళ్ళకుండా మంచి పని చేసాననిపించింది. పెద్దమనిషి కర్రుచ్చుకొని వెంటపడిఉండేవారు. దాదాపు ఒక నాలుగైదు యేళ్ళపాటు ఈనాడు ఆదివారం సంచిక లో వచ్చే కధలన్నీ చింపి ఒక చిన్న పుస్తకం లా కుట్టుకున్నాను. కొన్ని కధలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు మాటల్లో చెప్పలేను. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు దుమ్ము దులిపి ఒక లుక్కేయాలి దానిమీద.

ఇంజనీరింగు లోకొచ్చాక కూడా మొదటి మూడేళ్ళు బానే చదివాననుకుంటా. అప్పట్లో నేను స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కి వెళ్ళేవాడిని రెగ్యులర్ గా. మా కాలేజేమో గండిపేట్లో.లైబ్రరీ ఏమో అఫ్జల్ గంజ్ లో. శనాదివారాలు పొద్దునే బయలుదేరి లైబ్రరీ కి వచ్చేవాడిని. వచ్చేసరికి ఎంతలేదన్నా పదీ పదకొండయ్యేది, ఒక గంట చదవగానే ఆకలి. ఇంకొక రెండు గంటలు కాగానే ఇంక బయల్దేరాలీ అనే తొందర. ఇంట్లో డబ్బులమీద ఆధార పడ్డ ఆరోజుల్లో హాస్టల్ లంచ్ త్యాగం చేసి బయటతినాలంటే కొద్దిగా ఆలొచించాల్సొచ్చేది.అలా అక్కడ నాకు తిలక్,బలివాడ,శీలా వీర్రాజు,కొ.కు,రంగ నాయకమ్మ, అక్కిరాజు (మంజు శ్రీ),భరాగో, ఇంకా చాలా మంది పరిచమయ్యారు. ముఖ్యం గా కొ.కు గారు. ఆయన రచనలు చదుతుంటే , చదువుతున్నత సేపూ కోపం వచ్చేది నామీద నాకే. ఈయన రచనలు నా దృష్టి కి మరీ ఇంత లేటు గా వచ్చాయేమిటి అని. రంగనాయకమ్మ గారి రచనలు చదివాక నాకు అప్పటివరకు ఉండే ఆలోచనల్లో సమూలమైన మార్పు వచ్చింది. "బడు" పద ప్రయోగం మీద, "వాడుక భాష" గురించి ఆమె రాసిన వ్యాసాలు చాలా ఆసక్తి గా చదివాను.ఆ తరువాత నా మకాం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ కి మార్చాను.అప్పటి తిరుగుడు అంతా సిటీ బస్సుల్లోనే కదా. ఈ లైబ్రరీ ఎలా ఉండేదంటే ఎటువైపు బస్సు దిగినా బాగా లోపలికి నడవాలి. దానికి తోడు ఆరూట్లో బస్సులు తక్కువ. ఇంత కష్టపడ్డా ఇక్కడేమి చదివానో గుర్తు లేదు గాని, రిఫరెన్సు విభాగంలో పదిహేను ఇరవైయేళ్ళ నాటి "ఈనాడు" పేపర్లు నెలలవారీగా బైండు కట్టి ఉండేవి, వాటిని తెగ చదివేవాడిని. ముఖ్యంగా ఆదివారం నాటి పేపర్లని.

నాకు ఊహ తెలిసి నేను చదివిన మొదటి సాహితీ కాలం "చేరాతలు". ఆ తరువాత ఏపేపరు చదివినా సాహిత్యానికి సంబంధించిన పేజీ లని శ్రద్ద గా చదివేవాడిని. ఇప్పటికీ నాకు కొన్ని అర్ధం కావు. అందుకే నా స్థాయి మీద నాకెప్పుడూ న్యూనతా భావమే. ఇంకొంచెం ఎక్కువ చదివి ఉండాల్సింది అనే ఆలోచనే..

పెళ్ళి చేసుకొని మొదటి సారి ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నా, నాలుగు సూట్కేసులు గదా, ఈసారి ఇండియా వెళ్ళినప్పుడూ ఒక సూట్కేసు నిండా నాకు నచ్చిన పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకోవాలి అని. అలానే ఒకరొజు మా ఆవిడ కళ్ళుగప్పి అబిడ్స్ విశాలాంధ్ర బుక్ హవుసు కెళ్ళి నాకు నచ్చిన పుస్తకాలు చాలా కొన్నా. నండూరి వారి విశ్వదర్శనం రెండు సంపుటాలు, తిలక్ కధలు, మునిపల్లె రాజు జర్నలిజం లో సృజనరాగాలు, అక్కిరాజు గారి సాహితీ వ్యాసంగం, భరాగొ ఇట్లు మీ విధేయుడు, నవీన్ అంపశయ్య, డి.వి నరసరాజు గారి ఆత్మ కధ, మహానటి సావిత్రి జీవిత చరిత్ర, భానుమతి గారి నాలో నేను.. మరికొన్ని. ఇంటి కొచ్చాక వాటన్నిటినీ తూకం వేస్తే గుండే గుభేలు మంది. నిజంగానే ఒక సూటుకేసు కి అవే సరిపోతాయ్. అవన్నీ ఒక సూటుకేసు లో సర్ది, పైన బట్టలు పెట్టా అనుమానం రాకుండా. "రాజభవనం అంతా తిరుగు, ఆ గది తలుపు మాత్రం తియ్యకు" అని అదేదో జానపద కధలో రాకుమారిడికి చెప్పినట్లు నేను తనకి చెప్పాను, ఆ సూట్కేసు తీయకు అందులో ఉన్నవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు, అవి గనక పోతే ఇక అంతే సంగతులు అని. ఇంకా నమ్మకం కుదరక ఆ సూట్కేసు ని మా బెడ్రూం మంచం కింద లోపలికి అందకుండా తోసేసా. మొతానికి కధ సుఖాంతమే అయింది "నేను అమెరికా వచ్చేదాకా". ఆమాత్రం రిస్కు తీసుకోకపోతే నాకు మిగిలేది ఇంకో రెండు శిల్పారామం , తరుణి షాపింగులూ , ఇంకో రెండు రకాల పచ్చళ్ళు, మరి కొన్ని తపేలాలూ, గిన్నెలూనూ . ఇంట్లో ఇప్పటికీ తను గుర్రు గా చూస్తుంది ఆ పుస్తకాల వంక.

నాకు బాగా తెలుసు నాదంతా వానాకాలం చదువే అని. ఇక్కడికొచ్చేక ఆ మాత్రం చదువు కూడా లేదు. ఎలాగైనా రెండో ఇన్నింగ్స్ మొదలేట్టాలి. అన్నిటికంటే ముందు ఇప్పటివరకూ చదివిన సిలబస్ ని ఇంకోసారి తిరగెయ్యాలి..

Wednesday, November 19, 2008

అమెరికా సిత్రాలు

నేను కార్లో పెట్రోలెప్పుడూ కాస్ట్కో లోనే పోయిస్తా వీలైనంత వరకు. ఇంజనుకి రక రకాల పెట్రోలు తాగించే బదులు ఎపుడూ ఒకేరకమైంది తాగిస్తే మంచిదనే గుడ్డి నమ్మకం, కాస్ట్కో కంపనీ మీదున్న నమ్మకం, పైగా అక్కడ ఒక రెండు సెంట్లు తక్కువుండడం అనేవి వేరే కారణాలు. నా ఆఫీసు కొచ్చేదారిలో దాదాపు అయిదు పెట్రోలు బంకులు కనబడతాయి నాకు. రోజు అవసరమున్నా లేకున్న పనిగట్టుకొని మరీ చూస్తా ఈరొజుటి రేట్లెలా ఉన్నాయా అని. ఒక బంకు లో ఉన్న రేట్లు ఇంకొక బంకు లో ఉండకపోవటం ఒక విషయమైతే, ఒకే బంకులో పొద్దునొక రేటు సాయంత్రమొక రేటు ఉంటుంది. నాలుగేళ్ళ నుంచి అనుకుంటున్నా దీని వెనకున్న కధా కమామిషు కనుక్కోవాలని. ఇంతవరకూ కనుక్కోలేదు. సరే మొన్నొకసారి కాస్ట్కో లో పెట్రోలు నింపుకుంటూ యధాలాపంగా గేలను రేటెంతా అని చూసా. ఒక్కసారి నాకు కలలో నిజమో అర్ధం కాలేదు. రెండు డాలర్ల అయిదు సెంట్లు. కరెక్టుగా ఒక మూణ్ణెల్ల క్రితం నాలుగు డాలర్ల ఏడు సెంట్లు. ఈ మూణ్ణెల్లలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేవీ సంభవించలేదు. అయినా ఎందుకీ మార్పు? ఎక్కడో ఏదో ఉంది. ఎవడో ఎక్కడినించో మీటలు నొక్కు తున్నాడు. ఆ మాట కొస్తే గేలను నాలుగు డాలర్ల పైచిలుకు పలికినప్పుడు కూడా ప్రపంచం లో ఎక్కడా ఏరకమైన ఉత్పాతమూ సంభవించలేదు. అప్పుడు బారెలు క్రూడాయిలు ధర నూట ఇరవై పైనే పలికింది.ప్రస్తుతానికి యాభై పైచిలుకు. ఇప్పుడు ఇది రాసేటైముకి గేలన్ పెట్రోలు జాతీయ సగటు ధర రెండు డాలర్లు. అయ్యారే ఏమి ఈ విచిత్రము?
**************************************************************
కొత్త జబ్బులొచ్చేస్తున్నయ్.

ఈమధ్య CNN లొ ఒక వార్త చూసాను. చూసాక నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. సాక్షాత్తూ న్యూయార్క్ గవర్నరుకి సహాయకుడి గా పనిచేసే చార్ల్స్ ఓ'బర్న్ అనబడే వ్యక్తి 2001 నుండి 2005 వరకు నాలుగేళ్ళ పాటు ఆదాయపన్ను రిటర్న్స్ దఖలు పరచలేదు. బకాయి పడిన మొత్తం చాలా పెద్దది , పైగా యవ్వారం ఆదాయపు పన్ను శాఖ తోటి కాబట్టి చార్ల్స్ ఒక లాయర్ని వెతుక్కున్నాడు. ఈ లాయర్లకి అమెరికాలో బాగా గిరాకి. సరే సదరు లాయరుకి ఎంత బుర్ర గోక్కున్నా ఏ లాజిక్కూ తట్టలెదు. ఏదో ఒక సంవత్సరం అంటే ఎలాగో మానేజ్ చెయ్యొచ్చు గాని వరసగా ఐదేళ్ళ పాటంటే అల్లాటప్పా కారణాలు చూపిస్తే సరిపోదని అర్ధమయింది. చెఫ్ఫటానికైతే తన క్లయింటు డిప్రెషన్ తో బాధ పడుతున్నాడనిన్నూ, ఆ కారణం చేత రిటర్న్స్ ఫైల్ చెయ్యలేదని కోర్టు వారికి విన్నవించుకున్నా, అది నిలబడదేమో అన్న చిన్నపాటి సందేహం తో ఈసారి ఓ కొత్త కారణం తో ముందుకొచ్చాడు. అదే "Late Filing Syndrome(LFS)". తన క్లయింటు ఈ LFS అనే వ్యాధి తో బాధ పడుతున్నాడనీ,ఆ ఒక్కగానొక్క కారణం చెత రిటర్న్స్ ఫైల్ చెయ్యలేదని విన్నవించుకున్నాడు. ఈ జబ్బుకున్న లక్షణం ఏమిటంటే ఇది ఎవరినైతే పట్టుకుంటుందో వారు టాక్సు రిటర్నులు తరువాతెప్పుడైనా చేద్దాములే అని ఏళ్ళూ పూళ్ళూ వాయిదా వేస్తారట. జడ్జి గారు తూలి కింద పడబోయి, తమాయించుకొని, కాసేపు బుర్ర గోక్కుని, ఈలోకం లో ఉన్న సవాలక్ష మానసిక జబ్బుల్లో ఈజబ్బు సంగతి ఎక్కడా ప్రస్తావించ బడలేదని నిర్ధారణ చేసుకొని సదరు చార్ల్స్ గారిని దోషిగా నిర్ధారించేసారు. విషయం బట్టబయలు కావటం, ఈ ఉదంతం తరువాత గవర్నరు గారి ఆఫీసులో చార్ల్స్ పెద్ద జోకరు లాగా అయిపోయి, ఈయన కనపడగానే జనాలు చాటు మాటుగా కిసుక్కున నవ్వుకోవటం, ఇత్యాది వన్నీ చూసి గవర్నరుగారికి చిర్రెత్తుకొచ్చి ఈయన్ని ఇంటికి సాగనంపారు. కొసమెరుపేమిటంటే, కేసు మొదట్లో రిటర్న్స్ ఫైల్ చెయ్యకపోవటానికి డిప్రెషన్ కారణం అని చెప్పి ఈయన అమెరికా లో డిప్రెషన్ తో బాధపడుతున్న కొన్ని మిలియన్ల మందిని అవమాన పరిచాడని కొన్ని వర్గాలు రుసరుస లాడాయి.
******************************************************************

ఒక సినిమా-కొన్ని జ్ఞాపకాలూ

న్యూఇంగ్లండ్(కనెటికట్) లో నేనున్నది రెండు సంవత్సరాలు మాత్రమే అయినా గాఢమైన అనుబంధమేర్పడిపోయింది నాకు ఆ ప్రాంతంతో.  (తెలియని వారికి: అమెరికాలో...