చరిత్రంటే నాకిష్టం.

Friday, May 14, 2010


చరిత్రంటే నాకిష్టం.

చరిత్రకి సంబంధించి ఏమైనా చదివినా, టీవీలో ఏదైనా ప్రొగ్రాము చూసినా వెంటనే దానిలో లీనమైపోతాను. కవితా సౌరభాలు వెల్లి విరిసిన రాయల వారి కాలం గురించి చదివినా, రాజ్య కాంక్షతో జీవితాంతం యుద్దాలతో గడిపేసిన అలెక్జాండరు జ్ఞప్తికి వచ్చినా, ఉన్మాదంతో ప్రపంచాన్ని అగ్నిగుండంగా మార్చేసిన హిట్లర్ మీద ఏదైనా ప్రోగ్రాము చూసినా ఏదో అవ్యక్తానుభూతి. అది దుఃఖమూ కాదు, సంతోషమూ కాదు.ఈ రెంటికీ అతీతంగా, ఏదో భావన.

కొన్ని సార్లు ఆ భావన ఎంత విచిత్రంగా ఉంటుందంటే జరిగిన చరిత్ర మీద కంటే జరిగిపోయినఆ కాలం మీద ఒక రకమైన బలమైన ఆకర్షణ కలగజేసేలా ఉంటుంది.

******************************************************************************

కనెక్టికట్ కి వచ్చినకొత్తల్లో, ప్రాజెక్టులో కుదురుకోగానే మొట్టమొదట చేసిన పని ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలేమున్నాయా అని చూడటం. గూగుల్ లో వెతికిన ప్రతిసారీ కనపడేది "Mystic Seaport" అని. చూసినప్పుడల్లా "ఆ! సీ పోర్టులో ఏముంటుందిలే" అని పట్టించుకోలేదు. ఒక రెండేళ్ళ తరువాత, చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేసాక , ఈ సీపోర్టేమయిఉండొచ్చబ్బా ఒకసారి వెళ్ళి చూస్తేపోలా అనుకున్నా. మొత్తానికి ఒక శనివారం రోజు వెళ్ళా.


ఈ సీపోర్టొక ఓపెన్ ఎయిర్ మ్యూజియం లాంటిది. 1800 లలో , సముద్రం మీద ఆధారపడి జీవించే వారుండే ఒక సగటు అమెరికన్ గ్రామాన్ని యధాతధంగా పునర్నిర్మించారు. అప్పటిలానే ఇళ్ళూ, వీధులూ, షాపులూ, ఒక బేంకూ , పోస్టాఫీసూ, ప్రింటింగు ప్రెస్సూ, కిరాణా షాపూ, బేకరీ, మెడికల్ షాపూ అన్నీ. అన్నీ ఒక వంద,నూటేభై ఏళ్ళ క్రితం ఎలా ఉండేవో అలానే ఉన్నాయి. వాటిల్లో ఆ కాలపు దుస్తులు ధరించి, అప్పటి ఆ వస్తు విశేషాల్ని వివరిస్తూ సీపోర్టు ఉద్యోగులు. చాలా ముచ్చటేసింది.

పారిశ్రామిక విప్లవం మొదలైన ఆ రోజుల్లో , కొత్తగా కనుగొన్న ఆ యంత్రాలకు లూబ్రికేషను కావాలి అంటే తిమింగలాలను చంపగా వచ్చిన ఆయిలే శరణ్యం. అలా మొదలయింది తిమింగలాల వేట. పెద్ద పెద్ద షిప్పులు మీద ఏకబిగిన సంవత్సరాల తరబడి సముద్ర జలాలమీద తిమింగాలాలకై వేటకెళ్ళేవారట. అప్పట్లో, టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో, ఆ అనంత జలరాసి లో, రాత్రనక పగలనక వేటాడేవారు.ఆ షిప్పుల్లో ఒక్క కెప్టన్ కి మాత్రమే భార్యని వెంట తీసుకెళ్ళే సౌలభ్యం ఉంటుందట. మిగతా వాళ్లందరూ ఒంటరిగా భార్యలనీ పిల్లల్నీ,తల్లితండ్రుల్నీ వదిలి వెళ్ళాల్సిందే. ఆ ఓడల్లోనే కొన్నిసార్లు ఆ కేప్టన్ల భార్యలు పిల్లల్ని కనేవారు. కొన్నిసార్లు అనారోగ్యం కారణంగా కెప్టన్ చనిపోతే వాళ్ళ భార్యలే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని కెప్టన్ బాధ్యతలు నిర్వహించేవారట. చీకటి గుయ్యారాల్లాంటి ఆ కేప్టన్ల డెక్కుల్నీ, అంతకంటే ఇరుగ్గాఉండే నావికుల కేబిన్లని చూస్తే అయ్యో అనిపించింది.ఇలాంటి ప్రతి ఊరికీ సముద్రపొడ్డున ఒక చిన్న గ్రౌండ్ లాంటిది ఉంటుంది. సముద్రంలో సుదూరంగా ఏదైనా ఓడ కనపడితే పిల్లా,పాపలంతా అక్కడ గుమి గూడేవారట ఆ ఓడలో తమవారు తిరిగొస్తున్నారేమో అనే ఆశతో. ఎంత ఎమోషనల్ దృశ్యమో కదా ఊహించుకుంటే.


అప్పట్లో వేటకు వాడిన, దాదాపు ఒక పాతిక పైగా ఓడల్ని సేకరించి నీళ్ళలో నిలిపి ఉంచారు ఈ మ్యూజియంలో. వాటిల్లోకెళ్ళి కలియతిరుగుతుంటే ఎన్నో ఆలోచనలు.ఎంతమంది ఆశల్నీ , కలల్నీ మోసుకెళ్ళిందో ఆ ఓడ. ఎంతమంది జీవితాలు ఇందులోనే తెల్లారిపోయాయో కదా. ఆ షిప్పులో మెట్లెక్కినా , దిగినా , అప్పట్లో వాళ్ళు నడిచిన చోటే నేను నడుస్తున్నాననే ఆలోచన నాలో కలిగించే ఉద్విగ్నత. ఆ చెక్క దూలాల మీద వాళ్ళు చెక్కిన గుర్తులు చూస్తుంటే ఏ మధ్యాహ్నం నాడో, లేదా ఏ నిశిరాత్రో, ఎవరో నావికుడు, ఎక్కడో ఈ అనంత జలరాసి కావల ఉన్న తన పిల్లల్నీ, వృధ్ధులైన తల్లితండ్రుల్నీ , భార్యనీ తలచుకొని ఆ ఆవేదనని దిగమింగటానికి , ఉబికివస్తున్న కన్నీళ్ళనాపుకుంటూ చేసిన గుర్తులేమో అవి..


అంతా చేసి అప్పుడప్పుడు సంవత్సరాలపాటు వేటాడినా సరైన సంఖ్యలో తిమింగలాలు దొరక్కపోతే ఆ నావికులే కెప్టన్ కి డబ్బులు బాకీ పడేవారట. దారుణం కదా? ఇది నా దేశం కాదు. నా సంస్కృతీ కాదు. కానీ మనిషి ఎక్కడైనా మనిషేకదా.సుఖానికేమో గాని, కష్టానికీ, దుఃఖానికీ, ఆవేదనకీ, అన్యాయానికీ దేశాలూ, సంస్కృతీ - సంప్రదాయాలూ అతీతం కదా.

మెట్లు దిగి బయటికొచ్చాక కూడా మళ్ళా ఎప్పుడు చూస్తానో అని చేత్తో తడిమాను, మోర్గాన్ అనే ఆ పెద్ద చెక్క ఓడని.

******************************************************************************
నేను ఇంజనీరింగు చేసిన కాలేజి హైదరాబాదు ఊరి శివార్లలో ఉంటుంది. సిటీ నుంచి మా కాలేజీకి వెళ్ళాలంటే గోల్కొండ కోట మీదగా వెళ్ళాలి.బస్సు కిటికీలోంచి ఆ కోటని ఒక్కసారి పరికించి వెంటనే రోడ్డు కిరుపక్కలున్న పోలాలవైపు దృష్టి సారిస్తాను. కోటని ఆక్రమించటానికి తొమ్మిది నెలలపాటు కష్టపడ్డ ఔరంగజేబు ఇదిగో ఈ చుట్టుపక్కలే తన సైన్యాన్ని మొహరించి ఉంటాడు. ఇప్పటి పచ్చటి పోలాలున్న ఈ భూమి ఒకప్పుడు వెచ్చటి రక్తంతో తడిసి ఉంటుంది . కుట్రలకీ కుతంత్రాలకీ మూగ సాక్షి అయి ఉంటుంది.

రాత్రిపూటో,ఏదో ఎక్జాము టెన్షన్స్ ఉన్నప్పుడో, మరెప్పుడో తప్పితే దాదాపు ప్రతిసారీ అక్కడికి రాగానే ఇదే ఆలోచన.

గోల్కొండ కోట చూసినపుడూ ఇలాంటివే ఆలోచనలు. అవి మొండి గోడలే కావచ్చు. కానీ మనకెవ్వరికీ తెలీని రాచరిక రహస్యాలు తమలో ఇముడ్చుకున్నవవి. వైభవాన్నీ,పతనాన్నీ రెంటినీ సమానంగా నిశ్చలంగా వీక్షించిన గవాక్షాలవి.

****************************************************************************

కొన్నేళ్ళ క్రితం అలానే యాదగిరి గుట్ట నుంచి తిరిగి హైదరాబాదు వస్తూ ఆ భువనగిరి కోట ఎక్కాము. చాలా చిన్న కోట. నిజానికి అదొక ఖైదీల్ని ఉంచటానికి వాడే జైలు(అట). అలానే ఒక రకమైన గార్డు పాయింటు లాంటిదట ఆ కోట. శత్రువు లెవరైనా గోల్కొండ మీద దాడికి వస్తుంటే ముందే తెలియడానికి కట్టుకున్న కోటన్నమాట. ఫ్రెండ్స్ అందరు కిందికి చూసి ఆ వ్యూ బావుంది ఈ వ్యూ బావుంది అంటున్నారు. నాక్కూడా అవి బావున్నా, నా బుర్రలో మాత్రం అంతకు మించిన ఆలోచనలు.

ఎప్పుడు కట్టారో దీన్ని? ఎన్ని వందల వేలమంది కష్టపడ్డారో కదా.

ఆ మెట్ల మీద నడుస్తున్నా,అక్కడక్కడ ఉన్న అరుగులమీద కూర్చున్నా ఎన్నో ఆలోచనలు. ఇప్పుడంటే పాడుపడి పోయింది కానీ కొన్ని వందల ఏళ్ళ క్రితం అదొక సజీవ దృశ్యం. ఎన్ని సాయంత్రాలు ఆకోట దివిటీల వెలుగులో ఆ మసక వెలుతురులో తన ఉనికి నిలుపుకుందో.ఆ చీకటి గదుల్లో ఒకప్పుడు ఎన్ని గొంతులు ప్రతిధ్వనించాయో కదా.

అక్కడ కట్టిన గోడని చూసినా, ద్వారాన్ని చూసినా ఎన్నో ఆలోచనలు. రాయి పై రాయి పెట్టి వాటిని నిలబెట్టిన చేతులు ఎవరివో కదా? భుక్తో , ప్రభుభక్తో ఏదయితేనేం, ప్రభు దాసుడో, కారాగారవాసో ఎవరైతేనేం, ఏ చెమటలుగక్కే మధ్యాహ్నమో, మసక చీకటి నాటి సాయంత్రమో, చల్లగాలులు వీచే ప్రాతః వేళో ఆ రాయి అక్కడ పెట్టబడింది. ఎవరు పెట్టారో దాన్ని.ఒక్కసారి తడిమి చూద్దాం అనిపిస్తుంది నాకు. ఆ శ్రమజీవి తాలూకు తరాలకి తరాలు గడిచిపోయినా నాటి శ్రమ ఇప్పటికీ సజీవంగా,మన కళ్ళ ముందు.ఎవరై ఉంటారా వ్యక్తి?..

**************************************************************************

కోపెన్ హేగన్ (డెన్మార్కు) ...2003 ఒక వేసవి కాలపు మధ్యాహ్నం.

ఆఫీసు పని ముందే ముగించుకొని బయటపడ్డాను.ఇంతముందే ఇంటికి వెళ్లి ఏంచేస్తాను అని, అనుకున్నదే తడవు తరువాతి స్టేషనులో ట్రైన్ ఆగగానే దిగేశా. జనంతో కిటకిటలాడుతున్న ఉన్న ఆ ఇరుకు వీదుల్లో తిరుగుతూ ఉంటే ఏవేవో ఆలోచనలు. యూరోప్ అనగానే నాకు మొట్టమొదటగా గుర్తుకొచ్చేది,హిట్లర్ -రెండో ప్రపంచయుద్దం .(అంతకుముందు యూరప్ కి చరిత్రేమీలేనట్టు :) ). రెండో ప్రపంచ యుద్ధం గురించి ఎంత విన్నా, ఎంత చదివినా, ఎన్ని సినిమాలు చూసినా నాకు ఎప్పటికీ తరగని ఆసక్తి.

ఎడతెరిపి లేకుండా వాహనాలు పరిగెడుతూ ఉండే ప్రధాన వీధినానుకొనే,చిన్న చిన్న నాపరాళ్ళు పరిచి ఉన్న పెద్ద మైదానం లాంటి ప్రదేశం, దానికి మూడువైపులా అద్భుతమైన భవనాలు. చర్చిలా కనపడే పెద్ద భవనం ముందు మెట్లపై కూర్చున్నాను.

హిట్లర్ లాంటి వ్యక్తిని కూడా స్నేహపూర్వకంగా ఉంటే ఎవరూ మనవైపు చూడరులే అని అమాయకంగా నమ్మి మోసపోయిన దేశం డెన్మార్క్ . బహుశా 63 ఏళ్ళ క్రితం ఈ ప్రదేశం కూడా సైనికుల పద ఘట్టనల కింద నలిగి పోయి ఉంటుంది. దాడి అనివార్యం అని తెలిసిన మరుక్షణం అప్పటి ప్రజల మానసిక స్థితి ఎలా ఉండుంటుంది? రక్తం ఏరులై పారక పోయినా, బహుశా ప్రదేశం భయ గుప్పిట్లో గిజగిజలాడిపోయి,నిర్మానుష్యమై ఉండి ఉంటుంది. సైరన్లతో,ఆకాశంలో జర్మన్ యుద్దవిమానాల రొదతో దద్దరిల్లి ఉంటుంది.

ఇలా ఏవేవో ఆలోచనలు.అక్కడే అలా తిరుగుతూ ఉండిపోయాను. రాత్రి పదిన్నర వరకూ.పశ్చిమాన సూర్యుడస్తమించేవరకూ ..

****************************************************************************
ఆ సీపోర్టు లో ఒకాయన మాటల్లో ఇలా అన్నాడు. "అప్పట్లో అది వాళ్ళ జీవన విధానం. రోజు తర్వాత రోజు గడిపేయడమే వాళ్ళు చేసింది.అప్పట్లో వాళ్ళు అనుభవించిన దానికంటే ఎక్కువ ఇప్పుడు మనం ఆ రోజుల గురించి ఆలోచించి అనుభవిస్తాం. గతం తో రోమాన్స్ అంటే ఇదే" అని పెద్దగా నవ్వేసాడు.

నిజమే కదా.ఆలోచించే హృదయం ఉండాలేకానీ ఆ రోమాన్స్ ఎంత బాగుంటుందో కదా.సంతోషం, దుఃఖం, బాధ, దిగులు, అన్నీ ఏక కాలంలో కలుగుతాయి. మన ప్రాంతం అయినా కాకున్నా, మన సంబంధీకులు అయినా,కాకున్నా, కొన్ని వందల ఏళ్ళ క్రితం జీవించి కాల గర్భంలో కలసి పోయినా, వాళ్ళని తలచుకొని ఆనందపడతాం. దిగులు పడతాం. ఏదైనా విషాదగాధ వింటే ఉబికివచ్చే కన్నీళ్ళ నాపుకుంటాం.

నేర్చుకోగాలగాలే గాని, చరిత్ర నేర్పే పాఠాలెన్నో.చూపించే జీవిత సత్యాలెన్నో.

17 comments:

santhi said...

Good one.

చిన్ని said...

అచ్చు ఒక్క మాట కూడా పొల్లు పోకుండా నేను ఇలానే ఆలోచిస్తాను.నాకు చరిత్ర ప్రాణం.చదువుతూ ,చూస్తూ అక్కడికి వెళ్ళిపోతాను .కొన్నాల్లక్రితం చివరి పాలకులు (యురేపియన్స్ ఆక్రమించాక ). హైదర్ఆలి,టిప్పు ల కోటలు వేసవివిడుదులు ,సమాధులు మైసూర్ ,శ్రీరంగపట్నం ,బెంగళూర్ లో చూసి ఎంతో దిగులుపడాను. ఆ ప్రాంగణం లో కూర్చుని మైసూరు యుద్దాలు తలుచుకుని హైదర్ చనిపోయిన తీరు గుర్తొచ్చి ఆ ప్రదేశం చూసి కలత పడిపోయాను.ఇలా ఎన్నో ఎన్నెన్నో ...
చాలా బాగా రాసారు.చాల విపులంగా.మీతో పాటు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి చూపించేశారు .... . .

భావన said...

అవునండి. నేను కూడా అలానే ఫీల్ అయ్యాను మిస్టిక్ సీ పోర్ట్ కు వెళ్ళినప్పుడు. అదే కాదు గోల్కొండ కెళ్ళినప్పుడూ రాజస్తాన్ లో పాత శివాలయం చూసినప్పుడూఇంకా వాళ్ళ భావాలు వాళ్ళ వ్యక్తిత్వం అక్కడే గాలి లో గింగిరాలు తిరుగుతూ వుందేమో అనిపిస్తుంది నాకు.

శేఖర్ పెద్దగోపు said...

గోల్కండకి వెళ్ళినప్పుడైతే రామదాసు చెరసాల చూసినప్పుడు నేను ఇలానే ఫీలయ్యాను...అయితే హిస్టరీని ఇలా ప్రాక్టికల్ గా చూస్తున్నప్పుడు తల్చుకోవటం బాగానే ఉంటుంది కానీ చదవటం నా వల్ల కాదండీ..:) హిస్టరీ రోస్టు కన్న రెస్ట్ మేలు...:-)

మురళి said...

చరిత్ర అంటే నాక్కూడా చాలా ఇష్టం అండీ.. హైదరాబాదు లో ఇప్పటివరకూ నేను ఎక్కువ సార్లు చూసిన ప్రదేశం గోల్కొండ కోట.. చూసిన ప్రతిసారీ ఒకలాంటి ఉద్వేగానికి గురవుతూ ఉంటూ ఉంటాను.. అలా అని చూడడం మానలేను.. పాతకాలపు కట్టడాలు, ఆలయాలు, జమీందారుల భవంతులు..ఇలా ఏవి చూసినా ఆరోజుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాను.. గతం తో రొమాన్స్ అన్నమాట!! ఎప్పటిలాగే చాలా బాగుంది మీ టపా..

జయ said...

గతం గత: అని చివరికి 'చరిత్ర ' చెప్పుకోటానికి కూడా మిగిలేటట్లు లేదు. చరిత్ర ఆనవాళ్ళు చెరిగిపోతున్నాయి. శిధిలాలు కూడా కనుమరుగైపోతున్నాయి. ఇక ముందు తరాలకు చరిత్ర అన్న పదమే తెలియని ప్రమాదం పొంచిఉంది. ఘనకీర్తి కలిగిన ఈ ధ్వంశమైపోతున్న మన చరిత్ర ను కాపాడగలమా! నాకెంతో ఇష్టమైన కొన్ని చారిత్రక ప్రానతాల్లో పర్యటిస్తున్నప్పుడు అనిర్వచనీయమైన తృప్తితో...పోటీగా నాలో ఈ అసంతృప్తి కూడా ముందుకు తోసుకొస్తూనే ఉంటుంది.
శేఖర్, హిస్టరీ రొస్టా నేనొప్పుకోను.

వేణూ శ్రీకాంత్ said...

మంచిటపా చాలా బాగుంది. సాధారణంగా ఇలాంటి చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశానికి వెళ్ళినపుడు నేను మాములుగా చూస్తుంటాను కానీ కాస్త సమయం గడిచాక ఉన్నట్లుండి ఇలాంటి ఆలోచనలు అలల్లా అలా వచ్చి వెళ్తుంటాయ్ :-)

గతమన్నా చరిత్ర అన్నా నాకూ అంతులేని ఇష్టం కానీ పుస్తకాలలో తేదీలతో సహా బట్టీ పట్టాల్సిన చరిత్ర పాఠాలు అంటే మాత్రం బోలెడంత కష్టం.

శేఖర్ పెద్దగోపు said...

@జయగారు,
హిస్టరీ అంటేనే ఒక్కొక్క ప్రశ్నకు ఓ నాలుగైదు పేజీల ఆన్సర్ ఉంటుంది..అందులో వేణు అన్నట్టు గుర్తు పెట్టుకోవల్సిన తేదీలు అదనం..చదువుతున్నప్పుడు ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే అంత పెద్ద ఆన్సర్ బట్టీ పట్టలేక ఏడుపొచ్చేది నాకు...అందుకే అలా అన్నానండి...కానీ చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు చూస్తూ వాటి గురించి వినటం/తెలుసుకోవటం మాత్రం చాలా ఇంటరెస్టింగా ఉంటాయి నాకు...

Dharanija said...

nenoo mee laagaane alochisthanandee.nenu charitra vidyarthinini .andulo leenamai pothaanu.chaalaa thanks manchi post andinchinanduku.

ఉమాశంకర్ said...

@Santhi: Thank you.

@చిన్ని: ఎందుకో అనిపించింది మీనుంచి ఇలాంటి వ్యాఖ్య వస్తుందని.నిజమైంది.

@భావన: మిస్టిక్ సీపోర్టు మీరు కూడా చూసారా? అయితే అక్కడ మీకు బాగానచ్చినదేదో చెప్పండి (గుర్తుంటే)

శేఖర్: మీరన్నట్టు, చదివి , మార్కులకోసంబట్టీ పట్టడంవేరు, ఇప్పుడు చదివి తెలుసుకొని ఆస్వాదించడం వేరు.

@ మురళి: Thank you

జయ : నిజమేనండీ..అటువంటి వార్తలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది నాకు. నేను ఇప్పటి వరకూ చూసిన వాటిల్లో ఒక్క గోల్కొండ కోటని మాత్రమే ఎంతోకొంత పునరుద్దరించారు.( నాకైతే అది టూరిజం ని దృష్టిలో పెట్టుకొని చేశారనిపిస్తుంది.). ఆలనా పాలనా లేక మట్టికొట్టుకుపోతున్నవెన్నో.

@వేణూ శ్రీకాంత్ : Thank you

@Dharanija : Thank you for visiting my blog and leaving a comment.

హారం ప్రచారకులు said...

ఉమాశంకర్ గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

Vinay Chakravarthi.Gogineni said...

enta baaga raasaaru...

"gatam to romance" enta baaga cheppadu tanu

తృష్ణ said...

చాలా రోజులకు ఇటు వచ్చానండీ...బాగుండి టపా. నాకూ చరిత్ర అంటే ఎంతో ఆసక్తి. ఏదైనా కోటనూ, చారిత్రాత్మక ప్రదేశాలనూ చూసినప్పుడు మీరు రాసిన భావాలే మనసులో మెదులుతూ ఉంటాయి. మన ఇవాళ కూడా రేపటి తరానికి చరిత్రే కదా అనుకుంటూ ఉంటాను.

3lok said...

నాకయితే ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచనలు రాలేదు కాని ఇప్డు మీ పోస్ట్ చదివాక వస్తాయేమో అనిపిస్తుంది. చాలా బాగుంది.

Vasu said...

అద్భుతంగా ఉంది. నాకు కోణార్క్ ఆలయం చూసినప్పుడు, దక్షినాది దేవాలయాల గురించి విన్నప్పుడు ఇలాటి ఆలోచనలు కలిగాయి.
ముఖ్యంగా కోణార్క్ చూశాక ఎన్నాళ్ళైనా ఆ అభుభూతి చెక్కు చెదరకుండా ఉండి పోయింది. ఇది ఇంకా గుడిలా ఉంటే, వెనకాల ఉన్నా పెద్ద గోపురం కూలిపోకుండా ఉంటే అని ఎన్ని సార్లు అనుకున్నానో నాకే తెలియదు.
ఒరిస్సా లో ఎన్ని ఉన్నాయి ఇలా చరిత్రకి సాక్ష్యాలు.

"Romance with the past" చాల అందంగా చెప్పారు.
స్టొరీ అఫ్ ఇండియా (మైకేల్ వుడ్ ) చూసినప్పుడు మొదటి భాగాలలో ఉన్నంత ఆసక్తి చివరి భాగాలలో అంటే ఇరవయ్యో శతాబ్దం గురించి చెప్తుంటే ఉండదు.
మరి ఇది ఖచ్చితంగా "Romance with the past".

చాణక్య లాటివి చూసినప్పుడు ఇదే భావన.
తెలుగలో కాకతీయుల మీద శాతవాహనుల మీద సినిమా ఇప్ప్పటి వరకూ ఎందుకు రాలేదో నాకర్థం కాదు (వచ్చి కూడా నేను చూడలేదేమో)

Snkr said...

హూఁ... బాగా చెప్పారు.
ఎప్పుడో చిన్నప్పుడు చూసిన హంపి నగరం నన్ను పెద్దయ్యాక కూడా అలా వెంటాడేది. మిమ్మల్నైతే అక్కడే నాలుగురోజులుండి తనివితీరా ఏడ్చేలా చేస్తుందేమో. బహమనీ ముష్కరుల చేతుల్లో చేతులు, ముక్కులు చిద్రం చేయబడ్డ అందమైన రాతి విగ్రహాలు ఏదో తెలియని ఉద్వేగాన్ని కలిగిస్తాయి. సంస్కృతిని ద్వంసం చేసి, నామరూపాల్లేకుండా చేసి నీచమైన అనాగరిక ప్రవృత్తి మొఘలులది. బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నా, కనీసం విగ్రహాలను ద్వంసం చేసే నీచులు కాదు.

Snkr said...

ఎన్నైనా చెప్పండి హిట్లర్ అంటేనే ఓ ఉద్వేగం, ఓ ఉత్తేజం,... ( ఓవరాల్‌గా నచ్చకపోయినా)మెచ్చుకోదగ్గ పర్సనాలిటీ. ఒక్క మనిషి అంతమందిని ప్రభావితం చేసి, ప్రపంచాన్ని గడగడ లాడించాడంటే...simply great!

 
అనంతం - by Templates para novo blogger