భజ గోవిందం

Monday, July 11, 2011

కొన్ని ఉదయాలు మొదలవడమే ఎంతో ఉత్తేజపూరితంగా మొదలవుతాయి. మిగతా రోజులు నీరసంగానూ, నిస్తేజంగానూ.

ఎందుకలాగ అని కొన్ని సార్లు అనిపిస్తుంది. క్రితం రోజు ఏమేమి పనులు చేసానా, ఈ ఉల్లాసానికీ, ఉత్సాహానికి కారణమేమిటా? అని ఆలోచిస్తే , ఆ క్రితం రోజు మిగతా రోజుల్లాగే సర్వ సాధారణంగా గడిచి ఉంటుంది.పేద్ద చెప్పుకోదగ్గవేమీ ఉండవు.

నీరసంగా మొదలైన రోజుల్లో మాత్రం ఉదయాన్నే లేవగానే , కాఫీ కప్పు పుచ్చుకొని కంప్యూటరు ముందు తిష్ట వేస్తాను ఒక అరగంట. యు ట్యూబు లో పాటలు చూడ్డంతో నా రోజు మొదలవుతుంది. మిగతా పాటల సంగతెలా ఉన్నా, మొట్ట మొదటగా వినేది మాత్రం "భజగోవిందం " . ఎమ్మెస్ గళం లో "స్థాపకాయచ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే" వింటూనే అప్పటివరకూ తిష్టవేసుక్కూర్చున్న నిరాశా నిస్పృహలు నెమ్మదిగా మాయమై ఏదో ధైర్యం నాలో గూడు కట్టుకొనడం మొదలవుతుంది. ఈ "చిన్న చిన్న చికాకులూ,సమస్యలూ అసలు సమస్యలే కావూ, నిజం తెలుసుకో" అంటూ ఎవరో శ్రేయోభిలాషి నా పక్కనే ఉండి నాకు బోధ పరుస్తున్నట్టు అనిపిస్తుంది.

"సంప్రాప్తే,సన్నిహితే కాలే" ఈ జీవితాన్ని ఎంత నిరర్ధకంగా గడుపుతున్నానో అని హెచ్చరిస్తుంది. సమస్యలు దూదిపింజలై పోతాయి ..

2004 నుంచి ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు.

విచిత్రమేమిటంటే అంతకు ముందు ఒకటి అరా సార్లు దీన్ని విన్నా, అంతగా పట్టించుకోలేదు. దీన్ని నాకు పరిచయం చేసి, దీని వెనుకున్న కథనీ, అర్ధాన్నీ నాకు తెలియజేసింది ఒకమ్మాయి,అదికూడా ఎవరూ ఊహించని టైములో..


2004 లో ఉద్యోగార్ధం అమెరికాకి ప్రయాణమైన నాకు ముంబై ఎయిర్ పోర్టులో పరిచయమయిందీ హైదరాబాదీ తెలుగమ్మాయి. ఫ్లైటు ఎక్కబోయే ముందు ఎస్టీడీ బూత్ దగ్గర హైదరాబాదు ఫోన్ చేసి అమ్మకి ఫ్లైటు ఎక్కబోతున్నాను అనిచెబ్దామనుకుంటున్నప్పుడు ,తన పేరెంట్స్ కి ఫోన్ చేయటానికి అదే ఫోన్ దగ్గరికి తనూ రావటంతో మొదలయింది పరిచయం.


తను వెళ్ళేదేమో న్యూయార్క్ కి , నేను విస్కాన్సిన్ కి. ఆమ్ స్టర్ డాం లో మెయిల్ ఐడీ తీసుకొని బై బై చెప్పేసుకున్నాం.ఆ తరువాత తరచుగా ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం. తన కాలేజీ కష్టాలూ, నా ఉద్యోగపు వెతలూ, నా ఒంటరితనమూ ( కారు లేదు. అపార్టు మెంటులో నేను ఒక్కడినే, విస్కాన్సిన్ లో ఒక చిన్న పల్లెటూళ్ళో.అందునా జనవరి మాసం , ఫారెన్ హైట్లో సైతం మైనస్ లలో ఉండే ఉష్ణోగ్రత ..డిప్రెషను రాదూ అంటే ఎందుకు రాదు మరి?) ..ఒకరి కొకరం ధైర్యం చెప్పుకొనే వాళ్ళం.ఇప్పుడాలోచిస్తే గమ్మత్తుగా ఉంటుంది.

ఫోన్ లో మేము కవర్ చేయని టాపిక్కంటూ ఉండేది కాదు.తను రాసిన కవితో, చదివిన పుస్తకమో, వినాయక చవితి పండగో, కేంపస్ లో జరిగిన మగ్గింగో .. టాపిక్కు లకు కొదవుండేది కాదు.

ఒకసారెప్పుడో శుక్రవారం రాత్రి 11 గంటలకు తననుంచి ఫోన్...బహుశా నిద్ర పట్టలేదేమో..లేదా ఏదో చికాకులో ఉందో..సరిగా గుర్తు లేదు..

ఓ గంట తరువాత సంభాషణ ఎలా వెళ్లిందో గుర్తు లేదు గాని ,టక్కున అడిగింది "మీరు భజ గోవిందం, ఎప్పుడైనా విన్నారా" అని. "లేదండీ " అని నేను.

తన మాటల ప్రవాహం ఎలా ఉంటుందంటే తను చదివిన పుస్తకం గానీ, లేదా చూసిన సినిమానో లాంటి విషయాలు తను చెప్తుంటే వినే అవతలి వ్యక్తి చేయగలిగేది "ఊ" కొట్టడం మాత్రమే. ఇప్పుడూ అంతే..నాకు ఆశ్చర్యమని పించిది మాత్రం తను "భజ గోవిందం" స్తోత్రం మొత్తాన్నీ పాడి వినిపించటం, దాని అర్ధాన్ని తనకి తోచిన ఉదాహరణలతో నాకు వివరించటం. ఎప్పుడో తెల్లవారు ఝాము మూడూ,మూడున్నరకి మా సంభాషణ ముగిసింది.

ఉద్యోగం పేరిట నేను చేసే నిర్లక్ష్యానికి ప్రతీకగా ఆ పరిచయం కూడా ఎప్పుడో ముగిసింది. కొన్ని జ్ఞాపకాలు మాత్రం మిగిలాయి. వాటిల్లో ఇదొక మధురమైన జ్ఞాపకం.

నాకిష్టమైన మరి రెండు లైన్లు, నేను మరీ మరీ రివైండు చేసుకొని మరీ వినేవి..

"పునరపి జననం, పునరపి మరణం........"

"అర్ధ మనర్ధం, భావయే నిత్యం...."

తనకి... "వన్స్ అగైన్ , థాంక్యు "

శుభమస్తు..

14 comments:

మురళి said...

ఇవాళ నా జాతకంలో 'పాత మిత్రుల కలయిక' అని ఉంటే ఏమిటో అనుకున్నా..
బ్లాగుల్లోకి పునః స్వాగతం.. చక్కటి టపాతో ప్రారంభించారు.. ఇలాగే కొనసాగించాలి..
ఒక కో-ఇన్సిడెన్స్ తో ఈ వ్యాఖ్య ముగిస్తానండీ.. మీకు ఇష్టమైన లైన్లే నాకూ చాలా ఇష్టం.. ముఖ్యంగా 'పునరపి జననం...'

చిన్ని said...

bagundandee.ilaa udyoga badyathallo padi manchi mitrulni dooram chesukokudadandee:-)

భాస్కర్ రామరాజు said...

:):)
శ్రీ ఆది శంకారాచార్య విరచిత *భజగోవిందం*, ఉమాశంకరుల విశ్లేషణలో ఆత్భుతంగా ఉంది అన్నాయ్!!

శుభం!!
-భాస్‌కరుడు

Rao S Lakkaraju said...

ఎప్పుడో 50 ఏళ్ళ క్రిందట విశాఖపట్నంలో చిన్మయానంద "భజగోవిందం" ఉపన్యాసం విన్నాను. ఇంకా మనసులో మెదులుతోంది. కొన్ని అలా గుర్తు ఉండిపోవటం మంచిదేమో. మన ఉనికిని ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాయి. థాంక్స్ ఫర్ పోస్టింగ్.

ఉమాశంకర్ said...

@మురళి గారు, థాంక్స్ అండీ..మీ వ్యాఖ్య చూడగానే పాత బ్లాగు రోజులు గుర్తొచ్చాయి..తరచుగా రాద్దామని ప్రయత్నం. :)

రాగ భావ యుక్తంగా , ఎమ్మెస్ గారి కంటే బాగా ఎవరు పాడగలరు చెప్పండి? ముఖ్యంగా "పునరపి మరణం" ని కొద్దిగా సాగదీసినట్టు పాడడం అదోరకమైన అలౌకిక ఆనందం కలగజేస్తుంది నాకు.

@చిన్ని గారు, నిజమేనండీ..కొన్ని పరిచయాలను మళ్ళా పునః ప్రారంభించే పనిలో ఉన్నాను.

@భాస్కర్ గారూ, థాంక్స్ అండీ. విశ్లేషించగలవాడినా నేను? శంకరాచార్య విరచితం, ఎమ్మెస్ గళం లతో కూడుకున్న చక్కటి జ్ఞాపకాన్ని పంచుకోవడమే నా ఉద్దేశం.

@రాజు గారూ, అవునండీ, ఇలాంటివి మన ఉనికిని గుర్తు చేస్తాయి.. థాంక్స్ అండీ..

sunita said...

naadee muraLigaari maaTae! enniroejula taruvaata? manchi manchi poesTulakai eduru choostoo.....

వేణూ శ్రీకాంత్ said...

పునరాహ్వానం ఉమాశంకర్ గారు.. మీ నుండి కొత్త టపా చూడటం చాలా సంతోషాన్నిచ్చింది.
ఒక సమయంలో నేను దదాపు ప్రతి ఉదయం వినేవాడిని ఈ భజగోవిందం.
"సంప్రాప్తే, సన్నిహితే కాలే"
"పునరపి జననం, పునరపి మరణం......"
ఈ రెండు లైన్ల దగ్గర ఎమ్మెస్ గారి స్వరం అద్భుతం.. తను పలికే తీరు ప్రత్యేకించి చెప్తున్నట్లు అనిపిస్తుంది. ఆ లైన్లు నాకు అంతగా నచ్చడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. చాలా నచ్చింది టపా.
మీరు మురళి గారికి ఇచ్చిన జవాబులో “తరచుగా రాద్దామని ప్రయత్నం” అన్నలైన్ చూసి మరింత సంతోషమేసింది :)

మేధ said...

చాలా రోజులకి :)
నేను ఇండియాలో విన్నప్పుడు విన్నా వినకపోయినా కొరియాలో ఉన్నప్పుడు మాత్రం రోజూ లేవగానే వింటూ ఉండేదాన్ని...
మీరు చెప్పిన లైన్లు, ఇంకా "సంప్రాప్తే సన్నిహితే కాలే - నహి నహి రక్షతి" బాగా ఇష్టం..

KumarN said...

After long time!! Nice to see you back :-)
KumarN

ఉమాశంకర్ said...

సునీత గారు, థాంక్స్ అండీ , ప్రయత్నిస్తాను : )

శ్రీకాంత్ గారు, Thank you

KumarN: Thanks Sir.Yes, been a long time and i wish it will never be so long again...:)

మేధ : Thanks andee.

తృష్ణ said...

వేణూగారి బజ్జులో లింక్ చూసి ఇటు వచ్చానండి...చాలా రోజులకు రాసారు. తరచూ మీ టపాలు కనబడాలని కోరుతున్నాం..:)

నాకూ ఎమ్మెస్ గళంలో భజగోవిందం చాలా ఇష్టమండి..
http://samgeetapriyaa.blogspot.com/2010/09/blog-post_17.html
...:)))

Padmavalli said...

ఉమాశంకర్ గారూ, మీ బ్లాగ్ కి వేణుశ్రీకాంత్ గారి పరిచయంతో వచ్చాను. ఇంత మంచి బ్లాగ్ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో తెలీదు. ఇప్పుడే కొన్ని పాత పోస్టులు కూడా చదివాను. మీ ఆలోచనలు, స్పందనలతో నాకు చాలా సారూప్యం కనిపిస్తుంది, ముఖ్యంగా ఎటాచ్మెంట్స్ అండ్ ఫీలింగ్స్ విషయంలో. ఇంకా నా మనసు ఈ టపాలు చదివిన హాంగోవర్ నుంచి తేరుకోలేదు.
ముందుగా మీ లేటెస్ట్ టపా గురించి... భజగోవిందం గురించి నేను వేరుగా చెప్పాల్సింది ఏమి లేదు. సంప్రాప్తే.. సన్నిహితే కాలే .. పునరపి జననం పునరపి మరణం. అంతే.... ఇక మీరు చెప్పినట్టు కొన్ని విషయాలు విశేషణాలు వ్యక్తులతో ముడిపడటం. ఇది నాకు కూడా చాలా అనుభవం. కొందరు వ్యక్తులు, మనకి అంతగా పరిచయం కూడా ఉండక పోవచ్చు. ఏదో ఒక చిన్న సంఘటన మాత్రమే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని ఒక జీవితకాలం పాటు కూడా గుర్తు చేసుకోక పోవచ్చు మనం. కాని సడన్గా ఎక్కడి నుండో ఊడిపడినట్టు, ఎన్నో ఏళ్ళ తర్వాత సమయం సందర్భం లేకుండా ఆ విషయమో, లేకపోతే ఆ వ్యక్తో కళ్ళముందు ఒకసారి మెదులుతారు. ఆవును కదా, వీళ్ళు మనకు తెలుసు కదా, ఎలా మర్చిపోయమబ్బా అని అనిపిస్తుంది. కొందరితో పరిచయం అతి చిన్నదే అయినా, వాళ్ళ జ్ఞాపకాలు పరిమళం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

మీ "చరిత్రంటే నాకిష్టం" గురించి, నాకు చరిత్ర అంటే ఇష్టం లేదు. అంటే యుద్ధాలు, తేదీలు, పరాజయాలు గుర్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. ఈ వొక్క రోజు చదివితే చాలు ఇక జన్మలో చదవక్కరలేదు అని ఏడుస్తూనే, టెన్త్ క్లాస్స్లో సోషల్ పరీక్ష రోజు ఉదయం చదవటం ఇంకా జ్ఞాపకం, దాదాపు పాతికేళ్ళు అయినా కూడా. కానీ ఆ చరిత్ర మిగిల్చిన గుర్తులు, గుణపాఠాలు చూసినపుడు మాత్రం మీలాగే "రాళ్లెత్తిన కూలీలెవ్వరు" అనో లేక ఏ రాణి ప్రేమపురాణమో కారణం కదా అనో ఆలోచిస్తూ, మనసు బరువేక్కించుకొని బయటపడతాను. అవి కొన్ని రోజుల పాటు వెంటాడి వెంటాడి వేధిస్తాయి.

"ప్రాజెక్టు అయిపోతుంది": ఏం చెప్పమంటారు, ఉద్యోగం మారాల్సి వచ్చినప్పుడల్లా అంతే. రోజులు లెక్కపెడుతూ రేపటి నుంచి, వీళ్ళందరూ ఇలాగే ఉంటారు, అన్నీ ఇలాగే ఉంటాయి, కాని ఇక్కడ నేనే ఉండను కదా అనీ, నన్ను చూడకపోతే మిగతా వాళ్ళు ఎమైపోతారో అనీ బెంగ పెట్టేసుకొని, పర్సనల్ వస్తువులు పెట్టుకొని ఎంతో అపురూపంగా చూసుకున్న డెస్క్ని తడుముకొని చూసుకోవటం నించీ, మొక్క మొక్కని, గోడ గోడని పేరు పేరున పలకరించటం వరకూ.... ఒకటే కధ..

ప్రస్తుతానికి ఇంతే. మిగతావి కూడా చదివి అపుడు మళ్ళీ.

ఉమాశంకర్ said...

Trushna gaaru, Thank you. And thanks to you too Venu Srikanth. :)

@Padmavalli gaaru, Thanks to you for your time reading my blog and for the comment.

jhanu said...

Hi Uma sankar garu,
nenu 2 days back mee post okati choosanu.daani tarvaata i couldnt stop reading all your posts.Chaala chaala chaala baagunnayi...mukyam ga mee US experiences. 2011 lo oke oka poste raasinattunnaru..please continue with your posts.meeru 2009 lo raasinan vaatikante ekkuva tapa lu 2011 raayalani korukuntunnanu.

 
అనంతం - by Templates para novo blogger