నే చదివిన ఒకానొక మంచి కధ

Tuesday, December 2, 2008

నేనప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను,నేను నా చిన్నప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్ని సినిమాలు చూసిఉంటాను? అని. నాలుగొందలు? ఆరొందలు? వెయ్యి? అమ్మో వెయ్యా? అన్నుండవు. ఏమో లే,తెలుసుకొని చేసేదేముంది.
మొన్నీమధ్య అదేరీతిలో ఇంకొక ఆలోచనొచ్చింది. చిన్నప్పటినుంచి ఇప్పటివరకు ఎన్ని కధలు చదివి ఉంటాను అని.వెయ్యేం ఖర్మ ఆపైన ఇంకో వెయ్యి కూడా వేసుకోవచ్చు అనిపిస్తుంది.సరే మరి, ఆ చదివిన వాటన్నిటిలోకల్లా మంచి కధ ఏది? చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే చదివిన వాటిల్లో ముప్పాతికొంతు అసలు గుర్తేలేవు కనుక.ఈ ఇంటెర్నెట్ పుణ్యమా అని ఇప్పటికీ రెగ్యులర్ గా ఆన్లైన్లో దొరికిన కధనల్లా చదువుతూనే ఉన్నా. వాటిల్లో నాకు బాగా నచ్చిన కధ శ్రీరమణ గారి "బంగారు మురుగు". మొట్టమొదటసారి ఆ కధని చదివేటప్పుడు కధ చివరకు రాగానే మనసంత ఏదో దిగులుగా అయిపోయింది. ఆ కధని ఆరొజే దాదాపు ఏ పదిసార్లో చదువుకొని ఉంటాను.అంత బాగా నచ్చింది నాకా కధ. నేను ఆన్ లైన్లో రాసిన మొట్టమొదటి కామెంటు కూడా ఆ కధకే. ఆతరువాత నేను చేసిన పని ఆ కధని ప్రింటవుటు తీసుకోవడం.ఈ నాలుగేళ్ళలో ఆ కధని ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు.
ఇక కధ విషయానికొస్తే ఇది ఒక బామ్మా మనవళ్ళ కధ. ఏదొ చాదస్తపు బామ్మ కాదు. ఎందుకు పుట్టామో చెపుతుంది, ఎలా బ్రతకాలో చెప్తుంది, ప్రేమంటే ఏమిటొ చెప్తుంది, సాటి ప్రాణి మీద దయలేని దైవభక్తి ఎంత నిరర్ధకమో చెప్తుంది,త్యాగమంటే ఏమిటో చెప్తుంది. చిట్టచివరిగా ఈ కధ అందరికీ తమ అమ్మమ్మల్నో, నానమ్మల్నో గుర్తు చేస్తుంది.
చక్కటి కధ. ఎక్కడా ఆగకుండా అలా చదివించే కధనం. ఇది శ్రీరమణ గారు రాసిన మొట్టమొదటి కధ అంటే నమ్మబుద్ది కాదు.
సరె, ఇక్కడ ఆకధ మీకోసం.


P.S: ఆ కధ కింద వచ్చిన కామెంట్లలో ఒకరు శ్రీరమణ గారు రాసిన "షోడానాయుడు" కధ గురించి ప్రస్తావించారు. మీకెవరికైనా ఆ కధ ఎక్కడైన ఆన్లైన్లో కనపడితే వివరాలిచ్చి పుణ్యం కట్టుకోగలరు.

8 comments:

సుజాత said...

ఆ కథ ఆన్లైన్లో లేదనే నా నమ్మకం! ఆ కథ, మిథునం, ధనలక్ష్మి,వరహాల బావి, బంగారు మురుగు ఇవన్నీ కలిసి "మిధునం" కథా సంకలనం గా వచ్చింది.ఆ పుస్తకం సంపాదిస్తే తప్ప షోడాల నాయుడు కథ చదవడం వీలవదు మరి! నా జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేని కథ మాత్రం మిథునమే! వండర్ ఫుల్ కథ!

ఉమాశంకర్ said...

సుజాత గారు,

ధాంక్సండి..సంపాదించి తీరాల్సిందే ఆ పుస్తకాన్ని ఎలాగైనా.ఈ ఒక్క కధతోనే నేనాయనకు వీరాభిమానినై పోయాను.. మీరు చెప్పేదాన్నిబట్టి నాకనిపిస్తొంది మిగతా కధలన్నీ ఏమాత్రం తీసిపోవని..

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మంచి కధ,యధాలాపంగా చాసో కధలు చాలా గుర్తొచ్చాయి,అవునూ చాసో గారివి ఎవరన్నా ఆన్ లైనులో అందుబాటులొ ఉంచారా??

సత్యప్రసాద్ అరిపిరాల said...

ఎంత అద్భుతమైన కథ..!! అందించిన మీకు నెనర్లు.
గతంలో నేను పలకబలపంలో రాసిన అక్షింతలు అనే కథకి వ్యాఖ్య ఇస్తూ ఒక మిత్రుడు ఈ కథ గుర్తుకు వచ్చిందన్నారు.

(http://palakabalapam.blogspot.com/2008/09/blog-post.html)

ఇన్నాల్టికి ఆ కథ చదివే అవకాశం కల్పించారు. (అలా కామెంటడం ఆ మిత్రుడి సహృదయమేగాని... శ్రీరమణగారి కథ అసమానం)

కొత్త పాళీ said...

చాలా మంచి కథ.
సుజాత గారు చెప్పినట్టు ఈ రచయిత రాసిన మరి కొన్ని కథల్తో కలిసి ఇది మిథునం అనే కథల సంపుటిలో వచ్చింది. హైదరాబాదు నివాసి, తెలుగు సాహిత్యం అంటే అభిమానం ఉన్న ఒక పారిశ్రామిక వేత్త తనొక్కడే సుమారు వెయ్యి కాపీలు కొని తన బంధుమిత్రులందరికీ పంచి పెట్టడమే కాక, చదివారా లేదా అని వాళ్ళ దుంప తెంచినట్టు పబ్లిషర్ నవోదయ రామ్మోహనరావుగారు చెప్పారు.

ఉమాశంకర్ said...

@రాజేంద్రప్రసాద్,సత్యప్రసాద్ గార్లకు: ధన్యవాదాలు.

రాజేంద్ర గారు: చూద్దాం ఎవరైనా స్పందిస్తారేమో..ఉదయంలోనో మరింకేదొ పత్రికలో చాసో గారి కాలం (లేదా కధలు) చదివినట్టు గుర్తు..


@సత్యప్రసాద్ గారు: ఆ కమెంటిన మిత్రుణ్ణి నేనేనండి..

ఉమాశంకర్ said...

కొత్తపాళీ గారు: Thank you

నిజానికి నేను కూడ నాకు బాగా పరిచయమున్న తెలుగు మిత్రులు చాలా మందికి ఈ కధ లింకు పంపండం జరిగింది గతంలో.

ఆణిముత్యాలు మరి.

నాగన్న said...

http://www.avkf.org/BookLink/book_link_index.php

 
అనంతం - by Templates para novo blogger