ఒక చలిలో వణికిన రాత్రి

Thursday, January 22, 2009

పెద్ద పెద్ద మంచు మేఘాలు దూసుకొస్తున్నాయ్ మావైపు. వెదర్ ఛానల్ వారి ప్రకారం మంచు కురవడం రాత్రి తొమ్మిదింటికి మొదలవుతుంది. ఇక రేపొద్దున ఆఫీసు కి టైము కి చేరుకోవాలంటే ఎంతైనా ఒక అరగంట ముందు లేవాల్సిందే. నిద్ర లేవగానే కిటికీ లోంచి చూస్తే ఎంత అందంగా ఉంటుందో, అంత నరకాన్నీ చూపిస్తుందీ మంచు బయటికి రాగానే. 2001 లో మొట్టమొదటి సారి నేను అమెరికాలో కాలుపెట్టినప్పుడు న్యూజెర్సీ లో ఈ చలి వాతావరణాన్ని , మంచు తుఫానుల్నీ చూసి అబ్బురపడిపోయినా, ఆజ్ఞాపకం అంతవరకే పరిమితం. పెద్ద చెప్పుకోదగ్గ సంఘటనలేమీ లేవు. ఆ ప్రాజెక్టు తరువాత తిరిగి ఇండియా వెళ్ళిపోయి మరలా 2003 జనవరి లో ఇదిగో యీ విస్కాన్సిన్ ప్రయాణం. ఆఫీసులో అందరూ విస్కాన్సిన్ చలి గురించి ఊదరగొట్టినా ఇదేమీ నాకు కొత్త కాదు అని ఫోజు కొట్టాను. అయినా నాజాగ్రత్తల్లొ నేనున్నాను. లెదర్ జాకెట్లూ, గ్లోవ్స్ , ధర్మల్ వేర్ గట్రా అన్నీ రెడీ గా పెట్టుకోవడం ద్వారా.

బొంబాయి లో విమానం రెండుగంటలు లేటు. దీని పుణ్యమా అని ఆమ్ స్టర్ డాం లో కనెక్టింగు విమానం కూడా గాల్లోకి ఒక రెండు గంటలు లేటు గా లేచింది. మినియాపోలిస్ లోని సెయింట్ పాల్ విమానాశ్రయం చేరే సరికి రాత్రి ఎనిమిదయింది. విమానం నేలమీదికి దిగినప్పటి నుంచి, అది గేటు వద్దకి వచ్చి, ఆగి, విమానం తలుపు తెరచుకొనేవరకు క్షణమొక యుగం గా గడిచింది నాకు. గేటు తెరుచుకోవడమే తరువాయి, నేను నా పద్దతికి విరుద్దం గా, "ఎక్స్క్యూజ్ మి,ఎక్స్క్యూజ్ మి" అంటూ జనాల కాళ్ళు తొక్కుకుంటూ, వాళ్ళు నావైపు విచిత్రం గా చూస్తున్నా పట్టించుకోకుండా, వాళ్ళు అడగకున్నా "నేను ఇంకొక పదిహేను నిమిషాలలో నా నెక్స్టు ఫ్లైట్ అందుకోవాలి" అంటూ వాళ్ళకి వివరణలిచ్చుకుంటూ గేటు వైపు దూసుకు పోయాను. నిజానికి తోమ్మిదింబావు కి నా చిట్టచివరి విమానం, విస్కాన్సిన్ లోని లక్రోస్ అనే ఒక చిన్ని కుగ్రామానికి. ఇమ్మిగ్రేషన్ పూర్తయ్యేసరికి దాదాపు గంట పట్టింది. ఈ గంట మనసు మనసులో లేదు నాకు. ఇమ్మిగ్రేషన్ ఆఫీసరు పాసుపోర్టు నా చేతిలో పెట్టడం తరువాయి, దూసుకుపోయాను లగేజి బెల్టుల వైపు. ఇక్కడ ఇంకొక సస్పెన్స్ సినిమా నాకు. నా లగేజీ తప్ప మిగతా వాళ్ళందరి లగేజీ తోందరగా వచ్చినట్టనిపించింది. కస్టమ్సు పూర్తి చేసుకొని , లగేజి ని మరలా నార్త్ వెస్టు వారి మొహాన పడేసి విమానాల రాకపోకలు చూపించే ఎలక్ట్రానిక్ తెరల వైపు పరిగెత్తాను. గేటు నంబరు సరిగానే చూసుకున్నా. కానీ ఆ తొందరలో బుర్ర పనిచెయ్యదు కదా! ఆసాంతం సరిగానే వెళ్ళినా చివర్లో కుడివైపుకి తిరగాల్సింది ఎడమవైపుకి తిరిగి నాగేటుకి దూరంగా వెళ్ళిపోయా. ఈ పదినిమిషాల్లోనే నాపేరు రెండు సార్లు వినపడింది మైకులో "మహాశయా తొందరగా రండి ఇంకొక రెండు నిమిషాలలో గేటు మూయబడుతుంది" అని. అది విన్నప్పుడల్లా నా బీ.పీ ఇంకొక పది పాయింట్ల చొప్పున పెరుగుతూ పోయింది. చివరికి నాలిక్కరచుకొని వెనక్కి పరిగెత్తి నాగేటు దగ్గరికొచ్చేసరికి అక్కడున్న దొరసాని విమానాన్ని అప్పటికే గాల్లోకి పంపించి పక్కనున్న దొరబాబుతో కబుర్లాడుతూ కనిపించింది. నేను ఆమె ముందుకెళ్ళి బిక్కమొగం వేయడం, ఆమె కూడ నా దుస్థితికి కడు చింతించినదై, తరుణొపాయముగా రాత్రి పదిన్నరకి ఉన్న చిట్టచివరి ఫ్లైట్లొ నాపేరు చేర్చి, కొత్త బోర్డింగు పాసూ, ఒక పది డాలర్ల విలువగల ఫూడ్ కూపనూ నా చేతిలో పెట్టి, వాటికి ఒక చిరునవ్వుని కూడా జతచేసి, కళ్ళతొనే చెప్పేసింది ఇకనువ్వు నాముందు నుంచి దయచేయొచ్చు అని.

ఈసురో మంటూ ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాను. నాకింకా మింగుడు పడడం లేదు ఫ్లైటు మిస్సవడం అనేది. ఒక పదినిమిషాలు అలానే కూర్చొని బీ.పీ కాస్త తగ్గాక తినదగ్గదేమైనా దొరుకుతుందేమో అని బయలుదేరాను. నేను ఫక్తు శాకాహారిని కాబట్టి నాకు నచ్చిన ఫుడ్డు దొరకడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఏదో తిందామని బయలుదేరి, ఒక పిజ్జా ముక్కతో కడుపునింపుకొని వచ్చిన రోజులు కోకొల్లలు. కాబట్టి ఎప్పటిలానే పిజ్జా తిని నా గేటు వద్దకు వచ్చి కూర్చున్నా. ఈ పది పదిహేను నిమిషాలలొ నేను నావాచీ వైపు, ఎలక్ట్రానిక్ తెర మీదున్న నా ఫ్లైట్ నంబరు వైపు ఏ వెయ్యి సార్లో చూసుంటా.

ఎలాగూ రాత్రి భోజనం అయిపొయింది కదా, ఇక ఈ ఫ్లైట్ మిస్సుకాకుండా ఎక్కితేచాలు, నా గమ్యాన్ని చేరుకొని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోవచ్చు అనుకున్నా. నిజానికి అసలు కధ అప్పుడే మొదలవబోతోందనీ ఆక్షణాన నాకు తెలీదు.

పది గంటలప్పుడు నా ఫ్లైటు బోర్డింగు అనౌన్సుమెంటు చేసారు. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఒక్క క్షణం భయం వేసింది మళ్ళా నేను తప్పు గేటు దగ్గర కూర్చున్నానేమో అని. ఇక ఉపేక్షించి లాభం లేదని ఆ గేటు దగ్గరి అమ్మడి దగ్గరికెళ్ళి, కన్ఫమ్ చేసుకొని,ఆమె చింపి ఇచ్చిన బోర్డింగు పాసు తాలూకు ముక్క లో సీటు నంబరు చూసుకుంటూ ముందుకుకదిలాను. గేటు దగ్గర ఎయిర్ హొస్టెస్ చిరునవ్వుతో పలకరించింది. ఫ్లైటు లోపలికి అడుగుబెట్ట బోతూ ఉంటే నా తల ఆ ఫ్లైటు గుమ్మం పైభాగానికి కొట్టుకున్నంత పనైంది. అంత చిన్న ఫ్లైటు నేనెప్పుడూ ఎక్కలేదు. ఫ్లైటు లోపల కూడా అంతే.నిటారుగా నిలబడితే నాతల దాదాపు ఫ్లైటు పైకప్పుకి తగులుతోంది. ఇక ఫ్లైట్లో ప్రయాణికులకంటే క్రూ సంఖ్యే ఎక్కువ ఉంది. ఇద్దరు ప్రయాణికులు(నాతో కలిపి), ముగ్గురు క్రూ మెంబర్స్ మొత్తం అయిదుగురం అన్నమాట. అది ప్రొపెల్లర్ ప్లేన్. మన ఇంట్లో ఉండే టేబుల్ ఫేన్ సైజుకి ఒక ఐదారింతలు పెద్దగా ఉండే రెండు ప్రోపెల్లరులున్నై ప్లేన్ రెండు వైపులా. అయితే అటువైపు ఉన్న ప్రోపెల్లరు తిరుగుతోంది గానీ, నా వైపున్నది తిరగటం లేదు. పైలటు మర్చిపోయాడేమో. నాకేమో టెన్షను. మరుసటి రోజు ఈనాడు లో "అమెరికా లో విమానం కూలి ప్రవాసాంధ్రుని మృతి" అనేవార్త నాకళ్ళముందు మెదిలింది. దాన్నే చూస్తూ కూర్చున్నా. గేటు దగ్గరి నించి బయలుదేరి టేకాఫ్ కోసం రన్ వే మీదకు వచ్చేదాకా ఆ రెండో ప్రొపెల్లర్ అలానే ఉంది నిశ్చలంగా. ఇక టేకాఫ్ అనవున్సు చేసాక అది తిరగడం ప్రారంభింది. అమ్మయ్య గండం గడిచింది అనుకున్నా నేను. (బహుశా ఇంధనం వృధా కాకుండా ఉండటానికి అలా చేస్తారనుకుంటా. )

రాత్రి పదకొండింటికి లక్రోస్ లో దిగాను. నేను ఫ్లైటు మిస్సయినా నా లగేజీ మాత్రం మిస్సవకుండా అంతకుముందు ఫ్లైటులోనే నాకంటే ముందుగానే చేరుకుంది. లగేజి క్లెయిం దగ్గర కాసేపు చూసి పక్కనున్న కౌంటర్ లో అడిగితే వారు సెలవిచ్చారు ఫలానా చోట మీ లగేజి దొరకొచ్చు అని. అక్కడికెళ్ళి దాన్ని తీసుకొని తోపుడుబండి మీద పెట్టుకొని టేక్సీ సర్వీసు తాలూకు ఫోన్లుండే చోటుకు చేరుకున్నాను. చేతిలో అడ్రసు రెడీ గా పెట్టుకొని, టేక్సీ సర్వీసుకి ఫోన్ జేసి, నేనెక్కడున్నానో, ఎక్కడికెళ్ళాలో వాడికి వివరించేసరికి తిన్న పిజ్జా ముక్క అరిగిపోయి శోష వచ్చినట్టయింది.

ఎయిర్ పోర్టు లోపలినుండే గాజు తలుపుల గుండా చూస్తూ టేక్సీ వాడికోసం వెయిటింగు. చిన్న ఎయిర్ పోర్టు కాబట్టి టేక్సీ వాడంటూ వస్తే నాకోసమే అన్న ధైర్యం తో లోపలేఉన్నా. బయట పసుపు రంగు టేక్సీ కనపడటం తరువాయి , కార్టు తోసుకుంటూ బయటికొచ్చాను. చర్మాన్ని కోసేస్తున్న రీతిలో చల్లటిగాలి విసురుగా తగిలింది మొహానికి. చలిగా ఉంటుందని అనుకున్నాగాని మరీ అంత చలి ఉంటుందనుకోలేదు. గబగబా లెదర్ జాకెట్ జేబుల్లో కుక్కుకొన్న చేతి గ్లౌజులు తొడుక్కొని టేక్సి దగ్గరకెళ్ళేసరికి కార్లో కూర్చొనే ట్రంక్ ఓపెన్ చేసి లగేజి అక్కడపెట్టు అన్నట్టు సైగ చేసాడు టేక్సీ డ్రయివరు. నా లగేజీ మొత్తాన్ని అందులో సర్దేసరికి చుక్కలు కనిపించాయి నాకు. వచ్చిందాంతో ఇండియాలో హాయిగా పడుండక ఈ పరాయి దేశంలో ఈ చలిలో ఈ పాట్లేమిటిరా బాబూ అని ఏ వందసార్లో అనుకున్నా. ఇక టేక్సీ లో కూర్చోగానే మాట్లాడే ఓపిక లేక అడ్రసు కాగితాన్ని డ్రయివరు కందించా. ఆ చలికి దిమ్మ తిరిగిపోయి, డ్రయివరు తో కనీసపు పిచ్చాపాటీ కి కూడ ఓపిక లేక, అది పద్దతి కాదని తెలిసినా బయటికిచూస్తూ కూర్చుండిపోయాను. దాదాపు రాత్రి పన్నెండింటికి టేక్సీ నేనుండాల్సిన అపార్ట్మెంటు ఆవరణలోకి ప్రవేశించింది. నేను దిగాల్సిన బ్లాకు ముందు టేక్సీ ఆపి నావైపు చూసాడు డ్రయివరు. ఆయన తీరు చూస్తే టేక్సీ దిగి నాకు సహాయం చేసేలా అనిపించలేదు. ఎయిర్పోర్టు నుంచి ఇక్కడిదాకా ఏమీ మాట్లాడకుండా మూగమొద్దులా కూర్చున్నందుకు బదులు తీర్చుకుంటున్నాడేమో అనిపించింది.

ఆయన కివ్వాల్సిన డబ్బులు ప్లస్ టిప్ యిచ్చేసి, జైవీరాంజనేయా! అంటూ దిగి నా లగేజీ మొత్తం కిందకి దింపేసరికి ఈసారి ఆ చుక్కలమధ్య ముక్కోటిదేవతలు కూడా కనిపించారు. చిమ్మ చీకటి. అంత చీకట్లోను తెల్లగా మెరుస్తూ పెద్ద పెద్ద మంచుకుప్పలు. లగేజి అక్కడేపెట్టి మెయిన్ డోరు వైపు కదిలాను. నిజానికి ఆ డోరుకూడా లాక్ చేసిఉంటుంది. కానీ ఆ సమయంలో నాకా ఊహేలేదు. లోపలికెళ్ళి నేను ఉండాల్సిన అపార్ట్మెంటు గ్రవుండ్ ఫ్లోర్ (ఇక్కడ ఫస్ట్ ఫ్లోరంటారు) లోనే ఉండటంతొ చాలా సంతోషించా. లేకుంటే అంత లగేజి ని మెట్లమీద మోసుకెళ్ళడమంటే అంత ఈజీ కాదు. అపార్ట్మెంటు నంబరు సరిచూసుకొని డోరు కొడితే లోపలినించి ఉలుకూ పలుకూ లేదు. నేనువస్తున్నానని నా కాబోయే రూమ్మేటు కి ముందే మా ఆఫీసువారు ఉప్పందించారు కదా, మధ్యలో ఇదేమిట్విస్టు రాబాబూ అనుకొని అలా ఒక ఐదు నిమిషాలు కొడుతూనే ఉన్నా.ఎంతకీ సమాధానం లేకపోయేసరికి నా వెన్ను జలదరించింది. ఇదేమి ఖర్మ రా బాబూ, నేనురావటం లేటయ్యేసరికి ఈయనగారు ఎదురుచూసి, ఇక ఈరోజురాననుకొని ఏ ఫ్రెండింటికో వెళ్ళిపోయాడేమో! ఇంకాసేపు ట్రై చేద్దామని అలా కొడుతూనే ఉన్నా. ఆయన ఇంట్లో ఉండకపోవచ్చు అనే ఊహ ని ఒప్పుకోవడానికి నా మనసు ఏమాత్రం అంగీకరించటం లేదు. ఇంకొక ఐదు నిముషాలు గడిచేసరికి నాకు అప్పుడు గుర్తొచ్చింది నా లగేజీ అంతా అలా ఆరుబయట వదిలేసొచ్చానని. ముఖ్యంగా నా పాస్ పోర్టు, హెచ్-1 పేపర్లూ. దీని సంగతి తరువాత ముందు అవి ముఖ్యం అనిపించింది. వడి వడిగా మరలా మెయిన్ డోరు దగ్గరకొచ్చి బయటికి రాబోతుండగా అప్పుడు వచ్చిందా ధర్మసందేహం,ఈ డోరుకి లాకుందా లేదా అని. అంతకుముందు వచ్చినోళ్ళు డోరు సరిగా క్లోజు చెయ్యలేదేమో? ఒకవేళ నేను బయటికి వెళ్ళి డోరు వేయగానే అది లాకయితే? ఆ చలిలో నాగతేం గాను? చేతిలో సెల్ ఫోన్ లాంటివేమీ లేవు. ఉంటే ఇన్నితిప్పలుండవుకదా? ఇప్పుడేమిచేయాలి? డోరు ని వదిలేయకుండా మరలా జాగ్రత్తగా లోపలికొచ్చి డోరుని నెమ్మదిగా మూసాను. ఈసారి డోరుహేండిల్ ని తిప్పకుండా డోరుని నెట్టాను. తెరుచుకుంది. దానర్ధం లాకు లేనట్టేగా? ఎందుకో నమ్మకం కుదరలేదు. డోరుని నెమ్మదిగా వదిలేస్తే అది పూర్తిగా మూసుకోకుండా లాకుకు కొద్దిదూరంలో ఆగుతోంది. సరే అనుకొని ధైర్యం గా బయటికి వచ్చి, డోరుని అలానే పట్టుకొని ముందు ఏమైనా రాయి రప్ప దొరుకుతుండేమో అనిచూసా ఆ చీకట్లో. చివరికి అదృష్టానికి కూడా నోచుకోలేదు నేను. సరే అని దేముడి మీద భారం వేసి డోరుని నెమ్మదిగా వదిలి, తెరుచుకుంటుందోలేదో సరిచూసుకొని, మరలా రెండోసారి అలానే వదిలి నా లగేజిదగ్గరకొచ్చి కేబిన్ బేగ్ తీసుకొచ్చి ఆ డోరు దగ్గరకొచ్చా. కొద్దిగా భయంగానే ఉన్నా, అదృష్టం నా పక్షాన ఉండటంతో ఆ డోరు ఓపెన్ కావటంతో నా బేగ్ ని దానికి అడ్డం పెట్టి ఒకపెద్ద సూట్కేసుని లోపలికి తీసుకొచ్చా. ఎంత గ్లవుజులున్నా ఆ చలికి నా చేతివేళ్ళు కొంకర్లు పోతున్నాయి. మొహం మొద్దుబారి పోయింది. చేతులతో ఒక్కసారి బుగ్గల మీద రుద్దుకుంటే అస్సలా స్పర్శే లేదు. ప్రయాణంలో నా లగేజీ మొత్తాన్ని ఒకటికి పదిసార్లు చూసుకొనే అలవాటున్న నాకు, ఈ ఒక్కసూట్కేసు, నా పాస్ పోర్టు, హెచ్-1 పేపర్లు చాలు ఇక మిగతా లగేజి ఎటుపోయినా నాకనవసరం, ఇక లోపలే ఉండిపోదాం అన్నంత విరక్తి కలిగింది ఆఒక్క సూట్కేసుని లోపలికి తెచ్చేసరికి. కాసేపు లోపలే ఉండి తమాయించుకొన్నాక ఎలాగోలా నా లగేజీ మొత్తాన్ని నా అపార్ట్మెంటు ముందు పెట్టుకున్నా.ఈసారి ఎవరేమనుకుంటే నాకేమని నా అరచేయి మొత్తం డోరుకితగిలేలా ధబీ దభీ మని కొట్టా. ఊహు. లాభం లేదు. నా కొట్టుడికి ఆ వరండా మొత్తం ప్రతిధ్వనిస్తోంది గాని లోపలి నించి ఏ సమాధానం లేదు. ఇక ఆ వరండా ఆ రాత్రి పడుకోవటానికి వీలుగా ఉంటుందా అని చూసా. ఇరుకుగా ఉండటమేగాక, అంతకుముందు ఆందరూ అక్కడ నడిచిన కారణాన అక్కడక్కడ నల్లటిమురికిమంచు.

"మినియాపోలీస్ ఎయిర్ పోర్టు లో ఉన్నప్పుడే, ధేభ్యం మొహం వేసుకొని వెయిట్ చేయకుండా, కాస్త ఓపిగ్గా, ఫోన్ రిసీవ్ చేసుకొనే దాకా నీ మానేజరుకి అదేపనిగా ఫోన్ చేసుంటే ఈ బాధలుండేవికాదుగా? ఎందుకు రా ఎదుటిమనుషులమీద నీకంత అతి నమ్మకం? నీవేదో వీ.ఐ.పీ వైనట్లు, ఆయన నీకోసమే చకోర పక్షిలా ఎదురుచూస్తూ ఉంటాడన్నట్లు ఏదో ఫీలైపోయావుగా? అనుభవించు" అని నా ఆత్మారాముడు తిట్ల దండకం అందుకున్నాడు. ఇక లాభం లేదు, నిండా మునిగాక చలేంటి అని పక్క అపార్టుమెంటు తలుపుతట్టా . లోపల భయం గానే ఉంది. ఆ తలుపు తీసేవాడు భయస్తుడైతే తలుపు తీసి, నా మంకీ కేప్, నా వాలకం చూసి దొంగేమో అనుకొని ఒక రెండురవుండ్లు కాల్చి ఆ తరువాత "ఊప్స్" అంటాడేమో అని. నా ఊహకి భిన్నంగా తలుపుతెరిచాడొక తొంభయ్యేళ్ళ ముసలాయన. చేతిలో గన్నులేదు. పైగా ఆయన వాలకం చూస్తుంటే నిటారుగా నిలబడడానికే సర్వ శక్తులూ కేంద్రీకరిస్తున్నట్లు అనిపించింది. యధావిధిగా అంత రాత్రివేళ నిద్రాభంగం చేసినందుకు ఆయనకి క్షమాపణలు చెప్పుకొని, నా బాధ చెప్పుకొని, మీరేమనుకోకపోతే మీ ఫోనొకసారిస్తే నేను నా ప్రాజెక్టు మానేజరుకి ఒక ఫోను చేసుకుంటా అన్నా.
ఆయనడిగాడు.
"లోకలా, లాంగ్ డిస్టెన్సా?"
"తెలీదు"
"నంబరేది?"
నాచేతిలో ఉన్న కాగితం అందివ్వభోయి, ఈయన దాన్ని కూడబలుక్కుని చదివేసరికి తెల్లారుతుందనుకొని, నంబరు మొత్తాన్ని పైకి చదివా. నా ఖర్మ కాలి అది మా మానేజరు మొబైల్ నంబరు. ఆయన నిజానికి కేలిఫోర్నియా వాస్తవ్యుడవటం తో అది లాంగ్ డిస్టెన్సు నంబరే.

నిజం చెప్పొద్దూ ఆయన పాపం కాస్త తటపటాయిస్తూనే అన్నాడు.

"పది డాలర్లవుతుంది"

"నో ప్రాబ్లెం". నేనున్న పరిస్థితికి పదేంఖర్మ, వందయినా ఇస్తా, బయటేమైనా మామూలు చలా? ప్రాణాలతో చెలగాటం.

మా మానేజరుకి ఫోన్ చేశా.

"హాయ్ నిర్మల్, నేను ఉమాశంకర్ని"

"ఏంటి ఇంకా ఇండియాలోనే ఉన్నావా?" ఆయన నిద్రమత్తు తెలుస్తూనే ఉంది గొంతులో.

"లేదు అపార్టుమెంటు దగ్గరున్నా"

"ఓ, వచ్చేసావా? సరే మరి రేపు ఆఫీసులో కలుద్దాం".

పైకి నవ్వుతూ, లోపల తిట్టుకుంటూ చెప్పా.

"ఇప్పుడు మీరు వచ్చి నాకు సహాయం చెయ్యక పొతే బహుశా రేపు మీరు నా డెడ్ బాడీ ని ఇండియా కి పంపాల్సొస్తుంది."

ఆయన వివరం అంతా కనుక్కొని, నేవస్తున్నా, అక్కడే ఉండు అని ఫోన్ పెట్టేసాడు.

ఈయన కి ధేంక్స్ చెప్పుకొని పది డాలర్ల నోటందించా. ఆయన దాన్నందుకొని, అప్పటికి నామీద తను జాలి చూపించాలి అన్నది నిర్ధారణ చేసుకొని, "నీక్కావాలంటే లోపలికి వచ్చి వెయిట్ చెయ్యి, బయట చలికదా" అన్నాడు. ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. పైగా నా ప్రాజెక్టు మానేజరు గొంతు వినగానే నాకు అప్పటికే వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది. ప్రేమలొ నిండా మునిగినోడికి ఒక పదిరోజుల తరువాత తన ప్రియురాలి గొంతు వింటే కలిగే అనుభూతి కంటే ఒక వెయ్యి రెట్లెక్కువ.

నిర్మల్ వచ్చాడు. నార్త్ ఇండియన్. కొంతమందిని మొదటిసారి కలవగానే " అబ్బా! వీడేమి శాడిస్టు వెధవ రా బాబూ" అనుకుంటాం . నిర్మొహమాటం, మాటలో కరకుతనం ఈయనకి నిత్యాలంకారాలు. కానీ వాటివెనుక ఉన్న అంతరార్ధం గ్రహించిన వారికి ఈయన అత్యంత ఆప్తుడు. మీదవేసుకొనే ముసుగు ఎంత పలచనైతే అంత దగ్గరవుతారేమో. ఆ రకంగా చూస్తే ఈయనసలు ముసుగు మనిషేకాదు.

రాగానే నాతో మాటమాత్రం మాట్లాడకుండా అపార్టుమెంటు డోరు దగ్గరికి దారితీసాడు నిర్మల్. ధబీ ధభీ మనికొట్టాడు. ఊహూ. సరే లాభం లేదని బయటికివెళ్ళి అపార్టుమెంటు వెనకవైపు నుంచి, లివింగు రూము లోపి దారితీసే గాజు తలుపుల లోంచి కళ్ళు చికిలించి చూశాడు. ఆ గుడ్డి వెలుతురులో ఆయనకేం కనపడిందో, చిన్నగా నవ్వుకుంటూ ఇవతలికొచ్చాడు. నేనడిగాను ఏమిటీ అని?

సమాధానం చెప్పకుండా కుడిచేతి గుప్పిటమూసి , థంప్స్ అప్ లాగా బొటనవేలిని పైకి లేపి చేతిని పైకీ కిందకీ ఆడించాడు. అర్ధం అయింది. గురుడు లోపల మందుగొట్టి కలలో దేవకన్యలతో విహరిస్తున్నాడన్నమాట. సరేగానీ, ఏమిటీ?, నారూమ్మేటు తాగుబోతా? హతవిధీ..

నిజానికి నా రూమ్మేటుది మా కంపెనీ కాదు. అనుకున్న టైముకి ఇక్కడ అమెరికా లో ఎవరూ దొరక్క, ఇక్కడ దొరికిన వేరే కంపెనీ వాణ్ణి పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడు నేను దొరికాను కాబట్టి మాకంపనీ కి డబ్బులు (ఎక్కువ)మిగలాలంటే వీణ్ణి సాగనంపి ఆ స్థానం లో నన్ను కూర్చోబెట్టాలి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎలాగూ వెళ్ళిపోతున్నాముకదా అని "సహాయ నిరాకరణ" ని మనసా వాచా కర్మణా తు.చ తప్పకుండా పాటిస్తారు చాలామంది. నాకెందుకో ఈ తాగుబోతు రూమ్మేటు సహాయ నిరాకరణ లో ఆరితేరి ఉంటాడనీ, ఇక ఆఫీసులో నాపని గోవిందో గోవింద అనుకున్నా.

ఇక లాభం లేదని నిర్మల్ తన ఇంటికెళ్ళి అపార్టుమెంటు తాలూకు డూప్లికెటు తాళాల్ని తీసుకొచ్చాడు. ఇద్దరం లోపలికెళ్ళి గురుడు పడుకున్న బెడ్రూం లోకెళ్ళాము. ఎక్కడా కనపడడే. తీరా చూస్తే మంచానికి, క్లోజెట్ కి మధ్యలో ఉన్న ఇరుకైన ప్రదేశంలో బోర్లా పడుకొని ఉన్నాడు. నాకైతే డౌటు, పాపం మంచం మీద నుండి పడుంటాడని. నిర్మల్ "ఊహు" అన్నాడు. బహుశా ఆయనేకైనా పూర్వానుభవం ఉందేమో గురుడితో. రూములో డ్రెస్సింగు టేబిలు మీద సింబాలిక్ గా ఖాళీ మందు సీసా(ఇంక సింబాలిక్ ఏంటి నా మొహం). అదిచూసి ఓహో ఇందాక బయటినుంచి ఈ సీసాని చూసే నిర్మల్ కన్ ఫం చేసుకున్నాడేమో అనుకున్నా.

చిన్నఫ్ఫటినుంచి నాకు తాగేవారంటే భయం. దీనివెనకో భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. నేను మూడో తరగతి చదివేటప్పుడు ఒకతాగుబోతాయన నేను స్కూలుకి వెళుతుంటే నా వెంటపడటం, నేను ఆ భయం తో నూటొక్క డిగ్రీల జ్వరంతో మంచమెక్కి, రోజూ రాత్రుళ్ళు పక్క తడపటం. ఇంకెప్పుడు స్కూలుకి ఆదారెంట వెళ్ళలేదు. ఆదెబ్బతో నాకు తాగేవాళ్ళంటే అదో ఫోబియా పుట్టేసుకుంది. వాళ్ళలో మంచి వాళ్ళుంటారనే నిజాన్ని నా బుర్ర అస్సలు ఒప్పుకునేదికాదు.

నా రూమ్మేటు గురించి ఇంత మంచి అభిప్రాయం నాలో ఏర్పడ్డాక ఆరాత్రే డిసైడు చేసుకున్నా ఇక ఆఫీసులో ఒంటరిగానే పోరాటం సాగించాలి, వీడి మీద ఆశ పెట్టుకోవటం వేస్ట్ అని.

ఇక ఆరాత్రి నేను లివింగు రూములోనే సోఫాలో ముడుక్కొని పడుకున్నా రేపొద్దున్నే చూడాల్సిన నా రూమ్మేటు మొహం తలుచుకుంటూ. నేను పొద్దున్న లేచేసరికి ఎనిమిదయింది. లీలగా నారూమ్మేటు ఆఫీసుకి రెడీ అవటం తెలుస్తూనే ఉంది. అలానే మత్తుగా పడుకున్నా. కాసేపాగి చూస్తే టైము పది. ఉలిక్కిపడి లేచా. మొదటి రోజే ఆఫీసుకి లేటు గావెళితే క్లైంటు ఏమనుకుంటాడొ అనుకుంటూ రెడీ అవుతుంటే ఫోనుమోగింది.

"హాయ్, నాపేరు రమేష్, మీ రూమ్మేటు ని"
"హాయ్ రమేష్"
"రాత్రి బాగా నిద్ర పట్టిందా?"
ఆబ్బా, ఎకసెక్కాలు కూడానా అయ్యగారికి అనుకున్నా. పైకి మాత్రం....
"ఓ, యా"
"సరే, నేను నిర్మల్ కి ఆల్రెడీ చెప్పా, లేటయిందని కంగారు పడొద్దు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పికప్ చేసుకుంటా. ఇంకాసేపు నిద్ర పోతారా?"
"లేదు, మరీ లేటయితే బాగోదు. ఇంకొక అరగంటలో రాగలరా?"

అరగంటలో ఠంచనుగా నా ముందు ప్రత్యక్షమయ్యాడు రమేష్.

రాత్రి నేనూహించుకున్న రూపానికి పూర్తిగా విరుద్దం. రాగానే నవ్వుతూ చెయ్యి ముందుకు చాపాడు "హాయ్" అంటూ..

అప్రయత్నంగా చేయికలిపాను.

"i am really sorry about last night. నిజానికి మీకోసం పదింటిదాక ఎదురుచూసా, మీకోసం డిన్నర్ కూడా ప్రిపేర్ చేసా. ఎదురు చూసి చూసి ఇక రారేమోననుకొని.. అంటూ ఆగిపోయాడు.

రాత్రి పడ్డ కష్టాన్నంతా పక్కనబెట్టి, " సహాయ నిరాకరణ" ని దృష్టి లో పెట్టుకొని, ముఖం మీద నవ్వు పులుముకొని అన్నాను.

"పర్లేదు."

ఆతరువాత రమేష్ తనున్న వారం రోజులు నాకు చేసిన సహాయం నాకు అతని మీదున్న నెగటివ్ ఆలోచనల్ని సమూలంగా కాలరాయటమే కాకుండా, నిజం గా చెప్పాలంటే తన గురించి అలా ఊహించుకున్నందుకు నన్ను అనుక్షణం సిగ్గు పడేలా చేసింది. ఏదడిగినా విసుక్కోకుండా చెప్పడం, సాయంత్రం ఐదింటికి తను ఇంటికి వెళ్ళగలిగి ఉన్నా, నాకోసం, తను వెళ్ళాక నాకు ప్రాజెక్టు లో ఏ ఇబ్బంది ఎదురవకుండా ఉండటానికి, రాత్రి పదింటివరకూ ఉండి అన్ని వివరాలూ చెప్పటం... నిజానికి మా సొంత కంపనీ వ్యక్తులు కూడ అంత శ్రద్ద తీసుకోరేమో.. Hats-off to him.


ఆతరువాత తను ప్రాజెక్టు వదిలి వెళ్ళినా ఒక రెండు సంవత్సరాలవరకు కనీసం వారానికొకసారి మాట్లాడుకునేవాళ్ళం. ఆ తరువాత కారణమేదీ లేకుండానే గేప్ రావడం, అలా అలా నేనూ నా పనిలో పడి తనని మర్చిపోవటం జరిగింది. కొన్ని స్నేహాలంతే. రమేష్ కి "బాబాయ్" అనేది ఊతపదం. సరదాగా నన్నలాగే పిలిచేవాడు. ఇప్పటికి బాబాయ్ అనేపదం వినపడితే వాడే గుర్తొస్తాడు.

ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, కొలీగ్స్ గానీ ఇండియా నుంచి వస్తున్నారనే కబురు నా చెవిన పడితే వాళ్ళు ఎయిర్ పోర్టు నుండి ఇంటికి రావటానికి సరైనా ఏర్పాట్లు చేసుకున్నారా లేదా అని వాకబు చేస్తా. ఇండియా నుంచి మొదటిసారి వస్తున్న వాళ్ళయితే ఇంకాస్త జాగ్రత్తగా... ఆ అనుభవం అలాంటిది మరి..

22 comments:

మధుర వాణి said...

ఉమా శంకర్ గారూ..
మీరు సరదాగా చెప్పినా గానీ.. నాకైతే భలే భయం వేసిందండీ ఆ పరిస్థితుల్ని ఊహించుకోవడం వల్ల.. పోనీ లెండి..ఎలాగయితేనేం.. చివరికి అంతా మంచిగానే జరిగిందిగా :)
ఇలాంటి అనుభవాలు అప్పటికి నరకం చూపించినా.. తరవాత గుర్తుకొస్తే.. భలే విచిత్రంగా అనిపిస్తుంది.
మీరు వ్రాత శైలి బాగుంది. అభినందనలు.

ఉమాశంకర్ said...

మధుర వాణి గారు,
కావాలని కామెడీ జతగలిపి రాసాను గాని, నిజానికి ఇప్పటికీ అనిపిస్తుంది , ఆ డోరు కి సెక్యూరిటీ లాక్ ఉండి, నేను బయటే ఉండాల్సిఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి...

మీ కమెంటుకి ధాంక్యూ ...

సుజాత said...

మీ వెనకాలే తిరుగుతూ మంచానికీ, క్లోజెట్ కీ మధ్య ఉన్న ఇరుకు స్థలంతో సహా అన్నీ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కల్గించారు. ఒక పక్క నవ్వు, మరో పక్క జాలి కలిగాయి.

"అమెరికాలో విమాన కూలి ప్రవాసాంధ్రుడి మృతి"...నవ్వాగలేదు.

భలే రాశారు, ఏకబిగిన చదివించేలా....ఇంత పెద్ద టపా తప్పుల్లేకుండా!

ఉమాశంకర్ said...

సుజాత గారు,

Thank you.

జీడిపప్పు said...

చాలా బాగా వ్రాశారు. మీ రూంమేట్ విషయాలు బాగున్నాయి. అలాంటి అనుభవాలు అందరికీ ఎపుడో ఒకపుడు ఎదురవుతూనే ఉంటాయి.

ఉమాశంకర్ said...

జీడిపప్పు గారు,
ఓపిగ్గా చదివినందుకు ధేంక్స్.

సిరిసిరిమువ్వ said...

మీకు అక్కడ చలేమో కాని మాకు ఇక్కడ చెమటలు పట్టుకొచ్చాయి చదువుతుంటే డోరుకి సెక్యూరిటీ లాక్ ఉందేమోనని:)

చాలా బాగా వివరించారు మీ అనుభవాలు. కొంతమంది మనుషుల్ని మొదటి పరిచయంతో ఏమాత్రం అంచనా వేయలేం.

ఉమాశంకర్ said...

సిరిసిరిమువ్వ గారు,
అందర్నీ బానే భయపెట్టానన్నమాట.
అవునండీ, మొదటి పరిచయంతోనే చెప్పలేము వారెలాంటివారో.. కొద్దిపాటి ఓపిక, ఇంకొంత ఓపెన్ మైండ్ తప్పనిసరి...

Shankar Reddy said...

బాగుంది....

నాగన్న said...

కళ్ళకు కట్టినట్టుగా రాసారు. బాగుంది.

ఉమాశంకర్ said...

Shankar Reddy గారు,
Thank you.

నాగన్న గారు,
మీరు రెండు కమెంట్లు చేసారనుకుంటా. రెంటీనీ పబ్లిష్ చేసానే, ఎందుకో ఒకటే కనపడుతోందిక్కడ. ఆ రెండోది ఏదో URL. వీలైతే మరలా పంపగలరు.

ఉమాశంకర్ said...

నాగన్న గారు,

Never mind. i realized your second comment is intended for another post of mine. Got the link. Thank you..

GIREESH K. said...

కళ్ళకు కట్టినట్లు వర్ణించారు...పెద్ద టపా అయినా, చివరివరకూ చదివించారు.

ఉమాశంకర్ said...

గిరీష్ గారు,

ధేంక్సండీ.

Srinivas Ch said...

జనవరిలో వ్రాసిన టపాకి ఇప్పుడు కామెంట్ ఏంటి అనుకుంటున్నారేమో, నేను ఈరోజే మొదటి సారి మీ బ్లాగ్ చూసాను. మీ రచనా శైలి చాలా బాగుంది. అభినందనలు.
మీకు కలిగినటువంటి అనుభమే నాకు కూడా అమెరికా వచ్చిన నా మొదటి వింటర్లో కలిగింది. మీ టపా చదివాక నాకు కూడా ఇలాంటి టపా వ్రాయాలని అనిపిస్తుంది. కాని నేను మీ అంత బాగా వ్రాయలేనేమో. ఇంత పెద్ద టపా కూడా ఏకబిగిన చదివించారు.

ఉమాశంకర్ said...

శ్రీనివాస్ గారు,
Thank you. మీకు బ్లాగుందా? అలా సందేహ పడకండి. రాసేయడమే. :)

Srinivas Ch said...

ఉమాశంకర్ గారు, నా బ్లాగులో టపాలు వ్రాసి 1.5 సంవత్సారాలు కావస్తుంది. ఎప్పుడు మంచి టపాలు చదివినా ఇంకా నేను కూడా మళ్ళి మొదలెట్టాలి అనుకుంటాను కాని బద్ధకం, పనుల వత్తిడి వల్ల కుదరడం లేదు. కానీ అతి త్వరలోనే మళ్ళి మొదలెట్టాలని అనుకుంటున్నా. ఇంకో విషయం మీ బ్లాగ్ టెంప్లేట్ నాకు చాల నచ్చింది. బ్లాగర్ లో టెంప్లేట్ ఎలా మార్చుకోవాలో కాస్త వివరిస్తారా?

ఉమాశంకర్ said...

@శ్రీనివాస్ గారు,
నేను గూగుల్లొ సెర్చ్ కొట్టి ఏవేవో సైట్లు వెతికి పట్టుకున్నానండి. దురదృష్టవశాత్తూ నేను ఆ URLs వేటినీ సేవ్ చెయ్యలేదు.ఒక్కసారి గూగుల్లో "changing blogger template" అని ట్రై చేయండి.

భాస్కర్ రామరాజు said...

అన్నయ్యా? నా కామెంటేది?

ఉమాశంకర్ said...

భాస్కర్ గారూ, మీరు కామెంటు రాశారా? నాకేమీ రాలేదే? ఇంకొకసారి చూసుకున్నా కూడానూ .

పానీపూరి123 said...

ఉమా గారు, బాగా వ్రాశారు...

ఉమాశంకర్ said...

@పానీపూరి123

Thank you :)

 
అనంతం - by Templates para novo blogger