నాకు రాజకీయాలంటే పరమ అసహ్యం ఎందుకంటే..

Wednesday, February 4, 2009

నా చిన్నప్పుడెప్పుడో ఒకసారి స్కూల్ నుంచి ఇంటికొస్తుంటే ఊరి సెంటర్లో పెద్ద గుంపు. ఎవరో అన్నారు "చీప్మినిస్టర్, చీప్మినిస్టర్" ( లేఖిని ఎఫెక్టు కాదు) అని. ఈ చీప్మినిస్టర్ అంటే ఎవరబ్బా అంటూ నేనుకూడా ఉత్సాహంకొద్దీ గుంపులోకి దూరా. ఇది అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య మాఊరొచ్చినప్పుడన్నమాట. ఆతరువాత సోషల్ సైన్సు లో చదువుకున్నా, శాసనసభ, ఎగువసభ, దిగువసభ, రెండింత మూడొంతుల మెజారిటీ, ఓటుహక్కు, ముఖ్యమంత్రీ, ప్రధానమంత్రి, రాష్ట్రపతీ, స్పీకరు ...మన్నూ మశానం అన్నీనూ. జనరల్ నాలెడ్జి కాంపిటీషన్లలో పాల్గొనేవాడిని కాబట్టి అన్నీ బట్టీపట్టా.....మొదటి ప్రధాన మంత్రీ, మొదటి మహిళా ముఖ్యమంత్రీ గట్రా...

నిజానికి రాజకీయాలంటే అనుభవంలో కొచ్చింది మాత్రం ఎంటీయార్ ముఖ్యమంత్రి అయ్యాకే. ఇద్దరు రాజకీయ నాయకులు తిట్టుకోవడం నేను చదివింది ఈయన హయాంలోనే(అప్పట్లో ఈ టీవీ లు ఇంతగా లేవులెండి). ఎంటీయార్, జలగం వెంగళరావు లు తెగ తిట్టుకొనేవారు అప్పట్లో. ఎవరు ఎవరినన్నారో గుర్తు లేదు గాని, " తంతే వెళ్ళి బంగాళాఖాతం లో పడతాడు" అని తిట్టేసుకున్నారు. ఇప్పటి స్టాండర్డ్స్ ప్రకారం ఇదస్సలు తిట్టే కాదు గానీ అప్పట్లొ మా మంచి వినోదం అందరికీ.

అప్పుడు మొదలయ్యిందండి నా ప్రస్థానం, రాజకీయనాయకులంటే మనలాంటి మనుషులే అనే (అమాయకపు) అభిప్రాయం నుంచి "అస్సలు వీళ్లు మనుషులా .. రాక్షసులా.." అని చీదరించుకునేంత వరకు...

నాకు గుర్తుండి ఛీ, ఛీ..ఛీ.. అనిపించిన కొన్ని....

ఇద్దరు సభ్యులతో మొదలెట్టి, మతాన్ని వాడుకొని, రధయాత్రలు చేసి, జనాల్ని రెచ్చగొట్టి, కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా సాగిన పార్టీ ప్రస్థానాన్ని చూసినప్పుడు....

బలపరీక్ష లో జయలలిత వ్యక్తిగత పంతాలకి పోయి ఒక్క ఓటు తేడా తో ప్రభుత్వాన్ని పడగొట్టి, వందల కోట్ల ప్రజా ధనం తో మళ్ళీ ఎన్నికలు జరిపించినప్పుడూ..

సోనియమ్మ సుపుత్రుడు హైదరాబాదు వచ్చినప్పుడు, ఆ కుర్రకుంక దృష్టి లో పడటానికి , తన పెద్దరికాన్ని మరిచి, తన నియోజక వర్గ ప్రజల ఆత్మ గౌరవాన్నీ, అన్నిటికీ మించి తన ఆత్మ గౌరవాన్నీ తాకట్టుపెట్టి, వాడి దృష్టి తన మీద పడితే చాలు అని, ఆ కారెనకాలే, పంచె ఊడి పోతున్నా, కండువా జారిపోతున్నా పట్టించుకోకుండా పరిగెత్తిన రాజకీయ నాయకుడిని చూసినప్పుడూ...

సోనియమ్మ ప్రధాని కావాలి అని "హైడ్రామా" నడిపించి, రోజుకో పుకారు పుట్టించి, చివరికామె, "చూద్దాం" అనగానే, అదేదో మహాప్రసాదం అని భావించి, దాన్ని కళ్ళకద్దుకొని, "మేడం ఒప్పుకున్నారహో" అని, వయసుమరిచి, మన ఎంపీలు చాలా మంది, పార్లమెంటులో , టీవీ కేమెరాలముందు సినిమా స్టెప్పు లేయడం చూసినప్పుడూ..

బిల్ క్లింటన్ పార్లమెంటు లో ప్రసంగించిన తరువాత ఆయన షేక్ హేండ్ కోసం ఎంపీలు ఎగబడినప్పుడూ ..

ఖైరతాబాదు ఫ్లైఓవర్ మీద మండుటెండలో, నిండు వేసవిలో, మిట్టమధ్యాహ్నం, ఆ వాహనాల పొగ పీలుస్తూ, ఎవడో "పెద్ద మనిషి" ఆ దారెంట వెడుతున్నాడని నన్నూ, నాతో పాటు వందలాది మందిని ఆపేసి నప్పుడూ..

రోజువారీ జీతం మీద సినిమా హాల్లో పార్కింగ్ టికెట్లిచ్చే వ్యక్తిని "ఎవడ్రానువ్వు, నీ అంతు చూస్తా" అంటూ ఆ అర్భకుడి మీద నలుగురిముందు తన ప్రతాపం చూపిన ఖద్దరు శాల్తీ ని చూసినప్పుడూ..

గత నాలుగేళ్ళ నుంచి అసెంబ్లీ సమావేశాలని చూసిన ప్రతిసారీ..

ఈ తొడ కొట్టడాలూ, మీసం మెలేయడాలూ, గాల్లోకి ముద్దులూ, కంటి చూపు ప్రసంగాలు చూసినప్పుడూ..

ఆపార్టీ, ఈపార్టీ అని కాదు..
అప్పుడూ ఇప్పుడని కాదు ,
ప్రతిరోజూ, ప్రతిసారీ..
వాళ్ళని చూసినప్పుడల్లా
ఒకటే ఆలోచన..

"దేవుడా రక్షించు నాదేశాన్ని"..

9 comments:

అబ్రకదబ్ర said...

>> ఎవరు ఎవరినన్నారో గుర్తు లేదు గాని, "తంతే వెళ్ళి బంగాళాఖాతం లో పడతాడు" అని తిట్టేసుకున్నారు.

తంతానంది జలగం. కానైతే, ఎన్టీయారు పడతాడనింది మద్రాసులో. మీరు ఎఫెక్టుకోసం మద్రాసవతల బంగాళాఖాతంలో పడేంత గట్టిగా తంతానన్నాడని చెప్పారని నా అనుమానం :-)

ఉమాశంకర్ said...
This comment has been removed by the author.
ఉమాశంకర్ said...

@అబ్రకదబ్ర
.. లేకుంటే ఒకరు మద్రాసంటే మరొకరు బంగాళాఖాతం అని రిటార్టిచ్చారేమో.. ఎనీహౌ... I am not sure :)

మురళి said...

రాను రాను రాజకీయాలు మరీ రోత పుట్టిస్తున్నాయి. దురదృష్టం. ప్రజాస్వామ్యానికి మరో ప్రత్యామ్నాయం లేదు.

పిచ్చోడు said...

ఇంతకీ మీ ఓటు ఎవరికి వెయ్యబోతున్నారు సార్..?? మాకు చెప్పక్కర్లేదు కానీ మంచి నాయకుడికి వేయండి. పార్టీని చూసి జనాలు ఓట్లు వేసినన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఏడుస్తుంది. ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు నాయకులు ఇలాగే ఉంటారు..... ఆశ్చర్యమేం లేదు, అనుమానం అంతకన్నా లేదు.

ఉమాశంకర్ said...

@పిచ్చోడుగారు:
ఇంత రాసాక ఇక దాపరికాలెందుకు? ఆ టైములో ఇండియాలో ఉండాలేగాని నాఓటు లోక్ సత్తాకే.. :)

మురళి said...

ఇప్పటివరకు మీ పాత టపాలన్నీ చదివానండి. ఆశ్చర్యం..చాలా విషయాల్లో coincidence. ఒక్కో సారైతే నా బ్లాగు నేను చదువుకుంటున్నానా? అనిపించింది. ఇంతకీ 'షోడా నాయుడు' దొరికాడా? అది నాక్కూడా చాలా ఇష్టమైన కథల్లో ఒకటి. నా మొదటి బ్లాగు లో రాశా ఆ విషయం. దొరక్కపోతే మీకు పంపే ఏర్పాటు చేస్తాను. నిజంగా నిజం.

మురళి said...

కొత్త డిజైన్ చాలా బాగుందండి.. కొత్త టపా కోసం ఎదురుచూస్తున్నాం..

ఉమాశంకర్ said...

మురళి గారు: రాయడానికి బోలెడున్నాయిగానీ సమయం చిక్కటం లేదు.. మీరు మాత్రం భలే రాస్తున్నారండి రోజుకొక టపా చొప్పున..
ఈ వారాంతం లోపు రాస్తా.. కనీసం ఒక్క టపా ..

 
అనంతం - by Templates para novo blogger