మూగమ్మ

Wednesday, March 19, 2014

మేమందరం తనని మూగమ్మ అని  పిలిచేవాళ్ళం.మా అమ్మమ్మ తరపు బంధువు.అమ్మమ్మ తరపు బంధువులంతా చాలా వరకు ఏదో కూలీ నాలీ చేసుకొనే వారే. అతి కొద్ది మందికి మాత్రం ఏదో ఎకరం అరెకరం పొలాలు అంతే. అయితే వాళ్ళు కూడా చాలావరకు వాటిని కౌలుకిచ్చి పొలం పనులకెళ్ళేవాళ్ళే .

తన అసలు పేరు ఇప్పటికీ తెలీదు.మాటలు రావు  పైగా పుట్టెడు చెముడు కూడా.మొదటిసారి తనని చూసినప్పుడు నాకప్పుడు ఏడెందేళ్ళ వయసుంటుందేమో.ఎవరు చెప్పారో తెలీదుగాని మూగవాళ్ళకి ఎదురుగా నిలబడి చూపుడు వేలుతో మన ముక్కు గిల్లుకుంటే వాళ్ళని ఆటపట్టించినట్టట.ఇంకేముంది మేం నలుగురు పిల్లలం సందు దొరికినప్పుడల్లా తనని ఆట పట్టించేవాళ్ళం.అప్పటికి తన వయసు ఇరవై కూడా ఉండక పోవచ్చు.చాలా వరకు సంయమనం పాటించినా,మా అల్లరి శృతిమించినప్పుడు మాత్రం మామీద అలిగేది.ఒకట్రెండుసార్లు చేతిలోని వస్తువుని విసిరి కొట్టి కోపంతో మేడ మీద కెళ్లి కూర్చుంటే మా అమ్మో అమ్మమ్మో తనని బ్రతిమాలి కిందికి తీసికొచ్చి తనెదురుగానే మమ్మల్ని  కసిరేవాళ్ళు.కాసేపు గప్ చుప్ .ఆ తరువాత అంతా మామూలే. 

ఆ తరువాత తనని చూసింది చాలా కొద్ది సార్లే. అయితే మాఇంట జరిగే ప్రతి శుభకార్యానికీ తప్పనిసరిగా వచ్చేదట. కలిసినప్పుడు సైగలతోనే బావున్నావా అని అడిగేది. తను మూగది కాబట్టేమో, అలా అడుగుతున్నప్పుడు నేను తన ముఖ కవళికల్ని శ్రద్దగా గమనించేవాణ్ణి. ఆ మోహంలో మాపట్ల ఎంతో  ఆప్యాయత. స్వతహాగా నేను సిగ్గరిని కాబట్టి సైగలతొనొ,పెద్దగా అరుస్తూనో తనతో మాట్లాడలేక ఆ ఒక్క మాటకి సమాధానం చెప్పి పక్కకి తప్పుకునేవాడిని బతుకు జీవుడా అనుకుంటూ( నిజంగా అలానే అనుకునేవాడిని ). 

ఆ తరువాత దాదాపు ఇరవైఏళ్ళ  తరువాత తనని నా పెళ్లి రిసెప్షనులో  చూట్టమే. సూటూ బూటూ వేసుకున్న నన్ను చూసి దాదాపు పరిగెత్తుకుంటూ వచ్చింది నాదగ్గరికి. ఇంటికి రాకుండా డైరక్టుగా రిసెప్షను కొచ్చినట్టుంది. నన్ను చూడగానే తన మోహంలో పట్టరానంత ఆనందం. సైగలతోనే "ఇంతుండే  వాడివి,ఎంత పెద్దయిపోయావు" అని మురిసిపోయింది. చేతి బోటనవేలినీ,చూపుడు వేలినీ కలిపి సున్నాలా చేసి, సూట్లో చాలా బావున్నావు అంది .కొద్దిగా వయసు మీదపడిన ఛాయలు   కనిపిస్తున్నా చలాకీతనం ఏమాత్రం తగ్గలేదు.

రిసెప్షన్ ఆద్యంతం వీలు కుదిరినప్పుడల్లా ఆ స్టేజి మీద నుంచి  తనెక్కడుందా  అని తనని వెతుకుతూనే ఉన్నాయి నాకళ్ళు. ఒకట్రెండు సార్లు నేను తన వంక చూడడం గమనించి చెయ్యూపుతూ  నవ్వింది కూడా.ఆ సాయంత్రం  నాకు అత్యంత సంతృప్తి కలిగించిన విషయం ఏమైనా ఉన్నదంటే అది ఇన్నేళ్ల  తరువాత తనని చూడటమే.నా చూపులతోనో,చేతలతోనో నేను తనని మర్చిపోలేదనే భావాన్ని వ్యక్త పరచాననే అనుకున్నానా సాయంత్రం. 

రిసెప్షను ఒక అరగంటలో ముగుస్తుందనగా తనను భోజనాల దగ్గర చూసా.ఆ తరువాత లేటుగా వచ్చిన మిగతా  బంధువులని  పలకరించి,కాసేపు వాళ్ళతో పిచ్చాపాటీ మాట్లాడి,అమ్మ కనపడితే "మూగమ్మెక్కడా?" అని అడిగితే , అమ్మ వాకబు చేసి  చెప్పింది వెళ్ళిపోయిందని. 

మనసు చివుక్కుమందొక క్షణం. 

అయినా మా అమ్మమ్మ బంధువుల విషయంలో అది కొత్తేమీ కాదు.చెప్పా పెట్టకుండా మాయమవుతారు.అలానే ఇంట్లో ఏదైనాపనుండి కబురు పెడితే, తెల్లారకుండానే తలుపు తడతారు. రావడంతోనే ఏవిధమైన భేషజాలు లేకుండా,మనం చెప్పే అవసరం లేకుండానే చొరవగా పనుల్లోకి జొరబడి పోతారు. 

కాస్త నగదూ, కొన్ని ఆస్తులూ ఆశ చూపి ఇల్లరికం వచ్చేలా చూసి మూగమ్మకి  పెళ్లి చేసారు. ఆ వచ్చినతను   ఏడాది తిరక్కుండానే ఆస్తులమ్మి డబ్బులియ్యమని నానా యాగీ చేసి తననొదిలి వెళ్లి పోయాడు. తన చెల్లెలి దగ్గర వాళ్ళ పిల్లల బాగోగులు చూస్తూ పొలం పనులకెళ్తూ రోజులు వెళ్ళదీస్తుందని  చెప్పింది అమ్మ పొద్దున్న ఫోన్ చేసినప్పుడు. "నువ్వు ఇండియా వచ్చినప్పుడు కబురు పెడితే ఎందుకు రాదూ, పరిగెత్తుకుంటూ వస్తుంది నువ్వంటే" అంది కూడా. 

నేనే వాళ్ళ వూరు వెళ్ళాలి. వెళ్లి "అసలు ఆరోజు నాకు చెప్పకుండా వచ్చేసావేం" అని సరదాగా నిలదీయాలి. అయితే ఎలా అడగాలి అన్నదే పెద్ద ప్రశ్న మరి. 


3 comments:

తృష్ణ said...

తను మీతో చెప్పకుండా వెళ్ళిపోయిందని మీకు తెలిసినట్లే తనకి కూడా తెలుసు కదా.. ఇంకా ప్రశ్న అడగాలా?
మీరు వెళ్తే తప్పకుండా సంతోషిస్తుంది.. వెళ్ళివచ్చాకా మళ్ళీ మాకు చెప్పడం మర్చిపోకండి :)

ఇది చదివితే బంధువుల పెళ్ళిళ్లలో మాత్రమే కనబడే దూరబ్బంధువులు కొందరు గుర్తుకొచ్చారు.. మిగతా సమయాల్లో ఏ కాంటాక్ట్ లేకపోయినా రెండు మూడేళ్ళకో.. ఐదేళ్ళకో ఓసారి అలా పెళ్ళిళ్ళలో కనబడి మాయమైపోయేవాళ్ళతో కూడా ఎందుకో చెప్పలేని దగ్గరతనం ఉంటుంది...

ఉమాశంకర్ said...

తృష్ణ గారు, Thank you.నిజానికి నామీద నేనే సైటైరికల్ గా రాసుకున్న విషయమది. : )

ఎగిసే అలలు.... said...

Chaalaa baagundi umashankar gaaru:):)mee blog ippude chustunnaa..very nice:):)

 
అనంతం - by Templates para novo blogger