మా ఇంటి వార్తలు

Monday, February 17, 2014

1. రాత్రిటి వంట తాలూకు సగం తరిగి వదిలేసిన ఉల్లిపాయ కిచెన్ కౌంటర్ మీద అలానే ఉంది . దాని పక్కనే తరిగిన కూరగాయల తాలూకు తొడిమెలూ,ఫ్రిజ్ లో పెట్టడం మరిచిపోయిన పెరుగు గిన్నె, ఆ పక్కనే సింక్ లో ఉండాల్సిన భోజనం ప్లేటూ. 

2. ఈ మధ్య కార్ ప్రయాణం చాలా నిశ్సబ్దంగా,బోరింగ్ గా ఉంటోంది . వెనకున్న రెండు కార్ సీట్లూ నాలాగే వంటరిగా. ఇక పక్క సీటు సంగతంటారా , ఉమ్మ్మ్... సో సో ..  ఆ సీటు అలా కామ్ గా ఉంటేనే బెటరు .. :)

3. అలవాటు తప్పిపోయింది కదా, ఇంట్లో నాకిష్టమైన పని, నాకిష్ట మొచ్చినప్పుడు చేయడం భలే వింతగా ఉంది. దాన్ని మించి, నాకిష్టం లేని పనిని  వాయిదా వెయ్యగలగడం ఇంకా ఇంకా వింతగా ఉంది.

 4. నాలోని  అరాచకవాది  మేల్కొన్నాడీ మధ్య. కావాలనే మొన్నొకరోజు ఎంచక్కా జీన్స్ పేంటు వేసుకొనే నిద్రపొయా. ఎన్నేళ్ళయింది అలా నిద్ర పోయి? ఎంత చక్కగా నిద్ర పట్టిందో.ఇది బయటికి వేసుకెళ్ళే డ్రస్సు, అదేసుకోవద్దు,ఇదేసుకోవద్దు , అని నిలదీసేవాళ్ళెవరూ లేరింట్లో. మాఇంట్లో నేనే కింగుని(ప్రస్తుతానికి). 

5. వర్క్ ఫ్రం హొమ్ చేసేటప్పుడు, ఇంట్లో అందరూ ఉన్నప్పుడే ఇంకాస్త బాగా పనిచేసేవాడి ననిపిస్తోంది . దీని మీద నాకింకా క్లారిటీ రాలేదు గాని,బహుశా నిజం కావచ్చు.

6. నాకిష్టమైన ఛానల్సు ఎంతసేపైనా చూడొచ్చనుకున్నానా? రెండు రోజులకే మహా బోరు కొట్టేసింది. నాకు డోరా కావాలనో , మరింకేదో కావాలనో పోటీ పడే వాళ్ళుంటే బాగుండు . అలా ఫైట్ చేసి చూడ్డంలోనే మజా. 

7. ఎప్పుడైనా అలా బయటికెళ్ళొచ్చి మెయిన్ డోర్ తాళం తీసి లోనికి రాగానే అక్కడ కనపడే బుజ్జి బుజ్జి బూట్లు కనపడగానే ఇంట్లోకెళ్ళ బుద్ది కావడం  లేదు. నేనుకూడా ఇంకో రెండు నెలలు అలా అలా బయట తిరిగి, వారొచ్చాకే ఇంటికొద్దామని ఉంది . 

8. పెళ్ళంటేనే ఇద్దరికీ కొత్త జీవితం. ఆ "కొత్త" లో సింహభాగం కోల్పోయే స్వేఛ్చేఅని ప్రాక్టికల్ గా అర్ధం అవుతోంది. ఈ విషయం తెలియదని కాదు గానీ , ఏడేళ్ళ తరువాత కదా, మొహం మీద లాగి పెట్టి కొట్టినంత ప్రస్పుటంగా ఉందీ స్వేచ్చానుభవం . :)  

9. హారర్ , సస్పెన్స్ సినిమాలు రాత్రుళ్ళు చూడ్డం మానేసా. ఎంత కింగునైనా , మనిషినే కదా.....  భయం అన్నమాట.  (భయపడని వాళ్ళు అస్సలు మనుషులే కాదు అని నేనంటం లేదు బాబొయ్.. )

10. ఏమాటకామాటే. ఉదయాలు మాత్రం మహాప్రశాంతంగా మొదలవుతున్నాయి,నాకిష్టమైన సినిమాపాటలతోనో లేదా భక్తి సంగీతంతోనో. 

11. బ్రేక్ ఫాస్ట్ లు లంచ్ లవుతున్నాయి.అలాగే లంచ్ లు,లంచ్ టైం కి బాగా తరువాత,డిన్నర్ కి కొద్దిగా ముందు. అన్నమాట.   (కడుపులో బాగా కాలాక అని కవి భావం ). 

12. మొన్నొకరోజు కష్టపడి,చెమటోడ్చి రాత్రి పదింటికి వంట కానిచ్చి, ప్లేట్లో పెట్టుకొని  తింటూ , టీవీ చూస్తూ అలా  అన్నం చేత్తోనే నిద్రపొయా. మెలకువొచ్చాక ఎప్పుడో తెల్లవారు ఝాము నాలుగింటికి మిగతా భోజనం పూర్తి చేశా. (బ్రహ్మచారి జీవితంలో ఒక నాలుగైదు సార్లు ఇలానే జరిగినట్టు గుర్తు. ). 

13. బుర్ర అటెన్షన్ లోకొచ్చి చాలా రోజులయినట్టుంది, ఎవరిచేతైనా ఒక రెండు తిట్లు తిట్టించుకోవా లనిపిస్తోంది. ఏమిటో వింత కోరిక. 

14. బోల్డంత ఫ్రీ టైం . ఎడా పెడా చదివే యొచ్చూ , బర బరా రాసేయొచ్చూ  అనుకున్నానా, దానిక్కావలసింది కూసింత డిసిప్లనూ , టైం మేనేజ్మెంటూ అని అర్ధం అయింది. ( ఇదీ తెలిసిన విషయమే, ఏదో మీ కోసం :) )

15. నేను మర్చిపోయినో ళ్ళకీ ,నన్ను మర్చిపోయినోళ్లకీ ఫోన్ కాంటాక్ట్ లిస్టు వెతికి  మరీ ఫోన్ చేసి విసిగిస్తున్నానీ మధ్య. నా ఫోన్ కాల్  రిసీవ్  చేసుకున్నోళ్ళు  కొంతమంది బహుశాఇప్పటికీ తేరుకోనుండకపోయుండొచ్చు.రిసీవ్ చేసుకోనోళ్ళు  ఇంకా భయపడుతూ ఉండొచ్చు. 

16. బాబోయ్ ,ఇన్నేళ్ళలో , ముఖ్యంగా గత మూడేళ్ళలో నేను మిస్సయిన మంచి సినిమాలు , తెలుగువీ , హిందీవీ ఎన్నున్నాయో. ఒక్కోటొక్కోటి  చూడ్డం మెదలెట్టా.ఇంకా బోల్డున్నాయి. ప్చ్.... 

17. థియేటర్లో సినిమా చూడడం ఏదో గత జన్మ జ్ఞాపకంలా  అయిపోయింది. అటువంటిది ,ఏమిటండీ బాబు, అసలు, అప్పటికప్పుడు అనుకొని , ఒక అరగంటలో షో  ఉంటే , గబ  గబా   తయారయ్యి సినిమా కెళ్ళడం?   అస్సలు నమ్మశక్యంగా లేదు . థియేటర్లో కూర్చున్నాక  కాస్త గిల్లుకొని నిర్ధారించుకుంటున్నా. మొన్నొక రోజు  ఫషో సినిమా చూసి,దార్లో బిరియానీ తిని,ఇంటికొచ్చి ఒక గంట టీవీలో వార్తలు చూసి .. బాబోయ్..  అసలు నేను నేనేనా? నా జీవితమనే కేలండర్లో ఈరోజు నిజమేనా?

18. వేల మైళ్ళ దూరాన , భూగోళానికి ఆవల ఉన్న బుజ్జి తల్లిని , వెబ్ కేమ్ లో "హాయ్ అమ్మలూ" అని పలకరిస్తే, నాకవతల బోల్డు పనులున్నాయి అని మొహం కూడా చూపించటంలేదు. బోల్డు మంది కొత్త నేస్తాలు, ఇక నేనెందుకూ? ఇక్కడికొచ్చాక దాని పని పట్టాలి. ఏడ్చిగీపెట్టినా కార్టూన్ చానల్సు పెట్టనంటే పెట్టను.డోరా అసలే పెట్టను. 

19. ముద్దు ముద్దుగా  కనిపించే టెడ్డీ బేర్ మొహం ఇప్పుడు దిగాలుగా కనిపిస్తోంది . ఇంత కళ్ళేసుకుని  భలే ఫన్నీ  గా ఉండే చేప బొమ్మ ఇప్పుడు ఏదో బిత్తర చూపులు చూస్తున్నట్టుంది. ఇవి కూడా నాటైపే . ఉన్నప్పుడు ఎడా పెడా తొక్కించుకుంటాయి, లేనప్పుడు దిగులేసుకుంటాయి. :(  

20. నెల క్రితం అందిన వార్త. మా ఇంట్లో వాళ్ళందరూ ఇండియాకెళ్లా రండీ నన్నిలా వదిలేసి .. :(


8 comments:

Ennela said...

hahahaha funny! Paapam meeru!!!:(

Ennela said...

hahahaha funny! Paapam meeru!!!:(

సుజాత said...

ఎన్ని రోజులైందండీ కనిపించి!! (

ఊ.. బావుంది మీ దిగులు పోస్టు.

అంటే మీరు బ్లాగ్ రాయాలంటే మీ ఇంట్లో అంతా ఇండియా వెళ్ళాలన్న మాట! ఇదేం బాలేదు

Sunita Manne said...

హాహహ!బ్లాగ్ దుమ్ము దులిపి పాత నేస్తాలను పలకరించాలంటే బుజ్జితల్లి భూగోళం అవతలకి వెళ్ళాలన్నమాట:))) ఎన్నాళ్ళకెన్నాళ్ళకు:))) అంతా కుశలమేనా??

తృష్ణ said...

firstly a big hi!!but,నాదీ సుజాతగారి మాటే... మీవాళ్ళు ఇండియా వెళ్తేనే మీకు బ్లాగ్ గుర్తొస్తుందంటే ఎలా..ఎలా..ఎలా...:-)

మురళి said...

wow!! after a very long time..
keep writing blogposts too (along with your other dream projects like watching movies and reading books)
Enjoy the vacation :))

వేణూశ్రీకాంత్ said...

హౌ స్వీట్ :-) చాలా బాగున్నాయండీ వార్తలు :)

ఉమాశంకర్ said...

@వెన్నెల: Thank you అండీ..
@సుజాత: అవునండీ నాకూ అస్సలు బాలేదు..ప్చ్.. ఎలా ఉన్నారండీ? చికాగోలో ఉన్నారనుకున్నాను, ఆస్టిన్ కి మారారన్నమాట.

@సునీత: హాయ్ అండీ..కుశలమేనండీ..మీరెలా ఉన్నారు?

@తృష్ణ: ఎలా? అని నన్ను నేను చాలా సార్లు ప్రశ్నించుకున్నానండీ..సమాధానమే దొరకడం లేదు. :(

@ మురళి: తప్పకుండానండీ..మొదట్లో వెకేషన్ అనుకున్నాను గానీ, కష్టమేనండీ..

@వేణూ శ్రీకాంత్: హల్లో సర్, ఎలా ఉన్నారు ? Thank you

వావ్, ఇన్నేళ్ళయినా గుర్తు పెట్టుకొని మీరందరూ పలకరించేసరికి, పాత రోజులు గుర్తుకొచ్చేసాయ్..Thank you very much to you all.

 
అనంతం - by Templates para novo blogger