ఒక పరిచయం

Monday, April 9, 2012

తను నావైపు చూసి సన్నగా నవ్వింది.

నాలో క్షణకాలపు తడబాటు.

నన్నేనా లేక నా పక్కనున్న తన పరిచయస్తులెవరినైనా ఉద్దేశించి నవ్విందా?సమాధానంగా నేను తిరిగి నవ్వితే,ఒకవేళ ఆ నవ్వు నున్నుద్దేశించింది కాకపొతే ?

సమాధానంగా నేను నవ్వీ నవ్వనట్టు నవ్వినా, నా తడబాటు కలిగించిన ఆ క్షణకాలపు ఆలస్యం నా సమాధానాన్ని తనవరకూ చేరనిచ్చినట్టు లేదు. ఆసరికే తను తలకిందికి దించుకొని కుడి చేతి బొటనవేలిని స్మార్ట్ ఫోన్ తెర మీద ఆడిస్తోంది.

తలతిప్పి నా కుడి ఎడమలకు చూసాను. వారెవరూ తన పరిచయస్తుల్లా అనిపించలేదు.నాలో చెలరేగే సంచలనాన్ని అణచుకుంటూ, ఒక అరనిమిషం కదులుతున్న బస్సులోంచి బయటికి చూసి మళ్ళా తనవైపు ఓరగా చూసాను. తను అలానే తలవంచుకొని ఫోన్ వైపు చూస్తోంది.

నేను తనకు ఎంత కాలంనుంచి తెలుసో తెలీదు గాని, మాటా మంతీ లేని మా పరిచయానికి నావైపు నుంచి దాదాపు ఒక సంవత్సరపు వయసుంటుంది. ఇద్దరం ఆఫీసుకెళ్ళే సమయం ఒకటే కాబట్టి తరచుగా తను నాకెదురవుతూనే ఉంటుంది. మొదటిసారి చూసిన సందర్భం గుర్తులేదు కాని తనని చూడగానే ఏదో చాలా కాలం నుంచి పరిచయమున్న వ్యక్తిలా, ఒక అందమైన చిన్నప్పటి జ్ఞాపకంలా అపురూపమైనదీ, అరుదైనదీ అన్న భావన కలిగిందా క్షణాన.అప్పుడు నాకేమీ స్పురణకు రాలేదు గాని ఇది జరిగిన ఒక వారం రోజుల తరువాత , భోరున కుండపోతలా వర్షం కురుస్తున్న రోజు, బస్సులో ఎప్పటిలా తనని చూసిన క్షణాన , (బహుశా) ఆవర్షపు వాతావరణం ఒక ఉద్దీపనలా దాదాపు పాతికేళ్ళ క్రితపు నా యవ్వనపు పరిచయాన్ని గుర్తుకు తెచ్చింది. అంతటితో ఆగకుండా ఆ జ్ఞాపకానికీ నేను ఇప్పుడు చూస్తున్న వ్యక్తికీ ఏ తర్కానికీ అందని లంకె కుదిర్చి మిగతా ఖాళీని నువ్వే పూరించుకో అంటూ నిర్మొహమాటంగా నన్నో జ్ఞాపకాల జడివాన లోకి తోసేసింది..

***********************************************************************************
కాలపరీక్షకి ఎదురునిలిచే కొన్ని జ్ఞాపకాలు ఒంటరిగా గుర్తురావేమో.

ఆ సంఘటనలూ, వాటిని ఆవరించుకొని ఉన్న నేపధ్యం కూడా దాంతో పెనవేసుకొని గుర్తుండిపోతుంది. బహుశా మెదడు మనకిష్టమైన ఆ జ్ఞాపకాన్ని నిక్షిప్తం చేసే పద్దతే అదేమో నాకు తెలీదు..

ఎప్పుడో పాతికేళ్ళ క్రితపు ముసురు పట్టిన వినాయక చవితి నాటి సాయంత్రమూ..

వెన్నెల్లో మేడ మీద సిరివెన్నెల పాటలూ..

గుళ్ళో వెలిగించిన కార్తీకమాసపు దీపాలూ..

రోహిణీకార్తె మిట్టమధ్యాహ్నం ఆవిర్లు కక్కుతూ ,నిర్మానుష్యంగా ఉండి, ఏ ఐదింటికో తిరిగి జీవంపోసుకొనే వీధీ.. ఎప్పుడు సాయంత్రమవుతుందా ?తనెప్పుడు కనబడుతుందా?అని నా ఎదురుచూపులూ..

ఇవన్నీ ఆ అందమైన పరిచయానికి అంతే అందమైన నేపధ్యాలు...
*********************************************************************************


ఓరగా చూసి చటుక్కున తలతిప్పుకొనే నేను ఆరోజు తనని మొట్టమొదటి సారి పరిశీలనగా చూసాను. గుండ్రటి మొహం,ఆరోగ్యకరమైన పలకరింపుతో కూడిన కళ్ళూ, చెవులకు చిన్నప్పుడెప్పుడో పెట్టుకొని ఇప్పటివరకూ ఒక్కసారి కూడా తీయలేదేమో అనిపించే పాతకాలపు బుట్టలూ, మెడలో సన్నని బంగారపు గొలుసూ, అన్నిటికీ మించి మొహంలో పట్నవాసపు పోకడ తెలీదనిపించే ఒకరకమైన అందమైన అమాయకత్వమూ. తను తలవంచుకొనే విధానమూ , తలవంచుకొని చేస్తున్న పనిలోకి లీనమయే తీరూ ,తన నడకా ఇలా ప్రతిదీ నా జ్ఞాపకానికి ప్రతిరూపంగా అనిపించ సాగాయి ఆరోజునించి.

ఒకే అపార్ట్మెంట్ ఆవరణ లో ఉండే మాదొక మూడంచెల ఆఫీసు ప్రయాణం. ఒక రెండుమైళ్ళ కారు ప్రయాణం, తరువాత ఒక 20 నిమిషాల బస్సు, ఆపై దాదాపు ఒక 25 నిమిషాల సబ్వే రైలు ప్రయాణం. రైలు బయలు దేరిన 14 నిమిషాలకు తను దిగిపోతుంది.కొన్ని సార్లు బస్సు ఎక్కేటప్పుడు కనపడకపోయినా ట్రైన్ స్టేషన్లో కనపడుతుంది ప్లాట్ ఫారం మీద ఎస్కలేటర్ పక్కనే నిలబడి రైలు కోసం వేచి చూస్తూ.ప్రతిరోజూ అక్కడే నిలబడుతుంది ఒక అడుగు అటూ ఇటుగా.

దాదాపు ప్రతిరోజూ కారు పార్క్ చేసి నాలుగంతస్తులు మెట్లు దిగి కిందకొస్తూ, పక్కనున్న ఆద్దాలలోంచి కింద లైనులో నిలబడ్డ వాళ్ళలో ఆత్రంగా తనని వెదుక్కునేవి నాకళ్ళు. తను నాకు బస్ స్టేషనులో కనపడని రోజున నేను రైల్వే ప్లాట్ఫాం మీద ఎస్కలేటర్ పక్కనున్న ఆ స్థలాన్ని మనసులో మెదిలే ఆత్రత ఏమాత్రం పైకి కనపడనీయకుండా చాలా యధాలాపంగా గమనించేవాడిని. సరాసరి ప్రతి నాలుగు నిమిషాలకు ఒక ట్రైన్ ఉండే ఆ రూట్లో తను నాకు కనపడే అవకాశం బహు తక్కువ. చాలా వరకు ఆ స్థలం నన్ను వెక్కిరిస్తూ కనపడేది. వాక్యూముక్లీనర్లా ప్రయాణీకులందరినీ తుడుచు కెళ్ళిన రైలు వెళ్లి మరీ ఎక్కువసమయం కాకపొతే అది ఇంకాస్త ఖాళీగా , బోసి పోయి కనపడుతూ,ఆ నిశ్శబ్దంలో పక్కనున్న ఎస్కలేటర్ అప్పుడప్పుడూ చేసే కిర్రు మనే చప్పుడు అప్పుడేవెళ్ళిన తనగురించి నాకేదో చెప్తున్నట్టనిపించేది.

మా ప్రయాణంలో నేను పుస్తకం చదువుతూ, తను పాటలు వింటూ అప్పుడప్పుడు క్షణకాలం కలిసే కళ్ళను సభ్యత విడదీసేది. ఎప్పుడో అమావాస్యకో పౌర్ణానికో , ఏ తెలీని ధైర్యమో ఆ క్షణానికింకో క్షణాన్ని కలిపేది. నాగుండె లయ తప్పేలా ఆ రెండో క్షణం అచ్చంగా నా గత జ్ఞాపకం నన్నుచూసి పలకరింపుగా నవ్వినట్టుండేది. ఆసమయంలో తనుకూడా నన్ను చూస్తున్నదన్న ధైర్యం అనుకుంటా, అమాంతం వెళ్లి పక్కన కూర్చొని నన్ను తనకి పరిచయం చేసుకుందామనిపించేది.కానీ ఇలాంటి విషయాల్లో బహుశా నా నిరాశాపూరిత ఆలోచనల కారణంగా కావచ్చు , నా అందమైన ఊహల కొలనులో రాయి వేయటానికి నాకు మనస్కరించేది కాదు. కళ్ళముందున్న వాస్తవానికీ,నేనెరిగిన జ్ఞాపకానికీ స్థల,కాల పరంగా సహజంగా ఉండే దూరం ఒక భయమై, మాట్లాడకుంటే తను నాగురించి ఏమైనా చెడుగా అనుకునే అవకాశం ఉంటుందేమో అన్న ఆలోచని కూడా తోక్కిపట్టేసింది.అప్పుడప్పుడూ తన పేరేమిటో అన్న ఆలోచన మాత్రం నాలో పొడసూపేది. బహుశా తనపేరు కూడా అదేనేమో?నాలోనేను నవ్వుకునేవాడిని ఆ ఊహ రాగానే.కొన్ని కొన్ని సార్లు నేను తలతిప్పుకొని కిటికీ బయటికి చూస్తున్నప్పుడు తను నావైపే కళ్ళార్పకుండా చూస్తున్నట్టనిపించేది. అది నిజమో కాదో గాని ఆ ఆ ఊహ మాత్రం భలే గమ్మత్తుగా ఉండేది.

మాటల్లేని ఈ పరిచయం ఇలానే కొనసాగి ఉంటే బాగుండేది.

15 comments:

చిన్ని said...

బ్లాగ్ డాష్ బోర్డు లోకి రాగానే ఒక్కసారే అనంతం లో ఒక్కమెరుపు మెరిసింది! గబగబా పరుగులెట్టేసాయి నా కళ్ళు...ఆ తరువాత ?మరో నెల ఎదురు చూడాలన్న మాట !ఎప్పటిలానే చాలా చాలా బాగుంది ముఖ్యంగా జ్ఞాపకాల నేపధ్యం .

sunita said...

మా ఙ్ఞాపకాలూ అంతేనండి. పాత స్నేహితులు దగ్గర దగ్గర ఓ ఏడాది తరువాత ఇదుగో ఇలా పలకరిస్తే మేమూ చక్కగా గుర్తుపెట్టుకుంటాము:)))

madhu said...

Chala Baaga rasaru...mee lanti Prema Hrudayaali eepudo okappudu ela vooha lokaalloki vellipotune vuntayi...Naato saha.. thanks,chaduvutunnanta sepu teepi gnapakala to madi pulakinchindi..That is the power of woman as long as we dont really reach them.

madhu said...

Chala Baaga rasaru...mee lanti Prema Hrudayaali eepudo okappudu ela vooha lokaalloki vellipotune vuntayi...Naato saha.. thanks,chaduvutunnanta sepu teepi gnapakala to madi pulakinchindi..That is the power of woman as long as we dont really reach them. but beauty is beauty..if we see from diatsnace.

మురళి said...

Welcome back :)

KumarN said...

ఉమాశంకర్ గారూ,
ఎంతో చిక్కగా రాసే మీలాంటివాళ్లు ఇంత అరుదుగా రాయడం..కమ్యూనిటీకి మంచి రాతల్ని డిప్రైవ్ చేయడమే. అన్యాయం కదూ!

కానీ, చాన్నాళ్ళకి కనిపించారు, చాలా సంతోషం.

వేణూ శ్రీకాంత్ said...

చాలారోజుల తర్వాత మీటపా చూడడం చాలా సంతోషాన్నిచ్చిందండీ :)

జలతారువెన్నెల said...

బాగుంది.

MURALI said...

నాకు బాగా నచ్చిన వాక్యం.
<>
ఇంచుమించు ఇలాంటి భావాన్నే నేను నా పునరపి అనే కధలో వ్రాసాను.
"గతకాలపు దృశ్యాల్లో మనం వదిలేసి వెళ్ళిపోయే అస్థిత్వాలు ఆ జ్ఞాపకాలను అంటిపెట్టుకునే అలానే ఉంటాయేమొ. అదే నిజమయితే ఆ నాడు తను వదిలిన తన ప్రెజెన్స్ ఇప్పుడు ఇక్కడే నాతో ఉంది"

నిషిగంధ said...

బహుకాల దర్శనం :-)

మొత్తం బావుంది..

ఇది మాత్రం చాలా బావుంది...

"కాలపరీక్షకి ఎదురునిలిచే కొన్ని జ్ఞాపకాలు ఒంటరిగా గుర్తురావేమో.

ఆ సంఘటనలూ, వాటిని ఆవరించుకొని ఉన్న నేపధ్యం కూడా దాంతో పెనవేసుకొని గుర్తుండిపోతుంది. బహుశా మెదడు మనకిష్టమైన ఆ జ్ఞాపకాన్ని నిక్షిప్తం చేసే పద్దతే అదేమో నాకు తెలీదు....."

:-)

ఉమాశంకర్ said...

@చిన్ని .. హ్హ హ్హ హ్హ , ఒక నెల? నా ట్రాక్ రికార్డ్ తెలిసీ మీరు ఆ మాట అన్నారంటె మీరో పెద్ద ఆశావాది అన్నమాట..

@సునీత, మీరు కూడా రాయడం బాగా తగ్గించినట్టున్నారు. I miss your writings.

@Madhu.. You said it. :) And thank you.

@ మురళి .. Welcome back అర్ధమైందండీ.. ఆ తరువాత పెట్టిన స్మైలీ ఆ తరువాత కాసేపటికి గానీ అర్ధం కాలేదు. మీచేత మళ్ళీ మళ్ళీ Welcome back అని అనిపించుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను.

@KumarN మీ అభిమానానికి థేంక్స్ అండీ.. నావన్నీ ఏదో టైం పాస్ రాతలే లెండి.

@వేణూ శ్రీకాంత్ : థేంక్స్ అండీ.

@జలతారువెన్నెల : Thank you.

@MURALI: Thank you Sir.

@నిషిగంధ : As always, Thank you for stopping by :)

కొత్తావకాయ said...

బాగుందండీ.

"వాక్యూం క్లీనర్లా ప్రయాణీకులందర్నీ తుడుచుకెళ్ళిన రైలు.." ఎంత బావుందదీ! :)

ఉమాశంకర్ said...

@కొత్తావకాయ: స్వాగతం. మీ రాక మాకెంతో సంతోషం సుమండీ అనాలనుంది మరి. పైగా నా రాత నచ్చిందన్నారుగా..మరీ సంతొషం. : )..

Sravya Vattikuti said...

ఓహ్ భలే ఉందండి మీ మాటలు లేని పరిచయం !

ఉమాశంకర్ said...

Sravya Vattikuti: థాంక్స్ అండీ.

 
అనంతం - by Templates para novo blogger