అమెరి'కతలు -1

Saturday, April 21, 2012

శనివారం తెల్లవారుజాము తొమ్మిదింటికి రమేష్ గాడి దగ్గిర్నుంచి ఫోన్.
"ఏంట్రా"
"రేయ్ నేను రమేష్ ని. ఆ ఏంలేదు చిన్న హెల్ప్ కావాలి"
రమేష్ గాడి సంగతి నాకు బాగా తెలుసు. ఫోన్ చేసి ,విషయం పూర్తిగా చెప్పకుండా "ఆ ఏంలేదు" తో మొదలెట్టాడంటే ఏదో దాస్తున్నట్టే లెక్క.
"ఏమిటి?"
"ఆ ఏంలేదు .నా కారు సర్వీసింగ్ కివ్వాలి"
నాలో అనుమానం బలపడింది. మళ్ళీ "ఏంలేదు" అన్నాడంటే డెఫినెట్ గా ఏదో ఉంది.
"నువ్వు కూడా నాతోపాటు నీకార్లో వస్తే, వచ్చేటప్పుడు నన్ను మాఇంటి దగ్గిర వదిలేద్దువుగాని" చెప్పాడు,

వివరాలు కనుక్కొని ఫోన్ పెట్టేసాను.

మధ్యరాత్రి లేపాడుకదా ఒకటే కళ్ళు మండుతున్నాయి.

పని చేసీ,చేస్తున్నట్టు నటించీ,బుధవారంనుంచి పనిని క్రమ క్రమంగా వచ్చేవారానికి వాయిదావేసీ బాగా అలసిపోయుంటానేమో, శుక్రవారం సాయంత్రం కాగానే నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. ఇంటి విషయాల్లో దక్కే వీటో అధికారం దీనికి అదనం. తనేం పని చెప్పినా "ఏం ఇది శుక్రవారం సాయంత్రం, తెలీదా?" అన్నట్టు చూస్తుంటాను తనవైపు. జస్ట్ చూస్తాను. అంతే. ఏం అనను, ఎందుకొచ్చిన గొడవ అని. చాలా వరకు నాకు అనుకూలంగానే వర్కవుట్ అవుతుందా చూపు.ఇంతాచేసి శుక్రవారం సాయంత్రం నేనేం చేస్తానూ ఆంటే, నాకిష్టమైన సినిమా,లేక సినిమాన్నరో, ఆపై ఏదైనా పుస్తకంలో ఓ వంద పేజీలూ నమిలేసి ,ఆపై మళ్ళా టీవీ చూస్తూ ,నా కిష్టమైన చోట, అనగా సోఫాలో, నిద్ర పోతాను . బ్రహ్మచారి గా ఉన్నప్పుడు పడుకోటానికి బెడ్డున్నా,నేను టీవీ చూస్తూ సోఫాలోనే నిద్రపోయేవాడిని నాకిదే సౌకర్యం అంటూ. నా రూమ్మేట్లు వింతగా చూసేవారు,వీడి కిదేం (నిద్ర) పోయేకాలం అని. అలా ఆనందమయ జీవితానికి సోఫా ఒక సింబల్ అయి కూర్చుంది నాకు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గెస్టు లెక్కువై , హోస్టులు హైరానా పడుతుంటే నేను నెమ్మదిగా సోఫానాక్రమించుకొని నామోహాన ఒక కంఫర్టర్ పడేస్తే నా నిద్ర నేనుపోతాను అని చెప్తా ఏదో త్యాగం చేస్తున్నట్టు మొహం పెట్టి.

సరేలెండి, విషయానికొస్తే,సో, అలా నేను నిద్రపోయే సరికి శనివారం ఉదయం ఏ నాలుగో ఐదో అవుతుంది మరి.బహుశా అందుకే అనుకుంటా , ఆ మరుసటి రోజు, నేను క్రితం రాత్రి చూసిన సినిమాలు గుర్తుంటాయి గాని, వాటి పేర్లు మాత్రం చచ్చినా గుర్తు రావు.

********************************************************************

ఉసూరు మంటూ రెడీ అయి పదకొండూ పదకొండున్నర మధ్య రమేష్ గాడింటి కెళ్ళాను. వాడే తలుపు తీసాడు.వాళ్ళావిడ ఇండియా వెళ్ళింది. ఇంట్లో వీడొక్కడే. కలర్లో చూస్తున్న WW-II స్టిల్ ఫోటోగ్రాఫ్ లా ఉంది ఇల్లు. ఏ వస్తువునీ తాకకుండా, తొక్కకుండా జాగ్రత్తగా ఒక డైనింగు టేబుల్ తాలూకు కుర్చీలో సెటిలయ్యాను. వాడేమో డైనింగ్ టేబిల్ మీద పెట్టిన ల్యాప్ టాప్ లో పాటలు వింటూ వంటింట్లో స్టవ్ దగ్గర ఏదో కుస్తీ పడుతున్నాడు. ఆ పాట వింటుంటే విన్న ట్యూన్ లానే ఉంది. మ్యూజిక్కులో మాత్రం రెహ్మాన్ మార్కు స్పష్టంగా కనపడుతోంది.

"రెహ్మాన్ పాటలా ఉంది. ఏం సినిమా? " అడిగాను.

వాడు నావైపు అదోలా చూసి,గబా గబా నాదగ్గరకొచ్చి . ల్యాప్ టాప్ నావైపు తిప్పాడు. స్క్రీన్ నిండా పాపప్ విండోలు.

"ఏదో వైరస్ ఎక్కిందిరా. నీ దగ్గరేమైనా ఏంటీ వైరస్ ఉందా?" అంటూ టిక్కుం టిక్కుం అని వాటిని ఒక్కొక్కటే క్లోజ్ చేస్తున్నాడు. ఒక స్క్రీన్లో ఏవో వార్తలు వస్తున్నాయి. ఇంకో దాంట్లో ఇంట్లో కూర్చొని నెలకి ఇరవై వేల డాలర్లు ఎలా సంపాదిచ్చొచ్చో చెప్తూ ప్రకటన, ఇంకో దాంట్లో బరువు తగ్గటం ఎలా అనే విషయం మీద ఒకామె ఊదరకొట్టేస్తోంది. ఇంకొన్ని స్క్రీన్లు చెప్పకూడనివీనూ. అలా వాడు దాదాపు ఒక ఏడెనిమిది విండోలు మూసేసాక అప్పుడు వినపడింది పాట స్పష్టంగా "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి" అంటూ.

"అరె, మన ఇళయరాజా పాట. అనవసరంగా కాపీ ట్యూన్ అని రెహ్మాన్ ని ఆడిపోసుకున్నానే" నోచ్చుకున్నాన్నేను. పైకలా అన్నా నాకు రెహ్మాన్ మ్యూజిక్ అసలు నచ్చదు. వంటింట్లో ఉన్న స్టీలు పాత్రలన్నీ కౌంటర్ టాప్ మీద పెట్టి , ఒక్కసారిగా వాటన్నిటినీ నేల మీదికి తోసేసినట్టుగా ఉంటుంది నాకు ఆయన సంగీతం.

స్టవ్ దగ్గర్నుంచే వాడు ఆఫర్ చేసిన బ్రేక్ ఫాస్ట్ ని లోపల భయమేస్తున్నా,పైకి సున్నితంగా,పొట్ట రుద్దుకుంటూ ఇంట్లోనే తినొచ్చా అని చెప్పి తప్పించుకున్నాను.

వాడు తింటుండగా అడిగాను.

"ఇంతకీ ఏంటి విషయం?"

"దేని గురించి?"

"అదే , కారు సర్వీసింగ్ అన్నావు, ఆయిల్ చేంజా?"

"కాదు"

"మరి?"

వ్యక్తిగత విషయాలైనా,మొహమాటం లేకుండా,ప్రశ్నలతో వేధించగల చనువున్న అతి కొద్ది మంది (ఇద్దరు) ఫ్రెండ్స్ లో వీడొకడు నాకు.

వాడు నావైపు సాలోచనగా చూసాడు.చెప్పాలా వద్దా అని సంకోచిస్తున్నట్టుగా అర్ధమయింది నాకు. ఇప్పుడు కాకపొతే, కింద కారు దగ్గరి కెళ్ళాకో, లేదా సర్వీసు సెంటర్ లోనో విషయం నాకు వాడు చెప్పక పోయినా (చూచాయగా నైనా)తెలుస్తుందని నెమ్మదిగా అర్ధమయినట్టుంది బడుద్దాయికి. తింటున్నదాపి కాస్త నీళ్ళు తాగి గొంతు సవరించుకున్నాడు.

"ఏక్సిడెంటు చేశా"

వాణ్ని పైనించి కిందదాకా పరీక్షగా చూస్తూ అన్నా "ఏమిటీ? ఎక్కడ? ఎలా అయింది?ఏం కాలేదు కదా?"

"తిక్క మొహంది. వెళ్తూ వెళ్తూ సడన్గా బ్రేకేసింది, నేను చూసుకోలేదు" ఆమెదే తప్పన్నట్టు మొదలెట్టాడు. "వెనకనుంచి ముద్దెట్టుకున్నా"

"వాటెవర్ ఇట్ ఈజ్ . నీదే తప్పు. బాగా డామేజయిందా ?"

"ఆమె కారుకేం కాలేదు. నాకారు బానేట్ కొద్దిగా వంకర పోయింది."

"ఎప్పుడు జరిగిందిది?"

"మొన్న , సండే నైటు పదకొండప్పుడు "

"ఆ టైమ్లో బయటి కెందుకెళ్ళావురా?"

" "

దొరికి పోయాడు. సో, ఆ ఏదో, ఇక్కడుంది అన్నమాట.

పొద్దున్నే ఆఫీసు పెట్టుకొని ఆ టైమ్లో బయటికెందుకెళ్ళాడు? ఎందుకు?ఎందుకు?ఎందుకు?
(ఇంకాఉంది)


2 comments:

జలతారువెన్నెల said...

బాగుందండి.."శుక్రవారం సాయంత్రం కాగానే నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది." కదా?మొదట్లో అసలు శుక్రవారం రాగానే ఎందుకు ఆనందం వీళ్ళకి అనిపించేది, ఇప్పుడు శుక్రవారం పొద్దున్నుంచే మనసంతా తేలికగా ఉంటుంది..
"పైకలా అన్నా నాకు రెహ్మాన్ మ్యూజిక్ అసలు నచ్చదు." నాకు కూడా అసలు నచ్చదు. అంటె ఆయన మంచి సంగీతం చెయ్యలేదని కాదు కాని, ఎందుకో నాకు కూడా ఆయన సంగీతం నచ్చదు.
"తిక్క మొహంది. వెళ్తూ వెళ్తూ సడన్గా బ్రేకేసింది, నేను చూసుకోలేదు" హ్మ్..అంతే కదండి, సగం మంది మగవారు, ముందు కారు నెమ్మదిగా నడుపుతున్న ఆడవారిని ఇలా విసుక్కొవటం నాకు అనుభవమే! Casino కి కాని, pub కి కాని వెళ్ళారా ఎంటి రమేష్? ఎప్పుడండి తరువాయి భాగం?

చిన్ని said...

" వంటింట్లో ఉన్న స్టీలు పాత్రలన్నీ కౌంటర్ టాప్ మీద పెట్టి , ఒక్కసారిగా వాటన్నిటినీ నేల మీదికి తోసేసినట్టుగా ఉంటుంది నాకు ఆయన సంగీతం
'.
హమ్మ అంత మాట అంటారా!
ఇలా అస్తమాను సస్పెంస్లు కుదరవండీ .మేము ఒప్పుకోము

 
అనంతం - by Templates para novo blogger