ప్రాజెక్టు అయిపోతోంది! ప్చ్

Thursday, October 8, 2009


ఇక నేడో రేపో Its nice working with you all అనే ఈ-మెయిలు పంపాలి అందరికీ. అసలు ఈ ప్రాజెక్టుకి రావడమే ఒక వింత. మొదట్లో వద్దనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో పనిచేసి వదిలేసిన పురాతన సాఫ్ట్వేర్ వర్షను మీద పని. ముందుకొచ్చాక మళ్ళా వెనక్కి వెళ్ళాలంటే కష్టమే . ఈ సాఫ్ట్వేర్ ఫీల్డులొ అది మరీనూ. అయితే కొన్ని వృత్తిపరమైన మొహమాటాలూ, ఎలాగు ఆర్నెల్ల ప్రాజెక్టు కదా , కన్నుమూసి తెరిచేలోగా ఆర్నెల్లు చిటికెలో గడుస్తాయి అనే ఆలోచనతోనూ, వొహాయో లో ఇల్లు ఖాళీ చేసి , కార్లో మేమిద్దరం సీట్లల్లో కూర్చోగా మిగిలిన ప్రతి స్క్వేర్ ఇంచులోను ఇంటి సామాను మొత్తం కుక్కి పదమూడు గంటల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నాను. ఆర్నెల్ల ప్రాజెక్టు కాస్తా దాదాపు మూడేళ్ళ ప్రాజెక్టు అయి కూర్చుంది. నేను ఊహించలేదు ఇంతకాలం ఇక్కడ పనిచేస్తానని. నన్ను వదిలించుకొని ఖర్చు తగ్గించుకోవాలని మధ్యలో మా మానేజరు ఒక రష్యన్ భామని తెచ్చుకున్నా, తను కంప్యూటర్ మానిటర్ వైపుకంటే తన హేండ్ బాగ్ లో ఉన్న అద్దంలో తన మొహాన్ని ఎక్కువసేపు చూసుకొనేది. ఒక నెల లీవు పెట్టి నేను ఇండియా వెళ్ళిన టైంలో , తనకీ , మా మానేజరుకీ ఏదో విషయంలో యవ్వారం చెడి , "ఐ విల్ సు యు" అని మధ్యవేలు చూపించి తుర్రుమంది. ఒకానొక అర్ధరాత్రి ఇండియాలో ఉన్న నాకు మా మానేజరు నుంచి ఫోన్, ఇండియానుంచి రాత్రుళ్ళు పని చెయ్యగలవా అని. లీవు పొడిగిస్తే సంతోషంగా చేస్తా అన్నా. చక్కగా నాలుగునెలలు, జీతానికి జీతం , వెకేషన్ కి వెకేషన్.కంపెనీ లాప్టాప్ ఎలాగు ఉంది, దానికొక రిలయన్స్ వారి బ్రాడ్ బాండ్ కార్డు తగిలిస్తే ఇక మనం ఎక్కడున్నా పనికి ఢోకా లేదు. ఎటొచ్చీ లాప్టాప్ బ్యాటరీ చార్జ్ ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే చాలు. నాలుగు నెలలు పెద్దగా ఇబ్బందులు లేకుండానే పని లాగించేసా.ఇక్కడంటే అలవాటే గాని, ఇండియాలో షిర్డీ నుంచి వస్తూ బస్సులో ఆఫీసు పని చెయ్యటం ఒక అందమైన అనుభవం. ( కొన్ని మలుపుల్లో ,అప్పుడప్పుడూ సిగ్నల్స్ లేక ఆ బ్రాడ్ బ్యాండ్ కార్డు సతాయించిందనుకోండి. అది వేరే విషయం :) )

ఒక సంవత్సరం క్రితం నేను ప్రస్తుతం పనిచేసే కంపెనీని ఇంకొక కంపెనీ టేకోవర్ చేసింది. వాళ్ళ సిస్టమ్స్ అన్ని వేరే సాఫ్ట్వేర్ లో ఉండటం వల్ల ఇక్కడ మా డిపార్ట్మెంటు లో కూడా బెల్లు మోగింది. కొత్త సిస్టం లోకి వెళ్తున్నాం కాబట్టి ఈ క్రిటికల్ టైంలో మాకు మీ సహాయం కావాలి అని డైరక్టుగానూ, ఒకసారి వెళ్ళాక మిమ్మల్ని ఇక్కడినుంచి సాగనంపటానికి మాత్రం మాకు ఎవరి సహాయం అవసరం లేదు అని ఇన్ డైరక్టుగానూ మా మానేజరు మీటింగు పెట్టి మరీ చెప్పాడు.

మొన్న ఆగస్టులో ఆ పని కూడా పూర్తయింది. ఇక అందరూ ఎదురుచూడ్డం మొదలెట్టారు సెండాఫ్ ఉత్తర్వులకోసం. మొదట నాతో పనిచేసే ముగ్గుర్ని పీకేసారు. ఆ ముగ్గురిలో ఒకడు తెల్లోడయ్యేసరికి Conspiracy theory లకు చోటు లేకా , గాసిప్స్ కి ఆస్కారం లేకా నా తోటి భారతీయ వర్గం చాలా ఇబ్బంది పడింది. ఆతరువాత ఇంకో ఇద్దరిని. మొత్తానికి డిపార్ట్మెంటులో నేను ఒంటరినైపోయాను. నిజానికి ఆఫీసులో మాకు అత్యంత ప్రీతిపాత్రమైన సమయం అంటే కాఫీ బ్రేకే . ఆ టైం లో మా కబుర్లకు అంతుండదు. పది కాగానే గుంపుగా అందరం పొలోమని పరుగు బ్రేక్ రూంకి. అట్లాంటిది ఇప్పుడు నా కాఫీ బ్రేకు వెల వెలా బోతోంది. ఇక లంచ్ టైం అయితే చెప్పనవసరం లేదు. మేమందరం లంచ్ బ్రేక్ లో ఎవరి కుర్చీల్లో వారు కూర్చునే వాళ్ళం. ఎవరైనా లీవు పెట్టి రాకపోతే ఆ సీటు ఖాళీ గా ఉండాల్సిందే. మొదట్లో లంచ్ టైంలో ఆ రెండు ఖాళీ సీట్లను చూసి మాకు బాగా దిగులేసేది. ఇప్పుడు ఇంకెవరూ లేరు. నేనొక్కడినే. అన్ని కుర్చీలూ నావే. దిగులంతా నాదే.

నిన్న సర్వర్ రూం పక్క నుంచి వెళ్తూ అలవాటుగా అద్దంలోంచి నా (పాత) ప్రొడక్షను సర్వర్ వైపు చూసాను. అది చాలా ఒంటరిగా, దిగులుగా ఉన్నట్లు అనిపించింది నాకు. దాని లైట్లుకూడా పాపం దిగులుగా, ఏదో తప్పదు అన్నట్లు మిణుకు మిణుకు మంటూ వెలిగి ఆరిపోతున్నట్లున్నాయి. ఒకప్పుడు అవే లైట్లు చీకట్లో మిణుగురు పురుగుల్లా అందంగా కనిపించేవి. వెలిగి ఆరిపోవటంలో ఒకరకమైన ఠీవి కనిపించేది.నెల క్రితం వరకూ దాన్ని అందరూ అందమైన బుజ్జి కుక్కపిల్లని చూసుకున్నట్టు ప్రేమతో సాకేవారు. దానికి కాస్త వేడి చేస్తే నానా హైరానా పడిపోయేవారు. ఆ బుజ్జి కుక్కపిల్ల కాస్తా ఇప్పుడు గజ్జి కుక్కపిల్ల అయిపొయింది. మొన్నొకసారి సర్వర్ రూంలో ఏసీ లీకయి నీళ్ళు దాదాపు ఆ సర్వర్ దరిదాపుల్లోకి వచ్చినా ఎవరికీ చీమకుట్టినట్లయినా లేదు. అదే ఒకప్పుడయితే మా మానేజరు మీటింగెట్టి మమ్మల్ని చెడా మాడా తిట్టేవాడు.

ఎంత ప్రొడక్షను సర్వర్ కాక పోయినా, దాన్లో ఇంకా నేను రాసిన ప్రోగ్రాములు కొన్ని రన్ అవుతూనే ఉన్నాయి. నేను రిపీటేడ్ గా చేసే పనుల్ని చాలావరకు ప్రోగ్రాములు రాసి షెడ్యూలు చేసి పడేస్తాను. నిర్దేశిత టైంకి అవి నా ప్రమేయం లేకుండా రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ ఉన్నా లేకున్నా , నేను రాసిన ఆ ప్రోగ్రాములు కనీసం ఇంకొన్నేళ్ళు రన్ అవుతూనే ఉంటాయి. అర్ధరాత్రో ,అపరాత్రో అవి ప్రాణం పోసుకుంటాయి. నిర్దేశించిన పని పూర్తి చేసి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాయి.ఈ మనుషులు గుర్తుంచుకున్నా, గుర్తుంచుకోకున్నా , అవి మాత్రం నేను ఒకప్పుడు ఇక్కడున్నాననే నిజాన్ని అవి బ్రతికున్నంతవరకు ( పవర్ ఆఫ్ చేయ్యనంతవరకు) గుర్తు చేసుకుంటాయి. :)

లోపలికెళ్ళి అక్కడున్న సర్వర్లన్నిటినీ ఒక్కసారి కళ్ళారా చూసుకున్నాను. మళ్ళా నాచూపు ఒకప్పటి ప్రొడక్షను సర్వర్ మీద ఆగింది."నువ్వు లేవు నీ పాట ఉంది", అన్నట్లు "నువ్వుండకపోవచ్చు , కానీ నీ ప్రోగ్రాములున్నాయి" అని అది నాతో గుస గుస లాడినట్టనిపించింది నాకు.
22 comments:

అశోక్ చౌదరి said...

Hmm.. Its common in contracting... :(

భాస్కర్ రామరాజు said...

లోపలికెళ్ళి అక్కడున్న సర్వర్లన్నిటినీ ఒక్కసారి కళ్ళారా చూసుకున్నాను. మళ్ళా నాచూపు ఆ ఒకప్పటి ప్రొడక్షను సర్వర్ మీద ఆగింది."నువ్వు లేవు నీ పాట ఉంది", అన్నట్లు "నువ్వుండకపోవచ్చు , కానీ నీ ప్రోగ్రాములున్నాయి" అని అది నాతో గుస గుస లాడినట్టనిపించింది నాకు.

So touching Brother!!!
Well!! Show has to run...
We develop lots of luv with servers, but these business guys, plug 'em out naming it as *aged* *end of service* *blah blah*
HEARTLESS FELLAS

Indian Minerva said...

You almost made me cry.

భావన said...

ఉమ గారు ఇక్కడ కాకపోతే ఇంకో చోట మన సర్వర్ మనకోసం ఎక్కడో కాచుకునే వుంటుంది, ఏమి చేస్తాము IT industry కదా తప్పదు.. నేనైతే మొదటి సారి పింక్ స్లిప్ వచ్చినప్పుడు ఏడ్చేసేను చాలా సెంటిమెంటల్ ఐపోయి... మీకోసం ఎక్కడో మిణుకు మిణుకు మంటూ మీ ప్రోగ్రాం ల కోసం సర్వర్ పిలుస్తూ వుండి వుంటుంది.. All the best in finding new project...

sunita said...

ఫరవాలేదు. ఇపుడు మార్కెట్ గత ఆరు నెలలకంటే బాగుంది. మేము ఈ పరిస్తితి ఎదుర్కున్నాము. All the best in finding new project.

Krishna Rajesh said...

ఉమా శంకర్ గారు,
ఆ ఫీల్ ఈ ఫీల్డ్ లొ వాళ్ళకి కామన్.Business guys can't understand our feelings how we love our code, our work.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

ఉమా శంకర్ గారు,
చాలా టచింగ్గా వ్రాసారు! నిజమే మనతో పాటు ఉన్నవాళ్ళు సడన్ గా ఫైర్ చెయ్యబడితే చాలా బాధగా ఉంటుంది.

చిన్ని said...

లోపలికెళ్ళి అక్కడున్న సర్వర్లన్నిటినీ ఒక్కసారి కళ్ళారా చూసుకున్నాను. మళ్ళా నాచూపు ఆ ఒకప్పటి ప్రొడక్షను సర్వర్ మీద ఆగింది."నువ్వు లేవు నీ పాట ఉంది", అన్నట్లు "నువ్వుండకపోవచ్చు , కానీ నీ ప్రోగ్రాములున్నాయి" అని అది నాతో గుస గుస లాడినట్టనిపించింది నాకు.
ఎడ్పించేసారు...ఇది మీకు తగునా ?

మురళి said...

Touching..

జయ said...

పెనవేసుకు పోయిన బంధం అంత సులభం గా మరచిపోవాలంటే ఎవరితరం కాదు. ఈ బాధ కాలమే తీరుస్తుంది.

పరిమళం said...

హ్మ్మ్ .....ప్చ్ ..... :(

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగా రాసారు.

కొత్త పాళీ said...

This is one of the best pieces on one's career .. good job!

కొత్త పాళీ said...

very well expressed

ఉమాశంకర్ said...

THANK YOU ALL for your comments.
Its third such occasion in my (US) career and each time it sweeps me away.

@Bhaskar, I agree :)

@Bhavana and Sunita: Thank alot for your encouraging words.

భవాని said...

చాలా బాగా వ్రాశారు.

cbrao said...

ఇంక నూతన ప్రస్థానం ఎక్కడికో?

భాస్కర రామి రెడ్డి said...

ఉమాశంకర్, మూడేళ్ళ బంధాన్ని తెంచుకోవటం మనకు నిజంగా కష్టంగా వుంటుంది. కానీ రెండో రోజు మీరు ఆఫీసుకు వెళ్ళినా ఎవరూ ఎవరిని కోల్పోనట్టు రోజు గడిచిపోతూనే వుంది. 75 మంది నుంచి 30 కు చేరిన కంపెనీ ని చూసిన అనుభవం. ఉద్దండులును కూడా కోల్పోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ 30 నుంచి 4 పదులు దగ్గర దోబూచులాడుతుంది.

మళ్ళీ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాక కథ పునరావృత్తం. త్వరాగా మీ సర్వర్ మిమ్మల్ని

రా రమ్మని రా రమ్మని రామచక్కని సర్వ్రర్ పిలిచెను ఈ వేళా అని మీరు త్వరలో మళ్ళీ పాడాలని కోరుకుంటున్నాను.

harwin said...

ఉమా గారు మిరు మీ PROJECT లొ చేరాలని కొరుకుంటున్నాను

Seetha Rama said...

These are the feelings that we go again and again in this field. When I started my career back in 1996 - everytime I had to change client I had similar feelings in the beginning.

But then this is common in our profession and I got used to this.

I am now working at my 8th Global Fortune 500 client place and I enjoy the fact that had the rich experience of working in different places and clients.

I now feel consulting life has an upside too:

(i) Everytime we go to a new place - we learn new things . It's a good experience to work at different places - You learn good practices in different places

(ii) Its an opportunity to make good friends.

Wish you all the best
Sitaram

శ్రీనివాస్ చింతకింది said...

ఉమా గారు, నిజంగా ఎక్కడో టచ్ చేసారు, మనసంతా బాధగా తయారయ్యింది.
మీ టపా చదివాక నాక్కూడా ఇంకా దిగులు పట్టుకుంది. ఎందుకంటే గత ౨ సంవత్సరాలుగా చేస్తున్న ప్రాజెక్ట్ ఈ డిసెంబర్ లో అయిపోవస్తుంది. ఇక్కడే ఇంకో ప్రాజెక్ట్లో వేస్తారా లేక పింక్ స్లిపా అన్నది ఇప్పుడే తెలిదు. కాకపోతే అన్నింటికీ రడిగా ఉన్నాను.

ఉమాశంకర్ said...

వ్యాఖ్యానించిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.

@cbrao గారు: ఎక్కడికో ఇంకా తెలీదండీ :)

శ్రీనివాస్ గారు: మీకు పింక్ స్లిప్ ఇవ్వకూడదు అని మనసారా కొరుకుంటున్నాను

 
అనంతం - by Templates para novo blogger