వయసు మీద పడుతోందా?

Monday, July 13, 2009

ముచ్చటగా మూడు విషయాలు.

మొదటిది..

ఒక రెండు వారాల క్రితం...

బోస్టన్లో ఉండే స్నేహితున్ని కలుద్దామని కారెక్కా. హైవే ఎక్కిన పదినిముషాలకే చిన్నపాటి చిరుజల్లు మొదలయింది. బయటికి వెళ్ళే పని ఉన్నా లేకున్నాప్రతిరోజూ వాతావరణం ఎలా ఉంటుందో అని నెట్లో కుతూహలంగా చూసే నేను ఈరోజు బయటికి వెళ్ళే పని పెట్టుకొనికూడా దాన్ని పట్టించుకోనందుకు నన్ను నేను తిట్టుకున్నాను. కాసేపలా అద్దం మీద పడి గాలి విసురుకి అద్దం పైకి ఎగబాకే నీటి బిందువులను చూస్తూ ముచ్చటపడ్డా, వర్షం ఇంకాస్త పెరిగేసరికి ఇక తప్పదు అనుకుంటూ విండ్ షీల్డ్ వైపర్లు ఆన్ చేశా. ఇంకా దాదాపు గంటన్నర పైనే ప్రయాణం మిగులుంది. ఆలా ఒక పదిమైళ్ళు వెళ్ళానో లేదో వర్షం మటుమాయం. అక్కడసలు వర్షం పడిన ఛాయలే లేవు. నేలంతా పొడిగానే ఉంది. అక్కడినుంచి బోస్టన్ వరకు సూర్యుడు కనపడకపోయినా వర్షం మాత్రం లేనేలేదు.

ఫ్రెండ్ ఇంటిముందు కారు పార్క్ చేసి ఇంజన్ ఆఫ్ చేశా. టప టపా కొట్టుకుంటున్న వైపర్లు కరెక్టుగా కారు అద్దం మీద మధ్యలోకొచ్చి ఆగాయి. అప్పుడుగానీ అర్ధంకాలేదు. గత గంటన్నరగా వర్షం లేకున్నా నా పరధ్యానం పుణ్యమాని పొడి అద్దం మీద టప టపా కొట్టుకుంటూనే ఉన్నాయి వైపర్లు.

రెండవది..

మొన్నొకసారి ఏకబిగిన మూడుగంటలు టెన్నిస్ ఆడేసరికి మరుసటిరోజు ఎన్నడూ లేనిది ఒళ్ళంతా ఒకటే నొప్పులు. భుజం కాస్త మరీ ఎక్కువ నొప్పిగా ఉండేసరికి అప్పుడెప్పుడో ఏదో స్పోర్ట్స్ షాపులో కొన్న Hot pack కోసం వెతికా. దాన్ని కాసేపు మైక్రోవేవ్లో వేడి చేసి దాంతోపాటు వచ్చిన ఒక చిన్న వెడల్పాటి బెల్టులో పెట్టుకొని దాన్ని భుజానికి బెల్టు సాయంతో చుట్టుకోవడమే.

కాస్త వెతగ్గా, Hot pack దొరికిందిగాని దాని తాలూకు బెల్టు ఎక్కడ పెట్టానో తల బద్దలుకొట్టుకున్నాగుర్తుకురాలేదు. నిన్నో మొన్నో ఎక్కడో చూసినట్టే ఉంది. ఎక్కడ చూసానో గుర్తుకు రావటం లేదు. ఇంట్లో ఉన్న నాలుగు క్లోజేట్లనీ, వాటిల్లో ఉన్న బట్టల్నీ అటువిటూ ఇటువటూ అల్లకల్లోలం చేసి మరీ వెతికా. ఊహు, లాభం లేదు. లివింగు రూములో, ఆఖరికి కిచెన్ లో కూడా వెతికా. ఇక ఇంట్లో వెతికే పనిని మావిడకి అప్పజెప్పి నేను అపార్ట్మెంటు బేస్మెంటు లో ఉండే స్టోర్ రూం లో కెళ్ళి, రెండేళ్ళలో కొద్ది కొద్దిగా మేము కూడబెట్టిన చెత్తలో నిండా తలబెట్టి మరీ వెతికా. ఊహు. దొరక్కపోగా భుజం నొప్పి ఎక్కువయింది. ఈసురోమని, కాళ్ళీడ్చుకుంటూ, మావిడని స్టేటస్ రిపోర్ట్ అడుగుదామని పైకొచ్చేసరికి తను అప్పటికే సీరియస్ గా వంట పనిలో తలమునకలై ఉంది. ఒకవేళ దొరికిఉంటే తను చేసే హడావిడి నాకు తెలుసు కాబట్టి , విషయం అర్ధమై, ఏమీ అడగకుండా లోపలికి వెళ్ళా.

నాకు ఒకవేళ ఏదైనా వస్తువు కనపడకపోతే దాంతోపాటే ఉండే వేరే వస్తువులు గుర్తు తెచ్చుకుంటా. అప్పుడప్పుడు ట్రిక్ బానే పని చేస్తుంది. అలా ఆలోచించగా ఆలోచించగా అది బొత్తిగా ఒంటరి వస్తువనీ, దానికి బాయ్ ఫ్రెండ్సు, గర్ల్ ఫ్రెండ్స్ లాంటి చిన్న చిన్న సరదాలు కూడాఏవీ లేవనీ, దానిముందు నా బోడి ట్రిక్కు పనిచేయదనీ అర్ధం అయింది.

ఇక స్టోర్ రూంలో వెదుకులాట కారణంగా మొహానికి పట్టిన చెమట పోయేలా మొహం కడుక్కొని, బెడ్ రూం లోకొచ్చి సపోర్టు కోసం కుడిచేతి మోచేయి ఎక్సర్సైజ్ సైకిలు మీద వేసి "ఎక్కడుండొచ్చబ్బా ?" అని చార్మినార్ రామయ్యలా ఆలోచిస్తుండగా, చేతికి ఏదో మెత్తగా తగిలినట్టనిపించింది. తలతిప్పి చూస్తే సైకిలు హేండిల్ పై ఆ బెల్టు. దాదాపు ప్రతిరోజూ అధమపక్షం ఒక అరగంట అది నా కళ్ళముందే ఉంటుంది, సైకిలుపై నేను ఎక్సర్సైజు చేస్తున్నంతసేపూ .

దొరికింది అని తనకి చెప్పటానికి కూడాసిగ్గేసింది నాకు.


ఇంకొకటి.. ఇది మరీ దారుణం..

ఇది మెళ్ళో మంగళసూత్రంలా , సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మెళ్ళో వేలాడే ఐడెంటిటీ కార్డు గురించన్నమాట.

మంగళసూత్రం తాలూకు తాడు మరీ పాతపడినట్టనిపించి , సరే కొత్తది తీసుకుందామని హెచ్చార్ వాళ్ల దగ్గరికెళ్ళా . ఎప్పటిలానే కళ్ళింత చేసుకొని నవ్వుతూ " ష్యూర్" అంటు కొత్త తాడొకటి చేతికందించింది ఆ హెచ్చారమ్మాయి. తీరా చూస్తే అది తాడులా లేదు. రిబ్బనులా ఉంది. దానికి నా ఐడెంటిటీ కార్డు తగిలిస్తే ఒక రెండు క్షణాలకే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరునని లోకానికి చెప్పటానికి తనకి సిగ్గేస్తుందేమో అన్నట్లుగా కార్డు మొహం చాటేస్తోంది. అంటే వెనక్కి తిరిగిపోతోంది. అప్పటినుంచి ఒక వారం పాటు గుర్తొచ్చినప్పుడల్లా దాని వైపు చూడ్డం, అది అటు తిరిగిఉంటే, పెనం మీద దోశ తిరగేసినట్టు దాన్ని తిరగేయడం. అది ఎటు తిరిగి ఉన్నా, అసలు నా మెళ్ళో ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఉండదు అనుకున్నా, కష్టపడి వెళ్లి మరీ రిబ్బను తెచ్చుకునేందుకు పడ్డ శ్రమకు న్యాయం చేయాలనిపించింది. ఒకవారం ఇలా తంటాలుపడ్డాక ఒక "మెరుపు" లాంటి ఆలోచన వచ్చింది. ఏమీ లేదు, మా ఐడెంటిటీ కార్డు లామినేట్ చేసిన తరహాలో, రెండు వైపులా పారదర్శకంగా ఉండే చిన్న ప్లాస్టిక్ పాకెట్ లాంటి దాంట్లో ఉంటుంది.దాట్లోంచి నా కార్డు బయటికిలాగి, దాన్ని ఇటు తిప్పి మళ్ళా పాకెట్లో పెట్టేసా. అంతే..

వారం తరువాత వచ్చిన మెరుపు లాంటి ఆలోచనకి "హుర్రే" లాంటి పదాలు మరీ చిన్నవనిపించి, బుద్దిగా తలొంచుకొని పనిలో మునిగిపోయా.


13 comments:

Indian Minerva said...

ఈ చివరిది మేమూ ఫేస్ చేశాం కానీ ఎదుర్కొన్న విధానమే డిఫరెంట్!!

చిన్ని said...

మూడు చాల 'ముచ్చటగా ' రాసారండీ ....నేను రోజుకోసారి అనే మాట ,వెదికే ప్రతిసారి నాకు ఆ శ్రమ లేకుండా మావారినుండి వచ్చే డైలాగ్ కూడా అదే ..

sunita said...

baagundi!!!

మురళి said...

'వయసు' ని మరీ ఇంత లాంగ్ జంప్ చేయించడం అన్యాయం.. మధ్యలో 'ఎంసెట్' అవీ ఉన్నాయని గుర్తు చేస్తున్నా... మరుపు అంటారా.. మీకు తోడుగా చాలామందిమి ఉన్నాం..

కొత్త పాళీ said...

welcome to the club :)
Remember, it's all in the mind

పరిమళం said...

మొదటిది..
:(
రెండవది..
ప్చ్
ఇంకొకటి..
హుర్రే!!

భాస్కర్ రామరాజు said...

మొదటిది - :):) ఏంపర్లేదు, జిఫ్ఫి కాడికెళ్ళి కొత్తయి ఏయించుకో అరిగిపొయ్యి ఉంటయి పాతయి.
రెండోది -
>>ఈ రెండేళ్ళలో కొద్ది కొద్దిగా మేము కూడబెట్టిన చెత్తలో నిండా తలబెట్టి మరీ వెతికా.
:):) కేక. మొన్న మా అక్కవాళ్ళు మా ఇంటికి ఓ పని పైన వత్తామన్నారు. మేము *ప్రక్షాళన* చేసి *ఈ రెండేళ్ళలో కొద్ది కొద్దిగా మేము కూడబెట్టిన చెత్త*లో సగం దులిపేస్కున్నాం. కాబట్టి అద్దెచ్చా, అప్పుడప్పుడు పెద్దోళ్ళని ఆహ్వానిస్తుండాల. కొంత సెత్తని వదిలించుకోవచ్చు.
మూడు -
నేను నా కుక్కగొలుసు పీకేసి అవతలనూకి, బిళ్ళని పర్సులో పెట్టేసా. ఒక్కోరోజు ఈప్మీనకేస్కునే బ్యాగు అడ్డం వచ్చి పర్సు బైటికి రాదు. :):)
మీ బూట్లలోకి రాటానికి నాకింకా పదేళ్ళు టయం ఉందిగా..చూద్దాం..ఎట్టుండిద్దో ముందల ముందల.
అదేందది నీకెంతేం వయసు అని ఎవురైనా అడగొచ్చు. ఆ జస్టు మిప్పియ్యైదు!! కానీ ఇప్పుడు పాతికలా అగుపిస్తున్నా అని జనాల ఉవాచ.
:):)

ఉమాశంకర్ said...

వ్యాఖ్యలు రాసిన అందరికీ ధన్యవాదాలు.

భాస్కర్ గారూ,

"మీ బూట్లలోకి రాటానికి నాకింకా పదేళ్ళు టయం ఉందిగా..చూద్దాం..ఎట్టుండిద్దో ముందల ముందల."

తప్పులో కాలేసారేమో? :( . అయినా ఒకరకంగా నేనీ పోస్టు రాయటానికి మీరేనండీ స్ఫూర్తి. మీ తాళము వేసితిని గొళ్ళె.... నుంచి స్ఫూర్తి పొంది రాసానిది.. :)

భాస్కర్ రామరాజు said...

అయ్యా ఉమాశంకర్ గారూ!! నా వయసు పాతికే ఇప్పుడు. :):)

భాస్కర్ రామరాజు said...

:):)Kidding Brother!!!

ఉమాశంకర్ said...

నిజమా భాస్కర్ గారూ? ఏమోలెండి.. మీ "థర్టీ యియర్ ఇండస్ట్రీ" చదివీ చదివీ నేనే తప్పుగా ఆలోచించానేమో :) :)

మధురవాణి said...

మూడు విషయాలు బహు ముచ్చటగా ఉన్నాయండీ.!
మొదటిది, మూడోది నాకు ఎదురయ్యే అవకాశం రాలేదు. కానీ, రెండోది మాత్రం నేను తరచూ చేస్తూనే ఉంటాను. ఒక వస్తువు ఎదురుగానే నిలబడి దాని కోసం తెగ వెతికేస్తుంటాను. హాస్టల్లో ఉండే రోజుల్లో నేనేదయినా వెతుక్కుంటుంటే మా రూమ్మేట్స్ ముందే ఒక ఫైవ్ స్టారో, కాడ్బరీ నో ఒప్పందం చేస్కునేవాళ్ళు. ఎలా అయినా నేను వెతికేది వాళ్లకి సునాయాసంగానే కనిపిస్తుందని గట్టి నమ్మకంతో అన్నమాట. అలా ఎన్ని చాక్లెట్లు కొనిచ్చానో కదా :(

ఉమాశంకర్ said...

@మధురవాణి గారు,
: )

 
అనంతం - by Templates para novo blogger