నాకు నచ్చిన మరో కథ "షోడానాయుడు"

Friday, March 20, 2009

నాకొక స్నేహితుడున్నాడు. వాడూ నేనూ ఏడవతరగతి వరకూ కలిసే చదువుకున్నాం. ఆ తరువాత వాడికి చదువు అబ్బదు అని అనుకున్నాడోఏమో, వాళ్ళ నాన్న తనని ఒక "మేస్త్రీ" దగ్గర టైలరింగు పనిలో కుదిర్చాడు. ఇంటర్ తరువాత ఎంసెట్ రాసి అందరం చెల్లాచెదురైన తరువాత మా వూళ్ళో ఉన్న నా ఏకైక స్నేహితునిగా మా స్నేహం ఇంకా బాగా కుదురుకొంది. ఇంజనీరింగు చదివేటప్పుడు హైదరాబాదు నుంచిఎప్పుడొచ్చినా, ఆ వచ్చినరోజు సాయంత్రం మా వాడి టైలరింగు షాపులో హాజరు వేయించుకోవలసిందే. దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ఆరింటినుంచి రాత్రి పదింటికి కొట్టుకట్టేసే వరకు అక్కడే నా మకాం. నాకుతెలీని కొత్తలోకం పరిచయమయ్యేది నాకక్కడ. పక్కనున్న ఫ్యాన్సీ షాపులూ,హార్డువేరు షాపులూ,బంగారం కొట్లలో పనిచేసే కుర్రోళ్ళు మావాడితో బాతాఖానీ వేస్తుంటే నేను ఒక చెవి అటుంచి అన్నీ వింటుండేవాడిని. ఆ మాటలు చాలావరకు వాళ్ళ వాళ్ళ "సేట్ల" మీద కంప్లయింట్లూ, వ్యంగ్యపూరిత వ్యాఖ్యానాలు లేదా సినిమా ముచ్చట్లు. మావాడికి మాత్రం టైలరింగే లోకం. మేమెప్పుడు కలిసినా తన టైలరింగు గురించిన ప్రస్తావన రాకుండా ఉండదు. అన్నీ ఏకరువు పెడుతూ అప్పుడప్పుడు హైదరాబాదుకి ఉత్తరాలు కూడా రాసేవాడు.వాటిల్లో చాలా వరకు కష్టాలే. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని మంచి వార్తలు.ఊళ్ళొ కాంపిటీషనెక్కువైపోయిందంటాడు.పనోళ్ళు దొరకటంలేదు, దొరికినా ఒక సంవత్సరం పనిచేయగానే సొంతగా దుకాణాలు పెట్టుకుంటున్నారంటాడు. ఈ సంవత్సరం సంక్రాంతికైన బిజినెస్ ఉగాదికి కాలేదంటాడు.మన టౌనుల్లో కూడా రెడీమేడ్ దుకాణాలొచ్చిమా పొట్టకొడుతున్నాయంటాడు.ఇంకా అలాంటివే. ఏం మాట్లాడుకున్నా తిరిగి తిరిగి అవి తన టైలరింగు కష్టాల దగ్గరికొచ్చి ఆగేవి.నేను హైదరాబాదు కెళ్ళాక రెడీమేడ్ దుస్తులు అలవాటయి, ఎప్పుడైనా అవేసుకొచ్చి చూపిస్తే, వాటిల్లోని లోపాలని ఒకదాని తరువాత ఒకటి ఏకరవు పెట్టేవాడు. ఫిట్టింగు సరిగాలేదనేవాడు, లేదా ఇంకేదో పిస్తా,గిస్తా, అంటూ టైలరింగు భాషలో ఏదేదో చెప్పేవాడు. అన్నీ బాగుంటే కనీసం వాటిని కుట్టడానికి నాసిరకం దారం వాడారు అని తన కసి తీర్చుకొనేవాడు. రెండుతుకుల్లో ఈ గుండీలు ఊడి చేతికి రాకపోతే నాపేరు మార్చుకుంటా అని సవాళ్లూ విసిరేవాడు. నేను నొచ్చుకోకపోగా చాలా ముచ్చటపడేవాడిని తన ఎనాలిసిస్ విని.

ఈ మధ్యనే నెమలికన్ను మురళిగారు నాకు పంపిన శ్రీరమణ విరచిత "షోడా నాయుడు" కధ చదవాను. ఆ కధలో షోడానాయుడి గురించి చదవగానే పైన చెప్పిన స్నేహితుడే గుర్తొచ్చాడు. గుర్తుకు రావడం వరకే లెండి. అంతకుమించి ఈ కధకీ తనకీ పోలికలేమీ లేవు.

ఈ కధలో షోడా నాయుడికి సోడాలే లోకం. తనదైన చిన్ని లోకంలో జీవిస్తూ, విలువల్ని కాలదన్నక, అంతలోనే కొద్దిపాటి లౌక్యం ప్రదర్శిస్తూ సోడాలమ్ముకొని బ్రతుకు నెట్టుకొస్తుంటాడు.బంగారు మురుగు కధలోలానే బాల్యం నుంచి పెరిగి పెద్దవుతూ కధానాయకుడు తనగురించీ, తనెరిగిన షోడానాయుడి గురించీ చెప్పుకుంటూ కథ ముందుకు సాగుతుంది. కథ చివర్లో మనసును మెలిపెడుతుంది కూడా.

ఇక కధ గురించి. మన కధానాయకునికి చిన్నప్పుడు గోళీల పిచ్చి. తన దగ్గర అన్నిరకాల గోళీలున్నా తన దృష్టంతా సోడాల్లో ఉండే నీలం రంగు గోళీ మీదే. తన మిగతా స్నేహితుల దగ్గరున్నట్లు తనదగ్గర కూడా నీలం గోళీ ఉంటేనే తనకీ, తన ఉనికికీ సార్ధకం. ఆ గోళీ ఒక్కటి సంపాదిస్తే చాలు తనుకూడా తన స్నేహితుల దగ్గర సగర్వంగా తలెత్తుకొని తిరగొచ్చు. అప్పుడు మొదలవుతాయి మనవాడి తిప్పలు. ఆ నీలం గోళీ సంపాదించటానికి సోడాలమ్ముకొనే "షోడా నాయుడి" ప్రాపకం సంపాదించడానికి తను పడ్డ కష్టాలు, చివరికి దాన్ని సంపాదించకుండానే తన చదువుకోసం తన ఊరొదిలి వైజాగ్ వెళ్ళాల్సి రావటం, ఎదిగే కొద్ది జీవితం అంటే ఏమిటో అర్ధం కావడం, జీవితంలో నిలదొక్కుకొని ఒక ఆఫీసరవడం, చివరికి తను చిన్నప్పుడు నీలం గోళీ కోసం ఏ షోడా నాయుడి వెంట పిచ్చిగా తిరిగాడో అదే షోడా నాయుడు లోను కోసం తనని కలవటం, కలవటానికి వస్తూ గుర్తుపెట్టుకొని మరీ గుప్పెట నిండా నీలం గోళీలు తేవటం, ఎంతైనా పెద్ద ఆఫీసరు కదా ఇవ్వచ్చో ఇవ్వకూడదో అని సతమతమవటం. మనసుకి హత్తుకొనే కధ.


తన చిన్నప్పటి తాపత్రయాన్ని ఇప్పటిదాకా పదిలంగా గుర్తుంచుకొని, తనెప్పుడో వదిలి వచ్చేసిన లోకానికి తనని మళ్ళా తీసుకెళ్ళడం, ఒకప్పుడు ఈసడించిన ఆ చేత్తోనే గోళీలు ఇవ్వాలా వద్దా అని షోడానాయుడు సతమతమవటం మనసుని కదిలిస్తుంది.

"మారింది సామాజికపరంగా నా అంతస్తూ,హోదా మాత్రమే, నేను కాదు, నేనప్పటి మనిషినే" అని అరిచి గీపెట్టాలనిపిస్తుంది మనసున్న వారికెవరికైనా ఇలాంటి సందర్భాలు నిజజీవితంలో ఎదురైతే.


తిలక్ కధల్లోని మనస్తత్వ చిత్రణలూ, ప్రకృతి వర్ణనలూ నన్నాకట్టుకున్నట్టే శ్రీరమణ గారి కధల్లో ఉండే వర్ణనలూ, పాత్రలూ, వాటి తీరుతెన్నులూ నాకు చాలా నచ్చుతాయి. కథలో ఉదహరించిన వాతావరణానికి కొద్దిపాటి పరిచయముండాలే గాని,ఈ కధ చదువుతుంటే ప్రతి సన్నివేశం కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా, చాలా సహజంగా ఉండి, చేయి పట్టుకొని మనల్ని ఆ కధాకాలానికి తీసుకెళ్ళినట్లుగా ఉంటుంది. మంచి కథ . దొరికితే తప్పక చదవండి.


18 comments:

మురళి said...

మీరు ఎలా రాస్తారా? అని చాలా ఆసక్తి తో ఎదురు చూస్తున్నా.. చాలా చాలా బాగుంది.. మీ స్నేహితుడి గురించి చదివాక మా గణేష్ మరోసారి గుర్తొచ్చాడు.. పిస్తా కాదండి కిస్తా.. ముగింపు తెలిసినదే అయినా చదివిన ప్రతిసారీ భావోద్వేగానికి లోనవుతాను నేను.. హరికథ, నాటక ప్రదర్శన.. ప్రతిసారీ మనవాడికి వెంట్రుక వాసిలో సోడా గోలీ తప్పిపోవడం... అమ్మో చెబుతూ పొతే నేను కథంతా మళ్ళీ రాసేస్తానేమో..

ఉమాశంకర్ said...

మురళి గారు,

నేను పోస్టు చేసి కనీసం ఒక పావుగంట కూడా కాలేదు.. అప్పుడే మీ కామెంటు..:) Thank you.

అవునండీ, "కిస్తా". మీరు సరిచేసిన తరువాత ఆ వాక్యం తిరిగి చదువుకుంటే నాకే నవ్వొచ్చింది..ఓ, మీక్కూడా ఒక టైలరు ఫ్రెండున్నాడన్నమాట..

ఇంకొక్కమాట, వేరే వ్యక్తిగత కారణాలవల్లా, మరియు నే రాసింది నాకే నచ్చక ఇది రాయటం ఆలస్యమయింది.అన్యధా భావించకండేం? :)

ఉమాశంకర్ said...

మురళి గారు,

మీ గణేష్ గురించి చదివాను మళ్ళా ఇప్పుడే.. :)

జీడిపప్పు said...

ఉమాశంకర్ గారు, నేను కూడా మిథునం కథలన్నీ చదివాను. చదివాను అనడం కంటే చదివే అదృష్టం కలిగింది. మీ రివ్యూ కథకు ఏ మాత్రం తీసిపోలేదు. చాలా బాగా వ్రాసారు. వీలయితే "మిథునం" లోని ఇతర కథల పైన కూడా ఇలాంటి వ్యాసాలు వ్రాయండి.

ఉమాశంకర్ said...

జీడిపప్పు గారు,
Thank you.

ఆయన కధలంటే నాకిష్టం. ఫ్రయత్నిస్తాను

సుజాత said...

ఆ సంకలనం లో ప్రతి కథా ఒక ఆణిముత్యమే! సోడాల నాయుడు కథ చదివిన ప్రతి ఒక్కరూ దాన్ని ఏదో ఒక రకంగా తమ బాల్యానికి పోల్చి చూసుకోకుండా ఉండలేరు. వరహాల బావి, బంగారు మురుగు కూడా మనసుకు హత్తుకునేలా ఉంటాయి కాదూ!

ఈ శతాబ్దపు అత్యుత్తమ కథ ఏది అని ఎవరినా నన్ను అడిగితే (ఇప్పటికి కొన్ని కోట్ల కథలు చదివున్నా సరే)నేను మాత్రం "మిథునం" కథనే ఎన్నుకుంటాను.

అన్నట్లు మీలో ఎవరైనా శ్రీరమణ గారి "ప్రేమ పల్లకి" నవల చదివారా?

చిన్ని said...

maarindhi saamajikaparamga hodhaa maatrame nenu manishine ....annaru chudandi -xlnt.nenu chadivanandi.

చిన్ని said...

driver katha paatakula oohake vadlesaara:)

పరిమళం said...

షోడా నాయుడు కధ బావుందండీ ! అన్నట్టు మీరు భిక్షపతిని ఇంకా పరిచయం చేయనేలేదు :)

ఉమాశంకర్ said...

@ సుజాత గారు,
మిథునం నేనింకా చదవలేదు..(బహుశా ) అది చదివేవరకూ నా దృష్టిలో "బంగారు మురుగు" ది తిరుగులేని స్థానం. :)

ప్రేమ పల్లకి?? చదవలేదనుకుంటా.. కొంతమందివి నేను పేరు చూసి ఆ తరువాత చదువుతా.. అతి కొద్ది మందివి చదివి బాగా రాసాడే అనుకొని పేరు యధాలాపంగా చూసి ఆ తరువాత మర్చిపోతా,.. అలా చాలామంది ఉన్నారు.. పతంజలి, శ్రీరమణ, కవనశర్మ ఇలా..

@చిన్ని గారు,

ధన్యవాదాలు. త్వరలో రాస్తాను.. .మీరేమిటండి "కొత్త అలవాటు" తరువాత మొహం చాటేస్తున్నారు? మేమందరం భరోసా ఇచ్చాక ఇక రాయకపోయినా పర్లేదు అనుకుంటున్నారా?

@ పరిమళం గారు,
ధన్యవాదాలు. త్వరలోనే రాస్తాను :) మర్చిపోలేదండీ .. తీరిక లేక... తప్పనిసరిగా రాస్తాను.. :)

చిన్ని said...

అబ్బే మొహం చాటు వెయ్యలేదు , నేను కూడా మీలాగా సంయనం పాటించాలని ప్రయత్నం ,ఏదొక టైం లో మీ బ్లాగ్ ,నెమలికన్ను ,పరిమళం ,పద్మర్పిత ఇంకా కొన్ని {ఒక గూటివి} చూస్తూ ,పలకరిస్తూనే వున్నాను .:)నిన్నేమో "ఏటిగట్టు" చూసి ఒక రోజల్లా మనస్సు పాడైంది.రాద్దామని ఏమి రాయలేకపోయాను .కాస్త పని వత్తిడి కూడా ఒక కారణం .షోడా కథ ఆఫీసు లో చదివాను , నాకు చిన్నపుడు షోడా బాటిల్ పగలగొట్టి ఆ గోలి తీయాలని ఎంతో కోరికగా వుండేది ,తీరని కోరికల్లో అదొకటి :)అలానే పేపర్ వెఇట్ గాజు వాటిల్ని పగలు కొట్టి అందులోని చిలుకల్ని ,పూలని తీయాలని ,పగలుకోట్టాను కాని ఏమి రాలేదు.నిజంగా ఎంత అమాయకం రోజులో అవి {బాల్యం}

కొత్త పాళీ said...

Very nice.
కొన్నాళ్ళ క్రితం మన బ్లాగ్లోకంలో తిలక్ కథల గురించి కొంత చర్చ జరిగింది. ఇంచుమించుగా చర్చలో పాల్గొన్న అందరూ తిలక్ కథలు డిప్రెసింగా ఉంటాయి అని ముద్ర వేసేశారు. మీకు నచ్చుతాయి అని చదివి సంతోషించాను.

బుజ్జి said...

aite tilak kathalu chadavalanna mata.. ninnane shop lo choosi kooda konukkokunda vacha!! next time konali aite..

భావన said...

ఉమ శంకర్ గారు. మంచి కథ ను పరిచయం చేసేరు, మా వూర్లో మా స్కూల్ పక్కనే చిన్న షెడ్డ్ లో ఒక అబ్బాయి గోలీ సోడా లో గేస్ నింపే వాడు.. నేను ఇప్పుడు కూడా అప్పుడు అప్పుడు విచారిస్తాను నన్ను ఏప్పుడూ చూడ నివ్వలేదు ఆ అబ్బాయి అరిచేవాడు దూరం గా పొండి అని... :-) అవును మీరు ప్రస్తావించిన పుస్తకం పేరు ఏమిటి అండి, నాకు తెలియదు...ఆన్ లైన్ దొరుకుతుందా లేక మన వూరు నుంచి తెప్పించుకోవాలా? కొంచం చెప్పరా ప్లీజ్ ....

ఉమాశంకర్ said...

@ చిన్ని గారు,
సరదాకన్నానులెండి. భాధ్యతలూ, రోజువారీ పనులూ ముఖ్యం కదా :)

@కొత్తపాళీ గారు,
తిలక్ కథలు నాకు బాగా నచ్చుతాయి. ఒక కథ చదివేటపుడు పాఠకుడు తనకి ఏమి కావాలి అనేదాన్ని బట్టి ఆ కథ మీద ముద్ర వేసేస్తారేమో. నాకైతే ఆయన కధలు మళ్ళీ మళ్ళీ చదువుకునేలా ఉంటాయి..

@ బుజ్జి గారు,
తిలక్ కధలు నిరాశపరచవేమో అని నా నమ్మకం. చదివి మీ అభిప్రాయం తెలపండి.. :)

@ భావన గారు,

అవునండీ, సోడా లో గ్యాస్ నింపడం కొద్దిగా అపాయంతో కూడుకున్న పని.

మనసులోమాట సుజాత గారు చెప్పాక నాకు తెలిసింది, ఈ కధ శ్రీరమణ గారు రాసిన "మిథునం" అనే కథల సంపుటిలోనిదని. ఆన్లైన్లో దొరకదనుకుంటా..పబ్లికేషన్స్, వెల అవి నాకు తెలియవు గానీ, తప్పక చదవవలసిన పుస్తకం ఇది అని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను..

నాకు నెమలికన్ను మురళి గారు స్కాన్ చేసి పంపించారు, ఈ కథ మీక్కావాలంటే e-మెయిల్లో మీకు పంపగలను.

సుజాత said...

భావన గారూ,
మిథునం కథా సంకలనం నవోదయ పబ్లిషర్స్ ప్రచురణ. విశాలాంధ్ర, ఇతర పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది.
ఇందులో మిథునం(ఈ కథ అంతకు ముందు ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో మొదటిసారి వచ్చింది)
అరటిపువ్వు సాములారు,
తేనెలో చీమ
బంగారు మురుగు
షోడా నాయుడు
ధనలక్ష్మి(ఇది ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచికలో వచ్చింది)
వరహాల బావి
పెళ్ళి
ఈ కథలున్నాయి. ఇందులో షోడా నాయుడు, వరహాల బావి,బంగారు మురుగు,ధనలక్ష్మి గొప్ప కథలు. మిథునం సరే సరి.
ఉమాశంకర్ గారు.
మిథునం కథ మీకు చదవాలనుందా?

మిథునం కథ నాకెంత నచ్చిందంటే దీపావళి ఆంధ్రజ్యోతి సంచికలో ఎప్పుడో వచ్చిన కథను కత్తిరించి దాచుకున్నాను.

మధురవాణి said...

ఉమా శంకర్ గారూ,
మురళి గారి పుణ్యమా అని నేను కూడా షోడానాయుడు కథ చదివానండీ.! కథకి తగ్గట్టుగానే ఉంది మీరు రాసిన ఈ పోస్టు.
"మారింది సామాజికపరంగా నా అంతస్తూ,హోదా మాత్రమే, నేను కాదు, నేనప్పటి మనిషినే"
This sentence says it all :)

ఉమాశంకర్ said...

@మధురవాణి గారు,

Thank you :)

 
అనంతం - by Templates para novo blogger